ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 2

మా ఇంట్లో బోలెడన్ని గదులు, ఆ గదుల్లోని ఒక గదిమూలన పాత పెద్ద సందూకు ఒకటి నా సామ్రాజ్యంగా ఉండేది. నా ఆస్తిపాస్తులన్నిటిని అందులోనే చాలా జాగ్రతగా దాచి ఉంచుకునేవాడిని. నా ఆస్తి వివరాలు కొన్ని మీకు వివరిస్తాను: విరిగిన సైకిల్ చైను-ఒకటి, రోడ్డు మలుపులో దొరికిన కారు చక్రపు డొప్ప-ఒకటి, గాలి వదిలించుకున్న ఒక ఫుట్‌బాల్ లొత్త-ఒకటి, కొబ్బరి మట్టనుండి తొలచిన క్రికెట్ బ్యాటు-ఒకటి, ఏ భాగానికా భాగం ఊడి ఉన్న చిన్న చిన్న కారు బొమ్మలు-చాలా, వాటి చక్రాలు, మరలు, ఇంకా లెక్కలేనన్నిగా టెన్నిస్ బంతులు, బోలెడు ఖాళీ చాకలెట్ డబ్బాలు… ఇలా నా ఆస్తి చిట్టా చాలా పెద్దదే ఉందిలెండి. చెప్పుకుంటూ పోతే చాలా పేజీలు అవుతాయి అందుకని వాటి సంగతి ఇక ఆపేస్తాను.

బొమ్మలు వేసీ వేసీ అలసినపుడో, లేదా ఇక బొమ్మలు ఈ రోజుకు చాల్లే అనిపించినపుడో నేను నా భోషాణం దగ్గరకు చేరి దానిలోనుండి ఖజానా అంతా బయటకు తీసి నా చుట్టుతా పరుచుకుని, మురిసిపోతూ ఉండేవాడ్ని. ఒక రోజు అలాగే ఆ పెట్టి లోంచి సరంజామా అంతా తీస్తూ ఉన్నానా, సరుకు మధ్య నుండి తళుక్కుమని ఓ మూడు గాజు పలకలు నా దృష్టిని లాగేశాయి. అరే! వీటి సంగతే మరిచిపోయానే నేను! అనుకున్నా. ఈ గాజు పలకలను ఇంట్లో పెద్దవాళ్ళ కంట పడకూడదనిచెప్పి నేనే అతి భద్రంగా పెట్టె అడుగున దాచి ఉంచా. ఎందుకంటే గాజు అంచులు చాలా పదునుగా ఉంటాయి. వాటితో ఆడుకుంటూ పిల్లలు తమ చేతులు కోసుకుంటారని పెద్దవాళ్ళ భయం. అందుకని వాళ్ళ కేకలకు భయపడి వారి కంట పడకుండా వీటిని నా పెట్టె లోపల ఎక్కడో దాచి ఉంచి మొత్తానికి ఆ విషయం నేను కూడా మరిచిపోయా. ఇంతకాలం తరువాత దాచుకుని మరిచిపోయిన నా నిధి ఇప్పుడు నాకు కనపడ్డం ఎంత సంతోషంగా ఉందో!

ఆ గాజు ముక్కలను భద్రంగా బయటకు తీసి మూడుగా, రెండుగా కలిపి, ఒకటిగా విడదీసి నా కంటి ముందుకు తెచ్చుకుని అందులోంచి ఈ లోకాన్ని ఎరుపు, నీలం, ఆకుపచ్చగా రంగులు రంగులుగా చూస్తుంటే భలే తమాషాగా ఉంది. తల తిప్పి కిటికీ లోంచి బయటకు చూడ్డం మొదలుపెట్టా. మా పచ్చని తోట, ఎర్రని తలపాగా చుట్టుకున్న తోటమాలి, అతని చేతిలో నీళ్ళ దుత్త, అతని చుట్టుతా ఎన్నోరంగుల పూల ప్రకృతి అంతా ఆ గాజు అద్దాల మాయలో కరిగి నీరవుతూ కిందికీ మీదికి కదలాడుతున్నట్లుగా తమాషా దృశ్యాలు నా కంటి ముందుకు వచ్చి అలుముకున్నాయి. ఈ అద్దాల సాయంతో నేను ఓ చిన్న స్థాయి ఇంద్రజాలికుడినే అయ్యాను. నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నా చుట్టుతా ఉన్న ఈ ప్రపంచపు రంగులను నా కన్నుకు అనువుగా మార్చడం మొదలుపెట్టాను. వెలుతురు భగ్గుమనే వేళ రెండు అద్దాల మంత్రంతో వెలుతురును మసకబరిచేవాడ్ని. మూడవ అద్దాన్ని కూడా రమ్మని పిలిచానా! ఇక కంటి ముందు చల్లని పొగమంచే. మా తోట గోడ మీద కూర్చుని నేను నా అద్దాల సాయంతో ఋతువులను, కాలాలను, సమయాలను వాటి సహజగుణాల నుండి తప్పించి ఆ మాయజాలంలో కేరింతలుగా మునకలు వేసేవాడిని. ఒకరోజు అలా నా అమాయకపు ఆనందం ఆడే ఆటలు చూసి ఆ దారివెంట వెడుతున్న ఒక ముసలాయన ఆగిపోయాడు. నాకేసి చూస్తూ గొంతెత్తి బిగ్గరగా ఇలా అన్నాడు: ‘బాల్యమంటే స్వర్గం-స్వర్గమంటేనే బాల్యం.’ అలా అంటూ సంతోషంగా తల ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తరువాత, చాలాకాలం తరువాత పాఠశాల తరగతి గదుల్లో ప్రఖ్యాత కవి విలియమ్ వర్డ్స్‌వర్త్ యొక్క ‘Bliss it was in that dawn to be alive. But to be young was very heaven’ అనే వాక్యాలు చదువుకుంటున్నప్పుడు నా జ్ణాపకం మరలి ఆ చిన్నతనపు ముసలాయన బాల్యం గురించి అన్న మాటలే గుర్తుకు వచ్చేయి.

