ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 11

మద్రాసు నుండి మైసూరుకు తిరిగి వచ్చాకా మళ్ళీ చదువులో పడ్డాను. మా కళాశాలలో చదువుకున్న అప్పటి నా చివరి సంవత్సరాలు మామూలుగా ఎటువంటి ప్రత్యేకతలు లేకుండానే గడిచిపోయాయనే భావిస్తున్నాను. జరిగిపోయిన సంఘటనలు చిన్నవైనా పెద్దవైనా ఆనాటి ఏవైనా ప్రత్యేక సంఘటనల గురించి కొత్తగా మీతో పంచుకుందామనుకున్నా, జరిగిపోయిన సంఘటనలేవి కూడా నోట్స్ వ్రాసి పెట్టుకునే అలవాటు నాకు లేదు. ఇప్పుడు నా కథ నేను చెప్పుకుంటూ ఆ వెనకటి సంవత్సరాల వైపు తిరిగి అప్పటి నా అనుభవాలను, జ్ఞాపకాలను ఏవైనా నెమరు వేసుకోడానికి నా దగ్గర ఉన్నదల్లా ఇప్పటి నా బలహీనమైన జ్ఞాపకశక్తి మాత్రమే.

ఆనాటి చదువుల రోజుల గురించి నాకు తరుచుగా గుర్తుకు వచ్చే జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి. తరగతి గదిలో మాకు చదువు చెప్పే కొంతమంది అయ్యవార్ల పాఠాలు, ఉపన్యాసాలు ఒక్కోసారి విసుగ్గా అనిపించినప్పుడు నేను నా పక్కన కూర్చున్న తోటి విద్యార్థులతో కలిసి ఒక కాలక్షేపపు ఆటను ఆడేవాణ్ణి. గడ్డం కింద చేయి పెట్టుకుని మా లెక్చరర్‌గారి వంక ఓరగా చూసుకుంటూనే, నేను నా నోటు పుస్తకంలో కేవలం ఒక గుండ్రపు సున్నాని, దాని మధ్యలో రెండు చిన్న చుక్కలను గీస్తాను. నా పక్కన కూర్చున్న అబ్బాయి ఆ బొమ్మని చూసి, తన ముఖం నుండి ఉబికి వస్తున్న నవ్వును బలవంతంగా అణిచి వేస్తూ ‘అయ్యంగార్’ అని రహస్యంగా పలుకుతాడు. కేవలం రెండే చిన్న చుక్కలని కళ్ళుగా పెట్టి మా ఆర్థిక శాస్త్ర ఉపన్యాసకుడిని కాగితం పైకి దించిన నా చిత్రకళాశక్తికి అతను బోలెడంత థ్రిల్ అయిపోతాడు. ఈ సారి నేను కాగితంపై ముఖం లేని ఒక పొడవైన ముక్కును గీస్తాను. అది మా తత్వశాస్త్ర గురువు ‘ఆచార్య’గారి బొమ్మన్నమాట. కోడిగుడ్డు ఆకారంలో ఉన్న మొహం ఉన్న బొమ్మ తాలూకు పెద్దమనిషి ప్రొఫెసర్ ఈగిల్టన్. మా సీనియర్ బి.ఎ. తరగతి గదిలో సుమారు రెండువందల మంది విద్యార్థులు ఉండేవారు. మహా రద్దీ జనాభా అయిన వీరందరి మధ్య భద్రంగా కూచుని నేను మా గురువుల మొహాలకు బొమ్మల పంగనామాలు దిద్దేవాణ్ణి. నేను రాస్తున్న ఈ నా కథ చదువుతున్న వారిలో బొమ్మలు వేసేవారెవరైనా ఉంటే వారికి తెలుస్తుంది క్లాసు రూములో కూచుని ఆర్థికశాస్త్ర పట్టికలు గీయడానికి బదులుగా గురుమహాశయుల బొమ్మలు వేయడంలో కలిగే మజా.

