రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

తెలుగు భాష వయస్సెంత?

రచన: సురేశ్ కొలిచాల
నవంబర్ 2005

భాషను స్త్రీతో పోలుస్తారు. కానీ ఆడవాళ్ళ వయస్సు మొగవాడి జీతం అడగకూడదంటారు. ఆ రకంగా ఇది అడగకూడని ప్రశ్నే. అంతేకాక ఒక భాష ఎప్పుడు పుట్టింది అన్నది చాలా అసంబద్ధమైన (absurd) ప్రశ్న అని కొంతమంది భాషావేత్తలు అంటారు. “ప్రవాహినీ భాషా” అన్నట్లు భాష చరిత్రగతిలో మార్పులు చెందుతూ కొత్త కొత్త రూపాలు సంతరించుకొంటుందనీ, ఏ మార్పు ఎప్పుడు వచ్చింది అని అడగటం మాత్రమే సబబైన ప్రశ్న అని వారి వాదన. ఇటువంటి పరిశుద్ధ(Purist) వాదాన్ని పక్కనబెడితే, తెలుగు ఒక ప్రత్యేక భాషగా ఒక నియతస్థితిని, స్వయంప్రతిపత్తిని ఎప్పుడు ఏర్పరుచుకుందో ఆ కాలనిర్ణయం గురించి ప్రస్తుత భాషా పరిశోధకుల ఊహాగానాలను చర్చించడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

భారతదేశంలోని భాషల చరిత్ర, భారతదేశపు పూర్వ చరిత్ర చాలా కాలంగా వివాదస్పదమైన అంశంగా మారింది. ఈ అంశంపై వచ్చిన వాదప్రతివాదాలు రాజకీయ, సాంఘిక ఉద్యమాలకు, భాషోన్మాదాలకు దారి తీసాయి. తమిళనాడులో ప్రారంభమైన ద్రావిడ ఉద్యమం ఇందుకు ఒక ఉదాహరణ. కాని ఆర్య, ద్రావిడ పదాలు భాషా కుటుంబాలని సూచించే పదాలే గాని, రెండు వేర్వేరు జాతులని సూచించే పదాలు కావని శాస్త్రవేత్తల నమ్మకం. జన్యుశాస్త్రంలో సాధించిన అభివృద్ధి ఆధారంగా ఈ దశాబ్దంలో జరుపుతున్న పరిశోధనలు భారతదేశంలో ఆర్య, ద్రావిడ అని రెండు విభిన్నమైన జాతులు లేవన్న శాస్త్రజ్ఞుల అభిప్రాయాలని ధ్రువపరుస్తున్నవి [4, 6].

ఇంతటి వివాదస్పదమైన అంశం గురించి రాయటానికి నాకే భాషాశాస్త్రంలో గానీ జన్యుశాస్త్రంలో గానీ పట్టభద్రత లేదు. నేను చదువుకున్న చదువుకు చేసే ప్రోగ్రామింగ్‌ పనికి, భాషా చరిత్రతో ఎటువంటి సంబంధం లేదు. నాకున్న అర్హతల్లా ప్రఖ్యాతి గాంచిన భాషావేత్తలైన భద్రిరాజు, ఎమెనో, స్జోబెర్గ్‌ తదితరులు రాసిన కొన్ని పుస్తకాలు, పేపర్లు గత పదేండ్లుగా చదవటం మాత్రమే.

కానీ తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాల గురించిన కనీస వివరాలు చాలామంది తెలుగువాళ్ళకే తెలిసినట్టులేదు. ఈ మధ్య ఇండియాలో ఒక టీవీ ప్రోగ్రాంలో ఎక్కువమంది మాట్లాడే ద్రావిడ భాష ఏది అన్న ప్రశ్నకు సమాధానం “తెలుగు” అంటే మా అన్నయ్య ఆఫీసులో చాలా మంది ఒప్పుకోలేదట. తెలుగు ద్రావిడ భాషే కాదని వారి వాదన. ఇంతే కాక ఈ మధ్య భారతదేశ చరిత్ర గురించి, భారతీయ భాషల గురించి వింత వాదనలు, శాస్త్రవిమర్శకు నిలువలేని సిద్ధాంతాల ప్రచారాలు ఇంటెర్నెట్‌లోనూ బయటా జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రచారాల నేపథ్యంలో తెలుగుభాష గురించి చాలామంది భాషావేత్తలు ఒప్పుకునే వివరాలను నాకు తెలియవచ్చినంత తేటపరచాలని ఈ వ్యాసరచనా సాహసానికి పూనుకున్నాను.

తెలుగు సంస్కృత భవం కాదు

పూర్వకాలం నుండి తెలుగు సంస్కృత జన్యం అన్న అభిప్రాయం ఉందని చాలామంది నమ్మకం. ఇందుకు ఉదాహరణగా “తల్లి సంస్కృతంబు యెల్ల భాషలకు” అన్న కేతన పద్యాన్ని, “జనని సంస్కృతంబు సర్వభాషలకు” అన్న క్రీడాభిరామ పద్యాన్ని చూపిస్తారు. కానీ నిశితంగా చూస్తే నన్నయ్య కాలం నుండి కూడా తెలుగు సంస్కృత భాషల మధ్య అంతరం కవులకు స్పష్టంగా తెలుసునని మనకు తెలుస్తుంది. సంస్కృత ఛందస్సు వేరు, దేశి ఛందస్సు వేరు. సంస్కృత పదాలు వేరు (తత్సమాలు, తద్భవాలు), అచ్చతెలుగు పదాలు వేరు (దేశ్యాలు, గ్రామ్యాలు). తెలుగు సంధులు వేరు, సంస్కృత సంధులు వేరు. తెలుగు పదాన్ని, సంస్కృత పదాన్ని కలిపి రాయకూడదు. రాస్తే దుష్టసమాసం అవుతుంది. దేశి కవిత, మార్గ కవిత అని కవిత్వంలో రెండు భిన్న ధోరణులు ఉండేవని కూడా మనకు తెలుసు. చాలామంది కవులు ఈ రెండు ధోరణులకు మధ్యస్థంగా ఇరు పక్షాలు మెచ్చే రీతిలో కవిత్వం రాస్తున్నామని కూడా చెప్పుకున్నారు (ఉదా: శ్రీనాథుడు, పోతన, కొరవి గోపరాజు, మొల్ల).

పూర్వ కవుల అభిప్రాయం ఏమైనప్పటికీ 19వ శతాబ్దం వచ్చేసరికి తెలుగు సంస్కృత భవమే అన్న నమ్మకం చాలా బలంగా ఉండేది. ఈ నమ్మకాలకు ప్రతికూలంగా తెలుగుకు సంస్కృత ప్రాకృతాలతో జన్య జనక సంబంధం లేదని మొదటిసారి చెప్పిన ఘనత Francis White Ellis (1816) కు దక్కుతుంది. తరువాత ఎల్లిస్‌ పరిశోధనను కొనసాగించిన అలగ్జాండర్‌ క్యాంప్‌బెల్‌ ఇలా అన్నారు:

“It has been generally asserted, and indeed believed, that the Teloogoo has its origin in the language of the vedams … My inquiries have led to opposite conclusion … Teloogoo abounds with Sanskrit words … nevertheless, there is reason to believe that the origin of the two languages is altogether different”

ఎలిస్‌, క్యాంప్‌బెల్ సంగ్రహంగా ప్రతిపాదించిన ఈ సిద్ధాంతానికి సమగ్రాధారాలతో కూలంకష చర్చతో స్థిరత్వాన్ని కల్పించింది బిషప్‌ రాబర్ట్‌ కాల్డ్‌వెల్‌. ఈయన తమిళ, కన్నడ, తెలుగు భాషలతో సహా 12 భాషలు ఒకే భాషా కుటుంబానికి చెందినవని, వాటికి సంస్కృతంతో జన్మ సంబంధం లేదని సశాస్త్రీయంగా నిరూపించాడు. ద్రావిడ భాషా పరిశోధనా పితామహుడిగా ప్రసిద్ధి కెక్కిన కాల్డ్‌వెల్‌ 1856లో రాసిన గ్రంథం “A Comparative grammar of Dravidian Languages” తొలి ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథం. తరువాత గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి దానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు: ఎం. బి. ఎమెనో, టి. బరో, భద్రిరాజు కృష్ణమూర్తి గార్లు. 2003లో భద్రిరాజు కృష్ణమూర్తి గారు రాసిన “Dravidian Languages” పుస్తకం, గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యయనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు.