బొమ్మలు గీయడం, ఇంకా సందూకు పెట్టె గెలకడం కార్యకలాపాల తర్వాత కూడా నా దగ్గర కొదవలేనంతగా మిక్కిలిగా సమయం ఉండేది. అప్పుడు నా గుర్రాన్ని నేను మా నాన్నగారి గది వైపుగా మళ్ళించేవాడిని. ఆయన గదిలో అనేక జతల కళ్ళద్దాలు ఉండేవి. గుండ్రంగా ఉన్నవి కొన్ని, అండాకారంగా ఉన్నవి మరికొన్ని, నలుపలకలవి ఇంకొన్ని, సాదా పట్టీలవి, బంగారు, వెండి పూత అంచులవి… ఇలా చాలా ఉండేవి. గదిలో ఒక మూలలో కనీసం ఒక డజనుకు పైగా చేతికర్రలు ఉండేవి. అవన్నీ రకరకాల కలపల చేతికర్రలు. బెత్తపు చేతి కర్రలు, దంతపుపిడి చేతికర్రలు, వెండిపిడి చేతికర్రలు. కొన్నయితే జంతువుల ముఖాలు వేసుకుని, మరికొన్ని చిత్రమైన వంపుల తీగలతో తిరిగి ఉన్నవి. నన్ను ఈ విశేషాకారపు వస్తువుల కన్నా ఆ పక్కనే బోలెడన్ని విదేశీ పత్రికలతో నిండి ఉన్న పుస్తకాల అలమారా ఇంకా ఎక్కువగా ఆకర్షించేది.

నేను ఆ అలమారా తలుపులు తెరిచి ఆ పత్రికలన్నీ బయటకు తీసి వాటిని నాన్నగారి గది గచ్చుపై వరుసగా పేర్చుకుని ఒక్కొక్క పత్రికను అమిత కుతూహలంతో తిరగేసేవాడ్ని. ఆ పుస్తకాలలో రచనలకు వేసిన నలుపు తెలుపు బొమ్మలని అమిత ఆసక్తితో శ్రద్ధగా పరిశీలించేవాడిని. ఈ పత్రికల వరుసలో బైస్టాండర్ (Bystander), వైడ్ వల్డ్ (Wide World), టిట్ బిట్స్(Tit Bits), ఇంకా ప్రపంచ ప్రఖ్యాత హాస్య పత్రిక పంచ్(Punch) ఉండేవి. ఈ పత్రికలన్నింటిలోకెల్లా నాకు స్ట్రాండ్ (Strand) అంటే మక్కువ ఎక్కువ అయింది. ఇందులో గొప్ప రచయితలయిన పి. జి. వుడ్‌హౌస్, ఆర్థర్ కానన్ డయల్, డబ్ల్యూ. డబ్ల్యూ. జాక్సన్ వంటి చాలా మంది హేమాహేమీ రచయితల రచనలు ప్రచురితం అయ్యేవి. ఈ రచనలకు వేసిన బొమ్మలయితే అత్యంత సూక్ష్మమైన వివరణలతో సహా చిత్రించబడి నా కన్నులకు పండుగలానే ఉండేది.

