జమిలి పోగుల కథలు

జమిలి పోగు అంటే పెనవేసుకున్న రెండు దారాలు. రుబీనా పర్వీన్ రాసిన ఈ కథాసంకలనం లోని కథలు చదివితే, శీర్షికను ఎంచుకోవడంలోని ఆంతర్యం అర్థమవుతుంది. బలాలను బలహీనతలను కలిపి దాచుకున్న స్త్రీ హృదయాలు కావచ్చు; స్త్రీపురుషులు ఒకరినొకరు పూరించుకునే ఉద్దేశ్యంతో కలవడం కావచ్చు, మనుషుల్లోని ద్వంద్వాలు కావచ్చు. అలాంటి జమిలిపోగుకు రంగురంగుల పూలను దండగా కుచ్చి ఈ అందమైన కథా సంకలనంగా అందించింది రుబీనా. దీన్లోని పన్నెండుమంది స్త్రీలవి పన్నెండు విభిన్న నేపథ్యాలు. స్వచ్ఛమైన అడవి పువ్వుల్లా, కార్పొరేట్ జంగిల్‌లో వికసించిన గెలుపు పువ్వుల్లా – వీళ్ళలో ఒక్కొక్కరిదీ ఒక్కో రకం జీవితం. వీళ్ళందరినీ కలిపివుంచే అంతస్సూత్రాలు – వాళ్ళ జీవితాల్లో అనుభవించిన బాధ, ఆ బాధ నుండి బయటకు రావాలనే ఆలోచన, ఎంత కష్టమైన నిర్ణయాన్నైనా తీసుకునే తెగింపు, దానికి కట్టుబడి ఉండే నిబద్ధత.

ఏ స్థాయిలో మహిళలకు ఆ స్థాయిలో సమస్యలుంటాయని ముందుమాటలో చెప్పిన రచయిత్రి ఆ సమస్యలను కథల్లో కూలంకషంగా చర్చించింది. సమస్యలను చూపించి వదిలేయకుండా పరిష్కారం దిశగా కథలను నడిపించే నిజాయితీతో కూడిన ప్రయత్నం చేసింది. ఈ కథల్లోని ముగింపులన్నీ ఎంతో ఉత్తేజభరితంగా ఉన్నాయి, అదే సమయంలో సాధ్యాసాధ్యాల పట్ల నమ్మకం కలిగించేవిగానూ ఉన్నాయి. బాధ చివరి అంచుల వరకూ చూసి వచ్చాక కలిగే మార్పు నుండి ఎంత ధృఢమైన వ్యక్తిత్వాలు ఏర్పడుతాయో చూడటం ఆశాజనకంగా ఉంటుంది.

సమస్యకు పరిష్కారం ఎవరి సలహాల నుండి, ఏ కౌన్సిలింగ్ నుండీ పూర్తిగా దొరకదు. ఎవరికి వారే విముక్తులు కావాలి అంటుంది రుబీనా. ‘నీ సొంత కాంతిగా నువ్వు ఉండు’ అన్న గౌతమ బుద్దుని చివరి మాటలు గుర్తుకొచ్చాయి. మన సొంత అనుభవాలనుండి, ఆలోచనలనుండి మాత్రమే మనకు మనం పూర్తిగా దొరుకుతామనే ఎరుక మరోసారి కలిగింది.

కథల్లోకి వెళ్తే…

తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తనమీద నిందలు మోపే భర్త నుండి విముక్తి కావాలని “సొక్కంగ దమ్ము తీస్కునేటంద్కు నన్ను ఖులా చేయుండ్రి” అని అడిగిన జుబేదా కథ ‘ఖులా’. తలాక్ గురించి ఎంత తెలిసినా ఖులా అంటే ముస్లిం స్త్రీ కోరే విడాకులని వినడం ఇదే మొదటిసారి.

