ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 12

అయిదుమంది అన్నలే కాదు, నాకు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారని మీకు ముందే చెప్పాను కదా! ఆ ఇద్దరిలో చిన్నక్క ఉండేది ఢిల్లీలో. మా బావగారి పేరు ఎస్. ఏ. వెంకటరామన్. ఆయన ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో పెద్ద అధికారి. ఢిల్లీలో పరిశ్రమలు మరియు వాణిజ్యశాఖ కార్యదర్శిగా ఉన్నారు. ప్రభుత్వం ఆయనకు నివాసంగా ఒక పెద్ద బంగళాని కేటాయించింది. ఆ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పచ్చిక బయలు, టెన్నిస్ కోర్టు. ఆహా! మహా గోప్ప హోదాతో తగినంత దర్జాగా ఉండేది వారు నివసించే ఆ బంగళా. నేను ఢిల్లీలో ఉన్నంత కాలం వారివద్దే ఉన్నాను.

మైసూర్ పరిసరాల ప్రకృతికి అలవాటుపడ్డ నాకు ఢిల్లీ వాతావరణమంతా ఒక విషాదగాంభీర్యం నిండి ఉన్నదిగా తోచింది. సువిశాల నగర వైశాల్యము, ఆధికారిక గాంభీర్యమూ అనేవి ఒక్క నగర నిర్మాణం, అక్కడి మానవ స్వభావ దర్పాలకే పరిమితం కాకుండా ఈ ఢిల్లీ ప్రకృతి అణువణువులోనూ, వీచే గాలిలోను, వెలిగే ఎండలోనూ కూడా అది సమృద్దిగా నిండి ఉన్నట్టుగా అనిపించింది. విశాలమైన రోడ్లు వాటికి ఇరుపక్కల వరుసలలో నిలబడి ఉన్న చెట్లు కూడా తమకంటూ ఒక ప్రత్యేక ఆకారం, విశృంఖలమైన ఎదుగుదల, విశాల వ్యాప్తి అనే లక్షణాలు ‘ఢిల్లీవాసులము మేమెరుగమయ్యా’ అన్నట్టుగా ఆ చెట్లన్నీ పోతపోసినట్లు ఒకే సారూప్య రూపంతో నిలబడి కవాతుకు ముందు ఆజ్ఞాపూర్వకంగా నిలుచుని ఉన్న వరుస సైనికులుగా కనిపించాయి కానీ చెట్లలా అనిపించలేదు. మా మైసూరుకు వచ్చి మీరు అక్కడి చెట్లను చూడాలి. నుదుటి మీది నుండి కళ్ళ మీదకు జారే దుబ్బు జుత్తును కళ్ళు చిట్లించుకుంటూ కొమ్మ చేతులు పెట్టి తోసుకుంటూ కోతి కొమ్మచ్చి ఆటకు రెడీ రెడీ అన్నట్లు ఒక చైతన్యంతో భలే హుషారుగా ఉంటాయి మా ఊరి వృక్షాలు. మరి ఇక్కడా! అబ్బే ఏ లాభం లేదు. ఇక్కడ నేను ఎంత కాలం ఉంటానో అనుమానమే! ఊరు ఎట్లా ఉన్నా ఏముందిలే కాని, నేను ఉండటానికి వచ్చిన చిన్నక్క ఇల్లు మాత్రం విశాలంగా, గొప్ప సౌకర్యవంతంగా, హాయిగా ఉల్లాసంగా ఉంది.

మా చిన్నక్క స్నేహితులు, మా బావగారి అధికారపు హోదా తాలూకు పరిచయస్థులు, మిత్రులు, ఆయన కోసం వచ్చీ పోయే నిరంతర సందర్శకుల తాలూకు జనాలతో ఆ ఇల్లు నిత్యం సందడిగా ఉండేది. ఆ ఇంటి సాయంత్రాలు తరచూ చక్కని డిన్నర్ పార్టీలతో గలగల్లాడుతూ ఉండేవి. సాధారణంగా నేను నా గది కిటికీ లోంచి ఆ వచ్చిన సాయంకాలపు అతిథుల వైపు ఊరికే ఒక చూపు కలిపేవాణ్ణి కానీ అప్పుడప్పుడూ మైసూర్ లోని మా కుటుంబంతో స్నేహ బాంధవ్యాలు ఉన్న బంధుమిత్రులు వచ్చినపుడు మాత్రం నేను కూడా వారితో ఆ సాయంకాలపు సరదా విందులలో పాల్గొని తేలికపాటి మోతాదులో నిండివున్న నా గ్లాసును వారి గ్లాసులతో మిణుకుమిణుకుమనిపించి సరదా కబుర్లలో మునిగేవాడిని. మెల్లమెల్లగా నాకు అక్కడి ఇతర అతిథులతో కూడా స్నేహం ఏర్పడి, అది పెరిగి ఆ పై అది మా బావగారి పచ్చని బయలు సాయంత్రాల ప్రహరీ దాటి ఆ మిత్రుల కార్యాలయాలకు చేరి, ఇండియా కాఫీ హౌస్‌లో కలుసుకోవడాలు, కాఫీలు తాగడాలు, కబుర్లాడుకోవడాలూ వరకు సాగింది. దురదృష్టవశాత్తూ నా ఈ కొత్త మిత్రులు ఎవరికీ కూడా వార్తాపత్రికలు చదవడమనే పఠనా పరిచయం తప్పా పత్రికా కార్యాలయానికి సమీపంగా వెళ్ళిన, వెళ్ళగలిగిన పరిచయాలు లేవు. అదీ కాక అక్కడ ఒక మనిషి కుర్చీ వేసుకు కూచుని బొమ్మలు వేసే ఉద్యోగం చేయడమనేది ఏమిటో వారికి అందేది కాదు. అయినా నేను వారికి నా మనసు అంతా నిండి ఉండిన పత్రికా కార్టూనిస్ట్‌గా ఉద్యోగం చేయాలనే కోరికను వెల్లడించలేక ఉండేవాడిని కాదు. వారిలో కొంతమంది ఎంతో ఉదారంగా, స్నేహంగా తమకు వీలయినంత సహాయం నాకు చేస్తామని మాట ఇచ్చారు కూడా.

