ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 8

నేనూ హెచ్‌కె ఇద్దరం కలిసి కనీసం వారానికి ఒకసారయినా సినిమాకి వెళ్ళేవాళ్ళం. రాయల్ ఆపెరా హౌస్ అనేది మా ఇరువురికీ ఎంతగానో ఇష్టమైన సినిమా థియేటర్. ఇందులో బాగా పేరుపడ్డ హాలీవుడ్ సినిమాలను చూపించేవారు. ఈ థియేటర్‌ను తలుచుకుంటే మనస్సు దశాబ్దాల వెనక్కి మూగ సినిమాల దగ్గరి వరకు వెళ్ళిపోతుంది.

సినిమాలను ఆమడ దూరం పెట్టే మా నాయనగారు ఎంత మహా ఘోర సంప్రదాయవాదో మీకు తెలియదు. అయితే ఎలా జరిగిందో ఏమో తెలీదు, ఎవరి ప్రోద్బలం వల్లో బలవంతం మీదో ఒకసారి ఆయన ఈ రాయల్ ఒపెరా హౌస్ లోనే కిడ్ అనే సినిమా చూశారు. కిడ్ – అవును ఇది మీకందరికి తెలిసిన ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీచాప్లిన్ సినిమానే. అందులో ఆరేళ్ళ కుర్రవాడి పాత్రను ధరించిన నటుడి పేరు జాకీ కూగన్. ఆ సినిమాలో చిన్నారి జాకీ కూగన్ నటించిన చిలిపి చేష్టలు చూసి మా తండ్రిగారు ఎంత పరవశించి పోయారంటే ఏది ఏమయినా సరే, ఆ సినిమాని నేను చూడాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆయన నాతో ఆ సినిమాకు చూడ్డానికి రాలేదు కానీ, నేను ఆ సినిమా చూసి మరలి జాగ్రతగా ఇంటికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసి నన్ను థియేటర్‌కు పంపారు. నేను కూడా ఆ సినిమాతో ఎంతగా మమేకం అయిపోయానంటే సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత నేను నన్ను నేను కిడ్ కూగన్‌గా భావించుకుంటూ ఇంట్లో చిన్న చిన్న అల్లర్లు చేయడంలో తెగ మునిగిపోయాను. కిడ్ కూగన్ పూనకం నా నుండి వదిలిపోయేవరకు మా అమ్మగారు నన్ను, నా చేష్టలను జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ ఉండేది.

నేనూ హెచ్‌కె అనే నా జంట కవి, ఇద్దరం కలిసి తరుచుగా కనపడే మరో ప్రదేశం కృష్ణ అండ్ కో అనే పుస్తకాల షాపు. మా అంత వయసు పిల్లలు అరుదుగా కనపడే ప్రదేశాలలో పుస్తకాల దుకాణం ఒకటి కదా! మేము ఎంత అల్లరి పిల్లలమయినా బడి, చదువు పట్ల గొప్ప శ్రద్ద ఉన్నవారిమేమీ కాకపోయినా మేము కలిసి తిరిగే ఇష్ట ప్రదేశాల్లో పుస్తకాల దుకాణం ఒకటి ఉందీ అంటే దాని అర్థం ఏమిటీ? మేధోపరమైన నిర్దిష్టత ఒకటి మాకు ఉందనే విషయం మీకు అర్థం అవుతుంది కదా.

మైసూర్ అనేది పేరు గాంచిన ఒక విశ్వవిద్యాలయపు నగరం అవడం వలన మా నగరమంతా ఉపాధ్యాయులు, ఆచార్యులు, విద్యార్థులు, తత్వవేత్తలు, చింతానాశీలులు, పరిశోధకులే కాకుండా, రచయితలు, కవులు వంటి సాహితీ జీవులతో కూడా నిండిపోయింది. వీరితో పాటు నిత్యం పుస్తకాల పఠనమనే ఆకలితో ఉండే పాఠకుల జనాభాతో కూడా కలిసి కృష్ణ అండ్ కో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. వీరంతా కేవలం ఇక్కడికి వచ్చి పుస్తకాలు కొనడం వెళ్ళడం మాత్రమే కాదు, సమయం దొరికినప్పుడల్లా పుస్తకాల మీద, తాజా రచనల మీద తమ తమ అభిప్రాయాలు వెల్లడించడం, చర్చలు జరపడం వంటివి ఇక్కడ నిత్యకృత్యాలు. ఇంత జరుగుతుంది కదా ఈ పుస్తకాల షాపు ఎంత పెద్ద మహలో అని అనుకోవద్దు. మహా అంటే ఆరడుగుల వెడల్పు పన్నెండు అడుగుల పొడవు మాత్రమే విస్తీర్ణం ఈ దుకాణానిది. షాపులో ఒకటే పుస్తకాల అర. అందులో మీకు కనపడేవి, ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలు కొన్ని, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తాలూకు అన్ని సంపుటాలు, షేక్స్‌పియర్ సమగ్ర రచనలు, పాల్‌గ్రేవ్స్ గోల్డెన్ ట్రెజరీ, ఇంకా అవీ ఇవీ అరా కొరా పుస్తకాలు మాత్రమే. ఇవికాక పుస్తకాల దుకాణం యజమాని కృష్ణ నిత్యం సేవించే కాఫీ ఉన్న థర్మోస్ ప్లాస్కు, ఇంకా ఆయన మధ్యాహ్న భోజనానికి ఒక టిఫిన్ క్యారియర్, అదనపు వస్తువులు. వీటితోపాటుగా యజమాని కూచునే కుర్చీ ఒకటి. దాని ముందు చిన్న బల్ల. ఆ బల్ల ముందు ఒక అరడజను కుర్చీలు, అందులో ఎప్పుడూ కబుర్లు చెప్పడానికి లేదా పుస్తకాలు కొనడానికి వచ్చిన వ్యక్తులు. ఇదీ ఆ పుస్తకాల షాపు స్వరూపం.

