పలుకుబడి – కాలమానము II

అన్నీ మనవేదాల్లోనే ఉన్నాయిష!

నవంబర్ సంచికలోని పలుకుబడి వ్యాసంపై వ్యాఖ్యానిస్తూ లైలా, భారతీయ ‘కల్పం’ గురించి, స్విస్ దేశానికి చెందిన పర్మెజానీ సంస్థ తయారుచేసే ‘కల్ప’ చేతిగడియారాల గురించి ప్రస్తావించారు. లైలాగారు చెప్పినట్టు బ్రహ్మ జీవితంలో ఒక రోజుకు (ఒక పగలుకు) కల్పం అని పేరు. ఆ సమయం మానవ కాలమానం ప్రకారం సుమారు 43 కోట్ల 20 లక్షల సంవత్సరాలని భారతీయుల నమ్మకం. అయితే, వేదకాలం నుంచి మనకు సెకండులో ఒక కోటివంతు (10-7 సెకండ్లు) కాలం నుండి 40 లక్షల కోట్ల సంవత్సరాల (1022 సెకండ్లు) దాకా లెక్క పెట్టగలిగే కాలమానం ఉండేదని చెప్పే వెబ్‌సైట్లు ఇంటర్నెట్టులో కోకొల్లలు. అలాగే, వేదాలలో (సూర్య)కాంతి వేగాన్ని కూడా విలువకట్టి చెప్పారని, అది నేటి శాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతులను ఉపయోగించి కనిపెట్టిన విలువకు ఉరమరగా సరిపోతుందనీ గర్వంగా చెప్పుకోవడం కూడా కొన్ని సైట్లలో కనిపిస్తుంది. అయితే, ఇందులోని సత్యాసత్యాల గురించి కాస్తా విచారిద్దాం.

చాంద్రమానం, సౌరమానం, సౌర-చాంద్రమానం

ఒక అమావాస్య నుంచి మరుసటి అమావాస్య దాకా ఉన్న ‘నెల’ రోజులను ప్రమాణంగా తీసుకొని కాలాన్ని కొలవడం అనాదిగా మానవునికి తెలుసని ఇంతకు ముందు విడతలో చర్చించాం కదా! అమావాస్య నుండి అమావాస్య దాకా సుమారు ముప్ఫై రోజుల కొకసారి చంద్రకళలు పునరావృత్తమౌతాయని దాదాపు అన్ని నాగరికతలకు తెలుసు. ఈ రకంగా పౌర్ణమి, అమావాస్యల ఆధారంగా కాలాన్ని కొలవడాన్ని చాంద్రమానం (lunar) అంటారు.

ఇదే విధంగా క్రమం తప్పకుండా వచ్చే చెట్లు చిగురించే కాలాన్ని, ఆకురాలే కాలాన్ని గమనించడం నేర్చుకున్నాడు మానవుడు. వ్యవసాయం అభివృద్ధి చెందిన నాగరికతలలో వర్షాలు ఎప్పుడు పడతాయో, ఎండాకాలం ఎప్పుడు వస్తుందో తెలియడం ముఖ్యం. ఈజిప్టులోని నైలునదికి దాదాపు 360-370 రోజులకొక సారి వరదలు వచ్చేవట. సూర్యుని ఎండ తీక్షణతలోనూ, రాత్రి-పగళ్ళ కాలపరిమాణంలోనూ ఇదే 360 రోజుల క్రమంలో మార్పులు వచ్చేవని వారు గమనించారు. ఈ మార్పుల ననుసరించి కాలాలు, ఋతువులు 360 రోజుల్లో పునరావృత్తమవుతాయని అనుకునేవారు. ఈ రకంగా సూర్యుని గతిమీద ఆధారపడిన కాలమానాన్ని సౌరమానం (solar) అంటారు.

