రచయిత వివరాలు

పూర్తిపేరు: అన్వర్
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://thisisanwar.blogspot.in/
రచయిత గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/

 

ఆ ఇంటి రోడ్డు మలుపు తిరిగి పుస్తకం తెరిచి చదువుకుంటూ బడి దారి నడుస్తున్నానా. చదివే కొద్దీ ఒళ్ళంతా భయం, తిమ్మిరి. సల్లాడం వేడిగా, బిర్రుగా. ఒక్కసారి పుస్తకం మూసిపడేసి మా స్కూలు వెళ్ళే అడ్డదారి పట్టా. మనిషినంతా అదోలా అయిపోయా. అక్కడంతా కంపచెట్లు ఎక్కువ. భయంలో కూడా ఏదో గమ్మత్తు ఉంది ఆ రచనలో.

ఆ గదిలో దీవాన్ వంటి దాని మీద తెల్లని పరుపు, పరుపుపై తెల్ల దిండు. పక్కన ఒక వార్నీష్డ్ చెక్కబల్ల, దానిమీద ఒక ఎర్రని పానాసోనిక్ టేప్ రికార్డర్ కమ్ రేడియో. ఆ ఇంట్లో మనుషులు ఎవరూ కనబడేవారు కాదు. ఆ ఇంటిముందు నిలబడి నేను ఆ టేప్ రికార్డర్ కేసి ఇష్టంగా చూసేవాణ్ణి.

ఏళ్ళ క్రితం, నేనూ నా ఫ్రెండు మదరాసు నగరాన్ని ఒక చూపు చూద్దామని బయట వీధులెంట తిరుగుతుంటే పదిహేడు-పద్దెనిమిది ఏళ్ళ వయసు కుర్రవాడొకడు, ఇంకా తక్కువ వయసు కూడానేమో! ఒక గోడ మీద రాజకీయనాయకుడి పోర్ట్రయిట్ ఒకటి వేస్తూ కనపడ్డాడు. చాలా పెద్ద బొమ్మ అది. గోడ మీద, అదీనూ అంత పెద్ద గోడ మీద.

సాయంత్రం కాగానే రాత్రంతా బాగా చదవాలని ఒకరికొకరం ప్రమాణాలు చేసుకుని మిద్దె మీద చేరేవాళ్ళం. పుస్తకాలు ఇక తెరుద్దాము అనుకుంటుండగానే కొత్తగా పెళ్ళయిన జంటలు, పెళ్ళి పాతబడిన జంటలు కూడా వారి వారి మేడల మీదికి దిండూ పరుపులతో సహా ఎక్కేవారు. వారికి మేము కనపడేవాళ్ళం కాదు. వాళ్ళు మాకు కనపడేవారు.

ఇలా ఆదివారం అబిడ్స్‌లో పాత ఎర్రబారిన, దుమ్ముపట్టిపోయిన మార్ట్ డ్రకర్ బొమ్మల పేజీలు కాకుండా, ఒకసారి మార్కెట్‌లోకి మార్ట్ డ్రకర్: ఫైవ్ డికేడ్స్ ఆఫ్ హిస్ కెరీర్ అనే పేద్ద పుస్తకం వచ్చింది. బ్లాక్‌లో మరీ వైట్ మనీ పెట్టి ఆ పుస్తకం కొన్నా. పుస్తకం పేజీ తిప్పగానే మార్ట్ డ్రకర్ ఇంటర్యూ ఉంది. ఇలా…

ఇంతింత లావుగా ఉబ్బిపోయిన పుస్తకాలు అవి, వాటి పేజీల్లో పత్రికలలో వచ్చే రకారకాల అదీ ఇదని కాదు బొమ్మల ప్రపంచానికి, డిజైన్ కళకు సంబంధించి ప్రతీది అందులో అతికించబడి ఉండేది. ఆ పుస్తకం ఎవరికి వారికి పవిత్ర గ్రంథం. ఏ గ్రంథానికి ఆ గ్రంథం విభిన్నం, వైవిధ్యం.

