ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 10

ఇప్పుడు నేను అగ్గిదేవుడి స్వంత ఊరు మద్రాసుకు వచ్చి ఉన్నాను. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా బస. ఇక్కడికి వచ్చిన రోజునే కార్టూన్ ఫిల్మ్ డైరెక్టర్‌ని కలుద్దామని ఉబలాటంతో ఆయన పనిచేసే ఫిల్మ్ స్టూడియోకి వెళ్ళాను. నన్ను చూసి ఆయన తెగ సంతోషించారు. సంబరంగా ఆహ్వానించారు. ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అసలు ఒక కార్టూన్ సినిమా తీయాలనే ఆలోచన తన మనసులో మొదట ఎలా వచ్చిందో, అందుకని ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నాడో, దానికొరకు ప్రయత్నాలు ఎలా మొదలుపెట్టాడో, వాటిని ఎంత వరకు ముందుకు తీసుకెడుతున్నాడో. సినిమా నిర్మాణంలో తను ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న ఆర్థిక, సాంకేతిక, సృజనాత్మక చిక్కులు, సవాళ్ళ గురించి వివరించాడు. ఆయన వివరిస్తున్న ఈ కలగాపులగపు సమాచారం నాకు ఏమాత్రం బుర్రకు ఎక్కుతుందో ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నే ఒకడిని దొరికాను కదాని అత్యుత్సాహంతో ఆయన తన యత్నప్రయత్నాలన్నీ నాతో పంచుకుపోతూనే ఉన్నాడు. తను చెప్పాల్సినదల్లా చెప్పడం అయిపోయింది అనుకునే వరకు చెప్పేసి ఆ పిదప తన సిబ్బంది ఒక్కొక్కరిని పిలిచి నన్ను పరిచయం చేశాడు. తరువాత ఒక మనిషిని పిలిచి ఒక టేబుల్‌ని, కుర్చీని తెచ్చి తన గదిలో ఒక మూలలో పెట్టమని ఆదేశించాడు. నన్ను తీసుకువెళ్ళి ఆ టేబుల్ వద్ద కూర్చోబెట్టిన తర్వాత, అతను నన్ను తన కార్టూన్ సినిమాకి సంబంధించి కీ డ్రాయింగ్‌లు రచించే చిత్రకారుడిగా నియమిస్తూ కొన్ని పత్రాలపై తాను సంతకం చేశాడు. నాతోనూ సంతకాలు చేయించుకున్నాడు. పిదప ఈ ‘కీ డ్రాయింగ్స్’ అంటే ఏమిటో, నేను చేయవలసిన పనులు ఏమిటో ఆ విషయాలన్నీ నాకు తర్వాత వివరిస్తానని చెప్పాడు.

ప్రస్తుతం తాము నిర్మాణం చేపట్టిన ఈ కార్టూన్ సినిమాకు కథను వ్రాసినవారు ఈ స్టూడియో నిర్మించిన చాలా సినిమాల్లో నటించిన ఒక పెద్ద హాస్యనటుడని ఆ నటుడి పేరు నాకు చెప్పాడు… అతని పేరు వినగానే నా గొంతు తడారిపోయింది. ఆయన నటించిన చాలా సినిమాలని నేను చూశాను. భలే ఉందే ఇది! అంత గొప్ప నటుడు కథ వ్రాసిన సినిమాకి పనిచేసే అవకాశం నాకు రావడమనేది నమ్మశక్యంగా లేదు. దానిని మించిన గొప్ప ఆశ్చర్యం ఏమిటంటే ఈ సినిమా కథాంశం నారదమహాముని మీదట! నారదుడి సంగతి మనకందరికి తెలిసిందేగా! ఈయన మన పురాణాల్లో ఉన్న ఒక గొప్ప పాత్ర అనడంలో సందేహమేమీ లేదు. కలహప్రియత్వం, వాక్చతురత ఈయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు. మహతి అనేపేరున్న వీణని టింగు టింగుమని మోగించుకుంటూ ముల్లోకాలు తిరుగుతూ ఉండే ఈయన పెట్టే పితూరీలు, కలహాలు చాలా ప్రాముఖ్యమైనవే, కానీ వట్టి ఈయనని మాత్రమే ప్రధాన పాత్రగా పెట్టి వీళ్ళు ఏం కార్టూన్ ఫిలిమ్ లాగిస్తారో నా ఊహకు అందడం లేదు. నా ఆలోచనల్లో నేను ఉండగానే నారద పాత్ర తాలూకు కొన్ని నమూనా చిత్రాలు నాకు చూపించారు. కార్టూన్ సినిమాలంటే ఆ కాలానికి వాల్ట్ డిస్నీ నిర్మాణ సంస్థ పెట్టింది పేరు. వారు ఆ తరహా సినిమా పాత్రల నిర్మాణానికి సాధ్యసులభమైన ఒక బొమ్మల వ్యాకరణమొకటి తయారుచేసి పెట్టారు. మానవులు కానీ జంతువులు కానీ, సృష్టిలో కనిపించే ప్రతీదానిని కార్టూన్ సినిమాలకనుగుణమైన విధంగా శైలీకృతం చేసిన ఆ పనిలో ఒక అందం ఉంది. కానీ వీళ్ళు గీసిన నారదుడి నమూనా చిత్రం కార్టూన్ సినిమా శైలికోసం చేసినట్లుగా ఏ మాత్రం లేదు. మానవుల సాధారణ శరీర నిర్మాణ సంబంధమైన నిష్పత్తులలోనే ఈ బొమ్మ చిత్రకల్పన జరిగింది.

