అప్పుడే సూర్యుడు తగిలి, నవ్విన పగటి మొక్క జ్ఞాపకం ఉందా నీకు? అలా ఉండి ఉంటావు నువ్వెపుడో.
ఇంత విచారంతో
ఇంత వాడిపోయాక
వింటావు ఇప్పుడు నువ్వు
ఇక మొదలుపెడతాను మరి.
భూమి అని ఒకటి ఉంది. గుండ్రంగా ఉంటుంది. గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎందుకో తెల్సా? మనుషులుంటారక్కడ. వాళ్ళకి పేర్లుంటాయి. వాటితో ఒకరినొకరు ప్రేమగా పిల్చుకోవచ్చు. ప్రేమించుకోవచ్చు. కోపమొస్తే ఎవరో ఒకర్ని దొంగ నా కొడకా అని తిట్టొచ్చు.
సరే, బోర్ కొట్టించను. నాకూ తెల్సు. పద్యం కాస్త క్రిస్పీగా ఉండాలి. కనీసం కూరగాయల కత్తంత పదునుగా ఉండాలి.
ఒకడెవడో వస్తాడు. గూబ మీద ఒక్కటిచ్చి, నీ పళ్ళన్నీ రాలగొడతాడు. గత వారం కలిసి కూర్చున్న మందు సిట్టింగ్ జ్ఞాపకానికొస్తుంది. తమ్ముడూ… చిన్నప్పుడు పుస్తకాల్లో వ్యతిరేక పదాన్ని మాత్రమే రాస్తారు. పెద్దయ్యాక జీవితంలో వ్యతిరేక వాక్యాలను రాస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు.
రాలగొట్టిన వాడి పేరు సుబ్బారావనుకో. ఊరికే అనుకో. ఆ వెంటనే ఒక పుల్లారావొస్తాడు. వాడేదో పెద్ద డాక్టర్‍లా బిహేవ్ చేస్తాడు. వాడి సరంజామా వాడికుంటుంది. ఏదో రిపేర్ చేసి, మళ్ళీ పళ్ళికిలించమంటాడు. తమ్ముడూ… చిన్నప్పుడు సొంతవాక్యంలో నీ పేరు రాసుకుని మురిసిపోతారు మిత్రులు. పెద్దయ్యాక నిన్ను సొంత మనిషిగా చేసుకుని మురిసిపోతారు. మరి ఇదీ గుర్తుపెట్టుకోవాలి నువ్వు.
నాకూ తెల్సు. పద్యం ల్యాగవుతోంది. నేనూ రీడర్నే. కాకపోతే బాగా బ్రేకొచ్చింది. కోప్పడకు చాముండేశ్వరీ. నిజమే. ఇదేదో మగ పద్యంలా ఉంది. కొంచెం టైమివ్వు.
అక్కా… ఇప్పుడు నువ్వు విను. ఆమెవరో వస్తుంది. ఒక్క కోత కోస్తుంది. రక్తాన్ని చూసి కళ్ళు బైర్లుకమ్ముతాయి. నీ మంచితనాన్ని చూసి, ఆమె మూర్చపోయిన సంఘటనొకటి గుర్తుకొస్తుంది నీకు. చిన్నప్పుడు స్కూల్లో ఒక పదాన్ని రెండుగా చేస్తారు. దానికో సంధి పేరు పెడతారు. పెద్దయ్యాక జీవితంలో నీ గుండెను రెండు ముక్కలుగా చేస్తారు. నీకే ఒక పేరు పెడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు.
కోత కోసినామె పేరు నర్మద అనుకో. ఊరికే అనుకో. ఈసారి తపతి వస్తుంది. పెద్ద ఫిలాసఫర్లా పోజు కొడుతుంది. షాపింగుకి రమ్మంటుంది. నువ్వప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవాలి. కానీ షాకవుతావు. తీరా చూస్తే ఆస్పత్రికి తీసుకెళ్తుంది. నువ్వప్పుడు షాకవ్వాలి. కానీ కన్నీళ్ళు పెట్టుకుంటావు. అక్కా…చిన్నప్పుడు నీతో కలిసి నవ్వుతారు మిత్రులు. పెద్దయ్యాక నీతో కలిసి నవ్వడానికి ఆనందాన్ని వాయిదా వేసుకుంటారు. ఇదీ గుర్తుపెట్టుకోవాలి నువ్వు.
గాయం చెయ్యడానికైనా
దాన్ని మాయం చేయడానికైనా మనుషులే కావాలి.
లాటరీలొద్దు.
లాజిక్కులొద్దు.
లాలనగా ఉండు.
పుష్టిగా భోంచెయ్యి.
పుడమో, పాదాలో అరిగిపోయే వరకూ నడువు.
ఏం జరిగినా సరే,
ఎక్కడ నిలబడ్డా సరే,
ఎవరు కనపడ్డా సరే,
ఒక నవ్వు నవ్వు.
సరే. లేటైపోయింది.
నిద్రపో.
మెలుకువ వచ్చినప్పుడే లే.
గోరువెచ్చటి నీళ్ళ స్నానం చెయ్యి.
శుభ్రంగా తుడుచుకో.
అందరూ రాస్తున్నారు. ఆ మొహానికి నువ్వూ ఏదో ఒకటి రాయి.
చలికాలం కదా, కనీసం మాయిశ్చరైజర్.
ఇప్పుడు రా అద్దం ముందుకి.
మళ్ళీ నువ్వు
ఇప్పుడే సూర్యుడు తగిలి నవ్వే
పగటిమొక్క చిగురుటాకులా నవ్వు.