నేను బహు చెడ్డ ఉద్యోగిని, ఎడిషన్ పని మొదలు అయ్యే సమయానికి సంచి తగిలించుకుని ఇంటికి వెళ్ళే దారిలో దొరుకుతా. ఆయన ఎడిటర్. ఆయనకు తోచినప్పుడు ఎడిటోరియల్ మొదలెడతారు, ముగిస్తారు. నేను ఉదయం వచ్చి సాయంత్రానికి అంతా బొమ్మల పని ముగించుకున్నప్పటికీ ఆ ఎడిటోరియల్ కోసం అగ్గిపెట్టెంత బొమ్మ వేయడానికి అలా ఆగి ఎదురు చూడాలంటే వల్ల కాదు. నాకు తెలిసి ఏ రోజూ ఏ దినపత్రికలో ఎడిటోరియల్‌కి బొమ్మ లేదు, నాకు తెలీక ఉంటే ఉండవచ్చు. పతంజలిగారి కోరిక మేరకు ఎడిటోరియల్ ఒక ఇలస్ట్రేటెడ్ అయి ఉండాలి, దాని బొమ్మ అన్వర్‌దే అయి కూడా ఉండాలి. ఎడిట్ పేజీలో ఎడిటోరియల్‌కి బొమ్మ అంటే ఏం గౌరవం! ఎంత పేరు! అనుకుని కుళ్ళి చచ్చేవాళ్ళతో నాకేంటి గాని నాకు ఈ దిక్కుమాలిన పేరూ గౌరవాల కన్నా సాయంకాలపు నా ఇల్లు, నా భార్య, పిల్లాడు, వాళ్ళతో కలిసి భోజనం చెయ్యడం, ఓ కొత్త సినిమా చూసుకోడమే ముఖ్యం. భోజనమా? విశ్వాసమా? అనే మీమాంసకు తావులేని నా గుణాన్ని గమనించి పతంజలి వీలయినంత తొందరగానే ఎడిటోరియల్ మొదలుపెట్టేవారు, నేను ఆ మాత్రం కూడా భరించలేక ఆయన అలా రాస్తూ ఉండగానే ఆయన భుజంపై వాలిపోయి ఆ రాత చదివి, ఒక అవగాహనకు వచ్చి ఆ రాత ముగిసేలోగా బొమ్మ పూర్తి కానిచ్చేవాణ్ణి.
నాకు ఆ సాయంత్రం ఇంకా గుర్తుంది, కళ్ళ ముందుంది. జనం, ఆ కంప్యూటర్‌ల మధ్యన ఆయన నిలబడి రవీంద్రబాబుతో ఏదో చెబుతున్నారు. నేను వెళ్ళి గట్టిగా చేతులు పట్టేసుకున్నా. ఆ రోజు ఆయన వ్రాసింది ‘ఆ రేయి నీరెండ’. ఎడిటర్స్ నోట్ బుక్ అని ప్రచురితం అయ్యేవి ఆయన ఎడిటోరియల్స్. నాకు మాటలు రావట్లా, నా చేతుల భాష ఆయనకు అర్థం అయ్యింది, ఆయనా బోల్డు సంబరపడ్డారు. ‘మీకు నచ్చిందా? నచ్చిందా?’ అని పదే పదే అడిగారు. నేను ఈ ఒరిజనల్ని ఉంచుకోవచ్చా? అన్నా. నిజానికి అవేం అడగనక్కరలేదు, కంపోజ్ అయిపోయాక అవెలాగూ చెత్తబుట్టలోకి వెళ్ళిపోతాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ నాకు ఆ మహారచయిత రాసిన ఆ పీస్ మాత్రం దాచుకోబుద్ధి అయ్యింది, అలా అడిగి ఆయన్ని సంతోషపరచబుద్ధి వేసింది. నిజానికి అప్పుడు మా ఇరువురికీ తెలీదు అది పతంజలి చివరి ఎడిటోరియల్ కాబోతుందని, ఆయన పలికిన చివరి మహా భాష్యం కూడా. అది ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. ఆ చేతుల తాలూకూ వెచ్చదనం, ఆ మరణం తాలూకూ మహోగ్రసూర్యప్రతాపం, ఆ కాగితాల్లో ఒక చావు వాసన. ఇప్పుడు ఈ పదేళ్ళ తరువాత మీ ముందుకు మళ్ళీ ఓ సారి.