ఏ అమ్మాయికైనా తొలి హీరో తండ్రి. చిన్న వయసులో నాన్న నుండి ఆత్మవిశ్వాసాన్నీ స్ఫూర్తినీ పొందితే ఆ ప్రభావం భావి జీవితపు అన్ని దశల్లోనూ కనిపిస్తుంది. ‘అబ్బాజాన్’ కథలోని సాబిరాలో, ‘శోకప్రకటన’ కథలోని శక్తిలో ఇది గమనించవచ్చు. కూతురి జీవితం మీద అధికారం ఆమెకే ఇస్తూ, స్వేచ్ఛగా ఎదగనిచ్చే తండ్రుల అవసరాన్ని అందంగా చూపించింది రుబీనా. అమ్మాయి పుడితే శోకప్రకటన చేసే నీచమైన ఆచారం రాజస్థాన్‍ లోని కొన్ని ప్రాంతాల్లో ఉంది. అది సంతోష ప్రకటనగా మారే రోజు దగ్గర్లోనే ఉందనే నమ్మకాన్ని ఈ కథ ముగింపు ఇస్తుంది.

‘పి.ఎమ్.ఎస్.’ కథ ఆడవారు పీరియడ్స్‌కు ముందు అనుభవించే మానసిక, శారీరక అసౌకర్యాలను వివరించింది. ఇలాంటి సబ్జక్ట్‌ని కూడా ఆపకుండా చదివించగలిగే కథగా మలచడంలోను, ఆ సమయంలో ఏమవసరమో చెప్పటంలోనూ రచయిత్రి సఫలీకృతురాలు అయింది.

‘బుర్ఖా’ ఆర్ఎమ్‍పి డాక్టర్ మెహర్ తనమీద మతం రుద్దే ఆంక్షలను ఎలా తిప్పికొడుతుందో చెప్పిన కథ. ‘మక్సూదా’ భర్తపై టెర్రరిస్ట్ ముద్ర పడితే సమాజంలో భార్య పరిస్థితిని చూపించిన కథ. విధిలేని పరిస్థితుల్లో ఒక మగవాడికి లొంగిన వితంతువు, తన పిల్లల జోలికి వస్తే అతన్ని తన్నితగిలేసిన కథ ‘దేవ్లి’. స్త్రీల ఆర్థిక సాధికారత వల్ల వారి ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుందో ఈ మూడు కథల్లో స్పష్టంగా చూడొచ్చు.

‘వన్ పర్సన్ కంపెనీ’ జీవితంలో ఎదురైన సవాళ్ళను ఒక మహిళా ఆంట్రప్రెన్యూర్ ఎలా ఎదుర్కుందో చెప్పే కథ. ఇందులో వ్యక్తిగత జీవితాన్ని, వ్యాపార జీవితాన్నీ కలపకుండా ఎలా నడుపుకోవచ్చో, ఉద్వేగపరంగా ఎవరి మీదా ఆధారపడకుండా స్వేచ్ఛగా ఎలా ఎదగొచ్చో చక్కగా చెప్పి ఒప్పించింది రుబీనా.

‘వడగండ్ల వాన’ కథ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే పుకార్లు పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చెప్తుంది. భార్య చనిపోయి వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్న తండ్రికి పెళ్ళి చేసిన కూతురి కథ ‘తోడు’. జీవితం మీద సరైన అవగాహన లేకుండా, ఆధునికత పేరుతో అలవాట్లకు బానిసై అయోమయంలో పడే స్త్రీ కథ ‘రంగులకల’.

