గణానాం త్వా గణపతిం – తెలుగు అనువాదం

బృహస్పతి సూక్తము – ఋగ్వేదం 2వ మండలము 23వ సూక్తము

  1. గ॒ణానాం॑ త్వా గ॒ణప॑తిం హవామహే క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్ ।
    జ్యే॒ష్ఠ॒రాజం॒ బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒ ఆ నః॑ శృ॒ణ్వన్నూ॒తిభిః॑ సీద॒ సాద॑నమ్ ॥ (2.23.1)

    పదచ్ఛేదం:
    గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ ।
    జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనమ్ ॥

    టీకా:
    గణానామ్=గణములకు; గణపతిమ్=గణపతివైన; త్వా=నిన్ను; హవామహే=ఆహ్వానించు చున్నాము; కవీనాం కవిన్=కవులకు గవివైన; ఉపమశ్రవస్తమమ్=ఉపమింపదగినవారిలో నుత్తముడవైన; జ్యేష్ఠరాజమ్=ప్రశస్యతములైన వారిలో విరాజమానుడవైన; బ్రహ్మణానామ్= మంత్రములయందు; బ్రహ్మణస్పతే=పతియైన; నః = మాదు (ప్రార్థనలు); ఆ శ్రుణ్వన్= వినుచు, ఊతిభిః=మాపాలనకై; సాదనమ్=(యజ్ఞ)సదనమును; ఆసీద=ప్రవేశించుమనుచు;

    భావం: (ఓ బృహస్పతీ!) గణములకు నీవు గణపతివని, కవులలో నీవు కవివని, ఉపమ శ్రవులందు ఉత్తముడవని, జ్యేష్ఠరాజువని, బ్రహ్మణములకు నీవు బ్రహ్మణస్పతివని, మా ప్రార్థనలు విని మమ్ము బ్రోచుటకు యజ్ఞ సదనమందు ఆసీనుడవు కమ్ముని ఆహ్వానించుచున్నాము!

    గణములకును నీవు గణపతివని యెంచి
    కవులయందున నిన్ను కవిగ తలచి
    ఉపమ శ్రవులయందు ఉత్తముడని కొల్చి
    జ్యేష్ఠరాజుగ నీకు సేవసేసి
    బ్రహ్మణములయందు బ్రహ్మణస్పతివని
    ఆహ్వానములు జేసి ఆదరింప
    మా స్తోత్రములు విని మమ్ముల బ్రోవంగ
    ఆసీనుడవు కమ్ము సదనమందు!

  2. దే॒వాశ్చి॑త్తే అసుర్య॒ ప్రచే॑తసో॒ బృహ॑స్పతే య॒జ్ఞియం॑ భా॒గమా॑నశుః ।
    ఉ॒స్రా ఇ॑వ॒ సూర్యో॒ జ్యోతి॑షా మ॒హో విశ్వే॑షా॒మిజ్జ॑ని॒తా బ్రహ్మ॑ణామసి ॥ (2.23.2)

    పదచ్ఛేదం:
    దేవాః । చిత్ । తే । అసుర్య । ప్రచేతసః । బృహస్పతే । యజ్ఞియమ్ । భాగమ్ । ఆనశుః । ఉస్రాఃఇవ । సూర్యః । జ్యోతిషా । మహః । విశ్వేషామ్ । ఇత్ । జనితా । బ్రహ్మణామ్ । అసి ॥

    టీకా:
    దేవాః = దేవతలు; చిత్ = మరియు; తే =నీయొక్క; అసుర్య = అసురులవంటి? (అసురులను చంపు?); ప్రచేతసః = ప్రజ్ఞ; బృహస్పతే = ఓ బృహస్పతి; యజ్ఞియమ్ = యజ్ఞములో; భాగమ్ = భాగమును; ఆనశుః = పొందబడినవారు; ఉస్రాః ఇవ = కిరణములవలె; సూర్యః । జ్యోతిషా = జ్యోతి చేత; మహః = గొప్పగా; విశ్వేషామ్ = విశ్వమున; ఇత్ = అంతటా; జనితా = జనియించు; బ్రహ్మణామ్ = బ్రహ్మణముల యొక్క; అసి = ఉందువు;

    భావం:
    దేవతలు నీయొక్క అసుర ప్రజ్ఞ చేత యజ్ఞములో భాగమును పొందిరి. విశ్వములో సూర్యుడు ఎట్లా తన కిరణములను ప్రసరింపజేసి వెలుగును పంచుతాడో అట్లా బ్రహ్మణములు నీనుండి ప్రభవించును.

