ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 3

కన్నడ పాఠాలు, చరిత్ర దిశలు, లెక్కల బూచీలు, బొమ్మల బాధలు… వీటి మాట సరే సరి! మా ఇంగ్లీషు చదువు గురించి తెలుసుకోరా ఏమిటి? చెప్పటానికి ఏమంతగా లేకపోయినా చెబుతా వినండి. మేము లోయర్ సెకండరి మొదటి సంవత్సరపు క్లాసులో కూచునే వరకు మాకు బడిలో ఆంగ్లభాష బోధన అనేదే మొదలుపెట్టలేదు. మొదలుపెట్టడం అనేది జరిగాక అదీనూ ఏమిటన్నమాట మొదలెట్టడం? ఎబిసిడి-లతో నేర్పడం మొదలెట్టారు. నిజానికి మాకు అప్పుడు ఉన్న వయసుకు ఆంగ్ల వర్ణమాల కాదుగా నేర్చుకోవలసినది. చిన్న చితకా వాక్యాలు చకచకా వ్రాయగలిగి ఉండేంత వయసువాళ్ళమయి ఉండి కూడా ఎ అంటే ఏపిల్, క్యాట్ అంటే మ్యావ్, ఇ తో ఏనుగు ఎలిఫెంట్ అవుతుంది అని చదవడం ఎంత సిగ్గుచేటన్నమాట. ఇట్లా ఇంగ్లీష్ కీకారణ్యంలోకి అప్పడప్పుడే అడుగుపెడుతూ కొట్టుమిట్టాడుతున్న రోజుల్లో, తమ దారుణమయిన మద్రాసు ఎండాకాలపు వేడి నుండి తప్పించుకోవడానికి మా అక్కయ్య ఆవిడ పిల్లలతో సహా మద్రాసు నుండి మైసూరుకు వచ్చింది. నగరపు వేషభాషలు, ఆధునిక కాన్వెంట్ చదువులు కలిగిన మా అక్క పిల్లల నాగరిక పోకడ, వారి నోటినుండి ప్రవాహంలా తోసుకు వచ్చే ఆంగ్లభాషా ప్రావీణ్యం చూసి, విని నా మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పిల్లవాడి పరిస్థితి మద్రాసు ఎండలకన్నా దారుణంగా అయిపోయింది. వారి ఆంగ్ల ఉచ్చారణా ప్రవాహపు గడగడల ముందు నా నోరు పల్లెటూరి గబ్బిలాయిలా తెరుచుకూనే ఉండిపోయింది. వారి ఆ పాడు హెచ్చులు పద్ధతి నకరాలకు – నా ఆత్మన్యూనతకు మధ్య కొంతకాలం ఒక యుద్దం నడిచింది. పిల్లలం కదా మొదట్లో అలానే ఉంటుంది. కాలక్రమేణా ఇరుపక్షాల మధ్య భాషా భేదాభిప్రాయాలు నశించి మా వయసుకు తగ్గట్టు ఆటాపాటల్లో కేరింతలుగా తుళ్ళింతలుగా కలిసిమెలిసి కాలమలా గడుస్తూస్తూస్తూ… స్తూ ఉండగానే వారు మదరాసుకు మరలి వెళ్ళే రోజొకటి వచ్చింది. గుండె బద్దలుకావడం అంటారే, కాళ్ళు చేతులు క్రుంగి పోవడం అంటారే, శూన్యం అంటారే, నిర్జనమైన ఎడారిలో ఏకాంతవాసం అని పిలుస్తారే, ఏ దిక్కు చూసినా దిక్కులేనితనమని కూడా అంటారే. అలాంటి మాటలన్ని అప్పటి నా సైజుకు సరిగ్గా కుట్టినట్లు ఉన్నది పరిస్థితి.

