ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 16

ఆ విధంగా నా బెంగలన్నీ తీరిపోయాయి, నా కోరికలన్నీ ఫలించాయి. ఇక బొంబాయి నాకు శాశ్వత నివాసంగా మారింది. ఒక వైపు టైమ్స్ ఆఫ్ ఇండియాకు కార్టూన్లు, బొమ్మలు వేయడంతో పాటుగా బయటినుండి డబ్బులు తెచ్చిపెట్టే ప్రతి బొమ్మల పనిని ఒప్పుకునేవాడిని. పుస్తకాలకు ముఖచిత్రాలు, లోపల ఇలస్ట్రేషన్లు, వినియోగ, వాణిజ్య ఉత్పత్తులకు అడ్వర్టయిజింగ్ బొమ్మలు, వ్యాపారోత్పత్తుల ప్రచారం కోసం డ్రాయింగ్‌లు కూడా గీసేవాడిని. వీటన్నిటితో పాటూ మా అన్న ఆర్. కె. నారాయణ్ వ్రాసే నవలలు, చిన్న కథలకు బొమ్మలు వేసే పని ఎలాగూ ఉండనే ఉండేది. అప్పుడప్పుడూ నా కార్టూన్లు, వ్యంగ్య చిత్రాల ప్రదర్శనను ఏర్పాటు చేసేవాడిని. అంతేకాదు, వృత్తిలో భాగంగా నేను రాజకీయ నేతలను కలవడానికి అధికారిక పర్యటనల కోసం తరచూ ఢిల్లీకి వెళ్ళేవాడిని. పార్లమెంటు ప్రెస్ గ్యాలరీలో కూర్చుని మన దేశనాయకుల, రాజకీయ ప్రముఖుల ముఖకవళికలు, వేషధారణ, వారి హావభావాలు, నిలబడే, నడిచే, మాట్లాడే లక్షణాల తీరు తెన్నులని బాగా అధ్యయనం చేసేవాడిని.

ఈ రకమైన జీవన విధానంతో రోజులు ఎట్లా నడుస్తున్నాయో అర్థం కానంత వేగంగా కాలం పరిగెట్టింది. ఆ వేగంలో వేగంగా నా వివాహం నా మేనకోడలు కమలతో జరిగింది. ఇక నుండి ఏకలింగంలా ఎక్కడ పడితే అక్కడ ఏదో చుట్టూ నాలుగు గోడలు, తలపై ఇంత నీడ చూసుకుని ఇది చాలులే మనకు అని ఉండటం కుదరదుగా! ఆట్టే ఆలస్యం చేయకుండా వీలయినంత తొందరలో ఒక ఇల్లు చూసుకుని బొంబాయిలో కాపురం పెట్టమని అటు మా కుటుంబం వైపు నుండి ఒత్తిడి పెరగసాగింది! నేనూను త్వరగా కొత్త సంసారానికి తగిన వసతిని చూసుకుని మిరాబెల్ హోటల్ నుండి బయటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ బొంబాయిలో అద్దె ఇళ్ళ కొరత చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక బస నుండి బయటికి వచ్చామా, మరో బస చూసుకోవడం అనేది పొలిటికల్ కార్టూనిస్ట్ అవడం కన్నా మహా అసాధ్యమైన పని! ఇక్కడి ఇంటి యజమానులు మహా అత్యాశపరులు. కిలాడీ మనుషులు. తమ తలపై ఇంత పైకప్పు కోసం చూస్తున్న నిస్సహాయులను ఇల్లు అద్దెకు ఇచ్చే పేరు మీద దివాలా తీయించడానికి వారు చేసే ప్రయత్నాలను మించిన ఉల్లాసం వారికి మరెక్కడా దొరకదు. ఈ రకమైన సొరచేపలు, గుంట నక్కల వంటి మనుషులతో వ్యవహరించడానికి నాకున్న పని ఒత్తిడిలో సమయం లేదు. ఉన్నా చాలినంత అనుభవమూ లేదు కాబట్టి నేను పని సుకరానికై అద్దె ఇల్లు చూసి పెట్టే ఏజెంట్లను, దళారులను కలవడం ప్రారంభించాను. ఇదేమంత ‘నల్లేరు మీద బండి నడక’లా నడిచిన వ్యవహారము కూడా కాదు. నన్ను చూస్తే వారికి పని చేయించుకుని డబ్బులు ఎగదొబ్బే బాపతుగాను, వారిని చూస్తే నాకు పని చేయకుండానే, గోర్లూడగొట్టి డబ్బులు రాలగోట్టే మనుషుల్లాగునూ కనిపించాం. ఒకరినొకళ్ళం సందేహపు చూపులు చూసుకుంటూ, అనుమానపు వాసనలు పీలుస్తూ దాగుడుమూతలాట నడుస్తూనే ఉంది.

