ఇదిగిదిగిదిగో నేను!

లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో అనే ఒక రోజున నేనూ ఆర్టిస్ట్ మోహన్‌గారూ కూచుని జీవితము, చిత్రకళ అనుకుంటూ ఉన్న ముచ్చట్లలో ఆయన ఇలా చెప్పాడు:

“1976లో ఖమ్మంలో కార్టూనిస్ట్ సభలు జరిగాయబ్బా! (నాకు అనగా అన్వర్‌కు అప్పుడు టూ ఇయర్స్ అనగా రెండు చెవులు కాదు యియర్స్ అనగా రెండు సంవత్సరాల వయసు.) నేనక్కడ వో మూల నిలబడి సిగరెట్ తాగుతూ ఉన్నా. ఇంతలో బ్లాక్ జర్కిన్ వేసుకున్న ఒక హేండ్సమ్ వచ్చి, ‘ఇక్కడ ఆర్టిస్ట్ మోహన్ అంటే ఎవడ్రా?’ అనడిగాడు. ‘నే’ననగానే, అమాంతం నన్ను కావిలించుకుని అలాగే ఎత్తుకున్నాడు. ‘నేను ఆర్టిస్ట్ చంద్రనిరా. ఒరే! నువ్వురా బాగా బొమ్మలు వేస్తావురా! ఒరే! నీ లైన్‌రా సూపర్‌రా!’ అని మెచ్చుకున్నాడు. అప్పటికి బొమ్మలు వేస్తున్నా కానీ చంద్ర లాంటి సూపర్ స్టార్ నన్ను అలా కనిపెట్టడం భలే అనిపించిందబ్బా!”

వీళ్ళు, ఆ పెద్ద చిత్రకారులు, ఇలా మహా ముచ్చటగా ఉంటారు. చంద్రగాడు, బాలిగాడు, మోహన్‌గాడు అనుకుంటూ. ఎదురుపడగానే ‘ఒరేయ్ అరేయ్ తురెయ్’ అనుకుంటూ. నాకది ఎప్పటికీ చేతకాదు. బహు మర్యాదగా నేను బాపుగారి బ్యాచ్. ఎంతటి గారి నయినా ఎదురుగా సార్ అనే అంటాను, వాడు వెనక్కి తిరగ్గానే ‘జారే నీయఖ్ఖ’ అనడమే కద్దు లేదా మా బాపుగారు దీవించినట్లు ‘వీడు బహు పెంటముండాకొడుకు!’ అనుకోడం కూడా. అయ్యో పాపమా!


దేశం గర్వించదగ్గ ఆర్కే లక్ష్మణ్ ఆత్మకథలోని ఒక గుర్తింపు చమత్కారం ఇది; లక్ష్మణ్ మాటల్లో ఇలా…

“నేను చదుకునే రోజుల్లో మా కాలేజి మేగజైన్‌కి బొమ్మలు, కార్టూన్లు, కవర్లు గీస్తూ వుండేవాణ్ణి. అవి చూసి ముచ్చటపడ్డ ఒక ప్రముఖ కన్నడ రచయిత మా మాస్టారి ద్వారా నాకు కబురుపెట్టి, ‘ఒరే అబ్బాయ్, మనకు తెలిసిన ఒక డాక్టర్‌గారు బెంగళూర్ నుండి ఒక హాస్య ప్రధానమయిన మాసపత్రిక తేబోతున్నాడు. దాని పేరు కొరవంజి. అందులో నువ్వు కార్టూన్లు వేయాలి. అలా గీసినందుకు నీకు డబ్బులు కూడా ఇస్తారు’అని అన్నారు. నేను సరేనన్నా. అవి రెండవ ప్రపంచ యుద్ధపు రోజులు, తిండీ బట్టా కరువు రోజులు. నిత్యావసరమైన ప్రతీది కరువుగా ఉన్న రోజులు, చీకటి రోజులు, దిక్కుమాలిన రోజులు. ఆ పరిస్థితులు, ఆ సంక్షోభం, ఆనాటి జీవన సంక్లిష్టతలే నా కార్టూన్ల ముడి సరుకులు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ మొదటి సంచిక కార్టూన్లు గీశా. ఆరోజుల్లో కన్నడలో ఉన్న లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలు కొరవంజిలో వచ్చేవి. మెల్లమెల్లగా ఈ పత్రిక ప్రాముఖ్యత బాగా పెరిగి, అప్పటి జనాదరణ పొందిన పత్రికల్లో ఒకటయ్యింది. నా కార్టూన్ల సంగతి దేవుడెరుగు, అప్పటికి నేనెరుగను.