తెలుగు తమిళం నుండి పుట్టలేదు

తెలుగు సంస్కృతం నుండి పుట్టలేదు అంటే ఇది తమిళం నుండో కన్నడ నుండో పుట్టి ఉండాలి అన్న వాదం విన్నాను. తమిళం లో క్రీస్తు పూర్వము 3వ శతాబ్ది నుండి ప్రాచీన సాహిత్యం దొరుకుతుంది. కన్నడం లో ప్రాచీన గ్రంథం “కవిరాజ మార్గ” క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రాయబడ్డది. కాబట్టి తెలుగు కన్నడ నుండో తమిళం నుండో పుట్టివుండాలని వీరి తర్కం. తమిళం ప్రాచీన భాషే ఐనా తమిళమే ప్రాచీన లక్షణాలను నిలుపుకొంది అనటం సరి కాదని, కొన్ని విషయాలలో తెలుగు మొదలైన ఇతర భాషలలోనే తమిళంలో లేని ప్రాచీన లక్షణాలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. 1906 లో Linguistic Survey of India లో ద్రావిడ భాషల పరస్పర సాన్నిహిత్యాన్ని గురించి రాస్తూ స్టెన్‌కొనో ఇలా అన్నారు

“Tamil has usually been considered to be the Dravidian language which has preserved most traces of the original form of speech from which all other Dravidian dialects are derived. Some points will be drawn attention to in the ensuing pages where this does not appear to be the case, and in many peculiarities other Dravidian languages such as Telugu have preserved older forms and represent a more ancient state of development. It would therefore be more correct to describe Tamil as a dialect like the other ones, without any special claim to antiquity.”

ఆ రకంగా తమిళ కన్నడ భాషలు తెలుగుకు సోదర భాషలే కాని మాతృకలు కావు. క్రీస్తు పూర్వం నాలుగు, ఐదువేల యేండ్లకు పూర్వం మూల ద్రావిడ భాష ఒకే భాషగా ఉండేదని, అది కాలక్రమాన ఇప్పటి ద్రావిడ భాషలుగా విడిపోయిందని భాషా శాస్త్రజ్ఞులు తులనాత్మక పద్ధతి ద్వారా నిర్ణయించారు.

ద్రావిడ భాషగా పుట్టి సంస్కృత పోషణలో పెరిగిన తెలుగు

తెలుగు ద్రావిడ భాష కాబట్టి సంస్కృత భాషా పదాలు వాడటం మానేసి అచ్చ తెలుగు పదాలే వాడాలని “వార్త” పత్రికలో ఒక వ్యాసం చదివాను. ఈ రకమైన వాదం తెలుగును రెండు మూడు వేల యేండ్లు వెనక్కి తీసుకువెళ్ళాలన్న ప్రయత్నమే. తెలుగు పుట్టినప్పటి నుండి వేలకొద్దీ సంస్కృత, ప్రాకృత పదాలు తెలుగులో వచ్చి చేరాయి. పద నిర్మాణంలోను, వాక్య నిర్మాణం లోనూ తెలుగు ఎన్నో సంస్కృత లక్షణాలను తనలో కలుపుకొంది. తెలుగు కవులందరూ సంస్కృత భాషను క్షుణ్ణంగా అభ్యసించిన వారే కాబట్టి ఆ భాషా ప్రభావం తెలుగు సాహిత్యం పై స్పష్టంగా కనిపిస్తుంది. ద్రావిడ భాషలో లేని Passive Voice (బడు ప్రయోగం), Relative Pronouns తెలుగులో వచ్చి చేరటం సంస్కృత ప్రభావాన్నే చూపిస్తుంది. పోతన రాసిన “ఎవ్వనిచే జనించు జగము … వానిన్‌ … శరణంబు వేడెదన్‌” అన్న పద్యము సంస్కృతంలో ఆలోచించి తెలుగులో రాసిన పద్యమని కూడా చెప్పవచ్చు.

ద్రావిడ భాషల వర్గీకరణ

రాబర్ట్‌ కాల్డ్‌వెల్‌ రాసిన Comparative Dravidian Grammar గ్రంథంలోనే తమిళ, మలయాళ, కన్నడ భాషలకు దగ్గరి సంబంధం ఉందని, తెలుగు తమిళ భాషలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందనీ సూచించారు. 1906లో స్టెన్‌కొనో ద్రావిడ భాషలని తమిళ సముదాయం, తెలుగు సముదాయం అని రెండుగా విభజించారు. మూల ద్రావిడ భాష మొదట మూడు ఉపకుటుంబాలు గా చీలిందని ఇప్పుడు పండితులంతా అంగీకరిస్తున్నారు. 1975లో భద్రిరాజు కృష్ణమూర్తి గారు, తెలుగు-కువి-గోండీ భాషలను దక్షిణ-మధ్య ద్రావిడ భాషలుగా మూల దక్షిణ ద్రావిడం నుండి విడివడిన మరో ఉపశాఖకు చెందిందన్న కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ మధ్య ఆయన ద్రావిడ భాషలపై ప్రచురించిన గ్రంథరాజంలో తెలుగు దక్షిణ మధ్య ద్రావిడ ఉప కుటుంబానికి చెందిందని సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఈ పుస్తకంలో 26 ద్రావిడ భాషలను ఇలా విభజించారు: Classification of Dravidian Languages

తెలుగు భాష ఎప్పుడు పుట్టింది?

మొట్టమొదటి తెలుగు శాసనాలు

తెలుగు మాట కనిపించే మొట్ట మొదటి శాసనం క్రీస్తు శకం 200కి చెందినది. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం గుంటూరు‌ జిల్లా అమరావతిలో దొరికింది. అంతకు పూర్వం అశోకుడు, బౌద్ధ మత ప్రచారానికి తన దూతలను ఆంధ్రదేశానికి పంపినట్లు అశోకుడి కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్తిగా తెలుగు భాషలో రాసిన శాసనాలు మనకు క్రీస్తు శకం ఆరవ శతాబ్దినుండి దొరుకుతున్నాయి. వీటిలో కడప జిల్లా ఎర్రగుడిపాడు (క్రీశ 575-600), కలమళ్ళ (క్రీశ 576-600) లో దొరికిన శాసనాలు మొట్ట మొదటివి. ఆరో శతాబ్దికి ముందు ఆంధ్ర ప్రాంతంలో శాసనాలు సంస్కృత ప్రాకృత భాషలలో వేసేవారు కానీ వాటిలో ఉన్న ఊళ్ళ పేర్లు, మనుష్యుల పేర్లు తెలుగువే. ఈ శాసనాలలో ఉన్న ఏళూరు, తాన్ఱికొన్ఱ (తాటికొండ) మొదలైన ఊళ్ళ పేర్లు ఆ రోజులలో సామాన్య ప్రజలు తెలుగే మాట్లాడే వారని నిరూపిస్తుంది.

