కవిత్వం అమృతమవ్వాలి

వేసవి తాపానికి
చిక్కిపోయిన
పిల్ల కాలువలా
ఆలోచనలు
ప్రవహించనప్పుడు
పదాలు పేర్చి
అసందర్భ వాక్యాలతో
కవితలల్లకు

పుట్టినచోట,
నడుస్తున్న త్రోవంతా
కుంభ వృష్టిలో ములిగి
ఒడ్డు దాటి జరజరా
పొంగిపొర్లుతోన్న
ఉధృతమైన నదిలా

దొంతర్లు దొంతర్లుగా
తొట్రుపడుతూ
అతలాకుతలమౌతున్నట్లు
కాలు నిలవలేకుండా ఉన్నప్పుడు
అప్పుడు రాయి
కవిత్వమో, కథో

అంతవరకూ
అంతర్జల ఊరనీ

బాణం దిగగానే
సర్రున గంగ
పైకి రావాలి
కవిత్వం అమృతమవ్వాలి