ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 9

హైస్కూల్ పాసు కావడం, సర్టిఫికెట్ పొందడం ఆపైన ఇంటర్మీడియట్‌లో నేను ఏ సబ్జెక్టులు చదవాలన్నదానిపై చర్చలు జరపడం, మల్లగుల్లాలు పడటం ఇవన్నీ ముగిశాయి. కాలేజీకి వెళ్ళి నేను చేరవలసిన కోర్సుకు సంబంధించిన దరఖాస్తు ఫారం తెచ్చుకోవడం, నింపడం వంటివి కూడా ఇట్టే ముగిసి పరమ ఉత్సాహంగా జూనియర్ ఇంటర్మీడియట్ కాలేజీలోకి అడుగుపెట్టాను. కాలేజీ చదువులో నాకు గ్రీకు చరిత్ర, రోమన్ చరిత్రలు బాగా నచ్చాయి. చరిత్రతో పాటూ తర్కము ఇంకా మనస్తత్వ శాస్త్రాలను కూడా నేను నేర్చుకున్నాను. ఈ కొత్త చదువు నాకు ఒక కొత్త దృష్టిని ఇచ్చింది.

కాలేజీలో మాకు రోలో, మకింటోష్, ఇంగ్లీటన్ వంటి క్లిష్టమైన పేర్లు ఉన్న ఇంగ్లీష్ ప్రొఫెసర్లు ఉండేవారు. వాళ్ళు మాకు ఆంగ్లభాష లోని క్లాసిక్స్ అన్నీ బోధించేవారు. అయితే మాకు వారి ఫక్తు ఆంగ్ల ఉచ్చారణ అలవాటు పడటానికి, అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. కాలేజీ చదువులో కన్నడ భాష తాలూకు గద్య కవిత్వాన్ని కూడా నేను చాలా ఆస్వాదించాను. భాషలను, ఆ భాషల సాహిత్యాలను ఎలా రుచి చూడాలో మాకు తెలియచెప్పిన మా గురుపండితులకు వేనవేల ధన్యవాదాలు.

చదివినంతకాలం నేను మా కళాశాల చదువును ఆ కాలేజీ వాతావరణాన్ని ఎంతో ఆస్వాదించాను. చూస్తూ ఉండగానే జూనియర్ నుంచి సీనియర్ ఇంటర్మీడియట్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి మార్కులతో పాస్ కూడా అయ్యాను. రోజులన్నీ హాయిగా, ఆహ్లాదంగా గడుస్తున్నాయి. కాలేజీ రోజుల్లో నేను, హెచ్‌కె కలిసి టెన్నిస్ ఆడటం మొదలుపెట్టాము. ఇది మా కొత్త సరదా. హెచ్‌కె ఇప్పుడు కాలేజీలో నాకంటే ఒక సంవత్సరం సీనియర్, కానీ మా ఇద్దరి చదువులమధ్య వచ్చిన ఈ తేడా మా రోజువారీ సాయంత్రపు కలయికలకు, కలిసి మెలిసి సమయం గడపడం వంటి మా పాత అలవాటుకు, ఆ సరదా తిరుగుళ్ళకు ఏమీ అడ్డు రాలేదు. చదువు సంధ్యలు, సరదా తిరుగుళ్ళతో పాటూ నేను నా డ్రాయింగ్, పెయింటింగ్‌లను కూడా మరింతగా సాధన చేసేవాణ్ణి. బొమ్మలు గీయడంలో కొత్త శైలులను అన్వేషించేవాణ్ణి. నీటి రంగులను వాడ్డం, రేఖా చిత్రాలు గీయడం, కాన్వాస్‌పై ఆయిల్ కలర్లు, స్క్రాపర్ బోర్డ్‌పై బ్లేడు దూసి బొమ్మలు పుట్టించడం… ఒకటీ రెండూ అని, అదీ ఇదీ అని కాదు. అంగడిలో బొమ్మల పచారి ఏది కొత్తగా వచ్చినా సరే, ఆత్రగాడిని నేను, ఆ సామాగ్రిని కొనుక్కుని వచ్చి వాటితో రకరకాలుగా బొమ్మలు వేయడానికి ప్రయత్నించేవాడిని.

