మా ఊళ్ళో సాయిబులు పెద్దమ్మ, పెద్దనాన్నల సంతానంతో పెళ్ళి సంబంధాలు నెరపడం చూసి మా అమ్మమ్మ బుగ్గలు నొక్కుకొనేది. అయితే, ఉత్తరభారతీయులు మనం మేనమామ, మేనత్త కొడుకు, కూతుళ్ళతో మేనరికపు పెళ్ళిళ్ళు జరపడం చూసి అంతే ఆశ్చర్యపోతారు.
బంధుత్వాన్ని సూచించే పదాల నిర్మాణం ఒక్కో భాషలో ఒక్కో రకంగా ఉండటం గమనించిన మానవశాస్త్రజ్ఞులు ప్రపంచంలోని సామాజిక వ్యవస్థలను స్థూలంగా కొన్ని వర్గాలుగా విభజించవచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, లూయీ మోర్గన్ (Lewis H. Morgan) అనే మానవశాస్త్రవేత్త ప్రపంచంలోని అనేక సమాజాలను, అనేక భాషలలోని బంధుత్వ పదాలను విశ్లేషించి ఈ బంధుత్వ పదాలు ప్రధానంగా వర్ణనాత్మక పదాలుగాను (descriptive), వర్గీకరణాత్మక (classificatory) పదాలుగానూ విభజించవచ్చని సిద్ధాంతీకరించాడు. వర్ణనాత్మక పదం అంటే ఆ పదం ఒకే రకమైన బంధుత్వాన్ని సూచిస్తుంది. వర్గీకరణాత్మక పదం ఎన్నో రకాలైన బంధుత్వాలను సూచించే పదం కావచ్చు. ఉదాహరణకు ఇంగ్లీషులో brother అన్నది వర్ణనాత్మక పదం. ఆ పదం ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు వాడుతారు కాబట్టి అది ఒక స్థిరమైన బంధుత్వాన్ని సూచిస్తుంది. అలా కాక cousin అన్న పదం వర్గీకరణాత్మక పదం. తండ్రి సోదరుని పిల్లలకు, తండ్రి సోదరి పిల్లలకు, తల్లి సోదర సోదరీమణుల పిల్లలకూ వాడుతారు కాబట్టి ఇది వర్గీకరణాత్మక పదం. ఒకే భాషలో కొన్ని బంధుత్వ పదాలు వర్ణనాత్మక పదాలుగాను, కొన్ని వర్గీకరణాత్మక పదాలుగానూ ఉండటం కద్దు. బంధుత్వ పదాలలో ఏవి వర్ణనాత్మక పదాలుగా, ఏవి వర్గీకరణాత్మక పదాలుగా ఉంటాయో వాటిని బట్టి ప్రపంచ బంధుత్వ పదాల నిర్మాణాలను ఈ కింది ఆరు విభాగాలుగా వర్గీకరించవచ్చునని చేసిన సిద్ధాంతం మానవశాస్త్ర పరిశోధనలో ఒక మైలురాయి:
- హవాయియన్ బంధుత్వాలు
- సుడానీస్ బంధుత్వాలు
- ఎస్కిమో బంధుత్వాలు
- ఇరక్వాయి బంధుత్వాలు
- క్రో బంధుత్వాలు
- ఒమహా బంధుత్వాలు
దక్షిణభారతీయ బంధుత్వాలు ఇరక్వాయి బంధుత్వాల వర్గానికి చెందుతుందని చాలా కాలం భావించారు. అయితే, ఒక ముఖ్యమైన తేడా వల్ల ద్రావిడ బంధుత్వాలను ఇరక్వాయి బంధుత్వాల వర్గానికి చెందింది కాకుండా ఏడవ ప్రత్యేక వర్గంగా ఈ మధ్యనే గుర్తించారు. ఈ బంధుత్వ వర్గాల గురించి క్లుప్తంగా చర్చించి, ఆపై ద్రావిడ బంధుత్వ పదాలను విశ్లేషిద్దాం.
హవాయియన్ బంధుత్వాలు
ఈ రకమైన బంధుత్వాలలో అన్ని పదాలూ వర్గీకరణాత్మకమే. అంటే ఏ ఒక్క పదం ఒక ప్రత్యేకమైన బంధుత్వాన్ని గురించి చెప్పదు. తండ్రి సోదరుడిని తండ్రి లాగా, తండ్రి సోదరిని తల్లితో సమానంగా భావించి అవే పేర్లతో పిలుచుకుంటారు. అలాగే, తల్లి సోదర సోదరీమణులను కూడా తండ్రికి, తల్లికి సమానార్థకమైన పదాలతో పిలుస్తారు. వారి పిల్లలను కూడా సోదరులుగానే భావించి అలాగే పిలుస్తారు.