ప్రాచీన కావ్యాలలో ఆంధ్ర/తెలుగు ప్రస్తావన

రామాయణంలో సుగ్రీవుడు సీతాదేవి ఉనికిని గూర్చి వెతుకవలసిన స్థలాలను పేర్కొనే సందర్భంలో వరుసగా దండకారణ్యం, గోదావరీ నది, తరువాత, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య దేశాలున్నట్టు చెప్పాడు. ధర్మరాజు రాజసూయం చేసే ముందు దక్షిణ దిగ్విజయ యాత్రకు సహదేవుని పంపినట్లు అతడు పాండ్యులు, ద్రవిడులతో పాటు ఆంధ్రులను, కళింగులను, ఓఢ్రులను జయించినట్లు భారతంలో ఉంది. బౌద్ధ సారస్వతంలో చోళరఠ్ఠం, కళింగరఠ్ఠం, ద్రమిళరఠ్ఠం తో పాటు గోదావరినదికి ఇరు వైపుల అళక, ముళక దేశాలున్నట్లు, ఇవి రెండు అంధక రాష్ట్రాలని “సుత్తనిపాత” గ్రంథంలో ఉంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన గ్రీక్‌ రాయబారి మెగస్తనీస్‌ మౌర్యుల తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతియని, వారి రాజు మిక్కిలి బలవంతుడని అతనికి 32కోటలున్నాయని పేర్కొన్నాడు.

ఆంధ్ర జాతి ప్రస్తావన మొట్టమొదటి సారి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి చెందిన భరతుని నాట్యశాస్త్రంలో కూడా ఆంధ్ర భాషా ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నాటకాలలో సంస్కృత ప్రాకృతాలే కాక సామాన్య ప్రజలు మాట్లాడే భాషలను వాడవచ్చని చెబుతూ, శకార, ఆభీర, చండాల, శబర, ద్రమిళ, ఆంధ్ర జాతుల భాషలను కూడా వాడవచ్చని ఇందులో ఉంది. ఐతే ఆంధ్ర రాజులు, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర జాతి అన్న పదాలలో ఆంధ్ర శబ్దం తెలుగుకు పర్యాయపదంగా తీసుకుంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దికి ముందుగానే ఆంధ్ర/తెలుగు ప్రత్యేక జాతిగా గుర్తింపబడిందని చెప్పవచ్చు.

భాషా శాస్త్ర పరంగా తెలుగు కాలనిర్ణయం

తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. తమిళం లోనూ కన్నడలోనూ తాలవ్యీకరణ (palatalization) లో వ్యత్యాసం కనబడుతోంది కాబట్టి, అవి రెండు కనీసం మూడు నాలుగు వందల యేండ్ల ముందుగా విడివడి ఉండాలి. ఆ రకంగా పూర్వ-తమిళం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు. కానీ దక్షిణ ద్రావిడ భాషలకూ, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలకూ శబ్ద నిర్మాణంలోనూ, వాక్య నిర్మాణంలోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ‌-కన్నడ లతో పోలిస్తే తెలుగు-కువి-గోండీ లలో కనిపించే వ్యత్యాసాలో కొన్ని[1,3,5]:

  1. వర్ణవ్యత్యయం (metathesis): తెలుగు-కువి-గోండి భాషలలో మూల ద్రావిడ ధాతువులోని అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకుంటాయి. (ఉదా: వాడు < *అవన్ఱు, వీడు <*ఇవన్ఱు, రోలు < ఒరళ్ <*ఉరళ్)
  2. తెలుగులో బహువచన ప్రత్యయం- లు. తమిళాది దక్షిణ భాషల్లో ఇది -కళ్‌, -గళు.
  3. క్త్వార్థక క్రియలు తమిళాదుల్లో -తు -ఇ చేరటం వల్ల ఏర్పడుతాయి. తెలుగు-కువి-గోండి భాషలలో -చి, -సి చేరటం వల్ల ఏర్పడుతాయి. ఉదా: వచ్చి, చేసి, తెచ్చి, నిలిచి వరుసగా తమిళంలో వన్దు , కెయ్దు, తన్దు, నిన్ఱు.

పైన పేర్కొన్న లక్షణాలన్నీ దక్షిణ మధ్య ద్రావిడ భాషలన్నిటిలో ఉండి దక్షిణ ద్రావిడ భాషలో లేనివి. అంటే ఈ మార్పులన్నీ తెలుగు-కువి-గోండి ఒకే భాషగా కలిసి ఉన్న రోజులలో మూల దక్షిణ ద్రావిడ భాషనుండి విడిపోయిన తరువాత వచ్చిన మార్పులన్న మాట. అన్ని ముఖ్యమైన మార్పులు రావటానికి కనీసం 400-500 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలుగు-కువి-గోండి భాషలు దక్షిణ మధ్య ద్రావిడ ఉప శాఖగా క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో మూల దక్షిణ ద్రావిడం నుండి విడిపోవచ్చు. ఇదే నిజమైతే క్రీస్తు పూర్వం 700-600 వరకే తెలుగు ఒక ప్రత్యేక భాషగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు[1]. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్ర జాతిని ప్రత్యేక జాతిగా పేర్కొనడం ఈ లెక్కతో సరిపోతుంది కూడా!

ఈ రకమైన కాలనిర్ణయం సాపేక్ష కాలమానాల (relative chronology) మీద ఆధారపడ్డదే కానీ పద, ధాతు వ్యాప్తి గణాంకాల (lexicostatistics) మీద ఆధారపడ్డది కాదు. ద్రావిడ భాషల పూర్వచరిత్ర పై ఇంకా పరిశోధనలు ఇతోధికంగా జరిగితే గాని తెలుగు భాషా జనన కాలనిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పలేం.

ఆధార గ్రంథాలు

  1. Dravidian Languages Bhadriraju Krishnamurti Cambridge University Press (2003)
  2. Comparative Dravidian Linguistics: Current Perspectives Bhadriraju Krishnamurti (2001)
  3. ద్రావిడ భాషలు పి. ఎస్. సుబ్రమణ్యం (1994)
  4. History and Geography of Human Genes Luigi Luca Cavalli-Sforza, Paolo Menozzi, Alberto Piazza (1994)
  5. భాష, సమాజం, సంస్కృతి భద్రిరాజు కృష్ణమూర్తి (2000)
  6. Journey of Man: A Genetic Odyssey Spencer Wells (2002)
    
   

29అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Kompella Sarma September 17, 2007 7:36 am

    చాలా మంచి వ్యాసం. ప్రతీ తెలుగుజీవి దీనిని భగవద్గీతతో సమానంగా భద్రపరచుకోవాలి.
    ధన్యవాదములు.

    కొంపెల్ల శర్మ

  2. 2
    Rohiniprasad September 17, 2007 8:58 am

    చరిత్ర, భాషా చరిత్రల గురించి ఆసక్తి ఉన్నవారందరికీ ఎంతో పనికొచ్చే మంచి వ్యాసం ఇది. క్రీ.పూ. ఏడో శతాబ్దం నాటికి తెలుగు తదితర దక్షిణాది భాషలకు స్పష్టమైన స్వరూపాలు ఏర్పడి ఉంటాయన్న ప్రతిపాదన పూర్తిగా సమంజసమైనది. అది బుద్ధుడూ, మహావీరుల కాలానికి ఒక శతాబ్దపు ముందరి కాలం. అప్పటికి ఉత్తరభారతమంతటా మహాజనపదాలుండేవి. దండకారణ్యం గుండా కనీసం కాలినడకకైనా పనికొచ్చే ‘దక్షిణాపథం’ ఒకటి ఉండేదేమో.

    నాగరికత అంతగా ప్రవర్తిల్లని కాలంలో విడి తెగలుగా, గుంపులుగా ఒకే ప్రాంతంలో నివసిస్తున్నవారంతా క్రమంగా ఒకరికొకరు తారసపడి సంపర్కాలు పెంచుకోవటం ద్వారానే ఏ ప్రాంతీయభాషకైనా రూపం ఏర్పడుతుంది. సుమేరియన్ రాజవంశాలకు ప్రసిద్ధికెక్కిన ఆ కాలానికి ఉత్తరభారతంలో అథర్వణవేదం తదితర సాహిత్యం సృష్టి కావడం, దక్షిణ భారతంలో గణరాజ్యాల వంటివాటి స్థాపనా వగైరాలు జరిగే ఉంటాయి. లిపి కాకపోయినా దక్షిణభాషలు అప్పటికే రూపుదిద్దుకుని ఉంటాయనీ, ఆ తరవాతి కాలంలో సంస్కృత, ప్రాకృత భాషలతో వాటికి ప్రమేయం కలిగి ఉంటుందనీ సులువుగా ఊహించవచ్చు. కొన్ని వందల మైళ్ళ ఎడం ఉన్న దక్షిణాది రాష్ట్రాలన్నిటా ఒకే మూలభాష ఉండేదనీ (తమిళమో మరేదో) అందులోంచి తక్కినవి పుట్టాయనీ నమ్మడం కష్టం. రకరకాల స్థానిక తెగల మూల భాషల నుంచి ఆధునిక భాషలు విడివిడిగా పుట్టుకొచ్చాయన్నదే సబబుగా అనిపిస్తుంది.

