శాంతిని బహుమతిగా పొందిన వాడినై…

[ప్రముఖ రచయిత సల్‌మాన్ రుష్దీ ప్రతిష్టాత్మకమైన జర్మన్ బుక్ ట్రేడ్ శాంతి పురస్కారాన్ని (2023) అందుకున్న సందర్భంలో చేసిన ప్రసంగానికి తెలుగు సేత – సం.]

ఇక్కడికి విచ్చేసిన ఆహూతులందరికి ధన్యవాదాలు. ప్రపంచపు నలుమూలల నుండి వచ్చిన మీముందు మాట్లాడే అవకాశాన్ని నాకు కలుగజేసినందుకు కృతజ్ఞతలు. ఈ పురస్కారం పట్ల, ఈ పురస్కారాన్ని అందుకున్న అసామాన్యులైన పూర్వగ్రహీతల పట్ల నాకు ఎనలేని గౌరవం ఉంది. అయితే ఈ పురస్కారం నన్ను కూడా వరిస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఈ శాంతి పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు. తన పుస్తక ప్రచురణ పనులను ఆపుకొని మరీ నాకోసం ఇక్కడికి వచ్చి నా గురించి మాట్లాడిన నా అభిమాన రచయిత డానియెల్ కెల్‌మన్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిన ఈ భవంతి గోడలమధ్య నిలబడి ఉపన్యాసం ఇవ్వగలగడం నా అదృష్టంగా భావిస్తాను.

ముందుగా ఒక కథ. ఒక అడవిలో రెండు నక్కలు ఉండేవి. ఒక నక్క పేరు కరటకుడు, కొంత నెమ్మదస్తుడు. మరో నక్క పేరు దమనకుడు, కొంత దుడుకువాడు. ఆ అడవికి రాజు పింగళకుడు అనే సింహం. నక్కలు రెండిటికీ పింగళకుడి కొలువులో అధమస్థాయి పదవులు ఉండేవి. అయితే ఈ రెండూ జిత్తులమారి నక్కలు. ఒకనాడు మృగరాజు మునుపెన్నడూ వినని ఒక రంకె విని భయపడతాడు. ఆ అరుపు ఒకప్పుడు కాలు విరగడంతో ఒక వర్తకుడు వదిలేసిన సంజీవకుడు అనే ఎద్దు వేసిన రంకె అని ఆ నక్కలు గ్రహించాయి. ఆ ఎద్దు వల్ల సింహానికేం ప్రమాదం లేదని కూడా వాటికి తెలుసు. ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి, ఎలాగోలా నచ్చజెప్పి ఆ ఎద్దును సింహం ఎదుటకు తీసుకువచ్చి సింహంతో స్నేహం చేయడానికి ఈ నక్కలు ఒప్పిస్తాయి. సింహం అంటే స్వతహాగా భయం ఉన్న ఎద్దు ఎట్టకేలకు స్నేహం చేయడానికి ఒప్పుకుంటుంది. తన భయాన్ని పోగొట్టి మంచి మిత్రుడిని ఇచ్చినందుకు సంతోషించిన పింగళకుడు వీరికి మధ్యస్థాయి పదవులను కట్టబెడతాడు. అయితే, తక్కువ సమయంలోనే సంజీవకుడితో స్నేహం పెరిగిపోయి, అతనితోనే సమయమంతా గడుపుతూ పింగళకుడు చివరికి వేటాడటం కూడా మానివేస్తాడు. దానితో ఆకలితో నకనకలాడిన కరటక దమనకులు ఎలాగైనా పింగళకుణ్ణి, సంజీవకుణ్ణి విడదీయాలని పన్నాగం పన్ని ఎద్దు, సింహాల మధ్య భేదాలను సృష్టిస్తారు. ఎద్దు సింహాన్ని పదవీచ్యుతున్ని చేసి తానే రాజు కావాలని కుట్రలు పన్నుతోందని సింహాన్ని రెచ్చగొడతారు. సింహం ఎద్దును చంపి తినాలని ఆలోచిస్తోందని ఎద్దుతో చెప్పి, ఎద్దును కూడా ఉసిగొల్పుతారు. సింహం, ఎద్దుల మధ్య జరిగిన పోరులో ఎద్దు ప్రాణాలు కోల్పోతుంది. పోరు ముగిసిన తరువాత సింహరాజు తనపై ఎద్దు చేసిన కుట్రను తెలియజేసినందుకు నక్కలకు ఉన్నతస్థాయి పదవులను కట్టబెడతాడు. నక్కల కారణంగానే తినగల్గినంత మాంసం దొరికిందని అడవిలోని ఇతర జంతువులకు కూడా నక్కల పట్ల గౌరవం పెరుగుతుంది. పాపం, ఒక్క చచ్చిపోయిన ఎద్దుకు తప్ప ఈ యుద్ధం వల్ల అందరికీ లాభమే కలిగింది కదా!

