జేబులో బొమ్మ – జేజేల బొమ్మా!

నూనెపల్లెలో ఉండిన మా ఇల్లు అటు రోడ్డు నుండి ఇటు రోడ్డంత పెద్దది. నా చిన్నతనాన నూనెపల్లె పెద్దాసుపత్రి వైపు నుండి మీరు నా కోసం నడుచుకుంటూనో, పరెగెట్టుకుంటూనో మా ఇంటి వైపుకు వచ్చి ఉంటే మీకక్కడ బోలెడేసి ఇసుక కుప్పలు కనపడేవి. ఇసుక కుప్పలు దారికి ఇటువైపైతే రోడ్డుకు ఆవతలవైపు కొట్టాలపై కప్పే బోదగడ్డి కట్టలు కట్టలుగా అమ్మకానికి పెట్టి ఉండేది. మేమప్పుడూ ముక్కు గిల్లుడు ఆటలకు, నీ నేలంత తుక్కు తుక్కు నీ బండంత తుక్కు తుక్కు అనే పాటలకు, బంకమన్నుకు, దంటు బొమ్మలకు, ఎగిరే గాలిపటాలకు, వాటి తోకలుగా వేలాడే ఇంద్రధనస్సుకు, కురిసే వర్షానికి, రెక్కలు విప్పిన తూనీగలకు, కాకి బంగారాలకు, పచ్చని పిల్లపెసర కాయలకు, పుల్లని బుడంకాయల రసాలకు, నడక దారి మీద ఆరబోసిన వరిగడ్డి కుప్పలకు, కొత్త ఇంటికై దిగిన ఇటుక లోడు వరుసలకు, ఇసుక కుప్పల కొండలకు బహు దగ్గర బంధువులము. వాటిన్నిటిని గుప్పెట పట్టి తెచ్చుకుని గుండెకాయంత జేబు దురాశలో దాచుకునే ఆశపోతువాళ్ళము.

ఆ కాలంలో మా ఇంటి దగ్గర ఒకప్పుడెప్పుడో తెచ్చి పోసిన ఎర్రమన్ను దిబ్బ ఒకటి ఉండేది. అది మా రాయలసీమ ఎండకు దీర్ఘంగా ఎండి ఎండీ నా చిన్న ప్రాణానికి – పాకెట్ సైజు జానపద కథల్లోని ఎర్ర పర్వతంలా ధగ ధగ లాడుతూ అనిపించేది. ఆ దిబ్బ దగ్గరే ఉన్న ఇల్లు పెద్ద హుసేని కొడుకు చిన్న హుసేనిది. ఆయన లారీ డ్రైవర్. ఆయన ఇంటిముందు తరుచుగా ఆపి ఉండే అశోక్ లైలాండ్ లారీ అద్దాల వెనుకనుండి ఒక తెల్లని ఆంజనేయస్వామి బొమ్మ కనపడేది. దిట్టమైన మోకాళ్ళపై కూచుని గద భుజాన వేసుకున్న స్వామిని ఎంతో నాణ్యంగా తీర్చి దిద్దిన పనితనం ఉన్న బొమ్మ అది! అటీవలి నా జీవితాశయం అంతా ఏమిటయ్యా? ఈ గట్టి ఎర్రకొండపై చిన్న చాకుతోనో లేదా కోసు స్క్రూ డ్రైవర్‌నో పట్టి ఆ లారీలోని హనుమంతుడి రూపాన్ని ఈ మట్టి కొండలో ఒక బొమ్మలా చెక్కుదామని. ఎర్రమన్నుని బొమ్మగా చెక్క ప్రయత్నిస్తే, కుదరలా. మన్ను పెళ్ళలుగా విరిగి పడుతుంది. అయ్యో! చేత కావట్లేదని దిగాలుగా మన్ను పైనుంచి కన్ను మళ్ళిస్తే, నావంకే చూస్తూ ఆ లారీ లోనే ఉన్నాడే స్వామి! నా కళ్ళు ఆయన తెల్లని అందంపై అతుక్కుపోయేది. ఆ బొమ్మ కావాలి నాకు. లారీ చక్రపు ఎత్తు కూడా లేని నేను అర్ధరాత్రి ఆ లారీ ఎక్కి, అందులో ఎట్లా దూరి దొంగతనం చెయ్యను? ఒకవేళ కొట్టేసినా మా తురకల ఇంట్లో ఎట్లా దాచను? మా ఇంటి వారికి అది శిల్పం కాదు, చెక్కిన బొమ్మ కాదు. దాని పైన పెంచుకున్న నా ప్రేమా కనపడదు. మా జేజి కాళికమ్మ భక్తురాలనుకో, ఆవిడ పూజా గూట్లో అమ్మవారి పటం ఉందనుకో! పెద్దలు పిల్లలూ ఒకటే సమానమా ఏమిటీ? మా జేజి తప్పు చేసిందని నన్ను ఒప్పుగా పెరగనిస్తారా పెద్దలు? నా వంటి పిల్లలు హిందువులుగా, ముసల్మానులుగా, క్రైస్తవులుగా పుట్టడం కన్నా ముందు భగవంతుని వేళ్ళ చివరలలో కళాకారులుగా డిసైడ్ అయి ఉంటారు. జన్మల వెనుక ఉన్న ఈ రహస్యం ఎవరికి తెలిసి చచ్చేనూ? కులము, గోత్రము, నామము, తావీజూ పవిత్ర జలమూ సంగతి గల మనుషుల సంగతి పక్కన పెట్టు. హిందువుల ఇంట్లో పెరిగిన కుక్క రాము అయితే, సాయబుల కుక్క మోతి! మరి క్రైస్తవుల డాగ్ జిమ్మి కాక మరేమిటి? మన భావదరిద్రానికి పిల్లి, కుక్క, చిలక, కోడి, గుర్రం… ఏది మాత్రం ఆగునని!