ఒక రోజు ఉదయం నేను ఇంట్లో ఉన్న సమయంలో నా కాఫీ హౌస్ స్నేహితుల్లో ఒకరు ఫోన్ చేసి, తను నా కోసం ఒక శుభవార్తను అట్టిపెట్టాడని, నేను వీలయినంత త్వరగా ప్రభుత్వ సచివాలయానికి వచ్చి ఆరోగ్య మరియు విద్యాశాఖలో తనను కలవాలని చెప్పాడు. వెంటనే నేను మా బావగారి ప్యూన్ సైకిల్ అరువు తీసుకుని ఒక్క ఉదుటున దాని మీదకు ఎగిరి, సౌత్ బ్లాక్ వైపు వీలయినంత వేగంగా దూసుకుపోయాను. సచివాలయపు నడవాల చిట్టడవి, అల్లిబిల్లిగా అడుగడుగున అడ్డు పడే మెట్ల దారులు, గంభీరమైన స్తంభాల అడ్డుకట్టడాలు, ప్రతి తలుపు దగ్గర రాజరికపు వస్త్రధారణ ధోరణిలో నిలువెల్లా మునిగి నెత్తి మీద పెద్ద తలపాగాలతో తేలియాడే దర్బానులను వీలయినంతమందిని తట్టుకుంటూ, తప్పించుకుంటూ చివరగా నేను నా స్నేహితుడి దగ్గరకు వచ్చాను. అతను నన్ను వెంట పెట్టుకుని ఆ మయసభ వంటి ప్రభుత్వ కార్యాలయం లోని ఒక గదికి తీసుకెళ్ళాడు: అది ఆరోగ్య మరియు విద్యాశాఖ అసిస్టెంట్ సెక్రటరీగారి కార్యాలయం. లోపలి విశాలమైన గదిలో సదరు శాఖ సెక్రటరీగారు ఒక పెద్ద డెస్క్ వెనుక, ఒక విలాసవంతమైన కుర్చీలో కూర్చుని ఉన్నాడు. మా ఇరువురి పరిచయాల తర్వాత నా స్నేహితుడు తనకు వేరే జరూరు పని ఉన్నదని చెప్పి మా ఇద్దరిని సంభాషణ కొనసాగించమని చెప్పి తను సెలవు తీసుకున్నాడు. ఆ గదిలో కూచున్న ఆ ఢిల్లీ పెద్ద అధికారి నాతో చక్కని కన్నడభాషలో మాట్లాడి నన్ను తెగ ఆశ్చర్యపరిచాడు. ఆయనా మైసూర్ వాడేనట! పైగా అక్కడ మైసూరులోని మా కుటుంబంతోను, మా నాయనగారు, అన్నలతో కూడా పరిచయం ఉందని, అంతే కాకుండా స్థానిక కన్నడ పత్రికలలో నా బొమ్మలను తను చూసేవాడినని కూడా చెప్పాడు.

ప్రస్తుతం ఆయన సమక్షానికి నన్ను పిలిపించిన కారణం ఏమిటంటే ఆరోగ్యశాఖ కొరకు నేను ఒక పోస్టర్‌ని డిజైన్ చేయాలిట. ఇతివృత్తం క్షయవ్యాధి. క్షయవ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలలో పౌరజ్ఞానాన్ని కలగజేయడమే నేను చిత్రించబోయే పోస్టర్ లక్ష్యం. ‘క్షయ వ్యాధి ఒక ప్రమాదకార ప్రాణాంతక వ్యాధి. కాబట్టి, ఓ ప్రజలారా! జనసమర్థ ప్రాంతాలలో రుమాలుతో మీ నోటిని కప్పుకోండి. మీ ప్రాణాలూ మీ తోటివారి ప్రాణాలూ కాపాడుకోండి!’ నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను కానీ నా అంతరాంతారాల్లోంచి ఒక స్వరం వెర్రిగా ఆక్రోశిస్తుంది. ఇందుకా? ఈ పనికోసమా? ఈ క్షయ వ్యాధి నిర్మూలనా ప్రచారంలో భాగం కావడం కోసమా ఇదంతా? చివరకు ‘నేను సైతం, నా కుంచె సైతం టి. బి. జాడ కనపడని రేపటి తెల్లరేకై పల్లవించడం’ అంటూ మైసూరు నుండి మదరాసుకు, మదరాసు నుండి ఢిల్లీ దాకా వచ్చింది? నా ఆత్మ నుండి టి. బి. వ్యాధి నొప్పి తాలూకు మూలుగుకన్నా తీవ్ర మహారోగగ్రస్తమైన మూలుగు ఒకటి మొదలైంది. జీవితంలో రాజకీయ కార్టూన్లు వేసే గీత రాసి పెట్టబడి ఉందా నాకసలు?