ఇది స్థూలంగా పంచతంత్రంలోని అయిదు భాగాలలో రెండవది అయిన మిత్రభేదంలోని ప్రధాన కథ. అనేక ఉపకథలు, ఉపాఖ్యానాలతో సాగే మూడవ భాగం పేరు యుద్ధము-శాంతి. ఇదే పేరుతో ప్రపంచ సాహిత్య చరిత్రలో పేరు మోసిన మరో పుస్తకం కూడా ఉందనుకోండి. ఈ యుద్ధము-శాంతి ఉపకథలో కాకులు, గుడ్లగూబల మధ్య వైరం గురించిన కథ ఒకటి ఉంది. కాకుల జిత్తులు, తెలివితేటల వల్ల గుడ్లగూబలు ఎలా మోసపోయి నాశనమై పోతాయో ఈ కథ వివరిస్తుంది. ఇదే కథను నేను నా విక్టరీ సిటీ నవలలో కూడా వాడుకొన్నాను.

ఈ పంచతంత్ర కథల్లో నాకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, నన్ను అమితంగా ఆకర్షించే విషయం కూడా, ఏమిటంటే ఈ కథల్లో ఎక్కడా నీతిబోధ ఉండదు. ఏది మంచి ఏది చెడు అన్న వివరణ కనిపించదు. చాలా కథల్లో జిత్తులతో ఎత్తుకు పైఎత్తు వేసినవారే గెలుస్తారు. మంచివారు మాత్రమే గెలవాలన్న కథల మూసలో ఈ కథలు ఒదగవు. చాలా కథల్లో మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు అన్న విషయం కూడా అంత సులభంగా చెప్పలేము. ఈ కారణం చేతనే ఆధునిక పాఠకునికి ఈ పంచతంత్ర కథలు విలక్షణమైన సమకాలీన కథలుగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో నీతిబాహ్యులు, జిత్తులమారులు, నిర్లజ్జగా ప్రవర్తిస్తూ తరచూ గెలవడం మనం చూస్తూనే ఉన్నాం.

‘కథలు ఎక్కడనుంచి వస్తాయి?’ అని అడుగుతాడు, నా నవల హారూన్ అండ్ ద సీ ఆఫ్ స్టోరీస్‌లో కథానాయకుడు హారూన్. అతని తండ్రి కథలు అల్లడంలో దిట్ట. ఈ ప్రశ్నకు సమాధానం — కథలు ఇతర కథలనుంచి వస్తాయి, మన జీవనయానం నుండి వస్తాయి. కథలు, అవి చెప్పేవారి సొంత అనుభవం నుంచి, జీవితం గురించి వారికున్న అభిప్రాయాల నుంచి, ఇంకా వారి కాలమాన పరిస్థితులనుంచీ వస్తాయి. కాని, చాలా కథలకు మూలం ఇతర కథలలోనో, లేదా అనేక కథలలోనో ఉంటుంది. అవన్నీ కలిసి రూపాంతరం చెంది కొత్త కథలవుతాయి. ఈ ప్రక్రియనే మనం ఊహాశక్తి అని, కాల్పనికత అని అంటాం.

