ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 1

ఆత్మకథ అనే మాట వినగానే సాధారణార్థంలో మనందరికీ కలిగే అవగాహన ఒకటుంటుంది కదా? అలాంటి అవగాహనకు ఆస్కారం ఇచ్చే తరహా ఆత్మకథా రచన నేను చేయడంలేదు. నా ఆత్మకథ అనే ఒక స్పృహతో నేను దీనిని మొదలుపెట్టలేదు, అలా భావించి ఈ రచనను కనుక నేను మొదలుపెట్టి ఉండి ఉంటే, నేనూ నా ఆత్మా రెండూ ఏకంగా బిగుసుకుపోయి ఇక రాయబోయేది అంతా గంజి పెట్టినట్టి ఒక బిగుతు రాతే అవుతుంది అని నా భయం. నా ఈ స్వీయచరిత్రలో జనన మరణాలు, పెళ్ళి పేరంటాలు, ఆ తారీఖుల, సమయాల, సంవత్సరాల చిట్టాలు సరిచూసుకోడానికి నేను ఎప్పుడు డైరీ అనే పుస్తకంలో దినచర్య వ్రాసినవాడిని కాను, కేలండర్ కాగితాలపై గుర్తుగా వృత్తాలు చుట్టినవాడినీ కాను. అసలు నేను నా జీవితంలో చేతికి ఎప్పుడు ఒక గడియారాన్ని ధరించి ముల్లుల నడక గమనించిన బాపతువాడినే కాను. నడిచిన జీవితంలో గడిచిన కొన్ని విలువైన జ్ఞాపకాలు, దేనికోసం తడుముకోనక్కరలేకుండానే తగిలివచ్చే కొన్ని అనుభవాలు, స్మృతుల్లో గూడుకట్టుకు ఉండిపోయిన కొందరు మనుష్యులు, చూసిన, గడిపిన కొన్ని ప్రదేశాలు, ప్రాంతాలు, ఆ ఉదయాలు, సాయంత్రాలు… ఇలా ఇవన్ని ఒక అతి సాధారణ జీవితంలో గడిచేవే, మీకు తెలిసినవే, మీ అందరి జీవితంలో ఉన్నవే, మీకు సంభవించిన అనుభవాల వంటివే నా అనుభవాలు కూడా. అయితే ఈ సర్వసాధారణ సంభవాలు మిమ్మల్ని ఒకలా తయారుచేస్తే నన్ను ఇంకోలా తీర్చిదిద్దాయి. ఆ విధంగా ఇది నా కథ, మీకు తెలిసి ఉన్న ఆర్కే లక్ష్మణ్ అనే పేరుగల ఒక భారతీయ ఒక వ్యంగ్య చిత్రకారుడి కథ. నే చెబుతుంటాను, మీరు చదువుతూ ఉందురు కానీ… పదండి.

నేను నా చిన్నప్పట్నుంచి కూడా పెరిగి పెద్దయి ఫలానా ఏమవదలచుకుందామని ఏనాడు ప్రత్యేకంగా ఆలోచించుకుందేం లేదు. వైద్యుడు, న్యాయవాది, రైలు ఇంజన్ నడిపే డ్రయివర్ లేదా ఒక పెద్ద ఆఫీస్‌లో ముఖ్య కార్యనిర్వహణా సలహాదారుడు… వంటి వృత్తులు ఏవయినా కానివ్వండి. అది పెద్దదైనా, ప్రముఖమైనదయినా, చిన్నదైనా, సాధారణమయినదయినా… బొమ్మలు కానిదేది నా బుర్రలో ఇష్టంగా వచ్చి కూర్చున్నదెప్పుడూ లేదు. ఊహ అనే లక్షణం తెలిసిన క్షణం నుండి నేను నాది అనుకున్నది, నేను అనుకున్నది కేవలం బొమ్మలు గీయడమొకటే. ఒక చిన్నపిల్లాడిగా, తర్వాత కుర్రాడిగా, ఆపైన యుక్తవయస్కుడిగా… జీవితపు ప్రతి దశలో నేను బొమ్మలే నా లోకంగా అనుకుంటూ వున్నాను.

