రంగు బలపం: పులక్ బిశ్వాస్


పులక్ బిశ్వాస్ (1941-2013)

కొంచెం ఎక్కువ సిగ్గుగా ఉంటుంది, అలవాటు లేని పనిలా కొత్తగా ఇలా చేస్తుంటే. ఇప్పటికిప్పుడు ఇలా అతి కొత్తగా మొట్టమొదటిసారి సందు మలుపులో నన్ను దాచుకుని ఎదురువచ్చిన మనిషికి కత్తి చూపించి మెళ్ళో గొలుసు, జేబులో పరుసు తియ్యమని బెదిరిస్తున్నట్లుగా ఉంది. ఇంకా ఆ పై ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్లో బ్లాక్ టిక్కెట్లు అమ్మడానికి తయారయినట్లు కుదురుకుని తలవంచుకుని “యాబయ్‌ది నూరు యాబయ్‌ది నూరు” అని అమ్ముతున్నట్లూ కూడా ఉంది. అంత సిగ్గుగా అట్లా సిగ్గుగా ఉంది.

ఇప్పుడు చాలా బెంగతో, చాలా దుఖంతో “సైగల్ని వినండి ఇంకొంచెం ప్లీజ్!” అనడిగినట్లు కూడా ఉంది. “సార్సార్సార్! అమ్మా మేడమ్! బాబూ నాయనా! ఒకసారి భీష్మా సాహ్నీని చదవండి దయచేసి. మంటోని, సీయెస్ లక్ష్మీని, రామ్‌ నారాయణ్ శుక్లాని కూడా… ప్లీజ్! ప్లీజ్! మెర్సీ ప్లీజ్! మాంటెరే పాప్ ఫెస్టివల్‌లో పరమశివుడి వంటి రవిశంకర్ చేతి వ్రేళ్ళ హొయల వేగాన్ని అందుకోలేక సితార్ నిప్పుల్లో దగ్ధమయినపుడు దివినుంచి భువికి ఎగిసిన ఒక పూలవానలో ఒక పూరెక్కలా కొట్టుకుపోతూ చేయిచాచి వీలయినంత మంది ఎక్కువని ఎలా లాక్కుపోను అన్న బెంగ కూడా! సాధ్యమా నాకు? అయ్యో! ఇది మంచి కళ అని నా హృదయందాకా తాకిన దీనిని, ఆ బరువును, ఆ దుఃఖాన్ని మీ హృదయందాకా ఎట్లా మోసుకురావడం? ఈశ్వరుడే అనుగ్రహించలేని మిమ్ములని అత్యంత మోర్టల్‌ని అయివుండి రాగరంజితమొనర్చడమెల్లాగు?

వారు చేసేది అంతా చేసేశారు, ఏం ఆశించక! వారి పని వారు చేశారు. ఎవరు చూస్తారా ఎవరు తలుస్తారా అని కాదు. ఏమో!ఎందుకు చేశారో తెలీదు! నాకేం తెలీదు. కానీ నేను ఈ పని చేస్తున్నాను. మీరు చదువుతారని కాదు. నేను వ్రాయకుండా ఉండలేక.

పులక్ బిశ్వాస్! విన్నారా ఈ పేరు ఎప్పుడయినా మీ జీవితంలో? అంత కాంచనాల జిలుగుదనం! అచ్చం వాన్ గో (Van Gogh) పొద్దుతిరుగుడు పూవు లాంటి ప్రకాశం! తగులుతుందా మీ బ్రతుకులో ఎప్పుడైనా? కనీసం అలా అనుకుంటున్నారా? పోనీ ఇక్కడ ఇప్పుడు కొద్దిగా కళ్ళు విప్పి బలవంతం మీదయినా ఒక్కసారి ఈ పులక్ బిశ్వాస్‌ని చూడండి. పిల్లల కోసం అన్నట్టు అక్కడే ఆగిపోయి అచ్చంగా పిల్లల బొమ్మలు వేసిన ఒక బాలల చిత్రకారుడి గురించి, ఆతని బొమ్మల గురించి ఒక ఘోష వినిపించుకోండి, మెర్సీ ప్లీజ్!

