[అనువాదకుని మాట: వేదాన్ని ప్రాచీన తెలుగు కవులు ఎవ్వరూ అనువాదం చేసే ప్రయత్నం చెయ్యలేదు. దానికి ప్రధాన కారణం వేదాలు అపౌరుషేయాలు అన్న విశ్వాసం. అంటే పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాల మాదిరి వేదాలు మానవులు రాసినవి కావు నమ్ముతారు. అందుకే వేద వాఙ్మయాన్ని ఈ మధ్యకాలం దాకా లిపిబద్ధం కూడా చేయలేదు. అంతేకాక వేదం శబ్ద ప్రధానం. అందుకే అనాదిగా ఒకరి నుంచి మరొకరికి వాక్కు రూపంలోనే అందుతూ వస్తోంది. శబ్దం అనువాద సాధ్యం కాదు. అర్థం మాత్రమే అనువాద సాధ్యం. అయితే, ఋగ్వేదంలోని పదవ మండలంలో 129వ సూక్తంగా ఉన్న నాసదీయ సూక్తం ఈ సృష్టి ఎక్కడినుండి వచ్చిందో, ఎలా సృష్టింపబడిందో అన్న విషయాల గురించి మహాశ్చర్యకరమైన ప్రశ్నలు వేస్తుంది. కాబట్టి అందులోని అర్థం నాకు స్ఫురించిన విధంగా సూటిగా సంస్కృత మూలం నుండి తెలుగులో చెప్పడానికి నేను చేసిన ప్రయత్నం ఇది. మనం తెలుగులోకి అనువాదం చేయకుండా ఉంటే ఈ సూక్తాల గురించి తెలుసుకోవాలనుకొన్న వాళ్ళు దొరికిన ఆంగ్ల అనువాదాల ఆధారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఆంగ్ల అనువాదాల ఆధారంగా మళ్ళీ తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. భారతీయ భాషా సాహిత్యాన్ని సూటిగా మూలం నుండి తెలుగులోకి అనువాదం చేయకుండా ఆంగ్ల అనువాదం ఆధారంగా అనువాదం చేయడం అనేది నా దృష్టిలో క్షమించరాని నేరం. అందుకే సూటిగా సంస్కృత మూలం నుండి నాకు అర్థమైన విధంగా ముత్యాల సరాలకు దగ్గరిగా ఉండే ఛందంలో నేను చేసిన తెలుగు అనువాదం ఇది.
మరో మాట: ఋగ్వేదంలో శ్లోకాల అర్థాల విషయంలో ప్రాతిశాఖ్యల నుండి సాయణాచార్యుని నుండి ఆధునిక ప్రాచ్య-పాశ్యాత్య పండితుల వరకూ ఎన్నో వివిధ రకాలైన భాష్యాలు చెప్పారు. ఋగ్వేదంలోని చాలా సూక్తాలలాగే ఈ సూక్తంలోని పదాల అర్థాలు వివరించడంలో, భాష్యాలలో పలు అభిప్రాయ భేదాలున్నాయి. కాబట్టి వీలైనన్ని చోట్ల మూల సంస్కృత శబ్దాన్ని తెలుగులో యథాతథంగా ఉంచడానికి ప్రయత్నించాను. ఉదా: స్వధా, ప్రయతి మొ॥ తెలుగు అనువాదమే కాకుండా మూల సంస్కృత శ్లోకాలకు పదచ్ఛేదం, టీకా కూడా పొందుపరిచాను. ఇందులో ఉన్న శ్లోకాలకు, శబ్దాలకు ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక అర్థాలు వివరించాలంటే అదో పెద్ద వ్యాసమే అవుతుంది (ఎప్పుడైనా వీలు చిక్కినప్పుడు నాసదీయ సూక్తంపై వ్యాసం కూడా రాయాలని నా కోరిక). ఏది ఏమైనా మూలంలో ఉన్న శ్లోకాలకు వివిధ భాష్యకారులు ఇచ్చిన పలురకాల గూఢార్థాలను అనువాదంలోకి తీసుకురావడం దాదాపు అసాధ్యం. ఈ ప్రయత్నం ద్వారా మూలంలోని భావాలను, మునులు అనుభవించి అవగాహన చేసుకున్న అంతరంగాన్ని ఆవిష్కరించడంలో కొంతైనా కృతకృత్యుణ్ని అయ్యానో లేదో సహృదయ పాఠకులైన మీరే నిర్ణయించాలి. – సురేశ్ కొలిచాల.