    ఓ బృహస్పతి! నీయొక్క ప్రజ్ఞ చేత
    యజ్ఞ భాగమందెను దేవతానివహము
    కిరణములనెట్లు రవిపంపు విశ్వమెల్ల
    బ్రహ్మణములట్లు నీనుండి ప్రాభవిల్లు!

  3. ఆ వి॒బాధ్యా॑ పరి॒రాప॒స్తమాం॑సి చ॒ జ్యోతి॑ష్మన్తం॒ రథ॑మృ॒తస్య॑ తిష్ఠసి ।
    బృహ॑స్పతే భీ॒మమ॑మిత్ర॒దమ్భ॑నం రక్షో॒హణం॑ గోత్ర॒భిదం॑ స్వ॒ర్విద॑మ్ ॥ (2.23.3)

    పదచ్ఛేదం:
    ఆ । విబాధ్య । పరిరాపః । తమాంసి । చ । జ్యోతిష్మన్తమ్ । రథమ్ । ఋతస్య । తిష్ఠసి । బృహస్పతే । భీమమ్ । అమిత్రదమ్భనమ్ । రక్షఃహనమ్ । గోత్రభిదమ్ । స్వఃవిదమ్ ॥

    టీకా:
    ఆ = వరకు; విబాధ్య = బాధించు; పరిరాపః = నిందకులను; తమాంసి = చీకటిని; జ్యోతిష్మన్తమ్ = జ్యోతిష్మంతమైన; రథమ్ = రథమును; ఋతస్య = యజ్ఞము/సత్యము యొక్క; తిష్ఠసి = కూర్చొని; బృహస్పతే = ఓ బృహస్పతి; భీమమ్ = భయంకరమైన; అమిత్ర = మిత్రులు కాని (శత్రువుల); దమ్భనమ్ = దంభనము; రక్షః = రాక్షసుల; హనమ్ = చంపు; గోత్ర = గోశాల, మేఘములను; భిదమ్ = భేదించి; స్వః = స్వర్గము; విదమ్ = కలిగించు.

    భావము: యజ్ఞము యొక్క జ్యోతిష్మంతమైన రథమునెక్కి, ఓ బృహస్పతి, నీవు నిందకులను, చీకటిని తరిమివేసి, భయంకరమైన రూపముతో అమిత్రుల దంభనము చేసి, రాక్షసులను చంపి, గోశాలను/మేఘములను భేదించి, మాకు స్వర్గమును నిలుపువాడవు.

    జ్యోతిష్మంతమైన యజ్ఞరథమునెక్కి
    తమమునెల్లనీవు తరిమివేసి
    భీమరూపమందు శత్రుదంభముజేసి
    వేదనిందకులను వెడలగొట్టి
    గోత్ర భిదము సల్పి స్వర్గ విభము నిల్పి
    రాక్షసులను చంపు రక్షకుడవు!
  4. సు॒నీ॒తిభి॑ర్నయసి॒ త్రాయ॑సే॒ జనం॒ యస్తుభ్యం॒ దాశా॒న్న తమంహో॑ అశ్నవత్ ।
    బ్ర॒హ్మ॒ద్విష॒స్తప॑నో మన్యు॒మీర॑సి॒ బృహ॑స్పతే॒ మహి॒ తత్తే॑ మహిత్వ॒నమ్ ॥ (2.23.4)

    పదచ్ఛేదం:
    సునీతిభిః । నయసి । త్రాయసే । జనమ్ । యః । తుభ్యమ్ । దాశాత్ । న । తమ్ । అంహః । అశ్నవత్ । బ్రహ్మద్విషః । తపనః । మన్యుమీః । అసి । బృహస్పతే । మహి । తత్ । తే । మహిత్వనమ్ ॥

