ఉద్యోగంలో నుంచి నన్ను తొలగించే అవకాశం మా పత్రిక యజమానికి కాని, ఆయన ఆస్థాన జ్యోతిష్యుడికి కానీ ఇవ్వకుండా వారిరువురిని ఆశ్చర్యపరుస్తూ నేనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. నా రాజీనామా వెనుక పత్రికలో అటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. అప్పటి ఒక ప్రముఖ రాజకీయ పార్టీతో మా పత్రిక యజమాని కుమ్మక్కయ్యాడని, ఆ పార్టీకి తన పత్రిక ద్వారా చేయగలిగిన ఏ రకమైన మద్దతుకైనా సిద్దమయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నాడని, అందుకు ప్రతిఫలంగా పార్టీ ఆయన ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తగిన ఆర్థిక సహాయం చేయడానికి ఒప్పుకుందనే గుసగుసలు మొదలయ్యాయి. ఈ దిగజారుడు వ్యవహారాన్ని భరించలేక మా ఎడిటర్ కూడా పత్రిక నుండి రాజీనామా చేసి వెళ్ళిపోవడంతో పత్రికని నడిపించే బాధ్యత యజమానే స్వయంగా చేపట్టాడు. ఆయన సంపాదకీయ బాధ్యతలు వహించిన వెంటనే పత్రికలో వచ్చిన మార్పులు స్పష్టమయ్యాయి. కొద్దిరోజుల క్రితం వరకు ఈ పత్రిక ఏ పార్టీ పనితీరుపై, దాని అవినీతి వ్యవహారాలపై అయితే మహానిర్దాక్షిణ్యంగా దాడి చేసి నిప్పులు చిమ్మిందో ఇప్పుడు అదే పార్టీపై సంపాదకీయ పేజీలో ఏమాత్రం సిగ్గులేకుండా ప్రశంసల వర్షం కురిపించింది. అంతే కాదు, ప్రతిరోజూ ఆ పార్టీకి సంబంధించిన వార్త ఎంత చిన్నదయినా సరే, పార్టీ నాయకుల పెద్ద పెద్ద బొమ్మలు వేసి పత్రికలో ప్రముఖంగా ప్రచురించడం, పొగడ్తలు రాయడం తప్పనిసరి చేశారు.
ఊరందరిది ఒక దారయితే లక్ష్మణ్ చేతనున్న కుంచెది ఇంకొక దారని – మా యజమాని పత్రికలో ఆ పార్టీవారికి అనుకూలంగా ఎన్ని బాజాలైనా ఊదనీ – నేను మాత్రం నా బొమ్మలలో, కార్టూన్లలో ఆ పార్టీ వ్యవహారాలను తూర్పారపట్టేవాణ్ణి. కార్టూన్లలో ఆ రాజకీయ నాయకుల మీద, వారి బుర్రతక్కువ అనుచరుల మొహం మీద నా నల్లసిరా గీతలతో ఎగతాళి మచ్చలను పూయటం మాత్రం ఆపలేదు. సహజంగానే మా సంపాదకుడికి తన పత్రిక పాలసీకి విరుద్దంగా నడుస్తున్న నా బొమ్మల పోకడ రుచించలేదు. ఒకవైపు రాతల్లో పొగడ్తలు-గీతల్లో తెగడ్తలున్న ఈ వైరుధ్యం అతగాడిని బాగా ఇబ్బందిపెట్టింది. ఆయన ఒకరోజు నన్ను తన కార్యాలయపు గదికి పిలిపించాడు. పత్రిక పాలసీ ఏదయితే ఉందో దానిని అనుగుణంగా నా కార్టూన్లను సరిదిద్దుకోమని ఆదేశించాడు. యజమాని చెప్పాడు కదాని తల ఊపుతూ, సరే అలాగే అనేటువంటి ప్రతిస్పందన, వినయ విధేయతలు నా మాటల్లో కాని, ధోరణిలో కానీ అతనికి కనపడలేదు. కనీసం అది చూసైనా నీవంటివాడు నాకు అక్కరలేదు అని అతను నన్ను ఉద్యోగం నుండి గెంటేస్తాడని నేను ఊహించాను. కానీ అతను అలా చేయలేదు. మా ఇరువురికి, పత్రికకు ఇబ్బంది కలగకుండా నన్ను రాజకీయ కార్టూన్‌లు గీయడం మానేసి అందుకు ప్రత్యామ్నాయంగా పత్రికలో వచ్చే కథలకు, చిన్నాచితక కబుర్లకు స్కెచ్‌లను వేసుకోమని, ఆ విధంగా పత్రికకు నా సేవలను మరొక విధంగా వాడుకుందామని అనుకుంటున్నానని, నాకొక అవకాశం ఇచ్చే విధంగా మాట్లాడాడు.
