నా దైనిక సమస్యలు

ఇదంతా పాత కథ. 1949లో మాట. తెలుగు స్వతంత్ర అనే పత్రికలో నా దైనిక సమస్యలు అనే శీర్షిక కింద అచ్చయిన కొన్ని కన్నీటి చుక్కలు, గుండె మంటలు, ఆకలి నొప్పులు. అయ్యా బాబూ, అమ్మా తల్లీ, మీ మంట, మీ ఏడుపు, మీ దరిద్రం, మీ దౌర్భాగ్యం ఏదైనా పర్లేదు, చదవచక్కగా ఉంటే చాలు. మా పత్రికకు రాసి పంపండి. అందులోని ఒక ఉత్తమ రచనకు పది రూపాయల బహుమానం ఇస్తాము అని ప్రకటన.

అప్పుడు మన తెలుగు పాఠకులు ‘శారద’ అని చదువుకునే తమిళ వలస హోటల్ పనివాడు నటరాజన్ అనే రచయిత శారద తన కన్నీటిని కాస్త పట్టి, కాగితం పైన వంపి ఆ పత్రికకు పోస్ట్ చేశాడు. ఆయన వ్రాసిన నాలుగు మాటలు ఇవిగో ఈ క్రింద ఉన్నాయి చూడండి.

నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఈ చాకిరి చేస్తో ఇట్లా ఆలోచనలు చేస్తే తొరగా చచ్చిపోతానని. కానీ హోటల్ చాకిరి తప్పదు; చాకిరికి తగినంత ప్రతిఫలమూ రాదు. పోనీ ఈ కథలు రాయటం మానేద్దామా అనుకుంటాను. అది సాధ్యం కావటం లేదు, తెలుగు మాతృభాష కాకపోవటం వల్ల ఎంతో చదివితే గాని ఏ రచనా వ్యాసంగం సవ్యంగా సాగదు. అట్లా చదివేందుకు పుస్తకాలు కొనే ఓపిక లేదు. ఏ పుణ్యాత్ముడన్నా ఇస్తాడనుకుందాం. తీరిక గుర్రం కొమ్ములుగా ఉంది. ఇటీవల హోటల్ పనివాళ్ళకి తెనాలిలో ఎనిమిదిగంటల పని వచ్చిందన్నారు. ఏ దారిన ఒచ్చిందో తెలీదు కాని, నాతో సహా నూటికి తొంభైఐదుమందిమి పది-పన్నెండు గంటల ఎద్దుచాకిరీ చేస్తూనే వున్నాం. ఈ లక్షణంలో చదువెక్కడ, రాతెక్కడ? ప్రభుత్వం శాసనాలు చెయ్యటం కనిపిస్తోంది కానీ అవి అమలు జరగటం కనిపించదు. పేరుకు చేంబర్ ఆఫీసూ ఉంది; ఓ ఆఫీసరూ ఉన్నాడు. హోటల్ సర్వరుకు చదువెందుకూ అనే పెద్దమనుషులు చాలామంది ఎదురుపడ్డారు నాకు. సరైన గుడ్డలు నేను పుట్టింతర్వాత తొడిగి ఎరగను. ఈ హోటల్ పనికి గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పటికి పాతికసార్లకి పైగా ఈ ఉద్యోగం ఊడిపోవడం, రోజుల తరబడి పస్తులుండటం జరిగింది. ఇకముందు కూడా నా జీవితం ఇలానే ఉండబోతుందనడంలో సంశయమే లేనప్పుడు మిగిలి ఉన్న జీవితకాలం ఎలా గడవబోతుందా అని తగని భయమేస్తోంది. స్వతంత్రం వొచ్చాక ఇట్లా ఉండదనుకున్నాను. కనీసం, నా జీవితప్రమాణం వెనకటికన్నా నూటికి ఇరవైపాళ్ళన్నా పెరుగుతుందనుకున్నాను.

