పలుకుబడి: సంఖ్యా పదాలు – 2

సంఖ్యా పదం: మూడు

“ఒక్కా ఓ చెలియా, రెండూ రోకళ్ళు, మూడు ముచ్చిలక” — మనలో కొంతమంది అంకెలు గుర్తు పెట్టుకోవడానికి చిన్నప్పుడు నేర్చుకొన్న పాట ఇది! ఇంతకీ మూడుకు ముచ్చిలకకు ఉన్న సంబంధం ఏమిటి?

మూడుకు సంబంధించిన మూల ద్రావిడ ధాతువు *ముహ్-/ *మూ-. ఈ ధాతువుకు నపుంసక లింగ ప్రత్యయమైన –న్ఱు/-ఱు కలిసిన *మూన్ఱు మూల ద్రావిడ సంఖ్యావాచకమై ఉండవచ్చు. సంగత్తమిళంలో మూన్ఱు రూపం కనిపిస్తే, ఆధునిక తమిళంలో మూణు అని వినిపిస్తుంది. కన్నడంలో మూఱు రూపం ప్రాచీనంగా కనిపిస్తుంది. తెలుగు శాసనాలలో మూన్ఱు ఎక్కువగా కనిపించినా, సాహిత్యంలో మూఁడు అన్న రూపమే మనకు నన్నయ్య కాలం నుండీ కనిపిస్తున్నది. అయితే, నన్నెచోడుడు రాసిన కుమారసంభవము కావ్యంలో మాత్రం మనకు మూండు అన్న ప్రయోగం కూడా కనిపించడం విశేషం.

కం.
పోండిగ నగజ తపశ్శిఖి
మూండు జగంబులను దీవ్రముగఁ బర్వినఁ బ్ర
హ్మాండము గాఁచిన కాంచన
భాండము క్రియఁ దాల్చెఁ దత్ప్రభాసితమై (కుమారసంభవము 6.157)

పార్వతి తపస్సు అనే అగ్ని మూడు లోకాలలో పొండిగా (ఒప్పునట్లుగా) తీవ్రంగా వ్యాపించగా, ఆ అగ్నిజ్వాలలలో బ్రహ్మాండమే ఒక బంగారు కుండలా ప్రకాశించిందట.

ద్రావిడ భాషలలో మూడుకు విశేషణ రూపం *మూ-/*ము-. తమిళంలో మూవెయిల్ (మూ + ఎయిల్) అంటే మూడు కోటలు. హల్లు కంటే ముందు ము- అని వాడితే తరువాతి హల్లు ద్విరుక్తమవుతుంది. ముమ్మారు అంటే మూడు సార్లు. నిజం, నిజం, నిజం అని మూడు సార్లు పునరుక్తి చేసే బదులు ‘ముమ్మాటికి నిజం’ అని చెప్పవచ్చు. ముప్పాతిక అంటే మూడు పాతికలు. ముక్కంటి అంటే మూడు కన్నులు కలవాడు, శివుడు. ముక్కాని అంటే మూడు కానీలు; ముక్కారు అంటే మూడు కాలాలు అని అర్థమన్నమాట (కారు అంటే సీజన్ అన్న అర్థం ఉంది కదా!). ముక్కాలిపీట అంటే మూడు కాళ్ళు ఉన్న పీట. ముక్కోల అంటే మూడు కోలలున్న దండము, అంటే త్రిదండమన్నమాట. ముప్పిరి అంటే మూడు పిరి-లు, అంటే మూడు దారాలు అన్నమాట. మువ్వన్నె అంటే మూడు వన్నెలు గలది. ఇంద్రధనస్సుకు మువ్వన్నెవిల్లు అన్న పేరు కూడా ఉంది.