అతను చెప్పినదంతా విని, కనీసం అతని వైపు తలెత్తి కూడా చూడకుండా ఆ గది నుండి బయటకు వచ్చి నేను తిన్నగా అతని వ్యక్తిగత సహాయకుడి వద్దకు వెళ్ళి నా రాజీనామాను రెండు వాక్యాల్లో టైప్ చేయమని అడిగి, అనంతరం దానిని లోపలికి పంపాను. అది చూసి మా యజమాని తన స్వహస్తాలతో ఒక ఉద్యోగికి ఉద్వాసన చెప్పే అవకాశం పోయినందుకు తెగ విచారించి, తనకు తానై తన పత్రిక నుండి ఒక మనిషి అలా వెళ్ళిపోగలిగే స్వతంత్రాన్ని భరించలేక, మళ్ళీ నా కోసం కబురు పంపి బోలెడంత భవిష్యత్తు ఉన్న నేను అంత మొండిగా, మూర్ఖంగా ఉండకూడదని, కాబట్టి నా రాజీనామాను వెనక్కి తీసుకోమని నచ్చచెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాడు. చివరకు నేను తీసుకున్న నిర్ణయం నుండి తప్పుకోవడానికి ఏమాత్రం సుముఖంగా లేనని గ్రహించిన అతను నా బకాయిలను లెక్కాడొక్కా చూసి నాకు రావలసినది ఇచ్చేసి నన్ను పంపించివేయవలసిందిగా పత్రికానిర్వహణ శాఖవారికి తాఖీదు రాశాడు. నెలాఖరుకు ఇంకా మూడు రోజులు బాకీ ఉన్నాయి. నేను నా జీతం దాదాపు నూటముప్పైనాలుగు రూపాయలు ఫ్రీ ప్రెస్ జర్నల్ నుంచి వసూలు చేసుకుని బయటికి అడుగుపెట్టాను. ఆ రోజు బొంబాయిలో టాక్సీ స్ట్రైక్ ఉంది. నేను దర్జాగా విక్టోరియా ఎక్కి నేరుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కార్యాలయానికి వెళ్ళాను. ఆ వెళ్ళడం వెళ్ళడం అంతే! ఆ తరువాత నేను ఒక అర్ధశతాబ్దానికి పైగా ఉద్యోగం కోసమని ఏ ఇతర కార్యాలయానికీ వెళ్ళవలసిన అగత్యం ఏర్పడలేదు.