తా.క.:ఈ అనువాదాన్ని మధురంగా పాడి వీడియో రూపంలో అందజేసిన మ్యూజిక్ ఇండియా దుబాయ్ వ్యవస్థాపకురాలు శ్రీమతి ప్రశాంతి చోప్రాకు మా ప్రత్యేక ధన్యవాదాలు. వీడియో లింకు చివర చూడవచ్చును. — సం. ]
- నాస॑దాసీ॒న్నో సదా॑సీత్త॒దానీ॒మ్ నాసీ॒ద్రజో॒ నో వ్యో॑మా ప॒రో యత్ ।
కిమావ॑రీవ॒: కుహ॒ కస్య॒ శర్మ॒న్నంభ॒: కిమా॑సీ॒ద్గహ॑నం గభీ॒రమ్ ॥ ౧ ॥పదచ్ఛేదం: న । అసత్ । ఆసీత్ । నో ఇతి । సత్ । ఆసీత్ । తదానీమ్ । న । ఆసీత్ । రజః । నో ఇతి । వ్యోమ । పరః । యత్ । కిమ్ । అవరీవః । కుహ । కస్య । శర్మన్ । అమ్భః । కిమ్ । ఆసీత్ । గహనమ్ । గభీరమ్ ॥
టీకా: న అసత్ ఆసీత్ = అసత్తు లేదు; న ఇతి ఆసీత్ సత్ = లేదు సత్తు; తదానీమ్ = ఆ వేళలో, అప్పుడు; న ఆసీత్ = లేదు; రజః = రజస్సు; నో ఇతి = లేదు; వ్యోమ = వ్యోమము; పరః = పరము; యత్ = ఏదైతే; కిమ్ = ఏది; అవరీవః = ఆవరించినది; కుహ = ఎక్కడ; కస్య = ఎవరి; శర్మన్ = రక్షణలో; అమ్భః = అంభువు; కిమ్ = ఎందుకు; ఆసీత్ = ఉన్నది; గహనమ్, గభీరమ్ = గహన, గంభీరంగా.
సత్తులే దసత్తులే దపుడు
లేవు జగములు లేవు నభములు
ఆవరించినదేది ఎక్కడ
ఎవరి రక్షణ లోన ఉండెనొ
గహన గంభీరాంబు వెందుకొ? - న మృ॒త్యురా॑సీద॒మృత॒మ్ న తర్హి॒ న రాత్ర్యా॒ అహ్న॑ ఆసీత్ప్రకే॒తః ।
ఆనీ॑దవా॒తం స్వ॒ధయా॒ తదేక॒మ్ తస్మా॑ద్ధా॒న్యన్న ప॒రః కిం చ॒నాస॑ ॥ ౨ ॥పదచ్ఛేదం: న । మృత్యుః । ఆసీత్ । అమృతమ్ । న ।తర్హి । న । రాత్ర్యాః । అహ్నః । ఆసీత్ । ప్రకేతః । ఆనీత్ । అవాతమ్ । స్వధయా । తత్ । ఏకమ్ । తస్మాత్ । హ । అన్యత్ । న । పరః । కిమ్ । చన । ఆస ॥
టీకా: న మృత్యుః = లేదు మృత్యువు; ఆసీత్ అమృతమ్ న = లేదు అమృతము; తర్హి = అప్పుడు; న రాత్ర్యాః = రాత్రి లేదు; న అహ్నః ఆసీత్ = పగలు లేదు; ప్రకేతః = సూచన; ఆనీత్ = ఊపిరి; అవాతమ్ = లేదు గాలి; స్వధయా = తనంతట; తత్ = తాను; ఏకమ్ = ఒక్కటి; తస్మాత్ = అందుకు; అన్యత్ = ఇతరము; న పరః = దాటిలేదు; కిమ్ = ఏది; న ఆస = లేదు
మనికి లేదూ చావు లేదూ
రాత్రి లేదూ పగలు లేదూ
ఉన్నదొక్కటి ఉసురు లేనిది
తనకు తానే ఉసురు తీసెను
అన్యమేదీ లేదు అక్కడ - తమ॑ ఆసీ॒త్తమ॑సా గూ॒ళ్హమగ్రే॑ఽప్రకే॒తం స॑లి॒లం సర్వ॑మా ఇ॒దమ్ ।
తు॒చ్ఛ్యేనా॒భ్వపి॑హిత॒మ్ యదాసీ॒త్తప॑స॒స్తన్మ॑హి॒నాజా॑య॒తైక॑మ్ ॥ ౩ ॥పదచ్ఛేదం: తమః । ఆసీత్ । తమసా । గూళ్హమ్ । అగ్రే । అప్రకేతమ్ । సలిలమ్ । సర్వమ్ । ఆః । ఇదమ్ । తుచ్ఛ్యేన । ఆభు । అపిహితమ్ । యత్ । ఆసీత్ । తపసః । తత్ । మహినా । అజాయత । ఏకమ్ ॥
