ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 13

ఇక్కడ ఫ్రీ ప్రెస్ జర్నల్‌లో కార్టూనిస్ట్‌గా ఉన్నది నేనొక్కడినే కాదు. మరో కార్టూనిస్ట్ కూడా అక్కడ తన బొమ్మలతో, తన సృజనాత్మకతో, తన కార్టూన్ల వెటకారపు చావు దెబ్బలతో రాజకీయ నాయకులని హేళన చేస్తూ ఉన్నాడు. అతను మీకు బాగా తెలిసినవాడే! అతని పేరు చెప్పేయంగానే అతడిని మీరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. అయితే ఒక కార్టూనిస్ట్‌గా కాదు, ఒక గొప్ప రాజకీయనాయకుడిగా. మహారాష్ట్ర, దాని ప్రాచీన వైభవం, మరాఠా ప్రజలు, వారి భాష, సంస్కృతిని కాపాడాలనే గొప్ప సంకల్పంతో కార్టూన్ కళ నుండి బయటకు వచ్చి భారతదేశ రాజకీయాలలో బలమైన శక్తిగా ఎదిగిన ఆ వ్యక్తి పేరు బాల్ కేశవ్ థాకరే. అప్పట్లో మేము పనిచేసే ఆ పత్రికలో ఒక ఎడిటర్‌కు తప్పించి మరెవరికి స్వంత కాబిన్ అంటూ ఉండేది కాదు. థాకరే వరండా దగ్గర బాగా వెలుతురు వచ్చే చోట కూచుని బొమ్మలు వేసుకునేవాడు. ఒక చేతిలో సిగార్, మరో చేతిలో కుంచె. తలమీద నిత్యం ఒక పొగల మేఘం. ఎప్పుడు చూసినా తదేక దీక్షతో బొమ్మలు వేస్తూనే కనపడేవాడు. ఎవరు వెళ్ళి ఏ సమయంలో పలకరించినా, పనికి అంతరాయం కలిగించినా విసుగు, కోపం, చిరాకు ఉండేవి కావు. నవ్వుతూ మాట్లాడేవాడు. పత్రికలో పనిచేసే సిబ్బంది అందరితో స్నేహంగా ఉండేవాడు. ఎవరు తన బొమ్మ గీసి ఇవ్వమన్నా ఉచితంగానే గీసి ఇచ్చేవాడు. తను పత్రికలో పనిచేసే కాలంలో తన బొమ్మని థాకరేతో వేయించుకోనివారు లేరంటే అతియోశక్తి కాదు. నేనూ థాకరే 1945 నుండి 1950 వరకు కలిసి పనిచేశాం. తను కార్టూన్ చిత్రకళలో చివరిదాకా ఉండకపోయినప్పటికీ థాకరే చాలా సమర్థవంతమైన, ప్రతిభావంతమైన కార్టూనిస్ట్. కానీ తన లక్ష్యం, తన ప్రాధాన్యతలు వేరు. వాటిని అనుసరించి, రాజకీయాలలో అడుగు పెట్టి తన స్వంత పార్టీకి అధిపతిగా మారాడు.

