చిన్న పత్రిక

ఒక అమెరికన్ దంపతులు తమ జీవితాన్ని తమ స్వహస్తాలతో న్యూస్ ప్రింట్ కాగితంపై వ్రాసుకున్న భవిష్యత్తు ఈ కథ. వార్తల కొరకు వేట, ప్రకటనల కోసం పాట్లు, తీర్చవలసిన అప్పులు, చెల్లించవలసిన జీతాలు, అప్పుతచ్చులు-అచ్చుపుచ్చులు, వివాదగ్రస్తమైన వార్తలు, తలకిందులుగా ముద్రించబడే అడ్వర్‌టైజ్‌మెంట్లు… ఇటువంటి ఒక దిక్కుమాలిన పత్రిక సర్కులేషన్ పెంచడానికి బ్రహ్మాండమైన ఆలోచనలు వేసి ఘోరమైన నష్టాల్లోకి తెల్ల మొహం వేసుకోడం. ఇంకా చెమట చుక్కలు కన్నీటి చుక్కలకు తోడుగా చేస్తున్న పనిలో అకుఠింత విశ్వాసం, ఒకరి మొహం చూసి మరొకరు కమ్మని ప్రేమతో నవ్వుకోడం! ఇదంతా చివరకి వారికి విజయం వైపు వెళ్ళే దారి చూపుతుంది. విజయం అంటే మరేమీ కాదు; అది అయిదు సుగుణాల మేలురాశిట: కష్టపడి పనిచెయ్యడం, తెలివితేటలు, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, నిజాయితీ. అంతే! ఇంతే చాలు అని నేర్పిన గొప్ప వ్యక్తి వికాస మార్గం. ఇది తొంభైమూడు పేజీల పుస్తకం. అపుడే ఐపోయిందా అనే పెద్ద బెంగ పుట్టించే చిన్న నవలిక ఇది. జేన్ మెక్‌ఇల్వేన్ (Jane McIlvaine) అనే అమెరికన్ రచయిత్రి వ్రాసుకున్న స్వంత కథ ఇట్ హాపెన్స్ ఎవ్రీ థర్స్‌డే తెలుగులో అనువదించబడినది 1955లో శ్రీ యన్. ఆర్. చందూర్ ద్వారా (ప్రచురణ: ప్రతిమా బుక్స్ మదరాసు). ఈ పుస్తకం చదివి నాకు తోచిన విధంగా నాకు వచ్చిన విధంగా నాకు అర్థమయిన మార్గంగా మీతో పంచుకునే ప్రయత్నం ఇది.

1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలయింది, జపానువాడు పర్ల్ హార్బర్‌పై బాంబు వేసిన 1941 వరకు అమెరికా యుద్ధంలో పాల్గొనలేదు. జేన్‌కి, బాబ్‌కి వివాహం జరిగి అప్పటికి రెండు సంవత్సరాలే. 1941 ఒక వసంతకాల సాయంత్రం తన మనసులో మాట భార్యతో చెప్పాడు బాబ్: ‘యుద్దంలో పాల్గొనడానికి నేను నౌకాదళంలో చేరాలనుకుంటున్నాను.’ బేలయిపోయింది భార్య. ఎప్పుడెప్పుడు సైన్యంలో చేరకుండా తప్పించుకోడానికి ఏ సాకు దొరుకుతుందా అని వెదుక్కునే పెద్ద మనుషుల మధ్య బాబ్ ఒక వింత మనిషే! సైన్యంలో ఎంపికకు ముందు జరిగిన రెండు వైద్య పరీక్షల్లో అతను విఫలమయ్యాడు. హమ్మయ్య అనుకుని వెర్రి జేన్ ఆనందపడిపోతుంది కానీ రెండు సంవత్సరాలు కాపురం చేసినా మొగుడి ఘనమైన మనస్తత్వం ఆవిడకు అవగతం కాలేదు. సైన్యంలో చేరడానికి తనకు ఉన్న పలుకుబడి ఉపయోగించడం, తెలిసిన వాళ్ళందరినీ కలవడం చేశాడు సిఫారసు కోసం. ఈ చిన్న పుస్తకంలో చిత్రించబడిన బాబ్ వ్యక్తిత్వం చాలా బలమైనది, నిజాయితితో కూడినది. ఏ సిఫారసులు, బలవంతాల తోడ్పాటు లేకుండా నౌకా దళ రహస్య సమాచారశాఖలో చేరి యుద్ధరంగంలో కాలుపెడతాడు బాబ్.