క్లాసురూములో కూచుని ఉన్నత చదువులు చదువుతున్నప్పటికీ నా ఆలోచనలన్నీ నా బొమ్మల భవిష్యత్తు పైనే కేంద్రీకృతం అయి ఉండేవి. ఇక్కడ చదువుతున్న చదువు ముగించుకున్న అనంతరం బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అనే పట్టా పట్టుకుని బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టి నేను ఏ దిక్కున నడవాలనేది నా వరకు ఒక ప్రశ్న కానే కాదు. ఆ చదువుకుంటున్న రోజుల్లోనే నేను బొమ్మలతో నా ఖర్చులకు కావలసిన దానికన్నా ఎక్కువ ఆదాయాన్నే సంపాదించుకుంటూ వస్తున్నాను. చిన్న చిన్న పత్రికలకు కార్టూన్లు, కథలకు బొమ్మలు వేయడం మాత్రమే కాక ‘సినీ తారల సౌందర్య రహస్యం మా సబ్బు మాత్రమే! ఇక నుండి అది మీది కూడా’ వంటి ప్రకటనలు. ‘ఓ రంగయ్యా, మేలుకో! ఓ మంగమ్మా, మేలుకో, చదువుకుని నిన్ను నీవు తెలుసుకో!’ వంటి వయోజన అక్షరాస్యతను ప్రోత్సహించే పొస్టర్ల డిజైన్లు చేయడం అనే చిన్నా చితకా పనులు అనేకం నాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి.

క్లాసు రూములో కూచుని మా తరగతి ఉపాధ్యాయుల కేరికేచర్లు, లేకపోతే నోటు పుస్తకంలో స్కెచింగ్ మాత్రమే కాకుండా నేను తరుచుగా చేసే మరో పని కూడా ఉంది. అదేమిటంటే చిన్న చాకు కాని, సగం బ్లేడ్ ముక్క కానీ ఒకటి పుచ్చుకుని తరగతిలో ఏదో ఒక బల్ల ముందు కూచుని దానిపై నా పేరు తాలూకు మొదటి అక్షరాలైన RKL అని చెక్కడం. బొమ్మలు వేయడమనేది నూటికో, కోటికో ఎవరో ఒకరు చేస్తారేమో కానీ ఇలా బల్లలపై తమ పేర్లని శాసనాలుగా చెక్కేవారి లెక్కకు ప్రపంచంలో కొదవేమిటీ? బల్లలపై కనపడే ఇటువంటి NKB, CRS, L RAO, GK… వంటి అసంఖ్యాకమైన ఇనీషియల్స్ గురించి నేను అనేక ఊహాగానాలు చేసేవాడిని. నేను చదువుకుంటున్న కళాశాల నిన్నా మొన్నటిది కాదు. ఈ తరగతి బల్లలూనూ వందకు పైగా సంవత్సరాల వయస్సు గలవి. వీటిపై తమ పేర్లు చెక్కుకున్న ఈ మనుషులంతా ఇప్పుడు ఏమయినట్లు? ఎక్కడెక్కడ నివసిస్తున్నట్లూ? ఎక్కడో పుట్టి, పెరిగి, కేవలం బల్లల మీద తమ పేర్ల ముద్రలు వేయ నిమిత్తమే వీరు ఈ కళాశాలలో చేరి వారి పేర్లు చెక్కి, ఆ పై తాము ఈ భూమిపై అవతరించిన కార్యక్రమం ముగిసింది అన్నట్లు నిష్క్రమించారేమో అనుకునేవాడిని.