అలా అటువంటి కొరవంజి రోజుల్లో నా మానాన నేను నా సైకిల్ మీద పోతున్న ఒక రోజున, ఒక పోలీసాయన చేతిలో పట్టుబడ్డా. అప్పటికి నా సైకిల్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిన గడువు దాటి కొన్ని నెలలు గడిచిపోయింది (అవును సైకిల్ లైసెన్సే, మోటర్ సైకిల్ది కాదు!) కానిస్టేబుల్ నన్ను కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇన్స్‌పెక్టర్‌గారు నా సైకిలుకున్న ఇత్తడి లైసెన్స్ ప్లేట్ పరిశీలించి చూసి నా వద్దకు వచ్చి తన నోట్‌బుక్‌లో వివరాలు నమోదుచేసే నిమిత్తం నా పేరు అడిగాడు. నాకు ఇక్కడ నిలువెల్లా చెమట్లు దిగిపొతున్నాయి. జాలి మొహం, ఏడుపు మొహం, దీనాతిదీనంగా హీనాతిహీనంగా అన్నిరకాలుగా ఇన్స్‌పెక్టర్‌ గుండెని వీలయినంత కరిగిద్దామని ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నేను అప్పుడు ఆ సమయంలో ఎంత తీవ్రంగా జబ్బుపడి ఉండి లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేకపోయానో; పైగా రెన్యువల్ సమయానికి ఈ ఊళ్ళో లేనని; ఇంకా అదీ కాక తరగతి పరిక్షల్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకోడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఈ రెన్యువల్ సంగతి మరిచి పోయానని; ఈసారికి క్షమించి వదిలి పెడితే అమ్మతోడుగా రేపే వెళ్ళి లైసెన్స్ పునరుద్ధరించుకుంటానని… ఎంత చెప్పుకున్నా నా మాట ఒక్కటీ ఆయన వినిపించుకోవడం లేదు. ‘ముందు నీ పేరు, అడ్రస్ చెప్పరా’ అనే గదమాయింపు. వీలయినన్ని దొంగ పేర్లు తప్పుడు చిరునామాలు చెప్పడం కోసం బుర్ర వెతకసాగింది. ఏమీ లాభం లేదు. నాకు నా పేరు తప్ప వేరే ఏ పేరూ తట్టి చావట్లా. నోరు పెగుల్చుకుని ఆర్కే లక్ష్మణ్ అన్నా. ఇన్స్‌పెక్టర్‌ అదే పేరు తన పుస్తకంలో వ్రాసుకుని, రేపు ఉదయమే వచ్చి లైసెన్సింగ్ ఆఫీస్‌లో కనబడమని హూంకరించి వెనుతిరిగాడు. ఎంత త్వరగా అక్కడినుండి పారిపొదామా అని ఆత్రంగా సైకిల్ ఎక్కబోయిన నన్ను ఒక ప్రశ్న వెనకనుండి ఆపింది. ‘ఆర్కే లక్ష్మణ్ అంటే ఏ ఆర్కే లక్ష్మణ్? కొరవంజిలో బొమ్మలు వేసే లక్ష్మణ్ అయితే కాదు కదా?’ ఇన్స్‌పెక్టర్‌ అడిగాడు. ‘అవును సార్! అదే లక్ష్మణ్ నేను’. ఇన్స్‌పెక్టర్‌గారి మొహం చాటంతయ్యింది, తన నోట్‌బుక్‌లో సంఘవిద్రోహుల జాబితాలో ఉన్న నా పేరుని చెరిపేసి, ఆ పై నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఒక గట్టి షేక్ హేండ్ ఇచ్చి లాగి లాగి వదిలాడు. ‘నేను మీ అభిమానిని అబ్బాయ్! మీ వ్యంగ్య చిత్రాలు బావుంటాయి. అయితే నేను నీ అభిమానిని అయినప్పటికీ మీరు రేపు వెళ్ళి లైసెన్స్ రెన్యువల్ చేయించుకోండి. అది మీకే మంచిది’ అని మరోసారి నా భుజం తట్టి వెనక్కి తిరిగాడు. ఆహా! ఎలా అయితేనేం నేను గుర్తింపబడ్డాను. నేను వేసే కార్టూన్లు డబ్బు ఇవ్వడమే కాదు, చలానా రూపంలో డబ్బు పోకుండా కాపాడుతాయి కూడా. ఐ లవ్ కార్టూన్స్!”