ఇదంతా పాత కథ. 1949లో మాట. తెలుగుస్వతంత్ర అనే పత్రికలో నా దైనిక సమస్యలు అనే శీర్షిక కింద అచ్చయిన కొన్ని కన్నీటి చుక్కలు, గుండె మంటలు, ఆకలి నొప్పులు. అయ్యా బాబూ, అమ్మా తల్లీ, మీ మంట, మీ ఏడుపు, మీ దరిద్రం, మీ దౌర్భాగ్యం ఏదైనా పర్లేదు, చదవచక్కగా ఉంటే చాలు.

బాపు మాది అని దుడుకుగా ఉంటుంది. ఏమి కష్టపడకుండా, కనీసం చిన్నపాటి పుణ్యమో, పిసరెత్తు తపస్సో ఒనరించకుండానే బాపుని మావాడిగా పొందామే అని బిఱ్ఱుగా ఉంటుంది. అయితే అయితే ఈ బిఱ్ఱు వెనుక కనపడనిది తడిగుండెగా ఉంటుంది, చెమ్మ కన్నుగా ఉంటుంది, భక్తిగా, రెండు చేతుల కైమోడ్పుగా ఉంటుంది.

కొన్నిటిలో పేజీకి ఒకటి, కొన్నిటిలో పేజీకి మూడూ నాలుగు కూడా. అన్నీ శృంగార భంగిమలే. కూచున్న, పడుకున్న, నిలబడ్డ, ఎత్తుకున్న, సోలిన, వాలిన, పేలిన కామకేళి విన్యాసాలే ఆ బొమ్మలు. వాత్సాయనుడు కూడా కనిపెట్టలేని సూత్రాలు అన్నిటిని మోహన్‌గారి పెన్సిల్ పని పట్టింది. వాటిని చూడటానికి ముందస్తుగా నాకు సిగ్గేసింది.

ఏదీ ముందుగా వ్రాసి పెట్టుకున్నది కాదు. ఏ నెల కానెల అప్పటికప్పుడు వ్రాస్తూ వచ్చిందే. ఈమాట నవంబర్ 2021 సంచికలో ఈ ధారావాహిక మొదలయ్యింది. నవంబరు 2022కి అంతా అయిపోదా అనే ధీమా ఉండింది. ఇప్పుడు మార్చి 2023. వ్రాస్తూ పోతే ఇంకా 16 నెలలు వచ్చేట్టు ఉంది.

మొత్తానికి ఇళ్ళకన్నా, ఇళ్ళు చూపించిపెట్టే ఏజంట్ల వెదుకులాట అనేది అతి ముఖ్యం అయిపోయింది నాకు. ఆ పనిలోనే ఒకరోజు కాస్త పాపభీతి, దైవభక్తి మెండుగా ఉన్నట్టు కనపడే ఒక ఏజెంట్‌ దొరికాడు. నేను అతడిని కలవడానికి వెళ్ళిన సమయంలో అతను ఒక దేవత పటం ముందు నేలమీద కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడు.

నావంటివాడు ఉంటే గింటే రాజకీయ కార్టూనిస్ట్‌గానే ఉండాలి. వార్తలు చదవడం, ఆలోచించడం, వాటి ఆలంబనతో రాజకీయ కార్టూన్లు గీయడం. ఎంత మన్నికైన పని! ఆ వెటకారాన్ని, సునిశిత వ్యంగ్యాన్ని ఊహించడంలో ఎంత మజా ఉంటుంది. బుర్ర ఎంత పదునుగా పని చేస్తుంది.

మా యజమాని తన స్వహస్తాలతో ఒక ఉద్యోగికి ఉద్వాసన చెప్పే అవకాశం పోయినందుకు తెగ విచారించి, తనకు తానై తన పత్రిక నుండి ఒక మనిషి అలా వెళ్ళిపోగలిగే స్వతంత్రాన్ని భరించలేక, నా కోసం కబురు పంపి బోలెడంత భవిష్యత్తు ఉన్న నేను అంత మూర్ఖంగా ఉండకూడదని నచ్చచెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాడు.

