తెలుగు వ్యాకరణాల పరిచయం

“మానవ మేధస్సు సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి (one of the greatest monuments of human intelligence — Bloomfield)” అని ఆధునిక భాషవేత్తల చేత కొనియాడబడిన వ్యాకరణ గ్రంథం పాణిని రాసిన అష్టాధ్యాయి. ప్రపంచ వ్యాకరణాలన్నింటిలో ఇది తలమానికమైనది. అయితే, సంస్కృతంలో పాణిని కన్నా పూర్వం కూడా వ్యాకరణ సంప్రదాయాలుండేవని మనకు లభ్యమౌతున్న ఆధారాల ద్వారా మనకు తెలుసు. యాస్కాచార్యులు రచించిన నిరుక్తి గ్రంథం ద్వారా, పాణిని ప్రస్తావించిన వ్యాకరణాల ద్వారా ఐంద్ర, శకటాయన, శాకల్య, గార్గ్య మొదలైన ఇతర వ్యాకరణ సంప్రదాయాలుండేవని మనకు తెలుస్తుంది.

దక్షిణ భారతీయ భాషలలో తమిళంలో రాసిన తొల్కాప్పియం (=తొలి+కావ్యం) దేశభాషలలో వెలువడిన అతి ప్రాచీనమైన వ్యాకరణ గ్రంథంగా చెప్పుకోవచ్చు. తొల్కాప్పియంలో తమిళ భాషా వ్యాకరణాన్ని వర్ణించిన పద్ధతి సంస్కృతంలోని ఐంద్ర వ్యాకరణ సంప్రదాయానికి దగ్గరిగా ఉందని ఆధునిక భాషావేత్తల అభిప్రాయం. తొల్కాప్పియం రచనా కాలం క్రీ. శ. రెండవ శతాబ్దం నుండి క్రీ. శ. అయిదవ శతాబ్దం దాకా ఉండవచ్చని ఈ భాషావేత్తల ఊహ. కన్నడ భాషలో నృపతుంగ (అమోఘవర్ష ~ క్రీ. శ. 850) అనే రాష్ట్రకూట రాజు రాసిన ‘కవిరాజమార్గ’ అన్న కావ్యం మొట్టమొదటి లాక్షణిక గ్రంథంగా వారు భావిస్తారు.

మరి తెలుగులో వ్యాకరణాల మాటేమిటి? వ్యాకరణం అనగానే మనకు చిన్నయసూరి బాలవ్యాకరణం గుర్తుకు వస్తుంది. చిన్నయసూరి బాలవ్యాకరణం 1858లో ప్రచురితమయ్యింది. అయితే, బాలవ్యాకరణం కన్నా ముందు వచ్చిన తెలుగు వ్యాకరణ గ్రంథాల గురించి చాలామందికి తెలియదు. పాణిని తనకన్నా ముందు వచ్చిన వ్యాకరణాల గురించి ప్రస్తావించినట్టుగా, చిన్నయసూరి ఎందుకో తనకంటే పూర్వం వెలువడిన వ్యాకరణాలను ప్రస్తావించలేదు. కానీ, తెలుగులో కూడా వ్యాకరణ గ్రంథాలు కవిత్రయ కాలం నుండీ వెలువడుతూ ఉన్నాయి. చిన్నయసూరి కన్నా పూర్వం వెలువడిన ప్రాచీన తెలుగు వ్యాకరణ గ్రంథాలలో ముఖ్యమైన కొన్నింటిని స్థూలంగా పరిచయం చెయ్యడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

1. ఆంధ్రశబ్దచింతామణి –- నన్నయ్య(?)

ఎనభైయారు శ్లోకాలతో సంస్కృతంలో రాసిన ఈ వ్యాకరణ గ్రంథం మొట్టమొదటి తెలుగు వ్యాకరణమని చిన్నయసూరితో సహా చాలామంది పండితులు పేర్కొన్నారు. నన్నయ్య మహాభారత రచనకు పూనుకొని, ముందుగా తెలుగు వ్యాకరణాన్ని సంస్కృతంలో రచించి ఆ తరువాత భారతరచన కొనసాగించాడని వీరు చెబుతారు. అప్పకవి కాలానికి ఇందులో ఎనభైరెండు శ్లోకాలు మాత్రమే దొరికాయట. ఇందులో సంజ్ఞ, సంధి, అజంతాలు, హలంతాలు, క్రియ అని అయిదు విభాగాలు ఉన్నాయి. అయితే, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, 17వ శతాబ్దానికి చెందిన బాలసరస్వతి ఈ గ్రంథంపై వ్యాఖ్యానం రాసేంతవరకూ పూర్వ కవులు, లాక్షణికులెవరూ ఈ వ్యాకరణ గ్రంథం గురించి ప్రస్తావించలేదు. ఇది నన్నయ్య భట్టారకుడు రాసింది కాదని బాలసరస్వతే వ్యాకరణ గ్రంథము, టీకా రాసి దానికి ప్రాచీనత ఆపాదించడానికని నన్నయ్యకు కర్తృత్వం అంటగట్టాడని వాదిస్తూ 1917లో వీరేశలింగం ఒక వివాదం లేవనెత్తాడు. 13వ శతాబ్దానికి చెందిన కేతన తన ఆంధ్రభాషాభూషణము అన్న వ్యాకరణగ్రంథంలో అంతవరకూ తెలుగు భాషా లక్షణాలు వివరించే వ్యాకరణ పుస్తకాలు లేవని పేర్కొడడం వీరేశలింగం వాదానికి ఊతమిస్తుంది. ఆంధ్రభాషాభూషణము లోని 5వ పద్యం చూడండి:

