లెక్కలు తెలియని లోకులు!

ఏమి లాభం? ఎంత నష్టం? కులం ముఖ్యమా? పార్టీ ప్రధానమా? తానాకి అడుగుదామా? తందానా వెంట పడదామా? కాళ్ళా? గడ్దమా? మోకాళ్ళా? ఎంతవరకు వంగితే ఎంత ఎత్తుకు ఎదగవచ్చు? విజయానికి, హోదాకు, కీర్తికి, పీఠానికి, పదవికి అయిదేనా మెట్లు? మెట్టు మెట్టుకు మొక్కవలసిన కాళ్ళెన్ని? చేరి చేరి ఎవరెవరిని రంజింప చేయవలెను? దూరి దూరి ఏ ఏ గ్రూపులో సభ్యులుగా కర్చీపు పరవవలెను? ఏది దారి? నించోవలసిన శిఖరానికి దిక్కేది? ఇవన్నీ నాకు రోజూ కనపడే జీవితాల తాలూకు చిట్టాపద్దు! లెక్కాచారం! ఆదాయ వ్యయం! ఈ మీమాంసల మధ్య నుండి ఉక్కిరిబిక్కిరవుతూ రోడ్డు మీద రేగే దుమ్ము పీలుస్తూ హైద్రాబాద్ ట్రాఫిక్ నుండి తప్పించుకుంటూ ఇంటికి వచ్చి బాసింపట్టేసుకుని కూచుంటానా! ఎదురుగా పుస్తకాల గూట్లో నుండి కొద్దిమంది చల్లని మనుషుల సేద తీర్చే పలకరింపుల వైపు చూసి ఒక పుస్తకం అందుకుని ఎక్కడో ఒక చోట పేజీ విప్పి కూర్చుంటానా! పుస్తకాల పంక్తుల మేఘాల మీదుగా బూరుగు మేఘం వంటి గడ్డం మీసం తగిలించుకుని ఋషి రవీంద్రనాథ్ ఠాగోర్ పలకరిస్తారు కదా ఇలాని.

ఎక్స్‌ఛేంజ్ గజెట్ పత్రికలో ఏదో ఒక ప్రకటన చూసి వొకనాడు మధ్యాహ్నం జ్యోతి అన్నయ్య వేలం జరిగే చోటికి వెళ్ళాడు. తిరిగి వచ్చి తాను ఏడువేల రూపాయలకు వొక నౌకా కళేబరం కొన్నానని చెప్పాడు. దీని మీద గదులు కట్టి ఇంజను తగిలిస్తే పూర్తి వోడ తయారవుతుంది. మన దేశీయులు కలం బాగా నడుపుతారు, కాని వోడ నడపడం ఎరుగరు. ఈ బాధ అన్నయ్య మనసులో వుండేదనుకొంటాను. దేశంలో అగ్గిపుల్లలు తయారు చేయించాలని వొకప్పుడు అతను ప్రయత్నించాడు. దేశంలో నేత యంత్రాలు నడపాలని అతనికి ఉత్సాహముండేది. దాని తరువాత స్వదేశీ ప్రయత్నంలో నావలు నడపడానికి అతడు హటాత్తుగా నౌకా కళేబరం వొకటి కొన్నాడు. ఆ కళేబరం ఇంజనుతోనూ, గదులతోనూ పూర్తి కాక–అప్పులతో, సర్వనాశనంతోనూ–పూర్తి అయింది. అయినా ఆ నష్టమంతా అతడు వొక్కడే భరించాడు; కాని దాని లాభము తన దేశీయ ఖాతాలో జమకట్టే ఉందని మాత్రం ఇప్పుడు జ్ఞాపకముంచుకొవాలి. ప్రపంచములో ఇలా లెక్కలు తెలియని లోకులే దేశ కర్మక్షేత్రం మీద మాటిమాటికీ నిష్పల అధ్యవసాయం వరదపారించి పోతారు; ఆ వరద హటాత్తుగా వచ్చి హటాత్తుగా వెళ్ళిపోతుంది, కాని అది పొరలు పొరలుగా వొండ్రు పెట్టి దేశభూములను సారవంతము చేస్తుంది- పంటకారు వచ్చినప్పుడు ఆ మాట ఎవ్వరికీ జ్ఞాపక ముండదు. కాని జీవనమంతా నష్టమే వెద పెట్టుతూ వచ్చినవారు, జీవనాంతము తరవాత కూడా ఈ నష్టమును అనాయాసంగా భరించి సహింపగలరు.

ఒక వైపు ఫ్లొటిల్లా&కో సీమ కంపెనీ మరొక వైపు అన్నయ్య వొక్కడూ. వీరిద్దరి మధ్యా నౌకా వాణిజ్య యుద్దము క్రమంగా ఎలా ప్రచండరూపం తాల్చిందో ఖుల్నా బారిశాల్ తీరప్రజలు బహుశా ఇప్పటికి కూడా మరిచిపోయి వుండరు. పోటీల వల్ల వోడ తరువాత వోడ తయారయింది. నష్టం మీద నష్టం ఇంటి మీద పడ్డది. ఆదాయం క్రమంగా తగ్గి రానురాను టిక్కెట్ల విలువ కూడా లుప్తమైపోయింది. అంతట బారిశాల్ ఖుల్నా స్టీమర్ లైనులో సత్యయుగం అవతరించింది. ప్రయాణికులు టిక్కెట్లకు సొమ్ము చెల్లించకుండా ప్రయాణం చెయ్యడమే కాదు, డబ్బు లేకుండా వూరికే మిఠాయీలు తినడం కూడా ఆరంభించారు. బారిశాల్ వాలంటీర్ల దళం స్వదేశీ కీర్తనలు పాడుతూ నడుములు కట్టి ప్రయాణికులను సంతరించే పని మొదలు పెట్టారు. అందుచేత వోడ ప్రయాణికుల కరువు తీరిపోయింది; కాని తక్కిన అన్నీ రకాల కరువూ హెచ్చింది. తగ్గలేదు. గణిత శాస్త్రపుటలలో స్వదేశ ప్రేమను ప్రవేశ పెట్టేదారి దొరకలేదు; కీర్తన ఎట్టిదయినా కాని, ఉత్తేజన ఎంతయినా పెరగనీ, గణితము తన పేరు తాను మరిచిపోలేదు–అందుచేత అది మూడు మూళ్ళు తొమ్మిది అయి సరిగ్గా తూనీగల గెంతులేస్తూ ఋణము దారినే అడుగులు చాచింది.