ఆ రోజు మా ఇంటి వసారాలో ప్రయాణానికి సిద్దం చేయబడిన ట్రంకుపెట్టెలు, సూటుకేసులు. పండ్లు, మిఠాయిలు కుక్కిన బుట్టలను చూస్తుంటే వాటికి నాకు జన్మజన్మాంతరాల విరోధంగా, పరమ విషంగా అనిపిస్తుంది. దిగాలుగా, బుగులుగా, దుఃఖంతో బద్దలవుతున్న నా హృదయంపైకి టకటకలాడుతూ వచ్చిన ఒక టాంగా బండిలోకి ఈ సరుకులు ఎక్కాయి. దాని వెనుకే మరో బండిలో మా అక్కయ్య, ఆవిడ పిల్లలయిన నా మేనల్లుళ్ళు, మేనకోడళ్ళూను ఎక్కి కూచున్నారు (ఆ బండి ఎక్కి కూచున్న కోడలుపిల్ల ఒకతి తరువాత్తరువాత నా జీవితంలోకి కూడా వచ్చి కూచుని నా భార్య కమల అయ్యింది, అదంతా వేరే కథ) మమ్మల్ని విడిచి వెళ్తున్న వారి వేపు అలా చూస్తూ ఉండిపోయాను. ఇక ఎప్పటికయినా నేను మళ్ళీ ఆ పాత లక్ష్మణ్‌ని అవుతానా అనే అనుమానం. అనుమానానికి రెండు రోజుల వయసు వచ్చీ రాకముందే నేను ఆ పాత లక్ష్మణ్‌నే అయిపోయాను. ఇంటి నిండా అన్నలు, అక్కలు, వారి ఆటలు పాటలు, కవ్వింతలు, కేరింతల మధ్య ఏ తమ్ముడికయినా విచారమనేది ఎంతకాలం ఉండగలదు? ముఖ్యంగా నా సోదరద్వయం బలరామ్, రామచంద్రన్‌ల వంటి అన్నలు మీక్కూడా ఉండి ఉంటే తెలిసేది మజా. నా బాల్యంలో నేను ఎక్కువ సమయం వీరిద్దరి మధ్యే గడిపాను. ఎందుకంటే మిగతావారితో పోల్చుకుంటే మా ముగ్గురి మధ్య నున్న వయసుల తేడా చాలా స్వల్పం.

వీరిరువురిలో బలరామ్ అమిత పనిమంతుడు. తన ఖాళీ చేతులను ఉపయోగించి చిత్రవిచిత్రాలు చేస్తూ ఉండేవాడు, తన చేతికి ఒక చిన్న చెక్క ముక్కని ఇచ్చి చూడండి, దానిని చెక్కి అతను ముచ్చటైన బొమ్మగా తయారుచేసేవాడు. ఇనుప తీగను పట్టుకుని అల్లిబిల్లి తిప్పటాలు తిప్పి ఆకృతులుగా మలిచేవాడు. కాగితాలను అటు మడిచి ఇటుగా, ఇటు మడిచి అటుగా చేసే ఒరిగామి కాగితపు బొమ్మలకు అసలు లెక్కే లేదు. పనికిరావని పక్కకు పడేసిన భూతద్దాలు, పాత కళ్ళద్దాలను ఉపయోగించి ఆ వయసులోనే వాడు నిజమైన టెలిస్కోప్‌ని చేశాడంటే మాటలా?! దాన్ని చేతపుచ్చుకుని మేము మా వంటగది కిటికీ నుండి గురిపెట్టి కిలోమీటర్ల దూరాన ఉన్న చాముండీదేవి ఆలయం మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండే భక్తులను చూస్తూ ఉండేవాళ్ళం. ఇంట్లో పాడయిపోతే పక్కకి పడేసిన పాత కుర్చీల, మంచాల, బెంచీల కలపను ఉపయోగించి క్రికెట్ బ్యాట్లను తయారుచేసేవాడు. ఒకసారి ఆ చెక్క సరంజామాతోనే మా అమ్మ తన ఆభరణాలు దాచుకునేందుకు ఒక పెట్టె కూడా తయారుచేసిపెట్టాడు. దాని బయటి భాగాన్ని గరుకు కాగితంతో పామి పామి నునుపు చేశాడు, లోపల ఎరుపు రంగు వెల్వెట్ గుడ్డతో లైనింగ్ కూడా వేశాడు. పనికిరాని చెక్క ముక్కలతో అటువంటి అందమైన పెట్టె తయారు అయిందంటే ఎవరూ నమ్మలేనంత గొప్ప పనితనంతో అది తయారయ్యింది. ఈ విద్యలన్నీ వాడికి ఎలా ఒంటపట్టాయో మాకు తెలీదు కానీ వాడికి కలిగే తక్షణకోపం అనే షార్ట్ టెంపర్ మాత్రం మా నాన్నగారి వారసత్వంగా వచ్చింది. వాడు ఏదయినా పనిచేసున్నప్పుడు వాడికి దగ్గరలో నిలబడి ఒక చిన్న దగ్గు దగ్గినా, గట్టిగా ఊపిరి పీల్చినా ఆ మాత్రం చప్పుడు కూడా భరించేంత శాంతం వాడికి లేదు.