పుస్తకంలో ఒక చోట జేన్ అంటుంది: ‘యుద్ధపు రోజుల్లో కాలం కదులుతున్నట్టే ఉండదు. రోజులెంతకీ గడిచేవి కాదు. వ్యక్తిగత జీవితానికి, జీవనానికి అర్థం పోయింది. ఇప్పుడు అంతా మొత్తంగా గంపగుత్తగా ఎన్ని ఓడలు మునిగాయి? ఎన్ని విమానాలు నేల కూలాయి? ఎన్ని వందల ప్రాణాలు పోయాయి? ఇదే లెఖ్ఖ!’

అక్కడ యుద్ధరంగంలో గుడాల్ కెనాల్ నుంచి బాబ్ ఒక ఉత్తరం వ్రాస్తాడు భార్యకు.

“ప్రియమైన జేన్, నాకు యవ్వనంలో ఒక పెద్దమనిషి చెప్పిన మాటని ఇవాళ నీతో పంచుకుంటున్నాను. ‘ఎన్ని అవాంతరాలు వచ్చినా ఫలానా పని చెయ్యక తప్పదని నీకు అనిపిస్తే నీ జీవితం, నీ విజయం ఆ మార్గంలో నీకై ఎదురుచూస్తున్నదన్నమాట. నువ్వు పయనించాల్సింది ఆ దారిలోనేనన్నమాట!’ నా కాలేజీ చదువు అయిపోయి, బయటికొచ్చాక నేను శిల్పకళ నేర్చుకుందామనుకున్నా. అది మూడేళ్ళపాటు చదవాలి. ఆ మూడేళ్ళు నన్ను నేను పోషించుకోవాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా శిల్పిని అవడం నా గమ్యమా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కాదని తోచింది. అప్పటికీ ఇప్పటికీ మధ్య చాలా సంవత్సరాలు గడిచాయి. ఎన్నో అనుభవాలు, ఎంతో జీవితం–కాలం వృధాగా దొర్లిపోయిందని నేనేం చింత పడట్లేదు. ఈ యుద్ధకాలంలో ఇక్కడ నిప్పులు కక్కుతున్న సముద్రం మీద ఉన్నప్పుడు ఎన్నో రాత్రిళ్ళు ఒకే కోరిక నన్ను వేధించేది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఆ ఆశయం కార్యరూపం దాల్చాలని అనిపించేది; అది ‘చిన్న పత్రిక’ ఒకటి నడపాలనే తీవ్రమైన కోరిక. ఈ ఆశయసాధనలో అది సఫలమయ్యే ప్రయాణంలో నువ్వు నాకు తోడుంటావా జేన్?”

‘ఓ యెస్!’ అద్భుతంగా ఉందీ ఆలోచన అనుకుంటుంది జేన్. యుద్ధం ముగిసి బాబ్ వెనక్కి వచ్చేయడం, తామిరువురు ఒక పత్రిక కొనెయ్యడం, దానికి వెంఠనే పులిట్జర్ ప్రయిజులు వచ్చేయడం, ఈ ఇర్వురు దంపతులు ఎంతో గొప్పవాళ్ళని పదిమంది పొగిడెయ్యడం, తాము ఎక్కడికి వెళ్ళినా జనం గుంపులు గుంపులుగా చుట్టెయ్యడం… ఆ ఊహల్లో మునిగిపోయి తామిరువురికీ పత్రికల సంగతి అసలేం తెలుసు అన్నది ఆలోచనే లేదు జేన్‌కి. ఇప్పటికిప్పుడు ఎవరైనా ఎదురుగా నిలబడి, మొహం బిగియబట్టి ‘పత్రిక అంటే నీ ఉద్దేశంలో ఏవిటి జేన్?’ అని అడిగితే ‘ఏవుంది? వార్తాపత్రిక అంటే గుమ్మం దగ్గర పాలసీసాతో పాటు పక్కన పడి ఉండే ఒక కాగితాల చుట్టే కదా!’ అని ధీమాగా, అమాయకంగా జవాబు ఇచ్చేయగలదు.