నాగరికతలు వెలసిన తొలిరోజుల్లలోనే, తేలికగా గమనించగలిగే చాంద్రమానాన్ని, వ్యవసాయానికి అవసరమైన సౌరమానాన్ని అనుసంధానం చేసే సౌర-చాంద్రమానాలు (lunisolar) కూడా కొన్ని తయారయ్యాయి. ముప్ఫై రోజుల నెల లెక్కను బట్టి ఒక సౌరసంవత్సరం దాదాపు 12 చాంద్రమాసాలకు సమానమై ఉంటుందని వారు ఊహించారు. అయితే, ఒక్కో చాంద్రమాసం నిజానికి దాదాపు 29½ రోజులు; కాబట్టి 12 చాంద్రమాసాలు 354 రోజులకు సమానం. కానీ, సుమారు సౌరసంవత్సరంలో 365¼ రోజులు. అంటే ఈ రెండు పద్ధతుల కొలతలలో సంవత్సరానికి దాదాపు 11-12 రోజుల తేడా. ఈ రకమైన తేడాను వారు ఆ రోజుల్లోనే పసికట్టారు. ఈ వ్యత్యాసాన్ని అధిగమించడానికి రెండున్నర సంవత్సరాలకొకసారి అధికమాసం అని 13వ నెలను జతచేసేవారు. ఈ రకమైన అధికమాసపు పద్ధతి బాబిలోనియన్, ఈజిప్టు నాగరికతలలోనూ, యూదు, గ్రీకు, భారతదేశాలలో కనిపిస్తుంది. వ్యవసాయంతో పాటు ఈ పద్ధతి తూర్పు ఆసియాలో అభివృద్ధి చెంది మిగితా ప్రాంతాలకు పాకిందని కొంతమంది చరిత్రకారులు ఊహిస్తే, మరికొంతమంది ఎవరికివారే విడివిడిగా ఈ పద్ధతిని కనుక్కొన్నారని వాదిస్తారు. ప్రకృతిసిద్ధమైన విషయం గురించి భిన్నమైన నాగరికతలు ఒకరికొకరు తెలియకుండా, ఒకేరకమైన సిద్ధాంతాన్ని తయారుచేయడం అంత అసాధ్యమేమీ కాదని వీరి వాదన.

వేదాలలో కాలమానం

యస్యాగ్నిహోత్రం అదార్శం అపౌర్ణమాసం
అచాతుర్మాస్యం అనాగ్రాయణం అతిథివర్జితంచ
అహుతం అవైశ్వదేవం అవిధినాహుతం
ఆసప్తమాంస్ తస్య లోకాన్ హినస్తి (మాండుక్యోపనిషత్తు 1. 2.3)

ఎవరైతే నిత్యాగ్నిహోత్రముతోపాటు పౌర్ణమికి, మాసానికి, చతుర్మాసానికి, ఆగ్ర అయనానికి తగిన క్రతువులు చేయరో […] వారు సప్తలోకాలలో తమ గతిని నాశనము చేసుకొందురు.

కాలానుగుణంగా క్రతువులు చెయ్యాలని శాసించే వారికి ఆ కాలగమనం గురించి స్థూలంగానైనా అవగాహన ఉండేదని మనం ఊహించవచ్చు. వేదాలలో అతిప్రాచీనమైన ఋగ్వేదం లోని శ్లోకాల ద్వారా వారికి అప్పటికే కచ్చితంగా చంద్రగమనం గురించి, సూర్యగమనం గురించి స్పష్టమైన అవగాహన ఉండేదని, క్రమం తప్పకుండా వచ్చే ఋతువుల గురించి, అధికమాసం గురించే కాక, సంవత్సరానికి రెండు సార్లు వచ్చే విషువత్తుల (equinox) గురించి, అయనాల (solstice) గురించి కూడా తెలుసునని మనం గ్రహించవచ్చు.

ఋగ్వేదంలో ఋత(ము) అంటే క్రమము, సత్యము, ధర్మము; అనృతము అంటే క్రమం తప్పినది, అసత్యమైనది అన్న అర్థాలున్నాయి. ఋగ్వేదంలో ‘ఋత’ అన్న పదం చాలా ప్రచురంగా కనిపిస్తుంది. ఇది ఇండో-యూరోపియన్ మూల ధాతువు *హర్-త్- నుండి వచ్చిందని భాషావేత్తల ఊహ. గ్రీక్ దేవత పేరైన Arete, Harmony మొ., దీనికి సోదర పదాలు (cognates). విషువత్తు (equinox) రోజున భూమిపైన రాత్రిభాగం, పగటిభాగం సమానంగా ఉంటాయి. విషు- అంటే రెండు వైపులా (సమానంగా). విషువత్- అంటే సమానమైన భాగాలు కలది. రాత్రి, పగలు సమాన భాగాలుగా గల రోజును విషువత్తు అంటారు.

ఋగ్వేదంలో ఆయా కాలాలలో నిర్వహించవలసిన క్రతువులను వివరించే శ్లోకాల ద్వారా ఆనాటి కాలమానం యొక్క వివరాలను అంచనా వేయవచ్చు. ఉదాహరణకు, ఋగ్వేదంలోని ఏడవ మండలంలో 103వ సూక్తంలోని 7-9 శ్లోకాలలో సంవత్సరం చివర బ్రాహ్మణులు జరిపే సోమ-అతిరాత్ర యజ్ఞాన్ని వివరిస్తూ, 12 మాసాలను (ఋతువులను) చక్కగా కాపాడిన ఋత్విక్కులు సోమరసం తాగుతూ ఈ యజ్ఞాన్ని వేడుకగా నిర్వహిస్తారని వర్ణిస్తారు.