నిజానికి టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీసులో నాకు ఎవరూ తెలియదు. కానీ నేను సరాసరి లోపలికి వెళ్ళి రిసెప్షన్‌లో నిలబడి ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్ళాలని అడిగాను. టైమ్స్ పత్రిక వాతావరణానికి, ఫ్రీ ప్రెస్ జర్నల్ కార్యాలయానికి చాలా తేడా ఉంది. అదంతా నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ పనిచేస్తున్న చాలామంది ఆంగ్లేయ సిబ్బందే. అక్కడ ప్రతి ఒక్కరూ మర్యాదగా, నవ్వుతూ కనిపించారు. సిబ్బంది అంతా చాలా పరిశుభ్రంగా ఉన్నారు. చక్కని వస్త్రధారణ, ఒకరికొకరు ఎదురు పడ్డపుడల్లా చాలా పద్ధతిగా, మర్యాదగా హలో, మార్నింగ్, థ్యాంక్స్ అని మర్యాదపూర్వకంగా పలకరించుకుంటున్నారు. టైపురైటర్ల చప్పుడు తప్ప మనుషుల గలగల గోల అంటూ ఏమీ లేదు. ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్‌కు దారి అడిగిన నన్ను వేచి ఉండటానికి వెయిటింగ్ రూమ్‌లోకి దారి చూపించారు. ఆ గది గోడలపై కొన్ని బంగారు ఫ్రేములతో కూడిన తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి షాజహాన్ చివరి ఘడియల బొమ్మ. తన మరణాసన్నసమయంలో అతను తాజ్ మహల్ వంక చూస్తూ ప్రాణాలు విడుస్తున్న దృశ్యం అది. ఈ చిత్రాన్ని వేసింది బాగ్తాపోలస్ అనే గ్రీకు చిత్రకారుడు అని నాకు గుర్తుంది. నేను మంత్రముగ్దుడిలా ఆ బొమ్మకేసే చూస్తూ ఉన్నాను. అంతలో వెనుకనుండి ఒక గొంతు వినపడింది. ‘మిస్టర్ లక్ష్మణ్? మీరు కార్టూనిస్టులా? అయితే మీరు వెళ్ళవలసినది ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కి, ఎడిటోరియల్‌కి కాదు” అంటున్న ఒక అటెండర్ నా వెనుక నిలబడి ఉన్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో అడుగుపెట్టినపుడే రిసెప్షన్‌లో ఒక కాగితంపై నా వివరాలు రాసి ఇచ్చాను. పేరు: లక్ష్మణ్, వృత్తి: కార్టూనిస్ట్.
అందుకని నేను ఎడిటోరియల్‌కి కాకుండా పత్రిక ఆర్ట్ డైరెక్టర్ దగ్గరకు తీసుకెళ్ళబడ్డాను. ఈ వ్యక్తి హిట్లర్ నుండి, వియన్నా నుండి ఒక దశాబ్దం క్రితం పారిపోయి వచ్చి బొంబాయిలో అడుగుపెట్టాడు. బ్రిటిష్‌వారి ప్రాపకం సంపాదించి టైమ్స్‌లో ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో డైరెక్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు. అతను పొడుగ్గా భారీగా ఉన్నాడు. కొట్టొచ్చినట్లు కనపడే పెద్ద ఆకారం. చురుకైన నీలికళ్ళు. చక్కని రూపు, రంగు, గంభీరమైన గొంతుక. ఫ్రీ ప్రెస్ జర్నల్ కోసం నేను గీసిన కార్టూన్ల గురించి ఆయనకు బాగా తెలుసు. అయినా అతను నాకు ఒక కాగితం, పెన్సిల్, బ్రష్, ఇంక్ ఇచ్చి, అక్కడ టేబుల్ వద్ద కూర్చున్న ఒక వ్యక్తి బొమ్మని గీయమని పరీక్ష పెట్టి నన్ను ఆ గదిలో వదిలి తను బయటికి వెళ్ళిపోయాడు. నేను ఆ గదికి ఉన్న పెద్ద అద్దపు గోడ ఆవలినుండి టైమ్స్ పత్రిక విశాలమైన ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌నంతా చూడగలిగాను. ఇలస్ట్రేటెడ్ వీక్లీకి కథలు, పిల్లల పత్రిక కోసం కామిక్ స్ట్రిప్స్ చిత్రీకరించడంలో దాదాపు ఇరవైమంది కళాకారులు నిమగ్నమై ఉన్నారు. అంతే కాదు జూనియర్ చిత్రకారులు పత్రికలో వచ్చే ప్రకటనల కోసం, పత్రిక మేకప్‌కు అవసరమైన ఫోటోల లేఅవుట్‌లు, ఫోటోగ్రాఫ్‌ల టచప్‌ల పనులు చేయడం కనపడుతూ ఉంది.