‘ఇక చాల్లే’ అంటూ ఆయన్ని కాస్త ఆగమని, నేను గొంతు సవరించుకుని- వారు తీయాలనుకుంటున్న ఆ సినిమా తాలూకు కథ మీద, వారు సంకల్పించిన ఆ ముతక హాస్యం మీద, ఆ పసలేని బొమ్మ తయారి మీద ఆవేశంగా విమర్శలు కురిపిస్తూ నా అమూల్యమైన అభిప్రాయాన్ని ఆయనకు తెలియజేయాలనుకున్నాను. కానీ ఎందుకో, ఏదో మూలలోనో కాసింత నా ఇంగిత జ్ణానం మేల్కొని ‘అరేయ్ అబ్బాయ్! నువ్వు వీరిని కలిసి కనీసం రెండు గంటల సమయం కూడా కాలేదు, నీకా మునుపు ఇటువంటి చిత్రాలతో కానీ, చిత్ర నిర్మాణంలో కానీ ఎటువంటి అనుభవమూ లేవు. ఈ కథ వ్రాసినవాడా చిత్ర పరిశ్రమలో పెద్ద పేరున్నవాడు. ఈ చిత్ర దర్శకుడా, నీవు చిన్నవాడివని, కొత్తవాడివని కూడా తలవకుండానే, నీకు గౌరవం ఇచ్చి నీపట్ల కాస్త దయ, ప్రేమ చూపించి, నిన్ను ఇంతవరకు రానిచ్చారు. మరి నువ్వు ఏం చేస్తున్నావు? నీకు కలిగిన ఒక తాత్కాలిక భావావేశంతో చేస్తున్న పనినే నాశనం చేసే విప్లవం ఒకటి తెచ్చి, ఇక్కడి వాతావరణాన్ని పాడుచేద్దామని చూస్తున్నావు. అసలు ఉన్నదో లేదో తెలియని నీ తాలూకు ఒక జ్ణానాన్ని ఇక్కడ ప్రదర్శిద్దామని చూస్తున్నావు. కంట్రోల్ లక్ష్మణ్ కంట్రోల్! నువ్వు ఇక్కడ ఒక కీ డ్రాయింగ్ ఆర్టిస్ట్‌వి. ముందుగా వారు ఏం చెబుతున్నారో, ఏం చెయ్యబోతున్నారో శ్రద్దగా విను, నీకు చేతనయినంతలో వారికి ఆ పని ద్వారా సాయపడు. అంతే కానీ దయచేసి వారికి బోధించే పని మాత్రం పెట్టుకోవద్దు.’ అమ్మ మాట వినే మంచి పిల్లాడిలా నేను నా బుద్ది మాట్లాడుతున్న మాట విని, నా అసహనాన్ని, అనవసర ఆలోచనలను నియంత్రించుకుని వారికి ఆ సినిమా పనిలో సాయపడటానికి సిద్దమయ్యాను.