    టీకా:
    సునీతిభిః = సునీతి చేత; నయసి = చూపించి; త్రాయసే = రక్షించు; జనమ్ = జనులను; యః = ఎవరైతే; తుభ్యమ్ = నీకు; దాశాత్ = యజ్ఞమును; తమ్ = వారికి; అంహః = పాపము; న అశ్నవత్ = అంటకుండా; బ్రహ్మద్విషః = బ్రహ్మద్వేషుని యొక్క; తపనః = తపింపజేయువాడు; మన్యుమీః = కోపముతో నశింపజేయు; అసి = ఉన్నావు; బృహస్పతే = ఓ బృహస్పతి; మహి = గొప్ప; తత్ = అది; తే = నీయొక్క; మహిత్వనమ్ = గొప్పతనము;

    భావం:
    నీ నీతి చూపించే వాక్యాలతో యాగమును నీకిచ్చు జనులను రక్షించువాడవు! వారికి ఏ పాపము అంటకుండా ఆదరించువానివి. బ్రహ్మణాలను (మంత్రాలను) ద్వేషించే వారిని తపింపజేసి, వారిని కోపముతో మట్టు పెట్టువానివి. అది నీయొక్క గొప్పతనము.

    యాగ మొనరించు జనులకు నీతి చెప్పి
    అఘము తొలగించి రక్షించి ఆదరించి
    మలగు బ్రహ్మ ద్విషులనెల్ల మట్టుపెట్టు
    ఓ బృహస్పతి! నీ మహి పొగడ తరమె!
  5. న తమంహో॒ న దు॑రి॒తం కుత॑శ్చ॒న నారా॑తయస్తితిరు॒ర్న ద్వ॑యా॒విన॑: ।
    విశ్వా॒ ఇద॑స్మాద్ధ్వ॒రసో॒ వి బా॑ధసే॒ యం సు॑గో॒పా రక్ష॑సి బ్రహ్మణస్పతే ॥ (2.23.5)

    పదచ్ఛేదం:
    న । తమ్ । అంహః । న । దుఃఇతమ్ । కుతః । చన । న । అరాతయః । తితిరుః । న । ద్వయావినః । విశ్వాః । ఇత్ । అస్మాత్ । ధ్వరసః । వి । బాధసే । యమ్ । సుగోపాః । రక్షసి । బ్రహ్మణః । పతే ॥

    టీకా:
    న తమ్ అంహః = అంహస్సు, పాపము అంటదు; న దుఃఇతమ్ = దురితము అంటదు; కుతః చన = ఎప్పుడైనా; అరాతయః = అరులు (శత్రువులు); న తితిరుః = చేరలేరు; ద్వయావినః = ద్వయావినులు (కపటులు – రెండు నాల్కల ధోరణి కలవారు); విశ్వాః = అంతటా; ఇత్ = తప్పక్; అస్మాత్ = అక్కడినుండి; న ధ్వరసః = ధ్వంసించలేరు; వి బాధసే = బాధలనుండి; యమ్ = ఎవరైతే; సుగోపాః = గోప్తుడు; రక్షసి = రక్షించు; బ్రహ్మణః పతే = ఓ బ్రహ్మణపతీ!

    భావం:
    ఓ బ్రహ్మణపతీ, నీవు కాపుకాసి రక్షించు వారికి అంహస్సు, దురితములు అంటుకోవు. శత్రువులు చేరలేరు. ద్వయావినులు హింసించలేరు. అంతటా బాధలనుండి వారిని రక్షించువాడవు.

    బ్రహ్మణస్పతి నీవు రక్షించు నరులకు
    అంహస్సు దురితంబు లంటుకోవు!
    ఏ విరోధులు వారి హింసించ లేరు!
    ఏ ద్వయావినులైన గెలువలేరు!
  6. త్వం నో॑ గో॒పాః ప॑థి॒కృద్వి॑చక్ష॒ణస్తవ॑ వ్ర॒తాయ॑ మ॒తిభి॑ర్జరామహే ।
    బృహ॑స్పతే॒ యో నో॑ అ॒భి హ్వరో॑ ద॒ధే స్వా తం మ॑ర్మర్తు దు॒చ్ఛునా॒ హర॑స్వతీ ॥ (2.23.6)