ఇక ముజ్జగములు, ముల్లోకాలు అంటే మూడు లోకాలన్నమాట. ఇక్కడ జగము, లోకము అన్న శబ్దాలు సంస్కృత తత్సమాలు. ఈ సంస్కృత పదాలను తెలుగు పదాలతోనో, ప్రత్యయాలతోనో కలిపి సమాసంగా రాస్తే ఆ సమాసాలను దుష్టసమాసాలంటారు. సాధారణంగా ఇలా తెలుగు పదాలను, సంస్కృత పదాలను కలిపి రాయడాన్ని వ్యాకరణం ఒప్పుకోదు. అయితే, గర్భగుడి, మహాతలవరి, మహాతల్లి వంటి దుష్టసమాసాలు మనకు ప్రాచీన కాలంనుండీ కనిపిస్తాయి. ఇటువంటిదే ఇంకో దుష్టసమాసం ముమ్మూర్తులు. ముమ్మూర్తులు అంటే మూడు మూర్తులు. “మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తివంట” అన్న ‘రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రీ’ పాట వినే ఉంటారు మీరు.

ఇంతకీ ముచ్చిలక అంటే ఏమిటి? ముచ్చిలక అంటే ఒప్పందము, రైతు భూకామందుకు వ్రాసి యిచ్చు కౌలుపత్రము అని అర్థాలున్నాయి కదా. మరి వీటికి మూడు చిలకలకూ సంబంధం ఏమైనా ఉందా, అంటే ఏమీ లేదనే చెప్పాలి. ముచ్చిలక అన్నది మనకు ఉర్దూ/హిందీ ద్వారా సంక్రమించిన అరబ్బీ పదం. ముచల్‌కా అన్న ఉర్దూ పదానికి అర్థం హామీ పత్రము లేదా పూచి పత్రము అని.

*ము- అన్న ధాతువుతో కొంత అయోమయం కలిగించే మరో ధాతువు మున్-. ముత్తాత, మున్నీరు, ముచ్చెమటలు, ముంగారు, ముంజేయి, ముంగాలు, మున్నుడి (ముందు మాట) ఈ పదాలన్నిటిలోనూ మున్- అన్న ప్రత్యయం ‘ముందు’ అన్న అర్థాన్ని సూచించేవే. మున్నీరు అంటే సముద్రం అన్న అర్థం ఉంది (సముద్రం=మొదటినీరు). మున్నీటిచూలి అంటే సముద్రుని కూతురు, అంటే క్షీరాబ్ధి కన్యక అయిన లక్ష్మి అన్నమాట. ‘మున్నీట పవళించు నాగశయన’ అని విష్ణువును సంభోదిస్తున్న సినిమా పాట కూడా ఉంది. ‘కారు’ అంటే సీజన్/కాలము అని పైన చెప్పుకున్నాం కదా. ముంగారు అంటే ఆ కాలానికి తొలినాళ్ళు అన్నమాట. ముంగారిపైరు అంటే తొలినాళ్ళలోనే ఇంటికి వచ్చే పైరు. అలాగే, ముంగామురు(వు) అంటే ముం(దు)+కయి+మురువు అంటే ముంజేతి కంకణమన్నమాట.

ఇంతకీ ముప్పాతిక అంటే మూడు పాతికలు అని తెలుసు కాని, పాతిక అన్న పదానికి వ్యుత్పత్తి ఏమిటో ఎవరైనా ఊహించగలరా?

సంఖ్యాపదం: నాలుగు

“ఏదో నాలుగు ముక్కలు చదివి ఆపై నాలుగురాళ్ళు సంపాదించి నాలుగు కాలాల పాటు నలుగురికి సహాయపడుతూ ఉంటే నలుగురిలో మంచిపేరు లభిస్తుంది” కదూ! చార్ దిన్ కి జిందగీ హై, నలుగురితో పాటు నారాయణ, నాల్కు క్షణగళు ఈ జీవన’ — ఇలా పలు భారతీయ భాషలలో నాలుగవ అంకెకు అంటే ‘పెక్కు’, ‘అనేకం’ అన్న విశేషార్థాలు కూడా ఉన్నాయి. అంటే ఈ భాషలలో ఒకప్పుడు నాలుగే అతి పెద్ద సంఖ్యగా ఉండేదా? ఉత్తర ద్రావిడ భాషలలోనూ, మధ్య ద్రావిడ భాషలు కొన్నింటిలోనూ నాలుగు వరకే అంకెలు ద్రావిడ ధాతువులతో కనిపించడం కూడా ఈ రకమైన ఊహకు ఊతమిస్తుంది.