బ్రాహ్మణాసో అతిరాత్రే న సోమే సరో న పూర్ణం అభితో వదంతః
సంవత్సరస్య తదహః పరిష్ఠ యన్ మండూకాః ప్రావృషీణం బభూవ
బ్రాహ్మణాసః సోమినో వాచం అక్రత బ్రహ్మ కృణ్వంతః పరివత్సరీణం
అధ్వర్యవో ఘర్మిణః సిష్విదానా ఆవిర్ భవంతి గుహ్యా న కే చిత్
దేవహితిం జుగుపుర్ ద్వాదశస్య ఋతుం నరో న ప్ర మినంత్యేతే
సంవత్సరే ప్రావృష్యాగతాయాం తప్తా ఘర్మా అశ్నువతే విసర్గం
(ఋగ్వేదం 7.103.7-7.103.9)

సంవత్సరానికి 12 మాసాలన్నది దైవనిర్ణయమని, వాటిని చక్కగా నిర్వర్తించినందుకు బ్రాహ్మణులు జరుపుకొనే విజయోత్సవమే సోమ-అతిరాత్ర యజ్ఞమని ఈ శ్లోకాల ద్వారా మనకు తెలుస్తున్నది.

ఋగ్వేదంలోని మొదటి మండలం 25వ సూక్తంలోని 8వ శ్లోకం వరుణుని గురించి చెబుతూ:

వేద మాసో ధృతవ్రతో ద్వాదశ ప్రజావతః
వేదా య ఉపజాయతే (1.25.8)

వరుణ దేవునికి పన్నెండు మాసాల గురించి బాగా తెలుసు; (ఇవి కాక) ఇంకొక మాసం గురించి కూడా తెలుసు.

ఇక్కడ ఇంకొకమాసం అంటే అధికమాసం గురించే ప్రస్తావిస్తున్నారని అనుకోవాలి. యజుర్వేదంలోని 1.4.14 శ్లోకంలో ఈ అధికమాసాల గురించి విపులంగా వివరిస్తూ, ఇది ప్రతి అయిదు సంవత్సరాలకు రెండు సార్లు వస్తుందని చెబుతుంది.

ఋగ్వేదంలోనే కాలామానాన్ని చాలా గుహ్యంగా వర్ణించే ఈ కింది శ్లోకాలను గమనించండి:

ద్వాదశారం నహి తజ్జరాయ వర్వర్తి చక్రం పరి ద్యామృతస్య ।
ఆ పుత్రా అగ్నే మిథునాసో అత్ర సప్త శతాని వింశతిశ్చ తస్థుః ॥ 1.164.11
పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహుః పరే అర్ధే పురీషిణం ।
అథేమే అన్య ఉపరే విచక్షణం సప్తచక్రే షళర ఆహురర్పితం ॥ 1.164.12

అగ్నీ, ముసలితనం లేకుండా స్వర్గం చుట్టూ నీ చక్రం ద్వాదశ అరములతో (spoke – బండికంటియాకు) సదా తిరుగుతూ ఉన్నది. నీ 720 జంట కవలల పుత్రులు కూడా కనిపిస్తున్నారు. వారు అయిదు పాదాలు కలిగి, పన్నెండు ఆకృతులు కలిగిన పితరుడిగా నిన్ను భావిస్తున్నారు. మరికొంతమంది నిన్ను ఆరు ఆరములతో, సప్త చక్రాలు కలిగిన విచక్షణునిగా పరిగణిస్తున్నారు.

ఇక్కడ అగ్నిని సూర్యుడినిగా భావించి సంబోధించే శ్లోకాలు ఇవి: అతని పుత్రులు 720 జంట కవలలు – 360 పగళ్ళు, 360 రాత్రులు; అంటే వారు ఆ రోజుల్లో సంవత్సరాన్ని 360 రోజులుగా భావించారని అనుకోవచ్చు. అయిదు పాదాలు అయిదు ఋతువులు. పన్నెండు ఆకృతులు పన్నెండు నెలలు. మరి కొంతమంది ఆరు ఋతువులు కలిగి ఏడు రోజుల వారానికి ప్రతీకగా నిన్ను సప్తచక్రాలు ఉన్నవాడిగా పరిగణిస్తున్నారు.

యజుర్వేదంలో కూడా అహోరాత్రం, అర్ధమాసం, మాసము, ఋతువులు, సంవత్సరాల వివరాలు ఆనాటి స్థూల కాలవిభజనగా మనకు కనిపిస్తాయి.