ఇక్కడ ఫ్రీ ప్రెస్ జర్నల్‌లో కార్టూనిస్ట్‌గా ఉన్నది నేనొక్కడినే కాదు. మరో కార్టూనిస్ట్ కూడా అక్కడ తన బొమ్మలతో, తన సృజనాత్మకతో, తన కార్టూన్ల వెటకారపు చావు దెబ్బలతో రాజకీయ నాయకులని హేళన చేస్తూ ఉన్నాడు. అతను మీకు బాగా తెలిసినవాడే! అతని పేరు చెప్పేయంగానే అతడిని మీరు ఇట్టే గుర్తు పట్టేస్తారు.

నేనూ, నాది, నాకు అనే నా రోజువారి ప్రతిబింబాల నుండి ఒక్కసారిగా ఈ మాటలు నన్ను కాలం వెనక్కి తీసుకెళ్ళి సుడిగాలిలో చిక్కి అంతర్ధానమైన జ్యోతింద్రనాథ్ వంటి అవ్యవసాయకులను పరిచయం చేసుకోవడం, వారి చేతుల్లో మొహన్ని దాచుకోవడం, వాటిని ముద్దాడుకోవడం చేస్తాయి. దేశం కోసమని, మన కాళ్ళ మీద మనం నిలబడి చూపాలని ప్రయత్నించి – అప్పులతో, నష్టాలతో సర్వనాశనంతోనూ మిగిలిన మనుష్యులు ఎంతమందో!

అక్కడినుండి వెళ్ళిపోదామనుకున్న సమయంలో ఆయన తన తపస్సునుండి కొద్దిగా కదిలి ‘నువ్వు కార్టూనిస్ట్‌గా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? కార్టూన్లు వేయడంలో అంత గొప్ప ఏమున్నదబ్బా? పనికి వచ్చే వేరే పని ఏదయినా చేసుకోవచ్చు కదా?’ కళ్ళు తెరవకుండా సలహా ఇచ్చాడు. నేను మౌనంగా లేచి నిలబడ్డాను.

నాకు తెలిసిన పండుగలలోకెల్లా పిల్లల కోసమనుకునే గొప్ప పండగ ఏదో తెలుసా? వినాయక చవితి. వినాయకుడు దేవుడు, కారణ జన్ముడు, ఏకదంతముపాస్మహే, కరిభిద్గిరిభిత్కరికరిభిద్గిరిగిరిభిత్కరి అనే గందరగోళమూ, భయమూ, భక్తి, లెంపలు వేసుకోడఁవూ, గుంజీళ్ళు తీసుకోడఁవూ… వంటివి కాదు.

క్లాసు రూములో కూచుని మా తరగతి ఉపాధ్యాయుల కేరికేచర్లు, లేకపోతే నోటు పుస్తకంలో స్కెచింగ్ మాత్రమే కాకుండా నేను తరుచుగా చేసే మరో పని కూడా ఉంది. అదేమిటంటే చిన్న చాకు కాని, సగం బ్లేడ్ ముక్క కానీ ఒకటి పుచ్చుకుని తరగతిలో ఏదో ఒక బల్లపైన నా పేరు తాలూకు అక్షరాలను చెక్కడం.

ఎంత కంట్రోల్ లక్ష్మణా, కంట్రోల్ అని నన్ను సముదాయిందుకుందామనుకున్నా ఈ పిచ్చి హాస్య కథకు తన్మయులైపోతున్న వీరి మధ్య నేను మూడు నెలలు ఎలా గడపగలనని బెంగ పట్టుకుంది. అక్కడ మంగలి కుర్చీలో పడ్డ నారదుడికి, ఇక్కడ, ఈ కీ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కుర్చీలో పడ్డ నాకు ఉన్న సారూప్యం గురించి ఆలోచిస్తున్నాను.

బ్రిటీష్ పాలన నుండి దేశాన్ని విముక్తి చేయడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడుతున్నందువలన పాఠశాలలు, కళాశాలలు అన్నీ మూసివేశారుట. అంతేకాదు, ఇంత జబ్బున పడి కోలుకుంటున్న నన్ను పరామర్శించడానికి నా ప్రాణస్నేహితుడు హెచ్‌కె ఇంతవరకు ఎందుకు రాలేదు అనుకున్నారు? వాడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారుట.

