మొత్తం మీద నా జీవితం టైమ్స్ ఆఫ్ ఇండియా లోపల కానీ బయట కానీ హుషారుగానే గడిచిపోతోంది. కానీ రోజులు గడిచేకొద్దీ నాకు ఇష్టమైన, నేను ఆశపడ్డ, నేనెంతగానో కలలు కన్న రాజకీయ కార్టూనులు గీసే పనిని మాత్రం చేయలేకపోతున్నాను అనే ఆలోచన నా మనస్సుని చీకాకు చేస్తూ పీడిస్తూ వస్తున్నది. వారపత్రికలో కథలకు వేసే బొమ్మలలోనో లేదా పిల్లల పత్రిక కోసం గీసే బొమ్మల కథలలోనో నాకేమీ అభిరుచి లేదు, ఈ పనిలో ఎదుర్కోవడానికి నాకెటువంటి సవాళ్ళూ లేవు. ఇలా కథలకు వేసిపెట్టే చెక్క బొమ్మలతో నా బుర్రలో తెలివితేటలు కూడా మొద్దుబారి పోతున్నాయని, గడ్డకట్టుకు పోతున్నాయని నాకు చాలా దిగులుగా ఉంది.
నావంటివాడు ఉంటే గింటే రాజకీయ కార్టూనిస్ట్‌గానే ఉండాలి. వార్తలు చదవడం, ఆలోచించడం, వాటి ఆలంబనతో రాజకీయ కార్టూన్లు గీయడం. ఎంత మన్నికైన పని! ఆ వెటకారాన్ని, సునిశిత వ్యంగ్యాన్ని ఊహించడంలో ఎంత మజా ఉంటుంది. బుర్ర ఎంత పదునుగా పని చేస్తుంది. చేయవలసిన పని చేయకుండా హయ్యో! నేనేం చేస్తున్నా? నేనెందుకిలా చేస్తున్నా! అని అనునిత్యం ఈ ఆలోచనతోనే సతమతమైపోతూ ఉన్నా.
ఒక రోజా, రెండు రోజులా! వారం పదిరోజులా! ప్రతి రోజూ ఈ వేదనే నన్ను ముంచేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా రోజువారీ దినపత్రికల్లో రాజకీయనాయకుల వెర్రి ప్రసంగాలు, పార్టీల పిచ్చినివేదికలు చదివినపుడల్లా నా ప్రాణం గుంజుకుపోతూ ఉండేది. అబ్బా! ఈ వార్తకు ఎంత మంచి కార్టూన్ పడాల్సింది. అసలు ఐడియా పేలిపోయేది. కార్టూన్‌ని చూసి మంత్రిగారి మొహం వాడిపోయేది! అయ్యయ్యో! గొప్ప కార్టూన్ వేసే అవకాశం పోయిందే! అని నేను చింతించే ఖచ్చితమైన సమయంలోనే ఎవరో ఒకరు ఎదురుపడి ‘అరే, లక్ష్మణ్! ఫ్రీ ప్రెస్ జర్నల్‌లో నీ కార్టూన్లు బాగా మిస్సయ్యాము. పొనీ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనయినా చూడవచ్చులే అనుకుంటే ఇంకా నీ కార్టూన్లు అచ్చు అవడం లేదేమీ?’ అని తరచూ చేసే పరామర్శలు పుండు మీద కారంలా మంట పుట్టించేవి. ఇక ఈ హింసని తట్టుకొలేక నేను నాకోసం, కేవలం నా ఆత్మ సంతృప్తి కోసం, నా స్వంతానికి రాజకీయ కార్టూన్లు వేసుకోవడం ప్రారంభించాను. వీటివల్ల నాకు కాస్త మనశ్శాంతిగా ఉండేది, పనిలో సాధన నడిచేది. కొంత కాలం గడిచాకా ఇక ఏవైనా సరే మా పత్రికా సంపాదకుడిని వ్యక్తిగతంగా కలిసి, నా పొలిటికల్ కార్టూన్ల గురించి మాట్లాడాలని గట్టిగా నిశ్చయించుకుని వెళ్ళి ఎడిటర్‌గారి పి.ఎ.ని కలిసి ఎడిటర్‌తో మాట్లాడటానికి సమయం కుదర్చమని అడిగాను.