పావుగంట తర్వాత ఆర్ట్ డైరెక్టర్ తిరిగి వచ్చాడు. నేను అప్పటికే తను అప్పగించిన డ్రాయింగ్ పని పూర్తిచేశాను. ఆ బొమ్మను చూడగానే నా నిపుణత గురించి అతనికి కలిగిన ఆనందం అతని మొహంలో స్పష్టంగా కనపడింది. వెంటనే అతను నన్ను ఉద్యోగంలో చేర్చుకోవాలని తహతహలాడాడు. కానీ టైమ్స్ పత్రికకు రాజకీయ కార్టూనిస్ట్‌గా నన్ను నియమించే అధికారం తనకు లేదని, అది పత్రిక ఎడిటర్‌కి సంబంధించిన విషయమని, కానీ నేను అంగీకరిస్తే అతను నన్ను ఇప్పటికిప్పుడే ఇలస్ట్రేటెడ్ వీక్లీలో కామిక్ స్ట్రిప్స్, ఇంకా ఇతర ఇలస్ట్రేషన్‌లను గీయడానికి నన్ను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు. అంతా బావుంది, కానీ నాకు అక్కడ రాజకీయ కార్టూనిస్ట్‌గా అవకాశం మాత్రం లేదు. నాకు రాజకీయ కార్టూనిస్ట్‌గా తప్ప వేరే పని చెయాలని కలా కోరికా రెండూ లేవు! నా జీవితంలో మరోసారి – నేను ఏం చేయాలనుకుంటున్నానో, కానీ నాకు ఏం చేయడానికి ఇటువంటి అవకాశాలు లభిస్తున్నాయో అని మనసులోనే వాపోయాను. కానీ వచ్చిన అవకాశాన్ని తిరస్కరించే స్తోమత ప్రస్తుత పరిస్థితుల్లో నాకు లేదు. కాబట్టి విధిలేక వచ్చిన అవకాశాన్ని గౌరవించి అందిపుచ్చుకోవడమే మంచిదని – అన్నీ అనుకున్నట్టుగా కుదిరే ఒక రోజు వస్తుంది, ఆ రోజున నేను కలలు కంటున్న కార్టూనిస్ట్ ఉద్యోగం కూడా సాధించుకుంటానులెమ్మని నా మనసుకు నేనే సర్ది చెప్పుకుని – టైమ్స్‌లో చేరిపోవడానికి ఒప్పుకున్నాను. నేను అతని ప్రతిపాదనను అంగీకరించినందుకు ఆర్ట్ డైరెక్టర్ చాలా సంతోషించాడు. నేను ఇంతకు ముందు చేసిన ఉద్యోగంలో ‘మీ జీతం ఎంత? ప్రస్తుతం మీరు ఆశిస్తున్న జీతం ఏమిటి?’ అని ఆయన అడిగాడు. ‘ప్రీ ప్రెస్ జర్నల్‌లో నా జీతం రూ. 250, ప్రస్తుతం మీ వద్దనుండి రూ. 350 వస్తే మంచిది అనుకుంటున్నా’ అని బదులిచ్చాను. అతను నాకేసి అదోలా చూస్తూ గది నుండి వెళ్ళిపోయాడు. కాసేపటి తరువాత ఒక కాగితంతో తిరిగి వచ్చిన అతను దానిని నా ముందు ఉంచాడు. అది నా అపాయింట్‌మెంట్ లెటర్. అందులో నా జీతం రూ. 500 అని ఉంది.