అర్ధమాసాస్తే కల్పంతాం, మాసాస్తే కల్పంతాం । ఋతవస్తే కల్పతాం సంవత్సరస్తే కల్పతాం ॥ (యజుర్వేద 27.45)

అయితే, ఋతువులు, కాలాల గురించి వేదవాఙ్మయంలో పరస్పర విరుద్ధమైన భావనలు కనిపిస్తాయి. ఉదాహరణకు, ఋగ్వేదంలోని పదవ మండలం పురుష సూక్తంలో వసంతం, గ్రీష్మం, శరత్తు అన్న మూడు ఋతువుల ప్రస్తావనే కనిపిస్తుంది. యజుర్వేదంలో ఒకచోట (యజుర్వేద 7.3.8) అయిదు ఋతువులను పేర్కొంటే, మరోచోట (యజుర్వేద 4.4.11) ఆరు ఋతువులను పేర్కొన్నారు. శతపథ బ్రాహ్మణంలో మూడు, అయిదు, ఆరు ఋతువులతో పాటు ఒకచోట ఏడు ఋతువుల ప్రస్తావన కూడా కనిపిస్తుంది. కొన్ని చోట్ల కొత్త సంవత్సరం దక్షిణాయనంతో (summer solstice) ప్రారంభమైతే, మరికొన్ని చోట్ల ఉత్తరాయణంతో (winter solstice) ప్రారంభమవుతుంది. కొన్ని చోట్ల సంవత్సరాన్ని 360 రోజులుగా వర్ణిస్తే, మరోచోట చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికి తేడా 12 రోజులుగా వర్ణించడం కనిపిస్తుంది. (అంటే సంవత్సరానికి 366 రోజులుగా పరిగణించారిక్కడ). ఇటువంటి పరస్పర విరుద్ధమైన భావనల ద్వారా, భారతీయ కాలమాన లక్షణాలు వైదికకాలానికి పూర్తిగా అభివృద్ధి చెందలేదని మనం చెప్పుకోవచ్చు.

ఆలస్యంగా అభివృద్ధి చెందిన యుగసిద్ధాంతం

అంతేకాక, వైదిక వాఙ్మయంలో ఎక్కడా కల్ప, మహాకల్పాల గురించి గానీ, యుగ, మహాయుగాల గురించి గానీ ప్రస్తావన లేదు. యజుర్వేదంలో నిజానికి యుగం అంటే అయిదు సంవత్సరాల ఆవర్తనం. “సంవత్సరో౽సి, పరివత్సరో౽సి, ఇదావత్సరో౽సి, ఇడ్వత్సరో౽సి, వత్సరో౽సి” అన్న యజుర్వేద శ్లోకం(27.45) ప్రకారం “సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, ఇడ్వత్సర, వత్సర” అంటూ ఈ ఆవర్తంలోని ఒక్కో సంవత్సరాన్ని ఒక్కో పేరుతో పిలిచేవారు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో “పంచవత్సరో యుగమితి (అర్థశాస్త్ర ఈఈ.20)”, వేదాంగమైన జ్యోతిశ్శాస్త్రంలో “యుగం భవేద్ వత్సరపంచకేన,” అన్న నిర్వచనాలే కనిపిస్తాయి.

అయితే, కృత, త్రేత, ద్వాపర, కలి యుగాల ప్రస్తావన, కల్ప, మహాకల్పాల కాలవిభజన మనకు మొట్టమొదటిసారిగా మహాభారతంలో కనిపిస్తుంది. అయితే, ఈ ప్రస్తావనలు కూడా మహాభారతానికి చిట్టచివర దశలో చేర్చిన భాగాలలో, తరువాత చేర్చిన ప్రక్షిప్తాలలో ఎక్కువగా కనిపించడం విశేషం. ఉదాహరణకు, 75 వేల శ్లోకాలున్న మహాభారతంలో కలియుగ ప్రస్తావన కేవలం తొమ్మిది సార్లు మాత్రమే కనిపిస్తుంది. ఇవి మహాభారతంలో ప్రక్షిప్తాలుగా చెప్పుకునే శాంతిపర్వంలోని నారాయణీయంలోనూ, అరణ్యపర్వంలోని మార్కండేయ విభాగంలోనూ ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఇవి మహాభారత మూలకథలో భాగం కాదని పండితుల వాదన. భగవద్గీతలో కృష్ణుడు “సంభవామి యుగే, యుగే” అంటాడు కాని, ఎక్కడా కృత, త్రేత, ద్వాపర, కలి యుగాల పేర్లు చెప్పలేదు. దశావతారాల ప్రసక్తి కూడా భగవద్గీతలో లేదు. అలాగే, ‘కల్ప’ ప్రస్తావన భగవద్గీతలో ఒకే ఒక్క శ్లోకంలో కనిపిస్తుంది (9.7).

సర్వ భూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం (భగవద్గీత 9.7)

కౌంతేయా! కల్పక్షయమయ్యే ప్రళయకాలంలో ప్రాణికోటులన్నీ నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. మరల కల్పాదియందు వాటిని మళ్ళీ నేను సృజిస్తున్నాను.