కంటికి ఎదురుగా కనపడే బయటి వాతావరణాన్ని చిత్రించడం మాత్రమే కాదు. అప్పుడప్పుడూ బొమ్మ వేస్తున్న కాగితాన్ని పట్టుకున్న నా ఎడమ చేతిని, ఆ వేళ్ళని, తల వంచి కిందకు చూసినా, చాపుకున్నా కనపడే నా కాళ్ళని ఆ కాళ్ళు తొడుక్కున పంట్లాం లేదా పంచెల మీది మడతలను విపరీతంగా అధ్యయనం చేసేవాడిని. గీసేవాడిని.

నేను నా బొమ్మల బల్ల దగ్గర ఒక నిలువుటద్దాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఒకసారి దాని ముందు కూర్చుని, అందులో కనపడే నా ప్రతిబింబాన్ని పోర్ట్రెయిట్‌గా గీశాను. దాని రేఖాకృతి బాగా కుదిరింది, ఆ ఆకృతి లోతు వెడల్పుల మీద పనిచేయడానికి పెన్సిల్ షేడింగ్ చేస్తూ, ఆ పెన్సిల్ నలుపు నూగుపై వేలితో రుద్దే సమయంలో ఒక నిర్లక్ష్యపు కదలిక వల్ల ఆ బొమ్మ పెదాల పై భాగంలో ఒక మరక ఏర్పడింది. నిర్లక్ష్యంగా ఏర్పడిన ఆ మరకని అలానే ఉంచి వాటినే తీరైన మీసాలుగా మలిచాను. ఆ తమాషాను అలానే కొనసాగిస్తూ నా బొమ్మ మొహానికి కాసింత గడ్డం కూడా జోడించాను. ఇప్పుడు ఆ బొమ్మలో నేను ఒక సాధువులా కనిపించాను. సాధువు మొహానికి పరిపూర్ణత అందించడం కోసమని అతని జుట్టుని కూడా చింపిరిగా పెంచి ఆ పై చివరగా ఆ బొమ్మ నుదుటిపై కుంకుమని గీశా. తమాషా అంతా అయిన తరువాత నేను దానిని నా అనేకానేక ఇతర స్కెచ్‌ల మధ్య ఉంచి, మొత్తానికి దాని గురించిన విషయమే మరచిపోయాను.

అలాగలాగలాగ కళాశాల, చదువు, సరదా సరదా తిరుగుడు, సీరియస్ బొమ్మల సాధన నడూస్తూనే ఉన్నాయి. అలా ఎంత వరకూ నడిచిందంటే మా మైసూరుకు సమీపంగా ఉన్న కొన్ని గ్రామాలలో టైఫాయిడ్ కేసులు మొదలయ్యాయి అనే వార్తలు వచ్చేవరకు నా జీవితం సాఫీగా సాగింది. ఆ జబ్బు మైసూర్‌లో కూడా అడుగు పెట్టిందని పుకార్లు వినవచ్చాయి. అవి ఒట్టి పుకార్లు మాత్రమే కాదని మా కాలేజీలో ఇద్దరు అబ్బాయిలు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన తరువాత మైసూరులో టైఫాయిడ్ వచ్చేసిందని మాకు గట్టిగా తెలిసిపోయింది.