కానీ కృష్ణ అండ్ కో యజమాని కృష్ణ ఉన్నారే, ఆయన ఒక భలే అద్భుతమైన మనిషిలే! కొనుగోలుదారులు కోరుకునే పుస్తకాలు ఆయన వద్ద సమయానికి లేకుంటేనేం. ‘ఇదిగో కాస్త ఆగండి’ అని ఆయన పాఠకులు కోరిన ఏ పుస్తకాన్నయినా ఒక నలభై ఎనిమిది గంటలలోపు తెప్పించి వారి చేతికి అందించేవాడు. అది సాహిత్యం కానివ్వండి, సామాజికం, విజ్ఞానం, వేదాంతం, తత్వశాస్త్రం, చరిత్ర, గణితం, ఇంకా ఏదైనా సరే మీ అవసరం చెబితే చాలు, ఆ పుస్తకం మీకు అంది తీరుతుంది.

ఈ దుకాణంలోనే నేను జీవితంలో మొదటిసారిగా పెంగ్విన్ ప్రచురణల పుస్తకాలను చూశాను. పాఠకుల చేతుల్లో ఉన్న పుస్తకాల అట్టలు బత్తాయి రంగులో ఉంటే ఆ పుస్తకాలను కల్పనా సాహిత్యమని పసిగట్టేవాళ్ళం. అదే విధంగా జీవిత చరిత్రలకు నీలిరంగు అట్టలు, యాత్రా సాహిత్యమైతే ఊదారంగు, సామాజిక శాస్త్రం, మనస్తత్వశాస్త్రం, తత్వశాస్త్రాల రంగులయితే ఫిరోజా నీలం, ఆటల కోసం పసుపు రంగు అట్టల పుస్తకాలు ఉండేవి. ఆకుపచ్చ కవర్‌లతో కూడిన పెంగ్విన్ పుస్తకాలను చదివే వ్యక్తుల మీద మా అభిప్రాయం కాస్త తక్కువస్థాయి. ఎందుకంటే ఈ రంగు అట్ట పుస్తకాల పాఠకులు హత్యలు, దోపిడీలు, ఉత్కంఠభరితమైన రచనల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపేవారు అని మాకు తెలిసిపోయేది.

పుస్తకాల కృష్ణ గొప్ప హృదయ ఔదార్యం కల మనిషి. ఆయన తన కస్టమర్లు ఆర్డర్ చేసిన పుస్తకాలలో నాకు, హెచ్‌కెకు ఏవైనా ఆసక్తి ఉన్నవి ఉన్నాయనుకొండి, ఆ పుస్తకాలను మాకు తిరగేయడానికి అనుమతి ఇచ్చేవాడు. ఇలా ఆయన దయ వలన నేనూ, హెచ్‌కె కలిసి కళల పునరుజ్జీవనోద్యమం నుండి ఇంప్రెషనిజం వరకు ఐరోపా కళ చరిత్ర యొక్క మొత్తం సంపుటాలను చూసే భాగ్యం కలిగింది. ఆ విలువైన సంపుటాలు మైసూర్‌లోని ఒక లైబ్రరీవారు కృష్ణ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. మేము ఆ ఆరు ఘనమైన సంపుటాలను చూడ్డం పూర్తిచేసే వరకు కృష్ణ ఆ పుస్తకాల డెలివరీని ఇదిగో ఇప్పుడూ, అదిగో అప్పుడూ అంటూ పుస్తకాలని వారికి అప్పగించడంలో జాప్యం చేశారు. ఆ పుస్తకంలో రెంబ్రాండ్, వెలాస్క్వెజ్, టిటియన్, రూబెన్స్, ఎల్ గ్రీకో, వాన్ గాగ్, డెగాస్ మరియు అనేక ఇతర మాస్టర్స్‌ల పని చూసి నేనెంత థ్రిల్ అయ్యానో!

నా జీవితంలోని తర్వాతి సంవత్సరాల్లో, నేను యూరప్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, అక్కడి మ్యూజియాలలో, ఆర్ట్ గ్యాలరీలలో అప్పుడు నా బాల్యంలో చూసిన బొమ్మల ప్రింట్ల తాలూకు అసలువాటిని చూశాను. అక్కడి చాలా పెయింటింగ్స్‌తో నాకు బాగా పరిచయం ఉంది కాబట్టి నేను వాటిని చాలా దూరం నుండి కూడా గుర్తించగలిగాను. అందుకు ఎప్పటికీ మీకు అనేకానేక ధన్యవాదాలు కృష్ణగారు.

మెల్లమెల్లగా మార్చి, ఏప్రిల్ నెలల సమీపిస్తున్నాయి. ఇవి చాలా గంభీరమైన నెలలు. విద్యార్థుల బ్రతుకులకు పరీక్షానామ మాసాలివి. నేనూ, హెచ్‌కె కాస్త మా తిరుగుళ్ళు తగ్గించాము. కాలేజీలు మరియు పాఠశాలల్లో వివిధ స్థాయిలలో జరిగే సంవత్సరాంత పరీక్షల తయారీల కోసం విద్యార్థులంతా విద్యాలయాల గంట కొట్టేయగానే సరాసరి ఇళ్ళకు చేరుకుంటున్నారు. ఆ కారణంగా ఆటస్థలాలు, వారు తరుచుగా కనపడే అడ్డాలు అన్నీ బోసిపోయి కనపడుతున్నాయి.

హెచ్‌కె, నేను కూడా బడి విడిచిన సాయంత్రాలలో అక్కడే టాటాలు బైబైలు చెప్పేసుకుంటున్నాము. ఇళ్ళ దగ్గరే కాలం గడుపుతూ మేము బలహీనంగా ఉన్న పాఠ్యాంశాలు ఏవేవో లెక్కలు వేసుకుంటూ, చూసుకుంటూ వాటిలో వేటిని మేము ఇంత కాలం నిర్లక్షం చేశామో, ఏవి అత్యంత ముఖ్యమో ఆ పాఠాలన్నింటిని క్రమబద్ధీకరించుకుని అధ్యయనం చేసుకోవడమనే ఒక క్రమశిక్షణకు సిద్దమయ్యాము. ఈ భయంకరమైన పనిని ఎవరికి వాళ్ళం ఒంటరిగా కాకుండా జంటగా కలిసి కంబైన్డ్ స్టడీ పేరుమీద విజయవంతం చేద్దాం అని కూడా ప్రయత్నించాము. కానీ ఈ జాయింట్ స్టడీలో చదువుపై చూపవలసిన శ్రద్ధ కన్నా కబుర్లు మీద శ్రద్ధ ఎక్కువై చదువుకోవలసిన కాలాన్నంతా నవ్వుతూ తుళ్ళుతూ తులవగా గడుపుతున్నామని, ఈ విధంగా మేము పాస్ అయ్యే అవకాశాలంటూ ఏవైనా ఉంటే వాటిని మా నవ్వులారా మేమే సర్వనాశనం చేసుకుంటున్నామని గ్రహించి, ఆ కంబైన్డ్ స్టడీని ఇక త్యాగం చేశాము. అప్పుడపుడూ వీధిలోనో, పని మీద బయటికి వచ్చినపుడు దారుల్లోనో ఏ ఇతర సహవిద్యార్థులనో కలుసుకున్నప్పుడల్లా ఆ కబుర్లు ఈ ముచ్చట్లు కాకుండా పరీక్షల్లో ఏ ఏ ప్రశ్నలు రావచ్చు, ఇంకా ఏ అధ్యాయాలను గట్టిగా చదివితే మంచిది- ఇలాంటివే మాట్లాడుకునేవాళ్ళం.

