ఈ మధ్య అంటే మరీ ఈ మధ్యే బుజ్జాయిగారిని తలుచుకున్నాను. టెలిగ్రామ్ అనే ఆప్‌లో ఎవరో షేర్ చేయగా చిరంజీవి అనే బొమ్మల కథ అందులో చేరింది. సినిమా నటులు చిరంజీవిని ప్రధానపాత్రను చేసి చిత్రించిన కామిక్ అది. బుజ్జాయిగారి బొమ్మల కథలను, అందులోని పాత్రలను, ఆ సన్నివేశాలను, ఆ ముచ్చటైన అరేంజ్మెంట్‌ను ఈ రోజు కొత్తగా తెలుసుకున్నవాళ్ళం కాదు కదా! కానీ ఈ కొత్తగా చూస్తున్న ‘చిరంజీవి’ నన్ను మంత్రముగ్దుణ్ణి చేసింది. చిత్రకారుడికి కాల్పనికమైన పాత్రలను సృష్టించడం పెద్ద గొప్ప విషయం కాదు, అలా అని మన మధ్య ప్రాణం పోసుకుని తిరుగుతున్న మనకు బాగా తెలిసి ఉన్నవారినీ బొమ్మల్లో ప్రాణప్రతిష్ట చేయడం అతి కష్టమైనదా? అని అడిగితే ఒక బొమ్మని మాత్రమే చిత్రించడం అయితే పెద్ద కష్టమూ, గొప్పాకాదు. కానీ కామిక్ ఫ్రేముల్లో కొన్ని వందలసార్లు ఒక పాత్రని అందునా మనకు బాగా తెలిసి ఉన్న ఒక ప్రముఖుడిని ఏ వైపు నుంచి చూసినా అరచేయి కొలత నుండి అగ్గిపుల్ల మొనంత వరకు ఆ క్యారెక్టర్ని గీయడమనేది అంతగా క్రాఫ్ట్ నైపుణ్యం లేని తెలుగు చిత్రకళారంగంలో ఒక అసాధ్యమైన పని. నాకు తెలిసి ఈ పనే అంతర్జాతీయ స్థాయిలో అమెరికన్ చిత్రకారులు మార్ట్ డ్రకర్ చేయగలిగారు. అయితే ఆయన తన బొమ్మల కథలన్నీ ఆయా సినిమాలను వీడియోలుగా చూస్తూ పాజ్ చేసో, ప్రింట్ తీసో వేసిన బొమ్మల కథలు. ఆయన బొమ్మల్లో తెగ డిటైల్ ఉంటుంది. బుజ్జాయిగారు అలా కాదు అమిత సింప్లీ ఆయన బొమ్మల బ్యూటీ. బుజ్జాయిగారి బొమ్మలతో పోల్చుకోదగిన అలతి రేఖల ఆర్టిస్ట్ అంత సులువుగా మరెవరూ కానరారు. అందువల్లనే ఒకానొక సమయంలో దేశంలోకెల్లా ప్రఖ్యాతి గాంచిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలో బుజ్జాయిగారి బొమ్మలు మాత్రమే ప్రచురితం అయ్యాయి. మరే తెలుగు చిత్రకారులు ఎంత ప్రయత్నించినా అందులో చోటు చేసుకోలేకపోయారు. ఏం రేఖ ఆయనది, ఎంత చక్కని కూర్పు ఆయన బొమ్మలది! తొలి ఉదయపు లేత ఎండ కాంతివంటి ఆయన రంగులు బొమ్మల మీద జిగేలుమనేది. ఎంత మంచి బొమ్మలవి, రంగుని రేఖ తినేది కాదు, రేఖని రంగు మింగేది కాదు. సమన్వయం- సంతులత తెలిసిన ఒబ్బిడి రకం చిత్రకారులు ఆయనా, ఆయన బొమ్మలూనూ. బుజ్జాయిగారు మనిషీనూ అంతే.