యుద్ధం ముగిసింది. బాబ్ ఇంటికి తిరిగి వచ్చేశాడు. యుద్ధకాలం వారిరువురి మధ్య తీసుకొచ్చిన దూరాన్ని పోగొట్టుకుని తమ రెండు జీవితాలకి మధ్య సమన్వయం ఏర్పరచుకునే యుద్ధానంతర సమయం అది. ఒక్క వారి దేశంలోనే కాదు ప్రపంచ నగరాలన్నిటిలోనూ, వేలూ లక్షలు కోట్లుగా వారి వంటి స్త్రీ పురుషులు ఇక ముందు ఏవిటి, ఏ విధంగా జీవితాలని దిద్దుకోవాలని చూస్తున్న సమయమది. ఒక సాయంకాలం బాబ్‌తో కలిసి నడుస్తూ–యుద్ధానంతర ప్రపంచంలోని పరిస్థితుల ప్రభావంతో తలకిందులయిన తమ జీవితాలని ఒక ఒరవడిలోకి తెచ్చుకోడమే కాదు; కేవలం మేమూ, మా జీవితమూ అని మాత్రమే అనుకుని తతిమా ప్రపంచంతో సంబంధం లేకుండా ముక్కు మూసుకుని కూచోకుండా ఒక చిన్న వార్తాపత్రిక నడపడం ద్వారా మేమిద్దరం ఇతరులతో కలిసిమెలిసి తిరుగుతూ తద్వారా ఉత్తమ పౌర ధర్మమేవిటో తెలిసికొని దానిని ఇతరులకు కూడా నేర్పగలుగుతామేమో! మానవులు ఉత్తమ పౌరులైనప్పుడే కదా ఈ యుద్ధాలు సమసిపోవడం! ఇలా ఆలోచిస్తుంది జేన్.

జేన్ మెక్‌ఇల్వేన్, బాబ్ మెక్‌ఇల్వేన్ అనే ఈ దంపతులిరువురు కలిసి మహానగరానికి బహు దూరంగా ఒక చిన్న గ్రామంలో పదిమందికి ప్రయోజనకారిగా ఒక చిన్న పత్రికను నడపడమనే ఒక కలని పుచ్చుకుని సాగించిన ప్రయాణపు విశేషాలే ఈ నవల. పట్నవాసపు జీవితం దాటుకుని అప్పటికే ఆరు పత్రికల సమాధి కట్టారని పేరు గల్గిన ‘డౌనింగ్ టౌన్’ అనే గ్రామంలో ‘ది ఆర్కయివ్’ అనే సార్థక నామార్థకకమైన పత్రికను కొంటారు ఈ దంపతులు. పత్రిక కొనడమంటే మరేం లేదు, అయిదువేల డాలర్లు పెట్టి వీరు కొన్నదల్లా సాలెగూళ్ళతో నిండి ఉన్న చిన్న గది అనబడు ఆఫీసు, రెండు చెడిపోయిన టైపు రైటర్లు, ఒక తాళం కప్ప, దాని చెవి. 1750 మంది చందాదారులు గల ఒక పట్టిక. ఈ పట్టికలో 60 మంది తప్ప మిగతావారు ఎప్పుడో చనిపోయారు. ఈ పత్రికని న్యూస్ స్టాండ్స్ ద్వారా అమ్మే కాపీలు వారానికి కేవలం అయిదు. జీవితం మొతాన్ని ఈ బ్రహ్మాండమైన కలకు అప్పజెప్పి అడుగుపెట్టిన ‘ది ఆర్కయివ్’ అనే ఈ ఆశల పునాదికి వీరే యజమానులు, వీరే సంపాదకులు, వీరే విలేఖరులు, వీరే ఆఫీస్ కుర్రవాళ్ళు, వీరే అడ్వర్‌టైజ్‌మెంట్ ఏజంట్లు, వీరే పత్రిక అచ్చు పనివారు, వీరే పత్రిక పంపిణీ సిబ్బంది, వీరే కార్యాలయ గుమాస్తాలు, చివరకి కార్యక్షేత్ర కావలి పనివారు కూడా వీరే.