సుడానీస్ బంధుత్వాలు
సుడానీస్ బంధుత్వాలు హవాయియన్ బంధుత్వ నిర్మాణానికి పూర్తిగా వ్యతిరేకం. ఈ బంధుత్వ పద వర్గంలో ప్రతి బంధుత్వ పదం వర్ణనాత్మకమే. అంటే ప్రతి ప్రత్యేకమైన బంధుత్వ సంబంధాన్ని సూచించడానికి ఒక ప్రత్యేకమైన పదం ఉంది. తండ్రి సోదరుని సూచించడానికి వేరే పదం, తల్లి సోదరుని సూచించడానికి ఒక ప్రత్యేక పదం. మన ఉత్తరభారతంలో సంబంధాలు కూడా వర్ణనాత్మకమే. ఒక మనిషి తన సన్నిహిత బంధువర్గాన్ని సంబోధించడానికి హిందిలో 45 పదాలు దాకా ఉన్నాయి. హిందిలో తండ్రి-తండ్రిని దాదా అని, తల్లి-తండ్రిని నానా అని, తండ్రి-తల్లిని దాది అని, తల్లి-తల్లిని నానీ అని, కొడుగు కొడుకును పోత అని, కూతురు కొడుకును దోతా అని పిలుస్తారు; తల్లి సోదరి మాసి అయితే, తండ్రి సోదరుని భార్యను తాయి అనిగానీ చాచీ అని గాని పిలుస్తారు; అలాగే మేనత్తను భూఅ అని పిలిస్తే, మేనమామ భార్యను మామి అని ఇలా ప్రతి బంధుత్వానికి ఒక్కో ప్రత్యేక పదం వాడడం గమనించదగ్గ విషయం.
ఎస్కిమో బంధుత్వాలు
ఎస్కిమో బంధుత్వాలు హవాయియన్ బంధుత్వాల వలె వర్గీకరణాత్మకమే గానీ, సొంత తల్లి, తండ్రి, సోదర సోదరీమణులకు మాత్రం ప్రత్యేకమైన వర్ణనాత్మకమైన పదాలు ఉంటాయి. మనకు బాగా పరిచయమున్న ఇంగ్లీషు భాషలోని సంబంధాల పదాలు ఎస్కిమో బంధుత్వపు వర్గీకరణ కిందికే వస్తాయి.
ఇరక్వాయి బంధుత్వాలు
ఈ మూడు రకాలు కాక, వీటికి మధ్యస్థంగా ఉండే బంధుత్వ పదాల వర్గాలలో అతి ముఖ్యమైనది ఇరక్వాయి బంధుత్వాలు. ఇది మన ద్రావిడ భాషలలోని బంధుత్వ పదాలకు దాదాపు సరిగ్గా సరిపోతుంది. ఇందులో, తండ్రి సోదరుడు తండ్రికి సమానం. తల్లి సోదరి తల్లితో సమానం. అయితే, తండ్రి సోదరి మాత్రం అత్త అవుతుంది. అలాగే తల్లి సోదరుడు మామ అవుతాడు. వారి సంతానంతో వివాహం ఆమోదమే కాక శ్రేయస్కరమన్న భావన ఈ సమాజాల్లో ఉంది. అనాదిగా వస్తున్న ఈ మేనరిక వివాహాల ఆచారాన్ని ఇప్పటికీ ఈ సమాజాల్లో పాటిస్తారు.
క్రో బంధుత్వాలు
క్రో బంధుత్వాలు ఇరక్వాయి బంధుత్వాలు వంటివే కానీ, వారికి తల్లి వైపు మాత్రమే మేనరిక సంబంధాలు ఆమోదయోగ్యం. తండ్రి వైపు సంబంధాలను తండ్రితో సమానంగా భావిస్తారు.
ఒమహా బంధుత్వాలు
ఒమహా బంధుత్వాలు ఇరక్వాయి బంధుత్వాలు వంటివే కానీ, వారికి తండ్రి వైపు మాత్రమే మేనరిక సంబంధాలు ఆమోదయోగ్యం. తల్లి వైపు సంబంధాలను తల్లితో సమానంగా భావిస్తారు.
