నో ఎగ్జిట్.2

“ఇది వేరే లోకం. అంతా అక్కడిలాగే ఉంటుంది. ఒకటే తేడా. మనిషి అభ్యున్నతికీ, సమాజ శ్రేయస్సుకీ సాహిత్యమొక్కటే మార్గమని నమ్ముతాం. రచయితలూ, కవులదే ఆ బాధ్యత.”

“ముందు పాఠకులు చదవాలి గదా!”

నవ్వాడు అతను. “మా నమ్మకాన్ని పాటిస్తాం. ఇక్కడ శిక్షలేమీ ఉండవు, చేసిన తప్పు వాళ్ళే దిద్దుకునేందుకు తగిన పుస్తకాలు చదివిస్తాం.” ఆగి అన్నాడు “రోగులకి మందులు ప్రిస్క్రైబ్ చేసినట్టు. వాళ్ళు ప్రభుత్వాధికారులయినా, నాయకులయినా, హంతకులయినా ఎవరికయినా అంతే!”

తర్వాత ప్రశ్న అడక్కుండానే చెప్పాడు. “చదవడాన్ని మోనిటర్ చేస్తాం. పేజీలు తిప్పేసి తప్పించుకోలేరు. చిన్నప్పట్నుంచే మొదలు పెడతాం. ముందు అప్‍డేట్ చేసిన నీతి కథలు, పాటలూ చిన్నప్పటినుంచే ఒక సిలబస్ ప్రకారం నేర్పుతాం.”

“అయితే నేనెందుకు ఇక్కడ?”

“మీలాంటి రచయితలు ఇంకా కావాలి. మీ రాతలు చదివి మనిషి ఉన్నతుడు కావాలి, దయ, సహనం, క్షమ, వినయం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధీ న్యాయబుద్ధీ వంటి సద్గుణాలు నింపుకుని. అణచివేతలు, దోపిడి, హింసలు, మోసాలు, అసమానతలూ ఆధిక్యభావనలూ మాయమై దుఃఖం లేని సమసమాజం ఏర్పడాలి. ఎవరిని ఎవరూ ద్వేషించని, భాష, కుల, మత, ప్రాంత, ధన, అధికార, శారీరక కారణాల వల్ల ఎవరినీ కించపరచని, అవమానించని, ద్వేషించని సమాజం. మంచి సాహిత్యం ద్వారా మనిషి ఉన్నతుడై, సమసమాజం సిద్ధిస్తుందని నమ్ముతారు కదా మీరు?”

“అవును!”

“ఇక్కడ మీ పని అదే! మీరు చేయవలసినదల్లా రాయడం. చదివించడం మా బాధ్యత. మీకు కావలసినవన్నీ ఏ లోటూ లేకుండా సమకూరుస్తాం! ఇది మీరు కంటున్న కలే! ఇది రచయితల స్వర్గం!”

“ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? నేను తిరిగి వెళ్ళాలంటే?”

“మీరు రచయితలు, పైగా ఎన్నో పుస్తకాలు చదివి ఉంటారు! ఎలా తీసుకొచ్చి ఉంటామో ఊహించుకోలేరా! మీరు తిరిగి వెళ్ళాలని ఎందుకనుకుంటారు? అక్కడ మిమ్మల్ని ఎవరూ మిస్ కారు. ఇంత దుఃఖాన్ని మాపగల అవకాశాన్ని, బాధ్యతనూ వదులుకుని ఎలా వెళ్ళగలరు?”

కొంచెం ఆగి చెప్పాడు. “ఇప్పుడు మీకు అన్ని సెక్షన్లూ చూపించి మిగతా రచయితల్ని పరిచయం చేస్తాను. మీకేది ఇష్టమయితే అది రాయొచ్చు. అయితే ఒకటి చెప్పడం మరిచాను. మీ పేరు ఏ పుస్తకం మీదా ఉండదు.”

“అదేమిటి?”

“మన దృష్టి మనం మార్చవలసిన దానిమీదే ఉండాలి. మనకు కావలసిన ఫలితం అందడాన్ని మించిన సార్థకత ఏముంది? అప్పుడే కదా తృప్తి!”