అదీ గాక, పురాణాల్లో ఒక కృత, త్రేత, ద్వాపర, కలి యుగాల ఆవర్తానికి మహాయుగమని పేరు. అటువంటి మహాయుగాలు వెయ్యి అయితే అది ఒక కల్పం అవుతుంది. కానీ, మహాభారతంలో నాలుగు యుగాల ఒక్క ఆవర్తానికే కల్పమని పేరు (12.291.14). పురాణాలు రామాయణ, మహాభారతాది ఇతిహాసాల తరువాతి కాలంలో వెలువడిన కావ్యాలు. అష్టాదశపురాణాలు సుమారు క్రీస్తుశకం 4వ శతాబ్ది నుండి 12/15వ శతాబ్దం వరకూ రాయబడ్డవని పండితుల ఊహ. గుప్తుల కాలంలోనూ, ఆ తరువాతి కాలంలోనూ రాయబడ్డ పురాణాల్లోనే మనకు యుగసిద్ధాంతము, కల్ప, మహాకల్ప కాలమానాల విభజన మొదలైన అంశాలను విపులంగా చర్చించారు. విష్ణుపురాణం మొదటి విభాగంలోని మూడవ అధ్యాయంలో ఈ యుగసిద్ధాంతపు వివరాలు కనిపిస్తాయి. అలాగే, 4వ శతాబ్దికి చెందిందిగా భావించబడే సూర్య సిద్ధాంతంలో వివరించిన స్పష్టమైన కాలవిభజన ఆతరువాతి కాలాలలో ప్రామాణిక భారతీయ కాలమానంగా స్థిరపడిపోయింది.

ఈ ఆధారాలను బట్టి యుగసిద్ధాంతం వైదిక వాఙ్మయంలో ఛాయామాత్రంగానైనా కనిపించదనీ, ఆపై మహాభారత రచనలో కనిపించినా, అది కథాంశంలో అంతగా ప్రధానమైనది కాదని మనం కచ్చితంగా చెప్పవచ్చు. తరువాతి రోజుల్లో మహాభారతానికి చేర్చిన ప్రక్షిప్తాల ద్వారా కురుక్షేత్ర యుద్ధానికి కలియుగ ఆరంభానికి లంకె పెట్టే ప్రయత్నం జరిగిందని కూడా మనం చెప్పవచ్చు. ఈ అంశంపై మరిన్ని వివరాలకు Luis González –Reimann రాసిన పరిశోధనా పత్రం చదవండి.

సూక్ష్మ కాల విభజన

భారతీయ కాలమానంలో మనకు ఎక్కువగా కనిపించే సూక్ష్మ కాల పరిమాణం నిమేషము. నిమేషము అంటే రెప్పపాటు కాలం. అయితే, నిమేషము అంటే రెప్పపాటు అన్న అర్థం ఋగ్వేదకాలం నాటినుండి ఉన్నా, ఆ పదాన్ని ఋగ్వేదంలో కాలపరిమాణానికి వాడిన గుర్తులు కనిపించవు. ఋగ్వేదంలో రెప్పపాటు లేనివారు, దేవతలు అన్న అర్థాలలో ‘అనిమిష’, ‘అనిమేష’ అన్న ప్రయోగాలు మాత్రమే మనకు కనిపిస్తాయి.

ఉపనిషత్తుల కాలంలో మాత్రం కలా, ముహూర్త, కాష్ఠ అన్న సూక్ష్మ కాలవిభజనలు కనిపిస్తాయి. ఉదాహరణకు మాండుక్యోపనిషత్తులోని ఈ శ్లోకం చూడండి:

కలా ముహూర్తాః కాష్ఠాశ్చ అహోరాత్రాశ్చ సర్వశః
అర్ధమాసా మాసా ఋతవస్ సంవత్సరశ్చ కల్పంతాం (మాండుక్యోపనిషత్తు ఈ. 2.3-4)

కలా, ముహూర్త, కాష్ఠ, అహోరాత్రాలు అన్నీ కలిసి అర్ధమాస, మాస, ఋతు, సంవత్సరాలుగా అయి ఉన్నవి.

క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిందిగా చెప్పుకునే శతపథబ్రాహ్మణంలో మాత్రం విభిన్నమైన సూక్ష్మకాల విభజన కనిపిస్తుంది (శతపథ బ్రా. 12.3.2.5). ఆ విభజన ప్రకారం:

1 ముహూర్తం = 15 క్షిప్రలు
1 క్షిప్ర = 15 ఏతర్హీలు
1 ఏతర్హి = 15 ఇదానీలు
1 ఇదాని = 15 ప్రాణాలు
1 ప్రాణ = 1 నిమేషము (రెప్పపాటు)

అయితే, ఈ విభజన అంతగా ప్రాచుర్యం చెందినట్టుగా కనిపించదు. తరువాతి సాహిత్యంలో మాండుక్యోపనిషత్తులో వాడిన కలా, ముహూర్త, కాష్ఠ శబ్దాలే కాని, శతపథబ్రాహ్మణంలో వాడిన క్షిప్రలు, ఏతర్హీలు, ఇదానీలు కనిపించవు.