చివరగా ఈ పుస్తకంలో అన్నిటికంటే నాకు ఎక్కువ నచ్చిన కథ ‘స్కిజొఫ్రీనియా’. అంత క్లిష్టమైన విషయాన్ని చాలా సులభంగా అర్థం చేసుకునేలా రాసి, మంచి కథలా రుబీనా మలిచింది. రోగి భార్య పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఇలాంటి మానసిక వ్యాధులు ఉన్న వాళ్ళకంటే కూడా ఆ కుటుంబం పడే బాధ మరింత ఎక్కువ. ముఖ్యంగా భాగస్వామికి చుట్టూ ఉన్న వారి సహకారం చాలా అవసరం. శారీరక వ్యాధులకు ఉండే సహానుభూతి వీటికి ఉండదు. సరైన చికిత్స ఉందా అన్నది కూడా అనుమానమే. ఒత్తిడి పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక వ్యాధులూ పెరిగాయి. వీటి గురించి అవగాహన పెరగాలి. ఈ వ్యాధి తాలూకా స్పెక్ట్రమ్ చాలా పెద్దది. ఆ భర్త అలా ఎందుకు ఉన్నాడు? ఆ పాత్ర అలా ఎందుకు ప్రవర్తించింది? అనే ప్రశ్నలకు ఇలాటి కథల్లో పడికట్టు సమాధానం లాంటిదేమీ ఉండదు. భార్య అతనితోనే ఎందుకు ఉంది, ఎందుకు వదిలి వెళ్ళలేదు అనే ప్రశ్నలకు కూడా కథకురాలు పూని జవాబు ఇవ్వదలచినట్టు ఎక్కడా కనడదు. కథలో ఆమె వివేకవంతురాలు, ఉద్యోగస్తురాలు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించుకోగల సమర్థురాలు. భర్త దగ్గర హింసను తట్టుకోలేని బేల కూడా. అయినా ఆమె అతన్నుండి విడిపోదు. ఎక్కడా వాచ్యంగా ఉపన్యాసాలు ఇవ్వకుండా, బంధాల్లో ఉండవలసిన నీతి, కట్టుబాట్ల వంటి పెద్ద మాటల జోలికి కూడా వెళ్ళకుండా, అతనితోనే ఉండేందుకు ఆమెకున్న ఒకే కారణం – అతని దగ్గర ఆమె ఎప్పుడో అనుభవించిన ప్రేమ అని అతి రహస్యంగా కథలో చెబుతుంది రచయిత్రి. అలాంటి కథనం, అలా పాఠకులే జవాబు వెదుక్కునేలా చేయగల ఒడుపు, ఈ కథను చిత్రంగా బలోపేతం చేస్తాయి. ‘ఎందుకిలా చేసింది’ అనే ప్రశ్న నుండి, ‘ఇంతే కదా జీవితం’ అని నిట్టూర్చేలా చేసి వదిలేసిన కథ ఇది.

సమాజంలో ఎదురుపడే ఎన్నో చిత్రమైన సమస్యల్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించి రాసిన కథలివి. రచయిత్రికి భాష మీద మంచి పట్టు ఉంది. కార్పొరేట్ భాషను ఎలా రాయగలిగిందో ఖమ్మం జిల్లా పల్లెల హిందూ, ముస్లిమ్‍ల మాండలికాలను అంతే అందంగా పలికించింది. టౌన్ భాషను, సింగరేణి మైన్స్‌లో మాట్లాడే యాసను ఏ కథకు తగ్గట్టుగా దానికి అలవోకగా వాడుకుంది. దీనివల్ల కథలు సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. అయితే, ఇంత వైవిధ్యమైన కథాంశాలు ఉన్నప్పటికీ లోటు అక్కడక్కడా కనపడుతూనే ఉంది. పాత్రల భావోద్వేగాలతో పాఠకులు కనెక్ట్ అయే లోపే కథ ముందుకు సాగుతుంది. పాత్రలు అర్థమవుతాయి కానీ మనసుకు హత్తుకుపోవు. కొన్ని కథల్లో సంఘటనలను అంత నేరుగా కాకుండా మరింత కుతూహలం రేకెత్తించేలా రాసి ఉంటే బాగుండేది. రచయిత్రి ఈ కథల్లో సహజంగా దొర్లిన నాటకీయతను, ఇంకో మెట్టు పైకెక్కించే అవకాశాన్ని కావాలనే వదులుకుని ఉంటుంది అని చాలాసార్లు పాఠకులకు అనిపిస్తుంది. అది కొన్ని కథల్లో మంచి ప్రభావమే చూపించింది. కొన్ని మాత్రం ఆ అడుగు వెనుక ఉండిపోయి, ఇంకాస్త మంచి కథలు కావచ్చునన్న అభిప్రాయాన్ని మిగిల్చాయి.


జమిలి పోగు – రుబీనా పర్వీన్
సైరా ప్రచురణలు, 2024.
పే. 123. వెల: Rs.145
ప్రతులకు: అమెజాన్, అన్ని ప్రముఖ పుస్తకదుకాణాలు.