మున్ను తెనుఁగునకు లక్షణ
మెన్నఁడు నెవ్వరును జెప్ప రేఁ జెప్పెద వి
ద్వన్నికరము మది మెచ్చఁగ
నన్నయభట్టాది కవిజనంబుల కరుణన్

ఎవ్వరూ ఇంతకు ముందు తెలుగునకు లక్షణం చెప్పలేదు. పండితవర్గము మెచ్చుకొనునట్లు నేను తెలుగుభాషా లక్షణాన్ని వివరిస్తాను, నన్నయభట్టు వంటి కవిజనంబుల కరుణతో.

అంటే నన్నయ్య ఒకవేళ ఆంధ్రశబ్దచింతామణి రాసి ఉంటే ఆ విషయం కేతనకు తెలియదన్నమాట. అంతేకాక, 16వ శతాబ్దంలో రాఘవపాండవీయ కావ్యానికి ముద్దరాజు పెద్దరామన రాసిన వ్యాఖ్యానంలో అప్పటివరకూ వచ్చిన తెలుగు భాషా లక్షణ గ్రంథాలన్నింటినీ పేర్కొన్నాడు. అయితే, ఈ జాబితాలో ఆంధ్రశబ్దచింతామణి లేదు.

అలాగే, ఆంధ్రశబ్దచింతామణిలో ఉన్న కొన్ని సూత్రాలకు మహాభారతంలో నన్నయ్య వాడుకకు మధ్య వైరుద్ధ్యం కనిపిస్తుంది. ఉదాహరణకు, ఆంధ్రశబ్దచింతామణిలో సంధి విభాగంలో ‘ఇ-కారాంత అనుత్తమ పురుష క్రియారూపాలకు సంధి నిత్యం’ (నిత్యం అనుత్తమపురుషక్రియాస్వితః) అని నాలుగో శ్లోకం చెబుతుంది. అయితే, మనకు మహాభారతంలోని అరణ్యకాండలో “అంతఁ గొందరధిక హాస్యంబు చేసిరి యడవిన్ (2.103)” అన్న పద్యంలో ‘చేసిరడవిన్’ అనకుండా ‘చేసిరి యడవిన్’ అన్న విసంధి కనిపిస్తుంది. అలాగే, అర్వాచీనమైన -ఉన్న, -కల అన్న ప్రత్యయాల గురించి ఆంధ్రశబ్దచింతామణిలో ఉంటే వాటి వాడుక మహాభారతంలో దాదాపు మృగ్యం. అలాగే, మహాభారతంలో తరచుగా కనిపించే -అయ్యెడున్, -అయ్యెడిన్ అన్న ప్రత్యయాల ప్రస్తావన ఆంధ్రశబ్దచింతామణిలో ఎక్కడా కనబడదు. ఈ ఆధారాలను బట్టి చూస్తే, ఈ గ్రంథం వీరేశలింగం పంతులు చెప్పినట్లుగా నన్నయ్య రాయలేదని, తరువాతి కాలంలో ఎవరో రాసి దీని గ్రంథకర్తృత్వం నన్నయ్యకు కట్టబెట్టారన్న వాదనే సబబనిపిస్తుంది. అయితే, ఇందులో కొన్ని శ్లోకాలు మాత్రం అతి ప్రాచీనమైనవిగా కనిపిస్తాయని ప్రముఖ భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి గారి అభిప్రాయం.