ఇక్కడ ఈ చిత్రం చూడండి రేఖా రంగా వేగమా? ఏం వుంది ఇందులో? మనసుకు ఏం పట్టింది మీకు ఈ బొమ్మలో? దేన్ని మీ కళ్ళు ఇక్కడ ప్రధానంగా క్యాచ్ చేస్తున్నాయ్? చెప్పడం కష్టం! మీరు చూడగలిగితే ఒక సంపూర్ణమైన అందం మాత్రమే ఈ బొమ్మలో వుంది. అందరు చిత్రకారులకు సాధ్యం కానిదిది. కేవలం పులక్ మాత్రమే చేయగలిగిన మ్యాజిక్ అది. అయినా ఒక్కసారి లేని ఓపిక తెచ్చుకుని మీ వద్దనున్న బొమ్మల పుస్తకాల్లోని బొమ్మలు తిరగెయ్యండి. రేఖ రంగు వేగం కూర్పు ఏవో ఒకటి మాత్రమే ప్రధానంగా వుంటాయ్! పులక్‌లా సంపూర్ణంగా గీయగలగడం అసాధ్యం. ఇది చూడాలంటే, దీన్ని మీరు తెలుసుకోవాలంటే ఈ దేశానికి, తల్లిదండ్రులకు, ఇంకా చిత్రకారులకు కూడా బొమ్మను చూసే ఒక శిక్షణ తప్పని ఒక అత్యవసరం.

ఇక్కడ ఈ రెండు బొమ్మల్లో ఏనుగులు, పిల్లలు, రంగులు, ఆనందం అంతా ఒకటే. కానీ ఏనుక్కీ ఏనుక్కీ ఎంత తేడా! పసివాడికీ పసిదానికీ ఎంత తేడా! నీటిరంగుల తడి కాగితానికి, పొడిరంగుల అద్దకానికి ఎంత తేడా! ఏమని చెప్తాం? ఇంత చిత్రకళని హృదయం నుంచి ఆరబోసిన ఈ మనిషి పిల్లల సాహిత్యానికి, వారి రంగుల ప్రపంచానికి తనను తాను ఎంత సమర్పించుకున్నాడో! ఏం ఎంతలా వదిలేసుకుని ఇంత సృష్టి జరిపాడో! ఎప్పటికి తెలిసేను? కళ్ళు మనకు ఎందుకున్నై? ఏం చూడ్డానికని? అసలు కన్నులున్నాయా అని కదా అసలు ప్రశ్న?

ఈ బొమ్మల్లో పులిని చూడండి, ఇంకో పులిని చూడండి. చూడ్డమే కాదు, ఇలా చూడకుండా మీ స్వంత బుర్రతో ఒక జీవిని ఊహించగలరా? ఊహించిన దాన్ని దాని లక్షణం చెడకుండా టేబుల్ సొరగులో నిక్కి నిక్కి చూస్తున్న కుంచె, కలం, చార్కోల్, వాష్, ఒపేక్ రంగుల్లో దేన్ని పట్టి ఆ పులిని బంధించగలరు మీరు? ఏం తమాషాలా సృజనాత్మకత అంటే? పాచినోటితో టీలు, కాఫీలు తాగే నోటితో బొమ్మ శైలుల గురించి, ఆ పనితనం గురించి బేరాలు ఆడుతారు మీరు మనుషులు. మీ తలలు దానిపై ఉన్న లేదా లేని బొచ్చుని గోక్కోడానికి తప్ప మరేం పనికిరాని మీ మురికి వేళ్ళతో రంగు జిలుగులు వెదజల్లే బొమ్మలు పూచే నిత్య వసంతాల్లాంటి మునివ్రేళ్ళు రచించిన బొమ్మల ఖరీదు కట్టడానికి నాలుక ఎంగిలి తడి మాత్రమే తెలిసిన వేళ్ళ మధ్య నోట్లు పెట్టుకుని మాట్లాడేది మీ భాష. కొద్దిగా ఆ కావరం నుంచి ఆ దుర్గంధం నుంచి జరిగి మీ మురికి హృదయానికి అంటిన మకిలి తొలగడానికి ఇదంతా తెలుసుకోండి.