మా పత్రిక సంపాదకుడు బ్రిటీష్ దేశస్తుడు. బర్మా యుద్దంలో పాల్గొని ఉండిన మాజీ సైనికాధికారి. ఎలాగోలా ఆయనని కలవడానికి నాకు సమయం దొరికింది. ఈయన చాలా మంచివాడు. నన్ను తన ఎదురుగా కూర్చుండపెట్టుకుని చాలా ఓపికగా నా ఘోషనంతా విన్నాడు. అతని ముందు ఎంత నా బాధని వెళ్ళబోసుకున్నా ఇప్పటికిప్పుడు నన్ను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆస్థాన కార్టూనిస్ట్‌గా నియమించి నాతో పొలిటికల్ కార్టూన్లు వేయనిచ్చే అవకాశం లేదని నాకు ఖచ్చితంగా తెలుసు. అయితే నేను నా తృప్తి కోసం ఆయనని కోరినదల్లా ఒకటే. నేను ప్రతి రోజూ గీస్తున్న రాజకీయ కార్టూన్లు ఏమీ పత్రికలో ప్రచురించనవసరం లేదు. ఆయన కేవలం రోజులో ఏదో ఒక సమయంలో నేను గీసే కార్టూన్లు పరిశీలిస్తే చాలు. ఈ పని నన్ను ఏదో ఒక విధంగా పొలిటికల్ కార్టూన్‌కు దగ్గరగా ఉండనివ్వడమే కాకుండా, నా పని మీద ఆయన సలహాలు, విమర్శనాత్మక సూచనలు నాకు అందుతాయి. ఆ సూచనలను బట్టి నేను భవిష్యత్తులో ఒక మంచి రాజకీయ కార్టూనిస్ట్‌గా ఎదగడానికి అది ప్రయోజనకారి అవుతుందని నేను ఆయనకు విన్నవించుకున్నాను. నా వింత, అసాధారణమైన కోరిక గురించి అతను కాసేపు ఆలోచించాడు. నా పని పట్ల తనకున్న వ్యక్తిగత అభిమానాన్ని వ్యక్తం చేస్తూనే, నా పట్టుదలను, ఎదగాలనే కోరికను ఎంతగానో ప్రశంసించాడు–అనుభవం దృష్ట్యా, వయసు దృష్ట్యా ఒక రాజకీయ కార్టూనిస్ట్ పాత్రను పోషించడానికి నాకు ప్రస్తుతం ఉన్న వయసు చాలదని, కానీ నాకు పనిమీద ఉన్న శ్రద్దాశక్తులను బట్టి భవిష్యత్తులో నేను ఒక గొప్ప ఉన్నత స్థానాన్ని చేరుకుంటానని తను ఆశిస్తున్నాననీ. ప్రస్తుతం నేను కోరుకున్న విధంగానే నేను గీసే పొలిటికల్ కార్టూన్లు ఆయన చూడటానికి అంగీకరించాడు- ప్రచురణ కోసం ఏమాత్రం కాదు అని గట్టిగా నొక్కి చెబుతూ.
అల్లుకుపోవడానికి అది చాలు నాకు. నేను మామూలుగా పత్రికకు గీసిపెట్టే బొమ్మలతో పాటూ రోజు విడిచి రోజు రాజకీయ కార్టూన్లు వేయడం, వాటిని ఎడిటర్‌కి చూపించడం చేస్తూ ఉండేవాడిని. ఆందులో కొన్ని కార్టూన్లు చూసి ఆయన చిరునవ్వు నవ్వేవాడు. కొన్ని కార్టూన్లు చూస్తూ సాలోచనగా తల పంకించేవాడు. కొన్ని కార్టూన్లు చూసి గట్టిగా పగలబడి నవ్వేవాడు. కొన్ని కార్టూన్లలో భావం అర్థంకాక నన్నే వివరించమని కోరేవాడు. మరి కొన్ని కార్టూన్లను చూసి నవ్వాపుకోలేక శభాషని, టేబుల్‌పై పెద్ద చరపు చరిచి, ఫోన్ అందుకుని తన మాదిరే ఆ కార్టూన్‌లోని విషయం చూసి ఆనందించడానికి కొంతమంది పత్రికా ఉద్యోగులను తన గదిలోకి ఆహ్వానించేవాడు.