    పదచ్ఛేదం:
    త్వమ్ । నః । గోపాః । పథికృత్ । విచక్షణః । తవ । వ్రతాయ । మతిభిః । జరామహే । బృహస్పతే । యః । నః । అభి । హ్వరః । దధే । స్వా । తమ్ । మర్మర్తు । దుచ్ఛునా । హరస్వతీ ॥

    టీకా:
    త్వమ్ = నీవు; నః = మమ్ము; గోపాః = రక్షించు; పథికృత్ = దారిలో; విచక్షణః = విచక్షణుడవు; తవ = నీయొక్క; వ్రతాయ = వ్రతముకొరకు; మతిభిః = సుమతిచేత; జరామహే = పాడెదము; బృహస్పతే = ఓ బృహస్పతి; యః = ఎవరైతే; నః = మమ్ము; అభి = వైపు; హ్వరః = హాని, కౌటిల్యము; దధే = ఇచ్చు; స్వా = స్వయం; తమ్ = వారిని; మర్మర్తు = కష్టపెట్టి; దుచ్ఛునా = నశింపజేయు; హరస్వతీ = వేగవతిగా;

    భావం:
    నీవు సుమతిచేత, విచక్షణ చేత మంచి దారి చూపగలిగే విచక్షణుడవు. నీ వ్రతము కొరకు మంచి నుతులు పాడగలము. ఓ బృహస్పతి! మా దారికి కౌటిల్యముతో హాని చేయదలచు వారిని కష్టపెట్టి, వారిని వేగముగా నశింపజేయుము.

    మాకు సత్పథమును జూపి మనుపుమయ్య
    నీ విచక్షణ చేతను నీసుమతిచె!
    మాకు హానిగూర్చెడువారి మదిని వెతలు-
    వెట్టి నాశమొందగజేయు వేగముగను!
  7. ఉ॒త వా॒ యో నో॑ మ॒ర్చయా॒దనా॑గసోఽరాతీ॒వా మర్త॑: సాను॒కో వృక॑: ।
    బృహ॑స్పతే॒ అప॒ తం వ॑ర్తయా ప॒థః సు॒గం నో॑ అ॒స్యై దే॒వవీ॑తయే కృధి ॥ (2.23.7)

    పదచ్ఛేదం:
    ఉత । వా । యః । నః । మర్చయాత్ । అనాగసః । అరాతీవా । మర్తః । సానుకః । వృకః । బృహస్పతే । అప । తమ్ । వర్తయ । పథః । సుగమ్ । నః । అస్యై । దేవవీతయే । కృధి ॥

    టీకా:
    బృహస్పతే=ఓబృహస్పతీ! ఉత వా=అపి చ=ఇంకను; యః=ఎవడైతే; వృకః= నక్కవలె కుటిలమైన; మర్తః=పురుషుడు; అరాతీవ=శత్రువువలె -(ఎదుర్కొనుచు); సానుకః=ఎత్తుగా ఎదిగి; అనాగసః=పాపరహితులమైన; నః=మమ్ము; మర్చయత్=హింసించునో; తమ్=అతనిని; అపవర్తయ=తొలగించుము; అస్యై=ఈ; దేవవీతయే = దేవవీతి అయిన (దేవభోజనమైన) యజ్ఞమునకు; నః=మాకు; పథః= మార్గము; సుగమం కృధి=సుగమము చేయుము.

    భావం:
    ఎవరైతే నక్కల వలె కుటిలుడైన మర్త్యుడు, ఎత్తుగా ఎదిగి, పాపరహితులమైన మా మార్గమడ్డుకొనునో అతనిని తొలగించుము; దేవభోజనమైన ఈ యజ్ఞమునకు మంచి పథము మాకు సుగమము చేయుము.