బలరామ్ ఇలా ఇంట్లో ఒకచోట కుదురుగా కూచుని పనిచేసుకునే ప్రాణి అయితే వాడికి పూర్తి విరుద్ధమైనవాడు రామచంద్రన్ (వీడికి డుబ్బు అని ముద్దు పేరు). వీడు పూర్తి స్థాయి ఇంటి వెలుపలి మనిషి. వీడు ఎప్పుడయినా ఇంట్లో కనపడ్డాడంటే విచిత్రమే! వీడు పేరుకు మాత్రమే రామచంద్రన్, ఆత్మ అల్లా హనుమంతన్. వీడి నివాసం, కార్యకలాపాలు అంతా మా తోటలోని చెట్లపైన లేదా ఇంటి చుట్టూతా ఆవరించుకున్న ప్రహరీ గోడ పైనే. నా నివాసమ్ము తొలుత గంధర్వలోక మధుర సుషమా సుధాగాన మంజువాటి… వంటి గింటి లెక్క లేదు డుబ్బుకు. వీడికి తొలుత మలుత గిలుత అంతా అంతెత్తు చెట్లు, గోడలు, ఇంటి పై కప్పులు మాత్రమే. మా అన్నాదమ్ముల్లో అటీవలి నా స్పూర్తిదాయకుడు అంతా మా రామచంద్రనే. నేను వాడిలాగే కొమ్మ మీద నుండి గోడ పైకి, గోడ మీది నుండి కిటికీ కంతలోకి లంఘించాలని తెగ ఉవ్విళ్ళూరేవాడిని, అప్పుడప్పుడూ అలా చేసి విజయవంతంగా అసఫలం అయ్యేవాడిని కూడా. నేను ఇలా ఈ విన్యాసాలు చేయడానికి వాడు ఏ మాత్రం సమ్మతించేవాడు కాదు. చెట్టు మీదినుండి పట్టు తప్పి క్రిందపడితే అయితే మెడ కాకపోతే కనీసం కాలయినా నేను తప్పక విరక్కొట్టుకుంటానని, తద్వారా ఇంట్లో వాళ్ళూ డుబ్బూ కాళ్ళు కూడా విరగ్గొడతారని అతగాడి భయం. ఎలా అయితేనేం ప్రాధేయపడగా పడగా వాడు నాకు మామిడిచెట్టు ఎలా ఎక్కాలో నేర్పించాడు.