నా బి.ఎ. చదువు చివరికొచ్చేసింది. మెల్లగా వేసవి కాలమూ వచ్చేసింది, భూతాపమే కాకుండా పరీక్షల వేడి కూడా మమ్మల్ని చుట్టుముట్టింది. ఒకరోజు నేను సీనియర్ బి.ఎ. హాల్‌లో చివరి వరుసలో కూర్చుని, పాఠం వింటున్నాను. మా గురువుగారి కంఠస్వరం హాయిగా జోలపాటలా ఉండి నాకు నిద్ర పట్టేలా చేసింది. సగం కలలో, సగం కాలేజీ పాఠంలో మూస్తూ మూస్తూ తెరుచుకుంటున్న నా అరమోడ్పు కళ్ళు అసంకల్పితంగా నే తలవాల్చిన డెస్క్ ఉపరితలం పైనున్న పేర్లను చదువుతున్నాయి. ఒక్కసారిగా నిదుర మత్తు విదిలించుకుంటూ లేచి కూచున్నాను. డెస్క్‌పై చెక్కి ఉన్న ఇనీషియల్స్ నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులవే. అన్నిటికన్నా పైన ఉన్న ఇనిషియల్ RKP. అంటే అది నా అన్న పట్టాభి! దాని క్రింద RKN -నారాయణ్ తర్వాత RKS -శ్రీనివాసన్, RkB -బలరామ్, చివరగా RKR -రామచంద్రన్ పేర్లు ఉన్నాయి. మహారాజా కళాశాల ముఖద్వారం గుండా ఈ కళాశాలలోకి ప్రవేశించి ఉండిన నా సోదరులు ఒకరి తరువాత ఒకరు ఈ తరగతి గదిలో చదువుతూ ఒకరు మొదలుపెట్టి చెక్కిన తమ పేర్ల పరంపరలో తమ అందరి పేర్లను వరుసగా ముద్రిస్తూ వచ్చారు. ఆహా! ఎంతమందికి ఈ అదృష్టం పడుతుంది చెప్పండి? పరమ ఉత్సాహంగా నేను నా జేబునుండి పెన్సిల్ చెక్కుకునే చాకు తీసి నా పేరు చెక్కడం మొదలుపెట్టాను. పనంతా అయిపోయాకా సుతారంగా చెక్క తాలూకు పొట్టును ఊది మా అన్నాదమ్ముల వంశవృక్షాన్ని ఆ విధంగా బల్లల చరిత్రలో నమోదు చేశాను.

నా బి.ఎ. చివరి సంవత్సరపు పరీక్షలు ముగిశాయి. నేను ఈ చదువు అనే రోజులు తరిగి ముగిసి పరీక్షలు అనే ఘట్టం ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అని మాత్రమే ఎదురు చూస్తున్నాను. ఈ పరీక్షలు నిర్ణయించే జయాపజయాలతో నాకు నిమిత్తం లేదు. నాలుగు గోడల మధ్య కూచుని చదువు అనే విషయానికి వీలయినంత త్వరగా వీడ్కోలు పలికేందుకే నేను తహతహలాడుతున్నాను. ఒక పక్క పరీక్షలు నడుస్తుండగానే బజారుకెళ్ళి ఒక పెద్ద ముదురు గోధుమ రంగు ట్రంకు పెట్టె కొని తెచ్చా. పరీక్షలు ముగిసిన రెండు వారాలకే ఆ పెట్టెలో నా ఆస్తిపాస్తులయిన పుస్తకాలు, బొమ్మలేసిన కాగితాలు, బొమ్మల పచారీ సామాను, నా బట్టలతో దానిని నింపుకున్నా. పెట్టె తలుపు మూసి పెయింమ్ దానిపై ‘ఆర్. కె. లక్ష్మణ్’ అని నా పేరు రాసుకున్నా. ఇక అయిపోయింది, బయట ప్రపంచంలో బ్రతకడానికి నేను నా రెక్కలు విదిలించుకుని సిద్దంగా ఉన్నాను. నేను ఏం చేసినా కాదనని మా ఇంట్లో వాళ్ళు మామూలుగానే చిరునవ్వుతో నాకు వీడ్కోలు చెప్పారు.