ద్రావిడ బంధుత్వాలు
ఇరక్వాయి బంధుత్వాల వ్యవస్థ, ద్రావిడ బంధుత్వాల వ్యవస్థ స్థూలంగా ఒకే లాగా కనిపించినా, ఒక తరం దాటిన బంధుత్వాల విషయంలో ఈ రెండు వ్యవస్థల మధ్య తేడా ఉంది. ఇరక్వాయి బంధుత్వాలలో తల్లి జ్ఞాతులలో (cousins) ఆడవారు అందరూ తల్లితో సమానం. తండ్రి జ్ఞాతులలో మొగవారందరూ తండ్రితో సమానం. ద్రావిడ బంధుత్వాలలో అమ్మమ్మ సోదరుని కూతురు, తాతయ్య (తండ్రి-తండ్రి) సోదరుని కూతురు మేనత్త వరస, తాతయ్య (తండ్రి-తండ్రి) సోదరి కొడుకు, అమ్మమ్మ సోదరి కొడుకు మేనమామ వరస అవుతారు. అంటే, అమ్మమ్మ సోదరి కొడుకు సంతానం, అమ్మమ్మ సోదరుని కూతురు సంతానం, తాతయ్య (తండ్రి-తండ్రి) సోదరి కొడుకు సంతానం, తాతయ్య (తండ్రి-తండ్రి) సోదరుని కూతురు సంతానం మేనరికానికి వరుస కుదురుతారు. పెళ్ళి ద్వారా బంధుత్వం కలుపుకున్న వారిని కూడా రక్తసంబంధీకులకు ఉపయోగించే అత్త, మామ, అన్నయ్య వంటి పదాలు వాడడం ద్రావిడ బంధుత్వపు ప్రత్యేక లక్షణమే. అంతేకాక, సోదరి తనకంటే వయస్సులో పెద్ద అయితే అక్క అని, చిన్న అయితే చెల్లి/తంగై అని, సోదరుడు వయస్సులో పెద్ద అయితే అణ్ణ/అన్న అని, చిన్న అయితే తమ్మి/తంబి అని వయో భేదాలను బట్టి వేర్వేరు పదాలు వాడడం భారతీయ బంధుత్వాలలో కనిపించే ప్రత్యేక లక్షణమే.
ఇక ద్రావిడ భాషలలో కొన్ని ముఖ్యమైన బంధుత్వ పదాల వ్యుత్పత్తిని పరిశీలిద్దాం.
తండ్రి
అన్ఱు/-అద్ఱు/-అన్డు అన్న పదం ద్రావిడ భాషలలో మగవాడు అన్న అర్థం వచ్చే పదాలకు మూల ధాతువు. అవ+అన్ఱు > అవన్ఱు > వాన్ఱు > వాండు > వాఁడు అంటే ఆ మగవాడు అని, ఇవ+అన్ఱు > ఇవన్ఱు > వీన్ఱు > వీండు > వీడు అంటే ఈ మగవాడు వంటి ఎన్నో పదాలలో మగవాడు అని అర్థం రావడానికి -అన్ఱు అన్న ధాతుప్రత్యయం వాడడం మనకు తెలుసు. తన్- + -అన్ఱు అంటే తన(తమ) మగవాడు, అంటే నాన్న. ప్రాచీన తమిళంలో ఎన్-(=నా) + తై అంటే నా నాన్న, నన్- (=మా) + తై అంటే మా నాన్న, ఉన్ (=నీ/మీ) + తై అంటే మీ నాన్న, తన్- + తై అంటే తన నాన్న అన్న అర్థాల్లో వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. అయితే, మిగిలిన పదాలన్నీ లుప్తమైపోయి ఇప్పుడు తన్- తో జత చేసిన తన్ఱు > తండ్రి, తంతై వంటి పదాలే నాన్న అన్న పదానికి సాధారణార్థంలో వాడే పదాలుగా మిగిలిపోయాయి.
ఇదే విధంగా తమ్ముడు అన్న అర్థంలో ఇప్పుడు తమిళంలో వాడే తంబి- (తన్- + -పి) అన్న పదమే కాకుండా ఎంబి-, నుంబి-, ఉంబి-, తంబి- అన్న నాలుగు పదాలు ప్రాచీన తమిళంలో వాడుకలో ఉండేవి. ఇప్పుడు తన్- తో జతచేసిన తంబి అన్న పదం తప్ప మిగిలిన పదాలు లుప్తమైపోయాయి. చెల్లెలు అన్న అర్థంలో తంగై (తన్ + కై) అన్న పదమే కాక ఎంగై, నుంగై, ఉంగై అన్న పదాలు వాడుకలో ఉండేవి.
ఈ రకంగా ద్రావిడ భాషలలో బంధుత్వ పదాలకు నాలుగు పూర్వ రూపాలు ఉండేవని ఎమెనో (Murray B. Emeneau) Dravidian Kinship Terms అన్న పరిశోధన పత్రంలో ప్రతిపాదించి సోదాహరణంగా వివరించారు.