ఆ రేయి నీరెండ!
ఆవకాయ అంటారో, ఊరగాయ అంటారో. తొక్కులంటారో లేకపోతే మామిడికాయ పచ్చళ్ళంటారో… ఏమంటారో వాటిని పెట్టి, జాడీలకు ఎత్తి వాసెనలు కట్టారా లేదా?వర్షాలొచ్చేస్తున్నాయి. ఎండల భుగభుగలూ, ధగధగలూ, ఫెళఫెళలూ తగ్గిపోతున్నాయి. వారం రోజులు తిరక్కుండా తొలకరి పలకరించబోతున్నది. ఇది ఎండాకాలానికి వీడుకోలు. వడియాలు పెట్టారా లేదా? తనివితీరా మామిడిపళ్ళు తిన్నారా లేదా? తాటి ముంజెలు కొని లేతవైతే వాటిపై పంచదార జల్లి, ముదురువైతే పులుసుపెట్టి వండుకునీ మనస్ఫూర్తిగా తిన్నారా లేదా? సెలవులకు ఇంటికొచ్చిన పిల్లలూ, మనమలూ, మనుమరాండ్రతో సంబరంగా గడిపారా లేదా? వేసవి వెళ్ళిపోవడానికి సూటుకేసు సర్దుకుంటున్నది. పొలిమేరలో తొలకరి కుడికాలు మోపడానికి సంసిద్ధం అవుతున్నది. ఇది తొలకరి స్వాగత సన్నాహం.
ఈ పృథివీతలాన్ని ఎన్ని ఎండాకాలాలు పలుకరించి పోయినాయో? ఈ తొలకరి చినుకులు ఎంత ప్రాచీనమైనవో. ఎన్నెన్ని జన్మలెత్తి ఈ మానవజాతి ఎన్నెన్ని ఎండల్లో వేసారినదో. ఎన్నెన్ని వానల్లో తడిచి ముద్దయినదో? ఎప్పుడేనాడో ఈ భూమి ఇంకా కన్యగా ఉండి సూర్యుడి దయవల్ల నెలతప్పి తొలిప్రాణిని ఎపుడు కన్నదో? ఆ ఆకుపచ్చని అంకురాన్ని గుండెలకు హత్తుకుని, దోసిటిలో ఉంచి సూర్యునికీ, ఆకాశానికీ చూపించి ఆనాడెలా సంబరపడిపోయినదో? మానవజాతి మరపు పరకల్లో పడిపోయిన ప్రాచీన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమిది.
ఏ కారణం వల్లనో ఎన్నడూ ఎరుగనంత భీకరంగా సూర్యభగవానుడు భగభగ మండిపోతున్నట్టు అనిపిస్తే, రోళ్ళు పగిలి, జీవనదుల్లోని నీరు కూడా సలసల మరిగినట్టు అనిపిస్తే, భీషణ తాపానికి సెలయేళ్ళు మరిగి, ఆ తాపానికి తట్టుకోలేక చేపలు చచ్చిపోయి నీటిలో తేలిపోతే–చెట్టూ చేమా వాడిపోయి, లేత ఆకులన్నీ ఎండిపోయి దాహం దాహం అన్న ఆర్తనాదం నలుదిక్కులా ప్రతిధ్వనిస్తే–అయిపోయింది! యుగాంతమిది! జగాంతమిది! ప్రాణకోటికి చిట్టచివరి వేసంగి ఇది! అని ఎన్ని మారులు మానవజాతి నిర్ధారణకు వచ్చిందో? నీగ్రో దేవతల్లాంటి నల్లమబ్బులు దోసిళ్ళతో తొలకరి తీసుకువచ్చి మొగాలమీద చల్లితే ప్రాణాలు లేచివచ్చి ఆ భయాలు, నిర్ధారణలు ఎన్నిసార్లు మరచిపోయిందో? కాలచక్ర భ్రమణాన్ని గుర్తుకు తెచ్చుకుని దాని ఇంద్రజాలం లోంచి బైటపడటానికి చేస్తున్న ప్రయత్నమిది.
