కాఫీ అంటే…
డికాక్షన్ కాదు, ఎమోషన్.
అంతకుమించిన డీకంపోజిషన్.
నువ్వు నీ నుంచి విడిపోయి
ఆవిడలో మీగడై తేలిపోవడం
సూరీడు తన గుర్రబ్బగ్గీ తుడుచుకునేప్పుడు
స్టవ్‌పై పెర్కొలేటర్‌లో
పరిమళం శంకరాభరణమవుతుంది.
ఆకాశం ఆరెంజ్‌లోకి మారేప్పటికి
ఓ మేఘాన్ని కత్తిరించి కప్పులో పడేస్తే
మా ఆవిడ చేతుల్లో బందీ అయిన అరోమా
మేఘమల్హార్ అందుకుంటుంది
అలా, కొత్త దినమొకటి
ఆమె పెదవుల మీదుగా ప్రాదుర్భవిస్తుంది
కాఫీ సోకిన పెదవుల ముందు
లత తటిల్లత అవుతుంది
మెహిదీహసన్ మూటాముల్లె సద్దుకుంటాడు
జాకిర్ హుస్సేన్ జుట్టు ముడేసుకుంటాడు
జస్‌రాజ్ గొంతు బొంగురుపోతుంది
చౌరాసియా వేణువు
గాయాలను కప్పెడుతుంటుంది
పైటేల కాఫీ వుంటే,
ఆకాశం భగ్గుమనడానికి అగ్గిపుల్లెందుకు?
కాఫీతో అక్రమసంబంధం లేనివారు
పతివ్రతలు కాలేరు;
ఉఫ్ ఉఫ్ అని ఊదుకునేవారు
జీవితాన్ని గ్రోలలేరు.
గోల్డెన్ డ్రాప్స్!
కాఫీ తాగని జన్మ వృథా
అది ఆమె పెదవుల మీదుగా
ఫిల్టర్ కాకపోతే వ్యథ.
బీ కేర్‍ఫుల్!
లైఫ్ ఈజ్ షార్ట్, బట్ కాఫీ ఈజ్ లార్జ్.