అబ్బురపోతూ బొమ్మ!

స్తంభాల మధ్య చెక్క నెమళ్ళు కాపలాగా ఉన్నాయి. ద్వారాల కమానులని, కిటికీలను ఎంతో నైపుణ్యంగా చెక్కారు. వాటిపైని సూక్ష్మమైన సున్నితమైన మెలికలు గొప్ప పనితనం వ్యక్తం చేస్తున్నాయి. మిరయా మొహంలో ఆశ్చర్యంతో కూడిన అబ్బురపాటు. ఆ అమ్మాయి ద్వారాల పక్కన ఉన్న ఆ డిజైన్లను తన బొమ్మల పుస్తకంలో నకలు దింపుకోవాలని ప్రయత్నిస్తుంది. చూసి వాటిని గీయడం సరిగా కుదరకపోతే రబ్బరు పెట్టి తుడిచి మళ్ళీ పదే పదే గీయ ప్రయత్నించడం, ఇబ్బంది పడ్డం చూస్తున్నాను. పెన్సిల్ ముక్క ఒక కోణం నుండి మరో కోణానికి తిరుగుతూ ఆగుతూ సుతారంగా మెలికలు పోతూ సాగుతుంది గీత. గీస్తూ గీస్తూ ఆ అమ్మాయి కొన్నిసార్లు చిరునవ్వు నవ్వింది, కొన్నిసార్లు కనుబొమలు మడిచింది, ఆగి ఆగి తన బొమ్మని అబ్బురంగా, అపనమ్మకంగా చూసుకుంటుంది. నాకు ఎందుకీ వృథాప్రయాస అనిపించింది. “అంత కష్టంగా ఉంటే ఎందుకంత శ్రమ పడ్డం? హాయిగా ఫోటోలు తీసుకోవచ్చు కదా” అన్నాను మిరయాతో.

“తీయడం వేరు, వ్రాయడం వేరు. నేను ఈ కళని అనుభవించాలని, ఆ కళాకారుడి ఆలోచనా ప్రక్రియని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఆయన ఈ కళాసృష్టిని ఎలా ఊహించి ఉంటారు, ఊహించినదానిని ఈ చెక్కలో వేల సంవత్సరాల తర్వాత కూడా నిలిచి ఉండేలా ఎలా ప్రాణ ప్రతిష్ట చేయగలిగి, ఉంచగలిగిన ఆ ఆలోచనకు, ఆ పనితనం లోని సునిశితత్వానికి సగౌరవకంగా ఈ స్కెచ్ వేసుకుంటున్నాను. సెకను కాలపు ఒక క్లిక్ ద్వారా కాకుండా నా జీవితం లోని కొంత సమయాన్ని ఈ కళా ఖండం ముందు నిలబడి మిషన్ల ద్వారా కాక నా ప్రాణపూరకమైన ఇంద్రియాల ద్వారా మాత్రమే ఈ చిత్రాన్ని నా హృదయంలో, కళ్ళల్లో, మనసులో, ఈ స్కెచ్ బుక్‌లో నింపుకుంటాను, అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాను, నా ఈ చర్య ద్వారా శతాబ్దాల వెనుకటి ఆ చిత్రకారుడి పట్ల నా గౌరవం, అభివాదం తెలియచేసుకుంటాను” అంది మిరయా. అచ్చు ఇల్లాగే కాకపోయినా దాదాపుగా ఇలానే ఉంటుంది. సవీశర్మ వ్రాసిన ఒక నవలలో ఒకచోట.

సవీశర్మ చెప్పినంతటి హృదయ సంస్కారం నాకు తెలియక పోవచ్చు, అయినా నాకు బొమ్మ అంటే ఎంతో ప్రేమ ఆరాధన. బొమ్మ అంటే సభ్యసమాజానికి తెలిసున్న, తెలివైన, చక్కని చిక్కని రంగుల బొమ్మ కాదు, పెన్నీలు, పేరు తెచ్చి ఇచ్చి నిలపెట్టే బొమ్మ కాదు నాకు బొమ్మ. బొమ్మ అంటే బొమ్మ అంతే! నడక తెలిసి, దారి పట్టి గమ్యం వైపుకు సాగిన లక్ష్యం కాదు నా బొమ్మ. నేనూనూ డ్రాయింగ్ టూ డ్రాయింగ్‌ని గీయ ప్రయత్నం చేస్తుంటాను. మామూలు కళాకారుల దగ్గరి నుండి మహా కళాస్రష్టల దాకా వారు తమ బొమ్మలో ఏం చెబుతున్నారా అని ఆత్మనంతా చెవిగా మార్చి నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య మహాచిత్రకారులు అంట్యాకుల పైడిరాజుగారి బొమ్మలని చూస్తున్నా, ఆ ఆకారం, ఆ కూర్పు, ఆ చిక్కదనం, ఆ భావన, ఆ జానపదం!