అది మహాత్మా గాంధీ క్విట్ ఇండియా పిలుపునిచ్చిన సమయం. దేశం అంతా అట్టుడుకుతున్నది. దేశం మాట దేవుడెరుగు, ఆ సమయంలో నేను ప్రాణాంతకమైన టైఫాయిడ్ బారినపడి నా బ్రతుకు కాపాడుకునే పోరాటంలో ఉన్నాను. జ్వరతీవ్రతలో కళ్ళు సోలిపోతూ, వళ్ళు పేలిపోతూ మంచాన పడ్డ నేను కాస్త కోలుకుని కళ్ళు తెరిచి చూసిన మొదటి దృశ్యం, మా అమ్మ నా మంచంపైకి వంగి ఆత్రుతగా, దిగాలుగా నా కేసి చూస్తుండడమే. దాదాపుగా నేను ఒక నెల పాటు ఒంటిమీద స్పృహ లేకుండా రోగాన పడి ఉన్నానని ఆ తరువాత తెలిసింది.

సమయం గడిచే కొద్దీ నేను కాస్త కాస్తగా బాగుపడుతూ వచ్చాను. పెద్ద జబ్బు నుండి కోలుకుని బయటపడ్డ నన్ను చూడటానికి నా బంధువులు, మిత్రులు తెగ వచ్చేవారు. వారు నా మంచం చుట్టూ కూచుని కబుర్లు చెప్పేవారు. వారినుండి నేను బయట ఏం జరుగుతున్నది, నాకు స్పృహ లేకుండా పడి ఉన్నరోజుల్లో ఏమేం జరిగిందో అన్ని విషయాలు తెలుసుకునేవాడిని.

బ్రిటీష్ పాలన నుండి దేశాన్ని విముక్తి చేయడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడుతున్నందువలన పాఠశాలలు, కళాశాలలు అన్నీ మూసివేశారుట. అంతేకాదు, ఇంత జబ్బున పడి కోలుకుంటున్న నన్ను పరామర్శించడానికి నా ప్రాణస్నేహితుడు హెచ్‌కె ఇంతవరకు ఎందుకు రాలేదు అనుకున్నారు? వాడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారుట. చక్కని నవ్వు మొహంతో సంస్కారంగా మాట్లాడుతూ మృదువుగా ఉండే వాడికి ఇలా జైలు ప్రాప్తం అవుతుందని నేనెప్పుడూ ఊహించలేకపోయాను! క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా మైసూరులో వెలిసిన ఒక సైకిల్ దండులో హెచ్‌కె చేరాడు. ఆ దండు చేసే పనేమిటంటే బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ గుంపులుగా కూడి పట్టణమంతా సైకిల్ తొక్కడం. అది ప్రభుత్వానికి కన్నెర్ర అయి వారినంతా అరెస్ట్ చేసి జైలుపాలు చేశారట. నా అనారోగ్యాన్ని గురించి బెంగపడుతూ హెచ్‌కె జైలు నుండి నాకు పోస్ట్ కార్డులు వ్రాసేవాడు. అది జైలు అధికారుల నుండి సెన్సార్ అయ్యిన తరువాతే చేరవలసిన వారికి చేరేది. నా మిత్రుడు అక్కడ జైలులో – నేను అనారోగ్యం వల్ల ఈ గదిలో, ఇద్దరమూ బందీలుగా ఉన్నాము.