పచ్చాని నిండు చంద్రుడుకి పోటీగా నేలపైకి దిగిన పచ్చాపచ్చాని ఈ పెద్దపులి వంటిపై చారికలు, ఆ లోయ, ఆ చెట్లు ఎట్లా దిగుతాయో తెలుస్తుందా ఏమైనా? ఉద్దరగా టీ బంకుల్లో, మంగలి షాపుల్లో చూసే దినపత్రిక చివరి రెండో పేజీలో ప్రచురితమయ్యే బిల్ వాటర్సన్ హాబ్స్ పులికీ, దాని బాబు వంటి పులక్ బిశ్వాస్ పులికీ, దాని హావభావాలకీ, దాని సైలెంట్ ఎక్స్‌ప్రెషన్‌లకి ఫరక్ తెలుస్తుందా జన్మలో మీకెప్పటికైనా? ఇక్కడే చూడు… ఈ పులక్ పులికి, ఇదే పులక్ మరో పులికి; ఈ పులక్ చెట్టుకి, ఇదే పులక్ మరో చెట్టుకి మధ్య భేదం! సామాన్యమా ఆ నల్లానల్లాని పచ్చికని, ఆ పై చెట్టుని, ఇర్రెగ్యులర్ నీటి అలల ఊయలని, ఆ పై తెల్లబారిన నెలవంకని గీయడం? గీయడం సాధ్యం కానప్పుడు ఆ బొమ్మ తాలూకు పనితనం, ఆ ఊహాశక్తికి అబ్బురపడ్డం మాత్రం సాధ్యం చేసుకోవచ్చు– మంచి బొమ్మలు చూడ్డం చెయ్యడం వల్ల, మంచి సంగీతం వినడం వల్ల, మంచి సాహిత్యం ఆస్వాదించడం వల్లా. ఆ చెయ్యడం మళ్ళీ మళ్ళీ చూస్తూనే వుండటం మంచి లక్షణం, హృదయంలో దీపం కనుక్కోడం. రిపిటేషన్ అనేది బోరింగ్ కానే కాదు. అది మీ జీవితాల్లో ఒక సౌందర్యకాంతి వెదజల్లుతుంది. అన్నా నమ్మండి నన్ను, అక్కా వినిపించుకోండి మీరూనూ. ఇంతకన్నా గొప్ప పనులు మీరు చేయవలసింది ఏమీ లేదని మీకు తెలిసేలోగా మీ ముగిసిపోక ముందే మేల్కొనవచ్చు, జీవితాల్లోని గుడ్డి లాంతరు వెలుగుల్లోకి పులక్ వెలిగించిన సంపూర్ణ నిండు చందమామని చూడవచ్చు! ఏం ఖర్చు కాదు కూడా!

ది ఫ్లూట్ పుస్తకానికి వేసిన బొమ్మలు చూడండి. ఇక్కడి అలలకు, ‘టైగర్ ఆన్ ఏ ట్రీ’ నీటి అలలకు ఉన్న తేడా చూశారా? ఆ మనుషుల నల్లటి శరీరాలు గమనించారా? ప్రాంతం ప్రాంతంకి మారే మన ఒంటి రంగు యొక్క అసలు రంగు ఏవిటో తెలిపే అసలు పని జరుగుతుందా చాలా బొమ్మల్లో? బయటికి వచ్చి మన ఇక్కడి సూర్యోదయానికీ, అనంతపురం ఎర్రాఎర్రని నల్లమన్నుపై కురిసే సూర్యోదయ కాంతికీ ఎంత తేడా వుందో తెలుసా? మహానంది అడవుల్లో అల్లుకున్న ఆకుపచ్చకి పాపికొండల మధ్యాని పచ్చనాకు ఫొలియెజ్ ఒకటి కాదనే విషయం తెలుసా? హిమాలయాలపై మెరిసే సూర్యుడి ఎండ, అదే సూర్యుడు గోదావరిఖని మనుషులపై చురుక్కుమనే వేడి-వి వేరు వేరు మిరుమిట్లు అనే విషయం తెలుసా? అది తెలుస్తే మీకు ఇదీ తెలుస్తుంది. ఇదంతా పూర్తి దేశీ చిత్రకళ అని, మన జాతీయత అని, బెంగాలీ మహత్తు అని కూడా. పులక్ లోపలా బయటా ఒక సంపూర్ణ్ కళాకార్. మన ఎదగనితనంపై జాలిపడి వాలిన ఒక చల్లని నీడ.