పౌరాణిక కథలు, జానపదుల కథనాలు, ఇతర అభూతకల్పనలూ నాకెంతో స్ఫూర్తినిస్తాయి. దీనికి కారణం వాటిలో మాట్లాడే జంతువులు, మంత్రతంత్రాలు ప్రయోగించగలిగే పాత్రలు ఉండడం కాదు. ఈ కథలు లోతైన సత్యాన్ని పొరలు పొరలుగా మనకు చూపుతాయి. ఉదాహరణకు, ఓర్ఫియస్ అండ్ యూరిడసీ (Orpheus and Eurydice) కథ తీసుకోండి. ఈ కథ నా ద గ్రౌండ్ బినీత్ హర్ ఫీట్ నవలకు ప్రధాన స్ఫూర్తి. నిజానికి ఓర్ఫియస్, యూరిడసీల కథ వంద పదాలకు మించి ఉండదు. అయినా, ఇంత చిన్నకథ మనలో కళ, ప్రేమ, మరణాల గురించి ఎన్నో బలమైన ప్రశ్నలు రేకెత్తిస్తుంది — కళ ద్వారా ప్రేమ మరణాన్ని జయించగలదా? మరణం కళను తోసిరాజని ప్రేమను కబళిస్తుందా? ప్రేమ, మరణాలకు అతీతంగా కళ అజరామరమౌతుందా? ఆ వంద పదాల కథలో ఉన్న లోతైన తాత్వికత వేయి నవలలకు సరిపడే స్ఫూర్తినిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా విసృతమైన పురాగాథల సంపద ఎంతో ఘనమైనది. ప్రసిద్ధి చెందిన గ్రీకు పురాణకథలే కాక, నార్స్ వచన కథలు, ఎడ్డా పద్య గాథలు, ఈసోప్ (Aesop), హోమర్, నీబెలుంగ్ (Nibelung), కెల్టిక్ గాథలు, అనేకం ఉన్నాయి. ఇంకా, షార్లమేన్ (Charlemagne) చక్రవర్తి చుట్టూ అల్లిన ఫ్రాన్స్ దేశపు కథలు, రోమన్ సామ్రాజ్యపు కథలు, కింగ్ ఆర్థర్‌కు సంబంధించిన కథలవంటివి ఎన్నెన్నో ఉన్నాయి. ఇక ఇక్కడ జర్మనీలో, యాకబ్, గ్రిమ్‌లు సేకరించిన అనేక జానపదకథలు ఉన్నాయి. నేను పుట్టి పెరిగింది భారతదేశంలో కాబట్టి, ఈ కథల గురించి తెలియడానికి ముందే నేను పంచతంత్ర కథలు వింటూ, చదువుతూ పెరిగాను. ఇప్పటికీ, నేను రచనల మధ్య విరామంలో ఉన్నప్పుడల్లా ఈ పంచతంత్ర కథలనే స్ఫూర్తి కోసం చదువుతూ ఉంటాను. ఈ కథలు నన్నెప్పుడూ నిరాశపరచలేదు. మంచి, చెడు, స్వేచ్ఛ, నిర్భంధం, యుద్ధం-శాంతి, సంఘర్షణల గురించి అనేక విషయాలు నాకీ కథలు నేర్పాయి. ప్రేమ గురించి తెలుసుకోవాలా? అది మాత్రం వేరొకచోట వెతుక్కోవలసిందే!

ఈ శాంతి బహుమతి గ్రహీతనైన సమయంలో, ఈ పురాగాథల నిధి శాంతి గురించి ఏం చెప్పిందో తిరిగి చూడాలనిపించింది.

దురదృష్టవశాత్తూ ఆశావహమైన కథ ఏదీ ఈ నిధి నాకు చెప్పలేదు. ఈ గాథల ప్రకారం, శాంతి అంత సులువుగా సాధించగలిగేది కాదు. హోమర్ కథల ప్రకారం, శాంతి కోసం దశాబ్దాల పాటు యుద్ధం జరుగుతుంది, మనకి కావలసిన వారందరి మరణం తరువాత, ట్రాయ్ నగరం విధ్వంసం అయిన తరువాతే శాంతి నెలకొంటుంది. నార్స్ పురాగాథల ప్రకారం, అనేక వేల సంవత్సరాల దేవదానవ సంగ్రామం తరువాత, దానవులతో పాటు కొందరు దేవతలు కూడా హతం అయిన తరువాతనే శాంతి నెలకొంటుంది. (నార్స్ గాథలలో ఈ సంఘటనలను ‘రాగ్నరాక్’ అంటారు. దీనికంటే, జర్మన్ పదం ‘గ్యొట్టర్‌డెమ్మరుంగ్’ అన్న పదమే దేవదానవ సంగ్రామం తరువాత జరిగే పతనాన్ని సరిగా సూచిస్తుంది. – అను.) రామాయణ, మహాభారతాల్లో కూడా మనకు ఇదే కనిపిస్తుంది. భారతంలో భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో యుద్ధాలు ముగిసిన తరువాత ఇరువైపులా అనేక బంధుజనం హతమయ్యాకనే శాంతిపర్వం మొదలౌతుంది. పంచతంత్రంలోని యుద్ధము-శాంతిలో కూడా, కాకులు జిత్తులతో ఉలూకాలను హతం చేసి మాత్రమే విజయం సాధిస్తాయి.

