కొన్ని కథలు వినిపిస్తా, వింటావా?

రేఖాజ్యోతిగారని ఒక పేరుగల కవయిత్రి ఉన్నారు. ఆవిడకు బొమ్మలు వేయడం పట్ల కూడా ఆసక్తి. ఏ సందర్భవశాత్తో తన బొమ్మల గురించి ఇలా అన్నారు: ‘నాకు బొమ్మలు వేయడం రాదు, వేయకుండా ఉండడం కూడా రాదు’ అని. ఇదిగో నేనీ రోజున పెద్ద కథకురాలు సత్యవతిగారి కథలు చదువుతూ చదువుతూ ఉండి అచ్చం ఆ రేఖాజ్యోతిగారి వలెనే నాకు కూడా సత్యవతిగారి కథల గురించి ఏమైనా వ్రాయాలనుకోడం చాలా పెద్ద చాతవని పని. అలా అని వ్రాయకుండా ఉండటం కూడా చాతవని పనే. అయినా ఇంతకాలంగా ఈ పెద్ద బ్రతుకే బ్రతుకుతున్నానట! ఈ కాలమంతా జీవితాన్ని ఈడ్చా కదా! అలాగే ఈ వ్రాయడం కూడా తప్పక ప్రయత్నిస్తాను.

నా పక్కన రూములో మా అబ్బాయి వీడియో గేమ్ ఆడుతూ ఉన్నాడు. అయినా కానీ ‘నాన్నా’ అని పిలవగానే ‘ఇదిగోనబ్బా’ అంటూ వచ్చి పక్కన ఆనుకున్నాడు. ఈ పిల్లవాడు పొత్తిళ్ళలో ఉన్నప్పుడు వాడి అమ్మ మా ఇద్దరి కడుపు నింపేందుకు టీచరమ్మ పనికి వెడితే ఉద్యోగం సద్యోగం లేని నేను ఆ పిల్లాడ్ని వళ్ళో వేసుకుని మహాప్రస్థానం వినిపిస్తూ ‘జో’ కొట్టేవాణ్ణి. ఇప్పుడు చాలా ఏళ్ళ తరువాత ఈ రోజు మళ్ళీ ఆ పిల్లాడిని నన్ను ఆనించుకుని ‘కొన్ని కథలు వినిపిస్తా, వింటావా?’ అంటే, వాడు గడ్డం కింద చేతులుంచుకుని నాకు ‘ఊ’కొట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇక్కడ వ్రాస్తూ వస్తున్నదల్లా నాతో నేను చెప్పుకుంటున్నానో లేదా మా అబ్బాయితో చెబుతున్నానో తెలీదు. కానీ ‘వినదగునెవ్వరు చెప్పిన…’ అనుకుని వినమనే నా మనవి.

“కానీ ఒరే నాన్నా! ఇదంతా ఎలా ఉంటుందీ అంటే మన మగ బుద్ధికి, మగ శరీరానికి, మగ అలవాట్లకి, మగ ఉద్రేకానికి… ఆడవాళ్ళ ఆలోచన, వారి బాధలు, వారి లోతు, ఆ లోతులో మనం పొడిబార్చిన ఆ మనసులు… ఇవి ఎన్నటికీ మనకు అందేవి కావు! తప్పు లేదు. అది భగవంతుడు మనకు పెట్టిన బుర్రలోనే ఒక తేడా ఉంటుంది. అలా దేవుడుగారు చేసిన తప్పులని ఒప్పుగావిస్తూ గొప్ప దయతో ఇదిగో దేవుడికన్నా గొప్పవారొకరు చేసిన ఇటువంటి సాహిత్యం ఉన్న ఒక పుస్తకం మన చేతుల్లోకి వాలి మనల్ని బోల్డంత కరుణతో చూస్తుంది. ఇది మన, మగ అనే మన దరిద్రాన్నంతా క్షమించి, మన తప్పొప్పులు సంస్కరించేందుకు తనకు తానుగా మన దగ్గరికి వచ్చి మనల్ని పరిశుద్ధులు గావించే గ్రంథం. మనల్ని మనుషులుగా పుట్టించాలన్నా అలా పుట్టిన మనల్ని మళ్ళీ ఒక మనిషిగా నిలబెట్టాలన్నా స్త్రీలే దిగి రావాలి. చాలామంది అనుకున్నట్లుగా, నమ్మినట్లుగా, నమ్మిస్తున్నట్లుగా ఈ సత్యవతి కథలు ఏమాత్రం వట్టి ఆడవాళ్ళ కథలు మాత్రమే కావు, అంతకన్నా ఎక్కువగా ఇవి మగవారి కోసం వ్రాసిన కథలు కూడా. కథలు వ్రాసి, తీసి, చెప్పి, ఆడవాళ్ళకు కొత్తగా నేర్పేందుకు ఈ ప్రపంచంలో ఏవీ మిగిలి లేవు. వారు పుట్టుకతోనే పూర్ణులు. మనమే మొత్తం అసంపూర్ణంగా ఉన్నవాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ నీకు పనిగట్టుకు ఎందుకు వినిపిస్తున్నానంటే ఇంకొంత కాలానికి నీ జీవితంలోకి ఒక ఆడపిల్ల వస్తుంది. ఇప్పడు ఈ కథలు విని వీటిని తెలుసుకున్న తెలివిడి నుండి నీ జీవితంలోకి రాబోయే ఆ సహచరి పట్ల కానీ, ఇక నుంచి నీ జీవితంలో పరిచయం అయిన ప్రతి ఏ స్త్రీ పట్ల కానీ, నీకు అమితమైన గౌరవం, మర్యాద, పెద్ద ఎత్తున సంస్కారం ఒనగూడుతయి. అలా ఒనగూడాలనేదే నా తపన కూడా. దానికొరకే నా నోరు నొప్పయినా కూడా… నీకు ఈ కథలు వినిపిస్తూ ఉన్నా. అట్లా సంస్కారంతో తయారైన నిన్ను చూసి అత్యంత ఎక్కువగా నీపై నీకే గౌరవం, ప్రేమ పుడుతాయి.