టీకా: తమః = తమస్సు; ఆసీత్ = ఉన్నది; తమసా = తమస్సులో; గూళ్హమ్ = గూఢంగా; అగ్రే = తొల్లి; అప్రకేతమ్ = తెలియలేనట్టి; సలిలమ్ = జలము; సర్వమ్ = అంతా; ఆః ఇదమ్ = అక్కడ ఉండెను; తుచ్ఛ్యేన = శూన్యముతో; ఆభు = ఉండిన; అపిహితమ్ = కప్పబడిన; యత్ ఆసీత్ = ఏది ఉండెనో; తపసః = తపస్సుచే; తత్ = అది; మహినా = మహిమచే; అజాయత = ఉద్భవించింది; ఏకమ్ = ఒకటి
తమము నిండిన తమమునందున
అలవి నెరుగని సలిల ముండెను
శూన్య మపిహితమైన వేళలొ
ఎవరి తపముల మహిమ చేతనొ
ఉద్భవించెను సృష్టి ఒక్కటి - కామ॒స్తదగ్రే॒ సమ॑వర్త॒తాధి॒ మన॑సో॒ రేత॑: ప్రథ॒మం యదాసీ॑త్ ।
స॒తో బన్ధు॒మస॑తి॒ నిర॑విన్దన్ హృ॒ది ప్ర॒తీష్యా॑ క॒వయో॑ మనీ॒షా ॥ ౪ ॥పదచ్ఛేదం: కామః । తత్ । అగ్రే । సమ్ । అవర్తత । అధి । మనసః । రేతః । ప్రథమమ్ । యత్ । ఆసీత్ । సతః । బన్ధుమ్ । అసతి । నిః । అవిన్దన్ । హృది । ప్రతీష్యా । కవయః । మనీషా ॥
టీకా: కామః = కోరిక; తత్ = అప్పుడు; అగ్రే = తొల్లి; సమవర్తత = సమవర్తించెను; అధి మనసః = అధిమనస్సు; రేతః ప్రథమమ్ = ప్రథమ రేతస్సు; యత్ ఆసీత్ = అప్పుడు ఉండెను; సతః బన్ధుమ్ అసతి = సత్తు అసత్తుల బంధమును; నిః అవిన్దన్ = తెలుసుకొన్నారు; హృది = హృదయంలో; ప్రతీష్యా = వెతకి, తరచి; కవయః = కవులు; మనీషా = బుద్ధిచే.
తొల్లి కోరిక అవతరించెను
అధిమనస్సున ప్రథమ రేతము
సత్-అసత్తుల నడుమ బంధము
మదిని తరచిన కవులు ఎరిగిరి - తి॒ర॒శ్చీనో॒ విత॑తో ర॒శ్మిరే॑షామ॒ధః స్వి॑దా॒సీ౩దు॒పరి॑ స్విదాసీ౩త్ ।
రే॒తో॒ధా ఆ॑సన్మహి॒మాన॑ ఆసన్త్స్వ॒ధా అ॒వస్తా॒త్ప్రయ॑తిః ప॒రస్తా॑త్ ॥ ౫ ॥పదచ్ఛేదం: తిరశ్చీనః । వితతః । రశ్మిః । ఏషామ్ । అధః । స్విత్ । ఆసీత్ । ఉపరి । స్విత్ । ఆసీత్ । రేతఃధాః । ఆసన్ । మహిమానః । ఆసన్ । స్వధా । అవస్తాత్ । ప్రయతిః । పరస్తాత్ ॥
టీకా: తిరశ్చీనః = అడ్డునిలువుగా; వితతః = ప్రసరించు; రశ్మిః = రశ్మి; ఏషామ్ = ఇక్కడది; అధః స్విత్ ఆసీత్ = క్రింద ఉన్నది; ఉపరి స్విత్ ఆసీత్ = పైన ఉన్నది; రేతఃధాః = రేతస్సు ఇచ్చువారలు; ఆసన్ = ఉన్నారు; మహిమానః ఆసన్ = మహిమానులు ఉన్నారు; స్వధా = స్వధ†; అవస్తాత్ = క్రిందగా; ప్రయతిః = ప్రయతి†; పరస్తాత్ = పైగా ఉండగా.