నారదుడి సినిమా కథ ఈ విధంగా ఉంది. శ్రీమాన్ నారదమహర్షి ఈ లోకం నుండి ఆ లోకానికి – ఈ దేవుడి దగ్గరి నుండి ఆ దేవుడి దగ్గరికని – అలా ఇలా అటూ ఇటూ తిరుగుతూ ఉన్న క్రమంలో ఒక మేఘం మీది నుండి కాలు జారిపడతాడు. ఆ జారుడు సరాసరి భూలోకంలోని ఒక హెయిర్ కటింగ్ సెలూన్ మధ్యలో ప్రతిష్టాపితమై ఉన్న రివాల్వింగ్ కుర్చీలోకి కూలపడి, ఆ కుర్చీ గిర్రున తిరిగి తల మైకం వచ్చేస్తుంది. స్వర్గం నుండి దిగిపడిన ఈ మహానుభావుడు ఎవరో సరిగా గుర్తించలేని మంగలాయన, నెత్తి నిండా గిరజాలు, మొహం నిండా మీసాలు గడ్డాలు పెరిగివచ్చిన పెద్ద గిరాకీగా భావించి క్షవర నిమిత్తం అతని మెడ చుట్టూ ఒక వస్త్రం చుడతాడు. ప్రస్తుతానికి కథ ఇంతవరకు మాత్రమే వ్రాయబడింది. ఇటువంటి కడుపుబ్బా నవ్వించి, మమ్మల్ని కకావికలు చేసే హాస్యసన్నివేశాలు ముందు ముందు ఇంకా చాలా సృష్టింపబడుతున్నాయి-అని దర్శకుడు చెప్పాడు. ఆయన చుట్టూ నిలబడి ఆ కథ వింటున్న తతిమ్మా సిబ్బంది ప్రకటించిన స్పందన చూసి నేను తెగ ఆశ్చర్యపొయాను. కథను వింటూ ఆ హాస్యరసపు చిలకరింతల్లో వారు ఊగిపోయారు. ఒకరి వీపుల మీద ఒకరు పకాలున నవ్వుతూ చరచుకున్నారు, మంగలి షాపు కుర్చీలో కూలబడిపోయిన నారదుడి దుస్థితి విని పకపకలయ్యారు. వికవికలయ్యారు.

ఎంత కంట్రోల్ లక్ష్మణా, కంట్రోల్ అని నన్ను సముదాయిందుకుందామనుకున్నా ఈ పిచ్చి హాస్య కథకు తన్మయులైపోతున్న వీరి మధ్య నేను మూడు నెలలు ఎలా గడపగలనని బెంగ పట్టుకుంది. అక్కడ మంగలి కుర్చీలో పడ్డ నారదుడికి, ఇక్కడ, ఈ కీ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కుర్చీలో పడ్డ నాకు ఉన్న సారూప్యం వెనుక గల విధి చేయు వింత గురించి ఆలోచిస్తున్నాను. భవిష్యత్తు ఇలా ఉంటుందని ఊహించకపోవడం వలన కొంసేపటి క్రితమే ఈ సినిమాకు కీ ఆనిమేటర్‌గా పనిచేస్తానని ఒప్పందపత్రంపై సంతకం చేసినందువలన, ఇప్పటికిప్పుడు మైసూర్ వైపు తిరిగి పారిపోవడానికి, సెలవుల మూడు నెలల కాలం హెచ్‌కెతో గడపటానికి నాకు ఇక మార్గం లేకుండాపోయింది.

అందుకని నేను నా మేధకు, నాణ్యతాపరమైన నా కళాదృష్టికి మూతవేసి తాళంపెట్టి నా స్టూడియో సహోద్యోగుల తెలివితేటలు మరియు సౌందర్య ప్రమాణాలకు అనుగుణంగా నన్ను నేను సరిదిద్దుకున్నాను. ఆ మరుసటి రోజు నుండే సినిమా నిర్మాణంలో పని ప్రారంభించాను.

ఏది ఎలా ఉన్నా దర్శకుడు నాకు ఇక్కడ ప్రత్యేక హోదా ఇచ్చాడు. నాకు తనతో పాటు తన కార్యాలయపు గదిలో చోటునిచ్చాడు. అంతే కాదు, ఈ కొత్త పనిలో నాకు ఎక్కువ ఇబ్బందులు కలగకుండా నాకు చాలా సులభమైన పనిని అప్పగించాడు. ఈ సినిమాకు నేను చేయవలసినదల్లా స్వర్గం నుండి కాలు జారిన నారదుడు గిరికీలుకొడుతూ భూమి పైకి కూలబడే బొమ్మలు గీయడమే.