ప్రస్తుత నా గమ్యం మద్రాసు, అక్కడ నిలయమై ఉన్న వార్తాపత్రికలలో ఏదో ఒకదానిలో కార్టూనిస్ట్‌గా ఉద్యోగం సంపాదించాలనేది నా ఆలోచన. వార్తాపత్రిక అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ది హిందూ. అయితే వారు ప్రపంచ ప్రఖ్యాత కార్టూనిస్ట్ డేవిడ్ లో కార్టూన్‌లను సిండికేషన్ ద్వారా తమ పత్రికలో ఉపయోగించుకుంటున్నారు. చిన్నతనం నుండి కూడా నేను డేవిడ్ లోకి వీరాభిమానిని, ఏకలవ్య శిష్యుణ్ణి కావడంతో, ఆయన బొమ్మల చెంత నా బొమ్మలు అనే మాట ఊహించడానికే ధైర్యం చాలక ఉద్యోగం కోసం హిందూ పత్రిక దరిదాపులకు కూడా వెళ్ళలేదు నేను. హిందూ తరువాత అంతటి పేరున్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ నాకు అక్కడ తెలిసినవారు ఎవరూ లేరు. అయినప్పటికీ, నేను ఒక రోజు ఉదయం ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ఆఫీసుకి చేరుకుని అక్కడి ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్‌లో అడుగుపెట్టాను. అక్కడ ఒక వయసు పెద్దాయన గాలీలో ప్రూఫ్‌లను చూస్తున్నారు. ఆయన్ని కలిసి నేను అక్కడికి ఎందుకు వచ్చానో ఆయనకు చెప్పాను. వివిధ పత్రికలలో మునుపు ప్రచురింపబడిన నా బొమ్మలు, కార్టూన్ల క్లిప్పింగ్‌లను ఆయనకు చూపించాను. ఆయన ఒకదాని వెంట ఒకటిగా నా బొమ్మలన్నింటినీ ఆసక్తిగా చూస్తున్నారు.

నాకు అర్థం అయిపోయింది, నా బొమ్మలన్నీ చూడ్డం అయిపోయాకా ఆయన తన కళ్ళనుండి కారుతున్న ఆనందభాష్పాలు తుడుచుకుంటూ, నన్ను తన దగ్గరగా తీసుకుని గద్గదమైన గొంతుకతో “ఇంత ప్రతిభావంతుడివి ఇంతకాలం ఎక్కడ ఉండిపోయావు నాయనా” అంటారు. ఆ పై గంభీరంగా తల ఎటోవైపుగా తిప్పి ఎవరక్కడా అని గర్జించగానే ఒక బంట్రోతు వీలయినంత గడగడా వణికిపోతూ ఆస్థాన కార్టూనిస్ట్‌గా నా అపాయింట్‌మెంట్ లెటర్ పట్టుకుని అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అవును కొన్ని విషయాలు నాకు ముందుగానే తెలిసిపోతాయి. ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటూ, ఇదంతా నాకు ఎదురైనపుడు వీలయినంత భావావేశానికి లోను కాకుండా ఉండటానికి నన్ను నేను నియంత్రించుకోవడానికి, నాలో నేనే ‘లక్ష్మణ్! చూడు ఇది ఇలా, అది అలా’ అని సూచనలు చేసుకుంటున్నాను. నా బొమ్మలను చూడటం ముగించి ఆ పెద్ద మనిషి తన తలను పైకెత్తి అడ్డంగా ఆడిస్తూ, ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పొలిటికల్ కార్టూనిస్ట్ ఉద్యోగాలు అంటూ ఏమీ లేవని, ఆవిధంగా నా అవసరం వారికి లేదని, పైగా ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులే పత్రికాయాజమాన్యం పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ఈ పత్రిక యజమాని పరమ పిసినారి మనస్తత్వం గురించి విసుక్కుంటూ రేపో ఎల్లుండో పత్రికా సమ్మె మొదలవ్వబోతుందని’ ఏదేదో గొణుక్కుంటూ నన్ను, నా నిరాశను అక్కడే వదిలి తన మానాన తను అక్కడినుండి వెళ్ళిపోయాడు.