నాకు అప్పటికి చదువు రాదుగా! నాకు ఆ రచనలు, అందులో కార్టూనులకు వ్రాసిన వ్యాఖ్యలు ఏమిటో తెలిసేవి కాదు. కానీ అందులోని బొమ్మల భాష మాత్రం క్షుణ్ణంగా అర్థం అయ్యేది. ఆ పుస్తకాలలో బొమ్మలు వేసిన ప్రతి చిత్రకారుడి చిత్రరచనలోని వైవిధ్యాన్ని నేను ఇట్టే గుర్తుపట్టేవాణ్ణి, వారు బొమ్మలు వేసే పద్దతి, వారు కుంచెని, కలాన్ని వాడిన విధం, వారు మానవ శరీర నిర్మాణాన్ని తమ వివిధ శైలులతో కొలిచిన పద్ధతులను చాలా తీక్షణంగా అధ్యయనం చేసేవాడిని. ఒకసారి నేను పంచ్‌ పత్రిక లోని కార్టూన్‌లలో ఒకదానిని చూసి చాలా ముగ్ధుణ్ణయ్యాను. దానిని నకలు చేయడానికి పేపరు, పెన్సిలు పుచ్చుకుని కూర్చున్నాను. ఇంకా బొమ్మ గీయడానికి చెయ్యి ఆడీ ఆడక మునుపే, అప్పుడే అటుగా వెళుతున్న నా అన్నలలో ఒకరు నన్ను, నేను చేస్తున్న పనిని చూసి ఆగిపోయి అన్నారు: “బొమ్మను కాపీ చేస్తున్నావా? తప్పు! ఎప్పుడూ అలా చేయకూడదు. బొమ్మలు వేయాలని ఉంటే నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించు, ఆ గమనించిన దాన్నంతా స్కెచ్ చేయడమనేది సరయిన పద్దతి! ఇప్పుడు చేస్తున్నావే అలా కాపీ చేస్తే నువ్వు ఎప్పటికీ కళాకారుడివి కాలేవు. కాపీ చేయడం అంటే వేరొకరి ఎంగిలిని భుజించడం అన్నమాట!” ఆ వయసులో నాకు మా అన్నయ్య ఏమంటున్నాడో, ఆయన ఇచ్చిన పోలిక ఏమిటో సరిగా అర్థంకాలేదు. కానీ నేను చేయబోయింది ఏమంత మంచి పని కాదన్న మాటలోని తీవ్రత నన్ను తాకింది. జీవితంలో మళ్ళీ ఎప్పుడూ బొమ్మ కాపీ చేయడానికి ప్రయత్నించకుండా నన్ను భయపెట్టింది.

ఏదీ ఏమయినా మొత్తానికి అప్పటి నా రోజులు- ఆ రోజు మా తోట గోడపై నన్ను నా రంగు గాజు ముక్కలతో ఆడటం చూసి ఆ ముసలాయన చెప్పినంత సత్యంగా స్వర్గధామంగానే ఉన్నాయి. రోజులు అలా గడుస్తున్న రోజుల్లో మా ఇంటికి ఒక కొత్త మనిషి తరుచుగా రావడం మొదలయ్యింది. అతను వచ్చేది మా అన్నయ్య నారాయణ్ కోసం. విషయం ఏమిటా అంటే ఈయన ఇంగ్లీషు చదువులో బాగా వెనుకబడి ఉండటం, దాని వలన తరుచుగా పరీక్ష తప్పుతూ ఉండటం పరిపాటి అయిపోయింది. అందుకని మా అన్నయ్య నారాయణ్ దగ్గర ఇంగ్లీష్ పాఠాలు చెప్పించుకోడానికి వస్తున్నాడుట. ప్రతి రోజూ మా ఇంటికి క్రమం తప్పకుండా రావడం వల్ల ఆయన ఇంటి మనిషి లాగే అనిపించడం మొదలయింది. మా అన్నయ్య స్నానానికి వెళ్ళినపుడో, బజారుకు వెళ్ళినపుడో, లేదా ఇంట్లోనే మరేదయినా అత్యవసరమైన పనిలో మునిగినపుడో, ఈ అన్నయ్య స్నేహితుడు నన్ను చక్కగా ఆడించేవాడు, నాతో గాలిపటాలు ఎగిరించేవాడు. అలా ఒకరోజు మేమిద్దరమూ ఆటల్లో మునిగిపోయి ఉన్న సమయంలో ఆయన అకస్మాత్తుగా తన చేతి గడియారం వంక చూసుకుంటూ, ‘లచ్చూ! నీకింకా బడి సమయం అవ్వలేదా?’ అని అడిగాడు. బడికి, నాకు, చదువుకు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకుని నివ్వెరపోయి, ఒక్క క్షణం ఆగిపోయి తేరుకుని నన్ను భుజాన వేసుకుని మా మదరాసు మేనమామ పట్టిన బడి దారే పట్టాడు. నేనూ అచ్చం మా మదరాసు మేనమామ చేతుల్లో గింజుకున్నట్టుగానే గింజుకోవడం, ఈయనకు ఒకటీ రెండు కాలి తాపులు తగిలించడం జరిగింది. అయినా అతను వాటినేమీ లెక్క చేయకుండా నన్ను తీసుకువెళ్ళి అదే బడిలో, అదే ప్రధానోపాధ్యాయుడి చేతుల్లో నన్ను పెట్టి తను వెనకకు తిరిగి మా ఇంటి వైపు నడవసాగాడు. నాతో తనకు ఉన్న పాత అనుభవం ఆధారంగా ఆ ప్రధానోపాధ్యాయుడు ఈసారి నేను తప్పించుకుపోకుండా ముందుచూపుతో నాకు ఒకటీ రెండు దెబ్బలు తగిలించడం కూడా జరిగిపోయింది. విచిత్రం ఏమిటంటే ఆ రోజు నుండి, ఏ రోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావడం ప్రారంభించాను. ఎంత క్రమం తప్పకుండా అంటే చివరాఖరికి ఆదివారాలు కూడా బడికి వెళ్ళాలని పట్టుబట్టి వెళ్ళి- ఆ చడీచప్పుడు, పిల్లల సందడి, పాఠాల శబ్దాలు వినపడని నిర్జన భవనం నుండి నిరాశతో వెనుకకు తిరిగి వచ్చేవాణ్ణి.