నా మిత్రుడు ఫోన్‌లో శుభవార్త అనగానే మొదట నాకు పొలిటికల్ కార్టూన్లు వేసే అవకాశం వస్తుందేమో అనుకున్నాను. దేశాన్ని నడుపుతున్నామనుకుంటూ, గప్పాలు కొట్టుకుంటూ, గొప్పలు చెప్పుకుంటూ తిరిగే రాజకీయ నాయకుల ముఖాలను నా కుంచెతో వెటకరించడం, వారు చేపట్టే తలతిక్క రాజకీయ సంఘటనల్లోని వ్యంగ్యాలను, వైరుధ్యాలను బయటపెట్టడం, మహానాయకులని పిలిపించుకునే వీళ్ళు నిజానికి ఎంత సర్కస్‌లో బఫూన్లని మించిన హాస్యగాళ్ళో చెప్పడానికి, వారి అసలు అవతారాలను బహిర్గతం చేయడం కోసమా నా కళ ఉన్నది? లేక ఈ రోజు క్షయ అయ్యింది. రేపు మలేరియా, కలరా, కామెర్లు, విరేచనాలు, బోదకాలుల గురించి ప్రజలకు అవగాహన కల్పించే పని కోసమా? దీనికన్నా నారదుడు మేలు కాదూ. అయినప్పటికీ, నా లోపల జరుగుతున్న మథనాన్ని గురించిన ఏడుపును నా ఆత్మకే అప్పగించి సదరు సెక్రటరీగారు చాలా దయతో నాకు అందించిన క్షయవ్యాధికి సంబంధించిన సాహిత్యం యొక్క కాగితాల కట్టను చేత పుచ్చుకుని ఆ కర్తవ్య బాధ్యతను గొప్ప ఉత్సాహంతో స్వీకరించినట్టుగా ఆయనకు కనిపిస్తూ నేను వారి గది నుండి బయలుదేరాను.

రెండు రోజుల్లో పోస్టర్‌ సిద్ధం అయింది, ‘వద్దు, బహిరంగ ప్రదేశాలలో దగ్గు!’ అనే నినాదంతో బొమ్మని పూర్తి చేశాను. ఆ పోస్టర్ నిండా పెద్దగా ఒక మనిషి మొహం చిత్రించి ఉంటుంది. అతని వికృతమైన దగ్గు నుండి వెలువడుతున్న తుంపరలన్నీ ప్రాణాంతకమైన చిన్న బాంబులుగా రూపాంతరం చెంది నగరంపై కురుస్తూ ఉంటాయి. ఆ బొమ్మని చూసి సహాయ కార్యదర్శి చాలా సంతృప్తిచెందారు. ఆ పనిని ముగించిన తరువాత మళ్ళీ నేను ఆ అధికారితో కలవలేదు. అసలు ఆ కార్యాలయం దిక్కునే నడవకుండా జాగ్రత్తపడ్డాను. ఆ పోస్టర్ యొక్క అతీ గతీ ఏమయిందో కూడా నాకు తెలీదు.

దగ్గూ జలుబూ తుమ్ముల బారినుండి అకస్మాత్తుగా నా అదృష్టం ఒక మలుపు తిరిగింది. ఒక రోజు మా ఇంట్లో జరిగిన కాక్‌టెయిల్ పార్టీలో మా బావ నన్ను హిందుస్థాన్ టైమ్స్ పత్రిక సంపాదకుడికి పరిచయం చేశారు. ఒక మర్యాదపూర్వకమైన పలకరింపు తరువాత కొన్ని ఏమిటి? ఎలా? ఎందుకు? వంటి సాధారణ ప్రశ్నలూ – దానికి సమాధానాల అనంతరం ఆయన మరుసటి రోజు ఉదయం నన్ను తన కార్యాలయానికి వచ్చి తనని కలవమని ఆహ్వానించాడు. ఇక ఆ రాత్రి అసలు నేను నిద్రే పోలేదు. పొలిటికల్ కార్టూనిస్ట్ అయ్యే నా కల నెరవేరబోతుంది కదాని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నా ఆలోచనలన్నీ అటు నుండి ఇటు, ఇటు నుండి ఎటో అంటూ అన్ని వేపులా గింగిరాలు కొడుతున్నాయి. నిద్రపట్టక లేచి కూచున్నాను. కాసేపయ్యాకా కూచోబుద్ది పుట్టక మంచం చుట్టూ తిరిగాను. తిరిగి తిరిగి ఇక తిరిగే ఓపిక లేక వెళ్ళి మంచం మీద పడుకున్నాను. చీకటిలో కనపడని గడియారం దిక్కున తెల్లవారే సూర్యుడి కోసం చూస్తూ గడిపాను.

ఇచ్చిన అపాయింట్‌మెంట్‌కు అరగంట ముందే నేను హిందుస్థాన్ టైమ్స్ పత్రిక కార్యాలయానికి చేరుకొని ఎడిటర్‌గారి కోసం సందర్శకుల గదిలో వేచి ఉన్నాను. అక్కడ అప్పటికే కొంతమంది జనం ఆయన కోసం వేచి చూస్తున్నారు. సంపాదకుడుగారు వచ్చి రాగానే ఆ జనం మధ్యలో కూచుని ఉన్న నన్ను గుర్తుపట్టి, నవ్వుతూ పలకరించి స్నేహపూర్వకంగా కరచాలనం కోసం చేయి చాపారు. అంతమందిలో ఆయన నన్ను ప్రత్యేకంగా పలకరించడం గొప్ప కాదూ మరి! ఆయన అలా చేయడం వల్ల మిగతా జనం అంతా నా వేపు ‘ఎవరితను?’ అనే ఆసక్తితో చూడసాగారు. నిజం చెప్పొద్దూ నేను తబ్బిబ్బై గొప్పై పోయా. నాకు ఆయనంటే బాగా ఇష్టంగా అనిపించింది. పదిమంది జనం మధ్య మిమ్మల్ని స్పెషల్‌గా ఎవరైనా గుర్తిస్తే మీకు వారి మీద ఇష్టం కాక మరేం కలుగుతుంది చెప్పండి? అదొక్కటే అని కాదు. అతనిది నిజంగానే నిజాయితీతో కూడిన స్నేహపూర్వక స్వభావం. అది నన్ను ఎంతగానో ఆకర్షించింది. నేను వేసిన కార్టూన్లన్నింటినీ ఆయన ఎంతో ఏకాగ్రతగా, జాగ్రత్తగా చూశారు. ఆ బొమ్మల ద్వారా వారు నా రాజకీయ అవగాహనను, వ్యంగ్య భావాన్ని అంచనా వేయడం అనేది చేస్తున్నారని నేను స్పష్టంగా గ్రహించాను. నా కార్టూన్లు, బొమ్మలు, స్కెచ్చులు అన్నిటినీ పరిశీలించిన తర్వాత ఆయన వాటిని ఒక పక్కన పెట్టారు. నా పనిలో ఉన్న నాణ్యతా ప్రమాణాలు చాలా ఉన్నతంగా అనిపించినప్పటికీ ఆయన నాకు తమ సంస్థలో ఉద్యోగం ఇవ్వలేనని చెప్పారు. ఎందుకంటే వారి దగ్గర అప్పటికే అనుభవజ్ఞుడైన కార్టూనిస్ట్‌ ఒకరు సంవత్సరాల తరబడిగా ఆ సంస్థ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆయన పనిని ఆక్రమిస్తే వారు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇది క్రమేణా సంస్థ అంతర్గత కార్యకలాపాలకు ఎక్కడో ఒకక్కడ ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది. నిజానికి ఎడిటర్‌గారి ఆలోచన నూటికి నూరుపాళ్ళు సరైనదే. తరువాత ఆయన ఇలా కూడా అన్నారు – ఇక్కడ ప్రస్తుతం ఖాళీ లేదని, నేను నిరాశ పడకుండా వీలయితే వెళ్ళి అక్కడి పెద్ద కార్టూనిస్ట్‌తో ఒకసారి కలవాలని. ఆయనతో కాస్త సంభాషణ నడపాలని కూడా ఎడిటర్‌గారు కోరుకున్నారు. ఏమో! నన్ను ఇష్టపడి ఆ కార్టూనిస్టే నన్ను ఇక్కడ చేరమని సిఫార్సు చేయవచ్చు, మేము ఇద్దరం కలిసి పత్రికకు బొమ్మలు వేయడాన్ని కూడా ఆయన ఇష్టపడతారేమో!