మామిడి పళ్ళ కాలం వచ్చిందంటే చాలు ఆ కాలం గడిచేదాకా దాదాపు ఋతువంతా మేము మామిడి చెట్లమీదే గడిపేవాళ్ళం. ఆ మామిడి కొమ్మల మీదికి వెళ్ళే ముందు వంటింట్లోంచి ఉప్పూ, కారం పొట్లాలు కట్టుకోడం మాత్రం మరిచేవాళ్ళంకాదు. డుబ్బుగాడయితే కళ్ళు మూసి, కాళ్ళు మడిచి, చిలకలా ఎగిరినట్లే ఎగిరి చెట్టు మీదికి వాలేవాడు. అప్పుడప్పుడు నేను చెట్టు ఎక్కలేక జారేవాణ్ణి, జారిన వాణ్ణి కింద పడేవాణ్ణి, పడినందుకు మోకాలుకో, మోచేతికో గాయంచేసుకునేవాణ్ణి. అప్పుడు డుబ్బూ గబగబా కిందికి దిగివచ్చి గాయం పాలైన భాగంపై ఇంత మన్ను పోసి, వాచిన ప్రాంతాన్ని గట్టిగా రుద్ది అదే ప్రథమ, ద్వితీయ, తృతీయ చికిత్సగా చేసేవాడు. నా ప్రాణాలకు చిన్న ప్రమాదమే కల్పించి ప్రాణాలు దక్కించినందుకు కృతజ్ఞతతో ఒక రెండు మామిడి కాయలను పెరికి మా ఇంటికి కొన్ని మైళ్ళ దూరాన ఉన్న కొండ మీది చాముండి అమ్మవారి గుడి దిశగా విసిరి దానిని నైవేద్యంగా భావించమని కోరుతూ అమ్మవారికి దండం పెట్టుకునేవాడు. ఒక విసురుకే అంత దూరం పయనించలేని ఆ మామిడిపళ్ళు మా పొరుగు ఇంటి పై కప్పుపై ధబేలున కూలడం గురించి అతను పెద్దగా చింతించేవాడు కాదు.

డుబ్బుది గొప్ప ఊహాశక్తి. దాన్ని ఉపయోగించి వాడు వాచ్యరూపంలో అద్భుతమైన కథలు చెప్పేవాడు. కాకులు దూరని కారడవులు, చీమలు దూరని చిట్టడవులు, అందులో నివాసముండే అడివి జంతువులు, వాటి తోడుగా భీకరమైన దెయ్యాలు, భయంకరమైన భూతాలు కథలు-గాథలు-కబుర్లు… చెప్పిన కథను మళ్ళీ చెప్పకుండా, అల్లిన గాథను మళ్ళీ మళ్ళీ అల్లకుండా ప్రతిసారీ సరికొత్త కథనాత్మక కథలు కల్పించేవాడు. అద్భుతమైనవి. ఒళ్ళు గగుర్పొడిచేవి. భయానకమైనవి. బీభత్సమైనవి. కథని ఏ రసంలో చెప్పినా అవి వినడానికి మోహమే నా ఆలంబన అయ్యేది, చమత్కార కథలు విన్నప్పుడు నా ఒడలు చక్కిలిగింతలుగా నవ్వు వచ్చేది, దెయ్యాల భూతాల కథలు విన్నప్పుడు పీడకలలు రాత్రుళ్ళు వెంటాడేవి. డుబ్బు కథలు చెబుతున్నప్పుడు ఆ కథలలోని రకరకాల ఊహాజనిత ప్రాణులు అక్కడ పడి ఉన్న రాళ్ళ అడుగునుండి, చెట్ల తొర్రల్లోంచి కాస్త నావేపు తొంగిచూసి అవునన్నట్లు కాస్త తల ఆడించి పోయినట్లు నా కంటికి అనిపించేవి. డుబ్బు దగ్గర ఒక పాత ఖాళీ డైరీ ఉండేది. వాడు అందులో రకరకాల పక్షులు, జంతువులు, మానవుల బొమ్మలు చిత్రించేవాడు, ఆ బొమ్మల పక్కనే వాటిని గురించి తనదైన వ్యాఖ్యానాలు వ్రాసేవాడు. డైరీ పేజీల అంచుల చివర్లలో పక్షుల బొమ్మలు, పేజీ పేజీకి అదే పక్షి బొమ్మ భంగిమని మార్చి చిత్రించేవాడు. మనం కనుక ఆ డైరీని పట్టుకుని అంచుల పేజీలని సర్రున తిరగేశామనుకో, ఆ పక్షి రెక్కలు దూసి ఎగిరిపోతున్నట్టు కనపడేది, ఒక్క పక్షే కాదు నడిచే మనుషులు, పరిగెత్తే జంతువులు ఇవన్నీ ఆ పేజీల చివర్లలో భ్రమాజనిత ప్రాణం పోసుకునేవి.