క్రమంగా పడక మీది నుండి లేచేంత శక్తి తెచ్చుకుని నేను గదిలోనే కొంచెం కొంచెం అటూ ఇటూ తిరిగేవాడిని. కాసేపు నా టేబుల్ వద్ద కూర్చోవడం అక్కడి నుండి తిరిగి వెళ్ళి మంచం మీద పడుకోవడం ఇది మాత్రమే ఆ పరిస్థితుల్లో నేను చేయగలిగిన కార్యకలాపం. ఇంకొద్దిగా శక్తి సమకూరేకా నేను నా డెస్క్ డ్రాయర్‌లను, నా గది కప్‌బోర్డ్‌లను తెరిచి అక్కడ ఉన్న వస్తు, పుస్తక సామాగ్రినంతా సర్దేవాడిని. అక్కడ ఉన్నవాటిలో పగిలిన, ఎండిన పెయింట్ ట్యూబ్‌లు, ఇంకు సీసాలు, అరిగి చిన్న ముక్కలయిపోయిన పెన్సిల్ ముక్కలను, ఇంకా ఈకలు చెల్లా చెదురై, పాడైపోయిన కుంచెలను తీసి పారేసేవాడిని. అప్పుడుప్పుడు నేను నా స్కెచ్‌బుక్‌లను, బొమ్మలేసి పెట్టిన డ్రాయింగ్‌ షీట్‌లను తీసి వాటి దుమ్ము దులిపి చక్కగా అమర్చడం, ఫైలు చెయ్యడం చేసేవాడిని. ఇలా చేస్తున్నప్పుడు నాకు పొడవాటి చింపిరి జుట్టు ఉండి, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు దిద్దుకుని, గడ్డం ఉన్న ఒక వ్యక్తి యొక్క బొమ్మ కంట పడింది. అది ఎవరి బొమ్మో కాదు, నెలరోజుల క్రితం నాకై నేను అద్దంలో చూసుకుంటూ సరదాగా వికృతీకరించుకున్న నా స్వీయచిత్రం! ఇప్పుడు ఈ క్షణాన నేను ఆ బొమ్మను చూస్తూ ఉంటే జబ్బు చేయడం వల్ల జుత్తు, మీసాలు, గడ్డం పెరిగి, మొహం పాలిపోయి ఉండి, నేను అనారోగ్యం బారి నుండి బయటపడాలని మా అమ్మ నిత్యం పూజలు ప్రార్థనలు చేసి నా నుదుటన దిద్దిన కుంకుమలతో ప్రస్తుతపు నేను ఎలా ఉన్నానో! అలానే ఆ బొమ్మలో నా మొహం కనపడుతూ ఉండేసరికి నాకు చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. ఇది ఒక రకంగా నా రాబోయే స్థితిని నా కళ్ళ ముందు ఉంచుతూ భూతకాలంలో నాకు తెలియకుండా నేను వేసుకున్న నా భవిష్య చిత్రం. నాకు కలగబోయే ఒక ప్రాణాంతక రోగాన్ని నాకు ముందుగానే చెప్పబడిన ఒక ఆశ్చర్యకరమైన సందర్భం. పోర్ట్రెయిట్‌లో నా పోలికను చూసి ఇంట్లో ప్రతి ఒక్కరూ తెగ ఆశ్చర్యపోయారు.

ఆ ఒక అనారోగ్యపు కాలం, స్వాతంత్ర ఆకాంక్షతో ప్రజలు పిడికిలి బిగించిన కాలం ముగిసి నేను సాధారణ స్థితికి రావడానికి, నా మామూలు జీవితాన్ని మళ్ళీ ప్రారంభించడానికి, కళాశాలకు తిరిగి వెళ్ళడానికి ఒక సంవత్సరం మొత్తంగా పట్టింది. ఈ కల్లోలకాలం నుండి కూడా నాకు జరిగిన మంచి ఏమిటంటే, నా స్నేహితుడు హెచ్‌కె స్వాత్రంత్రం కోసం పోరాడుతూ ఒక సంవత్సరం చదువు కోల్పోయాడు. ఈ సంవత్సరం మేము మళ్ళీ కలిసి ఒకే క్లాసులో ఒకే బెంచిలో కూర్చున్నాము. మళ్ళీ బెంచ్ మేట్స్ అయ్యాము! అలా అలా కాలం గడుస్తూ వాటితో పాటే మేమూ నడుస్తూ బి.ఎ. చదువు చదవడం పరీక్షలకు కూచోవడం, పరీక్షలు ముగియడం కూడా అయింది.

