సిలబస్: 7. బొమ్మలు చెప్పే కథ

సావిత్రి గొప్ప నటి, చక్కని అభినయం. అయినా ఆవిడకూ మేకప్ అవసరమేనబ్బా! లోపల బిస్కట్ ఎంత నాసి రుచి కానీ, ప్యాకెట్ చూస్తూనే మింగబుద్ధిగా ఉండాలబ్బా. అనూష్కని చూడు, వంట్లో ఒక్క నరానికీ నటన చాతకాదు. కానీ ప్యాకేజ్ పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశాడు దేవుడు. ఆ నడుం మీదే రెండున్నర గంట సినిమా లాగించవచ్చు. ఇదంతా మేడిపండుపై మేలిమి అద్దిన వాడి సంతతి చెబుతున్న భోగట్టా. ఆ పై అవధరించండి…

అనగనగా ఇది జరిగి అయిదు ఆరేళ్ళయి ఉంటుందేమో! హోస్పెట్‌లో ఉండే కన్నడ రచయిత, చిత్రకారుడు సృజన్ నాకు వసుధేంద్ర గురించి మొదటిసారి చెప్పారు. చెప్పడమంటే ఏం లేదు: ‘వసుధేంద్ర అని గొప్ప రచయిత, నా ఫ్రెండ్. తనకు వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ఆవిడ మీద కథ వ్రాశారు. మీరు బొమ్మ వేసి ఇస్తే కవర్‌లా వాడుకుంటారు. అయితే బొమ్మ ఎలా ఉండాలీ అంటే ఒక పిల్లవాడు దొడ్డికి పొయి ఉంటాడు, అమ్మ వాడి ముడ్డి కడుగుతూ ఉన్న బొమ్మ వేసి ఇవ్వండి.’ కంపు గప్పున కొట్టలా? ఏవిటి బొమ్మ గీసేది! బొమ్మ అంటే ఏవిటి? రచనకు కాస్త మంచి రంగూ పొంగూ ఇస్నో పౌడరూ అద్ది చక్కగా అలంకరించి సింగారం చేసి పాఠకున్ని ‘రా రమ్మని’ కవ్వించేందుకు కదా! ఇదేవిటి పుస్తకం అరమైలు దూరం నుండే పీతి గబ్బు కొట్టే బొమ్మ! కర్లీ గ్రే అని ఒక అద్భుతమైన అందగత్తె మరునింటిని, ఆ పై వేడి గాలి సోకి నునుపెక్కిన ఇసుకతిన్నియ తొడలని డెబనయిర్ వాడు, ప్లే బాయ్ అబ్బాయి, పెంట్ హౌస్ ఓనర్ వారి వారి కవర్ పేజీ పైన అచ్చువేసి వదిలినా గుటకలు మింగడమే తప్పా నలుగురి కంటి ముందు తెల్ల వెలుగులో ఆ పుస్తకం కొనే ధైర్యం ఉందా మనకు? మరి ఇదేవిటీ గబ్బుకొట్టే బొమ్మ! కొనుట ఎట్లా? కొనినా చదవగలమా?

అయితే అలా తప్పా మరెలా గీసినా కూడా బొమ్మ వద్దనేది రచయిత మాట. ఆయన రచన ఆయన ఇష్టం. మనం ఇష్టం అయితే వేస్తాం లేకపోతే లేదు, ఇదీ మన ఇష్టం. అంతే, అయిపోయింది. అప్పుడు నాకు వసుధేంద్ర తెలీదు, తన రచనలూ తెలీదు. తెలిసింది తనను తాను ‘గే’ అని ప్రకటించుకున్న తొలి భారతీయ రచయిత అని మాత్రమే! కుంటే కున్నాడు కదాని దాన్ని కూడా నేను పెద్దగా పట్టించుకుంది లేదు. ఏదయితే ఏం? మన పని మనకు ముఖ్యం. కాబట్టి ఆ బొమ్మ వేయలా; ఆ పై సృజన్, వసుధేంద్ర ఇద్దరినీ పట్టించుకోలా.