పత్రికలవారు కథలు రాస్తే ఇచ్చే డబ్బులు నా మూర్ఛల రోగాన్ని నయం చేసుకోటానికన్నా సరిపోతయ్యేమో అని సంతోషించాను. అదీ వట్టిదైపోయింది. ఈ పద్ధతిలో నేను స్వతంత్ర భారత పౌరుణ్ణని భావించలేక పోవటంతో తప్పేమీ లేదనుకుంటాను.

ఎస్. నటరాజన్
తెనాలి.

ఈ ఉత్తరాన్ని నేను డాక్టర్ భార్గవిగారి రచన అలా కొందరు పుస్తకంలో చదివాను. ఆ పై నా స్వంత ఆసక్తి కొద్ది తెలుగు స్వతంత్ర పాత కాపీలు వెదికి పట్టుకుని ఈ తరహా రచనల్లో ఉత్తమ రచనకు పది రూపాయల బహుమానం ఉన్నదని తెలిసి గడిచి పోయిన కాలంలో ముగిసిపోయిన ప్రకటనే అయినప్పటికీ ‘భగవంతుడా! ఆ పదిరూపాయల పారితోషికము శారదకే ఇప్పించు నాయనా, మందులకు పనికి వస్తాయి తండ్రీ!’ అని దేవుడికి దండం పెట్టుకున్నాను. ఆ తరువాతి సంచికల్లో ఉత్తమ రచనకు బహుమతి పొందిన రచయిత గురించి చూస్తే ఆ బహుమతి ఎం. వి. రామారావుగారనే డాక్టర్‌గారికి ప్రకటించారని తెలుసుకుని మనసు ఎంత ముసురుపోయిందో ఆ రోజు చిన్నబోయిన నా మొహాన్ని చూసి ఉంటే తెలిసేది మీకు. శారద ఉత్తరంలో ఉన్నదల్లా భయంకరమైన పేదరికం, దరిద్రం, కనీసం మందులకయినా పనికి వస్తాయి కదా అనే పదిరూపాయల ఆశ. పది ముష్టి రూపాయలబ్బా. ఓన్లీ టెన్ రూపీస్ కయినా ప్రాప్తం లేని అచ్చమైన రచయిత చచ్చు బతుకు ఉత్తరమది. ఈ శారద ఉత్తరానికి ముందు సంచికలో మహారచయిత, జీవితమెత్తు రచనలను మనకు మిగిల్చి పోయిన అత్యంత అపురూపమైన రచయితల్లో ఒకే ఒక కొడవటిగంటి కుటుంబరావుగారి దైనిక సమస్యల రచన ఈ క్రింది ఉంది చదవండి.

ఒక లక్షమంది ప్రముఖ ఆంధ్రుల జాబితా తయారుచేస్తే అందులో నా పేరుంటుందని గట్టి నమ్మకం ఉంది. ఆర్థికంగా బాగున్నవాళ్ళ జాబితా తయారుచేస్తే అందులో మొదటి లక్ష మందిలో నా పేరుండదని కూడా నాకు గట్టి నమ్మకం.

ఇంకొకరికి చాకిరి చెయ్యకుండా నా ఆర్థిక సమస్యను నేనెదుర్కోలేను. రోజుకు షుమారు పది గంటలైనా పనిచేస్తే తప్ప నా అవసరాలు జరగవు. (నా అవసరాలలో సిగరెట్టూ, షుమారైన తెల్లని గుడ్డలూ కూడా ఉన్నాయి.)

నాది చాలా అసమగ్ర జీవనం, నేను తినేతిండి ఉత్తమతరగతి ఆహారం కాదు. నాకు ఉండదగినన్ని దుస్తులు లేవు. నాకు ఉండదగినంత గృహవసతి లేదు. నేను చేసేపనికి మంచి లైబ్రరీ అవసరం. నేనీ లైబ్రరీని ఈ స్థితిలో ఎన్నటికీ సంపాదించలేను. నా జీవితానికి తగినంత విశ్రాంతి గాని, ఆనందం గాని సంపాదించుకోలేను. విరివిగా దేశం చూడటానికి కూడా నాకు సదుపాయాలు లేవు.

