ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 7

అది అలా ఉండగా ఇక్కడ మైసూర్‌లో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. పండగ పదిరోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. జనంతో నగరమంతా కిక్కిరిసిపోయింది. ధగధగా ఎలక్ట్రిక్ బల్బుల వెలుగులో ఆ పదిరోజులు మైసూర్ నగర రాత్రుళ్ళు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. మైసూరు నడిబొడ్డున మహరాజ ప్యాలెస్ లెక్కలేనన్ని విద్యుత్ దీపాలని సింగారించుకుని దీప్త ప్రకాశితః కాగడాలా వెలుగులు విరజిమ్ముతూ ప్రతి పర్యాటకుడి చూపులకు ఆకర్షణా కేంద్రమై కూచుంది.

మైసూరు నగర దసరా ఉత్సవాల సంగతి జద్విఖ్యాతమే కదా, ఈ పండగ సంబరాలను చూడ్డానికి భారతదేశం నలుమూలల నుండే కాదు విదేశాల నుండి సైతం సందర్శకులు మైసూర్‌కు తరలివచ్చారు. వట్టిగా ఉత్సవాలని మాత్రమే చూట్టానికి వచ్చిన సందర్శకులు ఒక్కరు మాత్రమే కాదు, దేశం నలుమూలల నుండి భారీ సంఖ్యలో వచ్చిన వ్యాపారులు, ఇంకా అనేకానేక వస్తువుల తయారీదారులు కూడా తాము తయారుచేసిన రకరకాల వస్తువులను ప్రదర్శించడానికి ఆ వస్తు సముదాయాలతో ఇక్కడ దిగిపోయారు. ఈ వస్తువులన్నిటి కోసం, విందు వినోదాల ప్రదర్శన కోసం లెక్కలేనన్ని కొట్లు, దుకాణాలు, గుడారాలతో కూడిన విస్తారమైన మాయా దసరా బజారునొకదాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ దసరా బజారులో వస్త్రాలు, యంత్రాలు, సౌందర్య సాధనాలు, క్రీడా వస్తువులు… ఒకటా రెండా పదులా ఇరవైలా! వందల కొద్ది వస్తువులు… అలాగే జనం సరదా కోసం రకరకాల వినోద క్రీడా ప్రాంగణాలు, ఇంద్రజాల ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు మొదలైనవి కొలువుతీరి ఉన్నాయి. మైసూర్‌లోని జనాభా మొత్తానికి ఈ ప్రాంతం సాయంత్రానికి ఒక ఆటవిడుపు, ప్రతి సాయంకాలం అందరూ ఈ వేదిక వద్దకు వస్తారు. ఊరిలో ఉండి కూడా సంవత్సరాల తరబడి కలుసుకోడానికి కుదరని పాత మిత్రులను, పరిచయస్తులను, బంధుమిత్రులను అందరినీ ఇక్కడ కలుసుకోవచ్చును. ఇటువంటి కలయికల్లోనే చాలా కాలం క్రితం మరచిపోయిన ముఖాలు గుర్తుకు వస్తాయి. కొత్త మొహాలతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ ఉత్సవాలల్లో గుమికూడిన జనం అంతా హాయిగా ఆనందంగా మహోత్సాహంగా ఉంటారు. పనికట్టుకుని ఫలానా ఏమయినా కొనడానికే అంటూ జనం ఇక్కడికి రాకపోయినా ఈ దసరా పది రోజులు ఆటవిడుపుగా, కాలక్షేపంగా వచ్చి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, తింటూ, నవ్వుతూ తిరుగుతూ, తుళ్ళుతూ చాలా సరదాగా ఉన్నారు. నేనయితే పదే పదే ఈ ప్రాంతానికి తడవకొకమారు మా అన్నలతో, నా స్నేహితులతో కలిసి వచ్చి ఈ ప్రాంగణమంతటిని రంగులరాట్నంలా తిరిగిందే తిరగడం. నా పదే పదే ఈ తప్పనిసరి సందర్శనకు మరో ముఖ్య కారణం కూడా ఉంది. అదే అక్కడ జరుగుతున్న చిత్రకళా ప్రదర్శన.

ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. ఇక్కడ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, హైదరాబాద్‌లతో సహా ఇంకా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ చిత్రకారులు చిత్రించిన ఎన్నో కళాఖండాలు ప్రదర్శించబడతాయి. వీటిని శ్రద్దగా పరిశీలించి బహుమతులు ఇవ్వడానికి చిత్రకళా నిపుణుల బృందం ఒకటి ఉంది. వారు ఎంపిక చేసిన ఉత్తమ కళాఖండాలకు బంగారు, వెండి పతకాలు ఇంకా నగదు బహుమతులు, యోగ్యతాపత్రాలను ప్రదానం చేసేవారు. నే ఇటుగా వచ్చిన ప్రతిసారీ ఆ ఆర్ట్ గ్యాలరీలో చాలా సమయం గడిపేవాడిని. కళాకారులు నీటి రంగులు, తైలవర్ణాలు, బొగ్గు, పెన్ను, ఇంక్‌ను వాడి చిత్రించిన ఈ బొమ్మలను ఆ చిత్రకళా పద్ధతులను చూసి నేను తెగ ఆశ్చర్యపోయేవాడిని. గత సంవత్సరమే నేను గట్టిగా అనుకున్నా కూడా, వచ్చే దసరా ఉత్సవాల బొమ్మల ప్రదర్శనలో నా బొమ్మలని కూడా ప్రదర్శనకు పంపాలని.

ఈ ప్రదర్శనకోసమేనని నేను ప్రత్యేకంగా మా మైసూర్ నగరంలో పేరుగాంచిన కొందరు వ్యక్తుల కేరికేచర్లని చిత్రించాను. ఇందులో మైసూర్ దీవాన్ సర్ మిర్జా ఇస్మాయిల్‌గారు కూడా ఉన్నారు. లలిత కళా ప్రదర్శన ప్రాంగణంలో ఈ రకమైన వ్యంగ్య చిత్రాలను అనుమతించడం ఇదే మొదటిసారి. నేను ఇలా వ్యక్తుల వ్యంగ్య చిత్రాలతో పాటు బజారులో కూరగాయలు అమ్మేవారితో బేరసారాలు సాగించే వ్యక్తులు, కోతిని భుజాన వేసుకుని వెడుతున్న సంచారి, పాల సీసా పగిలి ఏడుస్తున్న చిన్నారి, కొబ్బరిచిప్పతో చేసిన ఏక్‌తార వాయించే బిచ్చగాడు వంటి కొన్ని రంగుల బొమ్మలను కూడా చేర్చాను. వాటితో పాటుగా నా మూడేళ్ళ మేనల్లుడి రకరకాల కార్యకలాపాలను, అంటే వాడు బంతితో ఆడుకోవడం, పరుగెత్తడం, తినడం, నిద్రపోవడం, ఏడుపు , నవ్వు… మొదలైన విన్యాసాలని ఒక ఒక డజను పెన్సిల్ డ్రాయింగులుగా వేసి అవి కూడా ఈ ప్రదర్శనలో ప్రదర్శించాను. ప్రదర్శనకు బొమ్మలను ఎంపిక చేసే న్యాయనిర్ణయాధిపతుల బృందం వారి బొమ్మల ఎన్నిక చాలా కఠినంగా ఉంటుంది. బొమ్మలనయితే పంపాను కానీ నా బొమ్మలు తిరస్కరించబడతాయేమోననే ఒక భయం కూడా ఉండింది. కానీ నన్ను పూర్తి ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తూ నా బొమ్మలన్నీ ఈ ప్రదర్శనలో చేర్చబడ్డాయి. ఇది నా జీవితంలో ఒక గొప్ప క్షణం. చాలా సంవత్సరాల క్రితం నా ప్రైమరీ స్కూల్ టీచర్ నేను గీసిన రావి ఆకు బొమ్మని మెచ్చుకుని నా వీపు మీద తడుతూ నువ్వు గొప్ప చిత్రకారుడివి అవుతావురా అని నన్ను అభినందించిన క్షణం గుర్తుకు వచ్చింది! అది చిత్రకారుడిగా నా తొలి గుర్తింపు, ఈ రోజు దేశంలోని ప్రముఖ కళాకారుల సరసన నా కార్టూన్‌లు, బొమ్మలు ప్రదర్శించడం చూసి ఎంతో గర్వపడతాను. అంతే కాదు, నేను ప్రదర్శనకు ఉంచిన ‘నా మేనల్లుడు తుంబి చేష్టలు’ బొమ్మల శ్రేణి అక్కడి చిత్రకళా విమర్శకులను, న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకర్షించి ఆ బొమ్మలు నగదు బహుమతికి కూడా ప్రాప్తమయ్యి నాకు తెగ సంతోషాన్ని తెచ్చిపెట్టింది. చివరకు పదిరోజుల అనంతరం దసరా కార్యకలాపాలు ముగిశాయి. సందర్శకులు తమ ఇళ్ళకు బయలుదేరారు, రాత్రిళ్ళ ధగద్ధగాయమాన అలంకారిక లైట్లు ఆర్పివేయబడ్డాయి. జన సందోహపు గలగల శబ్దాలు, కిలకిల సందడీరావాలు తగ్గాయి. మైసూరుకు దాని సహజ నిశ్శబ్దం తిరిగి వచ్చింది.