గడియారంలో నిత్యం నడిచే ముల్లులా డుబ్బు ఎప్పుడూ క్రియాశీలకంగా ఉండేవాడు. వాడి సమయంలో ఖాళీ అనేది, ఆత్మలో నీరసం అనేదే కనపడేదికాదు. ఎప్పుడూ ఏదో ఒకటి కనిపెట్టడానికో, కనుగొనడానికో, చేయడానికో ఉన్నది తను అన్నట్టు ఉండేవాడు. అతగాడి సమక్షంలో ఉంటే మజా అనేది దొరకని క్షణం అనేది అసలు ఉండేదికాదు. అయితే అప్పుడప్పుడూ మా ఇద్దరి మధ్య ఆవేశకావేశాలు రగుల్కునేవి. పెద్దవాడిగా అతను ఆదేశాలు ఇచ్చేవాడు, అవి అమలు చేయడానికి నేను చూపించవలసిన తగిన విధేయత తన పట్ల చూపించడం లేదనే అసంతృప్తితో ఉండేవాడు. మా ఇద్దరికీ మధ్య విషయం చెడినపుడు తను వంటగదిలో చేసిన నిప్పు ప్రయోగాల గురించి, నీళ్ళ చావిడిలో సంకల్పించిన నీటి ప్రయోగాల గురించి, అలానే సరుకుల గదిలో కొట్టేసి తిన్న పచ్చి బియ్యం, పప్పు శెనగల విందు గురించిన భోగట్టా ఇంటివాళ్ళకు చేరవేశానని అతని అనుమానం. ఇటువంటి వెన్నుపోటు కార్యానికి పాల్పడ్డ ద్రోహి ఏరకంగా కొట్టించుకోడానికయినా, తన్నించుకోడానికయినా అర్హుడని అతని ప్రగాఢ విశ్వాసం. ఒకరోజు అట్టి విశ్వాసపు పునాది మీద అతను నిలబడి నా దేహశుద్ధి చేసే సమయాన నేను పెట్టిన ఆక్రందన విని నన్ను కాపాడ్డానికి అమ్మ అక్కడికి వచ్చింది. తన చేత దెబ్బలు తినకుండా అమ్మ రక్షణ పొందిన పాపానికి పరిహారంగా నేను తన వెంట ఉండటానికి తగనివాడినని ఆరోజు నుండి నన్ను తన నుండి దూరంగా ఉండమని ఆజ్ఞాపించాడు.

దెబ్బలు తినడం, ఆపై రక్షించమని గగ్గోలుపెట్టడం వంటి కార్యాలకన్నా డుబ్బుగాడికి దూరంగా ఉండటమే హాయనిపించింది నాకు. కానీ నా కన్నీళ్ళు ఆరిపోయి, ఏడుపుగొట్టు మొహం తేటపడిన ఆపై ఏం చేయాలో తోచక విసుగ్గా అనిపించి డుబ్బుగాడెక్కడున్నాడా అని వాడిని వెదుక్కుంటూ బయలుదేరాను. మా రహస్య స్థావరాలయిన కలప గిడ్డంగి, తోట చివర ఉండే పెద్ద పొద, మామిడి చెట్టు కొమ్మ మీద కట్టుకున్న మంచె, మోటరు బండి గ్యారేజీలన్నీ వెదికి, వెదికీ చివరగా గడ్డివాము వెనుక విసుగ్గా కూచుని ఉన్న తనని కనిపెట్టాను. నన్ను చూడగానే వాడి మొహమూ వికసించింది. ఒక గంట క్రిందట మేము మాటా మాటా అనుకున్నామని, పోటాడుకున్నామని తను నన్ను తన్నబోయాడని, నేను వాడి సావాసాన్ని మరిక ఈ జన్మలో కోరననే ప్రతిజ్ఞ పూనాననే తుచ్ఛమైన విషయాన్నీ బుడుక్కున మరిచిపోయి ఒకరి భుజాల మీద ఒకళ్ళం చేతులు వేసుకుని పొడుగ్గా కబుర్లాడుకుంటూ నడిచాము.