ఎంత గొప్ప బొమ్మలు ఆయనవి! ఎంతగా ఆలోచన, ఎంతగా పరిశీలన, సౌందర్య దృష్టి ఉంటే తప్పా, ఆ ఆలోచించిన దానిని దృశ్యరూపం ఇవ్వగలిగిన నైపుణ్యం ఉంటే తప్పా, ఒక మామూలు తెల్ల కాగితమో కాన్వాస్ గుడ్డో ఈ రూపం దాలుస్తాయి? ఇక్కడ రెండే రెండు బొమ్మల గురించి మీతో పంచుకుంటాను. వరికోత, గ్రామకాంత ముగ్గు పెట్టుట – అనే ఈ రెండు బొమ్మలు చూడండి, ఇంతకు తప్పా మరి మంచి క్వాలిటీ నాకు దొరకలేదు. ఇది చాలులే అని కూడా అనిపించింది, దీని అందానికే ఇంత కన్ను చెదిరిపోయిందే మరి మంచి నాణ్యమైన బొమ్మ కంటపడితే ఆ బొమ్మలో మునిగి చావడం తప్పా ఇక తేలడం అనేది జరగడం ఎప్పటికని? కాబట్టి అంతా మన మంచికే.

మునుపు మీరు ఎన్నని బొమ్మల్లో ఇలా ముగ్గులు వేసే, వరి కంకి కోసే ఆడవాళ్ళను చూసి ఉంటారు? శరీరధర్మ శాస్ట్రం అని, వస్త్ర లక్షణం అని ఒకటి ఉంటుంది. ప్రతి అణువులో ఉన్న దానికి తగ్గ ధర్మాన్ని ఎంచి వొలికించిన బొమ్మలు ఇక్కడ ఉన్నాయి. ఆ వరికోత ఆవిడను చూడండి. ఆ జానపద శైలి, ఆవిడ కట్టుకున్న చీర పొడవు, దోపుకున్న చెంగు ఎక్కడి దాకా వచ్చి ఆగిపోయిందో, కాయకష్టం చేసుకునేవాళ్ళు కిలోమీటర్ల కొద్ది వస్త్రాలు ధరించి తిరగరు కదా, కాళ్ళు మునిగి పోయేలా చీర ఉండటానికి. పనీ పాటా చేసుకునే ఆవిడ పొత్తి కడుపు, వంగిన నడుమూ ఎంత బలంగా, అనాయాసంగా ఉన్నాయో గమనించండి. ఆ పిక్కలు సన్నగా ధృఢంగా, కడ్డీల్లా కొవ్వు లేకుండా చలాకీగా, అసలు వంగి నిలబడిన ఆ రెండు కాళ్ళ తాలూకు బ్యాలెన్స్. ఆ గరిమనాభి ఎంతమంది బొమ్మల్లో వచ్చేనూ చచ్చేనూ? బరువంతా కిందికి జారిన ఆవిడ రొమ్ము! చంక దగ్గర చిన్న వంపుతో మిగతా అంతా జాకెట్టు తాలూకు గుండ్రమే కానీ రాతి శిల్పం చెక్కినట్లో లేదా గుండెల్లో బెలూను ఊదినట్లో మూడు వందల అరవై డిగ్రీల్లో ఎటు తిరిగినా కుదురు చెడకుండా నిండినట్లు చాలా మంది గీసే సిలికాన్ రొమ్ము కాదది. ప్రాంతీయ అనాటమీ అనేది ఒకటుంటుందని ఎరిగిన కుంచెతనం. ఈ బొమ్మ నకలు గీస్తొ గీస్తొ నేను ఎంత అబ్బురపోతూ ఆనందపడ్డానో! ఆనందపడుతూ ఆనందపడుతూ ధన్యుణ్ణయ్యానో! ఆ గ్రామకాంత బొమ్మా అంతే! ఎంత బ్యాలెన్స్! ఎంత వాలు, ఏమి విరుపు!

ముగ్గు దిద్దటానికి సాక్షాత్తూ ముచ్చటే దిగి వచ్చినట్లుగా లేదూ ఈ బొమ్మ! చూడ్డానికి, సంతోషపడ్డానికి, నేర్చుకోడానికి ఎంత ఇస్తుంది ఈ ప్రపంచం!


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...