అన్నిరోజుల్లాగే ఒకరోజు చీకటి పడిన ఆ సాయంత్రం యథాప్రకారంగా మా అమ్మ వరండాలో కుర్చీ వేసుకు కూర్చుని, తన జపమాలలోని పూసలను లెక్కిస్తూ ధ్యానం చేసుకుంటుంది. అది ఆవిడ ప్రతినిత్యం ధ్యానం చేసుకునే సమయం. ఎప్పటిలాగే నేను ఆమె కుర్చీ పక్కనున్న చిన్న మెట్టు మీద కూర్చున్నాను. ఇంటి బయటనున్న పొదలకేసి, తుప్పల వంక చెవులప్పగించి వాటినుండి వినవచ్చే పురుగుల రొదను వినడానికి ప్రయత్నిస్తున్నాను. అకస్మాత్తుగా మా చీకటి వీధిలో గుర్రపు గిట్టల టకటకలు వినిపించాయి. కొద్దిసేపటి తర్వాత మా ఇంటి గేటు తెరుచుకున్న చప్పుడు. ఆ పై గేటు దగ్గరి నుండి ఇంటి వరకు వేసిన కంకర దారిలో నడుస్తున్న బూట్ల కరకర శబ్దం. చూస్తుండగానే ఒక అశ్వికదళ సైనికుడు వచ్చి మా ఎదురుగా నిలబడి, శ్రద్ధగా నమస్కారం చేసి, ఒక లేఖను అందజేసి మరోసారి నమస్కారం చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. తొలుత వచ్చిన ఆ ఉత్తరం సచివాలయంలో పనిచేస్తున్న మా అన్న శ్రీనివాసన్‌కి అయి ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఆ ఉత్తరంపై నా పేరు వ్రాసి ఉంది. అది చూసి నేను తెగ ఆశ్చర్యపోయాను.