నాకు తెలిసిన పండుగలలోకెల్లా పిల్లల కోసమనుకునే గొప్ప పండగ ఏదో తెలుసా? వినాయక చవితి. వినాయకుడు దేవుడు, కారణ జన్ముడు, ఏకదంతముపాస్మహే, కరిభిద్గిరిభిత్కరికరిభిద్గిరిగిరిభిత్కరి అనే గందరగోళమూ, భయమూ, భక్తి, లెంపలు వేసుకోడఁవూ, గుంజీళ్ళు తీసుకోడఁవూ… వంటివి కాదు.

గణపతి స్వామి పిల్లల ఎత్తు, గొలీ కనులు, తొర్రి దంతం, నీ వంటి నా వంటి అమాయకపు మొహం, ఫ్రెండ్లీ ఆకారం. ఏ ఇతరులను చూసుకున్నా పిల్లల నేస్తాలుగా ఉండదగ్గ అర్హతలు గల ఏకైక క్యారెక్టర్‌లు హనుమంతుడు, వినాయకమయ్యలు. వాళ్ళని మనం ఎప్పుడు చూసినా వాళ్ళు మన వంక చూస్తూ రా రామ్మన్నట్లు ఆడుకుందాం లెమ్మన్నట్లు ఉంటారు వారు. ఏం ఫన్నీ మొహాలు! ఏం ముద్దు ఆకారాలు! ఎంత రమణీయం! ఎంత ఇమాజినేషన్ ఆ తొండం మూర్తిది! ఎంత ఠీవీ ఆ కోతి దేవుడి పొడువు తోకది?

వినాయక చవితి రాంగానే రోడ్ల కిరుపక్కల మంచాలు పరిచి ఆ మీద కుప్పలు కుప్పలుగా బొమ్మలు అమ్మకానికి తయారు. పండగ రోజున అమ్మా నాన్నా పిల్లలు అలా బజారుకు వెళ్ళి, వచ్చేటప్పుడు చిన్న మట్టి వినాయకమయ్య వారితో పాటు ఎగస్ట్రా ప్యామిలీ మెంబర్ అయ్యి దర్జాగా వాళ్ళతో పాటు వచ్చేసేవాడు. మనింట్లో కూడా జీవితానికి అటువంటి ఒక విగ్రహం ఉంటేనా? అని నాకు తెగ అనిపించేది. అయినా వినాయకుడు అలా పూజాగదిలో పూవుల మధ్యలో పూజలకోసం కాక మన ఎప్పుడూ చేతుల్లో ఉండాలి. మన బొమ్మగా ఉండాలి. రమ్మనగానే మన జేబులోకి దూరి జేబులో బొమ్మ, జేజేల బొమ్మగా కూచోవాలి. రాత్రి నిద్రలో మన దిండుకింద నిద్రపోవాలి ఆ దేశీయ దైవ పినాకియో! ఇదంతా బాల్యంలో నాకు పెద్ద మిస్. ఫలానా ఫలానా ఇళ్ళల్లో పుట్టడం వలన మనకు కాకుండా పోయిన, మనది కాకపోయిన చిత్ర శిలా శిల్ప కళ మీది వెర్రి ఏడుపు నాది. నా వంటి వాడు చూసే చూపులో భక్తి, దైవం, ప్రసాదం, కళ్ళకద్దుకొనడం, పులిహోర మెక్కడం, గంధం చల్లుకోడం ఉండదు. తలకు ఇరువైపులా ఆ కళ్ళు, వాటి మధ్యన మొదలైన తొండం, ఆ తొండం మీద వెలసిన ఒక డిజైన్ పూలతీవ, వస్త్రాలపై తేలిన మడతలు, ఆ మందపు నడుం అనాటమీ, ఆ నడుముకు చుట్టిన పాము, దాని చర్మంపై తళతళల పొలుసులు. మొహర్రం గుండం ముందు నిలబెట్టిన పీరుల్లో కూడా ఇలాంటి అందాన్నే వెతుక్కునేవాడిని నేను. పీరు పీరుకు ఉన్న తేడా, తల్లి పీరు, పిల్ల పీర్లు, తండ్రి పీరు. కలశం లోని టెంకాయ వలే వారి తల, ఆ తలపై మారిపోయే డిజైన్, రంగుల బట్టలు. ఇదంతా కులం మతం వాడ కబుర్లు కాదు, ఇదంతా సంస్కృతి, ఇదంతా జాతి సొత్తు. జాతి అంటే ఒక కులం ఒక మతం ఒక వర్గం కాదు. ధూప దీప నైవేద్యాలతో అట్టహాసాలు జరిపించుకోడం కాదు. ఈ చక్కని పండగలను, అంతరించిపోయిన అనేకానేక ఆచారాలనన్ని భద్రంగా రికార్డ్ చేయాలసింది. చూపుడు వేలు దూరంలో గాజు అద్దం మీద రికార్డ్ అనే వృత్తాన్ని తట్టడం ఈ రోజు సులువైపోయింది, కానీ ఆ రోజుల్లో ఈ పండగల ఊపిరినంతా పట్టుకుని ప్రాణం పోయాల్సింది కాగితాలల్లో కథలుగానో, కాగితాలపై బొమ్మలుగానో! కానీ మనకేం తెలీదు. దేనిని పట్టుకోవాలో, దేనిని విడవాలో మనకు ఎప్పటికీ తెలీదు, తెలుసుకోలేం.