అసలు కాలేజీ చదువు చదవడమనేదే నాకు సమయం వృథా తప్పా మరేం లేదు అని నాకు అకస్మాత్తుగా అనిపించింది! నేనొక కళాకారుడిని. నావంటి వాడికి చరిత్ర, ఆర్థిక శాస్త్రం లేదా రాజనీతి శాస్త్రం చదివి ఆ పట్టా పొందడం వల్ల ఏమిటి ఉపయోగం? నిజానికి నాకు కావలసిన చదువు ఏదయినా ప్రసిద్ధ చిత్రకళా విశ్వవిద్యాలయాల నుండి పుచ్చుకోవలసిన ఫైన్ ఆర్ట్స్‌ పట్టా కదా?

ఆ రోజుల్లో పండగలకు కొత్త బట్టల ముచ్చట. అసలు కొత్త బట్టలంటేనే తాను నుండి గుడ్డ చింపించి, చక్కగా కొలతలు తీపించి, కుట్టించి, నలభైసార్లు దర్జీ షాపు చుట్టూ తిరిగి, చొక్కాయ్ సాధించి దానిని బొగ్గుల పెట్టెతో ఉల్టా పల్టా ఇస్త్రీ లాగించి మన చొక్కాని తొలిసారిగా వాడెవడో కాక మనమే తొడుక్కోడం. ఇప్పుడు మనం కొత్తంగి అని తొడుక్కునేది ఎక్కడని కొత్తది?

రాత్రిళ్ళు భోజనానంతరం ఇలా మా ఇంట్లో చెప్పుకునే కబుర్లు భలే ఉంటాయిలే. ఆరోజు మేము కలుసుకున్న కొత్త వ్యక్తులు, పాఠశాలలోని ఉపాధ్యాయుల లేదా కార్యాలయాల్లోని ఉన్నతాధికారుల దౌర్జన్యాలను, అతి వేషాల గురించి తమాషా పడుతూ వారి హెచ్చులని వెక్కిరించుకుంటూ ముచ్చటించుకుంటాము.

ఆ అమ్మాయి ద్వారాల పక్కన ఉన్న ఆ డిజైన్లను తన బొమ్మల పుస్తకంలో నకలు దింపుకోవాలని ప్రయత్నిస్తుంది. చూసి వాటిని గీయడం సరిగా కుదరకపోతే రబ్బరు పెట్టి తుడిచి మళ్ళీ పదే పదే గీయ ప్రయత్నించడం, ఇబ్బంది పడ్డం చూస్తున్నాను. పెన్సిల్ ముక్క ఒక కోణం నుండి మరో కోణానికి తిరుగుతూ ఆగుతూ సుతారంగా మెలికలు పోతూ సాగుతుంది గీత.

మాకు ఆకలిగా ఉంది, తను ఏమేమి తెచ్చి ఉంటాడా అని అత్రుతగా చూస్తున్నాం, పెట్టినదాన్ని పెట్టినట్లు గుటుక్కుమనిపించాలని తొందర కూడా పడుతున్నాం. వాసు ఆ భోజనపు పొట్లాన్ని జాగ్రత్తగా విప్పాడు. అందులో ఉన్నది చూసి నేనూ నా మిత్రుడు నిర్ఘాంతపోయాం, నివ్వెరపోయాం, ఖంగుతిన్నాం, నిశ్చేష్టులమయ్యాం!

‘ఈ గొప్ప చిత్రకారుడు దామెర్ల రామారావు ఇరవై ఎనిమిదేళ్ళ చిన్న వయసులోనే కాలం చెందారు గానీ, ఆయన కనక పూర్ణాయుష్కులు అయి ఉంటే…’ అని కొందరు పెద్దమనుషులు సభా సంప్రదాయాలననుసరించి ఊపిరి పొడుగ్గా వదులుతారు గానీ పూర్ణాయుష్కులు అయి ఉంటే మాత్రం ఏమవుతుంది?