నేను ఒక యువకుడిగా మైదానంలో ఫుట్‌బాల్‌ని కాలితో ఆటలాడించిన రోజులు లేకపోలేదు, చేతుల మధ్య బిగిసిన క్రికెట్ బ్యాట్‌తో గురిచూసి బంతిని బౌండరీలు దాటించిన సందర్భాల కేరింతలు కూడా నాకు ఉన్నాయి, ఇంకా అనేకం కూడా. కానీ ఆ పనులేవీ కూడా ఒక కుంచె నా మనసుని తాకి రాగరంజితం చేసినంత అద్భుత ఆనందాన్ని మించిన అనుభవాన్ని నాకు కల్పించలేదు. నా హృదయం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నా చేతివ్రేళ్ళ మధ్యే వున్నది. వీధుల్లోని వచ్చిపోయే మనుషుల ముఖ కవళికలని ఒడిసిపట్టుకోవడంలోనూ, వారి నానా భంగిమలు చిత్రించడంలోనూ, వారి సందడి కదలికలు, వారి సాలోచనపూరిత నిశ్శబ్ద విశ్రాంత వేళలని మరింత నిశ్శబ్దంగా పసిగట్టి నా పెన్సిల్ ముక్కుతో నా నోటు పుస్తకంలో బంధించుకున్న క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలుగా కాలం…

వీధి చివర మలుపు అంచున వున్న దీపస్తంభపు తీగ గాలి ఊయల వూగుతుండగా దానిని వేళ్ళ మధ్య ఉన్న నా కలంతో చలన స్తంభన విద్యకు కట్టుచేసి కాగితంలోకి చేర్చడంలో వున్న మహదానందాన్ని నేను మరెక్కడా పొందలేదు. నాకు ఊహ ఎరిగిననాటి నుండి ఇప్పుడు ఇంతవాణ్ణి అయ్యాకా కూడా నా జీవితంలో నేను బొమ్మ వేయకుండా వున్న ఒక్క రోజు లేదు. కణకణ మండే జ్వరం తగిలినపుడూ నేను బొమ్మతోనే వున్నా. పాఠశాల పరీక్షల వేడి చెవులదాక కమ్ముతూ వున్న రోజుల్లోనూ నేను బొమ్మతోనే వున్నా. బొమ్మ నా ప్రాణం, బొమ్మ నా దారి, బొమ్మ నా గమ్యం.

నేను ఎప్పుడూ అవాలి అనుకున్నది చిత్రకళాకారుడిని తప్ప మరేది కాదు. ఒక విద్యార్థిగా ఉన్నకాలంలో భూగోళశాస్త్రం, చరిత్ర, గణితం, ఆంగ్లం ఇత్యాది భాషాశాస్త్రాలు కొన్ని వచ్చి నా సహజ విద్యకు మధ్య కొంచెం చొరబాటు చేద్దామని ప్రయతం చేసినా, వీలయినంత నాకు నేనుగా వాటి మార్గాల నుండి చలాగ్గా తప్పుకుని అలా నడిచి ఒక నాలుగు వీధుల కూడలిలోనో, అంగళ్ళతో జనసమ్మర్దమయిన ఏదో ఒక ప్రదేశంలోనో నా స్కెచ్ పుస్తకంతో కూచుని బొమ్మల పాఠాలు దిద్దుకునేవాణ్ణి. ఇట్లాంటి ఒక బొమ్మల పిల్లవాణ్ణి ‘నీ మానాన నీవు’ అని అమిత దయతో, కరుణతో నన్ను నా తలిదండ్రులు, నా అన్నలు, అక్కలు, నా కుటుంబ పెద్దలు స్వేచ్ఛగా వదిలేశారు. ‘చూస్తూ ఉండండి, మా పిల్లవాడు గొప్ప చిత్రకారుడవుతాడు’ అని ప్రోత్సాహం ఇవ్వడం కాని, ‘ఇక చేసేదేం ఉంది? వీడి ఖర్మ కాకపోతే మరి, చిత్రకారుడవుతాట్ట!’ అని నన్ను నిరుత్సాహం చేయడానికి కానీ వారు ఎప్పుడు ప్రయత్నించలేదు. చెప్పాగా, ‘నా ఇష్టాన నన్ను’ అని వారు నన్ను నా బొమ్మలకు వదిలివేయడంకన్నా కావలసినది ఏముంది? నేను పొందినది అంతకు మించి ఏముంటుంది?