చదువుతో కుస్తీ పట్టే కాలం ముగిసింది. ఇక పరీక్షా కేంద్రాల్లో అడుగుపెట్టే రోజున మేమంతా భయాందోళనలతో బుగులుగా, గజగజగా పరీక్ష హాల్‌లో ప్రవేశించాము. నేను, హెచ్‌కె సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ పరీక్షకు రాస్తున్నాము. ఇందులో కనుక మేము ఉత్తీర్ణులమైతే ఈ హైస్కూల్ వదిలి ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రవేశిస్తాము. అప్పుడు లాగూలు వదిలేసి పంట్లాములు కూడా తొడుక్కోడానికి అర్హత వస్తుంది కూడానూ.

మొదలయిన పరీక్షలన్నీ ముగిశాయి. పరీక్ష చివరి రోజున మేము గోలగోలగా అరుస్తూ, పాఠశాల గోడలపై ఇంక్ బాటిళ్ళను పగులగొడుతూ, ఒకరి తెల్ల చొక్కాలపై మరొకరం సిరాను చల్లుకుంటూ పరీక్ష గదుల నుండి బయటకు వచ్చాము. ఆత్మవిశ్వాసం ఎక్కువైన కొంతమంది అబ్బాయిలు తమ ఉత్తీర్ణతపై గొప్ప నమ్మకంతో, ఇంతకాలం పరీక్ష కోసం జాగ్రత్తగా సిద్ధం చేసుకున్న మెయిన్ పాయింట్స్ ఉన్న నోట్స్‌ను ఉన్మాదంతో చించి గాలిలోకి విసిరారు. మరికొంతమంది ఇక గడిచిన తరగతి పుస్తకాలు చదవవలసిన అవసరం లేదని హైస్కూల్ మెట్లపైనే తమ పాఠ్యపుస్తకాలను తగులబెట్టారు.

సెలవులు మొదలయ్యాయి. నా పాత దినచర్యలో కొత్త మార్పు ఏమీ లేదు. స్కెచింగ్ అనే సాధన నడుస్తోనే ఉంది. కొన్ని పత్రికలకు కార్టూన్లు వేస్తున్నాను. హిందూలో మా అన్న నారాయణ్ వ్రాస్తున్న చిన్న కథలకు బొమ్మలు ఇస్తున్నాను. రాబోయే పరీక్షా ఫలితాల మీద ఇంచుకైనా బెంగే లేదు. నేను ఎట్లాగైనా ఉత్తీర్ణత సాధిస్తానన్న నమ్మకం బాగా ఉంది. మూడు నెలల తర్వాత పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఆశ్చర్యకరంగా నేను చాలా బలహీనంగా ఉన్న సైన్స్, గణితం వంటివాటిల్లో విజయం సాధించాను కానీ అత్యంత అనాయాసంగా మార్కులు తెచ్చుకోవలసిన కన్నడలో నీచమైన మార్కులతో తప్పాను. ఈ వార్త తెలియగానే ఒక క్షణంపాటు ఎవరూ నమ్మలేని ఈ వైఫల్యాన్ని నమ్మడానికి నా మనసూ అంగీకరించలేదు. సరిగ్గా ఆ సమయంలోనే మా ఇంటికి మా చిన్న చిన్న మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు వచ్చి ఉన్నారు. జీవితం ప్రతికూలించిన ఈ యొక్క విషమ పరిస్థితిని నేను ఎలా ఎదుర్కుంటానో చూడటానికి వారంతా తీవ్ర ఉత్కంఠతతో నా చుట్టూ చుట్టకట్టి ఉన్నారు. నేను వెర్రి మొహం తాలూకూ అయోమయ గాంభీర్యంతో, పిచ్చి ప్రేలాపన చివర దిద్దుకునే అవివేకమైన నవ్వుతో కట్రాటలా వాళ్ళ మధ్య నీలుక్కుని ఉన్నా. వెధవ జీవితంలో సుఖదుఃఖాలు, విజయాపజయాలు అత్యంత సర్వసాధారణం. వాటికి నావంటి స్థితప్రజ్ఞుడు కదిలిపోడు అనే అంతిమ సత్యం ఈ కుర్రకుంకలకు ఏమి తెలుసు అని తలపులు పోతున్నా. అయితే అప్పుడు తెలిసింది అసలు వార్త. చిన్నతనం నుండి ప్రతి తరగతి గదిలోనూ నాతో పాటు పాఠాలని పంచుకున్న నా అనుంగు మిత్రుడు హెచ్‌కె విజయవంతంగా పరీక్ష పాసయ్యాడని, అతను నన్ను వదిలి కాలేజీ చదువు వైపు అడుగులెయ్యబోతున్నాడని. చూడు, మనం పరీక్ష తప్పడమనే సత్యం క్షణకాల విషాదం. మన మిత్రుడు పాస్ అయ్యాడు అనేది గుండెలు పగిలిపోయే సత్యం. నా చుట్టూ ఉన్న పిల్లలు ఇంతసేపు దేనికోసం ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉన్నారో ఆ బంగారు ఘడియ రానే వచ్చింది. హెచ్‌కెగాడు పాసయ్యాడని తెలియగానే వాడిని మనసులోనే బండబూతులు అనుకుంటూ కిందపడిపోయి కాళ్ళు చేతులు నేలకేసి బాదుకుంటూ ఓ! అని సిగ్గులేని శోకాలు తీయసాగాను. పిల్లల మొహంలో అంతులేని సంతృప్తి.