ఒకరోజు హఠాత్తుగా మా ఆఫీసులో నా చిన్ననాటి స్నేహితుడు హెచ్‍కే కనిపించాడు. మేము చిన్నతనం నుండి కలిసి బడికి వెళ్ళడం దగ్గర మొదలుపెట్టి చివరగా కాలేజీ చదువుల వరకు డిగ్రీలు పుచ్చుకున్న సంగతంతా మీకు తెలుసుగా. మా సైకిల్ తిరుగుళ్ళు, మా రఫ్ అండ్ టఫ్ అండ్ జాలీ క్రికెట్ టీమ్‌కు మేమిద్దరం కెప్టెన్, వైస్ కెప్టెన్ బాధ్యతలు వెలగపెట్టడం, కృష్ణా పుస్తకాల షాపులో మా పుస్తక అభిరుచి, స్వాత్రంత్ర పోరాట కాలంలో హెచ్‍కె కొంత కాలం జైలులో గడపడం. హెచ్‍కే మైసూరులో బ్యాచిలర్ డిగ్రీని పుచ్చుకున్న తరువాత ఆర్థికశాస్త్రంలో పెద్ద చదువులు చదవడానికి మద్రాసు వెళ్ళాడు. నేను ఇక్కడ మైసూర్ కాలేజిలో డిగ్రీ పరీక్షలు రాసీ రాయంగానే బొమ్మలో, కార్టూన్లో అనుకుంటూ మద్రాసు, ఢిల్లి, ఆపైన బొంబాయిలు తిరిగిన ప్రహసనమంతా మీకు తెలిసిందే. నేను అక్కడ మైసూర్‌లో కాలేజి వదిలిన తరువాత ఇంతవరకు కూడా ఆ కాలేజీ నుండి పట్టభద్రుడిని అయ్యాననే రుజువుగల కాగితంముక్క తెచ్చి దాచిపెట్టుకున్న పాపాన పోలేదు. ఇపుడు మీరు నేను చదువుకున్న కాలేజీకి వెళ్ళి అక్కడ రిజిస్టార్ ఆఫీస్‌లోని చరిత్ర పుటల దుమ్ము దులిపి వెదికితే నా డిగ్రీ కాగితం దొరకవచ్చు.

ఏ మాత్రం ఊహకు అందకుండా ఇక్కడ బొంబాయిలో హెచ్‍కేని చూడటమనేది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నా ముందు నిలబడి ఉన్న అతడిని చూస్తుంటే అతను నాకు తెలిసిన నా చిన్ననాటి సాదాసీదా మిత్రుడు హెచ్‍కేలా లేడు. సూటు బూటు ధరించి పెదాల చివరనుండి పొడగాటి సిగరెట్‌ని బిగించి, అది కిందపడకుండా దానిని అలానే ఆపి గలగలా కబుర్లు చెబుతూ సంపన్నంగా బహు ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. ఒక చేతిలో తోలు భ్రీఫ్‌కేస్ మరో చేతిలో ఖరీదైన సిగరెట్ టిన్, లైటర్. వాడిలో కొట్టొచ్చినట్లు కనపడుతున్న ఖరీదయిన మార్పు ఉంటేనేం, ఇన్ని సంవత్సరాల తర్వాత వాడిని చూస్తూంటే నాకు కలిగిన ఆనందం వర్ణనాతీతం. ఈ రోజుకు నా ఆఫీసు పనులన్నీ గబగబా వదిలేసి, సెలవు పెట్టేసి వాడితో కలిసి రెస్టారెంట్‌కి వెళ్ళాను. తర్వాత సినిమా చూసి, రాత్రి భోజనం కలిసే ముగించాము. ఈ రోజంతా మేము మా పాత స్నేహితుల గురించి, మా చిన్నప్పటి కబుర్లు గురించి బోలెడు మాట్లాడుకున్నాము. మైసూరు వదిలిపెట్టి వచ్చిన ఇన్ని సంవత్సరాలుగా మా జీవితంలో సంభవించిన వివిధ అనుభవాల గురించి కబుర్లు పెట్టుకున్నాము. హెచ్‍కే ప్రస్తుతం స్టాక్ ఎక్స్ఛేంజ్‌ వ్యవహారాల్లో ఉన్నాట్ట. కొనుగోలు, అమ్మకం ఇంకా బిడ్డింగ్‌ల్లో చాలా డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పాడు.

నేను ఇక్కడ బొంబాయిలో మెరైన్ డ్రైవ్‌లో ఉన్న ఒక ఐదు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక గదిలో ఉంటున్నాను. హెచ్‍కే జుహూలోని ఓ హోటల్‌లో ఉంటున్నాట్ట. వాడు వారాంతాల్లో అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాడు. వాడు వచ్చినప్పుడల్లా ఇద్దరం జీవితాన్ని సందడిగా గడిపేవాళ్ళము. ఇద్దరం కలిసి బొంబాయిలో మైసూరులో లాగా అడుగుల నడకలు నడిచేవాళ్ళం.