నామీద ఆధారపడి ఉన్నవారి భవితవ్యాన్ని ఒక దారిలో పెట్టేందుకు నాకు శక్తి లేదు. కనీసం ఇంత డబ్బయినా వెనక వేసుకోలేను. నలుగురు స్నేహితులకు అప్పుడప్పుడూ ఆతిథ్యం ఇవ్వటం కూడా నాకు మించిన పని.

యుద్ధం అయినాక నా సంపాదనశక్తి చాలా తగ్గింది. స్వాతంత్ర్యం వచ్చినాక ఇది పెరగలేదు గాని నా జీవిత భారం అన్ని వేపులా హెచ్చింది. నేను కాల్చే సిగరెట్లు, ధరించే గుడ్డలు, నేను తినే కూరలు, నా బస్సు చార్జీలు, రైలు చార్జీలూ – అన్నీ పెరిగిపోయాయి,

కాంగ్రెసు ప్రజాప్రభుత్వం రోజూ చేస్తున్న చర్యలను గురించి పత్రికల్లో చూస్తున్నాను. నా జీవిక భారాన్ని ఈ చర్యలు అణుమాత్రమైనా తగ్గించలేకపోవటం చూస్తే నాకు ఒక్కొక్కసారి వింత కలుగుతుంది. ఈ ప్రజాప్రభుత్వంలో పెట్టుబడిదార్లూ దొంగ వర్తకులూ కొందరు ప్రభుత్వోద్యోగులూ బాగుపడటం చూస్తే ఈ సంఘంలో వారి సంస్కారానికి ఎటువంటి స్థానమున్నదీ, నా సంస్కారానికెటువంటి స్థానమున్నదీ నాకర్థమవుతూ ఉంది. ఈ విషయంలో నా సాటి రచయితలంతా నేనున్న స్థితిలోనే ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళందరి స్థితి బాగుపడకుండా నా ఒక్కడి స్థితే బాగుపడాలనేది నేను సహించలేను.

మానసికంగా కూడా జీవితం నన్ను కుంగదీస్తోంది. అనేక ఏళ్ళుగా నేను ప్రజాస్వామికం మీద అభిమానం అలవరచుకున్నాను. సంఘం మీద వ్యామోహం తెచ్చుకున్నాను. పత్రికలలో ప్రజాస్వామిక సూత్రాలకు జరుగుతున్న అవమానం గురించి, ప్రజలు ఉమ్మడిగా పడుతున్న ఇక్కట్ల గురించీ చదువుతున్నప్పుడల్లా నా గుండెలో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా ఉంటుంది. ప్రజల దారిద్య్ర్యము, అజ్ఞానము, ఆనారోగ్యమూ అనివార్యాలు కావని, వాటిని పరిష్కరించే విధానాలకు మనిషే ధర్మకర్త అనీ తెలిసి ఉండటం వల్ల నా అసమర్థత నన్ను మరింత కుంగదీస్తుంది. అన్నీ ఈశ్వరాజ్ఞ వల్లనే జరుగుతాయని, ఇహజీవితం క్షణభంగురమని, ఎవడి ఇహపరాలు వాడే చూసుకోవాలనీ నేను నమ్మగలిగి ఉంటే నా మానసిక బాధలు చాలావరకు నివారణ అగును. కాని అది తక్కువ సంస్కారమని విశ్వాసం ఉండటం వల్ల, నా సంస్కారం వల్ల నాకింత మానసిక ఆనందమైనా లేదే అని నేను విచారించటం అస్వాభావికం కాదు.

— కొడవటిగంటి కుటుంబరావు

ఈ రెండు ఉత్తరాలు చదివిన తరువాత నేను చాలా అశాంతికి, అసహనానికి లోనయ్యినాను. గుండె కోతగా, హృదయం బద్దలుగా ఉండినది నాకా రోజు. నేను ఆ రోజు ఎంత వేదన పడ్డానో అదే వేదన మరికొందరైనా పడతారని, ఈ మాత్రం సాహిత్యపు గోచిగుడ్డ బ్రతుకుని పీలికలుగా వాటాలు వేసుకుని ధరించచూసేవాళ్ళు సిగ్గు పడతారని ఒక ఉటోపియా కొద్ది ఈ రెండు ఉత్తరాలు.


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...