బడికి వెళ్ళడం అంటే ఏమిటనుకున్నారు? ఊరికే చొక్కాయి, సల్లాడం వేసుకుని పలక ఊపుకుంటూ పోవడం కాదు. వేసుకున్న అంగిపై నల్లకోటు ఒకటి, నెత్తిపై నల్లటోపి పెట్టుకుని అచ్చం మా అన్నయ్య ఆర్. కె. నారాయణ్ రచన ‘స్వామి, అతని స్నేహితులు’ పుస్తకంలో నేను చిత్రించిన పిల్లల బొమ్మలు ఉంటాయే అలా ఉండేదన్నమాట మా వేషధారణ. కన్నడ వర్ణమాలను దిద్దడానికి చేతిలో ఉండే పలక, బలపం సంగతి చెప్పనక్కరలేదు కదా. మా తరగతి గదిలో దాదాపు ఇరవై మంది అబ్బాయిలము పొడవాటి బెంచీల వరుసలలో పక్కపక్కనే కూర్చునేవారిమి. మా పంతులుగారి బల్లపై కొన్ని సుద్ద ముక్కలు, హాజరు పట్టీ, పుస్తకాలు, ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా ఒక బెత్తం ఉండేది. బడిలో మాకు కన్నడ వర్ణమాలతో పాటు, సంఖ్యలను చదవడం, లెక్కించడం నేర్పించేవారు. వ్రాసుకోడానికి పలకతో పాటు ఒక పాఠ్యపుస్తకం ఉండేది మాకు. అందులో చదువు నిమిత్తం అతి మామూలు వాక్యాలు ఉంటాయి. ‘రామ, లేచి నిలబడుము! ఇటు చూడుము! అటు చూడుము! ఆ అరటి చెట్ల తోట వంక చూడుము…’ ఇలా. మాలో ప్రతి ఒక్కరం ఈ పంక్తులను తడబడకుండా, పొరపాట్లు చేయకుండా చదవాలి. అదే పాఠ్యపుస్తకంలో పద్యవిభాగం కూడా ఉంది. అందులో ఉన్న ఒక చిలుక కవిత నాకు బాగా గుర్తుంది. ‘చిట్టి చిలుకమ్మ-మా ఇంటి మొలకమ్మ, మా చేతుల్లో పెరిగింది-మా ఒడిలో ఆడింది, రెక్కలు పెంచింది-కిలకిల ఎగిరింది, పిల్లి ఒకటి లటుక్కున ఎగిరింది-చిలుకేమో పిల్లికి చిక్కింది’ ఇదేం కవనమో, కవిత్వమో! చిన్నారి పిల్లల పాఠాల్లో దీనిని ఎందుకని ఒక బోధించే విషయంగా ఏ విద్యావేత్త తెచ్చిపెట్టాడో నాకు అర్థం కాలేదు. ఈ దుఃఖభరితమైన పద్యం చెప్పవలసి వచ్చినప్పుడల్లా నా కళ్ళు తడిగా మారేవి.

మా తరగతి ఉపాధ్యాయులవారు అచ్చం కార్టూన్ బొమ్మల్లో చిత్రించే ఉపాధ్యాయుడి బొమ్మలానే సన్నగా పొడుగ్గా, నెత్తి పైన తలపాగా, బిగుతు కోటు, దాని కింద ధోవతి ధరించి ఉండేవాడు. ఆ ధోతి కింద సన్నని గొట్టాల వంటి కాళ్ళు, నడుస్తూ ఉంటే పొట్లకాయల్లా ఊగిసలాడే చేతులు, ఆ పై ముక్కు. మొహం దగ్గరికి కనుక వచ్చి చూస్తే-ఆయన ముందరి పళ్ళు రెండు కనుక పొడుగ్గా బయటికి వచ్చి ఉండకపోతే ఆయన మూతిని కప్పేసే గుబురు మీసాల వెనుక ఒక నోరు ఉన్నట్టు అసలు తెలిసేదే కాదు. భగవంతుడికి భక్తుడికి అగరు బత్తి అనుసంధానమై ఉన్నట్లు మా గురువుగారికి బీడీ వాసన అలా అనుసంధానమై వ్యాపించి ఉండేది.