సూక్ష్మ కాల పరిమాణాల గురించి విపులంగా వివరించే మహాభారతం లోని శాంతిపర్వంలో కనిపించే ఈ శ్లోకాలు చూడండి:

కాష్ఠా నిమేషా దశ పంచ చైవ
త్రింశత్తు కాష్ఠా గణయేత్కలాం తాం
త్రింశత్కలాశ్చాపి భవేన్ముహూర్తో
భాగః కలాయా దశమశ్చ యః స్యాత్
త్రింశన్ముహూర్తశ్చ భవేదహశ్చ
రాత్రిశ్చ సంఖ్యా మునిభిః ప్రణీతా
మాసః స్మృతో రాత్ర్యహనీ చ త్రింశ
త్సంవత్సరో ద్వాదశమాస ఉక్తః
(మహాభారతం శాంతిపర్వం 12.224.12-16)

పై శ్లోకాల ప్రకారం:

1 నిమేషము = రెప్పపాటు కాలం
15 నిమేషములు = 1 కాష్ఠం
30 కాష్ఠములు = 1 కళ
30 కళలు = 1 ముహుర్తం
30 ముహుర్తాలు = 1 దివారాత్రి (ఒక రోజు)
30 దివారాత్రులు = 1 మాసం
12 మాసాలు = 1 సంవత్సరం

మను ధర్మశాస్త్రంలో, అర్థశాస్త్రంలో కూడా సుమారు ఇదే విభజన ఉంటుంది, కానీ వాటిలో 18 నిమేషాలు ఒక కాష్ఠం అవుతాయి. ఈ కాలంలో దాదాపు అన్ని కావ్యాలలో ఒకరోజును 30 భాగాలుగా విభజించడం కనిపిస్తుంది.

క్రీస్తుశకం నాలుగవ శతాబ్దానికి చెందినదిగా భావించే సూర్య సిద్ధాంతంలో మూర్త, అమూర్త అని రెండు రకాల కాలమానాలు కనిపిస్తాయి. మూర్త కాలమానంలో ‘ప్రాణ’ (breathing period) అతి చిన్నదైన ప్రమాణం. దానిననుసరించి మిగిలిన కాల విభాగాలు ఇలా ఉంటాయి:

6 ప్రాణ కాలాలు = 1 విఘడియ/వినాడి (24 సెకండ్లు)
60 విఘడియలు/ వినాడి = 1 ఘడియ/నాడి (24 నిమిషాలు)
60 ఘడియలు/నాడి = 1 అహోరాత్రము (24 గంటలు) = 1 రోజు

ఒక ‘ప్రాణం’ అంటే పది గురు (దీర్ఘ) అక్షరాలను పలికే సమయం అన్న నిర్వచనం కూడా ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

అమూర్త కాలమానంలో ‘త్రుటి’ అతి సూక్షమైన కాలపరిణామం అని మాత్రమే సూర్యసిద్ధాంత గ్రంథం చెబుతుంది. ఈ గ్రంథంలో ఇంతకుమించి అమూర్త కాలమానం గురించి ఏ వివరాలు కనిపించవు. అయితే, 12వ శతాబ్దానికి చెందిన భాస్కరుడు రాసిన సిద్ధాంత శిరోమణి అన్న గ్రంథంలో అమూర్త కాలమానానికి వివరణ ఇస్తూ ఈ రకమైన కాలవిభజన చూపిస్తాడు:

100 త్రుటి = 1 తత్పర
30 తత్పర = 1 నిమేష
18 నిమేషాలు = 1 కాష్ఠ
30 కాష్ఠాలు = 1 కలా
30 కలలు = 1 ఘటిక
2 ఘటికలు = 1 క్షణ
30 క్షణాలు = 1 అహోరాత్రము

అంటే రోజులో 2916000000వంతు త్రుటి. అలాగే, ఆధునిక లెక్కల ప్రకారం త్రుటి సెకండులో 33750వంతు.