ఉత్తరం పంపినవారు సర్ చార్లెస్ టోడ్ హంటర్‌గారు. ఈయన రాజుగారి ఆంతరంగిక ముఖ్యసలహాదారులలో ఒకరు. మైసూరు రాచరికపు వ్యవస్థలో ఒక కీలకమయిన వ్యక్తి. ఆయన దగ్గరనుండి నాకు ఉత్తరం రావడం ఏమిటో నేను అంచనా వేయలేకపోయాను. తలా తోకా లేని అంటారు కదా అలానే ఉంది ఆయన నాకు పంపిన ఉత్తరంలో విషయం. ఈ ఉత్తరాన్ని అర్థం చేసుకోవడమనే పరిశోధనలో నాకు సహయం చేయడం కోసం మా అమ్మ, ఇంకా ఇద్దరు అన్నలు బలరాం, దుబ్బూలు కూడా ఔత్సాహిక పత్తేదారుల్లా ఆ లేఖలోని నిగూఢత్వాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయాస చేశారు.

ఆ ఉత్తరంలో ఇలా ఉంది.

నేను పెట్టిన నోట్‌కు ప్రత్యుత్తరంగా నీవు మరొకడివెవరివో కాదు. మా శ్రీనివాసన్ సొదరుడివేనని రావు పేర్కొన్నాడు. సరి! ఆ విధంగా చూసినా ప్రాథమిక పాఠశాల ప్రణాళికకు నీ సేవలను ఉపయోగించుకోవాలని నేను భావించడంలో ఏ మాత్రం పొరపాటు పడలేదనే నేను అనుకుంటున్నాను. దయచేసి నీవు గురువారం ఉదయం పది గంటలకు నా కార్యాలయమునందు నన్ను కలుసుకోగలవాడవు.

ఆ గురువారం రానే వచ్చింది. నాదసలే నుదుటి మీదకు వాలే జుత్తు. దాని పీచమణచడానికని దిట్టంగా దానికి నూనెను దట్టించి వెండ్రుకలను చక్కగా వెనక్కి తోసేసి దువ్వుకున్నా. అప్పుడప్పుడు ప్రత్యేక సందర్భాల కొరకు కేటాయించిన కోటు తొడుక్కుని ఘనత వహించిన సర్ ఛాల్స్ టోఢ్ హంటర్‌గారిని చూడటానికి సిద్దమయ్యాను. మా అన్న శ్రీనివాసస్ మైసూరు సచివాలయ ఉద్యోగి, ఆయనకు అక్కడ అంతా బాగా పరిచయమే. ఆయనే నన్ను స్వయానా వెంటపెట్టుకుని ఛాల్స్‌గారి కార్యదర్శి రావుగారి వద్దకు నన్ను తీసుకువెళ్ళాడు. అక్కడి నుండి రావుగారు నన్ను చాల్స్‌గారి గదికి తీసుకువెళ్ళాడు. ఆ గదిలో శ్రీ ఛాల్స్‌గారు గది ముఖద్వారానికి ఎదురుగా తమ విశాలమయిన వీపు భాగాన్ని మాకు చూపిస్తూ అటువేపు తిరిగి ఏదో పని చూసుకుంటున్నారు. ఆయనది భారీ ఆకారం. ఆ వీపు మీదుగా చూపులు పైకెడితే ఇంత పెద్ద బలమైన మెడ అక్కడి నుండి నా తలెత్తి ఆయన తలమీదుగా కాస్త ప్రయాణిస్తూ చూస్తే అక్కడ గోడమీద బంగారు పూత భారీ ఫ్రేమ్ మధ్యలో వీరగంభీరంగా మా మైసూరు మహరాజావారి తైలవర్ణ చిత్రం, పచ్చని బంగారు వర్ణపు పటం పట్టీల మధ్య నీలిరంగు పట్టు వస్త్రాల్లో మహరాజు, ఆయన మెడలో ధవళ కాంతులీనుతూ ముత్యాల హారపు వరుస. నెత్తి మీద పెట్టుకున తలపాగాలో ఎర్రగా మెరిసిపోతున్న ఈకలు. బావుంది వర్ణ సమ్మేళేనం అనుకున్నా. అక్కడి గోడలపై మా మహరాజుగారే కాదు ఘనతవహించిన ఇంగ్లాండ్ రాజుగారు కూడా కొలువు తీరి ఉన్నారు. ఇంకో వైపు పచ్చటి గడ్డి మైదానంలో ఠీవిగా మెడ చాచుకుని నిలబడ్డ గొప్ప జాతి గుర్రం బొమ్మ ఒకటి, మిగతా గోడలపై పర్షియన్ తివాచీల సింగారం దాని మీద లతలూ పువ్వులూ అల్లికల ఆ రూపకల్పనా సౌందర్యం, గది బయట సూర్యభగవానుడి ప్రకాశవంతమైన కాంతి వల్ల గదిలోపల నిండయిన వెలుతురు ఉన్నప్పటికీ గదిలో ఉన్న అన్ని విద్యుత్ దీపాలు వెలిగించే పెట్టారు. అక్కడి షాండ్లియర్లలోని స్పటికాలు పట్టపగలు మెరుస్తున్న నక్షత్రాలకు మల్లే అనిపించాయి నాకు.