తరగతి గదిలో పాఠాల మధ్య ఆయనకి బీడీ కాల్చాలనే కోరిక వచ్చిప్పడల్లా మా బాధ్యతని తరగతి గదిలో కాస్త ఆకారపుష్టి కలిగి ఉండి, చక్కగా కథలు కబుర్లు చెప్పగలిగిన కుర్రాడొకడికి ఒప్పచెప్పి అలా బడి వెనుకకు వెళ్ళేవాడాయన. ఇక చూస్కోండి మావాడి కథాసరిత. కాకి-రాకుమారుల కథ, కోతి-మొసలి కథ, తెలివితక్కువ గాడిద కథ. తెలిసిన కథలే, విన్న కథలే మళ్ళీ మళ్ళీ అతని నోటి వెంట వినడం మహా చెడ్డ విసుగు బాబు! అందుకని అతని నోటిని అతని మానాన వదిలేసి మేము మాత్రం మా నోరు చెవులను తోటి కుర్రవారితో కలిసి గుసగుసల్లో కొనసాగించుకునేవారిమి. ఇంకొందరయితే కాగితపు రాకెట్లు అతని వేపు విసిరేవారు, సుద్దముక్కల తుంపులతో అతన్ని గురి సరి చూసుకునేవాళ్ళు మరికొందరు. ఇక కథలు చెప్పి లాభం లేదని అతనికి అర్థం అయినపుడు పిలకాయల గుంపులోనుండి కొందరు అనుమానితులు, విప్లవకారులు, క్లాసు ద్రోహుల జాబితా ఒకటి తయారుచేసి బీడి వాసన ఘుమాయిస్తూ వచ్చే మేష్టారుగారికి సమర్పించుకునేవాడు.

ఒక రోజు ఏమి జరిగిందంటే గురువుగారికి రెండు బీడి దమ్ములు లాగడానికి సమయం ఆసన్నం అయ్యేముందు మమ్మల్నీ మా తరగతినీ మా ఆకారపుష్టిగాడి కథలకు అచ్చంగా వదిలివేయకుండా మా పిల్లలందరికీ ఒక ఆకు బొమ్మని గీయమని పని అప్పజెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇక చూడండి. మేము ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా, సృజనాత్మకంగా చిత్రకళలో మునిగిపోయాం అంటే, కొంతమంది తొలుతగా తలలు పైకెత్తి ఒక ఆకు ఎలా ఉంటుందో దాన్ని ఊహించడంలో మునిగిపొయారు. మరికొందరు ఆకుని గీసేయడం ఆపై ఇలా కాదు కాదని తలలాడించి చెరపడంలో తీరిక లేకున్నారు. మాలో ఒకడు ఆకంటే అరటి ఆకుని గీయడం మొదలుపెట్టి అది అతని పలక అంచులని దాటిపోయి ఇక వ్యాపించడానికి చోటు లేక గాలిలో బలపం ఆగిపోయింది. ఇంకొకడు ఆకు చిత్రీకరణలో తన నైపుణ్యం విఫలమయిన ప్రయత్నంలో ‘నేను ఆకు బొమ్మ కాదు. ఏనుగు బొమ్మని గీస్తా’ అని ప్రకటించేశాడు. ఈ చిత్రకళా పరీక్ష మా అందరిలో ఒక కొత్త ఉత్సహాన్ని నింపింది. ప్రపంచాన్ని మరచి మేమందరమూ ఈ సరదా అయిన పనిలో మునిగిపోయాము. ఆ పనిలో ఎంత మునిగిపోయామంటే మా ఉపాధ్యాయుడు తన చేతిబెత్తంతో రెండు గట్టి చరుపులు బల్లపై మ్రోత మోగించేవరకు. మా తరగతి టీచరు తిరిగి రావడం, ఆయన బీడి కంపు తరగతిని ఆక్రమించడం కూడా ఎరిగే స్పృహ కూడా మాకు లేదు. ఆయన కళాపరీక్ష నిమిత్తం మమ్మల్నందరిని మా కళాఖండాలతో సహా ఒక వరుసలో నిలబెట్టారు. పిమ్మట కళా విమర్శకుడుగారు ఆయన చేతులను తన బెత్తంతో సహా వీపు వెనుకకు కట్టుకుని ఒక్కొక్క విద్యార్థి పలక వంక చూస్తూ, నిట్టూరుస్తూ, గొణుగుతూ, చీత్కారం చేస్తూ, ఒకరిద్దరికి చేత్తో వడ్డించి, ఇద్దరు ముగ్గురిని కర్రతో అదిలించి నా వద్దకు వచ్చాడు. నేను గీసిన బొమ్మ వంక తదేకంగా చూశారు, నావంక చురుగ్గా చూస్తూ ‘లక్ష్మణ్ ఇది నువ్వే గీశావా? అని అడిగారు. నేను ఠారెత్తిపోయాను, ఇక దెబ్బలు తప్పవనుకుని. ఒక అడుగు వెనకకు వేసి రెండు చేతులు ముందుకు రక్షణగా తెచ్చుకుని ‘మేష్టారుగారు, తమరే మమ్మల్ని ఆకు బొమ్మ గీయమన్నారని చెప్పి దీనిని గీశానండి’ అని, పాపం నాది కాదు అని ఆయనకు స్పష్టంగా చెప్పడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నాన్ని వాచక, ఆంగిక, యత్నక, ప్రయత్నక, అప్రయత్నకాది అన్ని విధాలా తంటాలు పడుతున్నాను. మేష్టారుగారు నా పలక పుచ్చుకుని క్లాసు మొత్తం కలియ చూపిస్తూ ‘ఇటు చూడండి! లక్ష్మణ్ ఈ ఆకుని ఎంత చక్కగా గీశాడో శ్రద్దగా చూడండి, ఈ రావి ఆకు ఆకృతి, దాని ఈనెలు, తిన్నని గీత, శభాష్ లక్ష్మణ్! నువ్వు ఒకరోజు చక్కని చిత్రకారుడివి అవుతావు, నీ బొమ్మకు పదికి పది మార్కులని’ ప్రకటించి నన్ను ఆశ్చర్యానందాలలో ముంచారు. ఆయన మెచ్చుకోలుని నేను పరమ ఒప్పుకోలుగా తీసుకున్నాను, ఆ క్షణం నుండి నన్ను నేను చిత్రకారుడిగా భావించడం ప్రారంభించాను.