పురాగాథలను కాసేపు పక్కనపెడదాం. ఈ మధ్యనే విడుదలయి విజయం సాధించిన సినిమాల జంట, బార్బెన్‌హీమర్, తెలుసు కదా! వాటిలో ఆపెన్‌హైమర్ సినిమా ఏం చెప్తోంది? హిరోషిమా, నాగసాకి నగరాల మీద రెండు అణుబాంబులు వేసి, మారణహోమం జరిగిన తరువాతే శాంతి నెలకొంటుందని చెప్తోంది. ఇక బాక్సాఫీసును కొల్లగొట్టిన బార్బీ సినిమా ఏం చెప్తోంది? నిరవధికమైన శాంతి, అకళంకమైన ఆనందం గులాబీరంగు బొమ్మరిళ్ళు ఉండే లోకంలో తప్ప సాధ్యం కాదని గుర్తు చేస్తోంది.

మనం ఇక్కడ శాంతి గురించి మాట్లాడుకోవడానికి కలుసుకున్న ఈ సమయంలోనే, ఇక్కడికి సమీపాననే ఒక ఘోరమైన యుద్ధం జరుగుతోంది. ఇది ఒక నియంత తన అధికారం కోసం, తన సామ్రాజ్య విస్తరణ కోసం చేస్తున్న యుద్ధం. ఇటువంటిది జర్మన్ ప్రజలకు అపరిచితం కాదు. ఇదే సమయంలో మరో యుద్ధం ఇజ్రాయిల్-గాౙా ప్రాంతాలలో ప్రబలింది. శాంతి నినాదం ఇప్పుడు మాదకద్రవ్యాల మత్తులో ఒక ఉన్మాది చేసే ప్రేలాపనలా వినిపిస్తుంది. ఇప్పుడు కనీసం శాంతి అంటే అర్థం ఏమిటన్న విషయంపై కూడా ఏ రెండు వర్గాలూ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఉదాహరణకు, ఉక్రెయిన్లకు శాంతి అంటే యుద్ధం ఆగిపోవడమే కాదు, వారి సార్వభౌమత్వానికి విఘాతం కలగకుండా వారి ఆక్రమిత ప్రాంతాలు తిరిగి వారికి చెందడం. ఉక్రెయిన్ శత్రురాజ్యానికి శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోయి ఆక్రమిత ప్రాంతాలను శత్రువుకు ధారాదత్తం చేయడం. శాంతి అన్న పదానికే ఇరువర్గాలలో పరస్పర విరుద్ధమైన నిర్వచనం ఉంది. ఇక దశాబ్దాలుగా రగులుతున్న ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో శాంతి విషయంలో వారి నిర్వచనాలు మరింత దూరంగా ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

శాంతిని నెలకొల్పడం కష్టం. శాంతిని నిలుపుకోవడమూ కష్టమే.

అయినా సరే, మనం శాంతికోసం తపిస్తాం. యుద్ధం ముగిసిన తరువాత వచ్చే శాంతిని ఆహ్వానించినట్టే మన జీవితాల్లో అడపాదడపా తొంగిచూసే శాంతి కోసం, మన చుట్టూ ఉన్న చిన్న ప్రపంచంలో శాంతితో బ్రతకడం కోసం ఎదురుచూస్తాం. వాల్ట్ విట్‌మన్ శాంతి అంటే మన మీద ప్రతిరోజు వెలుగు కిరణాలు ప్రసరించే సూర్యుడిగా వర్ణించాడు:

సవితృడా! యథార్థ శాంతి ప్రదాతృడా!
ద్రుతగతి కాంతి విధాతృడా!
స్వేచ్ఛాయుత హర్షాంచిత భాస్వంతుడా!
నీ శాంత్యుదయ వేళకై నేను ఏ-
ఆహ్వాన గాన ఝరుల నింతునో?

లోకాల చీకట్లు పోకార్చు ద్యుతులతో
గగనాగ్ర భాగాన ప్రసరించి వ్యాపించు!
ఉదయ వేదిక మీద సంకాశ సందర్శనం
హృదయ వేదికమీద ఆదర్శ సంనర్తనం!

విట్‌మన్ ఆదర్శం శాంతి. ఇక్కడ కలిసిన మనమంతా ఆయన ఆశయంతో ఏకీభవిద్దాం. శాంతి ఎంత కష్టమైనా, అసాధ్యమని అనిపించినా, కొన్ని సందర్భాలలో మనం శాంతిని ఇదమిత్థంగా నిర్వచించలేకపోయినా, శాంతి మనకు తెలిసిన విలువలలో అతి శ్రేష్ఠమైనది కాబట్టి దాన్ని సాధించడానికి నిర్విరామంగా కృషి చేద్దాం.