రావుగారు సర్ ఛాల్స్‌గారికి మర్యాద వహించాల్సినంత దూరంలో నిలబడి, మా రాకను గుర్తుగా ‘హుహుహుమ్’అంటూ తన గొంతు సవరించుకున్నారు. ఆ గొంతు ఉనికిని మన్నిస్తూ సర్ ఛాల్స్‌గారు తన చక్రాల కుర్చీలో గుండ్రంగా వెనక్కి తిరిగి మాకు ఆయన ముఖారవింద దర్శనం కావించారు.

రావుగారు వినయంగా నా రాక గురించి ఒక గొణుగును ఛాల్స్‌గారికి వినిపించాడు. సర్ ఛాల్స్ చిన్న నవ్వు నవ్వి ఒక్కసారిగా నాతో ఏదో చెప్పడం మొదలెట్టాడు. ఆ అంటున్నదేమిటో నాకు ఒక్క మాట కూడా అర్థం కానంత వేగంగా ఉంది ఆయన ఆంగ్ల ఉచ్చారణ. నాకేం చెప్పాలో తోచట్లేదు కానీ నాకు మారుగా రావుగారు ‘అవును సర్, అంతే సర్, అర్థమైంది సర్, తప్పకుండా సర్. నేను అతనికి చెబుతాను సర్, మంచిది సర్, ఉంటాము సర్…” కొద్ది నిమిషాల్లో మా మీటింగ్ పూర్తయింది, తను చెప్పాల్సింది చెప్పేయగానే సర్ ఛాల్స్‌గారు అటు తిరిగి మరోసారి విశాలమైన వీపును మాకు మరోసారి దర్శనప్రదర్శనం చేశాడు. గదిలోంచి బయటకు వచ్చాక రావుగారు అసలు విషయం గురించి నాకు వివరించారు. అక్కడ ధనవంతుల పిల్లల కోసం నిర్మిస్తున్న ఒక కొత్త పాఠశాలకు బాధ్యతని సర్ ఛాల్స్ టోడ్ హంటర్‌గారి శ్రీమతిగారు స్వీకరించారుట. పిల్లలకు మనోరంజకంగా విద్య బోధించడానికి, ఆ పాఠశాల ప్రాంగణమంతా చూడముచ్చటగా కనపడటానికి ఆ భవనం లోపలి భాగంలో కుడ్యచిత్రాలను నేను చిత్రించాలని వారు ఆశిస్తున్నారుట!

నిచ్చెనలు తెచ్చి, వెల్లలు వేసి, కుంచెలు పట్టి, రంగులు పులుముతూ చుట్టూతా కూలీలు, సహాయకులు, వారి మధ్య నేను ఆజ్ణలు ఇస్తూ, పని చేస్తూ, పని చేయిస్తూ… ఊహించడానికే ఏదోలా అనిపిస్తున్న ఈ బాధ్యతను, బరువును మోయడానికి నా మనస్సు అంగీకరించలేదు. అంతే కాదు అప్పుడప్పుడు లేడీ టోడ్ హంటర్‌గారు ఇక్కడికి వచ్చి నా పనిని తనిఖీ చేస్తుంటారు, ఆపై తగిన సలహాలను సూచనలను దిద్దుబాట్లను కూడా అందిస్తుంటారని తెలియజేయబడింది.