క్రమేపీ నా చిత్రకళ మా ఇంటి నేల మీది నుంచి గోడలు ఎక్కి ఆపై గది తలుపుల పైగా విస్తరించడం ప్రారంభించింది. ఒకసారి మా నాన్న కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతున్నారు. ఒక వేపు నుండి కనపడుతున్న ఆయన మొహం, ఆ చక్కని గంభీరమైన ముక్కు, పెదాలు, నుదురు, దాని పైనుండి వెనక్కి మళ్ళిన ఆయన బూడిదరంగు జుత్తు అంతా తనని బొమ్మలా దించడానికి కళ పలుకుతున్న ఒక ఆదేశంలా ఉంది. నేను ఆయనని చూస్తూ ఆ రూపాన్ని సుద్దతో నేలపై కారికేచర్‌లా గీశాను. అటుగా వెళుతున్న మా అమ్మ ఆ వ్యంగ్యచిత్రాన్ని గుర్తించి, కడుపు పట్టుకుని నవ్వడం ప్రారంభించింది. తన మానాన తను నవ్వుకోక దానిని చూడ రారమ్మని నాన్నను పిలిచింది! ఆయన ఆ బొమ్మను చూసి కోపం పట్టలేక నన్ను వెంటనే ఆ బొమ్మని తుడిచివేయమని ఆదేశించాడు. అబ్బే! అది ఎట్లా కుదురుతుంది? ఇంటి ఇతర సభ్యులు ఇంటికి వచ్చి చూసే వరకు అది అలాగే ఉండాలని మా తల్లిగారి పట్టుదల. సహజంగా చివరకు ఆమే విజయం సాధించింది, మా నాన్నగారి వ్యంగ్య చిత్రం చాలా కాలంపాటు నేలపైనే ఉండిపోయి కాలక్రమంలో చెరిగి మాయమయ్యింది.

ఇక మళ్ళీ చదువు దగ్గరికి వస్తే, సంవత్సరం తర్వాత సంవత్సరం, తరగతి తరువాత తరగతికి మారుతూ పోతున్నప్పుడు క్రమంగా తొలినాళ్ళల్లో బడిలో ఉండిన ఒక వినోదం, తోటి పిల్లల మధ్య నడిచే ఆ మాట ఈ మాటల గప్పాలు, ఆటలు, అల్లరి అనే విషయాల కొరకు ఉన్న సమయం తగ్గిపోయి. ఆ స్థానాన్ని రాను రానూ కష్టంగా ఉండే పాఠాలు ఆక్రమిస్తూ వచ్చాయి. పంతుళ్ళు కూడా మునుపటంతటి జాలి దయ కరుణ మా పై కురిపించడం లేదు. మేము బాగా చదవడం, నేర్చుకోడం పైనే వారి గురి అంతా. భాషలతో, చరిత్ర పాఠాలతో నాకేం పెద్ద చిక్కు లేదు. చరిత్రలో మిగిలి పోయిన విజేతలు, పరాజితులు. యోధులు, కుట్రదారులు, వారి పేర్లు, అప్పటి నాగరికతలు, వారు వసించిన శతాబ్దాలు, భూగోళంలోని పర్వతాలు, నదీనదాలు, మహాసముద్రాలు – ఈ విధమైన విషయాలు నా బుర్రకు బాగానే ఎక్కేవి. కథలు కల్పనలతో కూడిన చక్కని గద్య భాగాలు కూడా మాకు పాఠాలుగా, పద్యాలుగా ఉండేవి. ఆ కథలలో జానపద కథలలోని పాత్రలు, పురాణాలలోని పాత్రల ద్వారా వ్యక్తీకరించబడిన మంచీ – చెడూ, కఠినత్వం- కపటితనం, నీతీ- నిజాయితీ, పెద్దలను గౌరవించడం, పిన్నలను ప్రేమించడం వంటి మానవీయ విలువలను బోధించే విషయాలు మాకు పాఠాలుగా ఉండేవి. మాకు బోధించిన పద్యాలకు సంబంధించిన ఇతివృత్తాలు కూడా ఋజుప్రవర్తన యొక్క సూత్రాలుగా మానవాంతరాలలో తమను అంతర్గతీకరించుకొమ్మని మమ్మల్ని ప్రోత్సహించాయి.