ప్రపంచం గర్వించదగ్గ మహా చిత్రకారుడు నార్మన్ రాక్‌వెల్ తన ఆత్మకథలో ఒక దగ్గర తనకు ఎదురైన గుర్తింపు గురించి ఇలా వ్రాశారు, నేను చదివాను.

“1920లో గింబెల్స్ స్టొర్‌లో ఒక జత సాక్స్ కొన్నా. ‘వాటిని మీరు మా ఇంటి చిరునామాకు పంపగలరా?’ అని అక్కడ క్యాష్ కౌంటర్‌లో ఉన్న పెద్దమనిషిని వినమ్రంగా అడిగా.

‘తప్పకుండా. తవరి పేరు?’

‘వ్రాసుకోండి. నా పేరు నార్మన్ రాక్‌వెల్. ఇంటి నెంబరు…’ ఆయన తలెత్తి చూశాడు. చేతిలోని పెన్సిల్ బల్లమీద పెడుతూ ప్రశ్నార్థకంగా, ‘రాక్‌వెల్ అంటే సాటర్‌డే ఈవెనింగ్ పోస్ట్ పత్రిక కవర్ల చిత్రకారులు కాదు కదా?’

‘అవునండి, అదే రాక్‌వెల్ నేను.’

ఆ పెద్ద మనిషి సంబరంగా లేచి నిలబడ్డాడు. ‘దయచేసి ఒక్క క్షణం ఆగండి. ఈ విషయం మా ఆవిడకు చెబుతా, మిమ్మల్ని చూస్తే ఆవిడ బోల్డు థ్రిల్ అవుతుంది.’

నేను నీళ్ళు నములుతూ మర్యాద కోసమని ‘అబ్బే! అదేవుంది, నేనేముంది, నాదేవుంది, అదెంత, అయ్యో, అరెరే…’ అని నత్తులుకొడుతూ ఉన్నాగాని లోపల మాత్రం అమాంతం ఆ పెద్దమనిషిని కావిలించుకుని ఉన్నపళంగా అతన్ని నా ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించబుద్ధేసింది. ఆహా! ఈ ప్రపంచంలో నన్ను ఒకరు గుర్తించారు. అబ్బా! గుర్తింపు ఎంత అద్భుతమైన పదం, ఎంత అపూర్వమైన అనుభవం… వీరు ఎంత గొప్పవారు! గడియారం నడుమ నిండిన ఇనుప మరలు, స్ప్రింగులు, పళ్ళచక్రాల మధ్యని వజ్రం వంటి నన్ను గుర్తించారు. పైగా నన్ను ఇతని భార్యామణికి కూడా చూపిస్తాట్టా, ఇంకా ఏవన్నాడు! ఆవిడ నన్ను చూసి థ్రిల్లయిపోతుందట. అబ్బా, ఎంత బావుంది ఇలా జనం నన్ను చూసి థ్రిల్లయిపోతుంటే!

ఆ క్షణం నుండి నేను నిర్ణయించుకున్నా. ఇకనుండి నేనూ వీలయినంతగా ప్రజలను థ్రిల్‌కు గురిచేస్తాను. నన్ను చూసి వారు ఉద్రేకంతో ఊగిపోతుంటే, నన్నొక దైవాంశసంభూతునిలా పొగుడుతూ ఉంటే నా నరనరాన, రక్త కణకణాన పరవళ్ళు త్రొక్కే ఆ అనుభవాన్ని వారికి ఉదారంగా పంచుతా. ప్రపంచమా! కాచుకో. ఇదిగో నేను వస్తున్నా. సరే, కాస్త కారు ఈసారి మరో డిపార్ట్‌మెంటల్ స్టోర్ ముందు ఆపి, ఒక జత గ్లవ్స్ కొనుగోలు చేశా. కౌంటర్ దగ్గర కూచున్న జవ్వనితో, ‘దయచేసి వీటిని మీరు మా ఇంటికి పంపండి. కొనుగోలు చేయువారయిన నా పేరు నార్మన్ రాక్‌వెల్!’

‘సరే, డబ్బు చెల్లించండి.’

‘మీరు సరిగా విన్నట్టు లేదు. నా పేరు నార్మన్ రాక్‌వెల్.’