నేనిక చేయడానికేం లేక నారదుడి ఆనిమేషన్ సినిమా తీసిన పాత మిత్రులను పలకరిద్దామని మునుపు పనిచేసిన ఫిల్మ్ స్టూడియోకి వెళ్ళాను. నా రాకనసలు ఊహించని మా దర్శకుడు నన్ను చూసి ఎంతగానో సంతోషించాడు. అక్కడ పనిచేసే ఒకతనిని పిలిచి అక్కడ నాకు కుర్చీ వేయించాడు, తనే ఖుద్దున లేచి నాకు బాగా గాలి తగలాలని అక్కడ ఉన్న ఫ్యాన్‌ని నా వేపు సర్దుబాటు చేశాడు. అదంతా అయ్యాకా అతిథి మర్యాదలో భాగంగా స్టూడియో క్యాంటీన్ నుండి నా కొరకు వేడి వేడీ ఇడ్లీ, కాఫీ తెప్పించాడు. ఆ మాటా ఆ కబురు ఈ మాటా ఈ కబురు పూర్తయ్యాకా ఆయన నా భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగాడు. ఇక్కడి నుండి నేను ఢిల్లీకి వెళుతున్నాను అని చెప్పాను. నిజానికి అటువంటి ఆలోచన ఉన్నదని కాదు కానీ ఎందుకో ఢిల్లీ మాట నా నోటికలా వచ్చేసింది. అదీకాక ప్రస్తుతం నేను ఖాళీయేననంటే ఎక్కడ మళ్ళీ నన్ను ఆ నారదుడిని, ఆ మంగలి షాపుని, ఆ కీ డ్రాయింగులని, ఆ ముతక హాస్యపు యానిమేషన్ సినిమాని నా మెడకు తగిలిస్తాడోనని జడుపు పట్టుకుంది.

నారదుడి సినిమాకు సంబంధించి పనిచేస్తున్న కొంతమంది ఆర్టిస్టులు ఇక్కడ ఉద్యోగం వదిలి వెళ్ళిపోయారని, అందుకనే సినిమా పూర్తవడం ఇంత ఆలస్యమవుతుందని ఆయన తన గోడు వెళ్ళబోసుకున్నాడు. నేను ఇంతకుముందు నారదుడు దేవలోకం నుండి జారి భూలోకంలో ఒక మంగలి షాపు లోని కుర్చీలో కూలబడటం వరకు వారితో కలిసి పనిచేశాను కదా! మంగలి కుర్చీ సంఘటన తర్వాత కథని దర్శకుడు తన హాస్యధోరణిలో వివరించాడు. నారదుడు అక్కడి కుర్చీలో కూలబడగానే, క్షురకుడు మహర్షికి గడ్డం గొరగడం మొదలెడతాడు. దానితో ఇంకా బెంబెలెత్తిపోయిన నారద మహర్షి అక్కడి నుండి పారిపోతాడు. భూ ప్రపంచంతో పరిచయం లేని ఆయన రోడ్డు మీద మోతలు మోగిస్తూ తిరిగే కార్లు, బస్సులు, లారీలు, ఇతర మోటారు వాహనాల బారి నుండి తప్పించుకోవడానికి అటూ ఇటూ పరుగెడతాడు. అతనికి దారి మధ్యలో ఒక ఎర్రని పోస్ట్‌బాక్స్ కనిపిస్తుంది. ఇదేదో భూమి నుండి మొలుచుకు వచ్చిన ఒక చెవిలా ఉన్నదని భావించి, అతను స్వర్గానికి తిరిగి వెళ్ళడానికి దానిని దారి అడుగుతాడు. ఈ సన్నివేశాన్ని వివరిస్తూ డైరెక్టరుగారు అందులోని హాస్యానికి ముగ్దుడైపోయి తనను తాను నియంత్రించుకోలేక గొంతెత్తి నవ్వడం మొదలుపెట్టాడు. అతనితో కలిసి మర్యాదకోసం నాకు చేతనయిన స్థాయిలో నేనూ ఒక పిచ్చి నవ్వు నవ్వుతూ ఇక ఆ కథ బారినుండి తప్పించుకోవడానికి స్టూడియో యజమానిగారు ఎలా ఉన్నారు అని ఆయన యోగక్షేమం అడిగాను. దానికి జవాబుగా ఆయన ఈ నారదుడి సినిమా కథ స్టూడియో యజమానికి బహుబాగా నచ్చిందని, ఆయన దానిని చాలా మెచ్చుకున్నాడని, ఇప్పుడు స్టూడియో యజమానిని నాకు పరిచయం చేస్తాను పదమని డైరెక్టరుగారు దారితీశాడు. ఆ విధంగా ఇద్దరం వెళ్ళి స్టూడియో యజమానిని కలిశాము.