టేల్స్ ఫ్రమ్ ఇండియన్ క్లాసిక్స్ అని గుర్రాల మీదికెక్కి బళ్ళేలు పట్టిన మనుషుల బేలన్స్ చూడండి. ఒకసారి మన పత్రికల్లో కనబడే నిలబడ్డ మనుషుల బొమ్మల గరిమనాభి గమనించండి. భూమ్యాకర్షణకు స్కేలు బద్దలా నిలబడే మన కార్టూన్, ఇలస్ట్రేషన్, పెయింటింగ్ కళాకారుల బొమ్మలకు ఏనాడైనా పొంతన కుదురుతుందా? మనకు బొమ్మలు ఎప్పటికీ అందని ద్రాక్షపళ్ళేనని తరతరాలుగా నిరూపిస్తూ వస్తున్న మనల్ని చూసి మనం ఎందుకని గర్వపడాలి? మన ఆటా పాటా సినిమా సాహిత్యం మాటా తీరూ అంతా ఒకే మూస. ఎవరూ ఎవరికీ తగ్గం. ఇదే బొమ్మలో వెనుక అలుముకున్న బ్యాక్‌గ్రౌండ్ వర్ణ సమ్మిళితాన్ని గమనించారా? ఇదంతా చిన్నపిల్లల కోసం వేస్తున్న బొమ్మలయితే! ఇదంతా హైలీ స్టైలైజ్‌డ్ ఫామ్ అయితే! సంప్రదాయ చిత్రకళా శిఖరంపై వున్న నందలాల్ బోస్ బొమ్మల కాంతి చూడ్డానికి మన కళ్ళు చాలేనా?

హైద్రాబాద్ బుక్ ఫెయిర్ ముగిసింది. తొమ్మిదిన్నర లక్షలకు పైగా జనం స్టాళ్ళు సందర్శించారని ఒక సమాచారం. పులక్ బిశ్వాస్ బొమ్మల పుస్తకాలు అక్కడున్నాయి. నోరున్న నావంటివాడు కాక మరో తొమ్మిది మంది ఆ బొమ్మలు చూసి వుంటారని నా ఒక అంచనా. ఇట్టి వట్టి ఊహకే దుఃఖం గుండెను చుట్టేస్తుంది. మీ మీ కబోది బ్రతుకులపై జాలి వణుకులా కురుస్తుంది. కేవలం సంకల్ప బలంచేత మాత్రమే పుస్తకాలు మాయాతిరగలి నుండి బయటి వస్తాయి అనే గట్టినమ్మకం ఉన్న పబ్లిషర్లు లెక్కలు నొక్కుకోవడంలోనూ, సెల్ఫీలు దిగడంలోనూ, దుడ్లు బొత్తులుగా పెట్టుకోవడంలోనూ అంకితమయిపోయారు. సవాల్! అక్కడ వున్న ఏ ఒక్క పబ్లిషర్‌కి మికీ పటేల్ పేరు కానీ, మంజులా పద్మనాభన్ పేరు కానీ, శుద్ధసత్వ బసు, జగదీశ్ జోషీ పేరు గానీ తెలిసే, తెలుసుకునే జ్ఞానం వ్రాసిపెట్టబడలేదు. ఇదిగో ఇక్కడ 10 శాతం, మావద్ద 25 శాతం తగ్గింపు- అని కాదు పిలుపులు కావల్సింది. ‘అయ్యా! అమ్మా! మీ పిల్లల కోసం, వారి రసగుల్ల రాజ్యం కోసం, వారి మాయా ప్రపంచపు రంగుల నగరి నిర్మించిన మనుషులు మా దగ్గర వున్నారు. సత్యజిత్ రాయ్, ఏ.ఎస్ నాయర్, రావ్బలి, గోపులు, అమృతా పాటిల్‌ల కథలు, పుస్తకాలు, బొమ్మలు మీకోసం- కేవలం మీకోసం, మీ పిల్లల కోసం పట్టు వస్త్రాల్లో చుట్టి తెచ్చాం. ఊరికే చూడండి. మీ పిల్లలని చూడనివ్వండి. ఇది మన రేఖ ఐనది. మన రంగుగా ఉన్నది. రంగు బలపాల మణిమయ కాంతులు ఎన్నటికీ చెదిరిపోకుండా గట్టి ప్రేమ మమకారం మురిపం పూసి, ఆపై ఆరబెట్టి తెచ్చాం. ఊరికే చూడండి చాలు; కొననక్కరలేదు కూడా. దశాబ్దాల తరబడి ఆ స్రష్టలు పడ్డ శ్రమ, ఆ మునివేళ్ళు పూచిన పొగడ పూల సుగంధం ఇది. పన్నీటి కన్నీరు ఇది. అమరగాన సుధ ఇది. మీ చెవుల కొరకే పుట్టింది, మీ కండ్లల్లో కాంతి రగల్చడానికే పుట్టింది. రండి! రండి! ప్లీజ్! ఒకసారి రండి! చూసిపోండి! బాబూ అమ్మా మెర్సీ! మెర్సీ! మెర్సీ!