ఈ ఉపద్రవాన్ని తప్పించుకునే నిమిత్తం నేను రావుగారికి, అయ్యా నేను ఇంకా తరగతి గదులకు హాజరయ్యే విద్యార్థినేనని, నా చదువులు, పరీక్షలు, ఉన్నత విద్యాభిలాష ఆ పై నా భవిష్యత్తు వీటన్నిటి దృష్ట్యా ఇంత పెద్ద బాధ్యత తీసుకునే సమయం, శక్తి సామర్ధ్యాలు ప్రస్తుతానికి నాకు లేవని. కావున దయతో మీరూ మీ ప్రభువులుంగారు నన్ను క్షమించగలరని – ఒక ఉత్తరాన్ని నా కుటుంబసభ్యుల సహకారంతో వ్రాసుకుని సంతకాలు చేయించుకుని ఆ విధంగా సర్ ఛాల్స్ టోడ్ హంటర్‌గారి భార్యామణిగారి బారిన పడకుండా తప్పించుకున్నాను. అలా తప్పించుకున్నానుకునే భ్రమల్లో నేను ఉండీ ఉండగానే సర్ ఛాల్స్‌ మరో మారు నన్ను పిలిపించారు, ఈసారి నన్ను యుద్దానికి సంబంధించి కొన్ని పోస్ట్‌కార్డ్‌లను తయారుచేయాలని కోరుకున్నారు. అదృష్టవశాత్తూ ఆయన ఆ కార్డులు ఎలా ఉండాలని కోరుకున్నారో అవి చాలా సరళమైన, తిన్నని ఆలోచనలు. ఆ ప్రకారం వారికి కావలసిన విధంగా నేను బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన యుద్ఢ సైనికులు, ఆ వాతావరణానికి సంబంధించిన బొమ్మలు వేసి ఇచ్చాను. వాటిని చక్కగా ముద్రించి పోస్ట్‌కార్డ్‌లుగా విక్రయించారు. ఈ పని చేసిపెట్టినందుకు గాను నాకు ఇరవై రూపాయల విలువగల రెండు డిఫెన్స్ బాండ్‌లు అందించబడ్డాయి, దీని మెచ్యూరిటీ ఇష్యూ తేదీ తర్వాత పదేళ్ళు!

సర్ ఛాల్స్‌ టోడ్‌హంటర్‌తో సంభవించిన ఈ క్లుప్త పరిచయ విరామం తర్వాత, నేను మామూలుగా నా పాఠశాలలో ఇంకా ఇంట్లో ఉండే సాధారణ దినచర్యలో మునిగిపోయాను. జీవితం కూడా కాస్త అటూ ఇటూ డోలాయమానమయినప్పటికీ మళ్ళీ అది తన నిత్యప్రవాహపు వడిని తిరిగి పుచ్చుకుంది. మా ఇంట్లో మేమంతా కుటుంబసభ్యులం రాత్రి భోజనం చేశాక ఒకచోట చేరి, బద్ధకంగా మా అమ్మ మంచం చుట్టూ పిల్లుల్లా తిరుగుతూ, దొర్లుతూ, జారిగిలబడిపోతూ ఆ రోజు జరిగిన సంఘటనల గురించి కబుర్లు చెప్పుకునేవాళ్ళం.