ఇక టైమ్స్ ఆఫ్ ఇండియాలో నా ప్రయాణం మొదలయ్యింది. ఆ రోజుల్లో వీక్లీలో అగాథా క్రిస్టీ రాసిన కథ ఒకటి ధారావాహికగా ప్రచురితమవుతోంది. దానికి బొమ్మలు వేసే పని నాకు అప్పగించబడింది. అలాగే టైమ్స్ వారి పిల్లల పత్రిక కోసం ‘గుత్తా-పర్చా’ అనే ఒక కామిక్ స్ట్రిప్‌ని వేయడం మొదలుపెట్టాను. ఇది ఒక చిన్న పిల్లవాడు, ఒక పిల్ల ఏనుగు కథ. వారం వారం వారి సాహసాలను బొమ్మల కథల రూపంలో నేను చెప్పేవాడిని.
మొత్తం మీద తోటి కళాకారులతో టైమ్స్ పత్రికలో వాతావరణం చాలా హాయిగా ఉండేది. అక్కడ బొమ్మల పనిని నేను చాలా ఇష్టపడి చేసినప్పటికీ నా హృదయం మాత్రం ఎప్పుడూ రాజకీయ కార్టూన్లపైనే ఉండేది. ఎంత పని చేసినా, ఎన్ని రకాల బొమ్మలు చిత్రిస్తున్నా అప్పుడు చేస్తున్నదంతా తాత్కాలికం అనే భావన నుండి బయటపడేవాడిని కాను.
చేసిన పనులే చేస్తూ, వేసిన బొమ్మలే మళ్ళీ మళ్ళీ వేస్తూ వుండటం చేత పుట్టే ఒకరకమైన విసుగు మాలో ఉన్న కళను చంపకుండా ఉండటానికి, మా పనిలో ఎదుగుదల కోసం, మా నైపుణ్యాలను మెరుగుపడేలా ఉండటానికి మా టైమ్స్ పత్రిక ఆర్ట్ డైరెక్టర్ చాలా శ్రద్ద తీసుకునేవాడు. దానిలో భాగంగానే మా పత్రిక కార్యాలయానికి పొరుగునే ఉన్న సర్ జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో అక్కడి విద్యార్థులు తమ సాధనలో భాగంగా చేసే లైఫ్ స్కెచ్‌లో ఉండే మోడల్స్‌నే మాకూ వారానికి ఒకసారి మోడల్స్‌గా వచ్చి ఉండేలా ఏర్పాటు చేశాడు. ఈ రకమైన మోడళ్ళు ఏ చిత్రకళా విశ్వవిద్యాలయాల్లో అయినా ఒకే మచ్చు ఒకే మాదిరి ఉండే రకాలు. గడ్డం ఉన్న సాధువు, తలపాగాతో ఉన్న వృద్ధుడు, తన నడుంపై కుండ పెట్టుకొని నిలబడి ఉండే అమ్మాయిల వంటివారు వీరు. మా స్కెచింగ్ కోసం మేము కోరిన విధంగా మా అవసరాలకు అనుగుణంగా ఈ మోడల్స్ స్టూల్‌పై కూర్చొని లేదా నిలబడి ఉంటారు. వారి చుట్టూ రకరకాల కోణాల్లో మేము తిరుగుతూ వారి బొమ్మలను వేసుకునేవాళ్ళం.
ఒక రోజు ఒక కొత్త మోడల్ మా సాధన నిమిత్తం వచ్చినప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ తన గది నుండి బయటికి వచ్చి, ఆ ఆమ్మాయి వంక చూస్తూ తల పంకించగానే వచ్చిన ఆ అమ్మాయి ప్రశాంతంగా తన బట్టలన్నీ విప్పి, శరీరంపై నూలుపోగు కూడా లేకుండా ఒక కళాత్మక భంగిమలో మాకు నమూనాగా ఉండిన అంగవైఖరి చూసి నేను ఆశ్చర్యపోయాను. మానవ శరీరధర్మ శాస్త్రాన్ని గట్టిగా అధ్యయనం చేయడానికి న్యూడ్ మోడల్‌ని చూసి బొమ్మలు నేర్చుకోవడమనేది గొప్ప శిక్షణ, గట్టి పునాది.