ఇద్దరు ఆడపిల్లలు, ఆరుగురు మగపిల్లలుగా మేము మొత్తం ఎనిమిదిమంది సంతానం మా తలిదండ్రులకు. నేను కుమారులలో చిన్నవాడిని. మా తండ్రిగారు మైసూరు నగరానికంతా ఒక గొప్ప ప్రధానోపాద్యాయుడిగా పేరుపొందిన వ్యక్తి. ఆయన తన పాఠశాలలో చదివే విద్యార్థుల పట్ల ఎంత ఖచ్చితంగా, కఠినంగా ఉండేవారంటే ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు అందరూ తమ భావి జీవితాలలో అత్యున్నత స్థాయిని అందుకున్నవారే! వారి ఎదుగుదలకు కేవలం మా తండ్రిగారి చేతిలో ఉన్న బెత్తం దెబ్బలే కారణమని వారు ఏ స్థాయిలో ఉన్నా ఏమాత్రం మొహమాటపడకుండా ఒప్పుకునేవారు. అటువంటి తండ్రి ఇంట్లో ఉన్నాడనే స్పృహ, భయం కూడా లేకుండా ఇంట్లో ఉండే మా అన్నదమ్ములం ఎవళ్ళో ఒకళ్ళం ప్రతి నిత్యం క్రమం తప్పకుండా ఏదో ఒక తరగతి పరీక్షల్లో విఫలమవుతూ ఉండేవాళ్ళం.

మా తండ్రిగారు మరణించేనాటికి నేను చాలా చిన్నవాడిని. ఆయనది మహా గంభీరమైన విగ్రహం. అటువంటిదే వ్యక్తిత్వం కూడాను. పుస్తకాలే ఆయన కాలక్షేపం, నిత్య పుస్తకానుగత ప్రాణి. అప్పుడప్పుడు కొన్ని సాయంత్రాలు కాస్మోపాలిటన్ క్లబ్‌లో టెన్నిస్ ఆడేవారు. కర్ణాటక సంగీతంపై మా తండ్రిగారిది లోతైన జ్ఞానము. ఆయనకి కులాసా అనిపించినపుడు తరచుగా తన ఆత్మానందం కోసం మృదువుగా వీణను పలికించేవారు. కానీ ఈ మనిషి వ్యక్తిగత జీవితంలో ఉండిన సున్నితత్వం, దయ, కళాభినివేశనం వంటి ఈ వివరాలు ఆయన పాఠశాల సహోద్యోగులకు కానీ అక్కడి సిబ్బందికి కానీ పెద్దగా తెలియదు. వారు ఆయన కోపం, క్రమశిక్షణ, ముక్కుసూటిదనం అనే గుణాల వెనుక నిలబడి మాత్రమే ఆయనని చూశారు. వారంతా ఆయనకి పెద్దపులి అని ఒక అడ్డపేరు కూడా పెట్టారు. నేను ఎవరి ద్వారానో విన్న ఒక సంఘటన మీతో పంచుకుంటాను. బడికి సంబంధించిన కొన్ని అతిముఖ్యమైన పత్రాలపై పాఠశాల ముద్రవేసి వాటిని ఏ ప్రభుత్వకార్యాలయానికో పంపాలి. ఆ ముద్రవేసే గుమాస్తాకు సరిగా వేయరాలేదో, లేక ఆ ముద్ర తాలూకు సిరా పలుచనయ్యిందో, మరే తొందరలోనో చేసిన పనో, మొత్తానికి కాగితాలపై పాఠశాల ముద్ర సరిగా పడలేదు. మా తండ్రిగారు ఆ కాగితాలని చేతిలోకి తీసుకుని ఆ అస్పష్టమైన ముద్ర వంక ఓసారి చూసి పిదప ఆ ముద్ర వేసిన గుమాస్తా కళ్ళలోకి చూసినప్పుడు ఆ మాత్రం చూపుల చురుకుకే ఆ అభాగ్యుడు గజగజలాడి దభేలున నేలమీదకి ఒరిగిపోయి స్పృహ కోల్పోయాట్ట! మరందుకు అటువంటి తీక్షణమైన చూపు ఉన్న వ్యక్తికి పెద్దపులి అని పేరు తగిలించి పిలుచుకోడంలో ఆశ్చర్యం ఏముంది? ఆశ్చర్యం అంతా ఎక్కడుంది అంటే ఇటువంటి పెద్దపులి కడుపున పుట్టిన పిల్లలం బిలబిలలాడుతూ ఒకరితోనొకరం పోటిపడుతూ పరీక్షలు తప్పుతూ ఉన్నా ఆయన దానిని ఒక నేరంగా పట్టించుకోకపోవడం. బహుశా దీనికి అంతా కారణం మా అమ్మగారు అనుకుంటాను. ఆవిడ ఒక అద్భుతమైన మనిషి. చల్లని నవకమైన నవ్వు, పువ్వులాంటి లాలిత్యమైన ప్రకృతి ఆవిడది. ఆంతటి ప్రకృతి గల్గిన మనిషి కావడం వలననే అనుకుంటా పెద్దపులి వంటి మా తండ్రి ఇంట్లో మాత్రం మచ్చికజీవుడిగా నెమ్మదితనంతో ఉండేవారు.