ఇది పులక్ బిశ్వాస్ గురించిన కథ:

1941లో ఢాకాలో పుట్టిన పులక్ బిశ్వాస్ మెట్రికులేషన్ అనంతరం కలకత్తాలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో చిత్రకళ అభ్యసించారు. చిత్రకళాశాలలో పెయింటింగ్ చదవవలసిన పులక్ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇలస్ట్రేషన్ వైపు మళ్ళారు. కలకత్తాలోని చిన్న పబ్లిషర్లకు పుస్తకాల కవర్లు, గ్రీటింగ్ కార్డులు వెయ్యడం మొదలుపెట్టారు. కాలేజీ చదువు అనంతరం యునెస్కో ఫెలోషిప్ పొంది ఇలస్ట్రేషన్ మరియు గ్రాఫిక్ డిజైన్‌లో శిక్షణ పొందారు. లండన్‌లోని హోమ్స్ కళాశాల, అమ్‌స్టర్‌డమ్‌లోని రీట్‌వెల్డ్ అకాడెమీలలో గ్రాఫిక్ డిజైన్ మరియు ఇలస్ట్రేషన్లలో శిక్షణ కూడా తీసుకున్నారు. 2002లో ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రిత్వశాఖ సహకారంతో లె బెల్ ఎత్రాఁజెర్‌ లిటరరీ ఫెస్టివల్‌కు హాజరవ్వడానికి ఆహ్వానించబడ్డాడు. జీవితంలో అత్యున్నత పీఠాల్ని, పురస్కారాల్ని, డబ్బుని అలా చూసి ఇలా వద్దనుకుని చిన్నారి పొన్నారి చంటి పిల్లలకోసమని వెనక్కి మళ్ళి, జీవితాంతం చిన్నపిల్లల కోసం బొమ్మలు వేసిన ఒక రంగు సుద్ద ముక్క వంటి మెత్తని చిత్రకారుడి కథ ఇది. పులక్ మన దేశంలోని మొదటితరం బాలసాహిత్య చిత్రకారుల్లో ఒకరు.

చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ స్థాపకుడు కేశవ శంకర్ పిళ్ళై దృష్టి పులక్‌పై వాలింది. పులక్ వ్యక్తిత్వం, అతని బొమ్మలు– రెండూ శంకర్ పిళ్ళైని ఆకర్షించాయి. ఆ క్షణం నుండి పులక్ చిల్డ్రన్ బుక్ ట్రస్ట్‌లో భాగమయ్యారు. సి.బి.టి.లో శంకర్ పులక్‌కు పూర్తి స్వాతంత్రం ఇచ్చారు. అది ఆయనలో ఎంత ధైర్యం నింపిందంటే అక్కడ తను గీసిన ప్రతీ గీత బొమ్మ అయ్యింది. తను ఎలా గీయలనుకునేవాడో అలానే గీసేవాడు. పుస్తకం పుస్తకానికి శైలి మార్చేసేవాడు. హద్దులు లేకుండా బొమ్మని అక్షరాలమధ్య అల్లిబిల్లిగా పరిగెత్తించేవాడు. పిల్లల కోసం వేసే బొమ్మలమధ్య ఒక పిల్లవాడిలా చక్రం టైరు తిప్పినట్లు తన బొమ్మల్ని యథేచ్ఛగా విహారం చేయించేవాడు.