ఒక విషయం తెలుసుకో! మనల్ని చూసి, మన పనిని, మన వ్యక్తిత్వాన్ని చూసి మనకి మనం నిజాయితీగా ప్రేమించుకోడం, గౌరవించుకోడం, గర్వపడటం కన్నా గొప్పది ఇంకేం లేదు ఈ ప్రపంచంలో. అటువంటి నిన్నూ, నీ సంస్కారంపై ముచ్చట చెంది నీ భుజం తట్టే ప్రతి ఒక్కరికి ఇదంతా నీ తలిదండ్రి, నీ పరిసరాలు, నువ్వు పుట్టి పెరిగిన ధర్మం పెంచిన పెంపకం కాదని, ఒక నలభై కథల పుస్తకం/ఆ రచయిత దిద్దిన వ్యక్తిత్వం అని మళ్ళీ మళ్ళీ ఒక దండంగా చెప్పుకోవాలి. నీవంటి పిల్లల ద్వారా సత్యవతిగారిని ఎప్పటికీ మనం మనలో నిలుపుకోవాలి. ఈ కథలన్నీ బుర్రలో పెట్టుకో. ఎప్పుడయినా ఆదమరిచినా, నీ భార్యపట్ల గానీ, ఏ ఇతర స్త్రీలపట్ల గానీ నువ్వు ఎప్పుడయినా దుర్మార్గంగా ప్రవర్తించావని నీ మనసు నీతో విభేదించినపుడు అది నాతో చెబుకో! చేసిన మన ప్రతి చెడు ప్రవర్తనకు ఒక దిద్దుబాటు మళ్ళీ మళ్ళీ ఈ పుస్తకంలో దొరుకుతుంది. తప్పేం లేదు, అలా ప్రతిసారి మనం మారుదాం! అలా మారవచ్చు కూడా. ఇలా మార్పు తేగలిగినదాన్ని, గొప్ప కరుణగా మన ఆత్మని ప్రక్షాళన చేసేదానినే సాహిత్యం అంటారు. మరిక సాహిత్యమని పేరు పెట్టుకున్నదంతా సాహిత్యం కాదు.”

ఇదంతా మా పిల్లాడికి నేను చెప్పలా. ఊరికే ఆ కథలు చెప్పాను అంతే. అన్నీ చెప్పనక్కరలేదు. మనిషి అన్నవాడు నేర్చుకోడానికే ఉన్నది. బిడ్డడు నేర్చుకుంటాడు. సత్యవతిగారూ! మీరు వ్రాసిన దాన్ని చదుకుంటూ, నేర్చుకుంటూ మేము గర్వపడినట్లే మీరూ మీరు వ్రాసినదాన్ని గురించి కల్తీ లేని గర్వపడవచ్చు.