తల్లి
ద్రావిడ భాషలలో అన్ఱు అన్న ధాతువు పురుష సంబంధమైన పదాలలో కనిపిస్తే, -అళు అన్న ప్రత్యయం స్త్రీ సంబంధమైన పదాలలో కనిపిస్తుంది. తళ్ళి అన్న పదానికి తన్ + అళ్ అన్న వివరణ సబబు గానే అనిపించినా, తన్- లో ఉండే అనునాసికం ఏ రూపాలలో కనిపించదు. కాబట్టి దీన్ని త- + అళ్ అనే వివరించడం కుదురుతుంది. అదీ కాక, మిగిలిన పదాలలాగా నాలుగు రూపాలు ఈ పదానికి కనిపించవు. –అళు అన్న స్త్రీ సంబంధమైన పదాలన్నింటిలో ళ- కారం, తెలుగులో ల- కారంగా మారిపోయింది.
చెల్లెలు: మిగిలిన ద్రావిడ భాషలలో చెల్లెలు అన్న అర్థంలో కనిపించే తంగ/తంగి/తంగై అన్న పదాలకు సంబంధించిన పదం తెలుగులో, ఇతర దక్షిణమధ్య భాషలలో కనిపించదు. దానికి బదులుగా చిల్- (చిన్న) + అళు (స్త్రీ) అన్న అర్థంలో చిల్లళు > చెల్లళు > చెల్లలు అన్న పదాలు కనిపిస్తాయి.
కొడుకు కోడలు
కొడుకు: కొఴు-/కోఴు- అన్న మూల ధాతువుకు కొత్త, లేత, పసివాడు, కొడుకు అన్న అర్థాలు ఉన్నాయి. ఴ- కారం తెలుగులో అచ్చుల మధ్య డ- కారంగా మారిందని “ఏడు” సంఖ్యాపదం గురించి చర్చించినప్పుడు అనుకున్నాం కదా. ఆ రకంగా కొఴు- > కొడు- అవుతుంది, అయితే, కొడుకు లో చివరి –కు కారాన్ని ఎలా వివరించాలో నాకు తెలియదు.
కోడలు: కోఴు- + అళ్ = కోడళు > కోడలు అని ఈ పదాన్ని సూటిగానే వివరింపవచ్చును.
అమ్మ, అయ్య తదితరాలు
అమ్మ: ప్రపంచంలోని చాలా భాషలలో తల్లికి సంబంధించిన పదాలు మ- కారంతోనే ఉండటం భాషావేత్తలను ఆశ్చర్యపరచింది. ఈ రకమైన పదాలద్వారా అన్ని ప్రపంచ భాషలు ఒకే ఒక మూల భాషనుండి ఉత్పన్నమయ్యాయని నిరూపించడంలో ఉపయోగపడుతుందని భావించిన భాషావేత్తలు కూడా ఉండేవారు. అయితే, ఈ రకమైన పదాలలోని సారూప్యతను చాలా సులభంగా వివరించిన భాషావేత్త యాకుబ్సన్ (Roman Jakobson). చిన్నప్పుడు శిశువులు ముందుగా నేర్చుకొనే ధ్వనులు ప, ఫ, బ, భ, మ అనే ఓష్ఠ్యాలు. ముఖ్యంగా మ- అన్న శబ్దం చాలా సులభంగా ఉచ్చరించ గలిగే ధ్వని. అందుకని, శిశువు మ, మ్మ- అని చప్పరిస్తూ ఉంటే ఆ ధ్వనిని మాతృ సంబంధిత శబ్దంగా ఆపాదించడంతో అన్ని భాషలలో అమ్మ-, మామా-, మమ్మీ అన్న శబ్దాలే తల్లిని సంబోధించడానికి ముఖ్య పదాలుగా నిలిచిపోయాయి.
అప్ప, అయ్య: మ- కారం తరువాత శిశువులు సులభంగా ఉచ్చరించగలిగే ధ్వని ప-/బ-. అందుకే చాలా భాషలలో అప్పా/అబ్బా-, పాపా-, బాబా- అన్న పదాలు పితృసంబంధిత పదాలుగా నిలిచిపోయాయి. అయ్య అన్న పదం ద్రావిడ పదమా? ఆర్య- అన్న సంస్కృత శబ్దం నుండి నిష్పన్నమైన పదమా? అన్నవిషయాన్ని సులభంగా వివరించలేం.