ఒక స్పష్టమైన కారణం లేకుండా నా ప్రాణస్నేహితుడు నాకు ద్రోహం చేయడం నిజంగా నా హృదయాన్ని బద్దలు కొట్టింది. నా ఆ మిత్రుడి క్రూరమైన నిర్లక్ష్య ప్రవర్తన నన్ను, మా క్రికెట్ టీమ్‌ని తీవ్ర నిరాశలో ముంచెత్తింది. జీవనోత్సాహం అనేది జీవితంలోనూ ఆటలోను నశించిన నా వంటి కెప్టెన్‌ వల్ల క్రమంగా రఫ్ అండ్ టఫ్ అండ్ జాలీ టీమ్ జాలిగా కనుమరుగైంది.

ఆ రోజు నుండి నేను హిందూ పత్రికలో అప్పుడప్పుడు కనిపించే ఆవుగారి కార్టూన్ కోసం వెతికేవాడిని. ప్రచురితమైన ఆయన ప్రతీ బొమ్మని గంటల తరబడి నేను చాలా శ్రద్దతో అధ్యయన పూర్వకంగా పరిశీలించేవాడిని. ఆయన కార్టూన్లలోని రాజకీయ వ్యాఖ్యానాలలోని చురుకు, వెటకారం నాకు అర్థం అయ్యేంత వయసు కాదు కానీ చిత్రించే బొమ్మపై ఆవుగారికి ఉన్న నియంత్రణ నన్ను ముగ్ధుణ్ణి చేసేది.

బుజ్జాయిగారు అలా కాదు అమిత సింప్లీ ఆయన బొమ్మల బ్యూటీ. బుజ్జాయిగారి బొమ్మలతో పోల్చుకోదగిన అలతి రేఖల ఆర్టిస్ట్ అంత సులువుగా మరెవరూ కానరారు. అందువల్లనే ఒకానొక సమయంలో దేశంలోకెల్లా ప్రఖ్యాతి గాంచిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలో బుజ్జాయిగారి బొమ్మలు మాత్రమే ప్రచురితం అయ్యాయి. మరే తెలుగు చిత్రకారులు ఎంత ప్రయత్నించినా అందులో చోటు చేసుకోలేకపోయారు.

మామిడి పళ్ళ కాలం వచ్చిందంటే చాలు ఆ కాలం గడిచేదాకా దాదాపు ఋతువంతా మేము మామిడి చెట్లమీదే గడిపేవాళ్ళం. ఆ మామిడి కొమ్మల మీదికి వెళ్ళే ముందు వంటింట్లోంచి ఉప్పూ, కారం పొట్లాలు కట్టుకోడం మాత్రం మరిచేవాళ్ళం కాదు. డుబ్బుగాడయితే కళ్ళు మూసి, కాళ్ళు మడిచి, చిలకలా ఎగిరినట్లే ఎగిరి చెట్టు మీదికి వాలేవాడు. అప్పుడప్పుడు నేను చెట్టు ఎక్కలేక జారేవాణ్ణి.

ఉన్నట్టుండి నా ఎడమచెవి తీవ్రంగా మండినట్లు ఒక భావన అనిపించింది. ఎందుకా మంట? ఏమిటా కథ? అని లోకంలోకి వచ్చి చూస్తే, మా లెక్కల మాష్టారు నా చెవి పట్టుకుని మెలి తిప్పుతున్నాడు. ‘వెధవా, చెప్పిన లెక్క చెయకపోగా పైగా నన్ను ఎగతాళి చేస్తున్నావుట్రా? లే రాస్కల్? లే!’ నాకు ఏమీ అర్థం అవలేదు.

వీధి చివర మలుపు అంచున వున్న దీపస్తంభపు తీగ గాలి ఊయల వూగుతుండగా దానిని వేళ్ళ మధ్య ఉన్న నా కలంతో చలన స్తంభన విద్యకు కట్టుచేసి కాగితంలోకి చేర్చడంలో వున్న మహదానందాన్ని నేను మరెక్కడా పొందలేదు. నాకు ఊహ ఎరిగిననాటి నుండి ఇప్పుడు ఇంతవాణ్ణి అయ్యాకా కూడా నా జీవితంలో నేను బొమ్మ వేయకుండా వున్న ఒక్క రోజు లేదు.