2. కవిజనాశ్రయము –- మల్లియ రేచన (11వ శతాబ్దం)

పదకొండవ శతాబ్దానికి చెందిన మల్లియ రేచన రాసిన కవిజనాశ్రయము మనకు లభ్యమౌతున్న తెలుగు లాక్షణిక గ్రంథాలలో అతి ప్రాచీనమైనది. ఇది నిజానికి తెలుగు ఛందస్సులను వివరించే పుస్తకమే గానీ తెలుగు భాషా లక్షణాలను వివరించే వ్యాకరణ గ్రంథం కాదు. ఈ గ్రంథాన్ని వేములవాడ భీమకవి రచించాడని కొందరి అభిప్రాయం. గత శతాబ్దంలో ఈ గ్రంథాన్ని పరిష్కరించిన జయంతి రామయ్య పంతులు దీన్ని వేములవాడ భీమకవి పేరుతోనే ప్రచురించాడు.

3. అథర్వణకారికావళి –- అథర్వణుఁడు(?)

సంస్కృతంలో రాసిన ఈ వ్యాకరణ గ్రంథాన్ని 13వ శతాబ్దానికి చెందిన అథర్వణుఁడు రాసాడని అంటారు. ఆంధ్రశబ్దచింతామణిలాగే దీన్ని కూడా తరువాతి కాలంలో రాసి ప్రాచీనత కోసం అథర్వణుఁడికి అంటగట్టారని వీరేశలింగం వాదించాడు. 17వ శతాబ్దానికి చెందిన అహోబలుఁడు రచించిన అహోబలపండితీయములోనే ఈ వ్యాకరణంలోని శ్లోకాల ప్రస్తావన మొదటి సారి కనిపిస్తుంది. ఇందులోని సూత్రాల ఆధారంగా ఈ వ్యాకర్తకు పరిచయమున్న తెలుగు లిపి 15వ శతాబ్దానికి చెందిందని చెప్పవచ్చు. అలాగే, శ్లేష వాడుతున్నప్పుడు ప్రాసస్థానంలో అరసున్నాల ఒప్పుదల లేకపోయినా పరవాలేదని చెప్పడం రాఘవపాండవీయం వంటి ద్వ్యర్థి కావ్యాలను దృష్టిలో పెట్టుకొని రాసినట్టు కనిపిస్తుంది. మరికొన్ని వ్యాకరణసూత్రాలు కృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యదను సమర్థించడానికి రాసినట్టు అనిపిస్తాయి. అయితే, ఈ వ్యాకరణం లోని సూత్రాలను కొన్నింటిని అహోబలుడు విమర్శించిన తీరు చూస్తే, ఈ గ్రంథాన్ని అహోబలుడే రాసి ఉండకపోవచ్చని, అప్పకవికి, అహోబలుడికి మధ్య కాలంలో ఎవరైనా రాసి ఉండవచ్చని అనిపిస్తుంది.

4. ఆంధ్రభాషాభూషణము –- కేతన (13వ శతాబ్దము)

పైన చెప్పిన రెండు వ్యాకరణ గ్రంథాలు –- ఆంధ్రశబ్దచింతామణి, అథర్వకారికావళి –- తరువాతి కాలంలో రాసినవని అనుకుంటే, కేతన రాసిన ఆంధ్రభాషాభూషణమే మొట్టమొదటి తెలుగు వ్యాకరణ గ్రంథమౌతుంది. దశకుమార చరిత్ర, విజ్ఞానేశ్వరీయము వంటి కావ్యాలను రచించిన కేతనకు అభినవ దండి అన్న బిరుదు కూడ ఉంది. తిక్కనకు సమకాలికుడైన మూలఘటిక కేతన, తిక్కనపై అభిమానంతో తన దశకుమారచరిత్రను ఆయనకే అంకితమిచ్చాడు.

ఇంతకుముందే చెప్పినట్టు తెలుగు వ్యాకరణాన్ని రాయడంలో తనదే మొదటి ప్రయత్నమన్న ఊహ కేతనకు ఉంది. అంతకుముందు ఎవ్వరూ తెలుగు వ్యాకరణంపై రాయకపోవడం గురించి తరువాతి పద్యంలో ఇంకా ఇలా అంటాడు:

సంస్కృత ప్రాకృతాది లక్షణముఁ జెప్పి
తెనుఁగునకు లక్షణముఁ జెప్ప కునికి యెల్లఁ
గవిజనంబుల నేరమి గాదు నన్ను
ధన్యుఁ గావింపఁ దలఁచినతలఁపుగాని

సంస్కృతం, ప్రాకృతం వంటి భాషల లక్షణాలు వివరించే వ్యాకరణ గ్రంథాలున్నాయి కాని తెలుగుకు లక్షణ గ్రంథం లేకపోవడం పూర్వ కవుల నేరం కాదు. నన్ను ధన్యుడిని చెయ్యడానికే వారు ఈ పనిని నాకోసం వదిలివేశారు.