అన్న,అక్క: -అన్ఱు/-అద్ఱు/-అన్డు అన్న ధాతువుకు పురుష సంబంధమైన అర్థం ఉంది. అలాగే –క అన్న ప్రత్యయానికి స్త్రీ సంబంధమైన అర్థం ఉంది (తంకి, తంక). అయితే, అణ్ణ > అన్న, అక్క అన్న వంటి మూల పదాల వ్యుత్పత్తిని అంత సులభంగా వివరించలేం.
అత్త: ద్రావిడ భాషలలో స్త్రీ ప్రత్యయంగా –త కారం చాలా చోట్ల కనిపిస్తుంది. నెలత, గొల్లెత, గుబ్బెత, ముట్టుత అన్నపదాలలో చివరి త- ప్రత్యయం స్త్రీలింగ సూచకం. అత్త అన్న శబ్దం కూడా ఆ స్త్రీ లింగ ప్రత్యయాన్ని ఉపయోగించే సంబంధ విశేషం. ఆర్య భాష అయిన మరాఠీ భాషలోనూ మేనత్తను ద్రావిడ పదమైన అత్త అన్న శబ్దంతోనే సంబోధిస్తారు.
నాన్న: ద్రావిడ భాషలో మనుష్య సంబంధాలు కొన్నిస్వామిత్వ (possessive) రూపంలో ఉంటాయని ముందుగా అనుకున్నాం కదా. నాన్న అన్న పదానికి పూర్వ రూపం నాయినా < నాయన్న < నా + అన్న. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో తండ్రి యొక్క తల్లిని సంబోధించడానికి నాయినమ్మ (నాయిన + అమ్మ) అన్న పదమే వాడుతారు. మఱఁది/మఱఁదలు: *మఱు- అన్న ధాతువుకు ఇతర, ప్రత్యామ్నాయమైన అన్న అర్థాలు ఉన్నాయి. మఱు + అన్ఱు > మఱందు > మరఁది అని, మఱ + అందు + అళ్ > మఱందళు > మఱఁదలు గా మారిపోయాయి.
వదిన: వధూనీ అన్న సంస్కృత పదం వదుని అన్న ప్రాకృత రూపం ద్వారా తెలుగులోకి వదిని, వదినె, వదినగా ప్రవేశించాయి.
బావ: భావక- అన్న సంస్కృత పదానికి రూపమైన ఈ పదం కూడా ఆర్వాచీనమే.
తాత: తాత శబ్దంలో మొదటి త- కారం ముందుగా చెప్పుకున్నట్లు తన- శబ్ద సంబంధమైనది కావచ్చు. తమిళంలో తంతయ్, కన్నడలో తందె శబ్దాలు నాన్నకు పర్యాయరూపాలు అయితే, తెలుగులోను, ఇతర భాషలలో ఈ పదాన్ని ఇంకో పై తరానికి ఆపాదించి పితామహులకు, మాతామహులకు ఉపయోగిస్తారు.
భాష మారినా, వ్యాకరణం, పదజాలం మారినా బంధుత్వ వ్యవస్థ ఒక సమాజంలో అంత తొందరగా మారదు. దీని గురించి మాట్లాడుతూ లూయి మోర్గన్ ఇలా అన్నారు:
“Language changes its vocabulary, not only, but also modifies its grammatical structure in the progress of ages; thus eluding the inquiries which philologists have pressed it to answer; but a system of relationships once matured, and brought into operation, is, in the nature of things, more unchangeable than language – not in the names employed as a vocabulary of relationships, for these are mutable, but in the ideas which underlie the system itself.”
అందుకే మహారాష్ట్రలోనూ, గుజరాత్ లోనూ ఇప్పటికీ కనిపించే మేనరిక వివాహాలు, మరాఠీ, గుజరాత్, మేర్ వంటి భాషలల్లో కనిపించే బంధుత్వ పదాలు ఆ ప్రాంతాలలో ప్రజలు ఒకప్పుడు ద్రావిడ భాషలు మాట్లాడుతూ ఉండేవారని, అక్కడ ద్రావిడ సంబంధమైన సామాజిక సంస్కృతే పరిఢవిల్లేదని మనం చెప్పుకోవచ్చు. అలాగే, మన ప్రాంతాలలో కనిపించే మేనమామ అక్క కూతురును పెళ్ళి చేసుకునే పద్ధతి ద్రావిడ సంస్కృతికి పూర్వం ఉన్న సమాజపు అవశేషం కావచ్చని నా ఊహాగానం. ఈ ఊహను ఇంకా విశ్లేషించి బలమైన ఆధారాలతో నిరూపిస్తే మన పూర్వ చరిత్ర గురించి ఇంకా తెలుసుకున్నవారమౌతాం.