ఏళ్ళ క్రితం ఒకసారి మదరాసు ప్రయాణం పెట్టుకున్నాము నేనూ మా ఫ్రెండ్ విజయ్‌వర్ధన్‌గారూనూ. మా మదరాసు ప్రయాణానికి ముందు బాపుగారు మాకు ఫోన్‌లో “మీరూ ఆ హోటల్, ఈ లాడ్జ్ అని ఎక్కడా దిగవద్దు. సరాసరి ఇంటికే వచ్చేయండి. మా ఇంట్లోనే ఉండండి” అని హెచ్చరిక చేశారు. అయితే మేం మాత్రం ఎందుకని వారిని ఇబ్బంది పెట్టడం అంటూ ఉదయం మదరాసులో ఒక హోటల్ రూమ్‌లో దిగి సామాను అదీ అక్కడ పడేసి ముందుగా బుజ్జాయిగారి ఇంటికి వెళ్ళిపోయాం. ఆయన బొమ్మ ఎంత పొదుపో మనిషీ అంత మితం. మృదువైన నవ్వు, నడత. ఆయన చిన్నతనపు కబుర్లు, ఆ బొమ్మల ముచ్చట్లు, యవ్వనపు రోజుల్లో బాపుగారు స్కూటర్ ఎక్కి వారి ఇంటి వద్దకు వచ్చి హారన్ మ్రోగించడం, ఈయన బయటికి వచ్చి బండెక్కడం, ఆ చెట్టాపట్టాలు, బొమ్మల గురించి తాపత్రయాలు పడ్డాలు అవన్నీ చెబుతుంటే కళ్ళముందు ఒక చక్కని నలుపు తెలుపు రంగు సినిమా కదలాడినట్లు ఉంది. విజయవర్దన్‌గారు బాపుగారి గురించి, ఆయన బొమ్మల శైలి గురించి ఇంకా బొలెడన్ని కబుర్లు ఆయనతో చెప్పించి ఒక వీడియో ఫిల్మ్ లాగాలని కామ్‍కార్డర్ కూడా పట్టుకుని ఆయన సంభాషణనంతా షూట్ చేశారు. ఆ రోజు భలే రోజు. ఉదయం బుజ్జాయిగారితో, మధ్యాహ్నం బాపుగారు, రాత్రి చందమామ శంకర్‌గారితో గడిపి మాట్లాడి, కాపీలు తాగి భోజనాలు చేసీ. వీడియో షూటింగుల పుణ్యం సంపాదించుకున్న రోజు. సరే ఏవయ్యింది, ఉదయం బుజ్జాయిగారితో మాటా ముచ్చటా ముగించి టాటా బై బై చెప్పి హోటల్ రూముకి వెళ్ళి బ్యాగులు అవీ సర్దుకుని ఏమీ ఎరగనట్ల్గుగా బాపుగారి దగ్గరికి వెళ్ళిపోయాం. “మీరు ఉదయం కదా రావాల్సింది, ఇప్పుడు వచ్చారేం?” అన్నారు. “సర్, ట్రైన్ బాగా లేట్ అయ్యింది, నిజంగా సరస్వత్తోడుగా మేము హోటల్‌లో దిగలేదు. ట్రైన్ దిగగానే సరాసరి మీ దగ్గరికే వచ్చేశాం” అని తెగ అబద్దాలు ఆడేసి ఆ పై కబుర్లు చెప్పుకోడం మొదలెట్టాం. బాగా సమయం గడిచాకా బాపుగారు అన్నారు కదా- అలిసిపోయి ఉంటారు వెళ్ళి ఆ గదిలో కాస్త నిద్ర పొమ్మని. నేను ఆ గదిలోకి వెళ్ళి దొర్లుతున్నానా, కాసేపటికి నా మొబైల్ మోగింది, చూస్తే బుజ్జాయిగారు. “ఏం సార్?” అని రహస్యంగా అడిగా. “అన్వర్, బాపుతో మాట్లాడి చాలా కాలం అయ్యింది, ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి మాట్లాడతా” అన్నారు. ఇక్కడ నా పని ఝాటర్ ఢమాల్! ఏమని ఇస్తాం? మేము ఇప్పుడే దిగాం, ఇక్కడే దిగాం, అని ఇప్పటికిప్పుడు ఆడపిల్లలు పుట్టేంత అబద్దాలు ఆడి, మళ్ళీ ఇప్పటికిప్పుడే, అబ్బే అదంతా హుష్, తొలుత హోటల్‌లో దిగి, ఆ పై బుజ్జాయిగారి ఇంటికి వెళ్ళి… ఇలా నిజాలు పలికే బదులు “కాదు సర్, పాపం బాపుగారికి థ్రోట్ ఇనెక్షన్, సరిగా మాట్లాళ్ళేకపోతున్నారు, నిద్రపోతున్నారు, అయినా లేపనా”? అన్నాను. “అయ్యో! వద్దండి, నేను తరువాత ఎప్పుడయినా చేస్తా లెండి.”