‘ఆ మనిషి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే’ అంది అమ్మ. ‘అట్టా అనకు. ఇంటో మగమనిషి ఉన్న దారే వేరు… నాన్న ఇంటో లేకపోతే ఈ కొండమీద మగపిల్లల చూపులన్నీ ఇటే. ఆయన రాంగానే ఎక్కడి వాళ్ళక్కడ గప్చిప్’ అంటుంది కూతురు. ఒక మగాడిని తల్లి అలా, పెద్ద కూతురు ఇలా, రెండో కూతురు ఇంకోలా చూస్తుంది. బయట జనం వేరేలా చూస్తారు. కాడి అనే కథలోని ఈ మగమనిషి అన్నాదమ్ముల తగాదాలవల్ల, తన తండ్రి చేసిన అప్పులవల్ల, వడ్డీలవల్ల, పొలం కాస్తా పోయి పెళ్ళాం బిడ్డలతో బస్తీ బారినపడి, ఆపై తాగుడు బారినపడి, పెళ్ళాం సంపాదన మీద బ్రతుకుతున్నానని అవమానం బారినపడి… తన చేతకానితనం వల్ల వచ్చిన అవమానాన్ని తిరిగి తిరిగి భార్య మీదే చూపించేవాడు. భార్యకి ఎంకటేస్పర్రావుగారి ఇంట్లో పని, ఇతగాడికి పెళ్ళాం అక్కడ పనిచెయ్యడం ఇష్టం లేదు. ఇంట్లో ఏ గొడవ వచ్చినా ఆ గొడవ చివరకి ఎంకటేస్పర్రావుకి పెళ్ళానికి రంకు అంటగట్టి ముగియడం మామూలే. ‘ఎంకటేస్పర్రావుగారికి అరవై అయిదేళ్ళు. నాకన్నా పాతికేళ్ళ పెద్దవాడు. తండ్రిలాటాయన… ఆయన పెళ్ళాం పోతే నేను వంటకు కుదురుకున్నా. అదేం తప్పా? నెలకి పదిహేనువందలు ఇస్తాడాయన. ఎప్పుడేమడిగినా లేదనడు. నన్ను చూస్తే నాగమణి లాంటి ఆడాళ్ళకి కడుపు మంట. ఆళ్ళు నాలాగ కష్టపడి పనిచెయ్యరు. వాళ్ళు ఆయన్ని ఎగసనదోస్తారు’ అని వాపోతుంది భార్య. అటువంటి ఆ మనిషి తాగి తాగి జబ్బునపడి పైకెళ్ళిపోయాడు, ఇదుగో ఈ కిటికీ పక్కనే మంచం మీద… అట్టా పైకి చూస్తూ పడుకునేవాడు. అమ్మా కూతుళ్ళు వంతులేసుకుని కూచునేవాళ్ళు. అమ్మ ఇంట్లో లేనప్పుడు అయ్య కూతురు చెయ్యి పట్టుకుని ఏడ్చేవాడు. తను అసమర్థుడైనందువల్లే అమ్మ ఎంకటేస్పర్రావుకి లొంగిపొయిందనేవాడు. ‘అది తప్పు నాన్నా! ఎంకటేస్సరావుకు అమ్మ పని చేసి పెడుతుందంతే! నేను చూసొచ్చా… ఆయన సానా మంచోడు… అందుకే అమ్మ అక్కడ పన్జేస్తోంది, నువ్వట్టా అనమాక!’ అని ఈ పిల్ల చెప్పేది. ఆ సంగతి ఆయనకి తెలుసనీ, పెళ్ళాన్ని కాస్త అదుపులో పెట్టడానికి అట్లా అంటాడనీ తరువాత అర్థం అయ్యింది కూతురు స్వర్ణకి. సంసారభారం అంతా ఎత్తుకుని మోసింది, మోస్తుంది, అవమానాలు భరించింది అంతా ఆ ఇంటి ఆడవాళ్ళే! అయినా చేతకానితనంతో తాగుడికి బానిసయైన ఆ తండ్రి మాత్రం పెళ్ళాన్ని ‘అదుపులో’ పెట్టడానికి ఆవిడకి రంకులు అంటగట్టి కంట్రోల్లో పెట్టడం మగనీతి. అరే వా! నాకెందుకో అట్లాస్ గుర్తుకు వస్తున్నాడు, భూమినంతా తన భుజాలమీద మోసే మగాడు! నిజానికి అలా భూమిని మోస్తూ ఉన్నది స్వర్ణవాళ్ళమ్మ వంటి ఆడవాళ్ళు.

సత్యవతిగారి కథలు చదువుతూ ఉంటే ప్రతి కథలో ఉన్న జీవితం, దాన్ని మలిచిన గొప్ప శిల్ప చాత్యుర్యం, దేనికదే అయిన ఆ కథలను నడిపే పద్దతి అతి విలక్షణీయమైనది. మా కాలపు జీవితానికి ఎంతోటి అత్యంత అపురూపమైన రచయిత్రో ఈవిడ! జీవితం అంటే జాగ్రత్తయిన ఎరుక ఉండి ఆ జీవితంలో ప్రతి క్షణం ఎదురుపడ్డ ప్రతిదీనూ అంతే జాగ్రత్తగా మెదడు పొరల్లో దాచుకుని అక్షరాల్లో గుదిగుచ్చి వారి ద్వారా తనకు కలిగిన ప్రతి ప్రశ్నను మనతో అడిగించడం. ప్రతి జీవితాన్ని మన కళ్ళతో మనకి బొమ్మ కట్టించడం. కావాల్సిన జవాబుని వెతుక్కోడానికి మాత్రం మనకై మనల్నే వెతుక్కోమనడం. ‘దమయంతి కూతురు’ అనే కథలో చివర ఒక వాక్యం ఉంటుంది, ‘నా దగ్గర జవాబు లేదు. ఆమె దగ్గరేం జవాబు ఉందో?’ అని! తనవన్నీ జవాబుల్లేని కథలే. చేతిలో కలం ఉంది కదాన్న మాత్రానా తలరాతలు తీర్చిదిద్దుదామనుకుని బయలుదేరే వెర్రితల్లి కాదు సత్యవతి. మహాతెలివైన భలే కథకురాలు అనడానికి నాకేం అభ్యంతరం లేదు, ఎదుటివాడి అభ్యంతరాలపై నాకేం లెక్క కానీ!