నాకు ఈ కార్టూనిస్ట్‌తో మునుపు ఎటువంటి వ్యక్తిగతమైన పరిచయమూ లేకపోయినప్పటికీ ఈయన పని గురించి నాకు ఒక అంచనా అయితే ఉంది. ఈయన గీస్తున్న కార్టూన్లల్లో ఎటువంటి రాజకీయ అవగాహన కానీ బొమ్మల్లో గొప్ప నైపుణ్యం కానీ వ్యాఖ్యల్లో ఏమాత్రం చురుకుతనం కానీ నాకు ఎప్పుడూ అగుపించలేదు. నా వరకే అని కాదు నాకు తెలిసి ఈ పత్రిక చదివే పాఠకులు కూడా ఈయన కార్టూన్ చుట్టూ వ్యాపించి ఉన్న వార్తావిశేషాలను చదవనయితే చదువుతారేమో కానీ ఈయన గీస్తున్న కార్టూనులను ఆసక్తితో చూశారని కాని, ఈయనంటూ ఒక కార్టూనిస్ట్ ఈ లోకంలో ఉన్నాడని ఆయన గురించి పెద్దగా చర్చించుకోవడం కాని, నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు కూడా. ఏ విధంగా చూసినా నాకేమాత్రం పెద్ద ఆసక్తి కలిగించని వ్యంగ చిత్రకారుడు ఆయన. పని సంగతి ఎలా ఉన్నా ఆయన్నయితే కలిసిన మొదటి క్షణంలోనే గుర్తించాను ఈయన వ్యక్తిగా అత్యంత స్నేహశీలి అనే విషయం. నేను ఫలానా అని పరిచయం చేసుకుని నా బొమ్మల ఆల్బమ్ ఆయనకు అందించానో లేదో అందులోని ప్రతి బొమ్మని చాలా ఆసక్తిగా చూస్తూ, పరిశీలిస్తూ, తనని నవ్వించిన ప్రతి కార్టూన్ దగ్గర ఆగి పగలబడి నవ్వి, ప్రశంసాపూర్వకంగా నా వేపు తలాడిస్తూ నా పనిని అంతా ఎటువంటి మినహాయింపులు, ఈర్ష్యాసూయలు లేకుండా మెచ్చుకున్నారు. అంతా అయ్యాకా నేను అడగకుండానే ఒక ఉచిత సలహా కూడా దయతో నాకు దయచేశారు. రాజధాని నగరాల నుండి వెలువడే జాతీయ-అంతర్జాతీయ పత్రికలలో అవకాశాలు వెదుక్కోడానికి వచ్చేముందుగా నేను అనుభవం కోసం కొన్ని ప్రాంతీయ వార్తాపత్రికలలో పని చేస్తే మంచిది అని. నాకు ఆయన మాటల్లో ఈ పత్రికలో ఉద్యోగానికి ప్రయత్నించి తన దారికి నేను అడ్డు రావడం అంత మంచిది కాదు అనే సూచన ఒకటి చేస్తున్నట్లు అర్థమయ్యింది. అంతే కాకుండా తనకు ఒక పోటీదారుణ్ణి తెచ్చిపెట్టడానికి ఎడిటరే పనికట్టుకుని నన్ను అక్కడికి రప్పించాడని ఆయన భావిస్తున్నట్టుగా కూడా నాకు తోచింది.