మా తల్లిదండ్రులు నాకు సల్‌మాన్ అని పేరు పెట్టినప్పుడు కూడా ఇలాగే ఆలోచించారేమో. సల్‌మాన్ అన్న పేరుకు మూలధాతువైన స-ల్-మ్‌కు అర్థం శాంతి. సల్‌మాన్ అంటే ప్రశాంతమైన (వాడు). నిజానికి, చిన్నప్పుడు నేను సహజంగానే శాంతస్వభావిగా ఉండేవాడిని. బడిలో బాగా చదువుకొనేవాడినని, సౌమ్యుడినని నాకు పేరు. నన్ను చుట్టుముట్టిన వివాదాలు ఆ తరువాత కాలంలో వచ్చినవే. నా పరిణత జీవితం వేరే పుంతలు తొక్కినా, ఇప్పటికీ నన్ను నేను శాంతస్వభావిగానే భావించుకొంటాను.

నా రచనలకు అద్భుతమైన పురాగాథలు స్పూర్తి. కాబట్టి, ఈ బహుమతి కమిటీ సభ్యులకు అతీంద్రయమైన శక్తి ఏదో ఉండి, వాళ్ళు ఏడాదికి ఒకే ఒక్కసారి, ఒకే ఒక్క వ్యక్తికి ఒక ఏడాదికి సరిపడా సంపూర్ణమైన, పరిపూర్ణమైన శాంతిని – తాత్కాలిక ఉపశమనం కాదు సుమా – ప్రసాదించగలిగి ఉంటే, అలా శాంతినే బహుమతిగా, ఆ శాంతిని ఒక ఏడాదికి సరిపడా చక్కటి సంజీవనిలా సీసాలో నింపి బహుమతిగా ఇవ్వగలిగితే ఎంత బావుంటుంది? అటువంటి బహుమతికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాంటి బహుమతి గురించి ‘శాంతిని బహుమతిగా పొందిన వ్యక్తి’ అన్న శీర్షికతో ఒక కథ రాస్తానేమో కూడా.

ఆ కథ బహుశా ఒక చిన్న ఊరి జాతరలో జరుగుతుంది. ఆ సంతలో వంటల పోటీలు, కూరగాయల పోటీలు, అందాల పోటీలు, ఆటలు పాటల పోటీలు, ఇలా రకరకాల పోటీలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి ఒక బేహారి, ద విజర్డ్ ఆఫ్ ఆజ్‌లో ప్రొఫెసర్ మార్వెల్ లాగ ఊరూరా తిరిగే టక్కరి, ఓ అందమైన గుర్రపు బండిలో వస్తాడు. అతను అక్కడ జరుగుతున్న పోటీలకు తనని నిర్ణేతగా చేస్తే, గెలిచిన వాళ్ళకు వాళ్ళెప్పుడూ చూడనంత గొప్ప బహుమతులు ఇస్తానంటాడు. అమాయకులైన ప్రజలు వస్తారు. అతను గెలిచినవాళ్ళకు చిన్నచిన్న అత్తరు సీసాల్లాంటివి బహుమతిగా ఇస్తాడు. ప్రతి సీసా మీద సత్యం, అందం, స్వేచ్ఛ, మంచితనం, శాంతి – ఇలా ఒక్కొక్క గుణం పేరు రాసి ఉంటుంది. బహుమతి పొందినవాళ్ళు డబ్బు బహుమతిగా రానందుకు నిరాశపడతారు.

క్రమంగా, ఆ ఊళ్ళో విచిత్రమైన పరిణామాలు సంభవిస్తాయి. ‘సత్యం’ బహుమతిదారు తన సీసాలోని సంజీవనిని తాగినప్పటినుంచీ అన్నీ పచ్చి నిజాలే చెప్పేస్తూ ఊళ్ళోవాళ్ళ అసహనానికి గురై, వాళ్ళకి దూరం అవుతాడు. ‘అందం’ తాగిన సుందరి ఇంకా అందంగా అవడమే కాక – కనీసం ఆమె దృష్టిలో – ఎవరూ భరించలేనంత గర్విష్టిగా కూడా తయారవుతుంది. ‘స్వేచ్ఛ’ తాగినామె విశృంఖల ప్రవర్తన ఊళ్ళో అందరినీ విస్మయపరుస్తుంది. అందరూ ఆమె సీసాలో ఉన్నది మత్తుమందే అని తీర్మానిస్తారు. ‘మంచితనం’ పుచ్చుకొన్న వ్యక్తి తనని తాను మహాత్ముడినని ప్రకటించుకొని ఊళ్ళో అందరికీ విరోధిగా తయారవుతాడు. ఊళ్ళో అందరూ ఇలా రకరకాల ఇక్కట్లతో సతమతం అవుతుంటే, ‘శాంతి’ సంజీవనిని తాగిన వ్యక్తి మాత్రం ఒక చెట్టు క్రింద కూర్చొని చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ అందరినీ మరింత అసహనానికి గురిచేస్తాడు. మరుసటి సంవత్సరం మళ్ళీ సంత జరుగుతుంది, టక్కరి బేహారి మళ్ళీ వస్తాడు కానీ ఊళ్ళోవాళ్ళు అతన్ని రానివ్వరు. ‘బహుమతంటే, ఒక పతకమో, ఫలకమో ఇవ్వాలి గాని, ఇవి మాత్రం వద్దు’ అని అతన్ని వెళ్ళగొడతారు.