నా దీర్ఘ శోకాలు విని నా ప్రియమైన అన్నలు కొందరు పరుగుపరుగున వచ్చి నన్ను ఓదార్చడం మొదలుపెట్టారు. పరీక్షా ఫలితాల్లో నేను పొందిన వైఫల్యానికి వారంతా నైతిక మద్దత్తు ప్రకటిస్తూ తాము సైతం తమ విద్యార్థి జీవితంలో వివిధ దశలలో ఇలాంటి వైఫల్యాలను ఎలా ఎదుర్కొన్నారో చెబుతూ వచ్చారు. మా పెద్దన్న ఆర్.కే. నారాయణ్ అయితే ఒకానొకసారి ఒక ప్రవేశ పరీక్షలో తాను ఇంగ్లీషులో ఫెయిల్ అయ్యాడని అయినా ఆ అవమానాన్ని లెక్కచేయక, క్రుంగిపోక ముందుకు సాగి ఈ రోజు ఇంగ్లీషు భాషలోనే ఒక అత్యుత్తమ నవలా రచయితగా ఎదిగానని గర్వంగా ప్రకటించి నన్ను కాస్త ఉపశమింపచేశాడు. అంతలో మా అమ్మ కూడా అక్కడికి చేరుకుంది.

దిక్కుమాలిన పరీక్షల కొలతలతో తన కొడుకులు గెలిచారా లేదా ఓడిపోయారా అనే రెండు మాటల జీవన గణితాన్ని లెక్కచూడని మనిషి మా అమ్మ. ఆవిడ రాగానే ముందుగా చేసిన పని ఒకటే. నా దయనీయ స్థితిని ఆస్వాదిస్తున్న తన మనవ సంతానాన్ని అక్కడినుండి తరిమేసింది. ఆ పై ఏమిట్రా నాయనా పరీక్షల్లో తప్పడం కూడా అంత దీర్ఘ శోకాలు తీయవలసిన విషయమారా బాబూ అని నన్ను దగ్గరకు లాక్కుని, ఓదార్చి, వెచ్చగా ఉన్న నా ఒంటి స్పర్శతో నాకు జ్వరంగా ఉందని గ్రహించి నాకు విశ్రాంతి అవసరమని, మిగతావారిని కూడా అక్కడి నుండి కదలమని చెప్పి నేను జ్వరం నుండి కోలుకోడానికి లోపల గదిలో నిదరపొమ్మని పంపింది.

ఆకస్మికంగా పరీక్ష తప్పడం, ఉన్మత్తత, కేకలు, ఏడుపులు, ఆవేశం వీటన్నిటికి ఒక్కసారిగా లోనయ్యి వచ్చిన జ్వరం అది. మెల్లమెల్లగా శరీర ఉష్ణోగ్రత పెరిగి, కొద్ది రోజులపాటు జ్వరం కొనసాగింది. జ్వరం తగ్గే వరకు నేను గోడ వైపు తిరిగి గాఢనిద్రలో ఉండిపోయేవాడిని. తరువాత జ్వరం తగ్గుముఖం పట్టాక కూడా నేను గోడవైపే తిరిగి ఉండేవాణ్ణి. కానీ నిజానికి ఆ సమయంలో నేను జ్వరం నుండి కోలుకున్న తర్వాత ఒక సినిమా తీద్దామని అనుకుంటున్నా. మంచం మీద ఉన్న ఆ కాలమంతా నేను చేయబోయే సినిమా గురించి ఆలోచిస్తూ ఉండేవాణ్ణి.

క్రమంగా నేను జ్వరం నుండి, ఆ క్రూరమైన పరీక్షా ఫలితం దెబ్బ నుండి కోలుకున్నాను. చదువుల్లో, పరీక్షల్లో తినే తాత్కాలిక దెబ్బల కన్నా ఇంకా ఘోరమైన కష్టాల గురించి ఆలోచించేవాడిని. అటువంటి వాటిని ఎదిరించి కూడా ముందుకు సాగిపోతున్న వ్యక్తుల విషాదాలను గుర్తుకు తెచ్చుకునేవాడిని… వరదల్లో, భూకంపాల్లో తమ సర్వస్వాన్ని కోల్పోయినవారు, ఊహించని విధంగా కుటుంబాల్లోని తమ అత్యంత ప్రియమైన వారి మరణాన్ని చవిచూసిన వారు, వారి మరణం వల్ల ఆ కుటుంబాలలో ఏర్పడిన అల్లకల్లోలాలను కూడా నేను గుర్తు చేసుకున్నాను. ఈ రకమైన సకారాత్మక ఆలోచనా ధోరణి వల్ల నాలో ఒకరకమైన తాత్వికత అలవడింది. పరీక్ష తప్పాను అనే ఈ ఆలోచనని ఒక పక్కకు నెట్టి రాబోయే భవిష్యత్తును ఎదుర్కోవటానికి నిర్మాణాత్మక, ఆచరణాత్మక మార్గాలేమిటని కొత్త దారుల వైపు ఆలోచించడం ప్రారంభించాను. అందులో భాగంగా నా మొదటి అడుగును నారాయణప్పతో ప్రారంభించాలని అనుకున్నాను. నారాయణప్ప కాలేజీలో బి.ఎ. చదువుతున్నాడు. బాగా తెలివైన విద్యార్థి. కన్నడ భాషలో అయితే అతను పండితుడు కూడా. ఆర్థికంగా బాగా పేదవాడు, అనాథ శరణాలయంలో ఉంటాడు. వారాలు చేసుకుని బ్రతికేవాడు. మేము కూడా నారాయణప్పకు వారంలో ఒక రోజు భోజనం ఇచ్చేవాళ్ళం. కాబట్టి నేను మళ్ళీ పరీక్షకు సిద్ధం కావడానికి వారానికి ఒకసారి నాకు కన్నడలో శిక్షణ ఇవ్వమని నారాయణప్పను అడగాలని నిర్ణయించుకున్నాను. ఇట్లా సమస్య మరియు దాని పరిష్కారం అనే మార్గాల వైపు నా బుర్ర ఆలోచించడం మొదలెట్టగానే నేను సమస్య అనుకున్నదసలు పెద్ద సమస్యే అనిపించలేదు నాకు.