నేనిక పనిలో మునిగిపోయాను. ధోతి, పై కండువా ధరించిన ఒక వ్యక్తి కాలు జారడం, పల్టీ కొట్టడం, ఆ చర్యకు అనుగుణంగా చేతులూ, కాళ్ళూ వెనక్కి తన్నడం, దుస్తులు గాలిలో ఎగరడం వంటి దృశ్యాలను ఊహించి స్కెచ్‌లుగా వేసి దర్శకుడికి చూపించాను. అతను ఆ బొమ్మలు చూసి ముగ్దుడయ్యాడు. వెంటనే తన టేబుల్ పైనున్న గంట మోగించి తతిమ్మా సిబ్బందినంతా అక్కడికి పిలిచి నా బొమ్మలు చూడమన్నాడు. వారంతా ఆ నారద పతనాన్ని చూసి దానిని మెచ్చుకుంటూ తమ నాలుకలని అంగిలికి తాకించి లొట లొట లొట్టల చప్పుళ్ళు చేశారు. దర్సకుడు నన్ను ఆ విధంగా అలాగే ముందుకు సాగిపోతూ నారదుడు పైనుండి కిందికి జారిపోవడంలో నా సృజనాత్మకతను అంతా వినియోగించమని కోరాడు.

నాకు సినిమా రంగం యొక్క సాంకేతికత గురించి అంత అవగాహన లేదు. ఆనిమేషన్ గురించి అసలే లేదు. ఒక సెకను కదలికకు ఇరవై నాలుగు డ్రాయింగ్‌ల అవసరం ఉంటుందని విన్నాను. నారదుడు పైనుండి క్రిందకు పడే సన్నివేశం దాదాపు నలభై సెకన్ల పాటు ఉంటుందని చెప్పారు. అంటే కేవలం నారదమహర్షి నలభై సెకండ్ల పాటు అక్కడినుండి ఇక్కడికి జారాలంటే ఆ మాత్రం కదలిక కోసం దాదాపు వెయ్యి బొమ్మలు (960) వేయాలన్నమాట! ఓరి దేవుడా! నేను బెంబేలెత్తిపోవడాన్ని సినిమా ఎడిటర్ వినోదంతో చూశాడు, ఆయన నవ్వుకున్నాడు. అన్ని బొమ్మలు నేను వేయనక్కరలేదని అంత కంగారు పడవద్దని, నేను వేయవలసినదల్లా పదుల సంఖ్యలో కొన్ని కీలక స్కెచ్చులు మాత్రమేనని, వీటి ఆధారంగా మధ్యలో రావలసిన బొమ్మలను వేరే చిత్రకారులు చిత్రీస్తారని ధైర్యం చెప్పాడు.

నేను ప్రతిరోజూ ఎనిమిది గంటలకు పైగా స్టూడియోలో గడిపేవాడిని. నేను గీసిన ఒక కీ డ్రాయింగ్ నుండి మరో కీ డ్రాయింగ్ మధ్య జరిగే కదలికల బొమ్మలను మరో ఆర్టిస్ట్ గీయడాన్ని ఆసక్తిగా గమనించేవాడిని. ఇలా గీసిన బొమ్మల వరుసను ఒక పారదర్శక ఫిలిమ్ వంటి దానిపై మరి ఒకరు చిక్కని గీతాలతో నకలు గీసేవారు. తదుపరి ఈ బొమ్మలని ఫ్రేమ్ తరువాత ఫ్రేమ్‌గా కెమెరాలో షూట్ చేసేవారు.

స్టూడియోలో పని ముగించుకుని నేను రాత్రి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నన్ను ఎవరూ చూడని సమయంలో ఆ మెట్ల మీద నుండి నేను కిందకు పడవలసివస్తే, అసలు పడిపోవడం అనేది ఎలా జరుగుతుంది? చేతులు, కాళ్ళు ఏ కోణంలో లేస్తాయి? హఠాత్ పరిణామం వలన శరీరంలో పుట్టే వణుకు, కాళ్ళ, చేతుల మెలికలు. మొహంపై భయోత్పాతం… వంటి కీలకమైన అంశాలను జాగ్రతగా మననం చేసుకునేవాడిని. ఈ వివరాలన్నీ ఒక కాగితంలోకి ఎక్కించుకుని నా బొమ్మల మధ్య బొమ్మలు చిత్రించే చిత్రకారులకు సూచనలుగా అందజేసేవాడిని.