అన్ని కథలపై ఇది ఇలాని, అది అలాని చెప్పగలిగే నైపుణ్యం, శక్తి నాకు లేదు. సంప్రదాయ రచనా రివ్యూ పద్దతుల జోలికెళ్ళకుండా ఊరికే చేతికి అందిన కథను నాకై ఎలా తీసుకున్నానో, ఏం చదివానో, అలానే చెప్పుకుంటూ పోతా. ఇన్నేళ్ళ తరువాత ఒక కొత్తవాడు వచ్చి కల్తీ లేని పాతబంగారం వంటి మనిషి రచనల గురించి కొత్తగా గుబాళించే రాగం ఏమని పొగడగలడు? వినండి ఈ కథ పేరు నాన్న. కూతురు మనకు చెబుతూ వుంటుంది ఈ కథని, ఇది నాన్న కథని, అనగనగా అమ్మ మహాలక్ష్మి కథ ఏ మాత్రం కాదని నమ్మించేలా చూస్తుంది. కానీ… తాత సుబ్బయ్య, అమ్మమ్మ సరోజినమ్మ కలిసి అమ్మ మహాలక్ష్మికి లక్షణమైన బ్యాంక్ ఆఫీసర్ సంబంధం తెచ్చి పెళ్ళి చేశారు. దేనికీ లోటు లేదు, నాలుగేళ్ళ కాపురం, మూడేళ్ళ కూతురు, కడుపులో మరో బిడ్డ. ఒక మధ్యాహ్నం భర్త హడావుడిగా వచ్చి ‘అర్జంట్ పనిమీద హైద్రాబాదు వెళ్ళాలి. ఒక వారంలో వస్తా’ అని వెళ్ళాడు. వారం అయినా అతను రాలేదు. ఆ విషయం తన తల్లి జ్ఞాపకం చేసేదాకా మహాలక్ష్మి పట్టించుకోలేదు. ఆ వారం రోజులు ఆవిడకు భర్త పట్టలేదు. ఈ పూట ఏం తిన్నాడు, ఏం కట్టి ఉంటాడు, ఏం పని మీద ఇరుక్కుపోయాడు అనే ధ్యాసే లేదు. భర్త లేకున్నా యథాప్రకారంగా వారంవారంగా పనులు నడుస్తున్నాయ్. ఆర్థికంగా ఏ లోటు లేదు. పిల్ల హాయిగా ఆడుకుంటూనే ఉంది. స్నేహితురాళ్ళు ఫోన్ చేస్తుంటారు, పుస్తకాలున్నాయి చదుకోడానికి, వినడానికి పాటలున్నాయి. చూడ్డానికి సినిమాలున్నాయి. కడుపులో పిల్లవాడింకా తనని పెద్దగా ఇబ్బంది పెట్టడంలేదు. వారం గడిచింది, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు, దశాబ్దాలు గడిచాయ్. అతను రాలా. ఇక రాడు.

ఆ మనిషి తాలూకు గుర్తుల్ని చెరిపేసి, అతనికై హృదయాన్ని మూసేసి, అతని బొమ్మని తుడిపివేసేసిన ఒక సాయంకాలం నాన్న వచ్చాడు. ఇక్కడ కూతురుతో నాన్న ఇలా కథ చెబుతాడు: ‘మీ అమ్మ మహాలక్ష్మికి జీవితంలో నేనొక భాగం మాత్రమే. కానీ లలితకి నేనే జీవితం. తనకి అమ్మ లేదు, నాన్న ఉన్నా లేకపోయినా ఒకటే. చదువు లేదు, అస్తి లేదు, ఆరోగ్యం కూడా అంతంత మాత్రం… ఎప్పటినుంచో నా మీదే మనసు పెట్టుకుంది. నేను మహాలక్ష్మిని చేసుకోడం తప్పే. మా అమ్మ వల్ల అలా జరిగిపోయింది. నేనలా అమ్మకి లొంగిపోవడమూ తప్పే. మహాలక్ష్మితో ఉన్నా నేను లలిత గురించే ఆలోచించేవాడిని. ఉత్తరాలు వ్రాసేవాడిని. కలుస్తూ వుండేవాడిని. అప్పుడప్పుడూ డబ్బూ పంపేవాడిని. నేను లేనిదే ఆమె బ్రతకదనే నిర్ధారణకు వచ్చాకా ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఇద్దరిని మోసం చేస్తున్నాను. అందులో నేను ఒకర్నే ఎంచుకోవాలి. లలిత నన్ను వదలడానికి ఇష్టపడడం లేదు. ఆమె ఉత్తరాలన్నీ నిష్టూరాలతో ఉంటాయి. ఆత్మహత్యల గురించిన ప్రసక్తులతో ఉంటాయి. తను ఇంకొకర్ని పెళ్ళి చేసుకోదు. ఆర్థికంగా నిలబడే శక్తి లేదు. అతి బేలగా ఉంటుంది. కానీ, మహాలక్ష్మికి జీవితం అతి రొటీన్. అమ్మా, నాన్నా, స్నేహితులూ, పుస్తకాలు, పిల్లా, వీటితో పాటు నేను. నేను ఆలస్యంగా ఇంటికొచ్చినా కంగారుపడదు. ఆకలేస్తే అన్నం తినేస్తుంది. నిద్ర వస్తే పనిపిల్లకి తలుపు తియ్యమని చెప్పి నిద్రపోతుంది. ఆమెకు నా మీద ప్రేమ లేదని చెప్పడానికి కాదు కానీ నేను లేకపోయినా ఆమెకే లోటు రాదు. ఆమె తల్లిదండ్రులు ఆమెని కంటికి రెప్పలా కాచుకుంటారు అనిపించింది. అందుకే ఛీత్కారాలకి, అవమానాలకి సిద్ధపడి లలితని దక్కించుకున్నాను. తప్పే కావచ్చు. కానీ అలా చేశాను అంతే. దానికి నాదే బాధ్యత. నేనిప్పుడు ఏ క్షమాపణలు కోరడానికీ నన్ను కుటుంబంలో చేర్చుకోమని అడగడానికీ రాలేదు. ఒకసారి మిమ్మల్ని చూడాలనుకుని వచ్చాను. అంతే! మహాలక్ష్మి నన్ను తిట్టినా, అమానించినా భరించడానికి సిద్ధపడే వచ్చాను. నన్ను ఇలా మాట్లాడనిచ్చినందుకు ఆదరించినందుకు ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి.’ అని నిబ్బరంగా చెప్పాడు ఈ నాలుగు మాటలు.