అయితే నెల క్రితం మోహనస్వామి అనే పుస్తకం ద్వారా వసుధేంద్రని పరిచయం చేసుకున్నా. ఇది తన పాక్షిక ఆత్మకథ. చదివాకా ఏం అర్థం కాలా! ఊరికే అసహనంగా అటూ ఇటూ కదిలి అరచేతుల్లో మొహం పెట్టుకుని రుద్దుకుంటూ దిక్కులు చూడ్డం తప్పా ఏం చేతకాలా. తను పుస్తకంలో వ్రాసినట్లుగానే టపాసుల జడ మెదడులో పేల్చినట్లుంది. ఆ పేలిన తాలూకు చప్పుడు వసుధేంద్ర వరకు చేరింది, మాకు స్నేహం కుదిరింది. వారం క్రితం వాసు నా మెయిల్ ఐడీ అడిగాడు. ఇచ్చిన అయిదునిముషాల లోపే నా మెసేజ్ ఇన్‌బాక్స్‌లో: ‘అన్వర్, నేను వట్టి మోహనస్వామి రచయితగానే కాక నా ఇతర రచనల ద్వారా కూడా మీ అందరికీ తెలియాలనుకుంటున్నాను. ఒక నాలుగు కథల పుస్తకంతో మీ ముందుకు వస్తున్నాను. నా ఈ కొత్త పుస్తకానికి నువ్వు కవర్ పేజ్ చిత్రించగలవా?’ అని అడుగుతూ కథలు పంపాడు. పీడిఎఫ్ విప్పి చూస్తే మొదటి కథ పేరూ, పుస్తకం పేరూ ఒకటే, మా అమ్మంటే నాకిష్టం. కథ చదివా. అప్పుడు జ్ఞప్తికి వచ్చింది… నేను ఈ వ్యాసం మొదట్లో మొదలెట్టిన సృజన్ చెప్పిన కథ తాలూకు ఆ రచయితా, ఇప్పుడు నేను చదివిన ఈ కథ రచయితా ఒకరేనని! అయితే అప్పుడు కేవలం ఊరికే ఒక సన్నివేశం మాత్రమే నాకు ఇవ్వబడినది; ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఒక తల్లి కథ, ఆ అమ్మ గుండె.

అయినా ఒక చిత్రకారుడిగా నా పరిమితి నాకు ఉంది. నిజంగా వసుధేంద్ర కోరుకున్నట్లు నిక్కరు విప్పి పడేసి ఏడుపు మొహంతో, అవమానభారంతో నడుం వంచుకుని ఉన్న కుర్రవాడు, వాడిని కడుగుతూ తల్లి, కుడివైపున పిల్లల్ని వేసుకుని పందులు, ఈ వైపు కుక్క మూతి నాక్కుంటూ చూస్తూ, వెనుక ఎగతాళిగా నవ్వుతున్న స్కూల్ పిల్లలు… ఇదంతా గీస్తే అపుడు బొమ్మ ఏవవుద్దంటే బహిరంగ మల విసర్జన వద్దే వద్దు! మోడీయ స్వచ్ఛ భారతే ముద్దు! జై బోలో పరిసరాల పరిశుభ్రత!

అయితే దీన్నే ఈ గుంజులాటనే ఈ ఇబ్బందినే ఈ కథనే వసుధేంద్రకు చెప్పా. వాసు చాలా నమ్మకంగా ‘అన్వర్ నువ్వు ఏది గీస్తే అదే నా పుస్తకం కవర్.’ అన్నాడు. అయినా ఎలా వెయ్యాలి. నాకు ఆ క్షణాన, ఒకవేళ ఈ కథను ఇతర చిత్రకారులు అయితే ఎలా ఆలోచించి ఉండేవారు అనిపించింది. సరే, అదంతా అనవసరం. నా పునాది గట్టిది. చదివిన ప్రతి కథకు మనసు పెట్టి వేయలేం. కానీ నిజానికి గీతలో భగవానుడు చెప్పినట్లు ఎవరు ఎలా వ్రాసినా నువ్వు మాత్రం బొమ్మ బాగా వేయాలి అంటుంది మనసు. కానీ చేయ చేతరాదు. ప్రతిసారి ఎక్కడని మనసును బుజ్జగింపను?