మళ్ళీ ప్రపంచం మామూలుగా అనిపించడం మొదలెట్టింది. అన్నిటికన్నా గొప్ప హాయి నేను జ్వరం నుండి కోలుకునే సమయానికి మా ఇంట్లో ఉన్న బంధువులు అంతా దయతో వెళ్ళిపోయారు. నేను బ్రతికానురా దేవుడా అనుకున్నా. జ్వరం తగ్గి స్వస్థత చేకూరి ఇంటి నుండి బయటకు వెళ్ళగలిగిన కులాసా అందిన వెంటనే నేను చేసిన మొదటి పని హెచ్‌కెని కలుసుకోవడమే. కన్నడలో పరీక్షకు నారాయణప్ప సహాయం తీసుకోవాలనే ఆలోచన గురించి కూడా చెప్పాను. ఇది చాలా అద్భుతమైన ఆలోచన అని హెచ్‌కె నన్ను మెచ్చుకున్నాడు. ఒక రోజు నేను నారాయణప్పను వెళ్ళి కలిశాను. నా సమస్య చెప్పి నాకు కన్నడంలో శిక్షణ ఇవ్వమని అడిగాను. నాకు సాయం చేయడానికి అతను ఎంతగానో సంతోషించాడు. వారంలో ఒకరోజు మా ఇంటికి తను భోజనానికి వస్తాడు కదా, ఆ వచ్చేదేదో ఒక గంట ముందుగా వస్తానని, ఆ సమయంలో తను నాకు చదువు చెబుతానని చెప్పాడు. నేను అమ్మ వద్దకు పరిగెట్టుకు వెళ్ళి ఈ శుభవార్త చెప్పాను! ఆవిడా సంతోషపడింది. అయితే మరి నారాయణప్ప ట్యూషన్ ఫీజు మాట ఏమిటో కూడా ఆలోచించమంది.

నారాయణప్ప చాలా కుదురయిన మనిషి, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. ఆర్థికంగా పేదవాడు కావడం మూలానా అతనికి డబ్బు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆయన మాకు చేస్తున్న సాయానికి ఎంత విలువ లెక్కకట్టి ఇవ్వాలో గణించడం చాలా కష్టం అనిపించింది. ఇంత ఇద్దామా అని అనుకున్న ఏ మొత్తం కూడా అది తక్కువే అనిపించింది. ఏదో ఇచ్చాం అంటే ఇచ్చాం కానీ ఆ ధనరాశి ఆయన చేస్తున్న సాయానికి, అతని వ్యక్తిత్వానికి సరిపోయే విధంగా ఇచ్చామని నాకు అనిపించలేదు.

ఇదిలా ఉండగా అసలు కాలేజీ చదువు చదవడమనేదే నాకు సమయం వృథా తప్పా మరేం లేదు అని నాకు అకస్మాత్తుగా అనిపించింది! నేనొక కళాకారుడిని. నావంటి వాడికి చరిత్ర, ఆర్థిక శాస్త్రం లేదా రాజనీతి శాస్త్రం చదివి ఆ పట్టా పొందడం వల్ల ఏమిటి ఉపయోగం? నిజానికి నాకు కావలసిన చదువు ఏదయినా ప్రసిద్ధ చిత్రకళా విశ్వవిద్యాలయాల నుండి పుచ్చుకోవలసిన ఫైన్ ఆర్ట్స్‌ పట్టా కదా? అని ఆ వైపు ఆలోచించడం మొదలుపెట్టాను. నేను హెచ్‌కెతో నా ఈ మీమాంస గురించి చర్చించాను, అతను నాతో హృదయపూర్వకంగా ఏకీభవించాడు. అసలు నా వంటివాడు చదివితే గిదివితే బొంబాయిలోని ప్రసిద్ధ ‘సర్ జంషెడ్‌జీ జీజీభాయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌’లోనేనని, దానికి నన్ను దరఖాస్తు చేసుకోవాలని సూచించాడు. అసలు అది ఎంత గొప్ప విద్యాసంస్థ అనుకున్నావు? ప్రసిద్ద రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ వాళ్ళ తండ్రి జాన్ లాక్‌వుడ్ కిప్లింగ్ ఒకప్పుడు ఈ జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కు కొంతకాలం అధిపతిగా ఉన్నాడని చెప్పాడు. ఔరా! నాకు ఆశ ఇంకా పెరిగింది.

సరే! నేను ఇది అని అనుకోవడం దానికి వాడు తందానా అనడం, అదే గమ్యం ఇదే లక్ష్యం అని నిర్ణయించుకోవడం అంతా బావుంది. కానీ మా ఇంట్లో అందరూ ఉన్నత విద్యావంతులే. అటువంటి కుటుంబంలో ఒకడు హైస్కూల్ చదువుతో ఇక విద్యకు స్వస్తి పెట్టడం అనేదాన్ని ముఖ్యంగా మా అమ్మ అంగీకరిస్తుంది అని నేను అనుకోను. అందుకని నేను తీసుకోబోయే ఈ నిర్ణయాన్ని చాలా ఆచీ తూచీ సరైన ఎత్తులతో ఇంటివారిముందు ప్రవేశపెట్టాలని అనుకున్నా. ఆ ప్రకారం చాలా ఆలోచించిన మీదట మొదట నేను నా నిర్ణయం గురించి మాట్లాడాల్సినవారు మా పెద్దన్న నారాయణ్ అని నిర్ణయించుకున్నాను. విద్యకు సంబంధించినా విషయాలపై నారాయణ్ చాలా ఉదారవాద భావంతో ఉండేవాడు. అతను సంప్రదాయ విద్యా విధానాలను పట్టుకుని వేలాడే మనిషి కాడు. అయినా కాస్త జాగ్రత్తగానే నేను ఇలా బొంబాయిలో జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదువుకుందామని అనుకుంటున్నాను అనీ కోరిక వెళ్ళబుచ్చగానే, అతను దానిని చాలా మామూలు విషయం కింద తీసుకున్నాడు. అదేమంత పెద్ద పనిరా బాబూ, ప్రస్తుతం నా మిత్రుడొకడు బొంబాయికి వెళ్తున్నాడు, వాడికి చెబుతాను-నీకు అవసరమైన దరఖాస్తు కాగితాలు, ఆ బొమ్మల స్కూల్ తాలూకు విద్యా సమాచార పత్రాలు పంపమని, అన్నాడు. ఈ విషయం అమ్మకు తెలియగానే ఆవిడా అదేదో కొంపలు మునిగే వ్యవహారంలా తీసుకోక, “నువ్వు బొమ్మలు చాలా బాగా గీస్తావు కదరా, ఇప్పుడు దానికోసమని అక్కడికి ఎక్కడికో వెళ్ళి నీకు తెల్సిన విద్యనే మళ్ళీ నేర్చుకోవలసిన అవసరం ఏమిటి?” అని ఆశ్చర్యపోయింది. మా అమ్మ, అన్నల స్పందనకు నేనూ ఆశ్చర్యపోయాను.