నా ఉద్యోగప్రయత్నాల్లో ఒక ఘట్టం అలా ముగిసిందా! ఇంకోటి చెబుతా వినండి. ఇలానే ఎవరి పరిచయం వల్లనో నాకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ దినపత్రిక యజమానిని కూడా కలిసే అవకాశం వచ్చింది. ఆయన నన్ను తన సంపాదక శాఖలోని ఒక సీనియర్ని వెళ్ళి కలవమని చెప్పారు. సదరు పెద్దమనిషి ఉండేది కన్నాట్ సర్కస్‌లోని అపార్ట్‌మెంట్‌లో. నేను నా ఆత్రుతను, అవకాశాన్ని ఏ మాత్రం వాయిదా వేయకుండా ఆయన ఇంటికి బయలుదేరి వెళ్ళాను. తలుపు దగ్గర నిలబడి బెల్ కొట్టాను. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి… ఇలా ఓపిగ్గా, సహనంగా తలుపు దగ్గరే గణగణలాడుతూనే వేచి ఉన్నాను. చాలాసేపటి వరకు ఎటువంటి స్పందన లేదు. ఇక లాభం లేదని నేను అక్కడినుండి బయలుదేరబోతుండగా తలుపు తెరుచుకుంది. తలుపుకు ఆవల నెత్తిమీద చిందరవందరగా బూడిద రంగు వెంట్రుకలు వేసుకుని ఉన్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. నేను ఎవరు పంపగా వచ్చానో చెప్పాను. ఆయన తలుపు వేపునుండి జరిగి నాకు లోనికి రావడానికి దారి ఇచ్చారు. లోపలంతా చీకటిగా ఉంది. ఆయన నన్ను తన పడకగది వరకు తీసుకెళ్ళి నన్నో కుర్చీలో కూర్చోమని సైగచేసి తను మంచం మీదికి ఒరిగి అక్కడున్న లావుపాటి దుప్పటిని ముక్కువరకు లాగి కప్పుకున్నాడు.

ఆయనని కలవడానికి నేను రావడం వెనుక ఉద్దేశ్యం, నా అవసరం, నా ఆశయం, నా అనుభవంతో సహా నా అనేక వివరాలను వివరించాను. ఉద్యోగ అవసరార్థం కలిసిన ప్రతివారి ముందు ఇవన్నీ పునరావృతం చేయడం వల్ల నాకు ఈ ప్రవర అంతా కంఠోపాఠం అయ్యింది. నే చెప్పినదంతా ఆయన ఎటువంటి అభ్యంతరమూ అడ్డుమాటా లేకుండా కళ్ళు మూసుకుని శ్రద్దగా విన్నాడు. నేను నా బయోడేటా చెప్పటం పూర్తి చేసి మౌనం వహించినప్పుడు కూడా ఆయన శరీరం అణుమాత్రం కూడా కదలలేదు. నేను అతను, ఇంకా భరించలేని చీకటి నిశ్శబ్దం మాత్రమే కాక ఆ గది గాలిలో తేలియాడుతున్న బీరు వాసనల నుండి బయటపడ్డం కోసం ఆయనకు చెప్పకుండా గమ్మున అక్కడినుండి వెళ్ళిపోదామనుకున్న సమయంలో ఆయన తన తపస్సునుండి కొద్దిగా కదిలి ‘నువ్వు కార్టూనిస్ట్‌గా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? కార్టూన్లు వేయడంలో అంత గొప్ప ఏమున్నదబ్బా? పనికి వచ్చే వేరే పని ఏదయినా చేసుకోవచ్చు కదా?’ కళ్ళు తెరవకుండా సలహా ఇచ్చాడు. నేను మౌనంగా లేచి నిలబడ్డాను. వీలయినంత నిశ్శబ్దంగా అక్కడినుండి బయటికి నడిచాను. బహుశా ఆయన కూడా నా నిష్క్రమణను గమనించి ఉండకపోవచ్చు. నేను కోరుకున్న ఉద్యోగం నాకు దొరకటం లేదని నిరాశకు తోడుగా ఈ నిద్రనోపు సంపాదకుడి నిరుత్సాహపు సలహా కూడానా!

నిరుత్సాహాలు, నిద్రగొట్టు సలహాలను నేను పెడచెవిన పెట్టాను. చిన్న చిన్న అవమానాలను, ఆటంకాలను ఒక తల విదిలింపుతో దులపరించుకుని రాజకీయ కార్టూనిస్ట్ కావాలనే నా కోరికను గట్టిగా, ఇంకా బలంగా హత్తుకుని అలానే ముందుకు నడిచాను. ఆ నడక దారిలో నేను టైమ్స్ ఆఫ్ ఇండియాకి పొలిటికల్ కార్టూనిస్ట్‌ని అయ్యాను. ఆ అవడం మామూలుగా అవడం కాదు. భారతదేశంలో రాజకీయ వ్యంగ్య చిత్రకళకు ఒక పర్యాయపదంగా మారాను. కార్టూన్ గీయడంలో గొప్ప ఏమిటి అనే ప్రశ్నల నుండి దేశప్రజలు నా కార్టూన్ల కోసం ప్రతి ఉదయం ఎదురుచూసేంత కష్టపడి పని చేశాను. నా దేశంలోనే కాదు, కొన్ని విదేశీ వార్తాపత్రికలు – న్యూయార్క్ టైమ్స్ నుండి టైమ్స్ ఆఫ్ లండన్ వరకు, ఇంకా కొన్ని జర్మన్ పత్రికా ప్రచురణలు నా కార్టూన్లలో కొన్నింటిని పునఃప్రచురణ చేసేంత కార్టూనిస్ట్‌ని అయ్యాను. నా పనిలో నేను గుర్తింపు సంపాదించుకున్న కొన్ని సంవత్సరాల తరువాత, ఎక్స్‌ప్రెస్ గ్రూప్ పేపర్స్ వారి దగ్గరి నుండి ఒక సందేశం అందింది. భారతీయ వ్యంగ్య చిత్రకళను అత్యున్నత స్థాయికి తీసుకువెళుతున్న నా కృషిని గౌరవిస్తూ వారు నాకు భారీనగదుతో సహా బి. డి. గోయెంకా అవార్డును, ప్రశంశాపత్రాన్ని అందచేయాలనుకుంటున్నారని ఆ సందేశ సారాంశం. ఆ సందేశం అందుకున్న రోజున మాత్రం నా జ్ఞాపకపు పొరల వెనుక మరుగునపడి నిద్రిస్తున్న ఆ బూడిద రంగు జుత్తు సంపాదకుడిని గుర్తు చేసుకోకుండా ఉండలేక పోయాను. ‘నువ్వు కార్టూనిస్ట్‌గా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? కార్టూన్లు వేయడంలో అంత గొప్ప ఏమున్నదబ్బా? పనికి వచ్చే వేరే పని ఏదయినా చేసుకోవచ్చుకదా?’ వంటి ప్రశ్నలు గుర్తుకు వచ్చాయి. చేదుజ్ఞాపకాలే కాదు మా బావగారి ద్వారా పరిచయమయ్యి నా పట్ల ఎంతో స్నేహభావం, ఆప్యాయత చూపించిన హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ జ్ఞాపకార్థం ఇచ్చిన దుర్గారతన్ బంగారు పతకంతో కూడా నేను సత్కరించబడ్డాను.