ఒక రోజు బడికి వెళ్ళిన డుబ్బు బాగా జ్వరంతో తిరిగి వచ్చాడు, అది మొదలు వాడు చాలా నెలలు టైఫాయిడ్‌తో మంచం మీదే ఉన్నాడు. అంత జబ్బు వల్ల వాడు బాగా బలహీనపడిపోయాడు, కొంత మతిమరుపు కూడా వచ్చేసింది. కోలుకోడానికి చాలా నెలల సమయం పట్టేసింది. మెల్లమెల్లగా ఆ మంచం మీది నుండి లేచి బయటి ప్రపంచంలోకి వచ్చిపడ్డాడు. అయితే ఈ జ్వరం వాడి సహజమైన, చంచలమైన, కుతూహలాంకితమైన ఆత్మని చాలావరకు అణగకొట్టేసింది. ఆ జ్వరం తరువాత మునుపటి డుబ్బుని ఎండల్లో, వానల్లో, చల్లగాలి లోనూ చెట్లు ఎక్కే డుబ్బుని, గోడల మీద పరిగెత్తే డుబ్బుని, సందడి పిల్లాడు డుబ్బుని ఎవరూ ఎప్పుడూ చూడలేదు.

ఒక్కోసారి మా అక్కయ్యవాళ్ళు సెలవుల్లో గడపటానికి మైసూరు రాలేని సందర్భాలు ఉండేవి. అప్పుడు మా అమ్మ అందరికంటే చిన్నవాళ్ళమయిన నన్ను, రామచంద్రన్‌ని, బలరామ్‌ని వెంటపెట్టుకుని మద్రాసులో ఉండే మా అమ్మమ్మగారి ఇంటికి తీసుకెళ్ళేది. మద్రాసు ప్రయాణంలో గొప్ప ఉత్తేజాన్ని కలిగించేది ఏమిటీ అంటే రైలు ఎక్కడమే. మనం కదలకుండా కూచుని ఉంటాం, కంటి ముందు ప్రకృతి అంతా కదిలిపోతోంటుంది. రకరకాల నివాసాలు, డాబాలు, గుడిసెలు, కొండలు, గుట్టలు, చటుక్కున కనపడి లటుక్కున మాయమయ్యే మనుషులు, రైల్వే క్రాసింగులు, దూరపు మలుపుల్లో అదృశ్యమయ్యే రైలు పట్టాలు, ఆ చుట్టుతా ఆవరించుకున్న మైదానాలు, ఆవులు, గొర్రెలు, వెనక్కి పరిగెట్టే చెట్టూచేమా, సన్నని గీత గీసినట్లు కనపడే రహదారులు… వంటి దృశ్యాలను చూస్తూ మేము ముగ్గురం మైమరచిపోయేవాళ్ళం. రైలు ఏదయినా స్టేషన్‌ని సమీపించినపుడు లేదా అపుడపుడు తన పట్టాల దారిలో ఏదయినా ఆవో, గేదో అడ్డంగా కనపడినపుడో రైలు ఇంజను పెద్దగా గాండ్రుమని ఆవులించి నల్లని పొగనుగక్కేది, ఇంత బొగ్గు దుమ్ముని విదిలించేది, కిటికీలకు అతుక్కుని కూచున్న మా కళ్ళల్లో ఆ బొగ్గు పొడి పడేది, మూతి ముక్కు నుదురు బుగ్గలు మసితో నల్లబడేవి. మొహాలు నల్లగా కాళ్ళు చేతులు తెల్లగా ఉండి మేము మద్రాసు నగరపు స్టేషన్లో కాలు పెట్టేవాళ్ళం. మామూలుగానే మద్రాస్ పట్టణపు ఉష్ణోగ్రత పొయ్యివేడిలా ఉండేది. ఇక వేసవికాలంలో అయితే మనం పొయ్యిలో దిగబడిపోయి బ్రతుకుతున్నట్లే. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏ సమయమైనా కానీ ఉష్ణోగ్రత మాత్రం సలాకిలా ఒకే గీతమీద ఉండి మనల్ని కాలుస్తూ ఉంటుంది. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి, కానీ అవి వేడిని అదుపులో ఉంచడానికి పనికిరావు. కేవలం ఇంట్లో ఉన్న ఈగలు దోమలని బయటికి పారద్రోలే బాధ్యత మాత్రం వహిస్తాయి.