జూన్ నెలలో బొంబాయి మహానగరంలో మేఘాలు కమ్ముకుని భారీ వర్షాలు కురవసాగాయి. ఇట్లాంటి రోజుల్లో ఇల్లు, ఆఫీసు తప్పా మరెక్కడా సంచారం చేయడానికి కుదిరేలా పరిస్థితి లేదు. ఈ వర్షాల వల్ల తాత్కలికంగా మా ఇద్దరి మధ్య కలవడాలు, తిరగడాలు తగ్గాయి. కానీ ఒక వర్షపు రాత్రి నేను తలుపులు, కిటికీలు గట్టిగా బిగించి నిద్రపోతూ ఉన్నాను. గాఢ నిద్రలో మసకబారిన నిద్రావస్థలో, ఎవరో నా కనురెప్పలపై దబాదబా బాదుతూ ‘ఆర్కే!ఆర్కే! ఒరే ఆర్కే!’ అంటూ పిలుస్తున్నారు. గబుక్కున లేచి చూతునా! బాదుతున్నది నా కనురెప్పలను కాదు, గది తలుపులను. ఆదర బాదరగా మంచం దిగి తలుపు తీసి చూస్తే బయట నిలువెల్లా తడిసిముద్దయి ఉన్న హెచ్‍కే. వాడిని నా గదిలోకి తీసుకెళ్ళి తను మార్చుకోవడానికి నా పొడి బట్టలు ఇచ్చి, వాడి తడి బట్టలు ఆరబెట్టాను. వాడిని చూస్తే వాలకం ఏమీ బాగా లేదు. దిగాలుగా, ఢీలాగా దివాలా తీసినవాడిలాగా ఉన్నాడు. వాడిని నా మంచం మీద పడుకోపెట్టి, ఆ రాత్రంతా నేను మంచం పక్కనే ఉన్న కుర్చీలో నడుం వాల్చాను. వాడు రాత్రంతా ఏదో కలవరిస్తూనే ఉన్నాడు. వాటి మాటల అర్థాన్ని బట్టి చూస్తే హెచ్‍కె తన డబ్బంతా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో పోగొట్టుకున్నాడని, వాడు నమ్ముకున్న ఒక ఏజెంట్ వీడిని నిండా ముంచాడని అర్థం అయింది. అలా కలవరిస్తూనే వాడు రాత్రి ఎప్పుడు నిద్రపోయాడో వాడి కలవరింతలు వింటూ నేను ఎప్పుడు నిద్రపోయానో నాకూ తెలీదు. ఉదయాన్నే నేను నా ఆఫీస్‌కి వెళ్ళి ఢిల్లీలో ఉన్న హెచ్‍కే అన్నయ్యకి ఫోన్ చేసి వాడి పరిస్థితిని అంతా వివరించాను. సాయంత్రం నేను ఆఫీసు నుండి వచ్చే సమయానికి హెచ్‍కే నా గదిలో లేడు, జుహులోని తన గదికి వెళ్ళిపోయాడు.