పరీక్షలు ముగిసిన తరువాత ‘ఈ సెలవులను ఎలా గడపాలబ్బా!’ అని ఆలోచిస్తున్నప్పుడు ఊహించని విధంగా మద్రాసులోని ఒక ఫిల్మ్ స్టూడియో నుండి నాకొక ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం వ్రాసినవారు కార్టూన్ ఫిల్మ్ నిర్మించాలనే ఆలోచనతో ఉన్న కార్టూనిస్ట్. ఈ కార్టూన్ సినిమా నిర్మాతలు ఈ కార్టూనిస్ట్‌కు ఒక స్టూడియో, సినిమాకు కావలసిన సిబ్బంది, వీటన్నిటి నిర్వహణా ఖర్చుల నిమిత్తం కొంత నగదు కూడా ఇచ్చారు. ఈయన హిందూలో మా అన్న నారాయణ్ కథలకు నేను వేసిన బొమ్మలను చూశారట. అవే కాకుండా వేరే ఇతర పత్రికలలో కూడా నేను వేసిన బొమ్మలను చూశారని, వాటిని ఇష్టపడ్డారని, తాము తీయబోతున్న కార్టూన్ సినిమాకు నా బొమ్మలు, పనితనం సరిగ్గా సరిపోతాయని భావించి నాకు ఈ ఉత్తరం రాశారు. నేను కనక ఆయన సినిమాకు పని చేయకలిగితే వారు నాకు ప్రతి నెల 250రూ. జీతం ఇస్తానని కూడా చెప్పారు. ‘అరే భలే ఉందే’ అనుకున్నా. నేనూ “అయ్యా! మీ వద్ద పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ప్రస్తుతం నా కాలేజీ చదువు ఇంకా నడుస్తూనే ఉన్నది. నా చదువు ముగియడానికి ఇంకా సంవత్సరం మిగిలి ఉన్నది కాబట్టి ఈ సెలవులలో ఒక మూడు నెలలు మాత్రమే నేను మీ వద్ద పని చేయగలను. నేను ఎలాగూ ఈ సెలవులలో మద్రాసును సందర్శించబోతున్నాను కాబట్టి నేను అక్కడికి వచ్చినపుడు మిమ్మల్ని తప్పక కలుస్తా”నని చెబుతూ ఆయనకు బదులు లేఖ వ్రాశాను. నిజానికి అసలు నాకు మదరాసుకు వెళ్ళాలనే ఆలోచనే లేదు. ముఖ్యంగా మైసూర్‌లో ఉండే హాయైన చల్లని తేలికపాటి వాతావరణం అనుభవిస్తూ ఉండేవాళ్ళు వేసవి కాలంలో భూలోక నరకంలా ఉండే మదరాసుకు ఎందుకని ప్రయాణం కడతారు? కానీ నా మనసులో మాత్రం ఆ కార్టూనిస్ట్ చేపట్టిన ఆ ఆనిమేషన్ వ్యవహారం చూడాలని చాలా కుతూహలంగా ఉంది. అందుకని ఏది ఏమైనా కానీ అనుకుని ఒక సంచిలో నా బట్టలు తతిమ్మా సామాగ్రీ సర్దుకుని పద పద పోదాం మదరాసు అని బయల్దేరాను.

ఇంట్లో ఉన్నవారు పిల్లవాడు పనిమంతుడు అయినందుకు సంతోషంగా నాకు శుభాకాంక్షలు చెప్పారు. అమ్మ చెప్పింది: “నాయనా మరీ ఎండలో తిరగకు. మద్రాసులో ఏప్రిల్‌లో అక్కడి సూర్యుడు నిజమైన అగ్ని గోళం వాడు, అందుకని నువ్వు తప్పకుండా ప్రతి వారం నూనెతో తలంటుకుని, వళ్ళు రుద్దుకుని స్నానం చెయ్యి. అది నిన్ను చల్లగా ఉంచుతుంది, మరిచిపోకు సరేనా?”

అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...