‘నేను సరిగానే విన్నా. మీ పేరు నార్మన్ రాక్‌వెల్, నా పేరు గస్సీ సింప్సన్. మీరే నేను చెప్పింది సరిగా వినలా, డబ్బు చెల్లించి మీ వివరాలు నమోదు చెయ్యమని.’

‘అది సరే అమ్మాయ్, కానీ నా పేరు నార్మన్…’

‘ఓయ్! నీకేమైనా పిచ్చా? చెప్పిందే ఎన్ని సార్లు చెబుతావయ్యా బాబూ… ముందు డబ్బులు ఇవ్వవయ్యా!’

నేను ఆ అమ్మాయికి డబ్బులు చెల్లించి, ఆ గ్లవ్స్ నా కోటు జేబులో వుంచుకుని, అక్కణ్ణుండి బయటపడ్డా. వీటిని నేను మోసుకెళ్తే పోలా, మళ్ళీ ఇంటికి పంపడం ఎందుకు? అయినా అది కాదుగా ప్రధానం. నేను నార్మన్ రాక్‌వెల్ అనేది కదా ఆ అమ్మాయి తెలుసుకోవాల్సింది.

కాసేపు వరకు నాకు దిగులుగా వుంది, భారంగా వుంది. అదీ కొద్దిసేపేలే! కారు వద్దకు చేరుకునేసరికి కొన్ని లెక్కలేసుకుని మనసుని సమతుల్య స్థితికి తెచ్చుకున్నా. అయినా ఇందులో విచారించాల్సింది ఏవుంది? ఒక స్టోరువాడికి నా పేరు తెలుసు, నేనేంటో తెలుసు. మరొకరికి తెలీదు. ఈ లెక్క ప్రకారం ఈ ప్రపంచంలో సగం మందికి నేను తెలుసును కిందే అనుకోవాలి. ఇంత పెద్ద ప్రపంచంలో సగం జనాభాకి నేను తెలిసి వుండటం కూడా చిన్న విషయం కాదు కదా! అలా అనుకుంటుంటే నా మనసుకు ఎంత థ్రిల్లింగ్‌గా అనిపించింది! ఎంత హాయిగా ఉంది! ఎంత సంతోషంగా ఉంది!”


దాదాపు పది సంవత్సరాల క్రితం ఒకానొక ఒక ఆఫీస్ లాంజ్‌లో కూచుని మా భాస్కర్ అనే ఫ్రెండ్‌తో తెలుగులో ఉన్న అతి గొప్ప చిత్రకారులు అనే లిస్ట్‌లో నేను చేర్చుకున్న వేటూరి విక్రమ్ గురించి ఉపన్యాసం ఇస్తున్నా. “తెలుసా కారికేచర్ ఎట్లా గీస్తాడో? తెలుసా డ్రై స్కెచ్ పెన్‌తో ఎలా స్టొరీ బోర్డింగ్‌కి షేడింగ్ చేస్తాడు? తెలుసా క్యారెక్టర్ డిజైనింగ్ ఎంత గొప్పగా ఊహిస్తాడో!…” ఇలా తన్మయత్వంతో చెబుతూనే ఉన్నా. నాకు కాస్త ఎడంగా మాకు సంబంధం లేని ఒక చక్కటి అమ్మాయి, తెల్లని ముక్కుమొహం గలది, కాస్త గోరింట పూతతో అవి ఇంకా ఎర్రబడినట్లు మారి, వాటికి కాసిన్ని కన్నీళ్ళు అద్దుకుని, ఇలా పలికింది: “మీరు చెబుతున్న ఆ విక్రమ్‌కి నే స్వయానా చెల్లెల్ని అండి. ఏ మాత్రం అనుకోకుండా ఇక్కడా ఏ మాత్రం తెలీని మీరెవరో మా అన్నయ్యని అంతలా పొగుడ్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది!” అలా అని చెప్తూ బహు ఆనందపడిపోయింది. ఈ చిన్న చిన్న మాటలన్నీ ఒక గుర్తింపు మాలలో గుదిగుచ్చిన పూలు. కొన్ని గుర్తింపులు అలా అనుకోకుండా ఎదురొచ్చి గురి తగిలితే భలే ముచ్చటగా ఉంటాయ్. నాది ఇదో కోరికగా ఉండేది. ఇట్లా రాతల్లో మాటల్లో పాటల్లో గీతల్లో పడి తిరిగే మనుషులకు ఎదురైన తొలి గుర్తింపులన్నీ ఒక కాలమ్‌గా నడిపి, ఆ పై ఒక పుస్తకంలా తేవచ్చు కదా అని.


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...