అంతే నాన్న కథ. అయితే నాన్న నిబ్బరం వెనుక చాలా తెలివితేటలు ఉన్నాయి. మునుపు మహాలక్ష్మిని వదిలివెళ్ళినపుడు ఎంతటి ఛీత్కారాలకి, అవమానాలకి సిద్ధపడి వెళ్ళాడో ఇప్పుడు మహాలక్ష్మి తనను తిట్టినా, అవమానించినా భరించడానికి సిద్ధపడే వచ్చాడు. అదీనూ లలిత చనిపోయిన తరువాతే ఈ కుటుంబం గుర్తుకు వచ్చింది. తను ఆడిన ఆట కేవలం ఇద్దరు ఆడవాళ్ళ మధ్య మాత్రమే కాదని, ఏమీ ఎరుగని ఇద్దరు అమాయకప్పిల్లల పుట్టుకకు తను కారకుడు అని మాత్రం గుర్తులేదు ఈ మగాడి కన్ఫెషన్‌కి. నిజానికి నిబ్బరం అతగాడిది కాదు, అది మహాలక్ష్మిది, దాన్ని తోడుగా ఉంచుకుని పెంచుకున్న తన పిల్లలది కూడా. అతనివి తెలివితేటలు మాత్రమే. దొంగ!

సౌందర్య కనకాంబరం రంగు పట్టు లంగా, జాకెట్టు తొడుక్కున్న ఒక బంగారు బొమ్మ వంటి పిల్ల బుగ్గలు పుణికి ‘నూరేళ్ళు బ్రతుకు మాయమ్మా!’ అని దీవించిన ఒక దీవెనకి ఇంత నిస్సహాయపు నిట్టూర్పుని భాగం చేసి, పేదరికం, అసహాయత, బ్రతుకు, ఏడుపు, కష్టం… ఇలా సప్తవర్ణ సమ్మిశ్రితం అనే కథ చెప్పింది సత్యవతిగారు. ఇందులో ఒక బామ్మ ఉంది. ‘ఇప్పుడు డబ్బులున్న ముసలాళ్ళకి సేవ చేయడానికి ఇంట్లో మనుషులకు టైమ్ వుండట్లేదంట! అందుకని ఒక సారు ముసలాళ్ళకి సేవచేసే సంస్థ ఒకటి పెట్టాడు. అందులోకి పద్దెనిమిది ఇరవై అయిదేళ్ళ మధ్య వయసున్న పిల్లల్ని తీసుకుని నర్సు ట్రైనింగ్ ఇస్తాడంట. వారిని తీసుకెళ్ళి జబ్బుపడి మంచానున్న ముసలాళ్ళ దగ్గర పెడతాడట. ఆ పిల్లల తిండీ తిప్పలు అన్నీ ఇంటి గలవాళ్ళవే. ఈ అమ్మాయిలు అక్కడ వారి ఇంటి పనులేం చేయనక్కరలేదు. ముసలాళ్ళని చూసుకుంటే చాలు. నెలకి నాలుగు వేలు ఇస్తారు’. స్వర్ణని అటువంటి ట్రైనింగుకి పంపుదామని అమ్మా, అయ్యా ఆలోచన. స్వర్ణ అంటుంది కదా ‘అయినా ఆ చేసేదేదో ఇంట్లో ముసలమ్మని ఒదిలిపెట్టి బయటోల్లకి చేయాలేంటి?’ అంతకుమునుపే తన అవ్వ మంచం మీద వళ్ళంతా తడుపుకుని గబ్బు కంపు కొడుతుంటే, విసుక్కుంటూనయినా ఆవిడ్ని శుభ్రంచేసి ఎట్లాగో ఆమెకో పొడిచీర కట్టి మంచం మీది పట్టా మీద రెండు చీరల పక్కేసి పడుకోబెట్టింది. ఈ బీద ముసిల్ది ఏం ఇవ్వగలదు ఆ సేవలకు? ఆ డబ్బున్న ముసలాళ్ళని చూసుకుంటే స్వర్ణ వంటి అమ్మాయిలకి తిండి ఖర్చు ఉండదు, నెల తిరగ్గానే నాలుగు వేలు వస్తాయి. అందులో మహా మూడొందలు ఖర్చు పెడితే సబ్బులూ పేస్టులూ, పౌడర్లు, క్రీములు హాయిగా రుద్దుకుని ఆ ముసలాళ్ళ గబ్బు మరిచిపోవచ్చు. ఇక్కడ ఇంటి దగ్గర వళ్ళంతా హూనం చేసుకుంటూ తోటపని చేసివచ్చి, రాగానే ఇంట్లో ముసల్దానికి సేవలు చేస్తే రాలేదేమిటి? పైగా ఈ పిల్ల పెళ్ళీడుకొచ్చిందా! డబ్బు కావద్దూ? ఇప్పుడు మేనమామలు మేనత్త కొడుకులు కూడా కట్నాలడిగే పిదపకాలం వొచ్చిందిగదాని దాని తల్లి దిగులు.