ఒకే సమయంలో గొప్ప తపన, పనితనం తెలిసిన చిత్రకారులంతా తమ బొమ్మలతో దేశాన్ని ఉర్రూతలూగించిన సమయమది. ఇటు వేపు బాపు, వపా, బుజ్జాయి, చిత్ర, శంకర్ దాదాపు ఆ మదరాసు వీధుల్లో నడకలుగా, ఆ తెలుగు పత్రిక పేజీల్లో రేఖలను పరుగులుగా సాగిన కాలం. ఎంత గొప్ప రోజులవి! ఎంతగా దాచుకోవలసిన మనుష్యులు మనకుండేవారు! మన ప్రభుత్వాల ఆర్థిక కేటాయింపుల్లో చిత్రకళ అనే సాంస్కృతిక సౌందర్యంపై ఎవరికీ దృష్టి లేదు కానీ గొప్ప ఆనిమేషన్ చిత్రాలుగా, చరిత్రలో మిగుల్చుకోలేకపోతున్న గొప్ప గాథలని బుజ్జాయి బొమ్మల కథల్లో నిలుపుకుని ఉండాల్సిన పని. బుజ్జాయిగారి బొమ్మలు చూసిన ప్రతిసారీ నా మనసుకు అనిపించేది ఒకటే. బ్బా! ఎంత అలవోకగా ఈయన కాగితంపై బొమ్మని మిగులుస్తారు. నిజానికి ఎంత పనిని మనం ఈయన వద్దనుండి రాబట్టుకోవలసినది. యురోపియన్ దేశాల్లో ఆస్టెరిక్స్, టిన్ టిన్, అమెరికాలో గ్రూ ది వాండరర్‌కి రెండింతలు మూడింతలుగా మనకు బొమ్మల సంపద మిగిలి ఉండాలి కదా. ఎంత కథా సాహిత్యం మనదగ్గర మిగిలి ఉన్నది, లేనిదల్లా చిన్నారులకొరకు బొమ్మలు వేసే బుజ్జాయి వంటి చిత్రకారులే కదా. పడమట వాలిన సూర్యుడు తెలవారగానే తూరుపున వచ్చేస్తాడు. కానీ చరిత్రగతిలో- జాతి సాంస్కృతిక జీవనంలో ఒకరే బుజ్జాయి, ఒకరే బాపు, ఒకరే వడ్డాది పాపయ్య వంటివారు ఒకరే ఉంటారు. వారు సశరీరంగా శాశ్వతులు కారు కానీ వారి స్పూర్తి మాత్రం తరతరాలుగా శాశ్వతంగా ఉండవలసినది. వారు జీవించి ఉన్నప్పుడే వారితో వారి స్ఫూర్తితో చిత్రకళ, బొమ్మల్లో కథలు, వర్క్‌షాపులు నడిపించి ఎందరో కొత్త తరం బుజ్జాయిలని తయారు చేసుకోవాల్సి ఉందికదా! ఈరోజు బుజ్జాయి లేరు; ఆయన రచించిన పుస్తకాలు మాత్రం పుస్తకాల గూళ్ళ వరుసల్లో ఒక వరుసలో మిగిలాయి. ఏదో ఒక రోజున ఒక చిన్న హస్తం వచ్చి ఆ పుస్తకపు పేజీలు తెరిచి అందులోని బొమ్మలని చూసి వెలిగిన కన్నులతో బుజ్జాయి అంతటి చిత్రకారుడవ్వాలనే ఆశల కలలు కంటాయని, ఆవిధంగా ఆ గొప్ప చిత్రకారులు మనకి మిగిలే ఉండాలని, బుజ్జాయి అని మనకు తెలిసిన శ్రీ దేవులపల్లి సుబ్బరాయశాస్త్రిగారికి నివాళి.
(సాక్షి దినపత్రికలో జనవరి 29న ప్రచురించిన వ్యాసపు పూర్తిపాఠం – ర.]