అందుకే, చాలా వినమ్రంగా తప్పులుంటే మన్నింపుమని కవులను వేడుకుంటాడు:

ఒప్పులు గల్గిన మెచ్చుఁడు
తప్పులు గల్గిన నెఱింగి తగ దిద్దుఁడు త-
ప్పొప్పునకుఁ దొప్పు తప్పని
చెప్పకుఁడీ కవులుపాస్తి చేసెద మిమ్మున్

అలాగే, తెలుగుభాషకు పలు దారులున్నాయని తాను ఒక త్రోవ మాత్రమే చూపెడుతున్నానని వినయంగా విన్నవించుకొంటాడు:

కంచి నెల్లూరు మఱి యోరుగల్లయోధ్య
యను పురంబులపై గంగ కరుగుమనిన
పగిది నొకత్రోవఁ జూపెద బహుపథంబు
లాంధ్ర భాషకు గలవని యరసికొనుఁడు

కంచి, నెల్లూరు, ఓరుగల్లు, అయోధ్యల మీదుగా వెళితే గంగ వస్తుంది అని దారిచెప్పినట్టుగ తెలుగు వ్యాకరణానికి తనకు తెలిసిన ఒక దారి మాత్రమే చెబుతున్నానన్నాడు.

“తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు” అని ఆ రోజుల్లో లోకోక్తి. ఆ లోకోక్తిని తన పద్యాలలో కూడా వాడుకున్నా కేతనకు తెలుగు భాషకు, సంస్కృత భాషకు వ్యాకరణ నిర్మాణంలో ఉన్న తేడాలు బాగా తెలుసు. అందుకే తెలుగుకు తనదైన వ్యాకరణం కొంత ఉందని చెబుతూ (“కొంత తాన కలిగె”), తెలుగులో ఉన్న సంధులు, విభక్తులు, క్రియలలో ఉన్న తేడాలు వివరిస్తానంటాడు.

తెలుగున గల భేదంబులుఁ
తెలుగై సంస్కృతము చెల్లు తెఱఁగులుఁ దత్సం
ధులును విభక్తులు నయ్యై
యలఘుసమాసములుఁ గ్రియలు నవి యెఱిఁగింతున్

తను అభిమానించిన తిక్కనలాగే కేతన కూడా అచ్చతెలుగుకు పెద్దపీట వేశాడు. సంస్కృత వ్యాకరణ సంప్రదాయాలకు చెందిన పదాలను అంతగా వాడకుండా, తేలికైన మాటలతో, సరళమైన భాషలో క్లిష్టమైన భావాలను వివరించడంలో తిక్కనలాంటి ప్రజ్ఞే కేతనది కూడాను. వ్యాకరణ విషయాల వివరణలోనూ సంస్కృత వ్యాకరణాలను గుడ్డిగా అనుసరించలేదు. ఉదాహరణకు ఇతర వ్యాకర్తలు సంస్కృతభాషానుగుణంగా –కి, -కు అన్న విభక్తి ప్రత్యాలను యొక్క మొదలైన ప్రత్యయాలతో కలిపి షష్టీ విభక్తిగా వివరిస్తే, కేతన –కి, -కు లను చతుర్థీ విభక్తిగా, -యొక్క ప్రత్యయాన్ని షష్టీ విభక్తిగా వర్ణించాడు. నూట అరవై సంవత్సరాల క్రితం రాసిన చిన్నయసూరి బాలవ్యాకరణం కంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కేతన రాసిన వ్యాకరణ గ్రంథాన్ని ఏ వ్యాఖ్యాన వివరణల సహాయం లేకుండానే కొంత ప్రయత్నంతో అర్థంచేసుకోవచ్చు అంటే అతిశయోక్తి కాదేమో.

5. కావ్యాలంకార చూడామణి –- విన్నకోట పెద్దన (14వ శతాబ్దం)

14వ శతాబ్దానికి చెందిన విన్నకోట పెద్దన రచించిన ఈ లక్షణ గ్రంథంలో మొదటి ఆరు అధ్యాయాలు కావ్య లక్షణాల గురించి, తరువాతి రెండు అధ్యాయాలు ఛందస్సు గురించి ఉంటాయి. తొమ్మిదో అధ్యాయంలో పెద్దన తెలుగు వ్యాకరణాన్ని 171 పద్యాలలో వివరిస్తాడు. “ఆంధ్రభాషయున్ బ్రాకృతాన్వయ”మని ఆంధ్రభాషకు ప్రాకృతమని మరో పేరు కలదని చెప్పుతాడు. తెలుఁగు అన్న పదం త్రిలింగ శబ్దభవమన్న ప్రతిపాదన కూడా మొదటిసారి ఈ వ్యాకరణంలోనే కనిపిస్తుంది.