కొత్త కార్యాలయం, కొత్త ఉద్యోగం – ఇలా గడుస్తూ ఉంది. ఒక రోజు మా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గదిలోకి నిగనిగా మెరిసిపోతున్న ఒక బల్లని తెచ్చి పెట్టారు. మా డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి నన్ను ఆ బల్ల దగ్గరకు తీసుకు వెళ్ళి అక్కడ ఒక కుర్చీ వేసి నన్ను అందులో కూర్చుండబెట్టి గట్టిగా నాతో కరచాలనం చేసి ‘ఇది నీదే’ అన్నాడు. అది చాలా ప్రత్యేకంగా తయారుచేయబడ్డ బొమ్మల బల్ల. దాని మీద బొమ్మలు వేసుకోవడానికి చాలా అనువుగా, ఏ కోణంలో అయినా వాలుగా ఉండేలా ఏర్పాటు చేయబడి ఉన్నది. కాగితాలు పెట్టుకోవడానికి. బొమ్మల సామాను ఉంచుకోడానికి అవసరమైనన్ని సొరుగులతో ఒక ఆర్టిస్ట్ కోసం ఎంతో అనువైన పద్దతిలో తయారు చేయబడినదది. దాన్ని చూసి నేనెంతో ముగ్ధుడిని అయిపోయాను. తరువాతి కాలంలో అంతకన్నా సౌకర్యవంతమైనది, కొత్తది, పెద్దది అయిన మరొక బల్లని నేను ఉపయోగించడానికి మా కార్యాలయంవారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, నేను అంగీకరించక అక్కడ ఉన్నంత కాలం దాని మీదే బొమ్మలు వేశాను.
కొత్త ఉద్యోగపు అత్యుత్సాహం, మహానగరపు మంత్రముగ్ద వాతావరణం నాకు హాయిహాయిగా జోరుజోరుగా హుషారుగా ఉంది. క్రమక్రమంగా బొంబాయి మహానగరంతో పరిచయం గట్టిపడింది. కొత్త పరిచయాలు, క్రొంగొత్త స్నేహాలు పెరిగాయి. రోజులు సరదాగా గడుస్తూ ఉన్నాయి. అంతా బావుంది, ఒక్క బావోనిదల్లా నా వసతి.
నేను ఇంతకాలం ఇక్కడ పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ వస్తున్నాను. నేను ఉంటున్న అపార్ట్‌మెంట్ లోని ఫ్లాట్ ఒక ప్రభుత్వ అధికారికి చెందింది. అతను తన కుటుంబాన్ని స్వగ్రామంలోనే ఉంచి తను మాత్రం ఈ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. తన ఫ్లాట్ చాలా పెద్దది అందుకని అతనికి తోడుగా నాకు ఇక్కడ పేయింగ్ గెస్ట్‌గా ఉండే అవకాశం దొరికింది. అలా అని అతను ఎప్పుడూ ఫ్లాట్‌లో ఉండే మనిషి కాదు. తన పని బాధ్యతల మూలంగా అతను నిరంతరం ఆ ఊరు ఈ ఊరు అని పర్యటనలలోనే ఉండేవాడు. నే ఒక్కడిని ఏమీ తోచకుండా ఇంత పెద్ద నివాసంలో ఒంటరిగా ఉండటం నాకూ సుతరామూ ఇష్టం లేదు. ఏది ఏమైనా కానీ నేను అక్కడి నుండి మకాం మారుదామని నిశ్చయించుకున్నాను. ముఖ్యంగా ఏదైనా హోటల్‌లో చేరిపోదామని ఆలోచన. ఆ అన్వేషణలో భాగంగా హోటల్ మిరాబెల్ నాకు బాగా నచ్చింది. నగర ప్రధాన వీధి కూడలిలో సజీవంగా, గడియారం ముళ్ళతో పోటీ పడుతూ సందడిగా ఉండే హోటల్ ఇది. పాక కళకు పెట్టింది పేరైన ఉడిపి నుండి వచ్చినవారు ఈ హోటల్‌ని నడుపుతున్నారు.