ద్రావిడభాషలలో నాలుగు అన్న అంకెకు నాలు, నాల్కు, నాన్కు అన్న పదాలు తమిళంలో కనిపిస్తాయి. కన్నడలో నాలుకు, నాల్కు, నాకు అన్న ప్రయోగాలు కనిపిస్తే, తెలుగులో నాలుగు, నాల్గు అన్న ప్రయోగభేదాలు మాత్రమే కనిపిస్తాయి. “తద్రూప సౌందర్య దర్శన లోలుఁడై యజుఁడు నాలుగు దిక్కులందుఁ దనకు గావించుకొనియె ముఖంబులు మఱి రెండు కన్నులఁ జూచినం గాదు తృప్తి యని” (1.8.105) అన్నాడు తిలోత్తమను వర్ణిస్తూ నన్నయ్య.

ఈ అంకెకు సంబంధించిన విశేషణంగా *నాల్-, *నల్-అన్న ప్రత్యయాలు వాడుతారు. నలుదెసలు, నలుదిక్కులు అంటే నాలుగు దిక్కులు. నల్గడలు అంటే నాలుగు పక్కలు (కడ). నలువురు, నలుగురు అంటే నాలుగు మంది మనుష్యులు. నలుజాములు అంటే నాలుగు జాములు. ఈ పదాన్ని అన్నమయ్య ‘జో అత్యుతానంద జో జో ముకుంద’ పాటలో “పగలు నలు జాములును బాలుడై నట్టి” అని రాత్రికి సమానార్థకంగా వాడాడు. నలువా(యి) అంటే నాలుగు ముఖాలు (వాయి అంటే నోరు) ఉన్న బ్రహ్మ అన్నమాట. అగ్నిని నాలుగుకన్నులవేల్పు అన్నారు, కానీ, ముక్కంటి లాగా నల్గంటి అని ఉంటే సరిపోయేది కదా?

చాలా భాషలలో పద్యానికి నాలుగు పాదాలే ఉంటాయి. తెలుగు వృత్తాలన్ని నాలుగు పాదాల పద్యాలే. సంస్కృత శ్లోకంలో కూడా ఒక్కొక్క పాదంలో ఎనమిది అక్షరాల చొప్పున నాలుగు పాదాలుంటాయి గాని, వాటిని రెండు వరసల్లో రాయటం తాళపత్ర లేఖన సంప్రదాయం కావచ్చు. శుక్లాంబరధరం విష్ణుం అంటూ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పలికే శైలిలో ఈ కింది నాలుగు పాదాలను చదవండి:

ఒక కానీ ఒకే కానీ
రెండు కానీలు అర్ధణా
మూడు కానీలు ముక్కానీ
నాల్గు కానీలు ఒక్కణా

అనుష్టుప్ ఛందస్సులో పలికితే ఏదైనా గంభీరంగా ఉంటుందని చెబుతూ మా గురువుగారు తరచుగా చెప్పే ఉదాహరణ ఇది.

సంఖ్యాపదం: అయిదు

అయిదు సంఖ్యావాచకానికి మహాభారతంలో అయిదు అన్న పదంతోపాటూ ఏను అన్న ప్రయోగాలు కూడా ఉన్నాయి. ప్రాచీన తమిళంలో దీన్ని అయిన్తు అని, ఆధునిక తమిళంలోనూ, మలయాళంలోనూ అంజు అని అంటారు. కన్నడలో అయిదు, తుళులో అయినీ అని అంటారు.

అయితే, అయిదు సంబంధించిన పదాలు తెలుగులోనూ, దక్షిణద్రావిడ భాషలలోనూ అ/ఏ కారంతో మొదలైతే, మిగిలిన దక్షిణమధ్య, మధ్య ద్రావిడ భాషలలో చ/చే/సే కారంతో మొదలవుతాయి. గోండి భాషలో చెయుఙ్-/సెయుఙ్-/సైయుంగ్ అనీ, కుయీ భాషలో చేంగి/సేంగి అని అంటారు. కొలామీలో చేగుర్/సేగుర్ అంటే అయిదుగురు. నాయికీలో చేంది/సేంది అంటే అయిదు, పర్జీ లో చేఁదుక్ అంటే అయిదు (వస్తువులు), చేవిర్ అంటే అయిదుగురు.

