చివరి వాల్‌పోస్టర్…

విన్న పేరు గద్దర్, పాట అయితే అసలే తెలీదు. అయినా మా ఊరి ఆత్మకూర్ బస్టాండ్ గోడలపైకి, ఆర్టీసి బస్టాండ్ కాంపౌండ్ వాల్ మీదికి వచ్చి చేరింది. నల్లని పోస్టర్‌పై కసిరి దూకుతున్నట్టున్న అక్షరాలు ఆర్టిస్ట్ మోహన్‌వి. ఆ అక్షరాల మహాగ్రహం చూసి గద్దర్‌పై పేలిన తూటాపై నిరసన పుట్టింది నా రాయలసీమ బ్రతుకులో. అది ఆర్ట్ చేసిన పని. ఏ పల్లవి ఫాంట్ నుండో, అనుపమ బోల్డ్ నుండో ప్రేమ, కరుణ, దుఃఖం, కసి, క్రోధం జనియించవురా కంప్యూటర్ డబ్బా డిజైనుల్లారా! ఆకాశం ఊదే మెరుపుదెబ్బ వంటి అక్షరాలు కాగితంపై ఉరిమి చూడాలంటే ఆర్టిస్ట్ కావాలి. అది మోహన్ మాత్రమే అయి ఉండాలి. ఆ దారి చిత్తప్రసాద్ మాత్రమే వేసినది అయి ఉండాలి.

అలా గోడమీది అచ్చు బొమ్మలు మాత్రమే చూసే నా బ్రతుకులో నెల తిరగ్గానే ఆ బొమ్మలేసే చేతిని, ఆ బొమ్మలు పుట్టే సింగల్ డెమీ, డబల్ డెమీ తెల్లకాగితాన్ని, రోట్రింగ్ పాయింట్ నిబ్బుని, రన్నింగ్ మేటర్ చెక్కే లక్సోర్ స్కెచ్ పెన్నుని, కొండచిలువలా సరసర పాకే అక్షరాల జైనా నేచురల్ హెయిర్ బ్రష్ నడకని… నేను, నావంటి అనేక నోరెళ్ళుకపెట్టు జాతి వాళ్ళం అలా చూస్తూనే ఉండేవాళ్ళం.

ఒకే పేద్ద కాగితం, అదే పొడవాటి వేళ్ళ చిత్రకళా విన్యాసం. నో దిద్దుబాట్లు, నో అచ్చుతప్పులు, నో కొట్టివేతలు… అలా చూస్తుండగానే నరాల బిగువూ, కరాల సత్తువ, కణకణ మండే, గలగల తొణికే అనేక కన్నులు, లోహ రాక్షసుల పదఘట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్ళూ, కష్టం చాలక కడుపుమంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళూ, చెరసాలలలో చిక్కేవాళ్ళూ… అనేకులింకా అభాగ్యులంతా, అనాథలంతా, అశాంతులంతా ఆ కాగితంపైనుంచి ఎర్ర ఝండాలపైకి, నీలి పోస్టర్‌లపైకి, బిగిసిన పిడికిళ్ళతో కదనుతొక్కేవారు.

మోహన్‌కు ముందున్న కళ తాలూకు ఆ వంపులు, సొంపులు, వాలుకళ్ళు, పారాణి కాళ్ళు తప్ప ఏవీ ఎరగని ఆ సెక్స్ సింబల్ తెలుగు బొమ్మాయి నడుముకు చెంగు బిగించి పొలికేక నేర్పించింది, కళ్ళు ఉరమడం దిద్దింది మోహన్ కుంచె. తాడిత పీడిత కర్షక కార్మిక జనానికి రూపం రంగు, పరుగు, బిగింపు, పోరాటం అద్దింది మోహన్ సిరాబుడ్డి. ఎర్ర రంగును, నలుపు ఇంకును ఎక్కడ వాడాలో, కక్కే నిప్పుని కుంచె మొనకు ఆనించి అక్షరాల మెలికని, కొడవలి చివర కాగడాని ఎలా వెలిగించాలో తెలిపింది ఈ పోరాట చిత్రకళా శిఖరంపై ఎర్ర నెలవంకే!

ఈ మేడే రోజున, ఇంతకు మునుపు మేడే రోజున అంతా అలానే వుంది. ఇక ముందు కూడా ఇలానే వుండవచ్చు. కడుపు కాలడం, కన్నెర్ర చేయడం, పేదవాడి కోపం, పేలుతున్న వీపు… అంతా అలానే ఉంది. కార్మికుడు, కర్షకుడు, మోటర్ మెకానిక్, మిల్లు కూలి, చీకటి పాట, పేలిన తూటా… అన్నీ అలానే ఉన్నై. రెపరెపల ఎర్ర ఝండా, నినాదాల పోస్టర్ మాత్రం అనాథలయిపోయాయి. ఈ జాతికి ఉండిన ఎర్ర పోస్టర్ తాలూకు ఒకే ఒక చిత్ర కళాకారుడు లేడు. ఇది అవశేషం, అపురూపం, దొరకని దృశ్యం… అంతరించిపోయిన గత మూడున్నర దశాబ్దాల పోరాట బొమ్మ చరిత్ర. ఆ ఎరుక మీకూ, దానికీ కూడా లేదు. అది మీకు తెలుసా? ఈ సంగతి, విరిగిన పాళీకి తెలుసు, తడి వెలసిన కుంచెకు తెలుసు, నాకు తెలుసు.


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...