  3. 3
    Sreenath Reddy March 6, 2008 3:11 am

    చాలా మంచి వ్యాసము. మన ప్రభుత్వాలు తెలుగు భాష గురించి పట్టిచుకోకున్ననూ, మన గుండెల్లో ఇటువంటి భాషాభిమానము ఉన్నంతకాలము తెలుగు సజీవముగా నిలిచిపోతుంది.

  4. 4
    Prof. C.Parameswara Murthy July 22, 2008 5:43 am

    Really it is an excellent work and is highly informative. It has all the potential and need for inclusion in our text books. Please write some more articles. Keep it up. I wanted to write this in telugu but my lack of key board knowledge has prevented me.
    Murthy

  5. 5
    Ramesh December 17, 2008 11:44 pm

    అయ్యా! బాగా ఉందండీ. తెలుగు భాష గురించిన వివరాలను తెలియజేయాలన్ని మీ ప్రయత్నానికి జోహార్లు. కానీ మీరేమి అనుకోకపోతే నాదో చిన్న విన్నపం. మీ వ్యాసంలో చాలా వరకు సాధారణ ప్రజలకు తెలియని కొన్ని పదాలు దొర్లాయి. ఇవి సాధారణ ప్రజలకే కాదు ఓ మోస్తరు చదువుకున్న వారికి కూడా తెలియదని నా భావన.

    మీరు ఒ సారి దయచేసి అలాంటి పదాలకు కూడా అర్థాన్నిస్తూ కొంత వివరించగలిగితే, మీ వ్యాసం మరింత ఎక్కువ మందికి చేరి వారికి తెలుగు పట్ల ఉన్న ధోరణిని మార్చుకునేలా చెయ్యగలదని అనుకుంటున్నాను. అటు తర్వాత మీకు వీలైతే ఎందుకు తెలుగు భాషను నేర్చుకోవాలి..? అన్న దానిపై కూడా మీ సమగ్ర రచనా సంపుటితో మరో వ్యాసాన్ని అందించగలరని కోరుకుంటున్నాను.

    శెలవు.
    రమేష్ బాబు

  6. 6
    Rao Vemuri December 18, 2008 8:08 am

    చాల బాగుంది. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ లో తెలుగు బోధించే ప్రయత్నాలు చేస్తూన్నప్పుడు (ఇంకా ఈ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి) మమ్ము తరచుగా ఎదుర్కున్న ప్రశ్న “మనం తెలుగు భాషని ఎందుకు నేర్చుకోవాలి?” అన్నది. మొదట్లో విరాళం ఇవ్వకుండా తప్పించుకుందికి ఈ ఎదురు ప్రశ్న వేస్తున్నారనుకున్నాను. కాని ఈ వ్యాసం సందర్భంలో రమేష్ బాబు కూడ ఈ ప్రశ్న అడిగేరు కనుక దీనికి సాలోచనగా సమాధానం చెప్ప వలసిన అవసరం ఉన్నట్లనిపిస్తున్నాది. సురేశ్ కి ఈ సామర్ధ్యం ఉంది కనుక నేనూ అడుగుతున్నాను. తెలుగుదేశంలో ఉన్న తెలుగువారు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? ప్రవాసాంధ్రులు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? అన్న ప్రశ్నలని కూలంకషంగా ఎవ్వరయినా చర్చించండి. నేను నా బ్లాగులో ప్రయత్నించేను కాని బాగా రాలేదు.
    రావు వేమూరి
    http://latebloomer-usa.blogspot.com/

  7. 7
    Rohiniprasad December 18, 2008 8:53 am

    మన (మాతృ) భాష మనమెందుకు నేర్చుకోవాలి అన్న ప్రశ్నకు ఒక సమాధానం: తన సంస్కృతిని గుర్తించి గౌరవించలేనివాడు ఏ సంస్కృతినీ గుర్తించి గౌరవించజాలడు అని అంటారు. పుట్టినప్పటినించీ ప్రవాసాంధ్రుడుగానే ఉంటున్న నేను ఈ విషయం నిజమని గట్టిగా చెప్పగలను.

    బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో ప్రొఫెసర్ ఎం. ఎన్. గోగటేగారు ఈ తరం మరాఠీ పిల్లలు కామిక్స్ చదివి “లార్డ్ కృష్ణా” గురించి తెలుసుకుంటున్నారని వాపోయాడు. ఈ లార్డ్ బ్రిటిష్ లార్డా అని ఎద్దేవా చేశాడు. వీళ్ళకి సరైన ఇంగ్లీషూ రాదు, మరాఠీ ఎలాగూ రాదు అని హెచ్చరించాడు.

    ఆంధ్రపదేశ్ లో తెలుగును గురించిన నేటి తరం అభిప్రాయాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు.

    టీవీ ట్రావెల్ చానల్ లో షేక్స్పియర్ జన్మస్థలాన్ని భద్రపరిచి టూరిజం ద్వారా ఎలా అభివృద్ధి చేస్తున్నారో చూపించారు. మద్రాసు చింతాద్రిపేటలో ఒక పాత ఇంటిని చూపించి, అందులో వీరేశలింగంగారు కొన్నాళ్ళు గడిపారని మానాన్న నాకు చెప్పారు. ఈపాటికి దాన్ని కూల్చేసి ఉంటారు. రాజమండ్రిలో ఆయన ఇంటినీ, విజయనగరంలో అప్పారావుగారి ఇంటినీ టూరిజం పేరుతో జాగ్రత్తపరచాలనే భావన మన అధికారులకు ఉందా? నేటి ‘రాజశేఖర చరిత్ర’ ఎటువంటిది?

  8. 8
    Srinivas Nagulapalli December 18, 2008 12:59 pm

    చాలా మంచి వ్యాసం. తెలియని విషయాలెన్నో ఆసక్తికరంగా చెప్పారు.

    “తెలుగు మాట కనిపించే మొట్ట మొదటి శాసనం క్రీస్తు శకం 200కి చెందినది. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం గుంటూరు‌ జిల్లా అమరావతిలో దొరికింది.”
    అన్నారు. అంటే అప్పటికి తెలుగుకు లిపి లేదో, లేక వేరే కారణాల(రాజకీయంగానైనా కాకపోయినా) వల్ల బ్రాహ్మీలిపి నే వాడాల్సివచ్చిందో తెలియదు. సురేశ్, వీలైతే మీ అభిప్రాయం చెప్పండి.

    తెలుగెందుకు నేర్చుకోవాలి గురించి రెండు మూడు వాక్యాలు రాద్దామనుకున్నాను. చెప్పాల్సిన పాయింటు పక్కకు పెట్టి, దానికి ముందు నాలో జరిగిన ఆలోచన ఘర్షణ నాకు షాకిచ్చింది. దీన్ని ఇంగ్లీషులో రాస్తున్నందుకు క్షమించమని కోరుతూ, ఏందుకో కూడా చెప్తాను, బాధతో.
    To finish writing this in short time I can afford, I have two choices. Quickly say in English, or postpone to say in Telugu to my satisfaction.
    You know what I chose and therein lies my point and pain.