అలా స్వర్ణ ట్రైనింగయ్యి ఒక ఎనభై అయిదేళ్ళ మామ్మ దగ్గరికి వచ్చిపడింది. ఆవిడ్ని స్వర్ణ ‘గచ్చకాయ మామ్మ’ అంటుంది. మామ్మ ఎప్పుడూ కళ్ళు మూసుకుని తనలో తానే ఏదో మాటాడుతుంటుంది. ‘నిండు కెంపు రంగుకు పచ్చి పసుపు రుద్రాక్షల అంచు! అంచుకు చిన్న చిన్న కొండలు… నేనేమో చాయనచాయ! నాకు ఆ చీర నప్పుతుందా లేదా అని ఎంత తటపటాయించానో కానీ కట్టుకుంటే ఎంత బావుందో! కళ్ళల్లోనో ముక్కులోనో నీళ్ళొస్తే గబుక్కున పమిటతో తుడుచుకునే అలవాటు. వాయిల్ చీరలు ఎంత మెత్తగా వుండేవో! ముక్కు పమిటతో తుడుచుకుంటే మా అత్తగారు తిట్టేది. అత్తగారు చీరెల్లోనే తనువు చాలించింది. ఇష్టమైన మానుగాయి రంగు జరీచీర కట్టించుకుని మరీ… గచ్చకాయ, మానుగాయ, ఇటిక రాయి, మిరప్పండెరుపు, పెసరపచ్చ, నెమలిపింఛం, తోపురంగు, నిమ్మపండు, వంగపువ్వు, నారింజ, పసుపు, ముదురు నీలం, రత్నావళి, బచ్చలి పండు రంగు…’ స్వర్ణకి ఈ రంగులేం అర్థం కావు, ముసలిదాని స్వగతాలు ఎక్కవు. ముక్కుకు ఎక్కేదల్లా ఈ ముసల్ది బాత్రూమ్ వచ్చేదాక ఆపుకోలేదు, మధ్యలోనే దిగబడిపోతుంది! ఆ చండాలం మధ్య పనిచేసి శుభ్రంచేసి స్వర్ణకు కడుపుకు అన్నం సహించదు. ఆ సమయంలో తను ఇంట్లో విసుక్కునే తన నాయనమ్మ గుర్తుకు వచ్చేది. పాపం ఎట్టా ఉందో ఏమో! ఈ పిల్లతో ఈ పనులు చేయించుకునే గచ్చకాయ బామ్మకు మాత్రం ఇదంతా హాయిగా ఉందా? హింస కదూ! ఈ పడుచుపిల్లది, ఆ ముసలి అవ్వది చెరో రెండు ప్రపంచాలు, కష్టాలు వేరు కానీ దుఃఖం రంగు ఒకటే. చివరలో మామ్మ అంటుంది కదా స్వర్ణతో, ‘నిన్న రాత్రి నేను బట్టలు పాడుచేసుకున్నప్పుడు ఏడ్చావు కదా? నిన్నిక్కడికి పంపించినవాళ్ళని తిట్టుకున్నావు కదా? వారి పీక పిసికి చంపాలన్నంత కోపం వచ్చింది కదూ? అట్లాగే నేనూ నా చిన్నప్పుడు నన్ను నూరేళ్ళాయుషు అని దీవించినవాళ్ళని తిట్టుకుంటూ ఏడ్చాను.’

ఈ కథ చివర్న నాకూ ఏడుపు అనిపించింది. మా అమ్మని నేను ఎప్పుడు మనసులో తలుచుకున్నా తను అప్పుడే ఫోన్ చేస్తుంది. ‘అబ్బా నీకు నూరేళ్ళాయుషమ్మా!’ అని నోటికి గబుక్కున వస్తుంది. ‘ఈ దిక్కుమాలిన ప్రపంచంలో అన్నేళ్ళు ఎట్లా బ్రతుకుతావమ్మా? అంతా బావున్నప్పుడే వెళ్ళిపో మాయమ్మా,’ అని బలవంతంగా కోరుకోవాల్సివస్తుంది, నాకిపుడు గచ్చకాయ మామ్మని చదువుకుంటుంటే.