నిజానికి మనుగడలో ఉండే చిన్న పత్రికలు ఈనాడూ ఆనాడూ ఏ నిజాల కోసం, సత్యాలకోసం అచ్చు కాబడవు, పెద్ద పత్రికలూ అంతేననుకోండి! వాటి గురి పెద్ద ప్రయోజనాలు నెరవేర్చుకోడంలో ఉంటుంది. చిన్న పత్రికలు కేవలం నాలుగు డబ్బులు గిట్టుబాటు కావడం కోసం మాత్రమే అచ్చవుతాయి. ఈ చిన్న పత్రికలవారికి అతి ముఖ్యంగా కావలసినవి అడ్వర్‌టైజ్‌మెంట్లు. పత్రిక యజమాని రేపు ప్రచురణ తేదీ అనేవరకు ఈ వ్యాపార ప్రకటనల కొరకు వేట సాగిస్తూనే ఉంటాడు. తన జేబు నిండటానికి, కాగితం నిండటానికి సరిపడ్డ ప్రకటనలు వచ్చాయనిపించిందా, ఇక అచ్చు మొదలవుతుంది. మూలన పడివున్న తతిమా పత్రికల్లోని వార్తలు నాలుగు తీసి కంపోజింగ్‌కు ఇచ్చి మొక్కుబడిగా కాగితాలు గుద్దించడం మొదలవుతుంది. ఇలాంటి పత్రికలు నిజంగా పత్రికల్లా ఉండవు–పొట్లాలు కట్టుకునే కాయితాల్లా ఉంటాయి. దీనివల్ల కేవలం పబ్లిషర్‌కు లాభం కానీ ప్రజలకు ఏ మాత్రం కాదు. చివరకి అచ్చు అయిన పత్రికలు చేరేది వ్యాపార ప్రకటనలు ఇచ్చిన ఆ నలుగురు లేదా ఎనిమిది మందికే. నిజానికి అచ్చు కాబడేది వారికి ఇవ్వాల్సిన ఉచిత కాపీల వరకు మాత్రమే!

ఈ దంపతులు ఇర్వురికి ఇంతవరకు అచ్చు ఆఫీసు అంటే ఏవిటో తెలీదు. పత్రికాఫీసు వేరు, ప్రెస్సు వేరు అని తెలీదు. తాము సేకరించిన సమాచారం, వార్తలు, ఛాయాచిత్రాలు, అడ్వర్‌టైజ్‌మెంట్లు… ఇవన్నీ అచ్చు కావడానికి ఒక ప్రెస్సు అద్దెకు తీసుకోవాలని లేదా కొనాలని; తాము రేయింబవళ్ళు చెమట చిందించినంత మాత్రాన పత్రిక బయటపడదని, దానికి బోలెడంతమంది దయాదాక్షిణ్యాలు, సహకారం అవసరమని ఇందులో దిగేవరకూ తెలుసుకోలేకపోయారు. పైన మేఘాల్లో ఎగిరే వారి కలల విమానం నేల మీదకు దిగింది. వారు దిగి వచ్చి మనుషుల్లో పడ్డారు.

యజమాని అనే మాట వట్టిదే. కనీసం పనివారికయినా ఒక సమయమూ వేళా ఉంటాయి. ఉదయం 10 గంటలనుంచి రాత్రి 2 వరకు టైప్ రైటర్ల ముందు కూచుని ఉండే వీరిని చూడండి! చెల్లించవలసిన బిల్లులు, వెళ్ళవలసిన మీటింగులు, చూడవలసిన కాగితాలు వీరిని భయపెడుతూ ఉంటాయి. ఇదిగో, ఇప్పుటికిప్పుడు వస్తాయి అని ఎదురుచూసిన మూడువందల రూపాయల ప్రింటింగ్ బిల్లు ఇవ్వవలసిన మనిషి అయిపూ ఆనవాలూ లేకుండా పారిపోయాడు. జాన్ హిక్స్ అనే పెద్ద మనిషికి విత్తనాల కేటలాగు ప్రింట్ చేసి ఇచ్చారు కానీ, అతని పెద్దబ్బాయి తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉండగా ప్రింటింగ్ బిల్లు ఎక్కడినుండి చెల్లించగలడు? వీరు మాత్రం ఆ పరిస్థితుల్లో అతన్ని ఎలా అడగగలరు? అయినా బాంక్‌లో అప్పుచేసి కొన్న ప్రింటింగ్ మెషిన్ తాలుకూ వాయిదా మర్నాడు కట్టి తీరాలని బకాయి కాగితం హెచ్చరిస్తుంది. అబ్బాయికి ఇవాళ ఖచ్చితంగా చెప్పుల జత కొని తీసుకొస్తామని చెప్పారు కానీ, ఆ విషయమే మర్చిపోయి ఈ అర్ధరాత్రి కూడా కార్యాలయానికే వేలాడుతూ ఉన్నారు. నెత్తి పైన వేలాడే దీపకాంతి కింద ఆ ఇరువురు. ‘ఒక చిన్న వార్తాపత్రిక నడపడం ద్వారా మేమిద్దరం ఇతరులతో కలిసిమెలిసి తిరుగుతూ తద్వారా ఉత్తమ పౌరధర్మమేవిటో తెలిసికొని, దానిని ఇతరులకు కూడా నేర్పగలుగుతామేమో’ అనే ఒకే ఒక ఉదాత్తమయిన భావన వారికేం మిగిల్చిందో అడుగుదామా? రచయిత్రి మాటల్లోనే వినండి.