తత్త్రిలింగపదము తద్భవమగుటచేఁ
దెలుఁగుదేశమనఁగఁ దేటపడియె
వెనుకఁ దెనుఁగుదేశమునునండ్రు కొందఱ
బ్బాస పంచగతులఁ బరగుచుండు (9.6)

6. ఛందోదర్పణము –- అనంతామాత్యుడు (15వ శతాబ్దం)

పదిహేనవ శతాబ్దానికి చెందిన ఈ గ్రంథంలో ఛందస్సే ప్రధానాంశమయినా నాలుగో ఆశ్వాసంలో కొంత వ్యాకరణ చర్చ కనిపిస్తుంది. మొదటి ఆశ్వాసంలో గురువు, లఘువు, యతి/వళి, ప్రాస అన్న పదాల నిర్వచనంతో పాటు కవిత్వతత్త్వ చర్చతో ఈ గ్రంథం ప్రారంభమౌతుంది. రెండవ ఆశ్వాసంలో అనంతుడు సంస్కృత ఛందస్సులను, మూడవ ఆశ్వాసంలో తెలుగు ఛందస్సులను వివరిస్తాడు. నాలుగో ఆశ్వాసంలో కొత్తగా పద్యాలు రాస్తున్న యువకవులు తఱచుగా చేసే తప్పులను వివరించే క్రమంలో వ్యాకరణాన్ని చర్చిస్తాడు.

సంస్కృత సంధులను ఉదాహరణలతో సహా విపులంగా చర్చించడం ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత.

7. కవిచింతామణి –- వెల్లంకి తాతంభట్టు (15వ శతాబ్దం)

ఛందస్సును, వ్యాకరణాన్ని నాలుగు అధికరణాలలో చర్చించిన ఈ గ్రంథం కూడా 15వ శతాబ్దానికి చెందింది. ఇందులో చర్చించిన ప్రతి సూత్రానికి పాతకావ్యాల నుండి ఉదాహరణలను ఉటంకించి చర్చించడం ద్వారా ఈయన తెలుగు వ్యాకరణ సంప్రదాయంలో ఒక కొత్త ఒరవడిని ప్రారంభించాడు. అప్పకవి వంటి తరువాతి వైయాకరణుఁలంతా సూత్రచర్చకు ఇదే పద్దతి పాటించారు. తరువాతి లాక్షణికులు ఎంతగానో ప్రశంసించిన ఈ గ్రంథం మనకు పూర్తిగా లభ్యం కాకపోవడం మన దురదృష్టం.

8. కవిజనసంజీవని –- ముద్దరాజు రామన్న (16వ శతాబ్దం)

16వ శతాబ్దానికి చెందిన ముద్దరాజు రామన్న రచించిన ఈ గ్రంథం కూడా పూర్తిగా దొరకడం లేదు. మనకు లభ్యమౌతున్న నాలుగు తరంగాలలో ఈయన తాతంభట్టు ఒరవడినే కొనసాగిస్తూ ప్రతి సూత్రానికి ఉదాహరణలిచ్చాడు. అయితే, ఈయన ఉదాహరణల కోసం ఎక్కువగా కవిత్రయం రాసిన మహాభారతం మీదే ఆధారపడడం విశేషం.

9. బాలసరస్వతీయము –- బాలసరస్వతి (17వ శతాబ్దం)

నన్నయ్య రాసినట్టుగా చెప్పబడే ఆంధ్రశబ్దచింతామణికి బాలసరస్వతీయము తెలుగు వచనంలో వ్యాఖ్యానాన్ని అందిస్తుంది. బాలసరస్వతిగా పేరుపొందిన ఈ గ్రంథకర్త అసలు పేరు ఎలకూచి వేంకటకృష్ణయార్యుఁడు. అంతకు ముందు చర్చించినట్టుగా ఆంధ్రశబ్దచింతామణి యొక్క మొట్టమొదటి ప్రస్తావన ఈ కావ్యంలోనే కనిపిస్తుంది. మతంగ పర్వతం నుండి వచ్చిన ఒక సిద్ధుడు ఆంధ్రశబ్దచింతామణిని నన్నయ్య రచనగా తనకు బహూకరించాడని, తనను టీక రాయమని చెప్పాడని ఉపోద్ఘాతంలో ఆయనే స్వయంగా చెప్పుకున్న కథ: “పెక్కు వత్సరముల్ అంతర్భూతమై యున్న యీ తెలుఁగువ్యాకరణంబు నాకొసఁగెఁ బ్రీతిన్ డీక గావింపుమంచల సిద్ధుడు”. ఈయన గ్రంథమే అప్పకవికి, అహోబలపతికి స్ఫూర్తి.