మా పద్యభాగపు పాఠాలలో పుణ్యకోటి అనే ఒక ఆవు, దాని సత్యనిష్ట గురించి ఉండేది. ఆ కథ ఏవిటి అంటే- అనగనగా పుణ్యకోటి అనే ఆవు దాని మందలోని ఇతర పశువులతో కలిసి మేయడానికి అడివికి వెడుతుంది. అయితే, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే దారిలో పుణ్యకోటి మందనుండి విడిపడి దారి తప్పింది. అదే అడివిలో ఆకలితో నకనకలాడుతున్న ఉన్న పెద్దపులి ఒకటి ఈ ఆవును చూసి దాని మీద పడి తినబోతుంది. అప్పుడు ఫుణ్యకోటి పులితో, ఇంటి దగ్గర తనకో చిన్న లేగదూడ ఉందని, అది ఈ సమయంలో ఆకలితో ఉంటుందని, పులి ఆజ్ణ అయితే తను ఇంటికి వెళ్ళి తన బిడ్డకు పొట్ట నిండుగా పాలిచ్చి, దానికి కొన్ని బుద్దులు నేర్పి వెంటనే వచ్చేస్తానని ప్రాధేయపడుతుంది. మొదట అంగీకరించకపోయినా, తరువాత అందుకు అంగీకరిస్తుంది పులి. ఆవు తన బిడ్డ దగ్గరకు వచ్చి దాని పొట్ట నిండుగా పాలిచ్చి ఇతరులతో ఎలా మెలగాలో, తోడి ఆవులతో ఎలా ఉండాలో కొన్ని జాగ్రత్తలు చెప్పి తిరిగి పులి దగ్గరకు వస్తుంది. పుణ్యకోటి నిజాయితీకి పులి ఎంతగానో చలించిపోయి, తను చేయబోయిన పాపానికి తీవ్ర ప్రశ్చాత్తాపపడి దుఃఖించి ఆ అడవి కొండ చరియల మీదనుండి దూకి ఆత్మత్యాగం చేసుకుంటుంది.

ఆ కాలంలోని విద్యావంతులైన కన్నడిగులందరికీ తెలిసిన మరొక పద్యం మా పాఠంగా ఉండేది. ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. నది ఒడ్డున ఒక ఎండిన చెట్టుని నరికే క్రమంలో అనుకోకుండా తన గొడ్డలి చేయి జారి నదిలో పడిపోతుంది. గొడ్డలి కొరకు దిగాలుపడి ఒడ్డున కూచున్న ఆ కట్టెలవాడిని చూసి జాలిపడి నదీ దేవత నదినుండి బయటికి వచ్చి కట్టెలు కొట్టేవాడికి గొడ్డలి ఇస్తుంది. అయితే నదీ దేవత ఇచ్చిన ఆ గొడ్డలి బంగారంతో చేసినదని గుర్తించిన ఆ వ్యక్తి, అది తనది కాదని చెప్పి దానిని తిరిగి ఇచ్చేస్తాడు. దేవత మళ్ళీ కొలనులోకి దిగి, మరొక గొడ్డలితో వస్తుంది. ఈసారి గొడ్డలి వెండితో తయారుచేయబడింది. దానిని కూడా తనది కాదని ఆ కట్టెలు కొట్టేవాడు నిరాకరిస్తాడు. చివరగా ఆ దేవత ఆ వ్యక్తి దేనినయితే పారేసుకున్నాడో అదే పాత ఇనుప గొడ్డలిని వెలికితీసి అతనికి అందచేసినపుడు అతను దానిని సంబరంగా స్వీకరిస్తాడు. అతని నిజాయితీకి, నైతిక గుణానికి ఆ నదీమతల్లి ఎంతగానో సంతోషిస్తుంది. అతడికి తన ఆశీర్వాదాలతో పాటు అత్యంత విలువైన ఆ బంగారు, వెండి గొడ్డళ్ళను కూడా కానుక చేస్తుంది.

వివేకం, దయాగుణం, నైతికత వంటి ఆదర్శాల కథలున్న భాషా శాస్త్రాలు, రాజులు, రాజ్యాలు, క్రీస్తు పూర్వపు శకాలు, శతాబ్దాలు, చక్రవర్తులు పుట్టిన సంవత్సరాలు, వారు రాజ్యాలని జయించిన కాలాలవంటీ లెక్కా డొక్కలతో నాకేం పేచీ లేదు, నా పేచీ అల్లా గణితం తోనే: ఆ కూడికలు, గుణకారం. భాగహారం, సంకలనం-వ్యవకలనం… వీటి పేర్లు వినగానే నా నవనాడులు క్రుంగిపోయేవి. ఏమీ లెక్కల ఖర్మ కాకపోతే పదిహేను తియ్యని మామిడి పండ్లను ముగ్గురికి సమానంగా పంచాల్సిన దుస్థితి నా వంటి పిల్లాడికి ఎందుకు రావాలి? మామిడి పళ్ళు అనేవి పంచడానికా? చక్కగా కోసుకు తినక! ఈ చిక్కు లెక్కలు నెత్తినెక్కక, గణితం క్లాసు అనగానే తరగతి గదిలో చిట్ట చివరి బెంచిలో కాసింత స్థలం చేసుకుని కూర్చునేవాడిని. ఆ భయానక దుష్ట సంక్లిష్ట లెక్కల క్లాసుకు తగినట్లుగానే మా లెక్కల మాష్టారి గంభీరమైన మొహం, ఆ మొహం మీద ఆయన పట్టించుకున్న తెలుపు, ఎరుపు రంగు అడ్డబొట్లు కలిసి ఆయన మొహం నాకు చూడ్డానికి పులిని గుర్తుకు తెచ్చేది.