సరే! ఈ బొమ్మను ఎలా? అని అనుకున్న వెంటనే నాకు తట్టింది కృష్ణ లీలలు. ఎందుకు అంటే ఏం చెప్పలేను. అలా మనసు అందించింది అంతే. చిన్నప్పుడే కన్నయ్య నానా పనులు చేశాడు కదా! దొంగతనం, దనుజ మర్దనం, గోపికా వస్త్రాపహరణం, అయ్యి ఇయ్యి… అన్నీ ముద్దుముద్దుగానే చూసిన జనం మనం, చూపిన వర్ణన మన కావ్యం. దేవుడు ఏం చేసినా చేయకపోయినా ఆకాశపు స్క్రీన్ సేవర్ ముందుకు వచ్చి, దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ, దేవదుందుభులు మోగిస్తూ నానా రచ్చ చేస్తారు కదా! ఇది మాత్రం కిట్టడు పోయి ఉండడా? ఇక్కడ మాత్రం దుందుభులు మోగి ఉండవా? ఆ సుందర ముదనష్టాన్ని దేవతలంతా ఇంద్రుడిలా కళ్ళు వేయి వేసుకుని సంబరంగ అంబరమంతా నిండి ఉండరా? అలా అనుకుని గీసిన బొమ్మే ఇది. అయితే ముందు గీసుకున్న స్కెచ్ మేఘాల్లో యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు నారదుడుతో సహా ఉంటారు. అయితే అసలుకన్నా కొసరు ఎక్కువయినట్లు ఫోకస్ అంతా దేవతలే నిండి ఉండటంతో ఆ స్కెచ్ అంతా తీసేసి కేవలం ఒక వేలుపు మాత్రమే సువర్ణ భాండముతో ఉదక ధార ధారాపాతంగా దింపుతున్నట్లు వేశా. పైన అమ్మ పేరు ఉంది కదాని అమ్మ మొత్తాన్ని దింపకుండా కేవలం రెండు చేతులు సింబాలిక్ మరియూ సింప్లిస్టిక్. గట్టిగా చెప్పలేను కానీ… ఈ రెండు చేతుల సేవ వెనుక స్వర్ణ మంజరి అనే పాత తెలుగు సినిమా ఉండి ఉండొచ్చని కూడా నాదొక ఊహ. దీని గురించి చెప్పడం చాలా కష్టం. ముందు దిగువ ఈ కథ మొత్తం చదవండి. ఆ పై మీకు ఒపిక ఉంటే, ‘అరే! నిజంగా ఈ కథకు ఇలా బొమ్మ ఊహించడం ఎలా సాధ్యం అయింది?!’ అని నిజాయితీగా అలోచించండి. కనీసం ఒక్క నిముషం! కనీసం ఒక్కరయినా! నాకు భలే సంతోషం వేస్తుంది.

ఇప్పుడు కథ గురించి చిన్న మాట మాట్లాడుతా. నాకు అమ్మ లేదు. నేను పొత్తిళ్ళలో ఉన్నప్పుడే దేవుణ్ణి ప్రేమించి, నన్ను వదిలి తనతో వెళ్ళిపోయింది. ఆ తరువాత నాకు ఎంతో మంది అమ్మలు దొరికారు, నన్ను సాకారు. అందరికీ ఒక అమ్మ ఉంటే నాకు ఇంట్లో అందరూ అమ్మలే. బయట ప్రతి ఇంటికొక అమ్మ. ఎవరికీ తెలీనంత అమ్మల గురించి నాకు తెలుసు–అని అనుకుంటున్న సమయంలో వాసు నాకు వాళ్ళమ్మను పరిచయం చేశాడు. ఈయమ్మ నాకు మునుపు ఏ పెరడు లోనో, పొయ్యి ముందో, అరుగు మీదో కనబడిన అమ్మ కాదు. ఏ కథాసాహిత్యం లోనూ గుబాళించిన పరిమళం కాదు. చిక్కని దుఃఖపు రంగు పేరు ఈయమ్మ. ఈ కథ నిండా ఒక వాసన. ముందు భరించలేని వాసన. ఆపై నిన్నూ నన్నూ సమస్త మానవ జాతినీ చేతుల్లో తలదాల్చుకుని గుండెలు ఎగిసిపడేలా వెక్కివెక్కిపడేసే వాసన. ఇది అమ్మ వాసన. ఈ వాసన నన్ను నాకు తెలీని మా అమ్మ వొళ్ళోకి చెడ్డీ విప్పించి మరీ దూకేలా చేసింది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్రి సంకల్పమైన మా తాత షుకురల్లీ ఖాను వారసత్వం నా కుంచెది. ఆ రోజు పెద్దాపురం గోడమీద, శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు సమక్షంలో భళ్ళున పగిలిన సీసా ధగధగల పరిమళం, ఇదిగో ఈ కథనిండా ఉంది. రండి… ఇక మీ అరకళ్ళు ఈ రచనలో సొక్కించడమే మిగిలింది!


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...