    Language is merely a vehicle to communicate thoughts. To the extent the vehicle is agile, convenient and suitable we jump into it to transport and receive thoughts. Just that this vehicle changes all the time. And some vehicles are (made to be?) very efficient and effective to handle certain goods. One can go from A to B in many vehicles, but each one gives and leaves different experiences. Some enrich while others encumber!
    Telugu is one of the very efficient vehicles to express and receive the most sublime ideas from Indian spirituality. And, its resonating sounds add unique and lasting charm that heightens one’s feeling and thrill. Those who don’t know it have no idea what they are missing! Learning for sentimental value goes only so far. But learning to experience its enthralling beauty and thrill make it all the more worth it! That is the gain, but the irony and pain is I had to use English to say that quickly.

    Regards
    ========
    -Srinivas

  9. 9
    baabjeelu December 19, 2008 7:23 am

    సురేశ్ గారికి,

    మంచి వ్యాసవేఁ నిస్సందేహంగా. భాషాశాస్త్రవేత్తలందరకీ ఒక విన్నపం, నదికెదురీదో మరోలాగో దాని పుట్టుపూర్వోత్తరాలు నిర్ణయించొచ్చు. భాష విషయం అలా కాదు. భాషాశాస్త్రవేత్తలు వాళ్ళ కుస్తీలు వాళ్ళు పట్టొచ్చు. ఎందుకంటే భాష ఎక్కడపుట్టిందో తెలియని “జీవనది”. ముఖ్యంగా కవిత్వాన్ని “రిఫరెన్స్” గా తీసుకుని భాష గురించీ, అప్పటి బతుకు గురించీ వూహాగానాలు చెయ్యడం సరైనది కాదని నా నామ్మకం. కవులు వారివారి అభిప్రాయాల్ని వ్యక్తీకరిస్తారు తప్ప, వారి వ్యాఖ్యలు “నోటరీ సర్టిఫైడ్” కాదు. అనగా వాటిని పట్టుకు వేలాడ్డం తప్పవచ్చు.

    తల్లి ఎవరికి పుట్టిందీ, ఎలా పుట్టిందీ, ఎలాటి మార్పులికి లోనయ్యిందీ లాటివి మాట్లాడం, అది దండగ. ఆడవాళ్ళ వయసు గురించీ, మగవాళ్ళ జీతం గురించీ అని సురేశ్ గారు మీర్రాయడం బాగోలేదు, దాని బదులు “ఋషుల” పుట్టుక గురించంటే ఇంకా బాగుండేది. కుండలో పుట్టేవా, ఎవరో చేపల్దానికి పుట్టేవాఅని మహా ఋషుల్ని అడగం, దానివల్ల వాళ్ళు చెప్పిన మంచి ముక్కల్ని “ఛీ” కొట్టం.

    “అమ్మభాష” నేర్చుకోవడం గురించి: బతకడానికి ఏ భాష మంచిదయితే “అమ్మ” కూడా అదే భాష నేర్చుకోమంటుంది. ఎందుకంటే బతకడం ముఖ్యం గనుక. “వెంకటేశం” తల్లి, అగ్రహారీకురాలు, ఆ కుర్రాడి “ఇంగ్లీషు” గురించెందుకు బెంగపెట్టుకుంటుంది. బతకడానికి పనికిరాని భాష బతకదు.

    తెలుగు భాష “ఆంధ్రప్రదేశ్” లో బతికుంటే, అది బతికున్నట్టే. పాఠశాలల వ్యవహారం చాలా తక్కువ శాతం. “ఆంధ్రప్రదేశ్” జనాభాలో ఎంత శాతం పాఠశాలలకెళ్ళి చదువుకుంటున్నారు? ఎంత మంది చదువుకున్నారు? పాఠశాలలకెళ్ళి చదువుకోని వాళ్ళే ఎక్కువ శాతం అని నా నమ్మకం. వీళ్ళకి తెలుగొచ్చు. రాయడం రాకపోవచ్చు. “అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబొలె..” కి ప్రతిపదార్థం రాయడం రాకపోవచ్చు. “రావో!రావో!లోల లోల…” యక్షగానంలోని లోలకి అర్థం తెలియకపోవచ్చు, కానీ లక్షణవైన తెలుగు వచ్చు.

    ఇంకో విషయం. పరిపాలించేవాళ్ళు ఏ భాషని ఆదరిస్తే పాలింపబడేవాళ్ళు ఆభాషని నేర్చుకుంటారు. నిజాం రోజుల్లో ఎంతమంది తెలుగువాళ్ళు ఉర్దూ నేర్చుకోలేదు, అయినా తెలుగు మర్చిపోలేదు. ఇంగ్లీషు వాళ్ళ హయాం లో ఇంగ్లీషు నేర్చుకున్నా తెలుగు మర్చిపోలేదు. ప్రస్తుతానికి, అంత పట్టించుకోకుండానే, “ఆంధ్రప్రదేశ్” లో తెలుగు అమలులో వుంది. శ్రీ ఏ.బి.కే. ప్రసాదు గారి ప్రకారం మూడో నాలుగో జిల్లాల్లో అంతా తెలుగులోనే వ్యవహారం. మిగిలిన జిల్లాలు కూడా “ఫాలో” అవుతాయి.

    ఈ మధ్యనే “పంచాయితీ రాజ్ డిపార్ట్ మెంట్” కి వెళ్తే అక్కడ చక్కని తెలుగులో వ్యవహారం అంతా చూసి “హమ్మయ్య” అనుకున్నాను.

    నా ప్రస్తుత “ప్రోజెక్టు” విషయంలో గ్రామ పంచాయితీ వారిచ్చిన “నోటీసు” చూడండి: “…..కావున ఈ నోటీసు అందిన వెంటనే నిర్మాణము ఆపుదల చేయగలరు లేనిచో అట్టి నిర్మాణము నోటీసు ఇవ్వకుండానే కూలగొట్టబడునని ఈ నోటీసు ద్వారా తెలియచేయనైనది.” రాసింది బి.ఏ పేసవని కుర్రాడు.

    బహుశా ఈ అభిప్రాయవేదికల్లో అందరం భయపడుతున్న విషయం మన పిల్లలు తెలుగు నేర్చుకోవట్లేదనేమో? మనదే తప్పు. పిల్లలది కాదు, భాషది కాదు. మనదే, ముమ్మాటికీ మనదే.

    సాహితీవేత్తలకీ, భాషాశాస్త్రవేత్తలకీ వినమ్రవైఁన విన్నపం: బాగా బతకడానికి పనికొచ్చే “సామాన్య, సాంగీక మరియు లెక్కల” పుస్తకాలు “అమ్మభాష” లో రాయండి. అవి చదువుకుని మా బతుకుల్ని బాగు చేసుకుంటాం.

    అన్నట్టు, తెలుగు “ప్రాచీన భాషా?” “క్లాసికల్ భాషా?”

  10. 10
    సురేశ్ కొలిచాల December 21, 2008 6:28 pm

    నేను మూడేళ్ళ క్రితం రాసిన వ్యాసానికి ఇప్పుడు వచ్చిన ప్రతిస్పందన చూసి ఆశ్చర్యపోయాను. నేను భాషాశాస్త్రం గురించి రాసిన మొదటి వ్యాసం కాబట్టి కాస్తా బెరుకు, బెరుకుగా జంకుతూనే రాసాను. నేను ఈ వ్యాసం రాసేనాటికి తెలుగుభాష ప్రాచీనత గురించిన వాదాలు కానీ, తెలుగుభాషను శ్రేష్ఠభాషగా గుర్తించాలన్న నినాదాలు కానీ లేవు. ఈమధ్య కాలంలో ఈ వ్యాసం రాసుంటే కొంత దూకుడుగా, కుశాస్త్రనిందతో మొదలుపెట్టి రాసేవాడినేమో.

    వేమూరి గారు: మీ అభిమానానికి కృతజ్ఞతలు. “తెలుగదేలయన్న …” అన్న అంశం మీద మీరు చక్కగా రాసారు. నేను డెట్రాయిట్ సదస్సులో కూడా ఈ అంశంపై కాస్తా మాట్లాడటానికి ప్రయత్నించాను. ఆ సదస్సులో నేను మాట్లాడిన విషయాలను వ్యాసరూపంగా వచ్చే నెలలో పొద్దు పత్రికలో మీరు చూడవచ్చు.