నేనీ కథ రాయవచ్చు రాయకపోవచ్చు. ఇది హాస్యానికి చెప్పినట్టు ఉన్నా నేను చెప్పదల్చుకొన్న అసలు విషయం ఏమిటంటే మనం వేటినైతే సుగుణాలని అనుకొంటామో అవి అందరికీ అలానే కనిపించకపోవచ్చు. వారివారి పరిస్థితులను బట్టి, ఆయా గుణాల ప్రభావాలను బట్టి, మన సుగుణాలే ఇతరులకు దుర్గుణాలుగా కనిపించవచ్చు. ఇటాలో కాల్వినో పుస్తకం ది క్లోవెన్ విస్కౌంట్‌లో ఒక ఫిరంగిగుండు కథానాయకుణ్ని నిలువునా చీల్చేస్తుంది. శరీరపు రెండు ముక్కలూ బ్రతికే ఉంటాయి. ఒక వైద్యుడు ఈ రెండు శరీర భాగాలకు చికిత్స చేసి వాటిని బ్రతికేలా చేస్తాడు. అయితే, ఇప్పుడు ఆ కథానాయకుడు శారీరకంగానే కాక మానసికంగా, నైతికంగా కూడా రెండుగా విడిపోయాడని తెలుస్తుంది. ఒక భాగం ఎప్పుడూ పుణ్యకార్యాలే చేస్తుంది. ఒక భాగం పూర్తిగా పాపకృత్యాలే చేస్తుంది. అయితే ఈ రెండు భాగాలు చేసిన మంచి పనులు, చెడ్డపనులు కూడా దుష్ఫలితాలకే దారి తీస్తాయి. చివరకు ఈ రెండు శరీర భాగాలకు చికిత్స చేసిన వైద్యుడు ఆ రెండు భాగాలను కలిపి కుట్టేస్తాడు. శారీరకంగా ఏకమైన ఆ రెండు భాగాలలో ఇప్పుడు పుణ్య, పాప చిత్తాలు కలిసి సహవాసం చేస్తున్నాయి. ఇదే సామాన్య మానవుని అంతరంగం కూడా అని అర్థం చేసుకోవాలేమో.

ఇన్ని సంవత్సరాలుగా ‘స్వేచ్ఛ’ సీసాలోని సంజీవనినే తాగుతుండడం నా అదృష్టం. అందుకే నాకు తోచిన అంశాల మీద యథేచ్ఛగా పుస్తకాలు వ్రాయగలుగుతున్నాను. రచించడమే నేను ఎప్పుడూ చేయాలనుకొన్న పని. కొద్ది రోజుల్లో నేను నా 22వ పుస్తకాన్ని ప్రచురించబోతున్నాను. అంటే 21సార్లు నేను తాగిన ఈ సంజీవని నాకు మేలే చేసింది. ఒక్కసారి మాత్రం, నా నాలుగవ నవల ప్రచురించిన తరువాతనే ‘స్వేచ్ఛ’ని సేవించడం వల్ల సమస్యలు కూడా వస్తాయని నాకు — మనలో చాలా మందికి — తెలిసి వచ్చింది. అప్పుడే నాకు స్వేచ్ఛ ద్వారా ఎంత స్వాతంత్ర్యం పొందుతున్నామో, స్వేచ్ఛావ్యతిరేకుల నుండి అంతే ద్వేషాన్ని భరించవలసి ఉంటుందని తెలియవచ్చింది. నాలాగే, ‘స్వేచ్ఛ’ను తాగిన రచయితలు, ఇతర కళాకారులకు కూడా ఇది అనుభవేకవేద్యం. అయితే, ఈ చేదు అనుభవాల వల్ల స్వేచ్ఛ పట్ల గౌరవం, దానిని రక్షించుకోవాలన్న పట్టుదల మరింత పెరిగింది. అప్పటినుండి నా శాయశక్తులా నేను రచయితల, కళాకారుల స్వేచ్ఛ గురించే పోరాటం కొనసాగిస్తున్నాను. అయితే, ఒకొక్కప్పుడు ‘స్వేచ్ఛ’కు బదులు ‘శాంతి’ని తాగి ఉంటే, హాయిగా ప్రశాంతచిత్తంతో చిరునవ్వుతో బ్రతికేవాడిని కదా అని నాకు అనిపించిన రోజులు లేకపోలేదు. అయితే, ఆ బేహారి నాకు బహుమతిగా ఇచ్చినది కేవలం ‘స్వేచ్ఛ’ సంజీవని మాత్రమే.