ఎండ వేడిమికి తట్టుకోలేక, ఎండ ముదరకముందే గూటికి చేరిపోయి, కిటికీలకు వట్టివేళ్ళ తడికెలు బిగించి, వాటిని తడిపి, ఆ సుగంధం ఊపిరితిత్తులను, మేనినీ హాయిగా తాకుతుండగా, తడిపిన కొత్త కుండలోని నీళ్ళలో గులాబి నీరు, చక్కెరా కలిపి, వాటిని కంచుగ్లాసులో వేసుకుని ఆరారా తాగుతూ, విసనకర్రతో ఉసురుసురని విసురుకుంటూ, గాడ్పులను తిట్టుకుంటూ ఈ మిగిలిన వేసవిని ఎలా తట్టుకుని బతకాలిరా దేవుడా అని వాపోయిన రోజులు మీరు ఎరుగుదురా? ఎరిగినవారైతే వాటిలో ఏదైనా రోజు స్పష్టంగా గుర్తున్నదా మీకు?
రెక్కాడని రోజు డొక్కాడని స్థితిలో ఏ బరువునో మోస్తూ, ఏ రిక్షానో తొక్కుతూ, ఏ పార పనో, ఏ ఇటుకలో మోస్తూ ఒళ్ళంతా చెమటతో తడిసిపోయిన ఆరిన చోట ఉప్పు చారికలు తేలి, ఊపిరితిత్తుల నిండా వేడి వేడి ధూళి పేరుకుని, నోరార్చుకుపోయి, గొంతు ఎండిపోయి, ప్రాణాలు కడగడుతున్నపుడు ఒక్క వడగాలి గుండెలో గునపం పోటులాగ శరీరాన్ని తాకితే, ఎందుకు నాకీ కష్టం, నాకెందుకీ నిష్ఠూరమైన బతుకు అని ఎవరిని ప్రశ్నించాలో తెలియక, జవాబు ఎవరూ చెప్పరని తెలిసి కుమిలిపోయిన క్షణాలలో ఏదైనా ఒకటి జ్ఞాపకం వుందా? ఒక వేసంగి రోజు గానీ, ఒక మబ్బుపట్టిన వేళ గానీ, ఒక తొలకరి పొద్దు గానీ, ముసురుపట్టి ఎప్పటికీ తగ్గేట్టు కనిపించని వాన గానీ మరపునకు రాకుండా గుర్తుండిపోయాయా?
బావులు ఒట్టిపోయి, చెరువులు ఆరిపోయి, మబ్బు తునక గానీ, గరిక మొలక కానీ కనిపించక, ఊరి కొండలన్నీ నిప్పులే చెరుగుతూ, పూరీడు చెట్టునుండి ఎపుడూ రాగి రొట్టెలు కాలుస్తున్న వాసనలే వస్తూ, బ్రహ్మజెముడు చెట్లు తెల్లని ముళ్ళతో, నెత్తుటి పళ్ళతో భయద సుందరంగా అగుపించిన సందర్భాలేవన్నా మరచిపోలేనివిగా మిగిలిపోయాయా? మామూలు సందర్భాల్లోనివీ, నిజ జీవితాల్లోనివీ గుర్తులేకపోయినా కావ్యాల్లోనివీ, కథల్లోనివీ, కవితల్లోనివీ గుర్తుండిపోతాయి. రావిశాస్త్రిగారి కథల్లో శారదమ్మ ఇంటిలోని ముసురు చీకటీ, ఆవిడ జీవితంలోని ముసురూ, ఆవిడ కొంప చుట్టూ ముసురుకుని మరెప్పుడూ తగ్గని ముసురూ మరపునకు రావు.