మొత్తానికి ఇళ్ళకన్నా, ఇళ్ళు చూపించిపెట్టే ఏజంట్ల వెదుకులాట అనేది అతి ముఖ్యం అయిపోయింది నాకు. ఆ పనిలోనే ఒకరోజు కాస్త పాపభీతి, దైవభక్తి మెండుగా ఉన్నట్టు కనపడే ఒక ఏజెంట్‌ దొరికాడు. నేను అతడిని కలవడానికి వెళ్ళిన సమయంలో అతను ఒక దేవత పటం ముందు నేలమీద కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అటువంటి మంగళకరమైన సమయంలో అతడిని కలవడం నాకు చాలా శుభప్రదంగా అనిపించింది. మన పని ఈ సారి అయేట్టే ఉందని మనసుకు అనిపించింది. అతను తన పూజ ముగించుకుని నన్ను అద్దెకు ఇవ్వడానికి సిద్దంగా ఉన్న ఒక అపార్ట్‌మెంట్ వద్దకు తీసుకెళ్ళాడు. ఆ ఫ్లాట్‌లో బెడ్‌రూమ్, సిటింగ్ రూమ్, బాత్‌రూమ్, కిచెన్ అన్నీ ఒకే గదిలో ఉండటమనేది దీని ప్రత్యేకత. బొమ్మ వేసే ముందు ఖాళీ తెల్లకాగితంలో ఏది ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో నేను ముందుగానే ఊహించేస్తాను. ఆ గది మధ్యలో నిలబడి ఉండి నేనూ నా భార్యా ఇక్కడ ఎలా ఉండగలమనే దృశ్యాన్ని ఊహించసాగాను. ఈ గదిలో ఉండటానికి ఈ గదికే చోటు చాలడం లేదే! మరి నేను, మా ఆవిడ కలిసి ఎక్కడ ఉండాలో ఏమో! అనే నిట్టూర్పు. కానీ వేరే మార్గం లేదు. ఏది ఎలా ఉన్నా ఉండటమే మార్గం.

ఇక నియమాలు మరియు నిబంధనలు వినమన్నాడు. ఒకటి నుండి వంద వరకు ఏ నిబంధనకైనా నేను సిద్దమేనన్నాను. ఇంటి అద్దె, బయానా, ఏజెంట్‌కు చెల్లించుకోవలసిన మామూలు అన్నీ మనసులోనే లెక్కలేసుకున్నాను. నేను ఇంతవరకు ఉద్యోగాలు చేసీ, బయటి పనులు చేసీ కూడబెట్టిన పొదుపు అంతా సమర్పించుకోవడమే కాకుండా, నాకు లేని ఆస్తులు కూడా అమ్మి, నా తల తాకట్టుపెడితే తప్పా ఈ ఇంటి అద్దెని, ఇంటి యజమాని కోరుతున్న అడ్వాన్స్‌ని, ఇల్లు అద్దెకు చూపించిన పెద్దమనిషికి చెల్లించుకోవలసిన ముడుపుని ఇచ్చుకోలేనని లెక్కల్లో తేలింది. పోనీలే ఏమయితేనేం, బొంబాయి మహానగరంలో కాపురం పెట్టడానికి ఇంత జాగా అనేది దొరికింది కదాని ఒక సంతృప్తి. చెల్లించాల్సిన నగదు మొత్తాన్ని మరుసటి రోజు ఉదయాన్నే సగం చెక్కు రూపంలో సగం డబ్బు రూపేణా ఇస్తానని, ఈ లోగా నేను బయటికి వెళ్ళగానే నేను ఇస్తానన్న అద్దెకు రెండింతలు లేదా మూడింతలు ఇస్తామని షరామామూలుగా వచ్చేవాళ్ళు వచ్చినా వారికెవరికీ ఇల్లు అద్దెకు ఇవ్వరాదని, అలా చేస్తే నా మీద ఒట్టేనని గట్టిగా చెప్పి అక్కడినుండి బయటపడి ఆఫీసు దారి పట్టాను.