ఒకటీ రెండు రోజుల తరువాత నేను వాడిని వెదుక్కుంటూ జుహూ వెళ్ళాను. వాడు ఉంటున్న ఆ చీకటి గది చాలా ఇరుగ్గా, మురిగ్గా ఉంది. ఆ చీకటి గదిలో అస్థవ్యస్థంగా ఉన్న ఒక మంచం. కుదురుగా లేని సామానులు, చెల్లాచెదురుగా గది అంతా విసిరేసి ఉన్న బట్టలు. పరమ ఘోరంగా ఉంది అక్కడి వాతావరణం. వాడిని చూస్తుంటే వాడు చాలా కాలం నుండి కనీసం ఒక మంచి భోజనం చేసినట్లుగా కూడా లేదు. నన్ను చూడగానే హెచ్‍కే ఏదో అసంబద్ధంగా వాగడం మొదలెట్టాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండుండి ఏడుస్తాడు, తరువాత పకపకా నవ్వుతాడు. ఏమిటో! నాకు వాడిని చూస్తుంటే ఏమీ బాగాలేదు, భయంగా దిగులుగా అనిపించింది. మొత్తానికి హెచ్‍కే వాళ్ళ అన్నయ్య ఢిల్లీ నుండి బయలుదేరి వచ్చి ఫ్రీ ప్రెస్ జర్నల్‌లో నన్ను కలిశాడు. నేను ఆయన్ని జుహులోని హెచ్‍కే గది దగ్గరకు తీసుకెళ్ళాను. తరువాత వారిరువురికీ నేనే బెంగుళూరుకు రైలు టికెట్లను ఏర్పాటు చేసి స్టేషన్‌దాకా వచ్చి వారిని బొంబాయి నుండి సాగనంపాను. హెచ్‍కే మానసిక స్థితి బాగా దిగజారడంతో వాడిని బెంగుళూరులోని ఒక మానసిక చికిత్సా కేంద్రంలో చేర్పించారు. వాడి స్థితి అక్కడా ఏం మెరుగు పడలేదు. చికిత్స పొందుతూ పొందుతూ వాడక్కడే చనిపోయాడు.

నేను పనిచేసే ఫ్రీ ప్రెస్ జర్నల్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ పత్రిక యజమాని చాలా బలమైన జాతీయవాది, విధేయుడైన గాంధేయవాది, ఇంకా తన మతం పట్ల, పాటించవలసిన ఆచారాల పట్ల ఎంతో శ్రద్ద ఉన్న మనిషి. ఒకసారి అతను అమెరికాకు వెళ్ళినపుడు ఆ మరుసటి రోజే ఇక్కడ తన ఇంట్లో పూజలో పాల్గొనవలసిన అవసరం ఏర్పడింది, ఆ పూజలో పాల్గోనవలసిన ఆ కొంత సమయం కోసం అమెరికా నుండి విమానంలో వెనక్కి వచ్చి పూజ ముగించి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడు. పంతొమ్మిదివందల నలభైల్లోనే ఖరీదైన గగనతల రవాణా వ్యవస్థని అలా మతాచారాల పట్ల ఉన్న నమ్మకం కోసం ఒకరోజులోనే అటు అమెరికా నుండి ఇటు ఇండియా, మళ్ళీ ఇక్కడి నుండి అమెరికా ప్రయాణించిన మనిషికి సంప్రదాయాల పట్ల ఉన్న విశ్వాసాన్ని చూస్తే ఆశ్చర్యం వేయదూ! మామూలు భక్తి, నమ్మకం, శ్రద్ద, విశ్వాసాల కన్నా మించిపోయి ఉన్నాయి అతనికి, భగవంతుడికి ఉన్న సంబంధ బాంధవ్యాలు. ఒకరోజు అతని వ్యక్తిగత కార్యదర్శి నాకు రహస్యంగా మా యజమానికి సంబంధించిన కొన్ని ఫోటోగ్రాఫ్‌ల ఆల్బమ్‌ని చూపించాడు. అవన్నీ ట్రిక్ ఫోటోగ్రఫి సాయంతో కల్పించిన ఛాయాచిత్రాలు. ఒకదానిలో అయ్యగారు భూగోళం అంచున నిలబడి ఆకాశం వైపు చూస్తూ చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉంటారు, పైనుండి రెండు అరచేతులు ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉంటాయి. ఆ చేతుల నుండి కొన్ని దివ్యకాంతులు వెలువడి మా యజమానిని తాకి ఆయనని తేజోవంతుడిగా మారుస్తూ ఉన్నాయి. అన్నీ దాదాపు ఇటువంటి ‘తయారు చేయబడ్డ’ ఫోటోలే. ఒక్కో చోట ఒక్కో రకంగా వివిధ దేవతలు ఈయనను దీవిస్తున్నట్లుగా భంగిమలే. దేవదేవతలు ఆయనకు సంపద ఐశ్వర్యాలు, హోదా పదవులు ఇచ్చారు కానీ ఎప్పుడూ ఆయన ముక్కు మీద ఉండే అకారణ కోపాన్ని తొలగించలేకపోయారు. ఆయన తన దగ్గర పనిచేసే కార్యాలయ సిబ్బందిని నిత్యకృతంగా ఉద్యోగాల నుండి తొలగించేవాడు. ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఏ క్షణాన ఎందుకు ఊడుతుందో ఎవరూ ఊహించలేకపోయేవారు. ఈయనకు ఒక వ్యక్తిగత జ్యోతిష్యుడు కూడా ఉండేవాడు. ఆయన తరుచుగా అఫీసుకు వచ్చి యజమానిని కలిసేవాడు. ఆయన వచ్చినపుడల్లా కార్యలయంలో ఎవడో ఒకడి ఉద్యోగానికి మూడేది.