బాల్యం తరువాత యవ్వనం పిమ్మటి జీవితంలో మళ్ళీ ఒక బాలకుడిగా మారిపోయి, ప్రేమగా కోరి కోరి తపమొనర్చి పసిపిల్లాడి ఆత్మని అనునిత్యం దాల్చిన ఈ చిత్రకారుడు పిల్లల కోసం బొమ్మలు గీసి గీసి అదే పసిపిల్లల రంగుబలపాలవలే తనని, వేళ్ళని కూడా అరగదీసుకుని కెంజాయ కార్నర్ నుంచి వస్తున్న ఆఖరి ప్రయాణం తాలూకూ బండిలో ఆగస్ట్ 29, 2013న ఢిల్లిలో సూర్యాస్తమయపు చివరి సంజెకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు.


బాల సాహిత్య చిత్రకళ గురించి కొన్ని అభిప్రాయాలు పులక్ మాటల్లోనే ఇట్లా చదువుకోవచ్చు:

“బొమ్మలు వేసేవారు ముందుగా ఏం చెయాలంటే మీరు బొమ్మలు ఎవరి కోసం వేస్తున్నారో అతి ముఖ్యంగా వారినే దృష్టిలో వుంచుకోవాలి. అది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు నా విషయానికి వస్తే నేను పిల్లల కోసం బొమ్మలు వేస్తున్నాను కదా! అటువంటప్పుడు నేను ఒక చంటి పిల్లాడిలా మారిపోయి వాడు గీసిన పద్దతిలోనే గీయాలి. కానీ అలా గీస్తానంటే పాపం పబ్లిషర్ గారు ఒప్పరు. అందువల్ల నేను ఏం చేస్తానంటే బొమ్మ పిల్లాడిని ఎలా ఆకర్షిస్తుందో కనీసం అలా గీయ ప్రయత్నిస్తా. ఆ రంగులు రేఖలు… నిజానికి చాలామంది పిల్లలు కథలు చదవరు. కేవలం బొమ్మలు చూసి తమ స్వంతంగా కథను వెతుక్కునే పని చేస్తారు. నేను వారి బుర్రల్లో అలా ఒక వెతుక్కునే పని పెట్టడానికి ప్రయత్నిస్తా. ఆ రంగుల మధ్య వారి ఊహాశక్తికి రెక్కలు కట్టేలా చూస్తా.

పిల్లలకు కావల్సింది ఉన్నది ఉన్నట్టు ఉన్న బొమ్మలు కాదు; వారితో బొమ్మలు పలకాలి ఆడాలి పాడాలి. వారి చేతి వ్రేళ్ళలో అవి ఒదిగి, వారి చేతి ఇంద్రజాలం నుండి ఆ బొమ్మలు ఇంకా ఇంకా బొమ్మల్లా బయటికి రావాలి. అటువంటి సులభ శైలి వారిని ఆకర్షించినంతగా మరేవీ ఆకర్షించవు. ఇది ఒప్పుకోవాలి మనం.

మీరు ఇంకా ఏం చెయ్యాలంటే ప్రతి పిల్లవాడి వయసుకు ఒక బొమ్మల భాష, ఒక అక్షరాల భాష అర్థమవుతుంది. మీరు వాడికోసం బొమ్మ వేయాలంటే వాడి వయసు చదివే భాషను అర్థం చేసుకుని ప్రతీసారి మీ బొమ్మల భాషను మార్చుకుంటూ పోవాలంతే.