“మంచీ చెడూ, ఆశ నిరాశా, కష్టం, సుఖం–అనేవి మానవులందరికీ అన్నిచోట్లా ఒకటే. ఈ పత్రిక పని అని మాత్రమే కాదు, వేరే ఏ వృత్తిలో మాత్రం భౌతిక కష్టనష్టనిష్టూరాలకు లోటేమి? కనీసం మేం మాకు ఇష్టమయిన పని చేస్తున్నాం. ఫలానా సంపాదకీయం బావుందని ఎవరో పాఠకుడు రాసినప్పుడూ, ఆర్కయివ్స్‌లో వచ్చిన వార్త వల్ల తమకు న్యాయం జరిగిందని సమస్యల్లో వున్న ఏదో కుటుంబం రాసినప్పుడూ, తన భార్య గయ్యాళితనానికి మందు ఏమిటని ఒక అమాయక సంసారి మా దగ్గిరకొచ్చినప్పుడూ, మా ఇంట్లో చేసుకున్నాం, మీరుకూడా రుచి చూడండి అని పొరుగు మనిషి మా కోసం ఏదో ఆప్యాయతతో తెచ్చిపెట్టినప్పుడూ, తన తోటలోని ఒక బుట్టెడు యాపిల్స్ తీసుకొచ్చి ఎవరో తోటమాలి మాకు పంచిపెట్టినప్పుడూ, పదేళ్ళ కుర్రవాడు రోజుకి పది సెంట్ల చొప్పున పచ్చగడ్డి కోస్తూ, అలా మిగులు డబ్బుతో ఆర్కయివ్ పత్రికను ఒక యేడాదిపాటు తన జబ్బుపడ్డ తల్లికి సమర్పిద్దామనుకున్నప్పుడూ; మా కళ్ళు చెమ్మగిల్లక మానతాయా? మేము చేస్తున్న పనిలో మాకు తృప్తి, సంతోషం ఎందుకుండవ్? దేవుడో, సీసాలో దయ్యమో ప్రత్యక్షమై ఈ పాతబడ్డ చిన్న పత్రికను వదిలిపెట్టండి, మిమ్మల్ని బెత్లెహామ్ స్టీలు కంపెనీ ప్రెసిడెంటును చేస్తా, న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్‌గా నియమిస్తా అన్నా, వొద్దు బాబు మాకు! ఇది సామాన్యంగా కనిపించే అసాధారణ విజయం. శిఖరం ఎక్కి మేము పరిచయం కావడం కాదు, ఉన్న చోటే మేమే శిఖరాలుగా మమ్మల్ని మలుచుకున్నాం. అప్పుడప్పుడూ వేసవి ఉక్కబోత శిఖరాలకు కూడా తప్పదు. అప్పుడు మేము మా పాత ఆర్కయివ్స్ పత్రికతో గాలి విసురుకుంటాం. ఎంత హాయి!”