క్రాఫ్ట్ అనే అల్లిక ఆర్ట్ కన్నా అతి కష్టం ఐనది. పుట్టు మహారచయిత బుచ్చిబాబుగారి ‘బీ’ అనే కథ చదవండి. అందులో కథకుడు తొలిసారిగా ఒక పన్నెండేళ్ళ పిల్ల బీ-ని చూస్తాడు. ఇలా అనుకుంటాడు: ‘ఆ కళ్ళ ఆకర్షణ మామూలు ఆకర్షణ కాదు. కొన్ని జలచరాల మెదడు పైన మణులుండేవంటారు. ఆ మణిలో భీభత్సంగా కనబడి గగుర్పాటు కలగజేసే వొక వికృతమైన ఆకర్షణ వుంటుంది. అట్లాంటి ఆకర్షణ ఆమె కళ్ళల్లో వుంది. గుండ్రటి కళ్ళు అంత బాగుండవు. ఆమె కళ్ళు గుండ్రంగా లేకపోయినా, నల్లపాప గుండ్రంగా కదలడం వల్ల చూపులు అలా గుండ్రంగా వున్నట్లు కనబడతాయనుకుంటా. నిశ్చలమయిన చూపు కాదది. కంటిలో పాప గుండ్రంగా గిరగిర తిరుగుతూ వుంటుంది’. ఇలా ‘గుండ్రం, గిరగిర తిరగడం’ అనే మూల సూత్రాన్ని ఆధారం చేసుకుని అల్లిన కథ. మతిపోతుంది కథకుడి నైపుణ్యం చదివితే. తనకు సహజ గుణమయిన రచన అనే కళ ఎట్టాగు ఉన్నదే. ఇదిగో ఈ సత్యవతిగారు అటువంటి అల్లకం తెలిసిన మనిషి. కానీ బుచ్చిబాబుగారిలా కవితాదాత్మ్యతని అగరుబత్తి ధూపంలా వెలిగించి అలా మనల్ని మత్తులోకి కమ్మించేది కాదు తన శైలి. తనని చదువుతుంటే కడక్‌తనంతో కథను ఇంత నేర్పరితనంతో ఇంత బిగువున మానవ జీవితపు నరనరాన అల్లవచ్చని నాకు మునుపెన్నడూ నిజంగా తెలీదు. కోయీ ఇన్సే సీఖియే! డ్రాయింగ్ టు డ్రాయింగ్ అని నేను అనుసరించే ఒక గ్రామర్ ఉంది. అనగా బొమ్మ నుండి బొమ్మ నేర్చుకోడం. నచ్చిన చిత్రకారుల బొమ్మల్ని ముందుంచుకుని మక్కీకి మక్కీగా దాన్ని దానిలా గీసే ప్రయత్నం చెయ్యడం. ఇది సాధన, ఇది శిక్షణ, ఇది గమనం. ఇదే సూత్రం నేను సత్యవతిగారి ‘పెళ్ళి ప్రయాణం’ కథకు అప్లయ్ చేసుకోవచ్చని తోచింది. ఒకటి ఆవిడ కథల మీద కలిగిన గౌరవం వల్ల, రెండోది, ఒక కథ, దాన్ని నడిపే చాకచక్యం, అందలి పాత్రలూ వాటి సంభాషణల మధ్య టైమింగ్. వీటన్నిటికి మించి ఈ కథ క్రాఫ్ట్ మీద పుట్టిన వల్లమాలిన ప్రేమ. నిజానికి, బాగా రాయగలిగిన, లేదా బాగా రాద్దామనుకునే, అదీ కాక అసలు కథ వ్రాద్దాము, మొదలు పెడదామనుకునే ప్రతి ఒక్క రచయిత ఈ కథను అయిదుసార్లు ఇంపోజిషన్ వ్రాయగలిగితే ఖచ్చితంగా తెలుగు కథా సాహిత్యానికి ఎంత బలమైన కథకులు తయారవుతారో! ఎంత యుటోపియా!

ఒక పెద్దాయన ఎదురవుతాడు. పలకరింపుగా నవ్వుతాడు. ‘మీరు సుశీలమ్మ పెనిమిటా?’ అనడుగుతాడు. పెనిమిటి ఈ మధ్య ఎవరూ వాడని పదం. పెద్దవాడు కదా! పాతమాట అలవాటు కాబోలు పాపమనుకుని ఇలా జవాబు చెబుతాడు మెత్తగా, ‘సుశీల నా భార్య’. అర్థం అయ్యిందా కథకురాలి డీటైల్ ఏవిటో? జవాబు చెప్పినవాడి గురించి ఏం చెబుతుందో! ఈ కథ పేరు మెలకువ. ఒక కొత్త నడకతో నడిపించిన కథ ఇది. మార్టిన్ స్కార్సెసీ ఆఫ్టర్ అవర్స్ సినిమా తీసి ‘స్కార్సెసీ ఏ జాన్రా అయినా తీయగలడ్రోయ్!’ అని సిగార్ పొగ మన మొహం మీద వదిలినట్లు, సత్యవతిగారు చిద్విలాసంగా ఇదియొక తీరు అని పెన్ను తట్టి నడపించిన కథ ఇది. సత్యవతిగారి ప్రతి కథలో నిజంగా నన్ను అయోమయానికి గురిచేసేది ఆవిడ క్రాఫ్ట్. రాయగలిగినతనం అనే విషయం చాలా చిన్నది, సహజంగా వస్తే వచ్చేది, కానీ సత్యవతిగారు సాధించిన ఈ కథ చెప్పే క్రాఫ్ట్ మాత్రం ఏ వందేళ్ళకో ఏ లక్షమంది రచయితల్లో ఒకరిద్దరికో మాత్రమే అందగలిగేది. ఇటువంటప్పుడే ఈవిడ అతి తొలినాళ్ళల్లో వ్రాసిన కథలను గమనించుకోగలిగితే తప్పా ఈ పరిణామక్రమం తెలిసేది కాదు, ఎదగవచ్చు అనే మాట మనకు తట్టేది కాదు.