ఇదంతా తరువాత జరిగిన కథ. మళ్ళీ వెనక్కి వెళదాం. నా ఉద్యోగప్రయత్నాలలో ఢిల్లీలో తరుచూ తటస్థిస్తున్న నైరాశ్యవాతావరణం నుండి తప్పించుకోవడం కోసం మదరాసు మహానగరం లోని ఆ సినిమా స్టూడియో ఓనర్ తన తమిళ వారపత్రికలో నాకు ఇస్తానన్న ఉద్యోగాన్ని అంగీకరించడానికే ఇక నిర్ణయించుకున్నాను. అయితే మద్రాసు వెళ్ళడానికి ముందు నేను ఒక వారం సరదాగా చూసి గడిపి రావడానికి బొంబాయికి బయలుదేరి వెళ్ళాను. బొంబాయిలో నాకో మంచి మిత్రుడు ఉన్నాడు. తను ఒక సబ్ ఎడిటర్. బొంబాయి క్రానికల్‌లో పని చేస్తాడు. ఒక వారం పాటు నేను అక్కడ గడపబోయే రోజులకు దిక్కు-దిక్చూచి అతనే. నా మీద ఉన్న మైత్రి కొద్ది ఈ వారమంతా నన్ను బొంబాయి మహానగరం తిప్పి చూపించడానికి మహదానందపడ్డాడు.

బొంబాయి నగరం కాసరబీసరగా మనుషుల సముదాయాలతో నిండిపోయింది.ఆ కిక్కిరిసిపోయిన జనాభా, వారి ఆ ఉరుకులు పరుగులు నాకు ఎంతో చైతన్యంగా తోచాయి. టెలిఫోన్, నీళ్ళ కనెక్షన్, కరెంట్ స్తంభాల మరమ్మత్తుల కోసమని రోడ్లని ఎక్కడపడితే అక్కడ తవ్వి ఉన్నప్పటికీను, మాటకే మహనగరం కానీ జనసమూహాల మురికివాడలు అక్కడక్కడా పలకరిస్తున్నప్పటికీనూ నావంటివాడి కళ్ళకూ మనసుకూ హత్తుకుపోయేలా, మంత్రముగ్దుణ్ణి చేసేంత చేతనం అక్కడ ఉన్నట్టుగా నాకు తోచింది. గడియారంలో సెకన్ల ముల్లు నిత్యం కొట్టుకుంటున్నట్లూ అక్కడ జనం కదులుతూనే ఉన్నారు. పని నడుస్తోనే ఉంది. మందంగా, పొడిగా, మజ్జుగా ఉండే ఢిల్లీ సరిహద్దుల నుండి బయటపడి సరాసరి ఇక్కడ ప్రజాసమూహం మధ్యలో పడగానే నా ప్రాణశక్తి కూడా పదింతలు పెరిగినట్లు అయింది.

అదిగో అక్కడ అరేబియా మహాసముద్రం, ఇదిగో ఇక్కడ చౌపాటీ ఇసుక తిన్నెలు, అక్కడ మలబార్ కొండ, ఎక్కడ చూసినా కనపడేంత ఎత్తుకు ఎగబాకిన భవనాలు నాకు బాగా నచ్చాయి. రైలు ప్రయాణంలో కిటికీ వెనుకనుండి చూస్తున్నప్పుడు చటుక్కున మాయమయ్యే దృశ్యాల్లా, బొంబాయిలో నేను ఖర్చు చేయవలసిన సమయం కూడా వేగంగా మాయమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకో మూడు రోజుల్లోనే నా మద్రాసు ప్రయాణం. బొంబాయిని వదిలి వెళ్ళాలనే ఆలోచననే నాకు భరించలేని బెంగ పుట్టించింది. ఒకరోజు మా సంచారంలో మేము బ్లిట్జ్ పత్రిక సమీపంనుండి వెళుతున్నాము. నా మిత్రుడు బ్లిట్జ్ పత్రికా కార్యాలయభవనం చూడగానే అతనికి ఏదో ఆలోచన చటుక్కున తట్టినట్లు అనిపించి ‘లక్ష్మణ్, నువ్వు ఒకసారి బ్లిట్జ్ ఎడిటర్‌ని కలవరాదా గురూ. దాని ఎడిటర్ ఉన్నాడే! ఆయన ఆషామాషి మనిషి కాదు. పత్రికా ప్రపంచంలో ఆయనకు గొప్ప చాలా ధైర్యవంతుడని పేరు ఉంది. తప్పు చేసినవాడు అధికారపు మెత్తని సింహాసనం మీద కూచున్నా సరే! ఈయన తన పత్రికను ముల్లులా మార్చి ఆ సింహాసనం అడుక్కంటా చొచ్చుకువెళ్ళి తప్పు చేసినవాడికి చురుకులు పెట్టడానికి ఏ మాత్రం తగ్గేవాడు కాదు. అలాని వ్యక్తిగతంగా కఠినమైన మనిషి కాడు, చాలా మంచివాడు. ఉదార స్వభావి’ అని అన్నాడు.