ఈ నవల వచ్చి దాదాపు డెబ్భయ్ సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇందులో రచయిత్రి వెలిబుచ్చే కొన్ని మాటలు చదువుతూ ఉలిక్కిపడి చుట్టూ పరికిస్తే పౌరధర్మం అనేది, సమాజ ఆదర్శం అనేది, సాంఘిక సమభావం అనేవి ఎక్కడా కానరావడంలేదు; అంతా వ్యక్తిగత జీవిత పరమార్థమే! పౌరధర్మం, సాంఘిక సమభావం వంటి మాటలు కొన్ని ఉన్నాయని నాకు తెలిసిన ఏ మనుషుల సమూహాలూ నిఘంటువులూ నాకు నేర్పలేదు. మనం సమాజంలో ఒక భాగమని, ఇతరులతో కలిసిమెలిసి తిరగడం ద్వారా ఒకరి సహానుభూతి, సమస్యలని పంచుకోడం వల్ల మాత్రమే ఒక ఆదర్శపాత్రమయిన ప్రపంచాన్ని మన చుట్టూ నిర్మించగలమని తెలిసేట్టు ఇప్పుడు ఈ భావన కల్పిస్తున్నది కూడా. ఇన్నాళ్ళకయినా, ఇన్నేళ్ళ వయసుకయినా ఇటువంటి ఆదర్శాన్ని, ఉత్తమ భావనల్ని ఒక్క ఉత్తమ సాహిత్యం తప్పా మరేదయినా నేర్పగలదా? ఇటువంటి భావనలు కూడి మనం వ్యక్తులుగా, పాత్రికేయులుగా, తలిదండ్రులుగా, సమాజంలో ఒక భాగంగా మనకి మనం తెలుసుకోవలసినవి, నేర్చుకోవలసినవి కొన్ని బోలెడు ఈ పుస్తకంలో ఉన్నాయి. వాటిని గురించి ఒకటీ రెండూ ప్రస్తావనలు.

రకరకాల మనుషుల స్వభావాలు, వారి రకరకాల సమస్యలు తెలుసుకోవడం మనసుకి ఉత్తేజాన్ని ఇస్తుంది. అంతఃదృష్టిలో మనోవైశాల్యం పెరుగుతుంది. మనసు విశాలం అయ్యేకొద్దీ జీవితంలో ఎదురయ్యేది ఏ ఒక్కటీ చీకానిపించదు. అప్పుడే మనం నిజంగా జీవిస్తాం. ప్రతీదీ ఉత్సాహంతో తొణికిసలాడుతుంది. మన కోర్కెలు, మన ఆశలు ఒక్కొక్కప్పుడు మనం అనుకోని విధంగా, ఆశ్చర్యకరమైన ఫలితాలనిస్తాయి. ప్రజా జీవితానికి సంబంధించిన సమస్యలని పరిశీలించినపుడు, పై పై విషయాల దగ్గర మాత్రమే ఆగము. ‘అసలు విషయాల’ దగ్గరకెళ్ళి వాటిని తెరిచి చూస్తాం. ఆ ‘అసలు విషయాలే’ మానవ స్వభావాన్ని నడిపించేది.

కాస్త సహనం, కొంత ఓర్పు! ఈ గుణంతో మనం ఎదుటివారిని అర్థంచేసుకోవడం ఆరంభిస్తే, ఎదురుగా కనబడే మనిషి రక్తమాంసాల వెనుక అతని సమస్యల్ని, అతని నిజమైన అంతఃకరణని సానుభూతితో పరిశీలించడం సాధన చేస్తే? దానికన్నా ముందుగా మనల్ని మన అంతఃకరణని చూడ ప్రయత్నించడం, మనల్ని మనం అర్థంచేసుకోడం, ‘ఎందుకని ఇదంతా, ఏం కావాలని ఇలా అంతా?’ అని ప్రశ్నించుకోడం మొదలుపెడితే తప్ప మనోవైశాల్యం పెరగదు. ఒకసారి అటువంటిది మొదలయిందా, ఇంకేముంది? అంతా మహా శాంతి. అంతకన్నా కావాల్సింది మరేవుంది?

రాస్తూ ఉండగా ఈ వ్యాసం చదివిన మిత్రులు యాకూబ్ ఒక మాట అన్నారు: చందూర్ దంపతులు ఒంటిచేత్తో నడిపిన జగతి పత్రికకు ఈ నవలే స్పూర్తేమో! ఏమో! అదే నిజమయితే ఒక పుస్తకానికి అంతకన్నా పుణ్యమేమున్నది? రెండు జీవితాలకు ఇంతకు మించి అర్థం ఎక్కడున్నది? ఈ నవల ప్రతులు బహూశా ఎక్కడా అమ్మకానికి, ఆన్‌లైన్లో చదవటానికి కాని దొరికే అవకాశం ఉన్నట్టు కనిపించడంలేదు. కానీ ఈ నవల సినిమా మాత్రం యూట్యూబ్‌లో మీరు చూడవచ్చు.


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...