ఒక రోజు లెక్కల మాష్టారి తరగతిలో పాఠం నడుస్తుంది. నల్లబల్ల నిండా అనేక ప్లస్సులు, మైనస్సులు, ఈక్వల్‌టూ సైనులు, అంకెలు, సంఖ్యలు, చిహ్నాలు… ఏది తలో! ఏది తోకో! నాకు అసలు అర్థంకాలేదు. ఆ అర్థంకాని గోలనంతా నల్లబల్లకెక్కించేసి ఇక లెక్కని పరిష్కరించమని మా అందరికీ మాష్టారి ఆదేశం అయ్యింది. నేను నా తల మొత్తాన్ని నోటుపుస్తకం మీద ఒరగబెట్టి చాలా తీవ్రంగా నటిస్తున్నది లెక్క చేయడం గురించి కాదు. రాని లెక్కలని పక్కకు నెట్టి నా మానాన నేనేవో చిత్తు బొమ్మలు గీసుకుంటూ ఉన్నాను. పుస్తకంపై పెన్సిళ్ళు చేసే గరగరలు, లెక్క మింగుడు పడని విద్యార్థులు గొంతు తడుపుకోనే శబ్దాలు, అప్పుడప్పుడు ఉపాధ్యాయుడు టేబుళ్ళపై చరిచే బెత్తపు దెబ్బలు మినహా ఇక గది అంతా భీకర గంభీరపు వేడితో ఉంది. ఉన్నట్టుండి నా ఎడమచెవి తీవ్రంగా మండినట్లు ఒక భావన అనిపించింది. ఎందుకా మంట? ఏమిటా కథ? అని లోకంలోకి వచ్చి చూస్తే. మా లెక్కల మాష్టారు నా చెవి పట్టుకుని మెలి తిప్పుతున్నాడు. ‘వెధవా, చెప్పిన లెక్క చెయకపోగా పైగా నన్ను ఎగతాళి చేస్తున్నావుట్రా? లే రాస్కల్? లే!’ నాకు ఏమీ అర్థం అవలేదు. నేనా! మాష్టారుగారిని ఎగతాళి పట్టించింది, ఎప్పుడని?! నొప్పితో కీచుమంటూ లేచి నిలబడుతూ ‘బాబోయ్! నేనెప్పుడు మిమ్మల్ని ఎగతాళి చేశాను సర్?’ అన్నాను.

‘దీన్ని ఎగతాళి అనక మరేమిట్రా అనేది, కుంకా?’ అంటూ ఒక చేత్తో, నా లెక్కల నోటు పుస్తకంలో నేను చిత్రించిన పులి వంటి జీవి బొమ్మని నా మొహం మీద ఆడిస్తూ, మరో చేత్తో నా గూబ గుయ్యిమనేలా ఒక దెబ్బ వేశాడాయన. అది ఆయన బొమ్మే అని మేష్టారు, అటువంటి ఉద్దేశంతో చిత్రించినదేదీ అది కాదని, అవి ఊరికే నాకై నేను గీసుకున్న చిత్తుగీతలని నేను – చాలా సేపు ఎవరికి వారం, వాదాలతో-వేడుకోళ్ళతో, కోపాలతో-కన్నీళ్ళతో ముందూవెనుకలయిన ఎప్పటికో ఆ సంక్షోభం సద్దుమణిగింది. నిజానికి ఆ తరగతి గదిలో నేను ఉద్దేశపూర్వకంగా చేయని ఒక పని వల్ల దెబ్బలు, చీవాట్లు తినడం నాకు ఘోర అవమానం అయినప్పటికి, చాలా సంవత్సరాల తరువాత నేను నోటు పుస్తకాల్లో చిన్న చిన్న బొమ్మల స్థాయి నుండి పెద్ద పత్రికల్లో రాజకీయ వ్యంగ చిత్రకారుడిగా రూపాంతరం చెందినప్పుడు, నేను అర్థం చేసుకున్న విషయం ఒకటి ఉంది. మామూలుగా కళ్ళు, ముక్కు, నోరు, గడ్డాలతో సహా మనకు సహజంగా కనపడే ఒక మనిషి బహిరంగరూపం వెనుక ఒక పులి, పిల్లి, కుక్క, నక్క, కాకి, కోడి, గుడ్లగూబ వంటి జంతుజీవజాలమే కాదు. బస్సు, లారీ, కారు వంటి వాహనాలు, సీసాలు, గిన్నెలు, లోటాలు, చెంబులవంటి వస్తు సంచయాలు కూడా ఉంటాయని, వాటిని మనలోని కళాకారుడు పసిగట్టి ఆ ఆ మొహాలను ఈ కేరికేచర్ కళలోకి తర్జుమా చేసి చూపిస్తాడని.

(సశేషం)


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...