నాన్నగారి స్వభావానికి పూర్తిగా విరుద్దమయిన మనిషి అమ్మ. వివిధ మనస్తత్వాలు కలిగిన పదిమందినయినా ఏకసూత్రంగా కలుపుకుపోగలిగే, ఎవరితోనయినా కలిసిపోగలిగే వ్యక్తిత్వం అమ్మది. ఆవిడ టెన్నిస్ ఆటలో మంచి నైపుణ్యమైన ఆటగత్తె, ఒక చేత్తో పేక ముక్కలు మరో చేత్తో చదరంగపు బంటులని కదపగలిగే సామర్థ్యం ఆవిడ సొంతం. వారానికి ఒకటీ రెండు మారులు మైసూర్ మహరాణీ లేడీస్ క్లబ్‌కు వెళ్ళివస్తూ ఉండేది. పగటి సమయాలలో ఇంట్లో అమ్మ ఉన్నదీ లేనిదీ నాకు పెద్దగా పట్టేది కాదు. ఉదయపు కాలమంతా నా వయసుకు కాస్త దగ్గరగా ఉండిన ఒకరిద్దరు అన్నలతో కలిసి పరిగెడుతూ, గెంతుతూ, ఆటలాడుతూ ఉండటంతోనే ఇట్టే గడిచిపోయేది. ఎప్పుడయితే చుట్టూ చీకట్లు కమ్ముకోడం మొదలవుతుందో అప్పుడు అకస్మాతుగా నాకు అమ్మ గుర్తుకు వచ్చేది, ఆమె ఇంట్లో లేదనే విషయం అర్థమయ్యేది. అమ్మకోసం ఒక్కసారిగా పెద్ద పెద్ద శోకాలు పెట్టేవాడ్ని. నన్ను శాంతపరచడానికి ఇంట్లో ఉన్న పెద్దా చిన్నా, పిల్లా జల్లా, నౌకర్లు చాకర్లు ఎవరివల్లా, ఏ ఉపాయం వల్లా సాధ్యమయ్యేదే కాదు. ఆ నా శోకాల మధ్య ఉన్నట్టుండి మా ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు వినపడేది. కిటికీ చువ్వలను పట్టుకుని ఏడుస్తూ కూర్చుండి ఉన్న నేను ఒక్క గెంతుతో సంబరంగా ఇంటి గేటు ముందుకు ఉరికి మా అమ్మను కావిలించుకుని అమ్మను చూసి, ఆవిడ స్పర్శని ఎరిగి జన్మజన్మాంతరాలయినట్లు ఆవిడని అలానే కరుచుకు ఉండిపోయేవాడిని.

మైసూర్ మహరాణివారు మహరాణీ క్లబ్బుకి నిత్య సందర్శకురాలు. ఆవిడది చదరంగం ఆడటంలో మహా అన్యాయమైన ప్రతిభ. మా అమ్మ ఆ అటలో అఖండ ప్రజ్ఞావంతురాలు, అయినా ఆవిడ తనతో ఆట ఆడటానికి సహ ప్రత్యర్థిగా మా అమ్మగారినే కోరుకునేది. రాణిగారు కోరుకున్నాకా ఇక దేనికని కరువు? ఆవిడ ఎదురు కుర్చీలో కూర్చోవడం మా అమ్మకు తప్పేది కాదు. రాణిగారు ఒక్కో ఎత్తు వేయడానికి ముందు తెగ ఆలోచించి, సందేహించి, ముందు వెనుకలయిన పిదప కానీ ఒక్కో గడిని దాటరు, ఆవిడ గౌరవార్థం మా అమ్మ అన్నిగంటలు అలా మహా సహనంతో కూచుని, చూసి చూసి చివరకి రాణిగారు వేసే పేలవమైన ఎత్తులన్నింటికి ఒక ఉత్తమ పౌరధర్మంతో తల ఒగ్గి, ఆ విధంగా ఘనత వహించిన రాణిగారిని చదరంగపు ఆటలో గెలిపించి రాణిగారిని ఎంతో సంతోషపరిచేది. అంతటితో ఆయిపోతుందా రాజులతో వ్యవహారం, ఆ చదరంగపు హోరాహోరీలో విజయాన్ని కైవసం చేసుకున్న మహరాణివారి ఆనందభరిత ఆహ్వానం మేరకు ఆవిడతో పాటు అమ్మ వారి అంతఃపురానికి వేంచేసి ఆపై అక్కడ వారితోపాటు విందుభోజనాలు ఆరగించాలి. ఇక్కడ ఇంట్లో నేను కిటికీ చువ్వలకు వ్రేలాడబడి ఆరున్నొక్క రాగం అతి తీవ్రస్ఠాయిలో ఆలాపిస్తూ ఉండటంతో, దానిని భరించలేక భరిస్తూ మా నాన్నగారు లావాని నిండుగా నింపుకుని కూడా కక్కలేని ఒక అగ్నిపర్వతంలా రెండు చేతులు తన నడుముపై పెట్టుకుని తీక్షణంగా ఆ చీకట్లో చూస్తూ నిలబడేవారు.