ఎట్టకేలకు బొంబాయి నుండి జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వివరాలతో కూడిన అప్లికేషన్ ఫారమ్‌లు, కళాశాలలో నేర్పే విషయాల సాహిత్యం వచ్చినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. హెచ్‌కె, నేను కలిసి కూర్చుని ఆ పుస్తకంలో ఉన్న వివరాలని పదేపదే అధ్యయనం చేశాము. దరఖాస్తు కాగితంలో నా వివరాలు అన్నీ పూరించి దానితో పాటు ధరఖాస్తుదారుడు చిత్రించిన డజను నమూనా బొమ్మలని సమర్పించమని ఒక నిబంధన ఉంది.

హెచ్‌కె, నేనూ ఇద్దరమూ కూచుని నా అనేకానేక స్కెచ్ పుస్తకాల నుండి అసంఖ్యాకంగా నేను గీసిన బొమ్మలలో కొన్నిటిని ఎన్నుకుని దరఖాస్తు వెంట పంపడానికి ఆ బొమ్మలన్నింటిని ఒక సరైన పరిమాణానికి అనుగుణంగా మళ్ళీ గీశాను. ఆపై ఆ బొమ్మలని కార్డ్‌బోర్డ్ ప్యాకింగ్‌లో జాగ్రత్తగా ప్యాక్ చేసి, జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ శాఖాధిపతి పేరిట పంపించాను.

అదిగో అలా నా ధరఖాస్తు పంపిన ఆ క్షణం నుండి నేను సమాధానం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాను. వారం గడిచిపోయింది. ఇక లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టాను. నేను పంపిన ప్యాకెట్ మైసూరు నుండి బొంబాయి చేరుకోవడానికి రెండు రోజులు పడుతుంది. కాలేజీ పెద్ద నా దరఖాస్తును చూసి, బొమ్మల తనిఖీ కార్యక్రమం ముగించి తిరుగు జవాబు పంపడానికి ఒక రోజు, ఆ పై ఆ సమాధానపు తిరుగు ప్రయాణానికి మరో రెండు రోజులు ఆ విధంగా మొత్తం ఐదు రోజులు దానికి సరిపోతాయి. అయినా పోనీలే తపాలా శాఖవారి ఆలస్యం అందరికీ తెలిసినదే కాబట్టి వారికీ ఒక రోజు ధారపోసినా ఇప్పటికే ఏడు రోజులయిందే. ఇదెక్కడి అన్యాయం!

నేను ప్రతిరోజూ వీధి మూలలోని చెట్టు కింద నిలబడి, రోడ్డు చివర చిన్న చుక్కలా కనపడే పోస్ట్‌మ్యాన్ ఎవరైనా నా దాకా వచ్చి శుభవార్త అందించే రోజు కోసం ఎదురుచూస్తూ ఉండేవాణ్ణి.

రెండు వారాలు గడిచాయి, ఇప్పటికీ బొంబాయి నుండి ఎటువంటి సమాధానం లేదు. తపాలా అలసత్వం, నిర్లక్ష్యం, లేదా సదరు బొమ్మల కాలేజీ అప్లికేషన్ ప్రాసెసింగ్ మరియు డిస్పాచ్ విభాగంలో జాప్యాల గురించి ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తులు నా అప్లికేషన్‌కు రావలసిన సమాధానికి గాక ఆలస్యానికి కారణాలను కథలు కథలుగా నాకు చెబుతున్నారు. ‘ఒకసారి ఏమయిందంటే నేను రేషన్ కార్డ్‌కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నప్పుడు…’ దగ్గరినుండి, ‘మా తమ్ముడికి రావలసిన ప్రభుత్వ గృహ కేటాయింపు దగ్గర జరిగిన ఆలస్యం గురించి ఏం చెప్పమంటావులే లక్ష్మణా’… మొదలైన వారి స్వంత అనుభవాలను జనం నాకు వివరించేవారు. నా శ్రేయస్సు కోరే ఒక ముసలాయన అయితే, నా స్వంత కేసుకు ఎటువంటి సంబంధం లేని ఆయన కథని అతను పబ్లిక్ రోడ్డు యొక్క వీధిని మరమ్మతు చేయడానికి కోట్ చేసిన టెండర్‌ను అంగీకరించడానికి నగర కార్పొరేషన్‌ను ఒప్పించడంలో అతను పడిన ఇబ్బందులను వివరించాడు. రోజూ ఇంతని దశలవారీగా కథలు చెప్పడం మొదలుపెట్టాడు.

నాకు మెల్లమెల్లగా ఓపిక నశించడం మొదలైంది. నా మనసులోనే నేను జె. జె. స్కూల్ వారికి బూతులు తిడుతూ, శాపనార్థాలు పెడుతూ అసంఖ్యాక ఉత్తరాలు వ్రాస్తూ మానసికంగా సంతృప్తి పడుతున్నాను. అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉండేది, బొంబాయెళ్ళాలి బొంబాయెళ్ళాలి అని ఉబలాటం సరే! అసలు అక్కడకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? ఏం తినాలి? అసలేమిటి నా ధైర్యం? మనకు తెలిసిన బొంబాయి ఏమిటి? పాఠశాలలో భౌగోళిక శాస్త్రం మరియు చరిత్రలో దాని గురించి చదువుకున్న, నేర్చుకున్న పాఠం మాత్రమే. అదీకాక నా ఈడు కుర్రాళ్ళకు తెలిసినది ఏమిటంటే బొంబాయిలో రెడ్-లైట్ డిస్ట్రిక్ట్ అని పిలవబడే ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ ఆడపిల్లలను వీధుల్లో ఉన్న బోనులలో ఉంచుతారని, భోగలాలసులైన మగవాళ్ళు వచ్చి వారిని ఎంపిక చేసుకుని గడుపుతారని విన్నాం.