ఒకసారి మా యజమాని మాతో పాటు పనిచేసే ఒక యువ పాత్రికేయుడ్ని లెబనాన్ రాజధాని బీరుట్‌కు ప్రత్యేక అంతర్జాతీయ వార్తల బ్యూరోను ప్రారంభించడానికి పంపాడు. యువకుడు అత్యుత్సాహంతో తన వస్తువులన్నీ సర్దుకుని బయలుదేరాడు. అతను అలా బయలుదేరగానే ఇక్కడ యజమానిగారి దగ్గరికి ఆయన ఆస్థాన జ్యోతిష్యుడు వచ్చి కూర్చున్నాడు. అక్కడ మా రిపొర్టర్ తన గమ్యస్థానం బీరుట్ చేరుకోగానే అక్కడ అతను తన ఉద్యోగం నుండి తొలగించబడ్డాడని తెలియజేసే ఉత్తరం వచ్చి చేరింది. ఉత్తరం చేరింది కానీ తిరుగు ప్రయాణానికి వీరు అతనికి పైసా పంపింది లేదు. అతనే అక్కడ నానా తంటాలుపడి తిరుగుప్రయాణానికి ఏదో విధంగా పైకం ఏర్పాటు చేసుకుని బొంబాయి నుండి తెచ్చుకున్న సామానులను కనీసం విప్పనవసరం కూడా లేకుండా మళ్ళీ బొంబాయి చేరాడు. చాలా నెలల వరకు అతను ఫ్రీ ప్రెస్ జర్నల్ ఆఫీసులో మాసిన గడ్డం మొహంతో తన ఉద్యోగం తిరిగి పొందడం కోసమని దేబిరిస్తూ తిరిగేవాడు. యజమాని, ఆయన ఆస్థాన జ్యోతిష్యుడి దయవల్ల ఫ్రీ ప్రెస్ జర్నల్ ఆఫీస్‌లో పనిచేసే సిబ్బంది క్రమంగా చాలా కొద్దిమంది మాత్రమే మిగిలారు. అందులో కూడా కొంతమంది యజమాని చూపో జ్యోతిష్యుడి దృష్టో వారి మీద సోకక ముందే తమకు తాముగా రాజీనామా చేసేవారు. ఆ వరుసలో నేను కూడా ఎన్నో కలలు కని సంపాదించుకున్న కార్టూనిస్ట్ ఉద్యోగమిచ్చిన ఫ్రీ ప్రెస్‌ని విడిచిపెట్టే రోజు రావడానికి నాకూ ఎక్కువ సమయం పట్టలేదు.

అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...