మనం ఇప్పుడు చాలా చిత్రమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. నా జీవితకాలంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని నేను ఊహించలేదు. ముఖ్యంగా భావప్రకటనా స్వాతంత్ర్యం చాలా గడ్డు పరీక్షలు ఎదురుకుంటున్న కాలం ఇది. ప్రపంచంలో భావప్రకటనా స్వేచ్ఛ లేకపోతే ఇప్పుడు మనకు కనిపించే వైవిధ్యమైన పుస్తకప్రపంచమే ఉండేది కాదు. అటువంటి స్వేచ్ఛ ఇప్పుడు అన్ని వైపులనుండి ఒత్తిడులను ఎదుర్కొంటోంది. పలు దేశాల్లో అధికారం హస్తగతం చేసుకొంటున్న మతరాజకీయ శక్తుల నుండి, నిరంకుశ ప్రభుత్వాల నుండి, ప్రతిఘాతుక శక్తులనుండి, అరకొర విజ్ఞానంతో, అహంకారంతో విర్రవీగే స్వయంప్రకటిత ధర్మపరిరక్షక శక్తులనుండి వాక్స్వాతంత్ర్యం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. విద్యాలయాలు, పుస్తకాలయాలు, రచయితలు, ప్రచురణకర్తలు ఎందరో ఈ శక్తుల విద్వేషాన్ని, ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అన్ని వైపులనుండి అతివాదులు — మత దురభిమానంతోనో, సైద్ధాంతిక దురభిమానంతోనో — పెచ్చు రేగిపోయి సామాన్య జనజీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. సైద్ధాంతిక దురభిమానంతో వామపక్షీయులు కూడా వాక్స్వాతంత్ర్యాన్ని నియత్రించే ప్రయత్నాలు ఇదివరలో చేశారు, ఇప్పుడూ చేస్తున్నారు. కాబట్టి వాక్స్వాతంత్ర్యం ఇప్పుడు కుడి ఎడమల నుండి, సనాతనులు అధునాతనుల నుండి — అన్నివైపులనుండి — దాడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇంటర్‌నెట్ సమాచార సాధనాల ద్వారా ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఈ సామాజిక మాధ్యమాలలో ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చి చెప్పడం ఎంతటి వారికైనా క్లిష్టంగా తయారవుతోంది. ఈ మాధ్యమాల బిలియనీర్ అధినేతలు ఈ రకమైన సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టడంపై చిత్తశుద్ధి చూపించకుండా, అదుపులేని అబద్ధాల ప్రచారానికి ప్రోత్సాహాన్ని కలుగజేస్తూ, మితిలేని లాభాల వేటలో ప్రపంచ వ్యాప్తంగా మూకదాడులకు, అరాచక పరిస్థితులకు నిస్సిగ్గుగా దోహదం చేస్తున్నారు.

ఇంతగా దూషింపబడుతున్న వాక్స్వాతంత్ర్యం గురించి మనం ఏం చేయగలం? మరింత పట్టుదలతో మనం చేస్తున్న పనులను కొనసాగించాలి; చెడురాతలకు మంచిరాతలతో బదులు చెప్పాలి; తప్పుడు కథనాలను మరింత బలమైన కథనాలతో తిప్పికొట్టాలి; ద్వేషాన్ని ప్రేమతో సమాధానపరచగలగాలి; అబద్ధాల యుగంలో కూడా నిజమే చివరకు గెలుస్తుందని గాఢంగా నమ్మాలి. ముఖ్యంగా మనం ఏం చేసినా, మన వ్యతిరేకులు మనను ఎంతగా దుర్భాషలాడినా, మనను వ్యతిరేకించేవారి అభిప్రాయాన్ని వెలిబుచ్చగలిగే వాక్‌స్వేచ్ఛను మాత్రం మనం చివరివరకూ సమర్థించగలగాలి. ఈ విషయంలో నేను ప్రచురణకర్తలను ప్రత్యేకంగా అభినందించదల్చుకొన్నాను. మీరంతా మొక్కవోని ధైర్యంతో పలురకాలైన భావాలకు, భావనలకు వెలుగు చూపే అవకాశం కల్పిస్తున్నారు. మీకు అనేక ధన్యవాదాలు. ఐక సహస్రిక గళాల శత సహస్ర భావాలను వెలుగులోకి రానివ్వండి. (ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతః: అన్ని వైపులనుండి ఆలోచనలను రానిండు. – ఋగ్వేదం.)