అప్పుడప్పుడూ నా ఆలోచనలు నారాయణప్ప వైపు మళ్ళేవి. తను నాకు కన్నడ నేర్పించడానికి సాయం చేస్తాననడం, నేను ఇప్పుడు ఆ బొమ్మల బడిని నమ్ముకుని ఆయన చేస్తానన్న సహాయం తప్పించుకొని తిరగడం. కనపడ్డపుడల్లా నారాయణప్ప “మనం పాఠాలు ఎప్పుడు ప్రారంభించాలి?” అని అడగటం మొదలుపెట్టాడు. నేను మళ్ళీ పరీక్షకు సిద్ధపడడాన్ని ఇలా ఎక్కువకాలం వాయిదా వేయడానికి కుదరనందున, నేను నారాయణప్పకి అప్పటికప్పుడు నోటికి వచ్చిన ఒక తేదీని ఇచ్చాను. ఆ తేదీ వచ్చే నాటికి నా భవిష్యత్తు దిశానిర్దేశనమైన జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ గురించి సమాచారం అందుతుందిలే అని ఆశించాను.

రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇక మిగలడానికి ఏ ఆశ లేదు అని అనుకుంటున్న సమయానా జె. జె. స్కూల్ నుండి ఒక ప్యాకెట్ వచ్చింది. అందులో ఒక ఆంగ్లేయుడి సంతకం ఉన్న ఉత్తరంతో పాటూ నేను నా ప్రతిభ చూపిస్తూ పంపిన బొమ్మలు ఉన్నాయి. ఆ ఉత్తరంలో “ప్రియమైన అభ్యర్థి, ఒక చిత్రకళా విద్యార్థిగా మా విద్యాసంస్థలో చేరేందుకు తగిన ప్రతిభ మీ వద్ద ఉన్నట్టు మాకు అనిపించలేదు. కాబట్టి మీరు మీ యొక్క ప్రాంతంలోనే ఉన్న సంప్రదాయ విద్యావిషయాల పైనే అధ్యయనాలను మరింత కొనసాగించమని నేను మీకు హృదయపూర్వకంగా సలహా ఇస్తున్నాను.”

ఈ అమూల్యమైన సలహా బహుశా నేను జె. జె. వారికి దరఖాస్తు పెట్టేటప్పుడు రాసిన లేఖలో “అయ్యా, ప్రతిష్టాత్మకమైన జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుండి డిప్లొమా-హోల్డర్‌గా మారడానికి నేను ఇక్కడ నా కళాశాల చదువుని త్యాగం చేస్తున్నాను. కావున…” అని నేను నొక్కి వ్రాశాను. వారు నాకు చెబుతున్నది ఏమిటంటే, మీరు చిత్రకళలో అంతగా ప్రావీణ్యం చూపగలరని మాకు నమ్మకం లేదు కాబట్టి మీరు యథాతథంగా మీ చరిత్ర, ఆర్థిక శాస్త్రం లేదా రాజనీతి శాస్త్రంలో చదివి భవిష్యత్తును నిర్మించుకోగలరు, అని సలహా ఇచ్చారు.

జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుండి వచ్చిన లేఖలోని అవమానాన్ని మా ఇంట్లో పెద్దలకు చెప్పాల్సిన అవసరం లేదని నేను భావించాను. వారికసలు నేను జె. జె. ఆర్ట్ స్కూల్‌లో చేరుతానని అన్న మాట కూడా గుర్తు ఉండి ఉండదు. ఎవరికి వారి రోజువారీ పనుల్లో ఇల్లంతా మునిగిపోయి ఉంది. నాకు కూడా నన్ను నేను ఏమంతగా సంస్కరించుకోవడానికి బొంబాయికి పోవడం? వెళ్ళి అక్కడ ఎలా బ్రతకాలి, ఏం తినాలి? ఎక్కడ ఉండాలి? వంటి కొత్త ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవలసిన అవసరం లేదు, ఉన్నవాడిని ఇక్కడే బావున్నాను. ఇక్కడే ఉంటాను- అని ఊపిరి పీల్చుకున్నాను. నేనిక కొత్త కలలు కనడం మానేసి కన్నడ పరీక్షకు సిద్ధమయ్యాను. ఆపై అనాయాసంగా నేను హైస్కూల్ పరీక్షలో పట్టభద్రుడయ్యాను. అందుకు నారాయణప్పకు ఎంతో ధన్యవాదాలు.

కాలం గడిచి వృత్తిరీత్యా చాలా సంవత్సరాలు నేను బొంబాయికి వచ్చేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా చేరాను. తమాషా ఏమిటంటే మా వార్తాపత్రిక కార్యాలయం, జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ దాదాపు పక్కపక్కనే ఉన్నాయి, ఆ కాలేజీని రోజూ నా కిటికీలో నుండి చూస్తూ ఉండేవాణ్ణి… టైమ్స్ ఆఫ్ ఇండియాలో నా కార్టూన్‌లు ప్రతి రోజూ మొదటి పేజీలో కనిపించసాగాయి, జనానికి నా కార్టూన్లు చూడటం రోజువారీ దినచర్యగా మారింది. ఆనాటి రాజకీయ సంఘటనలపై నా వ్యంగ్య వ్యాఖ్యలను, చురకలను ప్రజలు ఆస్వాదించడం ప్రారంభించారు.

అన్నిరోజుల్లాగే ఒక రోజు నేను నా రోజువారి కార్టూన్ పనికి సిద్ధమవుతున్న సమయంలో ఒక ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తను ప్రఖ్యాత జె. జె. కాలేజీ ప్రధానాధిపతిగా పరిచయం చేయసుకుంటూ నన్ను ఒకసారి కలవాలనే కోరిక వెళ్ళబుచ్చి అందుకు కాస్త సమయం ఇవ్వమని కోరారు. నేను ఆయనకు ఫలానా తేదీన ఫలానా సమయానికి కలుద్దాం అన్నాను. అనుకున్నరోజున అనుకున్న సమయానికే అతను, అతని సహోద్యోగి ఒకరు నా గదికి వచ్చారు. వారిద్దరూ కలిసి నా డ్రాయింగ్ నైపుణ్యాన్ని, కార్టూన్లను విపరీతంగా మెచ్చుకున్నారు. ఆ సంవత్సరం వారి కాలేజీ విద్యార్థుల వార్షిక పెయింటింగ్‌ ప్రదర్శనలో విజేతలకు బహుమతులు పంపిణీ చేయడానికి నాకంటే గొప్ప వ్యక్తి మరిక లేరని, అందువలన వారి యందు దయవుంచి నన్ను ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని కోరారు.