నిత్యకృతం అయిన ఇటువంటి ఒక ఏడుపుగొట్టు సాయంత్రాల్లోని ఒక సాయంత్రం నన్ను సముదాయించే పని మా శీను అన్నయ్య తీసుకున్నాడు ‘అరేయ్ చిన్నా లక్ష్మణా! ఇటు చూడ్రా ఇటు’ అని సన్నగా ఈల వేస్తూ తన జేబులోంచి ఒక పేనాని తీసి అక్కడ ఉన్న తెల్లకాగితాలపై బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. తొలుత కొందరు స్త్రీల, పురుషుల మొహాలు గీశాడు, అ తరువాత మనుషులు నడుస్తున్నట్లు, ఉరుకుతున్నట్లు, వంగి ఏదో తీసుకుంటున్నట్లు, తలలపై బరువులు మోసున్నట్లు బొమ్మలు వేస్తున్నాడు. నాకైతే ఏదో మాయాజాలం చూస్తున్నట్లుగా ఉంది. ఆ తెల్లని ఖాళీ కాగితంపై మంత్రం వేసి మనుషుల్ని మొలిపించినట్లు, అంతటి నా ఏడుపంతా ఏమయిందో! అసలు నాకు మాట రానట్లే అయిపోయింది, మా అన్న చేస్తున్న ఆ చిత్రరచన చూస్తూ ఉంటే. ఒక్కసారిగా ఇల్లంతా, తుఫాను వెలిశాక జనం అంతా చేసేట్టు, మా ఇంట్లోని జనాభా అంతా హమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నట్టుగా అయిపోయారు. అంతలో మా అమ్మ కూడా వచ్చేసింది. ఆమె కారు నుండి కాలు దింపి ఇంట్లోకి అడుగు పెట్టేలోగానే ఆవిడకు తోడుగా రాజుగారి కోటనుండి వచ్చిన కొంతమంది భృతులు తమ చేతులనిండా ఇంతింత బరువులు నిండిన బుట్టలు తెచ్చి, ఇంట్లో దింపి నమస్కారమని సెలవు తీసుకున్నారు. ఆ బుట్టల నిండా రకరకాల మిఠాయిలు, పళ్ళు, బాదాము పిస్తాలు, గోడంబి, ఇంకా కిస్మిస్‌లు ఉన్నాయి. ఈ రుచికరమైన పదార్థాలను చూడగానే మా తండ్రిగారి కోపం గాలికి ఎగిర్పోయి దాని మీదకు ఒక చక్కని చిరునవ్వు తెరలా వచ్చి వాలింది. ఆయన చేయి చాపి ఆ బుట్టల్లో నుండి ఒక మిఠాయిముక్క తీసుకొని, దానిని తన నోట్లోకి నెట్టి ఏదో ఒక కూనిరాగం తీసుకుంటూ లోపలి గదిలోకి వెళ్ళిపోయారు.