కవి కవాఫీ (cavafy) మాటల్లో చెప్పాలంటే ‘మానవత్వం ఏమాత్రం లేని మానవులొస్తున్నారు.’ కాని, నాకు తెలిసిన విషయం ఏమిటంటే మానవీయ విలువలు, కళాదరణ తెలియని వారి కృత్యాలకు సమాధానం ఒక్కటే: మరింత మానవీయ విలువలతో కూడిన కళ. అనాగరికతకు నాగరికత సమాధానం అయినట్టే, నిష్కళాజీవులకు కళ సమాధానం కావాలి. ఈ సాంస్కృతిక యుద్ధంలో కళాకారులంతా — రచయితలు, గాయకులు, సినిమా కళాకారులతో సహా — భాగస్వాములు కావాలి. ఇక్కడ ఈ ఫ్రాంక్‌ఫర్ట్‌లో ప్రపంచ పుస్తకోత్సవంలో పాల్గొనే వారంతా ప్రపంచ సాహిత్యాన్ని చదివి, విమర్శించి, ప్రోత్సహించడం ద్వారా కూడా ఇందుకు దోహదం చేస్తున్నారు. మనమంతా కూడుకొని అమానుషులకు మానుషత్వం రుచి చూపిద్దాం.

నా ఉపన్యాసం ముగించే ముందు, నాపై 14 నెలల క్రితం జరిగిన దాడులను గర్హిస్తూ సంఘీభావాన్ని, మద్దతును ప్రకటిస్తూ జర్మనీలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ గొంతు వినిపించిన అనేకమంది స్వేచ్ఛాప్రియులకు, సాహిత్యాభిమానులకు నా ప్రగాఢమైన ధన్యవాదాలు. మీ మద్దత్తు వ్యక్తిగతంగా నాకూ నా కుటుంబానికి ఎంతో విలువైనది. వాక్స్వాతంత్ర్యాన్ని గాఢంగా నమ్మేవారు ప్రపంచం మూలమూలలా ఉన్నారని మీ మద్దతు వల్ల మాకు తెలియవచ్చింది. ఆగస్ట్ 12వ తేదీన జరిగిన దాడి తరువాత ఆగ్రహాన్ని, ఆందోళనను వ్యక్తపరచడం ద్వారా నాకు సంఘీభావం తెలుపడమే కాక, ఆ దాడి ఆధునిక స్వేచ్ఛాసమాజపు మూలస్తంభాలపైనే జరిగిన అతి దారుణమైన అనాగరికపు దాడిగా మీ అభిప్రాయాల ద్వారా స్పష్టం చేశారు. ఆనాటి దాడి నుండి వెల్లువెత్తిన స్నేహహస్తాల ఆదరణకు నేను సర్వదా కృతజ్ఞుడినై ఉంటాను. మీరంతా ముక్తకంఠంతో ఎలుగెత్తి చాటిన ఈ స్వేచ్ఛాసమాజపు మూలసూత్రాల పరిరక్షణకు నా శాయశక్తులా కృషి చేస్తూనే ఉంటాను.

ప్రస్తుతానికి నేను ఈ పురస్కారం అందుకొని ఇక మీనుండి సెలవు తీసుకొని తిరిగి ఇల్లు చేరిన తరువాత సమయం చేసుకొని మరీ ఈ ‘శాంతి’ సంజీవనిని చిద్విలాసంగా ఒక చెట్టునీడలో నిదానంగా సేవిస్తాను. అందరికీ ధన్యవాదాలు.


(ఈ ఉపన్యాసాన్ని నాకు అందజేసిన శ్రీనివాస్ పరుచూరిగారికి, నా అనువాదాన్ని ఓపికగా సమీక్షించి నాకు సూచనలను, సవరణలను అందజేసిన పద్మ ఇంద్రగంటిగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. – సురేశ్ కొలిచాల)