10. అప్పకవీయము –- అప్పకవి (క్రీ. శ. 1656)

తెలుగు వ్యాకరణాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన గ్రంథం అప్పకవీయము. అప్పకవి తన గ్రంథంలోనే చెప్పుకున్నట్లు, ఆయన శాలివాహన శకం 1578లో (అంటే క్రీ. శ. 1656లో) ఈ గ్రంథ రచనకు శ్రీకారం చుట్టాడు. నిజానికి ఇది ఆంధ్రశబ్దచింతామణికి వ్యాఖ్యాన గ్రంథం. ఆంధ్రశబ్దచింతామణిలో స్థూలంగా చెప్పిన సూత్రాలను విస్తారమైన వ్యాఖ్యానాలతో వివరించడం వల్ల ఈ గ్రంథం గొప్ప ప్రామాణికతను సంతరించుకొంది. తెలుగు కవుల అసాధు ప్రయోగాలను, ఇతర వైయాకరణుల గ్రంథాలలో తనకు నచ్చని అంశాలను పరుషంగా విమర్శించడంలో అప్పకవి ఏ మాత్రం వెనుకాడలేదు.

ఉదాహరణకు అనంతుడు తెలుగులో వర్ణాలను వివరిస్తూ క్ష-కారాన్ని ప్రత్యేక వర్ణంగా పేర్కొన్నాడు కాని, ళ-కారాన్ని పేర్కొనలేదు. తెలుగులో ప్రత్యేకాక్షరమైన ళ- ను వదిలిపెట్టి, కకార షకారాల సంయుక్తాక్షరమైన క్ష- ను ప్రత్యేక వర్ణంగా చెప్పడంపై ఆక్షేపణ తెలుపుతూ అప్పకవి ఇలా అంటాడు:

ఆగమజ్ఞులు దొడ్డ బీజాక్షరంబు
లందు లేకున్కి సన్నంబు నదియుఁగూడ
నొకటిగాఁ జేసి బీజోపయోగి గాన
క్షాను జేకొనిరది శబ్దసరణి గాదు

కాకు షా జడ్డయైన క్షకారమగుట
దలపకేఁబదిలిపులలోఁ దానిఁగూర్చి
తొలుత భిన్నాక్షరంబైన దొడ్డళాను
విడిచిపెట్టె ననంతుడు వెఱ్ఱిగాఁడె (అప్పకవీయము, ద్వితీయాశ్వాసము 67-71)

అలాగే, శ్రీనాథుడు శృంగారనైషధంలో “కూర్చుండిరి యొండొరున్ గదిసి” అన్న పద్యపాదంలో ఇ-కారాంత ప్రథమపురుష క్రియారూపమైన కూర్చుండిరి అన్న పదాన్ని తరువాతి పదం ఒండొరున్’తో సంధి చేయకపోవడాన్ని విమర్శిస్తూ ఇలా అంటాడు:

విరచించెను శ్రీనాథుఁడు
ధరణిని శృంగారనైషధంబునఁ ‘గూర్చుం-
డిరి యొండొరున్’ అని గానక
పరపురుషక్రియల బ్రకృతిభావము గలదే?

అయితే, ఇ-కారాంత క్రియారూపాలతో సంధి చేయని ప్రయోగాలు మహాభారతంలోనూ కనిపిస్తాయని అప్పకవి గుర్తించలేదు. పైన చెప్పినట్లు నన్నయ్య రాసిన అరణ్యపర్వంలో “అంతన్ గొందరధికహాస్యంబు చేసిరి యడవిన్” అన్న విసంధి కనిపిస్తుంది. అలాగే, తిక్కన రాసిన ఉద్యోగ పర్వంలోనూ “చేసిరియంత చేసియును” “కొడుకనిరి యెల్లవారలు వినగన్” అన్న ప్రయోగాలు కనిపిస్తాయి.

11. ఆంధ్రకౌముది –- గణపవరపు వేంకటకవి (క్రీ. శ. 1674)

సంస్కృత వ్యాకరణాన్ని వివరిస్తూ భట్టోజీ దీక్షితులు రచించిన సిద్ధాంత కౌముది గ్రంథం స్ఫూర్తిగా రాసిన తెలుగు వ్యాకరణ గ్రంథం ఆంధ్రకౌముది. అంతకు ముందు వైయ్యకరణులు అసాధు ప్రయోగాలుగా తిరస్కరించిన కోరడము, తోఁపడము వంటి మాటలను సాధువులుగా వర్ణిచడం ఈ గ్రంథం ప్రత్యేకత.