మెలకువ అనే ఈ కథలో ఆ ఉత్తమ పురుషుడు ఈ కథ చెబుతూ ‘సుశీలమ్మ పెనిమిటి’ దగ్గర కథ మొదలుపెట్టి, మనతో ఈ కథ మాట్లాడే ఈ మనిషి అకస్మాత్తుగా ఒక జబ్బునపడి కోలుకుంటున్న సమయంలో కళ్ళు తెరిచి చూసి తన గది లోనికి వస్తున్న మనిషిని ‘ఒక శ్వేతాంబరుడు’ అని పిలుస్తాడు. (నిజానికి ఇతగాడు ఈ కథలో ఉన్న మనుషులు అనే వాళ్ళని లక్షణాలుగా మాత్రమే చెబుతాడు. కథ చివరలో తను బాగా ఎరిగి ఉన్న సుబ్బారావు అనేవాడు కూడా సుబ్బారావు అనే పేరు వదుల్చుకుని ‘నవ్వుమొహం’ అయిపోవడాన్ని గుర్తిస్తాడు.) నిజానికి నేను ఇక్కడ చెబుతున్న ఈ మాటలు చాలా బండగా వ్రాస్తున్నా కానీ మీరు చదవండబ్బా. అబ్బా ఏం కథ! ఎంత తెలివైన నడక!! ఈ కథ చదువుకుంటూ నా వంటి పాఠకులు సత్యవతిగారి చుట్టుతా కూచుని ఈ చిన్న చిన్న ముచ్చట్లు అక్కడికక్కడ చదువుకుంటూ అబ్బా! అని అమాంతం ఒక ముచ్చటపడిపోయి ఆవిడని కావిలించుకుని మురిపంగా మాట్లాడాల్సిన కబుర్లు దేవుడు రాసిపెట్టాలి. ఆషామాషి కాదు ఈ కథని ఇలా రాయాలంటే. ఈ కథకురాలిలో ‘ఏది ఏమొచ్చినా గానీ తనలోని కథ వ్రాసే ఆ మనిషిని అనునిత్యం జాగరూకతతో నిలుపుకునే ఉంటాను’ అని గాట్టిగా అనుకున్న మనుషులు మాత్రమే ఇలా వ్రాయగలరు.

ఇదే కథలో ఒక దీపం లేదా సుశీలమ్మ అనే మనిషి ఉంటుంది. ఈవిడ అసలు పాఠకుడి ముందుకు ప్రత్యక్షంగా రానే రాదు. అయినా కూడా ముందుగా చెప్పినట్లు సత్యవతిగారి క్రాఫ్ట్ మామూలుది కాదు, చావచితక కొట్టే తెలివి ఆవిడ రచనా శైలిది. నేను చదివిన స్త్రీ రచయితల్లో ఇంత బలమయిన ఫెమినిష్టుగారిని మరొకరిని కనుగొన్న యాది అయితే రావడంలేదు. అమ్మా సత్యవతిగారూ! కథలో కథంతా చెప్పే ప్రధాన పాత్రకు పేరు లేదు. ఓ వ్యక్తిత్వమూ, ఓ అభిరుచి, ఓ రుచి, అతగాడి ఒక వృత్తి కనపడదు. అసలు కళ్ళముందుకు రాని సుశీల మాత్రం మనకు అంతా తానై మనతో ఉండిపోతుంది. శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రిగారి మార్గదర్శి ఒక గొప్ప టెక్నిక్‌తో నడిచే కథ అయితే, ఇదిగో ఈ కథ ఇంకో గొప్ప టెక్నిక్. అమ్మా మీకు నా పరి పరి దండాలు.

ఇంకా ఈ కథల గురించి ఏదో ఎంతో రాసేద్దామని మనసు ఏదేదో బోలెడు తహతహలాడుతూ లొడ లొడ చెబుతుంది, ఒకేసారి నలభై రకాల భాషలుగా, గందరగోళం. ఆ మనసు పలికే ఏ భాషా నాకు అర్థంకాదు. అయినా ఆ రణగొణ ధ్వనుల మధ్య కూడా సన్నగానయినా నాకు ఓ పాట స్పష్టంగా వచ్చి తాకినట్లు ‘మాఝీ, నయ్యా ఢూండే కినారా’. అట్టి సూత్రాన్ని ఆధారం చేసుకుని నాకు ఎక్కింది ఏదో మీతో మాట్లాడే ప్రయత్నం చేశా. ఇంతా చేసి మహా అంటే చెప్పింది ఒక మూడున్నర కథలు మాత్రమంతటి విషయమే! మీరెవరు వినకున్నా పర్లా. ఇక్కడ చెప్పడం మాత్రమే, చెయ్యడం మాత్రమే నేను ప్రధానం అనుకుంటున్నా. అలా సత్యవతిగారి కథల గురించి ఇంకా చెప్పుకోవాలి, మళ్ళీ మళ్ళీ వ్రాసుకోవాలి. అంతవరకు ప్రస్తుతానికి హేప్పీ బర్త్ డే మా సరస్వతి తల్లికి.

(జులై రెండు మా సత్యవతిగారి పుట్టినరోజు కాన్కగా…)


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...