“ఇదే సెంట్రల్ లైబ్రరీ. మనిషి ఉన్నతికి, సమాజ శ్రేయస్సుకూ పనికిరాని పుస్తకాలు తప్పితే ఇక్కడ లేని పుస్తకం లేదు. పాతకాలపు వాటినుంచీ ఇప్పుడు ప్రత్యేకంగా రాస్తున్న వాటిదాకా దొరుకుతాయి. సిస్టమ్‌లో అన్నిటికీ టాగ్స్ ఉంటాయి. కరప్షన్, డొమెస్టిక్ అబ్యూజ్, సూయిసైడ్, ఎక్స్‌ప్లాయిటేషన్, ప్రెజుడిస్, డిస్క్రిమినేషన్ ఇట్లాంటివన్నీ ఈ వైపునా; నీతికథలు, న్యాయవర్తన, ధార్మిక జీవనమూ ఇట్లాంటివన్నీ ఆ వైపునా ఉన్నాయి. ఇక్కడే కూచుని చదవడానికి వీలుగా ఈ గదులన్నీ ఉన్నాయి. మరీ కరుడు కట్టిన నేరస్తులయితే ఇక్కడే కూచుని చదవాలి.”

“ఎన్ని పుస్తకాలు చదివించాలో ఎలా తెలుస్తుంది?”

“పుస్తకం ఏ ప్రభావం చూపుతుందో మోనిటర్ చేస్తుంటాం. అదే తప్పు మళ్ళీ చేస్తే డోస్ పెంచుకుంటూ పోవడమే!”

“ఎన్ని పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు! మేం ఇంకా రాయవలసిన అవసరం ఉందా?”

“వీటి ప్రభావం తాత్కాలికంగా ఉంటుంది. పుస్తకం చదివిన కాసేపటికి దారిలో బిచ్చగత్తెని చూసి కంటనీరు పెట్టుకుని డబ్బు దానం చేసినవాడు మరుసటిరోజు మొహం పక్కకు తిప్పుకుపోతున్నాడు. అనుకున్న ఫలితాలు సాధించడంలో ఒక అడుగూ ముందుకు పడుతున్నట్టు లేదు. ఇంకా మనసుకు నాటుకునేలా బలమైన సాహిత్యం కావాలి.”


“నేనేం చేశాను నాచేత పుస్తకాలు చదివించడానికి? అయినా నా అంతట నేనే చాలా చదువుతూ ఉంటాను.”

“ఈ పుస్తకం మీరు చదివిన పుస్తకాల లిస్ట్‌లో ఉంది. చదివిన గుర్తుందా?”

“పోయిన నెలే చదివాను. నాకు బాగా నచ్చింది. భర్త వేధింపులు, అవమానాలూ తిట్లూ. బయటకు కనపడని హింస. చాలా చోట్ల ఏడుపు కూడా వచ్చింది. మా స్నేహితురాలొకామెకు దాదాపు అలాగే జరుగుతూంది. అతని చేత దీన్ని చదివించాలని కూడా చెప్పాను.”

“ఇదంతా మీ కథే! మిమ్మల్ని చూసి రాసిందే. మేం చెప్పకముందే దీన్ని చదివారని గమనించాం. అయినా మీలో ఏ మార్పూ లేదు.”

“నాకూ ఆ దుర్మార్గుడికీ పోలికేమిటి? నేనెందుకలా చేస్తాను? ఎప్పుడన్నా కోపమొచ్చినప్పుడు విసుక్కుని ఉంటానేమో!”

“ఆత్మ పరిశీలన మీద ఈ రెండు పుస్తకాలు కొత్తవి వచ్చాయి. చదవండి. ఆ తర్వాత ఈ రెండు పుస్తకాలు కూడా.”


“ఈ పుస్తకాలు రాసింది మీరే కదా?”

“అవును నేనే! ఎంతమంది చదివారు ఇప్పటిదాకా? చదివిన వాళ్ళ మీద బాగా పనిచేస్తూందా?”