అయితే, భాస్కరుని 12వ శతాబ్దం దాకా ఈ రకమైన విభజన లేదని మనం అనుకోవడానికి వీలులేదు. 4వ శతాబ్దం తరువాత వచ్చిన భాగవత పురాణం లోనూ, విష్ణుపురాణం లోనూ ఈ విధమైన సూక్ష్మ కాలచర్చ కనిపిస్తుంది. ఉదాహరణకు, భాగవత పురాణంలో విపులంగా వివరించిన ఈ విభజన చూడండి:

అణుర్ ద్వౌ పరమాణూ స్యాత్ త్రసరేణుస్ త్రయః స్మృతః
జాలార్కరశ్మ్యవగతః ఖం ఏవానుపతన్నగాత్ (3.11.5)

రెండు పరమాణువులు ఒక అణువుగా, మూడు అణువులు ఒక త్రసరేణువుగా భావిస్తారు. ఈ త్రసరేణు కిటికీ గుండా ప్రసరించే సూర్యరష్మిలో ఆకాశం (ఖం) వైపు పైకి పయనిస్తూ మనం గమనించవచ్చు.

త్రసరేణు-త్రికం భుంక్తే యః కాలః స త్రుటిః స్మృతః
శత-భాగస్తు వేధః స్యాత్ తైస్ త్రిభిస్ తు లవః స్మృతః (3.11.6)


మూడు త్రసరేణువుల కలయికకు (భుంక్త) పట్టే కాలాన్ని త్రుటి అంటారు. ఒక వంద త్రుటులను వేధ అని, మూడు వేధాలను లవమని అంటారు.

నిమేషస్ త్రిలవో జ్ఞేయ ఆమ్నాతస్తే త్రయః క్షణః
క్షణాన్ పంచ విదుః కాష్ఠాం లఘు తా దశ పంచ చ (3.11.7)

మూడు లవముల కాలాన్ని ఒక నిమేషము అంటారు. మూడు నిమేషాలు ఒక క్షణమని, అయిదు క్షణాలు ఒక కాష్ఠమని పదిహేను కాష్ఠాలు ఒక లఘువని తెలుసుకోవచ్చు.

లఘూని వై సమామ్నాతా దశ పంచ చ నాడికా
తే ద్వే ముహూర్తః ప్రహరః షడ్ యామః సప్త వా నృణాం (3.11.8)

పదిహేను లఘువులు ఒక నాడిక. రెండు నాడికలు ఒక ముహూర్తము. ఆరు లేక ఏడు నాడికలు ఒక ప్రహార (లేదా ఒక యామము/జాము)గా నరులు పరిగణిస్తారు.

యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానాం అహనీ ఉభే
పక్షః పంచ-దశాహాని శుక్లః కృష్ణశ్చ మానద

నాలుగుజాములు పగలు, నాలుగు జాముల రాత్రి కలసి ఒక మనుష్యుల అహోరాత్రమౌతుంది. పదిహేను రోజులు శుక్లపక్షంగా, పదిహేను రోజులు కృష్ణపక్షంగా పరిగణిస్తారు.

తయోః సముచ్చయో మాసః పితౄణాం తద్ అహర్-నిశం
ద్వౌ తావ్ ఋతుః షడ్ అయనం దక్షిణం చ ఉత్తరం దివి


ఒక శుక్లపక్షము, ఒక కృష్ణపక్షము కలసి మాసం అవుతుంది. అది పితృ దేవతల కాలమానం ప్రకారం ఒక పగలు, ఒక రాత్రి. అటువంటి రెండు మాసాలు ఒక ఋతువవుతుంది. ఆరు ఋతువులు కలిస్తే ఒక దక్షిణాయనం, ఒక ఉత్తరాయణం.

అయనే చాహనీ ప్రాహుర్ వత్సరో ద్వాదశ స్మృతః
సంవత్సర-శతం నౄణాం పరమాయుర్ నిరూపితం


రెండు అయనాలను కలిపి వత్సరమంటారు. ఇది ద్వాదశ పితృ దినాలు అంటే ద్వాదశ మాసాలకు సమానం. శతసంవత్సరాలు నరుల జీవితకాలమని నిర్ధారించారు.

దాదాపు ఇదే విధమైన కాలమానం విష్ణుపురాణంలోనూ, జ్యోతిషశాస్త్రం లోనూ కనిపిస్తుంది. జ్యోతిష శాస్త్రాన్ని వేదాంగంగా భావించినా దాని రచనాకాలం దాదాపు క్రీస్తుశక ఆరంభమని పండితుల భావన.

ఋగ్వేదం – కాంతి వేగం

మరి అయితే కాంతివేగం మాటేమిటి? దాని విలువను ఋగ్వేదంలో కచ్చితంగా లెక్కించారని వికీపీడియా ఘోషిస్తోంది కదా?