నా బాల్యమంతా భలే ఉల్లాసంగా గడిచింది. ఉదయాన్నే మా ఇంట్లోని పెద్దపిల్లలు గబగబా తయరయ్యి తమ తమ కాలేజీలకి లేదా పాఠశాలకి పరిగెత్తేవారు. నాన్న తన హెడ్మాస్టర్ ఉద్యోగ నిమిత్తం ఆయన బడికి ఆయన బయలుదేరడం ఎట్లాగూ తప్పదు. అమ్మేమో ఉంటే పూజామందిరంలో లేదా వంటగదిలో. మిగిలినదల్లా అంత పెద్ద ఇంట్లో నేనూ నా పరిగెత్తే కాళ్ళు, లేదా నా బొమ్మలేసే చిట్టి వేళ్ళు మాత్రమే. ఒక్కడ్ని అలా ఇల్లంతా నడుస్తూ, దొర్లుతూ, గెంతుతూ తిరిగేవాణ్ణి. తెల్లని సుద్దముక్క పుచ్చుకుని ఇంటి నల్లరాతి నేలపై తెల్లని బొమ్మలు వేసేవాణ్ణి. నల్లని పెనిసిల్ ముక్క పట్టుకుని తెల్లని ఇంటి గోడలపై బొమ్మలు ఎక్కించేవాణ్ణి. ఎందుకనో నాకూ ఒక బడికి వెళ్ళే వయసు ఆసన్నమయిందని మా అమ్మానాన్నలకు అనిపించనేలేదు. ఇది ఇలా నడుస్తుండగా ఒక రోజు మదరాసు నుండి ‘విధి బలీయమైనది’ అనే మాట ఒకటి మా మేనమామల్లో ఒకడి రూపం ధరించి మా ఇంటికి వచ్చింది. మిగతా బాలల ప్రపంచం అంతా పాఠశాల గదుల్లో బందీ అయిన సమయంలో కూడా నేను మాత్రం అటువంటి పట్టింపు అనేదేమీ లేకుండా ఇల్లంతా రికామీగా ఆడుతూ పాడుతూ హాయిగా ఉండటం ఆయనకు బొత్తిగ నచ్చలేదు. అందుకని ఆయన తన బుద్ధికుశలత అంతా వినియోగించి ఆలోచించి నాకు కాని, నా తలిదండ్రులకు కానీ ముందస్తు సమాచార హెచ్చరిక ఏమీ ఇవ్వకుండా నన్ను అమాంతం ఎత్తుకుని మా ఇంటి సమీపంలో ఉన్న ఒక ప్రాథమిక పాఠశాలకు చేరుకున్నాడు. ఆ బడి ప్రధానోపాధ్యాయుడిని కలుసుకుని నేను ఎటువంటి గొప్ప తలిదండ్రుల కడుపున పుట్టిన ఎటువంటి కొడుకునో చెప్పాడు. ఇక నన్ను సంస్కరించవలసిన బాధ్యత అంతా ఆ ప్రధానోపాధ్యాయుడుగారి రెండు భుజాలదే అన్నాడు. మా అమ్మానాన్నల పేరు వినగానే వారు పులకించిపోయి నన్ను వెంటనే ఎ సెక్షన్‌లో చేర్చారు. మామయ్య ఆ హెడ్‌మాస్టర్‌కి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. మామయ్య నన్ను అక్కడ విడిచేసి బయలుదేరి వెళ్ళిపోవడం చూసి నేను అందరి ముందు సిగ్గు అనేది లేకుండా ఒక పెద్ద ఏడుపు ఏడుస్తూ చుట్టూ ఉన్నవారిని విదిలించుకుని ఆయన వెనకే పరుగెత్తాను. ఆయన ఆగి వెనక్కి తిరిగి చూసి నన్ను తిరిగి బడికి వెళ్ళమని హెచ్చరించి మళ్ళీ ఇంటి వైపు నడవడం ప్రారంభించాడు. నేను ఆయనని కాస్త దూరం వెళ్ళనిచ్చి ఆ వెనుకే ఆయనని అనుసరించాను. ఆయన మళ్ళీ ఆగిపోయాడు. నేను కూడా ఆగిపోయాను. ఆయన కదిలాడు. నేనూ కదిలాను. ఈ విధంగా మేము ఇద్దరం విజయవంతంగా ఇంటికి తిరిగి చేరుకున్నాము. అక్కడ ఇంటి దగ్గర మా అమ్మ నా కోసం వెదుక్కుంటూ ఉన్నది. ఇంట్లో అమ్మ ఉనికి నన్ను ఆ మామయ్య మరియు ఆయన నిర్బంధ విద్య నుండి రక్షించింది. ఈ బలాత్కారముగా బడికి పంపుట అనే తాత్కాలిక అనుభవం తర్వాత నేను మళ్ళీ నా పాత రెక్కలు తొడుక్కుని మా ఇంట్లో హాయిగా, మామూలుగా ఎగరడం ప్రారంభించాను.

(సశేషం)


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...