పదాదిలో ఉండే చ- కారం లుప్తమైపోవడం తెలుగులోనూ, మిగిలిన దక్షిణ ద్రావిడ భాషలలో కనిపించే ధ్వని పరిణామమే. అందుకు ఉదాహరణ ఉప్పు (salt). ఈ పదం మధ్య, ఉత్తర ద్రావిడ భాషలలో చుప్పు అని గానీ, సుప్పు, హుప్పు అని గానీ కనిపిస్తుంది. అలాగే, ఒగరు అన్న పదం ఉత్తర, మధ్య ద్రావిడ భాషలలో చొగరు/ సవ్వొరు/ సారు అన్న పదాలుగా కనిపిస్తాయి. భాషాశాస్త్ర ధ్వని సూత్రాల ఆధారంగా ఈ పదాలన్నింటిలో మొదట చ- కారమే ఉండేదని, ఉత్తర, మధ్య ద్రావిడ భాషలలో అది స- కార, హ- కారాలుగా మారిపోతే, తెలుగులోనూ, దక్షిణ ద్రావిడ భాషలలోనూ అది లుప్తమైపోయిందని నిర్ణయించవచ్చు. ఈ రకమైన సూత్రాలననుసరించే అయిదుకు మూల ధాతువు *చయ్-మ్-తు అని ప్రతిపాదించవచ్చు.

మహాభారతంలో అయిఁదుతో పాటు ఏను అన్న పదం కూడా వాడారని చెప్పుకున్నాం కదా. అయితే, ఈ రెండు పదాలలో ఏ పదం ప్రాచీన తెలుగులో ఉండేది? నన్నయ్య ఆదిపర్వంలో సంస్కృత భారతంలోని పర్వాలలో ఉన్న శ్లోకాల సంఖ్య చెబుతూ, భీష్మపర్వం “యైదువేలు నెనమన్నూట యెనుబది నాలుగు శ్లోకంబులు గలిగి” ఒప్పియున్నదని చెప్పాడు. ఇక్కడ నన్నయ్య ‘ఐదు’ అన్న సంఖ్యావాచకం వాడాడని గమనించండి. కానీ, తిక్కన భారతంలో ద్రౌపది కీచకునికి తన అయిదుగురు పతుల గురించి చెబుతూ “మత్ పతుల్ గీర్వాణాకృతుల్ ఏఁవురు” అంటూ ఏను+వురు అన్న పదం వాడాడు. అయితే, నన్నయ్య ఆదిపర్వంలోనే మరోచోట శాంతిపర్వంలో 14525 పద్యాలున్నాయని చెప్పడానికి “అట్టి మోక్షధర్మంబులుఁ జెప్పుటయునను వృత్తాంతంబుల నొప్పి పదునాలుగు వేల నేనూట యిరువదియైదు శ్లోకంబులు గలిగి” అని ఒకే వచనంలో ఏను, ఐదు అన్న రెండు పదాలు వాడాడు. కానీ, అయిదుతో కూడిన ఇతర తెలుగు సంఖ్యా వాచకాలయిన పదిహేను (పది+ఏను), యాభయ్ (< యేబది < ఏబది < *ఏను + పది) మొదలైన వాటిని గమనిస్తే ఏను అన్న పదమే ప్రాచీనమని, బహుశా తెలుగు కావ్య రచనా కాలంలో అయిదు అన్న పదం కన్నడ భాష నుండి మనకు సంక్రమించిందని చెప్పుకోవచ్చు. నన్నయ్యకు పూర్వం రాసిన తెలుగు శాసనాలలో ఏను, ఏఁ అన్న పదాలే గానీ, అయిదు/అయిఁదు ఎక్కడా కనిపించపోవడం కూడా ఈ సిద్ధాంతాన్నే ధ్రువీకరిస్తుంది. అయిదువ అంటే మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు (చెవి+ఆకు = చెవి కమ్మ) అనే అయిదు ఆభరణాలు కల స్త్రీ అన్నది జానపద వ్యుత్పత్తి కావచ్చు. ఆవిధవ (అ + విధవ = విధవ కానిది) అన్నది ప్రాకృతంలో అఇదవా, ఆవిహవా అని మార్పులు చెందింది. అఇదవా తెలుగులో అయిదవ అవ్వడం సహజమే కదా! ముత్తయిదవ అంటే ముత్త + అయిదవ అంటే అసలు అర్థం ముదుసలి అయిన అయిదవ, కానీ పెళ్ళైన స్త్రీలందరికీ వాడుతారు. అయిదు పది చెయ్యడం అంటే పది వేళ్ళు కలిపి నమస్కారం చెయ్యడం. ఐదుమోముల వేల్పు శివుడు, ఐదుతెగలతూపుజోదు అంటే పంచసుమశరుడు అంటే మన్మథుడు.