12. అహోబలపండితీయము –- అహోబల పండితుడు (17-18వ శతాబ్దము)

ఆంధ్రశబ్దచింతామణి, అథర్వకారికావళి, నన్నయ్యభట్టు రాసిన మహాభారత పర్వాలు మాత్రమే ప్రమాణంగా స్వీకరించి తరువాతి కవుల ప్రయోగాలలో ఎన్నో తప్పులను ఎత్తి చూపిస్తూ వ్యాకరణసూత్రాలను కూలంకషంగా చర్చించే గ్రంథం ఇది. 17వ శతాబ్దపు చివరిభాగంలో, 18వ శతాబ్దపు తొలినాళ్ళలోనూ ఈ గ్రంథాన్ని రచించిన అహోబలపతి సంస్కృతాంధ్ర భాషలలో మహా పండితుడు. ఈయనకు కవిమహోపాధ్యాయ భట్టారక, అభినవ నన్నయ భట్టారక అన్న బిరుదులు ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పినట్టుగా అథర్వకారికావళి అన్న గ్రంథ ప్రస్తావన మొదటిసారి ఈయన రచనలోనే కనిపిస్తుంది. అథర్వకారికావళి అన్న వ్యాకరణాన్ని ఈయన గాని, ఈయన మేనమామ అయిన పోలూరి మాధవ సోమయాజి గాని రచించి ఉండవచ్చునని కొందరి ఊహ.

13. లక్షణసార సంగ్రహము –- కూచిమంచి తిమ్మకవి (క్రీ. శ. 1740)

మిగిలిన వ్యాకరణ గ్రంథాలలో ఛందస్సు, కావ్యలక్షణాలపై చర్చ ప్రథాన స్థానం ఆక్రమిస్తే, కూచిమంచి తిమ్మకవి రాసిన లక్షణసార సంగ్రహములోని నాలుగు ఆశ్వాసాల్లోనూ భాషా, వ్యాకరణాలపైనే చర్చ కనిపించడం విశేషం. వ్యాకరణ సూత్రలకు విరుద్ధంగా ఉన్నాయనిపించే పూర్వకవుల ప్రయోగాలను సరిదిద్దే ప్రయత్నాలను విమర్శించిన మొట్టమొదటి వ్యాకర్త ఈయన అని చెప్పవచ్చు. అహోబలపతి విమర్శించిన శ్రీనాథుడిని ప్రయోగాన్ని, అప్పకవి, ముద్దరాజు రామన్న విమర్శించిన పోతన ప్రయోగాలను ఈయన సమర్థించాడు. ర-, ఱ- తో అర్థభేదం వచ్చే జంటపదాలను చర్చించడానికి ఈయన ఒక పూర్తి ఆశ్వాసాన్ని వినియోగించాడు.

14. కవిసంశయవిచ్ఛేదము –- ఆడిదం సూరకవి (18వ శతాబ్దం)

ముద్దరాజు రామన్న రచించిన కవిజనసంజీవనికి అనుబంధంగా వెలువడిన రచన. మూడు తరంగాలు (chapters) ఉన్న ఈ గ్రంథంలో మొదటి తరంగంలో కవిజనసంజీవనిలో చర్చించని వ్యాకరణాంశాలపై వివరణ కనిపిస్తుంది. రెండవ తరంగంలో ర-, ఱ-ల మధ్య భేదాన్ని గురించిన చర్చ, మూడవ తరంగంలో సంస్కృత తద్భవాల వ్యుత్పత్తి గురించిన చర్చ కనిపిస్తుంది. కాలానుగుణంగా భాషలలో కలిగే మార్పుల విషయంలో ప్రాచీనులెవరూ చూపించని ఉదారతత్త్వం ఈ గ్రంథంలో కనిపించడం విశేషం.

15. చిన్నయసూరి బాలవ్యాకరణం (1858)

ఇప్పటిదాక వచ్చిన అన్ని వ్యాకరణ పుస్తకాలకంటే అతి సమగ్రమైన వ్యాకరణ గ్రంథం చిన్నయ సూరి రచించిన బాలవ్యాకరణం. ఈ వ్యాకరణ పుస్తకం రాయడానికి ముందు దాదాపు పద్ధెనిమిది సంవత్సరాలుగా ఆయన సమగ్ర తెలుగు వ్యాకరణగ్రంథాన్ని తీసుకురావడానికి ఎంతగానో శ్రమించారు. 1840 నుండి ఆయన వెలువరించిన పుస్తకాలు సమగ్ర వ్యాకరణ గ్రంథరచన కోసం ఆయన చేసిన కృషికి తార్కాణాలుగా నిలుస్తాయి. 1840లో పద్యాంధ్రవ్యాకరణము అన్న చిన్న వ్యాకరణ పుస్తకాన్ని ఆయన ప్రచురించారు. ఆపై 1842లో సంస్కృత సూత్రాలతో సూత్రాంధ్రవ్యాకరణమ్ అన్న పుస్తకం ప్రచురించినట్లు మనకు తెలుస్తుంది. ఈ సూత్రాలనే తెలుగులోకి అనువాదం చేసి శబ్దశాసనము అన్న పేరుతో ఆయన 1844లో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ఎంతగానో విస్తరించి అయిదు అధ్యాయాలతో శబ్దలక్షణసంగ్రహము అన్న పేరుతో 1853లో ప్రచురించారు. ఆపై పది అధ్యాయాలతో ప్రచురించిన ‘బాలవ్యాకరణం’ 1858లో వెలువడింది.