ఈ సాయంకాలపు కబుర్ల కూడికకు సాధారణంగా ఆలస్యంగా వచ్చే వ్యక్తి సచివాలయంలో పనిచేసే మా అన్న శ్రీనివాసన్. ఇంకా అంతకంటే అన్యాయపు ఆలస్యవంతుడు ఇంకో పెద్దన్న పట్టాభి. శ్రీనివాసన్ సంగతి వేరు. సాధారణంగా మహరాజాగారికి సంబంధించి అప్పటికప్పుడు ఏర్పడే అనేక కారణాల వల్ల ఆయనకు తన సమయం అయిపోయినా సరే సచివాలయ కార్యాలయం వద్ద ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. కానీ పట్టాభి సంగతి అలా కాదు. తన ఆఫీస్ సరిగ్గా సమయానికి ముగియగానే అక్కడి నుండి నేరుగా క్లబ్‌కి వెళ్ళి అక్కడ బ్రిడ్జ్, బిలియర్డ్స్‌తో పాటు తన అభిమాన పానీయమైన రెండు మగ్‌ల బీర్‌ను సేవించిన పిమ్మట మాత్రమే ఇంటికి మళ్ళడం వల్ల తను రోజూ ఆలస్యంగా వస్తాడు. పట్టాభిని తలుపు వద్ద చూసినప్పుడు అమ్మ అడుగుతుంది “ఎందుకురా ఇంత ఆలస్యం? సరే, సరే, ముందు వెళ్ళి తిని రా. ఇలా రోజూ ఆలస్యంగా తింటే మీ ఆరోగ్యం ఏమవుతుందిరా నాయనల్లారా?” ఇదంతా ఆవిడ ఏదో మాటవరసకు అడగడమే తప్పా, తను ఎటువంటి సమాధానం ఆశించి కాదు.

రాత్రిళ్ళు భోజనానంతరం ఇలా మా ఇంట్లో చెప్పుకునే కబుర్లు భలే ఉంటాయిలే. ఆరోజు మేము కలుసుకున్న కొత్త వ్యక్తులు, పాఠశాలలోని ఉపాధ్యాయుల లేదా కార్యాలయాల్లోని ఉన్నతాధికారుల దౌర్జన్యాలను, అతి వేషాల గురించి తమాషాపడుతూ వారి హెచ్చులని వెక్కిరించుకుంటూ ముచ్చటించుకుంటాము. కొన్నిసార్లు ఈ వెటకారపు ప్రసంగాల్లో మేము మునిగిపోయి రాత్రి ఎంత పొద్దుపోయిందనే విషయం కూడా మరిచి కబుర్లలోనే కాలం గడిపేవాళ్ళం. రాత్రి ఎంత ఆలస్యంగా నిద్దరోయినా సరే, ఉదయాన్నే లేచి చదువు నిమిత్తం పరిగెత్తాలి కదా!

అట్లా నిద్ర నుండి లేచి, స్నానం చేసి, గబగబా నాలుగు మెతుకులు గతికేసి కనాకష్టంమీద మిగిలి ఉన్న చివరి నిముషాల్లో పాఠశాలకు చేరుకునేవాణ్ణి. బడిలో ఏం మజా ఉందిలే? బహుశా ప్రపంచంలో అన్ని తరగతి గదులు, అందరు ఉపాధ్యాయులు మూసపోసినట్లుగా పరమ నిరాసక్తంగా ఇలానే ఉంటారు అనుకుంటా. ఏమాత్రం ఉత్తేజం లేని, ఉత్సాహం ఇవ్వని మా ఉపాధ్యాయుల పాఠాలు సగం సగం చెవిన వేసుకుంటూ మిగతా సగం మనస్సుని పుస్తకంలో వ్యంగ్య చిత్రాలు వేసుకుంటూ గడిపేవాడిని. ఈ చదువులకు సంబంధించినంతవరకు నా మీద నాకు ఒక నమ్మకం ఎల్లప్పుడూ ఉండేది. ఆ మాత్రం శ్రద్ధ వీరు చెప్పే పాఠాల మీద పెట్టకపోయినా సరే సంవత్సరాంత పరీక్షల్లో శుబ్బరంగా పాస్ అయ్యేంత మార్కులు నేను తెచ్చుకోగలనని నాపై నాకు నమ్మకం జాస్తి. ఇక నోట్స్ విషయానికి వస్తే ముందు బెంచీల్లో కూర్చుని విపరీతమైన శ్రద్దతో నోట్స్‌ వ్రాసుకునే బుద్దిమంతుల వరుస అబ్బాయిలు ఉంటారు కదా, వారిలో ఎవరిని అడిగినా కాసింత సమయం కోసం వారి నోట్‌బుక్స్ అప్పుగా ఇవ్వకపోరు. కాదనేదేం ఉండదు.