ఈ స్టూడియో యజమాని వేషభాషల్లోనూ మాట తీరులోనూ సాధారణంగా అప్పటి సినిమా వృత్తిలో ఉండే ఇతరులకు చాలా భిన్నంగానూ నూతనంగానూ కనిపించారు. మనిషి మాట్లాడే పద్దతి కానీయండి, మమ్మల్ని ఆహ్వానించిన తీరు కానీయండి, ఏ మాత్రం ముతకతనం లేదు. నన్ను నేను ఆయనకు ఔత్సాహిక కార్టూనిస్ట్‌గానూ ఇంకా తన రెండు నవలలను సినిమా కథలుగా ఇచ్చి సినిమా నిర్మాణాన్ని పర్యవేక్షించిన ప్రముఖ రచయిత ఆర్. కె. నారాయణ్ చిన్న తమ్ముడిగా పరిచయం చేసుకున్నాను. నేనొక చిత్రకారుడినని చెప్పుకోగానే ఆయన నా పనిని చూడటానికి చాలా ఆసక్తి కనబరచాడు. నా దగ్గర ఎలాగో ఆ ఉదయం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆఫీసులో చూపించడానికి తీసుకువెళ్ళిన బొమ్మలు ఉన్నాయి కదాని వాటినే చూపించాను. ఆయనకు నా పనితనం బాగా నచ్చింది. ఆ మధ్యే అతను ఒక ప్రముఖ తమిళ హాస్య పత్రికను కొనుగోలు చేశాడుట. నాకు ఆసక్తి ఉంటే వెంటనే నేను తన పత్రికలో చిత్రకారుడిగా ఉద్యోగం చేయవచ్చనే ఒక అవకాశాన్ని అందించారు. ఆ పెద్దమనిషి ఒక పళ్ళెంలో సగౌరవంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అంగీకరించాలా, లేకపోతే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న ఆంగ్ల పత్రికలలో నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలా అనే రెండు విషయాల మధ్య నేను కాస్త తడపడ్డాను. ఆయన నా గందరగోళాన్ని పసిగట్టాడు. సున్నితంగా మాట్లాడుతూ తను ఇచ్చిన ఈ ఉద్యోగ అవకాశం గురించి అంతగా కంగారు పడవద్దని, తన పత్రికలో ఉద్యోగం చేయాలని నిర్ణయం, అవసరం నాకు ఎపుడు కలిగినా నిశ్చయంగా నేను ఇక్కడ చేరవచ్చని నా కోసం అతని పత్రిక తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భరోసా ఇచ్చారు. ఒకవేళ నేను ఢిల్లీలో నా ఉద్యోగ ప్రయత్నాలలో విఫలమైతే వెనక్కి తిరిగివచ్చి ఇక్కడ ఒక పత్రికా ఉద్యోగంలో చేరవచ్చనే విశ్వాసంతో గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి మద్రాస్ నగరాన్ని వదిలి ఢిల్లీ పట్టాలపై ప్రయాణమయ్యాను.

అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...