వికీపీడియాలో ఎంతో ఉపయోగపడే విలువైన సమాచారం ఉన్నా, అంతే నిరుపయోగమైన దుష్ప్రాపగాండా కూడా ఉంది. వికీపీడియాలో పండిత పామర భేదం లేకుండా ఏ వ్యాసాన్ని ఎవరైనా మార్చవచ్చు; ఏ వ్యాసానికి ఏ రకమైన సమాచారానైనా జతచేయవచ్చు. వినోదప్రాయంగా కొంతమంది వికీపీడియాలో తమకు తోచిన అశాస్త్రీయమైన సమాచారం జతచేస్తే, తమ వర్గం/జాతి ఆధిపత్యాన్ని ప్రచారం చెయ్యడానికి మరికొంతమంది పనిగట్టుకొని వికీపీడియాను సాధనంగా వాడుకొంటున్నారు. కాబట్టి వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని ఆ విషయంపై స్థూలంగా తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించి, లోతైన అవగాహనకు ప్రసిద్ధి చెందిన పండితుల/ప్రచురణకర్తల పుస్తకాలను సంప్రదించడం ఎంతైనా శ్రేయస్కరం.

ఇక ఋగ్వేదంలో కాంతివేగాన్ని గురించి తరచుగా ఉటంకించే శ్లోకం ఇది:

తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృదసి సూర్య।
విశ్వమా భాసి రోచనం ॥ ఋగ్వేదం 1.050.04

దానికి సాయణాచార్యుడు రాసిన భాష్యం ఇది:

తథా చ స్మర్యతే యోజనానాం సహస్త్రం ద్వే ద్వే శతే ద్వే చ యోజనే ఏకేన నిమిషార్ధేన క్రమమాణ నమోఽస్తుతే॥

ఋగ్వేద శ్లోకానికి అర్థం: ఎంతో వేగంగా పయనిస్తూ అందమైన వెలుగును సృష్టించేవాడా! విశ్వమంతటా వెలుగును పంచేవాడా! ఓ సూర్యుడా!

సాయణుడు రాసిన భాష్యానికి అర్థం: నిమిషార్ధ సమయయంలో 2,202 యోజనాలు ప్రయాణం చేసే సూర్యునికి నమస్సులు!

నిజానికి ఋగ్వేదశ్లోకంలో కాంతివేగం గురించి గానీ, దాన్ని విలువకట్టే ప్రయత్నం కానీ కనిపించదు. అయితే 14వ శతాబ్దికి చెందిన సాయణుడు రాసిన భాష్యంలో మాత్రం సూర్యుని వేగానికి ఒక విలువ ఆపాదించే ప్రయత్నం కనిపిస్తుంది. ఆయన భాష్యం ప్రకారం సగం నిమిషంలో 2,202 యోజనాలు సూర్యుడు ప్రయాణం చేస్తాడని చెబుతున్నాడు. నిజానికి ఇక్కడ ఆయన కాంతి వేగం గురించి చెప్పలేదు. సూర్యకాంతి వేగం అనికూడా చెప్పలేదు; సూర్యుని వేగం అని మాత్రమే ప్రస్తావించాడు. కానీ, ఆయన సూర్యుని వేగం అన్నప్పుడు అది సూర్యకాంతి వేగం అయ్యే అవకాశం ఉందని మనం భావించవచ్చు.

అయితే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నిమేషమన్న కాలమానానికి, యోజనమన్న దూరానికి కచ్చితమైన విలువలు లేవు. యోజనం 9.6 కిలోమీటర్ల నుండి 14.4 కిలోమీటర్ల వరకూ ఉండవచ్చు. నిమేషము వివిధ గ్రంథాలను బట్టి 0.213 సెకండ్లు, 0.457 సెకండ్లు, 0.533 సెకండ్లు గానో లెక్క కట్టవచ్చు. ఈ విభిన్నమైన విలువలను బట్టి మనం సూర్యుని వేగం సెకండుకు 118 మిలియన్ల మీటర్లు గానో, 138 మిలియన్లు, 297 మిలియన్ల మీటర్లుగా నిరూపించవచ్చు. ఈ విలువ లెక్కగట్టడానికి సాయణుడు కానీ, అతని పూర్వులు గాని అవలంభించిన విధానమేమిటో బొత్తిగా బోధపడదు. అదీగాక ఒకవేళ సాయణుడు కాంతివేగపు విలువను నేటి ఆధునిక శాస్త్రవేత్తలు లెక్కగట్టిన 299.792 మిలియన్ల వేగానికి దగ్గరిగానే లెక్క కట్టినాడని నమ్మినా అది 600 సంవత్సరాల లెక్కే అవుతుంది గానీ, ఋగ్వేదపు లెక్క కాదు కదా!


అన్నమయ్య “కంటి శుక్రవారము ఘడియలేడింట” అన్న పాటలో ‘ఘడియలేడింట’ అన్నప్పుడు ఏ సమయాన్ని సూచిస్తున్నాడు?

అలాగే,

పాడేము నేము పరమాత్మ నిన్నును
వేడుక ముప్పదిరెండువేళల రాగాలను

అన్నప్పుడు ఆయన చెబుతున్న ‘ముప్పదిరెండు వేళల రాగాలు’ ఏమిటి? ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పకపోయారో …