రాజు-మహిషిలోని లంబాచోడా ప్రసాద్ తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువుకు పరిగెత్తిన రాత్రి కురిసిన గాలీ వర్షాన్ని నేను ఎన్నడూ మరచిపోలేను. ఎక్కడో లాటిన్ అమెరికాలో ఎడతెరిపి లేకుండా కొన్ని వందల రోజులు కురిసిన వర్షాన్ని నేను చూడలేదుగానీ దానిని గార్షియా గాబ్రియెల్ మార్క్వెజ్ వర్ణించాడు. అందులో నేను దర్శించిన, చూచిన, తడిచి ముద్దయిన ఆ నా చూడని వర్షాన్ని కూడా నేను మరువలేను. గోల్డెన్ హీలిక్స్ అనే ఒక పుస్తకంలో ఒక గ్రహం మీద ఎప్పుడూ చినుకుతునే ఉంటుంది. కొద్దిరోజుల్లో అక్కడ చిక్కుకున్న అంతరిక్ష యాత్రికుల బట్టలన్నీ నుగ్గునుగ్గయి రాలిపోతాయి. అందరూ దిగంబరంగా మిగిలిపోతారు. ఆ గ్రహం మీద డార్విన్ సిద్ధాంతం తలకిందులుగా అమలు అవుతుంది. తొలి జంట కడుపున కోతిపిల్ల పుడుతుంది. అందులోని వర్షం కూడా ఎపుడూ నాకు గుర్తు వుండిపోతుంది. నా చిన్నతనంలో ఎండాకాలంలో మా ఊరు తగలబడిపోయి గగ్గోలుగగ్గోలుగా ప్రజలందరూ అటూ ఇటూ పరిగెత్తిన వేళ ఆ కాచిన ఎండగానీ, మండిన నా ఊరు గానీ, నా మొగాన వాలినెండుతాటాకుల బూడిద గానీ నేను ఎపుడూ మరిచిపోలేను.
ఇదే రీతిగా మొన్న పదిరోజులనాడు కరీంనగర్ జిల్లాలో తీగల నర్సయ్య గౌడ్ అనే అరవయ్యేళ్ళ కల్లుగీత కార్మికుడు తాటిచెట్టు మీద చనిపోయిన దిక్కులేని చావును కూడా నేను ఈ వేసవితోపాటు మరువలేను. ఊరంతా సాయం చేయాలని చూసినా, పది గంటలసేపు నానా యాతనా పడినా నర్సయ్యగౌడ్‌ని బతికించుకోలేకపోయింది. నడుంకట్టు తెగిపోయి, కాళ్ళ జోడీకట్టుతో తాటి చెట్టు మీద నుంచి తలకిందులుగా వేలాడిన నర్సయ్యని సురక్షితంగా ఎలాగ దించాలో జనానికి తోచలేదు. సాయపడదామని వచ్చినవాళ్ళ సాక్షిగా అతను రక్తం గడ్డకట్టి చనిపోయాడు.
ఆ రేయి నిజంగా నీరెండ కాచింది. ఆ లోక భీకరమైన చావును గానీ, అది సంభవించిన ఈ వేసవిని గానీ నేను ఎన్నడూ మరచిపోలేను. నేను భయపడిన, జడుసుకున్న, మానసికంగా కకావికలైపోయిన సందర్భం ఇది. అలాంటి చావు ఎవరికీ రాకూడదు! ఇలా రాస్తున్నప్పుడు కూడా నా గుండె దడదడా కొట్టుకుంటున్నది.
(సాక్షి 1.6.2008)