ఎట్టకేలకు మా ప్రస్తుత ఎపిసోడ్ షూటింగ్‌ పూర్తయి, సినిమా డెవలప్‌ అయి చూడటానికి సిద్ధంగా ఉండటం మా జీవితాల్లోని అత్యంత ఉత్తేజకరమైన క్షణాలలో ఒకటి. దర్శకుడు మమ్ముల అందరినీ ఎడిటింగ్ రూమ్‌లోని చిన్న తెరపై సినిమాని చూడమని అడిగాడు. కొన్ని నెలలపాటు చెమటలు చిందించి చిత్రించిన బొమ్మలు, మేధో శ్రమ, వేడి వేడి చర్చలు, వాడి వాడి వాదనల అనంతరపు మా కలల ఫలం, మా శ్రమ ఫలితం ఇప్పుడు తెరపై కేవలం పదిహేను సెకనుల పాటు నడిచిన చిన్న కదలిక. అదీనూ డొంకల్లో బండి నడకల వంటి కుదుపులతో కనపడింది. పదిహేను సెకనుల సినిమా మా వీక్షకుల ముఖాలపై నిరాశని మిగిల్చిపెట్టింది. మా మొహలు చూసిన ఎడిటర్‌గారు, ఇది కేవలం చిన్న టెస్ట్ మాత్రమేనని, అంతిమంగా నేపథ్య సంగీతంతో కలిసి సినిమా అద్భుతంగా వస్తుందని హామీ ఇవ్వడం ద్వారా మాలో కాస్తయినా చైతన్యాన్ని పెంచడానికి ప్రయత్నించారు. కానీ నాకేం అది నమ్మదగ్గదిగా అనిపించలేదు.

ఈ సినిమా కాలంలో నా విషయానికొస్తే నన్ను నేను కాస్త నియంత్రించుకోవడం నేర్చుకున్నాను. ఏది ఎలా ఉన్నప్పటికీ నా భావాలను, నా అభిప్రాయాలను నాలోనే దాచుకునేవాడిని. ‘మరి నీ అభిప్రాయమేమిటి లక్ష్మణ్!’ అంటూ నా వైపు చూసేవారిని చూసి జవాబుగా నవ్వుతూ, దేనికయినా సరే అంగీకారపూర్వకంగా తల ఊపుతున్నాను. ఈ సినిమా రోజుల్లో నాకు ఉన్న ఆసక్తి, నేను చూపుస్తున్న శ్రద్ద అల్లా నెల తిరగ్గానే వచ్చిపడే నా జీతం డబ్బులు, సినిమాకోసమని స్కెచింగ్ ప్రాక్టీవ్ చేసే అద్భుతమైన అవకాశం, ఇంకా ఈ స్టూడియో క్యాంటీన్ అందించే రుచికరమైన ఉచిత భోజనం మాత్రమే.

నేను ఈ సినిమాకు పనిచేయడం మొదలుపెట్టి మూడు నెలలవుతుంది. ఇంత కాలం గడిచినా, నారదుడు అంతరిక్షం దాటి భూమి పైకి తన కాలు పెట్టే ఘడియ రాలేదు. ఆయన ఇంకా అదేదో కవికి మల్లే దిగిరాను దిగిరాను దివినుండి భువికి అంటున్నాడు. నాకు ఈ కీ డ్రాయింగ్ గీసే దిక్కుమాలిన పనిమీద విపరీతమైన విసుగ్గా ఉంది. ఇదే సమయంలో తమ వేతనాలు పెంచాలని కోరుతూ అఖిల భారత తపాలా ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. పరిష్కారం కోసం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దినపత్రికలో ఆ వార్తను చదువుతున్నప్పుడు ఈ విషయం కోసం ఒక అద్భుతమైన కార్టూన్ ఆలోచన నాకు వచ్చింది. వచ్చిన ఆలోచన ఆధారంగా ఒక కార్టూన్ చిత్రించాను. కానీ ఆ కార్టూన్ ప్రచురణకు ఎవరిని కలవాలో నాకు అర్థంకాలేదు. దానిని తీసుకుని హిందూ లేదా ఎక్స్‌ప్రెస్ పత్రికల సంపాదకులను కలిసేంత ధైర్యం నాకు లేదు. అప్పుడే నాకు మద్రాసు నుండి వెలువడే స్వరాజ్య అనే మాసపత్రిక సంపాదకునితో పరిచయం కలిగి ఉన్న ఒక స్నేహితుడు గుర్తొచ్చాడు. అతని సహాయంతో స్వరాజ్య పత్రికాఫీసులో ఎడిటర్‌ని కలిశాను. ఆయన నా కార్టూన్‌ని చూసి మరో రెండు రోజుల్లో విడుదల కానున్న స్వరాజ్య యొక్క తాజా సంచికలో ఈ కార్టూన్‌ని ప్రచురించడానికి అంగీకరించాడు. ఆపై ఆయన నాకు చాలా క్షమాపణలు చెబుతూ నా కార్టూన్‌కు యాభై రూపాయల ఇచ్చి, స్వరాజ్య పత్రిక చెల్లించగలిగే పారితోషికం ఇంతమాత్రమేనని చెప్పాడు.