నేనూనూ ఆయన గురించి విని ఉన్నాను. అంతే కాదూ బ్లిట్జ్ పత్రిక సంచలనాత్మక వార్తలకు పెట్టింది పేరు. దానిని జనం చాలా విస్తృతంగా చదివేవారు. సరే, చూద్దాం అనుకుంటూ నేను పత్రిక సంపాదకుడ్ని కలిసి నేను ఇది అని చెప్పుకున్నా. ఆయన మరో మాట అనేది ఏమీ లేకుండా వెంటనే ‘కల్బాదేవి కాల్పులపై’ ఒక కార్టూన్ స్ట్రిప్ నన్ను చిత్రించమని పని ఇచ్చాడు. కల్బాదేవి అనేది బొంబాయిలో బాగా పేరున్న ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రం. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే జరిగిన అతి పెద్ద ఉగ్రవాద దాడికి ఈ ప్రాంతమే కేంద్రం. 14 సెప్టెంబర్ 1946న ఈ మారణకాండకు పాల్పడ్డ ఇద్దరు సైనికులు ఇండియన్ ఆర్మీ క్యాంపును విడిచిపెట్టి, సైనిక లారీలో తమ యూనిట్ నుండి ఆయుధాలతో సహా తప్పించుకుని బైకుల్లా స్టేషన్ సమీపంలో ఒక టాక్సీని అద్దెకు తీసుకున్నారు. ఆ టాక్సీ నారిమన్ అనే పార్సీ వ్యక్తికి చెందింది. ఆ సమయంలో ఆ టాక్సీలో అతని యుక్తవయస్కుడైన కొడుకు కూడా ఉన్నాడు. హంతకులు నేరుగా టాక్సీని కల్బాదేవి వేపు తీసుకెళ్ళి ఆపమన్నారు. టాక్సీ ఆగీ ఆగగానే ఇరువురూ తమ చేతిలో ఉన్న మెషిన్ గన్‌తో రహదారిపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఇటువంటి పరిణామాన్ని ఊహించని డ్రైవర్‌ భయాందోళనకు గురై టాక్సీని వదిలి పారిపొయే క్రమంలో తండ్రీ కొడుకులు ఇరువురిని కూడా చంపేశారు. ఈ దారుణకాండలో దుకాణంలో కూచుని ఉన్న ఒక నగల వ్యాపారి, ఉదయాన్నే బడికి బయలుదేరిన ఒక పిల్లవాడు, రోడ్డు మీద కూరగాయలు అమ్మే ఒక మనిషి, టీ దుకాణంలో కూచుని టీ తాగుతున్న ఒక వ్యక్తి ఇంకా కొంతమంది పాదచారులు బలయ్యారు. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇరవైమంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితులను బాంబే పోలీసులు సంఘటన జరిగిన రెండు నెలల్లోనే అరెస్టు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని రోజుల ముందు కోర్టు వారిని విచారించి మరణశిక్ష విధించింది. ఇదంతా నేను బొంబాయి చేరుకునే సమయం ముందుగా జరిగింది. ఆ సమయంలో ఇది నగరవ్యాప్తంగా చాలా పెద్ద సంచలన వార్త.

బ్లిట్జ్ ఎడిటర్ నాకు ఈ కథను క్లుప్తంగా చెప్పాడు. ఈ సంఘటన విచారణకు సంబంధించిన కోర్ట్ కాగితాల ప్రతులను నాకు అందచేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన కథ ప్రతీ వారం తమ పత్రికలో బొమ్మల కథగా రావాలని, ఇందుకు గానూ ఆయన నాకు వెయ్యి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు. పంతొమ్మిది వందల నలభైలలో అది చాలా పెద్ద డబ్బు. ప్రస్తుతం వరకు నేను మద్రాసు నుండి వెలువడే స్వరాజ్య పత్రికవాళ్ళు నా కార్టూన్లకు పంపుతున్న డబ్బుతో బొంబాయిలో కాలం నెట్టుకొస్తున్నాను. ఇప్పుడు రాబోతున్న బ్లిట్జ్ డబ్బులు ఇవన్నీ కలుపుకుని బొంబాయిలో బహుకాలం ఉండవచ్చు కదా అని సంబరపడ్డాను.

బొమ్మల కథకు అవసరమైన నేపథ్య వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి కాల్పులు జరిగిన ప్రాంతం గుండా నన్ను భద్రంగా తీసుకెళ్ళడానికి, కాల్పులు జరిగినపుడు అక్కడే ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులను, బాధితులను నేను కలుసుకోవడానికి, వారి ద్వారా జరిగిన సంఘటన తబ్సీలు ఎక్కించుకోవటానికి గాను నా కోసం ఆ ప్రాంతపు ఆనుపానులు తెలిసిన కొంతమందిని నాకు సహాయంగా కల్బాదేవి ప్రాంతానికి పంపించాడు బ్లిట్జ్ ఎడిటర్. కల్బాదేవి వీధి అనేది దాదాపు అరకిలోమీటరు పొడవునా రద్దీగా ఉన్న రహదారి మార్గం. రోడ్డుపై బస్సులు, కార్లు, సైకిళ్ళు, తోపుడు బళ్ళు, వాటి మధ్యని, వెనుకని, ముందని అనేక మంది పాదచారులు బిలబిలమని కదులుతూనే ఉన్నారు. వీధికి ఇరువైపులా పుస్తకాలు అమ్మేవారు ఉన్నారు, గడియారాలు రిపేర్లు చేసే చిన్న చిన్న కొట్లవాళ్ళు ఉన్నారు, మంగలి షాపులు, టీ షాపులు, వెండిపని చేసే కంసాలివారి దుకాణాలు, బట్టలు అమ్మే వ్యాపారులు… బారులు బారులుగా వ్యాపారం నడుస్తుంది. ఆ వీధిలో అటూ ఇటూ చూసుకుంటూ నేను అక్కడ జరిగిన నరమేధం గురించి ఆలోచిస్తున్నాను. ఎటువంటీ ఒక ఘోరాన్ని ఊహించని ఒక ఉదయాన వీధి నడి బొడ్డున వచ్చి ఆగిన ఒక టాక్సీ నుండి నిప్పులు కక్కుతూ తుపాకులు సృష్టించిన భీకర మారణకాండని తలుచుకుంటే నా వెన్ను నుండి వణుకు పుట్టుకువచ్చింది.