సాయంత్రం పని ముగిశాకా మిరాబెల్ హోటల్‌లో నా బస చేరుకున్నాను. రాత్రి భోజనానంతరం ఆ సాయంత్రపు మా సాధారణ కబుర్లు ముచ్చటల్లో భాగంగా మిరాబెల్ యజమానిని కలిసినప్పుడు, నేను త్వరలో అక్కడి గది వదిలిపెట్టి నా స్వంత ఫ్లాట్‌కి మారిపోతున్నానని, ఇక్కడి మనుషుల్ని, ఈ హోటల్ వాతావరణాన్ని బాగా కోల్పోతానని కాసింత దిగాలుగానే చెప్పాను. ఆయన కూడా నాలాంటి మంచి మిత్రుడు దూరమవుతున్నందుకు విచారిస్తూనే, నేను ఎప్పుడు వెడుతున్నాను? ఏ ప్రాంతంలో ఉండబోతున్నాను? నాకు ఇల్లు చూపిస్తున్న ఏజంట్ ఎవరు? వగైరా వంటి వివరాలు అడిగాడు. నేను మొదట కేవలం నేను కాపురం ఉండబోతున్న ప్రాంతం పేరు చెప్పగానే అతని కనుబొమలు ముడుచుకున్నాయి. ఆ పై నేను ఏ వివరాలు చెప్పనవసరం లేకుండా మిరాబెల్ యజమానే మొదలుపెట్టి నేను చూసిన ఇల్లు, దాని ఎత్తు, పొడవు, వైశాల్యం, వాస్తూ తతిమ్మాలని పేర్కొంటూ మా ఏజెంటు రూపురేఖలు, అతని మొహం లోని భక్తి, శ్రద్ద, సత్పురుష లక్షణాలు అన్ని బొమ్మ గీసినంత సులువుగా వివరించి చెప్పి ‘వాడేనా?’ అని అడిగాడు. నేను ఆశ్చర్యపోయాను. నాకు ఇల్లు చూపించిన ఏజెంటు మామూలువాడూ సామాన్యుడూ కాదని, గత జన్మలో ఇతనే అలీబాబా నలభయ్ దొంగల నాయకుడని, ఇప్పుడు నేను చూసి వచ్చిన ఇంటిని ఏకకాలంలో తక్కువలో తక్కువగా నలభయ్ మందికి తక్కువ కాకుండా అందరికీ అద్దెకు ఇచ్చి బయానా, కమీషన్ పుచ్చుకుంటాడని, ప్లాట్ మాత్రం ఎవరికీ ఇవ్వడని, అతని కీర్తి జగద్విఖ్యాతమని చెప్పి నన్ను కాపాడాడు.