ఇక్కడ ఇంట్లో ఉండే ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెబుతా. అందులో ఒకరు మా అమ్మగారి పెద్దన్నయ్య అంటే మా పెదమామయ్య తమిళ, ఇంగ్లీషు భాషలలో పెద్ద పండితుడు. ఆయన తాత్వికుడు, సున్నితమైన వ్యక్తి, హాస్యభరితమైన స్వభావం గల మనిషి, ఆయనలో ఉండే క్షమాగుణం కూడా గొప్పది. మా పెదమామగారి సంపాదకత్వంలో ఒక తమిళ పత్రిక వెలువడేది. ఆ రోజుల్లో సాహిత్యాభిలాష ఉన్న తమిళులు అనేకులు ఆ పత్రికకు అభిమానులు. పెదమామయ్యకి పూర్తిగా విరుద్దమయిన స్వభావం మా చినమామయ్యది. వృత్తి రీత్యా ఈయన కార్ సేల్స్‌మాన్, కారు నడపడం కోసం డ్రయివర్ సీట్ ఎక్కాడా చాలు – అతివేగం అనే మాట ఆయన కారు చక్రాలకు ఎన్నో కిలోమీటర్ల దూరంలో వెనకబడేది. మద్యపానం, ధూమపానం ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, కారు అమ్మడంలో ఆయనకున్న ప్రతిభ అమోఘమైనది, ఒకసారి ఆయన చేతికి చిక్కి కారు కొనకుండా వెనక్కి పోయిన కోనుగోలుదారుడు ఎవరూ ఉండరు. కార్ల ప్రపంచలో ఆయన పేరు చాలా విఖ్యాతం. ఆ రోజుల్లో మైసూరు మహరాజా వారి దర్శనమంటే కేవలం ఆయన ఆంతరంగికులు, ఆప్తులకు మాత్రమే సాధ్యం. అటువంటి మహరాజావారినే మెప్పించి ఒకటీ అరా కాదు, అనేక కార్లను ఆయనచేత కొనిపించాడు. ఊరికే తెలివితేటలే కాదు మహా తెగింపుగల మనిషి కూడా, గొప్ప ధైర్యస్తుడు, సాహసి, మొండి. ఒకసారి పంతంగా నీలగిరి కొండల నుండి మైసూర్‌ వరకు బ్రేకులు లేని కారెక్కి కేవలం గేర్‌లను నేర్పుగా మార్చడం ద్వారా విజయవంతంగా చిన్న ప్రమాదం కూడా జరగకుండా నడిపించాడు. మరొకసారి ఆయన తన కారులో బెంగళూరు నుండి మైసూర్ వెడుతున్నప్పుడు రాత్రిపూట కొంతమంది దారికాచి దోపిడీలు చేసే దొంగలు ఆయన కారుకు అడ్డంపడ్డారు. చోరమహాశయుల బాణాకర్రలకు తల ఒగ్గుతున్నట్లే కారు వేగం తగ్గించి వారు దగ్గరికి రాగానే ఒక్కసారిగా కారుని భయంకరమైన వేగంతో పరుగులు తీయించి దొంగలను చెల్లాచెదురు చేశాడు, తను సురక్షితంగా బయటపడ్డాడు.