ఎవరయినా పెద్ద ఆర్టిస్ట్ చనిపోగానే తెల్లారి కాగితపు పేపర్లకు కార్టూనిస్టులు వేసే బొమ్మలలో ఆ సదరు చిత్రకారుడు ఒక సంచి తగిలించుకుని మేఘాల మధ్య స్వర్గమో ఇంకే శ్రాద్ధమో అనే ఒక పిండాకూడు ద్వారం దగ్గరికి వెడుతుంటాడు కదా, అటువంటి బొమ్మలని చూసినపుడల్లా మాకిరువురికి ఎక్కడ కాలాలో అక్కడ కాలేది.

ఆటల మైదానాల్లో స్కోరర్‌ని నేను. ఆటతో పాటు జీవితాన్ని రికార్ద్ చేయడం నా పని. ఇప్పుడు ఈ పుస్తకానికి ఒక ‘ముందు మాట’ అంటూ చెప్పాలి కాబట్టి–ఎందుకు ఈ రాతలు ఇప్పుడు? ఇలాగని? పెదాలు బిగించుకుని మోకాళ్ళ మీద కూచుని జుట్టు కళ్ళమీదికి జారుతుంటే చేత్తో తోసుకుంటూ, చాలా చిన్నవాడిగా, ఇంటా బయటా గోడల మీద బొగ్గుతో నల్లబొమ్మలు గీసే నేనే నాకు కనబడతా.

అమ్మా సత్యవతిగారూ! కథలో కథంతా చెప్పే ప్రధాన పాత్రకు పేరు లేదు. ఒక వ్యక్తిత్వమూ, ఒక అభిరుచి, ఒక రుచి, అతగాడి ఒక వృత్తి కనపడదు. అసలు కళ్ళముందుకు రాని సుశీల మాత్రం మనకు అంతా తానై మనతో ఉండిపోతుంది. ఈ కథ ఇంకో గొప్ప టెక్నిక్. అమ్మా మీకు నా పరి పరి దండాలు.

ఒకే పేద్ద కాగితం, అదే పొడవాటి వేళ్ళ చిత్రకళా విన్యాసం. నో దిద్దుబాట్లు, నో అచ్చుతప్పులు, నో కొట్టివేతలు… అలా చూస్తుండగానే నరాల బిగువూ, కరాల సత్తువ, కణకణ మండే, గలగల తొణికే అనేక కన్నులు, లోహ రాక్షసుల పదఘట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్ళూ, కష్టం చాలక కడుపుమంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళూ, చెరసాలలలో చిక్కేవాళ్ళూ…

ఇందాకా అనుకున్నాం కదా పిన్నీసు అని; చెప్పులు, పిన్నీసు రెండూ జంట కవులు. ఆ రోజుల్లో పిన్నీసుల హారం లేని ఆడ మెడ ఉండేది కాదు. పిన్నీసుకు జాత్యంతరం అంటదు. హిందూ, ముస్లిమ్, కిరస్తానీ అందరి మెడల గొలుసుల్లో పిన్నీసులు తళుకుమనేవి. అంగళ్ళల్లో పిన్నీసులు కొనడం డబ్బు దండగ, రోడ్ల మీద మొలతాడు దారాలు అమ్ముకునేవారి దగ్గర పిన్నీసు ప్యాకెట్లు కాస్త అగ్గువ. చొక్కాకు గుండీలు లేవా పిన్నీసు ఉందిగా!

నిజానికి మనుగడలో ఉండే చిన్న పత్రికలు ఈనాడూ ఆనాడూ ఏ నిజాల కోసం, సత్యాలకోసం అచ్చు కాబడవు, పెద్ద పత్రికలూ అంతేననుకోండి! వాటి గురి పెద్ద ప్రయోజనాలు నెరవేర్చుకోడంలో ఉంటుంది. చిన్న పత్రికలు కేవలం నాలుగు డబ్బులు గిట్టుబాటు కావడం కోసం మాత్రమే అచ్చవుతాయి. ఈ చిన్న పత్రికలవారికి అతి ముఖ్యంగా కావలసినవి అడ్వర్‌టైజ్‌మెంట్లు. ఇలాంటి పత్రికలు నిజంగా పత్రికల్లా ఉండవు.