నేను వారి ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించాను. బహుమతి ప్రధానం రోజున ఫైన్ ఆర్ట్ కాలేజీ ప్రధానాధిపతి నన్ను అధికారికంగా ఆడిటోరియంలోకి తీసుకెళ్ళడానికి వచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో హాలు కిక్కిరిసిపోయింది. బహుమతి పొందిన పెయింటింగ్‌లను చూడ్డానికి వెళ్ళిన నన్ను వారంతా ఆనందాతిరేకాలతో చుట్టుముట్టారు. ఆ బొమ్మలు వేసిన పిల్లలను నేను సంతోషంగా మెచ్చుకున్నాను. తర్వాత మేమంతా వేదికపైకి ఎక్కాము. ముఖ్య అతిథిగా నేను మధ్యలో కూర్చున్నాను. మిగతా అధ్యాపకులు నాకు ఇరువైపులా కూచున్నారు.

కాలేజీ ప్రధాని ఒక వ్యంగ్య చిత్రకారుడిగా నాకు, నా పనితనానికి ఘనమైన జోహార్లు అర్పించారు. నా బొమ్మలలోని నాణ్యత, నా కార్టూన్‌లలోని అద్భుతమైన కుంచె విరుపులు, నా వ్యంగ్య చిత్రాలకున్న శక్తిసామర్థ్యాలని ఎంతగానో ప్రశంసించారు.

నాకు ఆ సందర్భమంతా చాలా హాస్యాస్పదంగా ఉంది. వారి పొగడ్తలు వింటున్నకొద్ది నాకు విపరీతంగా నవ్వు వస్తోంది. ప్రస్తుత పరిస్థితిని, సంవత్సరాల క్రిందట నేను ఇదే కళాశాల వారినుండి అందుకున్న లేఖలోని వాక్యాలని గుర్తుకు తెచ్చుకుని పోల్చుకున్న కొద్దీ నా నవ్వును ఎంత ఆపుకోవాలనుకున్నా చేతకానంతగా నవ్వు ఉబికి ఉబికి వస్తూంది. తన ప్రసంగం తర్వాత కళాశాల అధిపతి పోటీలలో గెలుపు పొందిన విద్యార్థులకు బహుమతులు, కప్పులు, పతకాలు, సర్టిఫికేట్‌లను పంపిణీ చేయమని నన్ను అభ్యర్థించారు. నేను ప్రతి గ్రహీతకు చిరునవ్వుతో వారి బహుమతిని వారికి అందచేస్తూ వారు భవిష్యత్తులో మరింతగా ఎదిగేలా ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాను. బహుమతులు పంచడం అయ్యాక నేను వెనక్కి తిరిగి నా కుర్చీలో తిరిగి కూర్చోబోతున్నప్పుడు అందరూ సామూహికంగా అరవడం మొదలుపెట్టారు: “ఆర్కే లక్ష్మణ్ ప్రసంగించాలి, ఆర్కే లక్ష్మణ్ ప్రసంగించాలి!”

నేను మైక్ తీసుకుని క్లుప్తంగా మాట్లాడాను. సంవత్సరాల కిందటనుండి అణిగి ఉండిన వెటకారంతో మాట్లాడాను. ఇది కాదు మాట్లాడే పద్దతి, కానీ ఆ సమయంలో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. నా ఉపన్యాసం అక్కడి ప్రధానాధిపతికి ఇంకా ఉప శాఖాధిపతులకు, అక్కడి అధ్యాపకులకు చాలా ఇబ్బంది కలిగించింది.

“నా ప్రియమైన విద్యార్థుల్లారా, నేను మీరు చదువుతున్న ఈ కళాశాలకు, చాలా ఏళ్ళ క్రితం ఈ కళాశాలకు ముఖ్య అధిపతిగా ఉన్నవారికి ఎంతగానో ఋణపడి ఉన్నాను. నేను మీలానే చిన్న కుర్రవాడిగా ఉన్న రోజుల్లో బొమ్మలు నేర్చుకుందామనే ఆశతో, ఆశయంతో ఇక్కడ దరఖాస్తు చేసుకున్నాను. అయితే నా దరఖాస్తు తిరస్కరించడింది. నా బొమ్మల ప్రమాణాలు ఏమాత్రం నేను ఒక చిత్రకారుడిగా తయారయ్యేందుకు తగినట్లు లేవని తెలపబడింది. ‘నీరు వోసిన చెట్టు నిర్మూలం, పెంట మీద చెట్టు ప్రబలం’ అనే ఒక మాట ఉన్నది, ఆ రకంగానే నా బొమ్మల సాధన సాగింది. నిజానికి ఆనాడు నా దరఖాస్తు అంగీకరింపబడి నాకు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఇచ్చి ఉంటే, నేను ఈ కళాశాల నుండి డిప్లొమా ఒకటి పొంది ఉంటే ఏమి జరిగి ఉండేదో ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడు ఇక్కడ ఆర్కే లక్ష్మణ్ అనే ఒక కార్టూనిస్ట్ ఉండేవాడు కాదు. చాలామంది చదువుకున్న చిత్రకారులకు మల్లే ఈ మనిషి కూడా దేశమంతా పేరుకుపోయి ఉన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీల్లో ఏదో ఒక దానిలో ఒక మూలలో కుర్చీ వేసుకుని, దోమల నివారణల కోసం పొగచుట్టల బొమ్మ గీస్తూనో లేదా ఆడవాళ్ళ పెదాల మీద మిలమిల లాడే ఎరుపు రంగు లిప్‌స్టిక్ వ్యాపార ప్రకటన తయారుచేస్తూనో, ఆదీనూ కాకపోతే బొద్దుగా ఉన్న పిల్లల కోసం గ్రైప్ వాటర్ సీసా బొమ్మనో లేదా బహుశా ‘కరకరలాడే కమ్మని వీటా బిస్కెట్లు కొరకండి, నవలండి, మింగండి’ అనే వాక్యాలు వ్రాస్తూనో ఉండేవాణ్ణి. ఈరోజు ఈ దేశంలో ఒకే ఒక ఆర్కే లక్ష్మణ్‌ని తయారుచేసినందుకు సర్ జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కు ధన్యవాదాలు. మీకందరికి శుభాకాంక్షలు.”

(సశేషం)


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...