16. హరికారికావళి –- శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి (1864)

చిన్నయ సూరి బాలవ్యాకరణం వెలువడిన తరువాత అది చిన్నయసూరి స్వంత రచన కాదని శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి సంస్కృతంలో రచించిన హరికారికావళి అన్న ఆంధ్ర వ్యాకరణగ్రంథానికి ముక్కస్య-ముక్క అనువాదమని ఒక వివాదం తలెత్తింది. ఇది వేంకటరామశాస్త్రి 1864లో ప్రచురించిన గుప్తార్థప్రకాశికలో అనుబంధంగా ఉంది. శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారి మనమడు హరికారికావళి తాళపత్రాల ప్రతిని అందజేస్తే అది చదివిన వేంకటరామశాస్త్రి బాలవ్యాకరణం చిన్నయసూరి సొంతం కాదని, సంస్కృతంలోని హరికారికావళిని చౌర్యం చేసి తెలుగులో ప్రచురించాడని వాదించాడు. తన వాదనను సమర్థించుకోవడానికి ఆయన పధ్నాలుగు అంశాలను ఎత్తిచూపుతూ, చివరకు ‘పరవస్తు చిన్నయసూరి’ అన్న పేరును పర+వస్తు+చిత్+నయ+సూరి అని విడదీసి పరుల వస్తువులను, జ్ఞానాన్ని(=చిత్) నయం చేయడంలో (=తస్కరించడంలో) నేర్పరి (=సూరి) అంటూ అర్థం చెబుతూ ఎద్దేవా చేశాడు. హరికారికావళి తాళపత్రాల ప్రతి కాకినాడలోని ఆంధ్రసాహిత్య పరిషత్తులో భద్రపరిచి ఉన్నది. అయితే, ఈ వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన వేదం వేంకటరమణశాస్త్రి, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన పండితులంతా చిన్నయసూరి బాలవ్యాకరణం ఆయన సొంతమేనని, వ్యక్తిగత కారణాలవల్ల ఆయనపై అసూయతో శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి, వేంకటరామశాస్త్రిగార్లే లేని సంస్కృత వ్యాకరణాన్ని సృష్టించి ఈ దుష్ప్రచారానికి ఒడిగట్టారని నిరూపించారు.

17. ప్రౌఢ వ్యాకరణము –- బహుజనపల్లి సీతారామాచార్యులు (1885)

చిన్నయసూరి రాసిన బాలవ్యాకరణానికి అనుబంధంగా రాసిన ఈ గ్రంథానికి త్రిలింగ లక్షణశేషమన్న పేరు కూడా ఉంది.

ఇవే కాక, ఇంగ్లీషులో విలియమ్ కేరి (1814), అలగ్జాండర్‌ క్యాంప్‌బెల్‌ (1820), సి. పి. బ్రౌన్ (1857), ఆల్బర్ట్ ఆర్డెన్ (1873) వంటి పాశ్చాత్యులు రాసిన వ్యాకరణాల నుండి ఆధునిక భాషాశాస్త్ర దృక్పథంతో ప్రముఖ భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి, గ్విన్ (1985) రాసిన వ్యాకరణం వరకూ గత రెండు శతాబ్దాల కాలంలో ఎన్నో తెలుగు వ్యాకరణ పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఈ ఆధునిక వ్యాకరణ గ్రంథాల గురించి మరింకెప్పుడైనా చర్చించుకుందాం.


ఆధారాలు.

  1. Balavyakaranamu of Paravastu Cinnaya Suri, P. S. Subrahmanyam, 2002.
  2. Andhra Bhaashaa Bhuushanamu, Mulaghatika Ketana, Translated by Usha Devi Ainavolu, 2009.
  3. అప్పకవీయము, కాకునూరి అప్పకవి (17వ శ.), పరిష్కర్త: యద్దనపూడి సంజీవయ్య, 1901.
  4. Discussions with Prof. Bh. Krishnamurti and Prof. Velcheru Narayana Rao.