నారదుడి చేతుల్లో బందీ అయిన నాటి నుండి నా పనిలో ఉత్సాహం లేకుండా ఉండింది. ఈ కార్టూన్ ఆలోచన నాకు వచ్చి, దాన్ని గీసిన తరువాత ఈ క్షణం వరకు జరుగుతున్న సంఘటనలన్నీ చాలా వేగంగా జరిగాయి. నా కార్టూన్ స్వరాజ్య పత్రికలో ప్రచురణకు అంగీకరింపబడటం, దానికి పారితోషికం అందడం వంటి కలలు కనే స్థితి నుండి నన్ను నేను మేల్కొలపడానికి కూడా నాకు స్పృహలేని ఆనందంలో, చివరకు నన్ను మేల్కొల్పింది స్వరాజ్య ఎడిటర్ ఇచ్చిన మరొక ఆనందకరమైన వార్త! నేను అంగీకరిస్తే, స్వరాజ్యలో ప్రతి నెలా నా నుండి ఒక కార్టూన్ తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. స్వరాజ్య పత్రిక వారికి ఆ తరువాత నేను మరో రెండు కార్టూన్లు అందించాను.

మా నారదుడు ఆకాశంలో ప్రయాణిస్తూ ఒక విపత్కారి అయిన మేఘంపై కాలు జారిపడి మంగలాయన కుర్చీలో కూలపడే సమయానికి నేను నా బొమ్మల ద్వారా మదరాసు మహానగరంలో మరో వంద రూపాయలు వసూలు చేశాను. ఇక నా సెలవులు ముగిశాయి. నారదుడిని కుర్చీలో కూచోబెట్టి అతను అందులో గిరగిరా తిరిగే సమయమొచ్చేసరికి నేను హాయిగా మైసూరుకు తిరిగి వచ్చాను. ఆ తరువాత చాలా సంవత్సరాల తర్వాత నేను హాలీవుడ్‌లోని డిస్నీ స్టూడియోని సందర్శించాను. ఇది ఎన్నో ఎకరాలలో విస్తరించి ఉంది. దానిని చూస్తుంటే నిజానికి నాకది ఒక కళాసృష్టి జరిగే ప్రాంతంలా కాక ఒక విశాలమైన మెకానిక్ ఫ్యాక్టరీ లాగా కనిపించింది. మిక్కీ మౌస్, ఇంకా మిగిలిన జంతువులను రూపొందించడంలో అక్కడ వేలాదిమంది కళాకారులు, దర్శకులు కార్మికుల్లా పనిచేస్తున్నారు. కీ స్కెచ్‌లను సెల్యులాయిడ్‌లోకి కాపీ చేయడం కోసమే అక్కడ దాదాపు రెండువందల మంది కళాకారులు, వారిలోనూ ఎక్కువగా మహిళలు శ్రమిస్తున్నారు. వీరు చేస్తున్న ఈ ప్రత్యేకమైన పని కోసం కేవలం ఐదుగురు ఉండిన అప్పటి మద్రాస్ స్టూడియో నాకు గుర్తుకువచ్చింది.

మిస్టర్ వాల్ట్ డిస్నీని కలవడానికి నేను చాలా ఆసక్తి చూపించాను. ఆనిమేటెడ్ జీవుల ఊహా ప్రపంచం ఈ సినిమా రంగానికి అతను అందించిన గొప్ప అద్భుతం. కాని అతడిని నేను ప్రత్యక్షంగా కలిసినపుడు నాకు కలిగిన నిరాశని వర్ణించడానికి నాకు తెలిసిన మాటలు సరిపోవు. వాల్ట్ డిస్నీని నేను ఒక కళాకారుడిగా ఆరాధించాను. కానీ అతని మాటల్లో అతడిని వింటుంటే కేవలం ఒక పారిశ్రామిక వ్యాపారవేత్త మాత్రమే. అతనికి తెలిసినదల్లా వ్యాపారం, డబ్బు, సంపద, అమ్మకం. డిస్నీని కళాకారుడిగా ఊహించుకోవడం ఒక అద్భుతమైన ఊహ మాత్రమే.


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...