రాజ్యాలు, సమాజాలు, వ్యాపారాలు పండగల్ని పెంచి పోషిస్తాయి. ఈ రోజు ఉన్న పండగలన్నీ వస్తు విక్రయాలే, దేన్నయినా పండగ చేయగల బిజినెస్ మాత్రమే పరమసత్యం. ఆర్ట్ ఆర్టే కానీ బిజినెస్ కాదు. అందుకే ఆర్టిస్టుల్ని పుట్టనివ్వకుండా, పుట్టినా వ్యాపార ప్రపంచానికి అవసరమైనంత మాత్రమే పెరగనిచ్చి మిగతా కళని వ్యాపారాలు హత్య చేస్తాయి. ఏదీ చూపించండి? ఇన్నాళ్ళ జీవితంలో వీటన్నిటినీ, ఈ పండగలని, ఆ నవ్వుల సంబరాలని, ఆ మూడు రంగుల వేళలని ఒడిసిపట్టి స్కెచింగ్ చేసిన చిత్రకారుల మయూర తూలికల చిరునామా మీకెమైనా తెలుసేమో? ఏది నా బాల్యంలో స్కెచింగ్‌గా నేను నా నోట్ పుస్తక పేజీల్లో చిత్రించాల్సిన గణేశుని బొమ్మ ఎక్కడ ఉండింది? ఎక్కడి మట్టిలో, ఏ బావి నీళ్ళల్లో కలిసిపోయింది? ఏది ఆ పీరు నెత్తి మీది వంకీల సొగసు అల్లిక? ఏ గాలికి ఎగిరిపోయాయి హాసన్ హుసగ్‌గా పేగు దారాలు? దాన్నంతా అలా చూస్తూ చూస్తూ వయసు దారిలో కొట్టుకుపోతూ ఈ రోజు మూడు పూట్ల అన్నానికి జీవితాన్ని అమ్ముకున్నాను, సిర ధమనుల్లో ప్రవహించే రంగు రంగుల సిరా రంగులను, గోటి చివర కోసుగా పెరిగిన గోరు క్రోక్విల్ పాళీలను తెలిసి తెలిసీ అనేకానేక ఉద్యోగపు జమ్మి చెట్టు కొమ్మల్లో తాకట్టు పెట్టేశాను కదా! ఇప్పటికే ఆ తాకట్టు కట్టులో ఇవీ చివికి శిధిలమైపోయే ఉంటాయి! గుండె బరువుగా అడుగుతుంది! బానిస జీవితానికి శాపవిమోచనం కలిగి తెలివిడిబాల్యం మళ్ళీ జన్మలోనైనా కలిగేనా? పీర్ల కొట్టం పక్కన సుందర గణేశుడు కొలువుండేనా? తల్లిదండ్రులు తమ చేతులారా చిన్న అన్వర్ల చేతుల్లో కలం కాగితం పెట్టి, చేతులు జోడించి భజన చేసే పిల్లల పక్కన కూచుండపెట్టి గణపతిని బొమ్మగా గీయమని దీవించేనా? నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? నిజంగానే మానవాళికి మంచి కాలం రహిస్తుందా?


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...