    శ్రీనివాస్ నాగులపల్లి గారు: భారత ఉపఖండంలో లిపుల చరిత్రకు, భాషల చరిత్రకు అంతగా సంబంధం లేదు. భాషలు, భాషాకుటుంబాల చరిత్ర మహా ప్రాచీనమైతే, వర్తకులకు, రాజులకు, కవులకు మాత్రమే అవసరమయ్యే లిపులు అతి నవీనమైనవి. ఇప్పుడు భారతదేశంలో వాడే లిపులన్నింటికీ మూల మాతృక బ్రహ్మీ లిపి. ఈ బ్రహ్మీ లిపి 2500 సంవత్సరాలకు పూర్వం వాడినట్టుగా ఎక్కడా ఆధారాలు లేవు! వేద సాహిత్యం చాలాకాలం వరకూ మౌఖిక సాహిత్యంగానే ఉండేదన్న విషయం మనందరికీ తెలిసిందే.

    తెలుగు-కన్నడ లిపుల పరిణామాన్ని సూచించే ఈ కింది చిత్రపటం భద్రిరాజు కృష్ణమూర్తి గారి Dravidian languages పుస్తకం లోనిది [79 వ పేజీ].

    లిపుల గురించి రోహిణీప్రసాదు గారు రాసిన మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం అన్న వ్యాసంకూడా మీకు ఉపయోగపడవచ్చు.

    బాబ్జీలుగారు: ఈ వ్యాసం తిరిగి రాయాల్సి వస్తే “మగవాడి జీతం, వయస్సు” అనకుండా “శూరుల జన్మంబు, సురుల జన్మంబు, ఏరుల జన్మంబు ఎరుగ తరమే”అన్న పల్నాటియుద్ధపు పద్యాన్నో, “ఋషిచే కూళ్ ఆణి నదీచే మూళ్ శోధూ నయే! (ఋషుల కులాన్ని నదుల మూలాన్ని శోధించవద్దు)” అన్న మరాఠీ సామెతనో ఉటంకిస్తూ రాస్తాను లెండి :-).

    Classical Language అన్న పద బంధాన్ని “ప్రాచీన భాష” అని అనువదించడం లోనే వచ్చింది అసలు చిక్కు. క్లాసికల్ అన్న మాటలో కాలానికన్నా గుణానికే ఎక్కువ ప్రాధాన్యత కాబట్టి ఆ పదాన్ని శ్రేష్ఠభాష అని అనువదించుకొని ఉండుంటే తెలుగు భాషను సుమేరియన్లతో, తెలిమన్లతో ముడిపెట్టి ద్రవిడ ప్రాణాయామం చెయ్యాల్సిన అగత్యం తప్పేదేమో. ఇప్పటికైనా, ఆ శ్రేష్ఠ భాషా ప్రతిపత్తితో పాటు సాధించిన కోటి రూపాయలతో తెలుగు భాష, చరిత్రల గురించి ఉన్నత స్థాయిలో శాస్త్ర పరిశోధనలు జరపడానికి కావలిసిన వ్యవస్థని నెలకొల్పడానికి పూనుకుంటారని ఆశిద్దాం.

  11. 11
    rama December 22, 2008 6:15 am

    సురేష్ గారు, “శూరుల జన్మంబు…” నన్నయగారి పద్యం. రమ.

  12. 12
    సురేశ్ కొలిచాల December 22, 2008 5:12 pm

    రమగారు: మీరు చెప్పిందే కరెక్టు. “శూరుల జన్మంబు …” మహాభారతపు ఆదిపర్వంలోని ఆరవ ఆశ్వాసంలో అరవయ్యొవ పద్యం — కర్ణుడికి అంగరాజ్యాభిషేకం చేసే సమయంలో దుర్యోధనుని సమర్థింపు (DVSK సినిమాలో కూడా ఇలాంటి డైలాగే విన్నట్టు గుర్తు). దీనికి మూలం “శూరాణాంచ నదీనాంచ దుర్విదాః ప్రభవాః కిల”(ట). నేను పల్నాటి వీర చరిత్రలో చూసింది ఇలాంటిదే ఇంకో పద్యమైయుంటుంది. ఇటువంటి సామెతే మరాఠిలో ఉంది: “ఋషిచే కూళ్ ఆణి నదీచే మూళ్ శోధూ నయే”. మరాఠిలో లాగే తమిళంలో కూడా వినిపించే సామెత “ఋషి మూలం, నదిమూలం అరయక్కూడాదు/కేక్కకూడాదు”. విచారించి చూస్తే, “ఋషి మూలం, నదిమూలం న విచార్యమ్” అన్న సంస్కృత శ్లోకం ఈ సామెతలన్నింటికీ మూలమైయుండొచ్చని తోస్తోంది.

  13. 13
    Darla December 22, 2008 8:59 pm

    మీ వ్యాసం చదివాను. బాగుంది. కానీ, “భారతదేశంలో ఆర్య, ద్రావిడ అని రెండు విభిన్నమైన జాతులు లేవన్న శాస్త్రజ్ఞుల అభిప్రాయాలని ధ్రువపరుస్తున్నవి ” అనే మీ వ్యాఖ్య తర్వాత వ్యాసంలో మరింత వివరిస్తే బాగుండేది. అభినందనలు.
    మీ,
    దార్ల

  14. 14
    దేశిరాజు సుబ్రహ్మణ్యం August 5, 2010 1:20 am

    చాలా చక్కగా రాశారు. ఎన్నో తెలియని విషయాలు తెలిసినాయి. అభినందనలు.
    సుబ్రహ్మణ్యం

  15. 15
    చాకిరేవు ఉపేంద్ర August 29, 2010 12:10 am

    ఈ వారం Economic and Political Weekly లో ‘యమడా కైకో ‘ వ్యాసం ‘Origin and Evolution of Modern Telugus ‘ చదవదగిన ది. సాధారణంగా ఈ పత్రికలో వ్యాసాలు నాలుగు వారాల పాటు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత వాటిని చందాదారులకి మాత్రమే అందుబాటులో ఉండే archives లో కి పంపేస్తారు.
    పిడిఎఫ్ ఫైల్ ని ఇక్కడ నించి డౌన్ లో డ్ చేసుకోవచ్చును.
    http://epw.in/epw/uploads/articles/15095.pdf

    html లో చదవాలంటే ఇక్కడ చూడండి
    http://beta.epw.in/newsItem/comment/188642/

    తెలుగు భాష ప్రాచీనతకి సంబంధించిన వ్యాసం క్రింద అభిప్రాయాలలో తెలుగు ఉనికి రాజకీయాల పై వ్యాసాన్ని ఉటంకించడం సమంజసం కాదనిపిస్తే క్షంతవ్యుడిని .
    ఉపేంద్ర

  16. 16
    అరుణ్ చంద్ర గడ్డిపాటి March 4, 2011 6:31 am

    నాకు పన్నెండేండ్ల వయసు వచ్చేవరకు తెలుగు తప్ప మరో భాష నేను ఎరగను. తరువాత వరుసపెట్టి హిందీ, ఆంగ్ల, తమిళ, కన్నడ, మళయాళ, ఉర్దూ భాషల్లో మాట్లాడగలిగే సామర్థ్యం సంపాదించాను. నేను ఇతర భాషలు నేర్చుకుంది నిజానికి ఇతర భాషా చానెళ్ళ ప్రసారాలు చూడటానికి. 2006 మాతృభాషా దినోత్సవంనాడు “ఆంద్ర జ్యోతి”లో తెలుగు భాషా ప్రాచీనత, వైభవము, ఉన్నతి, నేటి స్థితివంటి అంశాలపై వచ్చిన వ్యాసము నాలో తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించింది. దాని తరువాత నేను మళ్ళీ ఆ స్థాయి వ్యాసాన్ని తెలుగులో ఇదే చూడటము.
    ఒక భాష కాల నిర్ణయము చేయటం అనవసరం అని నా అభిప్రాయము. ఆ భాషలో భావ వ్యక్తీకరణ, సౌందర్యము, సౌలభ్యము, కొత్తపదాల సృష్టి ఇలాంటివి ముఖ్యమైనవి అని నేను భావిస్తున్నాను. నేటి తెలుగు దౌర్భాగ్యము ఏమంటే ఆంగ్ల/సంస్కృత/పారశీక/ఉర్దూ పదాలు లేకుండా ఒక్కనిముషం అయినా మాట్లాడలేకపోవటం. నా మాతృభూమిని వదిలిన తరువాత నాకు మరింత దిగులు పట్టుకుంది తెలుగు దుస్థితిని చూసి. పాఠకులు మన్నించాలి నా ఆవేదన వెళ్ళగక్కినందుకు.