జ్యోతి అన్నయ్య వంటి అవ్యవసాయ భావుకుల దురదృష్టమేమిటంటే లోకులు వాండ్లను ఇట్టే కనిపెట్టివేస్తారు. లోకులను మాత్రం వీరు కనిపెట్టలేరు. తమ లోపం తాము గుర్తించేసరికి ఎంతో కాలం పట్టుతుంది. అందుచేత ఆ అనుభవ ఫలితం వాళ్ళు అనుభవించలేరు. ప్రయాణికులు డబ్బక్కరలేకుండా ఫలహారాలు తింటూ వుంటే జ్యోతి అన్నయ్యగారి ఉద్యోగులు తపస్యులలాగా ఉపవాసాలున్నారా? ఆ నిదర్శనాలు కనపడలేదు. ప్రయాణికుల కోసమే ఉపహారాల ఏర్పాటు వుండేది. ఉద్యోగులూ ప్రయాణికుల్లో భాగస్థులే అయినారు. జ్యోతి అన్నయ్య మాత్రం తన సర్వస్వమూ నష్టపోయినాడు.

అప్పుడు ఖుల్నా బారిశాల్ నదీపథంలో ప్రతి దినమూ ఈ జయాపజయాల వార్తలు ఆలోచిస్తుంటే మా ఉత్తేజనకు అంతముండేది కాదు. తుదకు వొకనాడు ‘స్వదేశీ వోడ’ హౌడా వంతెనతో డీకొని పగిలి మునిగిపోయిందని కబురు వచ్చింది.ఇలా ఓడల వ్యాపారం శక్తికి మించిపోయింది. తన దగ్గర ఏమీ మిగలకుండా అయిపోయినాడు అన్నయ్య. నావల నడక బందయింది.

ఏముందీ మాటల్లో? స్వంత లాభమా? పేరు ప్రసిద్ది కెక్కడమా? ఇల్లు, వోడ కూడా పట్టనంత ధనాన్ని అర్జించడమా? వీలయితే మళ్ళీ, మళ్ళీ చదవండి.

నేనూ, నాది, నాకు అనే నా రోజువారి ప్రతిబింబాల నుండి ఒక్కసారిగా ఈ మాటలు నన్ను కాలం వెనక్కి తీసుకెళ్ళి సుడిగాలిలో చిక్కి అంతర్ధానమైన జ్యోతింద్రనాథ్ వంటి అవ్యవసాయకులను పరిచయం చేసుకోవడం, వారి చేతుల్లో మొహన్ని దాచుకోవడం, వాటిని ముద్దాడుకోవడం చేస్తాయి.

దేశం కోసమని, మన కాళ్ళ మీద మనం నిలబడి చూపాలని ప్రయత్నించి – అప్పులతో, నష్టాలతో సర్వనాశనంతోనూ మిగిలిన మనుష్యులు ఎంతమందో! ఆ నష్టమంతా వారే భరించారుట; కాని దాని లాభము మన దేశీయ ఖాతాలో జమకట్టారని మాత్రం మనకు పాఠాలు ఎవరూ నేర్పలేదెందుకని? నిజమే! ప్రపంచములో ఇలా లెక్కలు తెలియని లోకులే దేశ కర్మక్షేత్రం మీద మాటిమాటికీ నిష్పల అవ్యవసాయం వరద పారించి పోతారు; ఆ వరద హటాత్తుగా వచ్చి హటాత్తుగా వెళ్ళిపోతుంది, కాని అది పొరలు పొరలుగా వొండ్రు పెట్టి దేశభూములను సారవంతము చేసింది- పంటకారు వచ్చినప్పుడు ఆ మాట ఎవ్వరికీ జ్ఞాపక ముండదు. అపుడపుడూ గొప్ప సాహిత్యం వచ్చి ఆ మాటలు, ఆ విషయాలు గుర్తు చేస్తాయి. అందుకోసమే సాహిత్యం అందునా గొప్ప సాహిత్యం ప్రతిసారి అత్యంత అవసరం అవుతుంది. కుర్రతుల్ ఐన్ హైదర్ చెపినట్లు మంచి సాహిత్యాన్ని తక్కువమంది చదువుతారు. చవకబారు సాహిత్యాన్ని చదివేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ చవకబారు సాహిత్య ప్రభావం కూడా వారి మీద ఎక్కువగానే ఉంటుంది. అయితే మంచి సాహిత్యం మనల్ని చదవమని నిలదీస్తుంది. ఇవాళ చదవకపోయినా మరో పదేళ్ళ తర్వాత నైనా సరే, చదివి తీరతాం.


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...