కల్బాదేవి దారుణ సంఘటనను బొమ్మల కథగా మలచడానికి సహయకారిగా నేనొక వాస్తవికభ్రమను నా చుట్టూ అల్లుకున్నాను. ఆ సంఘటన జరిగిన రోజున ఆ నేరగాళ్ళు ప్రయాణించిన కారులో నేనూ ఉన్నట్టు, వారి సంభాషణ మొత్తం నా సమక్షంలోనే జరుగుతున్నట్టు, వారి తుపాకి నుండి వెలువడిన ప్రతి తూటా నా కళ్ళ ముందే దూసుకుపోయినట్టు – రవ్వలు కక్కే ఆ అంగుళమంత నిప్పుముక్క ఏ దుకాణపు తలుపును ఛేదించుకుంటూ పోయిందో! ఏ మనిషి కడుపును కుళ్ళపొడుస్తూ తన రక్తదాహం తీర్చుకుందో! మనుషులు ఆర్తనాదాలు చేస్తూ ఎలా కకావికలమయ్యారో, ఎలా కుప్పకూలిపోయారో! – నేను అశరీరంగా చూస్తున్నట్లు బొమ్మలకు అనువయిన ప్రతి సన్నివేశాన్ని అనేకానేక కోణాల నుండి గమనించాను. ఆ సమయంలో నేను మొదటి సారిగా కల్బాదేవి వీధిలో నడుస్తూ నిలువెల్లా వణికిపోయినవాడిని కాను. నా ఎరుక లేకుండా జరిగిపోయిన దానిని కూడా అవసరమైనపుడు ఊహాపోహలుపోయి కళ్ళముందుకు తెచ్చుకుని దానిని నల్లని గీతలతో పునఃప్రతిష్ట చేయగలిగిన చిత్రకారుడిని.

సంఘటనలను కళ్ళముందుకు తెచ్చుకోవడం, దానికి రూపునివ్వడం, పూర్తయిన బొమ్మలను బ్లిట్జ్‌కు చేరవేయడంలో తలమునకలుగా ఉన్నాను. ఒకరోజు సాయంకాలం నా మిత్రుడొకరితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో ఫ్రీ ప్రెస్ జర్నల్ యొక్క కార్యాలయం కంటపడింది. మా కళ్ళ ముందే ఒక కారు వచ్చి ఆఫీస్ ముందు ఆగింది. అందులోంచి ఎవరో ఒక వ్యక్తి దిగి పత్రికా భవనంలోకి వెళ్ళడం చూశాను. ఆయనను చూపిస్తూ నా మిత్రుడు అన్నాడు అతనే ఫ్రీ ప్రెస్ జర్నల్ సంపాదకుడని, ఆయనతో తనకు బాగా పరిచయం ఉందని. తనని కలుద్దామనే సరదా నీకేమైనా ఉంటే చెప్పు పరిచయం చేస్తా అన్నాడు కలవను, వద్దు, అవసరం లేదు అనడానికి నాకేం అభ్యంతరం కనపడలేదు. కొద్దిసేపటి తర్వాత నేను సంపాదకుడి ముందు కూర్చుని ఉన్నాను. ఎందరికో చెప్పిన నా జీవిత చరిత్రను ఇప్పుడు ఆయనకు పారాయణం చేస్తున్నాను. నేనేమి కొత్త కాదట ఆయనకు. ఆయన నా కార్టూన్లను స్వరాజ్యలో చూస్తున్నారట. నా కార్టూన్లని దేశం మూలమూలకు పరిచయం చేసిన స్వరాజ్యకి ధన్యవాదాలు.

ఇప్పుడు నేను ఫ్రీ ప్రెస్ జర్నల్‌లో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా నెలకు రెండు వందల యాభై రూపాయల జీతంతో చేరాను. ఇది నేను కలలు కన్న ఉద్యోగం. ఇంత పరుగులు పెట్టింది, ఆశలు పెంచుకుంది డబ్బు కోసం కాదు, ఒక న్యూస్ పేపర్ ఆఫీసులో కార్టూనిస్ట్‌గా పనిచేయడమనేది నా ఆశ, ఆకాంక్ష, నా చిరకాలపు లక్ష్యం అని అప్పుడు నాకు నేనే చెప్పుకున్నాను. ఇప్పుడు మీకూ స్పష్టం చేస్తున్నాను. కార్టూనిస్ట్‌గా చేరినప్పటికీ పత్రిక అవసరార్థం వివిధ రకాల బొమ్మలు వేసేవాడ్ని. కార్టూనిస్ట్‌గా చేరి అక్కడ నేను పుచ్చుకునే జీతానికి ఎక్కువగానే న్యాయం చేశాను. శక్తికి తగ్గట్టుగా పని చేసే విషయంలో నేను ఖచ్చితమైన ఆత్మసంతృప్తినే పొందాను. నేనక్కడ రాజకీయ కార్టూన్లు వేశాను. ఆదివారంపూట వెలువడే ప్రత్యేక సంచికలకు సరదా కార్టూన్లు వేశాను. బొమ్మల కథలు గీసేవాడిని, కథలకు బొమ్మలు గీసేవాడిని, పత్రికకు బొమ్మలు అవసరమయిన ప్రతి జాగాలో అది నా పనా కాదా అని ఆలోచించకుండా అడిగిన ప్రతి బొమ్మా వేసి ఇచ్చేవాడిని. అక్కడ నేను రోజుకు దాదాపు పది గంటల పాటు నా డ్రాయింగ్ బోర్డు మీద ఒరిగి బొమ్మలను చిత్రిస్తూనే ఉండేవాడ్ని. ఆ రోజుల్లో నా మొహం చూసి కన్నా నా వీపును చూసి నన్ను గుర్తుపట్టే సహద్యోగులే ఎక్కువ.

అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...