సాయంకాలం బడి ముగియగానే, నేను సైకిలెక్కి అతివేగంతో ఇంటికి వెళ్ళేవాడిని, పుస్తకాలని టేబుల్‌ పైకి విసిరేసి, ఆదరబాదరగా మొహం కడుక్కొని, ఒక గుక్కలో కప్పు కాఫీ తాగి, పరమ ఆత్రుతగా చాలాకాలం క్రితం దూరమయిన స్నేహితుడిని ఈ రోజే కలవడానికి వెల్తున్నంత వాయుమనోవేగాలకు పోటీ వేగంతో నా మిత్రుడు హెచ్‌కె ఇంటికి పరుగెత్తేవాడిని! నిజానికి మేము ఉదయం నుండి సాయంత్రం వరకు, జస్ట్ ఇందాకే ఒక గంట క్రిందటి వరకు కూడా తరగతి గదిలో రోజంతా కలిసి కూర్చుని ఉన్నాము. అయితే ఉదయం క్లాసురూములో అన్ని గంటలు గడపడం వేరు. చల్లని సాయంకాలాల కాలక్షేపాలు వేరు. సాయంత్రం కాగానే ఇద్దరం కలిసి సైకిలు ఎక్కి ఆనంద్ భవన్‌కు వెళ్ళి అక్కడ కమ్మని మసాలా దోసె, ఒక ఫిల్టర్ కాఫీ తాగి, అక్కడి నుండి చాముండిదేవి ఆలయం మెట్ల దారి వైపు నుండి మైసూర్ మహారాజు తమ అతిథుల కోసం నిర్మించిన లలిత మహల్‌కి వెడతాం. అక్కడ ఓ పేద్ద విశాలమైన తోట ఉంది. ఏదో ఒక మూల చోటుచేసుకుని పుస్తకాలు, సినిమాలు, కళలు, ఆటలు అంటూ మాటాడుకుంటూ, చర్చించుకుంటూ ఓ రెండు సిగరెట్లు తగలేస్తాం. వాస్తవానికి నాకు సిగరెట్ వాసన ఎప్పుడూ నచ్చలేదు. దీనిని తాగడంలో నేను ఎప్పుడూ ఆనందాన్ని పొందలేదు నిజానికి సిగరెట్‌ని పీల్చిన ప్రతిసారీ నాకు వికారంగా అనిపిస్తుంటుంది. కానీ నా అన్నలు, తోటి మిత్రులు మొదలెట్టిన ఆ తొలి యవ్వనకాలపు పరంపరని కొనసాగించడం కోసం నేను సిగరెట్ అలవాటును ఉంచుకోవడానికే ప్రయత్నించాను. మా కబుర్లు కాలక్షేపాలు అన్నీ ముగిసిన తరువాత మేము మా ఇళ్ళ వైపు మళ్ళేవాళ్ళం. ఇంట్లో మా పొగాకు వాసన పసిగట్టకుండా ఉండేందుకు దారిపొడుగునా నోరు తెరిచి ఉంచుకుని గాలి వచ్చి మా నోట్లోని కంపు వదలగొట్టేలా మేము మా సైకిళ్ళను భయంకర వేగంతో తొక్కేవాళ్ళం.


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...