ఇక చేసేదేం లేదు కాబట్టి ఎప్పటిలాగే నేను ఒంటరిగా మిరాబెల్‌ హోటలోనే నివసించడం కొనసాగించాను. ఇల్లు వెదకడం, అందులోకి ఏ పితలాటకాలు లేకుండా అనాయాసంగా ప్రవేశించడమనే అత్యాశలు కట్టిపెట్టి ఏదో ఒక అద్భుతం జరగాలని కోరుకుంటూ దానికోసం నిస్సహాయంగా ఎదురుచూస్తున్నాను. కొన్ని వారాల తర్వాత మా కుటుంబ మిత్రుడు, మద్రాసులో కాపురం ఉండే ఒక పెద్దమనిషి తన వ్యాపారం పని మీద బొంబాయికి వచ్చి, తనని కలుసుకోమని చెప్పి నాకు కబురంపాడు. ఆయనని నేను మునుపు ఎప్పుడూ కలిసి ఉండలేదు. ఆయన చాలా గౌరవప్రదమైనవాడు, వయో వృద్దులు. నాగురించి, నా ఇంటి కష్టాల గురించి, మా బంధువుల ఆ నోటా-ఈ నోటా విని ఆయన నాకు సహాయం చేయడానికి పూనుకున్నారు. ఈ మదరాసు బంధువుగారికి బొంబాయిలో ఓ విలాసవంతమైన ప్రాంతంలో ఒక స్వంత ఫ్లాట్ ఉంది. అది ఎప్పుడూ తాళం వేసే ఉండేది. ఆయన చాలా అరుదుగా నగరానికి వచ్చేవాడు. అదీనూ తన వ్యాపార పర్యటన నిమిత్తం మాత్రమే. అలా వచ్చినపుడు మాత్రమే ఆ గదిని ఉపయోగించేవాడు. ఆ దయాళువు నాకు ఆ ఇంటి బీగాలు అందించి, నా స్వంత స్థలం దొరికే వరకు అందులో ఉండమని నన్ను ఆహ్వానించాడు.

ఇంతకన్నా సంతోషం మరేముంది? నేను వెంటనే ఇల్లు మారిపోయాను. ఈ ఇల్లు చాల పెద్దగా, సౌకర్యంగా కూడా ఉంది. ఇంటిలోపల ఉండవలసిన అన్ని హంగులు, వ్యవస్థలు ముందుగానే అమర్చబడివుంది. నేను ఒక వంటవాడిని ఒక పనిమనిషిని నియమించుకున్నాను. వారిద్దరి వెనుకే నా భార్య కూడా ఆ సంతోషాల ఇంట్లోకి కుడికాలు పెట్టేసింది.

తన ఇంటిని ఉపయోగించుకోవడానికి మాకు అనుమతినిచ్చిన ఈ పెద్దమనిషికి బొంబాయిలో ఒక వ్యాపారం ఉంది. అందులో ఒక భాగస్తుడు కూడా ఉన్నాడు. ఈ భాగస్తుడు ప్రాంతీయుడు. ఇతను ఇక్కడే ఒక ప్రాంతంలో కలప ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నాడు. ఆ ప్రాంతం చాలా ప్రమాదకరమైనది. ఈ ప్రాంతంలో నిత్యం ఇబ్బందులు ఉండేవి. ముఠాలు, తగాదాలు, హత్యలు, ప్రత్యర్థుల పోరులు, పోలీసుల బూట్ల చప్పుడు లేకుండా ఈ పరిసరాల్లో ఒక్కరోజు కూడా గడవదు. ఒకరోజు పోలీసులకు ఏదో నేరవిచారణ పరిశోధనలో ఈ కలప ఫ్యాక్టరీ గేటు బయట రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే వారు ఫ్యాక్టరీ యజమానిని విచారణకు పిలిచారు. వాస్తవానికి, ఈ భాగస్తుడి మీద నేరం ఏమీ నిరూపించబడలేదు. కానీ మా కుటుంబ స్నేహితుడు, మాకు ఇల్లు ఇచ్చిన మద్రాసు పెద్దమనిషి తన భాగస్వామి ప్యాక్టరీ దగ్గర జరిగిన ఈ సంఘటన విని ఎంతగానో ఆందోళనపడ్డాడు. తన చివరి రోజుల్లో ఎందుకీ పితలాటకమనుకుని బొంబాయిలో తన భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుని, ఇక్కడి వ్యాపారాలపై తన ఆసక్తిని తగ్గించుకుని సంపూర్ణంగా నగరాన్ని విడిచిపెట్టి, తన ఫ్లాట్‌ను మాకు బదిలీ చేశాడు. నేను ఐదు దశాబ్దాలుగా ఈ ఫ్లాట్‌లోనే ఉన్నాను. నా కొడుకు శ్రీనివాస్ ఈ ఇంట్లోనే పెరిగి, పట్టభద్రుడయ్యాడు, ఉద్యోగస్తుడిగా మారాడు, ఉషను వివాహం చేసుకున్నాడు.

(సశేషం)


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...