“పుస్తకం మీద రచయితల పేర్లు వేయమని ముందే చెప్పాం కదా? ప్రతి అధ్యాయంలో మొదటి అక్షరం కలిపితే మీ పేరు వచ్చేటట్టు రాస్తున్నారు కదా?”

“హహ్హహ్హ! కనిపెట్టేశారా? ఏం లేదు అదో చమత్కారం! అంతే!”

“వినయశీలత మీద ఇదొకటీ, అహంకారం వల్ల కలిగే అనర్థాల మీద ఇదొకటీ చదవండి!”


“అభం శుభం తెలియని పసిపిల్లని మాయమాటలు చెప్పి లొంగదీసుకోవాలని చూశారు కదా?”

తల దించుకున్నాడు.

“మీరు రచయిత అయ్యుండి ఇలా చేయడానికి మనసెలా ఒప్పింది?”

“మేం మనుషులం కాదా?”

“ఇది చదవండి. చిన్నప్పుడే సెక్సువల్ అబ్యూజ్‌కు గురయిన పాప పెద్దయ్యాకా దాన్నుంచి బయటపడలేక అనుభవించిన చిత్రవధ గురించి తెలుసుకుంటారు.”

“ఇది నేను రాసిందే.” ఆగి చెప్పాడు. “మంచేదో చెడేదో తెలియక ఇవన్నీ చేస్తున్నారా ఎవరయినా? అన్నీ క్షుణ్ణంగా ఆలోచించుకుని చేస్తామా? బలహీనతలుంటాయి. తక్షణ ప్రతిస్పందనలు, క్షణికోద్రేకాలూ ఉంటాయి. లోపల్లోపల కొన్నాళ్ళు చింతిస్తాం, సిగ్గుపడతాం. మనతో మనకే ఎడతెగని ఘర్షణ. బయటపడలేని నిస్సహాయత. ఇక సమర్థించుకోవడానికి దారులు వెతుకుతాం.”

ఇంకా చెప్పాడు. “ఈసారి దీని మీదే రాస్తాను. అది నన్ను ఉన్నతంగా మలుస్తుందా? కనీసం ఒక భ్రమగా అయినా?”


“ఎన్ని రాసుంటారు మీరు?”

“అబ్బో వందలు రాసి ఉంటాను. ఇన్ని అన్యాయాలు, ఇంత దుఃఖం! మనసు కలచినప్పుడల్లా రాశాను. ఇంకా మళ్ళీ మళ్ళీ వాటి గురించే రాస్తున్నాను.”

“మళ్ళీ మళ్ళీ ఎందుకు?”

“ఏదో ఆశ! ఒక చక్కటి జ్ఞాపకముంది. నా పుస్తకం ఒకమ్మాయిని ఆత్మహత్య చేసుకోకుండా ఆపిందని విన్నాను. ఇన్ని పుస్తకాలకు ఆ ఒక్క ప్రయోజనం. చాలుతుందా, ఏమో! వాళ్ళను ఏడ్పించేలా రాయగలం కానీ వాళ్ళు మరొకరిని ఏడిపించకుండా చేయలేం!”

“ఇంకెవరి పుస్తకమో చదివి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదంటే అంతే సంతోషం కలిగేదా?”

కాస్త ఆగి అడిగాడు. “సిసిఫస్ తెలుసా?”

“తెలుసు.”

“మనమంతా సిసిఫస్‌లమే. ఇది రచయితల స్వర్గం అని చెప్పారా?”

“అవును.”

“అప్పట్నుంచీ అలాగే చెప్తున్నారు. ఇది నరకం!”

“ఎప్పుడూ తిరిగి వెళ్ళాలనుకోలేదా?”

“తిరిగి ఎలా వెళ్ళాలో తెలియదు. తెలిసినా ఎలా వెళ్ళగలం ఇదంతా వదిలేసి. మనం సిసిఫస్‌లమని చెప్పాగా! ప్రయత్నిస్తూనే ఉండాలి! ఇది మనం కంటూన్న కలే కదా!”

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...