సంఖ్యాపదం: ఆరు

ఆఱు అన్న పదానికి మూలద్రావిడ పూర్వరూపం *చాఱు. ఈ సంఖ్యకు గోండిలోనూ, కుయీ, నాయకీ భాషలలోనూ ఉన్న సారుంగ్, హారుంగ్, సార్వుర్ (ఆఱుగురు), సాజ, సజ్గి, సాది అన్న పదాలు మూల ద్రావిడ రూపంలో చ- కారం మొదట ఉండేదని తెలుపుతున్నాయి. తుళు మినహా తతిమ్మా అన్ని దక్షిణ భాషలలోనూ ఇది ఆఱు గానే కనిపిస్తున్నది. తుళులో మాత్రం ఇది ‘ఆజి’ గా రూపాంతరం చెందింది.

మూలద్రావిడ భాషలో ఆఱు (*చాఱు) అన్న సంఖ్యావాచకానికి సంబంధం లేని *ఆఱు, *-ఆరు అన్న రెండు విభిన్న ధాతువులున్నాయి. ఆఱు అంటే ఆఱిపోవు, ఉపశమించు, నశించు అన్న అర్థాలుండగా, *-ఆరు ఆన్న ప్రత్యయానికి కలుగు, నిండు అన్న అర్థాలున్నాయి. అన్నమయ్య పదాల గురించి వేటూరి రాసిన ఒక వ్యాసంలో ‘పచ్చారు సొగసులు’ అన్న పదబంధాన్ని వివరిస్తూ ‘ముక్కుపచ్చలప్పటికి ఆరినవేమో మరి’ అని రాశాడు. పచ్చారు సొగసులు అంటే నేను అర్థం చేసుకున్నది పచ్చ(దనం) నిండిన సొగసులు అని, పచ్చలు ఆఱినవి అనికాదు. ఆరు అన్న వ్యాపారమాత్రబోధక ప్రత్యయం అలరారు, నిండారు, ఒప్పారు, కప్పారు, విప్పారు అన్న పదాలలో కనిపిస్తుంది కదా! ‘మనసారా పూజించాను’, ‘కడుపారా భుజించాను’, ‘కనులారా దర్శించాను’ అన్న పదాలలో కూడా ఇదే అర్థంలో కనిపిస్తుంది. మీరేమంటారు?

చర్చ పక్కదారులు పట్టి సంఖ్యా వాచకమైన ఆఱు వివరించే పని ఆఱుమూడు అయ్యింది కదూ! ఆఱుమూడు అవ్వడం అంటే అయోమయంగా మారిపోవడం. ఆఱ్ముగమ్ అంటే ఆరు ముఖాల వేల్పు, కుమారస్వామి. ఆరోప్రాణం అంటే తన పంచప్రాణాల తరువాత అపురూపంగా చూసుకునే ప్రాణం అన్నమాట. ‘ఆఱు నూఱైనా నూఱు ఆఱైనా’ అంటే ‘ఊహించని పరిణామాలు సంభవించినా’ అని అర్థం.

పాఠకులకు క్విజ్: ‘ఆరుస్తావా, తీరుస్తావా’ అంటే ఏమిటి? ‘ఆరింద’ అంటే ఏమిటి?