ఇక్కడ మద్రాసులో మా అమ్మమ్మే ఈ కుటుంబానికంతా ఇంటిపెద్ద. ఆ ఇంట్లో లెక్కపెట్టలేనంత మందిగా ఆవిడ సంతానం, ఆవిడ మనవ సంతానం. అమ్మమ్మగారి ఇల్లు చాలా పెద్దది. అతి విశాలమైనది. ఎంత విశాలమైన ఇల్లు ఇదంటే ఈ ఇంటిని మీరు ఒక చిన్న పల్లెటూరుగా భావించుకోవచ్చును. ఎత్తైన స్తంభాలు, పెద్ద పెద్ద మెట్లు, లెక్కలేనన్ని గదులు, గదులన్నింటికీ భారీ తలుపులు, ఆ తలుపులకు బిగించిన ఇత్తడి గుబ్బలు. ఈ ఇంట్లో నా వయసు పిల్లలు కూడా చాలామందే ఉన్నారు. కానీ అక్కడ మా మైసూరు ఇంటి పద్దతులకి, ఇక్కడి పోకడలకి ఎక్కడా సారూప్యత అనిపించడం లేదు. చెప్పాలంటే వీళ్ళకన్నా మేము కాస్త కుదురుమట్టమయిన పిల్లలం. ఇక్కడ ఇంట్లో వీళ్ళు ఎవరూ చొక్కాలు వేసుకోలేదు, ఇంకా అన్యాయం ఏమిటంటే బయటికేమయినా వెళ్ళే పని ఉన్నా ధోవతీల మీదే వెళ్ళడం, రావడం జరుగుతుంది. స్నానాలు చెయ్యడాలు, బట్టలు కడగడాలు అన్నీ తోట కొళాయి కిందే, దానికీ ఒకటంటూ వేళాపాళలు లేవు, ఎప్పుడయినా కుళాయి తిప్పవచ్చు, ఎన్ని సార్లయినా స్నానాలు చేయవచ్చు. ఇదేమని ప్రశ్నించే పెద్దలు కారిక్కడి పెద్దలు, ప్రశ్నించినా జవాబు ఇచ్చేలా లేరీ పిల్లలూనూ. ఉదయం లేచినప్పటినుండీ రాత్రి పొద్దు పోయేదాకా అదేం గెంతడాలు, గంతులెయ్యడాలు, అరవడాలు, ఆడుకోడాలు! ఇవన్నీ అయ్యాకా నిద్ర వచ్చిందా, ఎక్కడున్నామా, ఎవరి గదిలో ఉన్నామా అనే అలోచనసలే లేకుండా ఎక్కడ పడితే అక్కడ అలానే ఒరిగిపోయి నిద్రపోయేవారు. వారి వింత అలవాట్లు నాకు జీర్ణం అవడంలేదు. పైగా అమ్మమ్మగారి ఇంటికి సమీపంలోనే శ్మశాన వాటిక ఉంది. అంత్యక్రియల ఊరేగింపులు మా ఇంటి మీదుగానే వెళ్ళాలి. రాత్రిపూట్ల సాగే ఆ ఊరేగింపులు, డప్పువాయిద్యాల ఘోషలు, కిరోసిన్ దీపాల వెలుగులో ఆ అంత్యక్రియల్లో పాల్గొనే దుఃఖితుల నీడల వరుసలు… నేను నిద్రపోయే గోడల మీద వరుసగా నడుస్తూ, ఏడుస్తూ, ఎగిరి దుముకుతున్నట్టుగా ఉండి నాకెంతగానో, భయాన్ని బాధను కలిగించేవి. ఇక అక్కడ ఉండటం నా వల్ల కాక నన్ను మైసూర్‌కు తిరిగి తీసుకువెళ్ళమని మా అమ్మని కన్నీళ్ళతో వేడుకోవడం మొదలెట్టాను. ఎట్టకేలకు మేము తిరిగి మైసూర్‌కు బయలుదేరవలసిన రోజు రాగానే నాకు విమోచన దినం వచ్చిందని గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాను.

(సశేషం)

అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...