హోటల్ ఆవరణ అనునిత్యం వచ్చి పోయే మనుషులతో, వారి వివిధ వేషభాషలతో, ఒకరికి మరొకరికి పొంతన లేని తీరుతెన్నులతో, ఔచిత్యానౌచిత్య మనస్తత్వాలతో, నాటకరంగంపై నిండి ఉండే వివిధ నటధారుల మాదిరి గమనించడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. బొమ్మలేసేవారు ముఖ్యంగా కార్టూన్ రంగంలో ఉన్న వారికెవరికయినా కిటకిటలాడుతూ సందడి చేసే ఇటువంటి హోటల్ ప్రదేశం మంచి మోడల్ హౌస్ వంటిది, గొప్ప లైఫ్ స్కెచింగ్ విద్యాలయం వంటిది. మీరాబెల్ హోటల్ తన గదులను అక్కడ కాపురం ఉండేవారికే కాకుండా కొన్ని చిన్న కార్యాలయాలకు కూడా అద్దెకు ఇచ్చింది. హోటల్ రెండవ అంతస్తులో సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మిపెట్టే ‘బయర్ మీట్స్ సెల్లర్’ ఆఫీసు ఉంది; దాని పొరుగునే ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంది, ఆ ప్రక్కన ఒక జ్యోతిష్కుడు కాలాన్ని, నక్షత్రాలను, జాతకాలను, మనుషుల అదృష్ట దురదృష్టాలను గణించడమే కాకుండా ఏవో రకరకాల వేర్లు, మూలికలు, ఔషధాలను, పొడులను కూడా అమ్మేవాడు.
హోటల్‌లోని మిగతా గదులను వివిధ కార్యాలయాలలో, వ్యాపార సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, నిరంతరం ప్రయాణాలు చేసే సేల్స్ రిప్రజెంటేటివ్‌లు ఆక్రమించుకున్నారు, ఒక రోజు తమ సొంత వసతి దొరుకుతుందనే ఆశతో తాత్కాలికంగా వారు ఇక్కడ గదులను అద్దెకు తీసుకున్నారు. కానీ బొంబాయిలో గృహాల కొరత చాలా తీవ్రం కావడంతో, క్రమంగా వారిలో చాలామంది ఆ హోటల్ గదులకు శాశ్వత కిరాయిదారులుగా మారారు.
ఆ హోటల్‌లో నేనుంటున్న గది చాలా పెద్దది, బాగా సౌకర్యంగా కూడా ఉంటుంది. అక్కడ కూడా నా స్నేహితుల పరిధి బాగా పెరగడం మొదలైంది. ఆ హోటల్ మేనేజర్, ఇతర గదుల్లో నాలా కాపురం ఉండేవాళ్ళు, వివిధ కార్యాలయాల్లో పనిచేస్తూ అక్కడ ఉన్నవాళ్ళు అంతా నాకు బాగా పరిచయస్తులయ్యారు. వాళ్ళంతా నాతో కబుర్లాడటానికి తరుచూ వచ్చేవారు. హోటల్ యజమానితో కూడా నాకు మంచి దోస్తీ కలిసింది. మిరాబెల్‌లో నేను గడిపిన సమయం, అక్కడ కలిగిన వివిధ అనుభవాలు ఆధారంగానే ‘ది హోటల్ రివేరా’ అని ఒక నవల కూడా నేను రాశాను.
(సశేషం)