  17. 17
    Siddineni Bhavanarayana February 29, 2012 2:14 am

    సురేశ్ గారూ,
    వృత్తి రీత్యా భాష /సాహిత్యాలలొ ఉపన్యాసకులుగా ఉన్నవారిలో కనపడని వినయం, సంశయాత్మక గళం ముచ్చటగా ఉన్నయ్యి. You are justified in focusing exclusively on the obverse side of the issue.The ever conspicuous predilection for imitating any other language, be in Sanskrit, Persian , Portuguese, or English, not only in lexicon, but also in syntax may soon be tapered off. Your unique non assertive tone prompts the reader to ask for more.

    I request you to acknowledge the considerable contribution rendered in connection to Dravidian roots by Koraada Rama Krishnayya Pantulu గారు. Many thanks for the hopeful drift you have incorporated in the essay.

    yours
    S B N

  18. 18
    తఃతః February 29, 2012 8:04 pm

    చాలా మంచి వ్యాసాన్ని చాలా ఆలస్యంగా ఈ పూట చదివాను. భావనరాయణ గారికి ధన్య వాదాలు.

    1 నేను విష్ణు సహస్రనామం చదవను అందులో “చాణూరాంధ్ర నిషూదనః ” అని ఉందని మొదటి సారి చదివినప్పుడు కోపమొచ్చి. ..

    2. తెలుగయినా వేరే ఏదైనా మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే ‘native genius’ ని పొగొట్టుకునే ఘోర ప్రమాదం ఉన్నదని అనుకుంటాను. తూర్పు ఇరోపా నుంచి అమెరికా కు వలస పోయిన చాలా మంది శాస్త్రజ్ఞులు, ముఖ్యంగా లెక్కల్లొ, తర్కంలో ప్రప్రథమ శ్రేణికి చెందిన వాళ్ళు, వారి వారి మాతృ భాషల్లో పాటవం ఉన్నవాళ్ళుగా అగపడతారు. అమెరికాలో వేసవిలో హైస్కూలు పిల్లలకు నూతనాంశాలతోనూ, సమస్యా సాధనలతోనూ పరిచయం కలుగచేసే ఒకానొక కార్యక్రమంలో ఒక రష్యన్ కుర్రాడు ఒక ‘insanely difficult’ సమస్యను అవగాహన చేసుకొవటంలోనూ కొంత సాధించటంలోనూ చూపిన నైపుణ్యాన్ని ఆ వేసవి గురువు మెచ్చుకోవడం నేను చదివాను. ఆ కుర్రాడి గురించి రెండు ముక్కలు రాస్తూ అతను తన మాతృ భాషలో క్లాసిక్స్ చదువుతాడనీ రష్యన్ సంప్రదాయ సంగీతం వింటాడనీ రాశారు. ఇది మనపిల్లలకు తెలుగు భాష మీద శ్రధ్ధ లేకపొవడం ఇలాగే కొనసాగితే మనం genuinely intellectual ప్రపంచంలో మన ఉనికిని త్వరలొనే పూర్తిగా పొగొట్టుకుంటామా అని అనిపింపజేస్తోంది. ఈ విషయంలో చాలా ఇబ్బందు లున్నాయి అయినా, సురేశ్ , హనుమంత రావు (కొడవళ్ళ) లాంటి విజ్ఞులు కొంచెం గట్టిగా పూనుకోవాలేమో.

    3. సురేశ్ తను ఈ వ్యాసం రాసి చాలా సంవత్సరాలైనది . ఈవ్యాసం ఈకోవలో తమ మొదటి ప్రయత్నం అని గూడా రాశారు అయినా, ఆయన పోతన ‘యెవ్వని చేజనించు’ పద్యాన్ని గురించి రాసిన వాక్యం కొంచెం ఆశ్చర్యాన్ని కలగజేసింది. పోతన సంస్కృత భాగవతాన్నే గదా అనువదించింది. [‘ ఓం నమో భగవతే…. పరేశాయాభి ధీమహి”, “…యేనేదం …స్వయం భువం” అన్న శ్లోకాల అనువాదంగా ఈ పద్యం కనపడుతుంది (గోరఖ్ పూర్, గజేంద్రమోక్షం, తెలుగు ప్రతి నుంచి.) ఈ వాక్యం సబబుగా లేదని సంపాదకులైనా సూచించి ఉండ వలసినదేమో.

  19. 19
    Siddineni Bhavanarayana March 2, 2012 8:55 am

    సుrEష్ గారికి, తః తః గారికి నా దొక మనవి..

    నేను విష్ణు సహస్రనామం చదవను అందులో “చాణూరాంధ్ర నిషూదనః ” అని ఉందని

    నా పరిమితులు మన్నిస్తూ ఈ విషయం కూడా చూడ ప్రార్ధన. The following paragraphs I submit for for your kind perusal.

    Romance branch of languages of the Indo European family like French, have flexible word order as to the relation of noun and adjective. As is the case in the syntactical structure of the majority of this family of languages. This flexibility is attributed to the inflectional capabilities of the particular lexicon of each of these languages. Here a nominative, singular, masculine noun, an accusative plural feminine noun and a dative neutral singular pronoun can be transposed with each other without changing the basic meaning of the expression, yet shifting the emphasis.

    Moulin rouge [a dance hall in the Montmartre section of Paris], means red wind mill. Moulin, the noun precedes rouge, the adjective. As is the case with jambuka vruddham [vrudddha jambukam] of Panchatantram. By this analogy ChaNura may be an accusative noun. The other part of the samasa, “Andhra” may be an adjective rather than be a second accusative noun being governed by the transitive verb.

    N.B. I especially supplicate to Ta.Ta. garu to pardon if a cynic should be so brash as to apprehend. ”A language is more prone to commit suicide rather than to have been slain by an external agent.”

    yours humbly,
    S B N

  20. 20
    ramesh kolluri May 2, 2012 9:04 pm

    చరిత్ర, భాషా చరిత్రల గురించి ఆసక్తి ఉన్నవారందరికీ ఎంతో పనికొచ్చే మంచి వ్యాసం తెలియని విషయాలెన్నో ఆసక్తికరంగా చెప్పారు.ధన్యవాదములు.

  21. 21
    వెంకట చలపతి బాబు June 13, 2012 2:39 am

    చాలా బాగుంది… ప్రతి ఒక్కరు చదవాలి…. తెలుసుకొవాలి…

  22. 22
    వెంకట చలపతి బాబు June 13, 2012 2:48 am

    నేను ఈ విషయాన్ని నా మిత్రులకి అందించుటకు నా facebook లో మీ అనుమతి లేకుండా ప్రచురించాను… నన్ను క్షమించండి.

    [మీరు దయచేసి వ్యాసాన్ని మీ ఫేస్‌బుక్ నుంచి తీసివేసి, ఈమాటలో వ్యాసానికి లింక్ ఇవ్వండి. – సం.]