-ఇక ఇలస్ట్రేషన్‌లోకి రావాలనుకునేవాళ్ళకి చెప్పేది: ఇలస్ట్రేషన్ అనేది చాలా పెద్ద పని. చిత్రకళాశాలలు నిన్ను ఒక పెయింటర్‌గా అతి సులభంగా మలుస్తాయి. తీర్చిదిద్దుతాయి. కానీ ఇలస్ట్రేటర్లను తయారుచేసే కార్ఖానాలు, కాలేజీలు ఇక్కడ ఉండవు. నిన్ను నీవు చాలా అంకితభావంతో ఆ దారిలో నడిపించుకోవాల్సివస్తుంది. ఆ యాతనలోకి మనఃపూర్వకంగా దిగాల్సివుంటుంది. ఇంతా చేసినా సమకాలీన చిత్రకళారంగం ఇలస్ట్రేటర్ని ఒక ఆర్టిస్ట్‌గా గుర్తించదు. రైల్వే కూలీ, నువ్వూ ఒకటే అన్నట్టు అర్థంచేసుకుని ఈ రంగంలోకి దిగాలి. ఈ విషయాన్ని త్వరగా అర్థంచేసుకున్న తెలివైనవాళ్ళు పెయింటర్లుగా విజయానికి అయిదో ఆరో మెట్లు ఎక్కుతారు కానీ ఇలస్ట్రేటర్లుగా మెట్లు దిగే సాహసం ఎవరూ చెయ్యరు. కాబట్టి అది తీసుకోవలసిన జాగ్రత్త.

తరువాత్తరువాత ఇలస్ట్రేటర్‌గా నీకున్న పేరునిబట్టి దానికి తగినట్టుగానే డబ్బు లభిస్తుంది- ఎక్కువ కానీ తక్కువ కానీ. కానీ ఇపుడు అంత ప్యాషన్‌తో బొమ్మలు వేయాలని వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజు జీవితం నీకున్న సమస్తం అంతటిని మిగేస్తుంది, బొమ్మల్ని కూడా. డబ్బు ఎక్కడ ఎక్కువగా వస్తుంటే అక్కడికే చిత్రకారుల మనసూ బుద్ది శరీరం లాగబడుతుంది. పనిచేసి పనిలో బ్రతికే జీవితమిప్పుడు లేదు. అలా అని ఇందులోకి వచ్చే కుర్రాళ్ళని నిరుత్సాహపరచాలనేది నా ఉద్దేశం కాదు. కానీ ఎంతకాలమని నిన్ను నీవు ఉత్సాహపరచుకుంటావ్? తరువాత నీకు ఏ దారీ ఉండదు. దారి లేని దారిలో చీకట్లో కొట్టుకుపొమ్మని ఏ బిడ్డనీ తండ్రి పంపడు అనేదే నా ఉద్దేశం.

ఇప్పుడు ఇక్కడ చూడండి… ఈ దేశంలో ఇలస్ట్రేటర్లకు వర్క్‌షాప్స్ ఉండవు. వారి పనికి ఫెలోషిప్‌లు కానీ గ్రాంట్లు కానీ ఏం రావు. ఆ సౌకర్యాన్నంతా పెయింటింగ్ ఆక్రమించేసుకుంది. కానీ విదేశాల్లో నీకు ఈ సదుపాయాలు అన్నీ వుంటాయి. అద్భుతమైన గురువులు ఉన్నారక్కడ, అవకాశాలూ ఉన్నాయి. ఒకవేళ చూపు సారించగలిగతే నువ్వు ఆ వేపు చూడాలి. కానీ, మన భారతీయాత్మని అక్కడికి పట్టుకపోయి ఏం గీస్తాం? ఏం ఆనందిస్తాం? మనం మనవారికి అవసరం లేదు. పరాయి చోట మనం మనకు దొరకం.

ఏది ఎలా వున్నా వీటన్నిటి మద్య ఒక చిత్రకారుడిగా నువ్వు కనీసం బ్రతకాలి కదా, ఒక బాలల రచయితా బ్రతకాలి కదా? పబ్లిషర్లు మాత్రమే ఎందుకు దర్జాగా బ్రతకగలుగుతున్నారు ఇక్కడ కాలు మీద కాలు వేసుకుని? ఈ రచయితలు, చిత్రకారులు ఎందుకని ఇంకా కాలి నడకన బ్రతుకుని లాగుతున్నారు? అనేదే అంతుపట్టని ప్రశ్న ఇప్పటికీ. దీనికి సమాధానం ఎవరు చెబుతారు అనేది కూడా ప్రశ్నే!”


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...