    ఓ బృహస్పతి! మము హింసల బెట్టంగ
    మార్గ మడ్డు కొనెడు మర్త్యజనుని
    మాదు దారి నుంచి మరలింపగా జేసి
    మంచి పథము మాకు పదిల పరచు!
  8. త్రా॒తారం॑ త్వా త॒నూనాం॑ హవామ॒హేఽవ॑స్పర్తరధివ॒క్తార॑మస్మ॒యుమ్ ।
    బృహ॑స్పతే దేవ॒నిదో॒ ని బ॑ర్హయ॒ మా దు॒రేవా॒ ఉత్త॑రం సు॒మ్నమున్న॑శన్ ॥ (2.23.8)

    పదచ్ఛేదం:
    త్రాతారమ్ । త్వా । తనూనామ్ । హవామహే । అవస్పర్తః । అధివక్తారమ్ । అస్మయుమ్ । బృహస్పతే । దేవనిదః । ని । బర్హయ । మా । దుఃఏవాః । ఉత్తరమ్ । సుమ్నమ్ । ఉత్ । నశన్ ॥

    టీకా:
    త్రాతారం = కాపాడువానివి; త్వామ్ = నిన్ను; తనూనాం = దేహము యొక్క, తనయుల యొక్క; హవామహే = ఆహ్వానింతుము; హే అవస్పర్తః బృహస్పతే= సర్వ ఉపద్రవ దూరకుడవగు ఓ బృహస్పతీ; అధివక్తారమ్=అధికముగా పలుకు =ఉపదేశమొసగు; అస్మయుమ్= హవిఃప్రదానమునకు కోరదగినవాడవైన; దేవనిదః=దేవతల నిందించు అసురులను; నిబర్హయ=వినశింప జేయుము; దురేవాః=దుష్టులైన, దుర్బుద్ధులైన శత్రువులు; ఉత్తరమ్=ఉత్కృష్టమైన; సుమ్నమ్=సుఖమును; మా ఉన్నశన్= పొందకుండా చూడుము.

    భావం:
    సర్వ ఉపద్రవాలను దూరం చేయగల ఓ బృహస్పతి! తనువులను రక్షించే త్రాతవు నీవు. మా ఆహ్వానములు విని మాకు ఉపదేశము ఇచ్చే వేల్పువు. దేవనింద చేసే అసురులను నశింపజేయుము. దుష్టులైన వారికి ఉత్కృష్ట పదములు దక్కకుండా చూడుము.

    ఓ బృహస్పతి! నీవె ఉత్పాతములనుండి
    తనయుల రక్షించు త్రాతవయ్య!
    ఓ బృహస్పతి! మాదు ఆహ్వానములుగొని
    వేగమె బ్రోచేటి వేల్పువయ్య!
    దేవనిందసలుపు దేవదూషకులకు
    సుఖము కలుగకుండ చూడుమయ్య!
    ఓ బృహస్పతి వారి కుత్కృష్ట పదముల
    ఆశ భగ్నము చేసి అణచవయ్య!

  9. త్వయా॑ వ॒యం సు॒వృధా॑ బ్రహ్మణస్పతే స్పా॒ర్హా వసు॑ మను॒ష్యా ద॑దీమహి ।
    యా నో॑ దూ॒రే త॒ళితో॒ యా అరా॑తయో॒ఽభి సన్తి॑ జ॒మ్భయా॒ తా అ॑న॒ప్నస॑: ॥ (2.23.9)

    పదచ్ఛేదం:
    త్వయా । వయమ్ । సువృధా । బ్రహ్మణః । పతే । స్పార్హా । వసు । మనుష్యా । ఆ । దదీమహి । యాః । నః । దూరే । తళితః । యాః । అరాతయః । అభి । సన్తి । జమ్భయ । తాః । అనప్నసః ॥

    టీకా:
    త్వయా = నీ చేత; వయం = మేము; సువృధా=సద్వృద్ధి చేత; బ్రహ్మణపతే = ఓ బ్రహ్మణస్పతి; స్పార్హాః=కోరదగిన (కోరుకొన్న); వసు=ధనములను; వయం మనుష్యాః=సత్కర్మనిష్ఠులమైన మానవులము మేము; ఆ దదీమహి=గ్రహించుచున్నాము; దూరే=దూరంగా, తళితః=దగ్గరగా; యాః అరాతయః =ఏ శత్రువులు; అభిసంతి = ఎదురగు చున్నారో; జమ్భయ=నశింపజేయుము; తాః=వారిని; అనప్నసః = యజ్ఞహీనులను.

    ఓబృహస్పతి సద్వృద్ధి నొసగు నీవు
    స్పార్హ వసువులను మాకు పంపవయ్య!
    దూరతళితములందు మాతోడ పెనగు
    యజ్ఞ హీనుల శత్రుల నడచవయ్య!