  23. 23
    sukanya October 16, 2012 10:05 am

    మన మాతృభాష తెలుగునకు ఇంతటి ఘనమైన చరిత్ర ఉందని మీ వ్యాసం చదివే వరకు తెలియదు. నిజంగా గర్వంగ ఉంది. దేసభాషలందు తెలుగు లెస్స అన్న నానుడి నిజం. తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరు ఈ వ్యాసం చదివి తెలుగు గురించి తెలుసుకోవాలి.

  24. 24
    Raghavulu Regandla November 20, 2012 9:48 am

    నమస్సుమాంజలి. తెలుగు వారు తెలిసికొనవలసిన యెన్నో విషయాలు తెలియజీసినందుకు కృతజ్ఞతలు. ప్రాచీన భాషగా గుర్తింపబడటానికి యెందుకు అంత అవస్థలు పడవలసి వచ్చిందో కూడా తెలియ జేయగలరని కోరుచున్నాను.

  25. 25
    Ravisankar November 29, 2012 5:05 pm

    ఈ వ్యాసాన్ని ప్రచురించి మీరు చేసిన మేలు మరువలేనిది. ఎందరో మహనీయులకు ఒక చర్చావేదిక అయ్యింది. తెలుగు భాష ప్రాధాన్యతను తెలుసుకునెడి ప్రయత్నం ప్రతియొక్కరు చేయడానికిది నాంది అవుతుందేమో. జరగబోయే ప్రపంచ తెలుగు మహా సభలో ఇది ప్రస్తావిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కొందరు పెద్దలు తమ వ్యాఖ్యానాల్లో తెలుగు type చేయలేక ఆంగ్లములో ప్రయత్నించడము కూడ గమనించవలసిన విషయము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్పందించి, తెలుగు true type fonts సాధారణ keyboard తో అచ్చువేయ గలిగితే బాగుంటుంది. ఈ web page లో తెలుగు భాషను ముద్రించడము సులభంగా వున్నా మొదటి అక్షరం వత్తులు రెండవ అక్షరంపైన పడుతున్నది. దీనిని సవరించలేరా? ఆంగ్లములో అచ్చువేసుకున్నంత సులభంగా తెలుగులో అచ్చువేయగలిగితే బాగుంటుందని ఆశ.

  26. 26
    suresh choppara July 26, 2015 5:08 pm

    చాలా బాగుంది. తెలుగు భాష గురించి తెలుసుకున్నందుకు నేను ఒక తెలుగు వాదిగా గర్వపడుచున్నాను. ధన్యవాదములు.

  27. 27
    కట్టా శ్రీనివాస్ August 3, 2016 10:50 pm

    హిందు దినపత్రికలో వచ్చిన ఈ వార్త తెలుగు భాషా మరింత ప్రాచీనమైనదని నిరూపించే ఆధారాలు దొరికాయి అంటోంది. (లింకు ఓపెన్ కావడంలో ఇబ్బందులున్నాయని పూర్తిపాఠం కూడా క్రిందనే ఇచ్చాను)
    http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1971071.ece

    Telugu is 2,400 years old, says ASI
    The Archaeological Survey of India (ASI) has joined the Andhra Pradesh Official Languages Commission to say that early forms of the Telugu language and its script indeed existed 2,400 years ago.

    D. Jithendra Das, Superintending Archaeologist, ASI, Hyderabad Circle, cited three inscriptions discovered at Bhattiprolu in Guntur district that contained several Telugu roots or words, as “indisputable evidence” in support of the finding. All these inscriptions date back to 400 B.C. He showed magnified pictures of these inscriptions as also charts relating to evolution of Telugu letters since Mauryan times to journalists here on Wednesday. An English translation of one inscription reads: “Gift of the slab by venerable Midikilayakha.”

    Dr. Das and A.B.K. Prasad, Official Languages Commission Chairman, explained that Midikilayakha might be an independent Andhra king at that time. Bhattiprolu indicated, without an iota of doubt, the existence of Telugu words even a century before Emperor Ashoka (300 BC). Asked if the ASI would testify its findings before the Union government to secure classical language status to Telugu, Dr. Das said he would do so if asked by the Centre and “not on our own.”

    Telugu language was found more refined in the inscriptions found at Kantamnenivarigudem, Guntupalli in West Godavari district, and Gummadidurru and Ghantasala in Krishna district.

  28. 28
    Chepur Prabhakar Rao February 21, 2018 6:28 am

    తెలుగు క్రీస్తు పూర్వపు 7-8 శతాబ్దము నాటికే ఉండి ఉండవచ్చన్న సురేశ్ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. తెలుగు ప్రాంతాలు చాలాకాలం ఉత్తరప్రాంతమునుండిన రాజుల అధీనంలో ఉండినవి. శాతవాహనులు, ఇక్ష్వాకులు వగైరా. వారు పరిపాలనకు తెలుగు ఉపయోగించలేదు. తెలుగుకు రాజపోషణ లేదు. తెలుగు కొన్ని వందల సంవత్సరాలు మాట్లాడే భాషగానే ఉండి పోయింది. 6వ శతాబదము నుంచి తెలుగు శాసనాలు కనిపిస్తవి. రాతలిపి కంటే కనీసము వెయ్యి సంవత్సరాల ముందే తెలుగు వాడుకలో ఉందనవచ్చును. It takes at least a thousand years for a spoken language to reach literary stage. Even today many languages spoken by tribals like koyas, gonds don’t have much literature. They have only oral traditions. Telugu was in a similar condition before 6th century AD. Therefore Telugu must have been a spoken language at least by around 5 century BC. This is close to 6-7 century BC mentioned by Sri Suresh garu. Many people are under the wrong impression that Shatavahanas were Telugus. They are of North Indian Origin. Their Language was Maharashtri Prakrit. (Ancestor of Marathi language). Gautami Putra Saatakarni ruled from Maaharashtra, his Capital was some where near Nasik..All inscriptions pertaining to his rule are in Maaharashtri Prakrit and are mostly located in Maharashtra. His mother Gautami has one important inscription made about his rule. It is called Nasik Prasasthi and is in Maaharashtri Praakrit. Probably some telugu regions were under the dominions of Shatavahanas. In the recent Telugu movie, Gautami Putra ShataKarni was shown as a Telugu man. I dont think he knew any Telugu.

    In fact Shatavahaanas are responsible for Non- development of Telugu as a Literary language,They were more like QutbShahi Sultans of Golconda who used Only Persian for Official purposes. If we call them Telugu kings it will be a joke.

  29. 29
    జయశ్రీ అల్లు July 30, 2019 1:19 am

    చక్కటి వివరణాత్మకమైన వ్యాసం. ధన్యవాదములు సురేష్ గారు

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అక్కమహాదేవి వచనాలు – 3
  • ఆముక్తమాల్యద – కృష్ణదేవరాయల నవ్య రాజనీతి
  • 28 ఏళ్ల ‘ఈమాట’ సాహిత్య ప్రస్థానం
  • గడినుడి – 85
  • హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా?

ఇటువంటివే…

  1. తెలుగు అధికార భాష కావాలంటే
  2. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే…
  3. వ్యవహార భాష: వ్యాకరణము
  4. అలుసవుతోన్న అమ్మ భాష
  5. స్వీడన్‌లో మాతృ భాష వాడకం

నవంబర్ 2005 సంచికలో ...

  • Make Peace – మొదటి భాగం
  • కేసు
  • తెలుగు భాష వయస్సెంత?
  • తెలుగు సినిమా? తెగులు సినిమా?
  • తెలుగుదనం (not in lighter vein)
  • ద్వంద్వాలు
  • నవంబర్ 2005
  • నా మాట
  • నిద్ర
  • నువ్వు నాకొద్దు
  • మార్పు
  • మిడిల్ డ్రాప్
  • వైరుధ్యం
  • శాన్‌ఫ్రాన్‌సిస్కో
  • శిలాంతరాళలోలిత రేవతీదేవి
  • హిందూస్తానీ సంగీతం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

వానకు తడిసిన పువ్వొకటి
తెలుగు సినిమా? తెగులు సినిమా?

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.