రాజు-మహిషిలోని లంబాచోడా ప్రసాద్ తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువుకు పరిగెత్తిన రాత్రి కురిసిన గాలీ వర్షాన్ని నేను ఎన్నడూ మరచిపోలేను. ఎక్కడో లాటిన్ అమెరికాలో ఎడతెరిపి లేకుండా కొన్ని వందల రోజులు కురిసిన వర్షాన్ని నేను చూడలేదుగానీ దానిని గార్షియా గాబ్రియెల్ మార్క్వెజ్ వర్ణించాడు. అందులో నేను దర్శించిన, చూచిన, తడిచి ముద్దయిన ఆ నా చూడని వర్షాన్ని కూడా నేను మరువలేను.

అయినా ఒక చిత్రకారుడిగా నా పరిమితి నాకు ఉంది. నిజంగా వసుధేంద్ర కోరుకున్నట్లు నిక్కరు విప్పి పడేసి ఏడుపు మొహంతో, అవమానభారంతో నడుం వంచుకుని ఉన్న కుర్రవాడు, వాడిని కడుగుతూ తల్లి, కుడివైపున పిల్లల్ని వేసుకుని పందులు, ఈ వైపు కుక్క మూతి నాక్కుంటూ చూస్తూ, వెనుక ఎగతాళిగా నవ్వుతున్న స్కూల్ పిల్లలు… ఇదంతా గీస్తే అపుడు బొమ్మ ఏవవుద్దంటే బహిరంగ మల విసర్జన వద్దే వద్దు! మోడీయ స్వచ్ఛ భారతే ముద్దు!

మనకు వట్టిపుణ్యానికి తెలిసిన విషయాలు రెండు కలవు. సూర్యుడు తూర్పున ఎక్కి పడమట దిగుట. దీని గురించి మళ్ళీ ఎప్పుడయినా చెప్పుకుందాం. రెండు బాపూ గొప్పవాడు, బడా చిత్రకారుడు, ఎలా? అంటే ఆయన బొమ్మలు బాగా వేస్తారు, నవ్వించే కార్టూన్లు గీస్తారు. ఆ గీతల వెనుక పనిముట్ల మర్మం, ఈ చిన్న వ్యాసంలో వీలయినంత విప్పిచెప్పే ప్రయత్నం చేస్తా.

ఒకసారి మదరాసులో బాపుగారి ఇంట్లో ఆయన కలిసీ కలవగానే కొత్త బొమ్మలు ఏఁవేశారు? ఏవి చూపించండి? అని అడిగారు. అవి చూసి మురిసి ‘ఓయ్ వెంకట్రావ్ ఇలా రావయ్యా అన్వర్ బొమ్మలు చూడు ఎంత బావున్నాయో!’ అని ఆయనకు చూపించి ఆపై ‘ఏవండి, ఈ దగ్గరే మా గురువుగారు గోపులుగారి ఇల్లు. ఆయన్ని వెళ్ళి కలవండి ఈ బొమ్మలు చూపించండి చాలా సంతోషపడతా’రని అన్నారు.

గెలుపు అనే విన్నింగ్ పాయింట్ లేని పరుగులో నన్ను ఒక్క క్షణం కూడా నిలబడనీయక పరిగెత్తించేది బొమ్మ కాక మరేమిటని. బొమ్మ తప్ప మనల్ని నడిపించగలిగేది, పరిగెత్తించగలిగేది మరేదైనా ఉందా? బొమ్మని మించిన అత్యాశని మించిన సంపద ఏదైనా కనుగొనగలిగేనా?

అయితే కన్విన్స్ కండి, కాకపోండి. ఫరక్ కుచ్ భీ నహీ పడేగా. జరగాల్సింది ముందుగా వ్రాసిపెట్టినట్లుగానే జరుగుతుంది కాదనడానికి మై కౌన్ హుఁ? ఇదంతా నా థియరీ అనబడు ఒక సత్య శోధన, స్ట్రయిట్‌గా సూటిగా తార్కికంగా మీ పిల్లల సృజనాత్మకతని మీ తెలీని తనంతో హత్య చేయనీయకుండా ఆపే ప్రయత్నం.