ఇలా కొంతకాలం సాగింది. నేను నా టేబుల్ సొరుగులో ప్రచురించని కార్టూన్‌లను కట్టలుగా పోగుచేస్తున్నాను. రాన్రాను ప్రచురణకోసం కాని కార్టూన్లను వేయడం పట్ల నాకు ఆసక్తి పోయింది. మళ్ళీ నాలో నిస్పృహ మొదలయ్యింది. అలా గడుస్తున్న రోజుల్లో ఒక రోజు ఎడిటర్ నన్ను తన గదిలోకి పిలిచి ఆ ముందు రోజు నేను వేసిన కార్టూన్ తీసుకురమ్మని చెప్పాడు. అది నేను బెర్లిన్ దిగ్బంధనం మీద వచ్చిన వార్త ఆధారంగా వేసిన కార్టూన్. మౌనంగా ఆయనకు ఆ కార్టూన్ ఇచ్చి, చేతులు ఊపుకుంటూ సంపాదకుడి గది నుండి బయటకు వచ్చా. మరుసటి రోజు మా పత్రిక ఈవినింగ్ ఎడిషన్‌లో నేను వేసిన కార్టూన్ కనిపించడం చూసి నన్ను నేను నమ్మలేకపోయా. చాలా సంతోషమనిపించింది. క్రమంగా అడపాదడపా నా కార్టూన్లు ఈవినింగ్ న్యూస్‌లో కనపడ్డం మొదలయ్యింది.
కొన్ని వారాల తర్వాత ఎడిటర్ నన్ను మళ్ళీ పిలిపించి భారతదేశానికి ప్రపంచబ్యాంకు ఇచ్చిన రుణంపై నేను వేసి ఉన్న కార్టూన్‌ని తెమ్మని చెప్పాడు. ఆ తరువాతి రోజు ఆ కార్టూన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో మొదటి పేజీలో కనిపించింది. అది మొదలు. అప్పటి నుండి నేను ఇక నాకోసం, నా సాధన కోసం కాక అచ్చంగా టైమ్స్ దినపత్రిక కోసమే కార్టూన్లు గీయడం ప్రారంభించాను.
ఇంతవరకు ది టైమ్స్ గ్రూప్ అని పిలువబడే బెనెట్ కోల్‌మన్&కంపెనీ లిమిటెడ్ క్రమంగా భారతీయ యాజమాన్యం చేతుల్లోకి మార్చబడింది. మార్పులో భాగంగా పత్రికలోని బ్రిటీష్ సిబ్బందిని క్రమంగా సడలించారు. ఆ స్థానాల్లో భారతీయులకు ఉపాధి కల్పించడం మొదలయ్యింది. ఆ మార్పులో భాగంగా నేను పత్రిక ఆర్ట్ డిపార్ట్‌మెంట్ నుండి టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ పొలిటికల్ కార్టూనిస్ట్ హోదాతో పత్రికా సంపాదకీయ విభాగానికి మార్చబడ్డాను. ఇప్పుడు నేను ‘ఆర్కే లక్ష్మణ్, ది చీఫ్ పొలిటికల్ కార్టూనిస్ట్’ని. ఆ రోజు మొదలుకుని అర్ధ శతాబ్దం వరకు నేనూ నా కార్టూన్సూ టైమ్స్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రయాణం కొనసాగించాము. పత్రికలో కార్టూన్లు వేస్తూ కూడా నేను టైమ్స్ వారపత్రికలో కథలు, కథనాలకు బొమ్మలు వేస్తూనే వచ్చాను. దానికంటూ నాకు వేరుగా పారితోషికం ఇచ్చేవారు. అలానే నాదంటూ ఒక ప్రత్యేక శీర్షికతో జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల కేరికేచర్‌లు చిత్రించేవాడిని. ఆ బొమ్మలన్నీ ఒక పూర్తి పేజీలో రంగుల్లో అచ్చయ్యేవి.
(సశేషం)