అడ్డు నిలువుగ రశ్మి రేఖలు
పైకి క్రిందకి ప్రసర మయ్యెను
స్వధ† అవస్తగ ప్రయతి† పరస్తగ
రేతధాతలు నిండి నిలిచిరి - కో అ॒ద్ధా వే॑ద॒ క ఇ॒హ ప్ర వో॑చ॒త్కుత॒ ఆజా॑తా॒ కుత॑ ఇ॒యం విసృ॑ష్టిః ।
అ॒ర్వాగ్దే॒వా అ॒స్య వి॒సర్జ॑నే॒నాథా॒ కో వే॑ద॒ యత॑ ఆబ॒భూవ॑ ॥ ౬ ॥పదచ్ఛేదం: కః । అద్ధా । వేద । కః । ఇహ । ప్ర । వోచత్ । కుతః । ఆజాతా । కుతః । ఇయమ్ । విసృష్టిః । అర్వాక్ । దేవాః । అస్య । విసర్జనేన । అథ । కః । వేద । యతః । ఆబభూవ ॥
టీకా: కః = ఎవరు; అద్ధా = నిజముగా, పూర్తిగా; వేద = తెలియును; కః = ఎవరు; ఇహ = ఇక్కడ; ప్ర+వోచత్ = చెప్పగలరు; కుతః = ఎట్లా; ఆజాతా = పుట్టింది; కుతః = ఎట్లా; ఇయమ్ = ఈ; విసృష్టిః = విసృష్టి; అర్వాక్ = ఇక్కడి; దేవాః = దేవతలు; అస్య = ఇక్కడ; విసర్జనేన = తరువాత వచ్చినవారు; అథ = అయితే; కః = ఎవరు; వేద = తెలియును; యతః = ఎట్లా; ఆబభూవ = పుట్టిందో?
ఎవరు నిజముగ అరయు వారలు?
ఎవ్వరెరుగును సృష్టి గుహ్యము?
పిదప పుట్టిన దేవగణముల-
కెట్లు తెలుయును జగత్ప్రభవము? - ఇ॒యం విసృ॑ష్టి॒ర్యత॑ ఆబ॒భూవ॒ యది॑ వా ద॒ధే యది॑ వా॒ న ।
యో అ॒స్యాధ్య॑క్షః పర॒మే వ్యో॑మ॒న్త్సో అ॒ఙ్గ వే॑ద॒ యది॑ వా॒ న వేద॑ ॥ ౭ ॥పదచ్ఛేదం: ఇయమ్ । విసృష్టిః । యతః । ఆబభూవ । యది । వా । దధే । యది । వా । న । యః । అస్య । అధిఅక్షః । పరమే । వ్యోమన్ । సః । అఙ్గ । వేద । యది । వా । న । వేద ॥
టీకా: ఇయమ్ = ఈ; విసృష్టిః = విసృష్టి; యతః = దేనినుండి; ఆబభూవ = ఉద్భవించెను; యది = ఒకవేళ; వా = కానీ; దధే = ధరించి నిలుపునదో; యది వా = కానీ; న యః = నిలుపనిదో; అస్య = అక్కడ; అధిఅక్షః = అధివీక్షించేవాడు; పరమే వ్యోమన్ = ఉన్నత ఆకాశంలో; సః = తాను; అఙ్గ = పూర్తిగా; వేద = తెలుయునో; యది వా = లేదా; న వేద = తెలియదో.
ఉద్భవించెను దేనినుండో?
ఎవరి ధారణ వలన నిలిచెనొ?
ఉన్నతోన్నత వ్యోమమందున
అధీక్షించే దేవదేవుడు
సృష్టి గూఢము చెప్పగలడో?
తాను కూడా చెప్పలేడో?
(† స్వధా, ప్రయతి అన్నపదాలకు భిన్న, భిన్న విశ్లేషణలు ఉన్నాయి. సాయణాచార్యుడు వాటిని భోజ్యః, భోక్తారః అని వివరించాడు. కొంతమంది స్వధా అంటే ప్రకృతి అని, ప్రయతి అంటే పురుషుడు అని వివరించారు. ఇలా పలురకాల విశ్లేషణలను తెలుగుకు కూడా ఆపాదించాలనే ఆ పదాలను యథాతథంగా వాడుకొన్నాను.)