కానీ గురూ, చూడు ఈ రచయిత వాక్యం తాజాగా ఉన్నది. శైలి భిన్నంగా మెరుస్తుంది. కథ ఎత్తుకున్న తీరు తీర్చిదిద్దిన తీరుగా కలదు. ఇతగాడిని చదివి నేను మహదానందపడ్డా. నా ఈ ఆనందం నీకూ పంచాలనుకుంటున్నా, రా, నువ్వూ సంబరపడుదువు కాని మిత్రమా. ఈ కథాసంకలనం పేరు ఆ నేల, ఆ నీరు, ఆ గాలి.

గురువుల వంటి చిత్రకారుల పనితనం చూడ్డం, చిత్రకళా పుస్తకాలు చూపించిన తోడన్, తోన్ తోడ కూడనే కాకుండా వీలయినంత మంచి రచనలు చదువుకుంటూ తృతీయా విభక్తి కూడా తెలుసుకోవాలి. గొప్ప గొప్ప రచనలను చదవాలి. ఆ చదువు ఏం చేస్తుందంటే, మనం కళ్ళు మూసుకున్నప్పుడు కూడా గొప్ప ఊహాశక్తిని మన మనసుకు ఊదుతుంది.

వీళ్ళు, ఆ పెద్ద చిత్రకారులు, ఇలా మహా ముచ్చటగా ఉంటారు. చంద్రగాడు, బాలిగాడు, మోహన్‌గాడు అనుకుంటూ. ఎదురుపడగానే ‘ఒరేయ్ అరేయ్ తురెయ్’ అనుకుంటూ. నాకది ఎప్పటికీ చేతకాదు. బహు మర్యాదగా నేను బాపుగారి బ్యాచ్. ఎంతటి గారి నయినా ఎదురుగా సార్ అనే అంటాను, వాడు వెనక్కి తిరగ్గానే ‘జారే నీయఖ్ఖ బోస్ డికె’ అనడమే కద్దు.

ఈ దేశంలో ఇలస్ట్రేటర్లకు వర్క్‌షాప్స్ ఉండవు, వారి పనికి ఫెలోషిప్‌లు కానీ, గ్రాంట్లు కానీ ఏం రావు. కానీ విదేశాల్లో నీకు ఈ సదుపాయాలు అన్నీ వుంటాయి. అద్భుతమైన గురువులు ఉన్నారక్కడ. ఒకవేళ చూపు సారించగలిగతే నువ్వు ఆ వేపు చూడాలి. కానీ, నీ భారతీయాత్మని అక్కడికి పట్టుకపోయి ఏం గీస్తాం? ఏం ఆనందిస్తాం? మనం మనవారికి అవసరం లేదు. పరాయి చోట మనం మనకు దొరకం.

మీట్ మై స్కెచ్ బుక్. లేదా డ్రాయింగ్ జర్నల్. కాదా వంటరి జీవితంలోకి ఇల్లామై అని వగచనవసరం లేకుండా కోరి జన్మతో పాటుగా తోడు తెచ్చుకున్న పవిత్ర గ్రంథం. ఇది నా బైబుల్, ఇది నా ఖురాన్, ఇది నా ప్రేయసి, నా తల్లి, నా సహచరి, నా నేస్తం, నా ఆస్తి… నా అంతటికీ నేను అనునిత్యం వ్రాసుకునే ప్రేమలేఖల సమాహరం కథ వినిపిస్తా.

లైన్ డ్రాయింగ్ ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? రేఖ ఎంత అద్భుతమైన భాషో తెలుసా? ఒక వస్తువును అది అర్థం చేసుకున్నంతగా మరే కళ ఈ ప్రపంచాన్ని చూడలేదు. వాస్తవాన్ని చప్పున గాలికూదేసి రేఖ చేసే మహా మాయే లైన్ డ్రాయింగ్. రేఖ అనేదేదీ లేని ఈ వస్తు ప్రపంచంలో అది మనం ఉందనుకున్న మరో కొత్త లోకాన్ని సృష్టించింది.