ఒక విత్తనం నాటితే మొలక వస్తుంది. అది మెల్లగా మొక్క అవుతుంది. మొక్క నెమ్మదిగా చెట్టవుతుంది. ఆ చెట్టు నిదానంగా మహావృక్షం అవుతుంది. అలాంటి మహావృక్షాలు అనేకం ఏకమైతే అడవి అవుతుంది. ఆ అడవి అలాగే ఎదిగితే చిట్టడవి అవుతుంది. విస్తరిస్తే కారడవి అవుతుంది. ఇంకా విస్తృతి పెరిగి మహారణ్యం ఆవిష్కృతమవుతుంది.
ఆ మహారణ్యం ఊడలు సాచి భూదేవికి మోకరిల్లుతుంది. కొండలై ఎదిగి ఆకాశానికి నమస్కరిస్తుంది. ఇటు భూమినీ, అటు ఆకాశాన్నీ వర్షంతో అనుసంధానిస్తుంది. అప్పుడు ఆ అడవి భిన్నమైన పశుపక్ష్యాదులకి, విభిన్నమైన జంతుజాలానికీ నెలవవుతుంది. సృష్టి చక్రం తిరగడానికి సృష్టికర్త వున్నాడనుకుంటే… ఆ అటవీ చక్రం తిరగడానికీ ఓ వనదేవత వుంది.
సకల జీవరాశులనూ తన పచ్చదనంలో దాచుకున్న దాని కడుపులో మనుషులూ వున్నారు. నేలపండితే తిన్నారు. దొరవలు పారితే తాగారు. ఏ గుట్టల్లోనో, గుహల్లోను విశ్రమించారు. కాలంతోపాటే గిరిపుత్రులూ పెరిగారు. జాతులుగా ఏర్పడ్డారు. తెగలుగా సాగారు.
అప్పుడు అడవి పచ్చగా ఉండేది. కాలం ఎరుగని మానుల కాపుండేది. రుతువులకొక్క తీరు కాచే ఫలాలుండేవి. పొద్దుకొక్క పరిమళం పంచే పూలుండేవి. దాహార్తినేకాదు, దేహశ్రమనూ చల్లార్చే సరస్సులుండేవి. అందరూ ఆ అడవినే నమ్ముకున్నారు. తమ జీవితాలను పణంగా పెట్టి సాక్కున్నారు. జీవిక కోసం ఏ గుప్పెడో తీసుకున్నారు. నియమాలను ఆచరించారు. కట్టుబాట్లను పాటించారు. పండుగలు చేసి, పదాలు పాడారు. దండారి ఆడారు దండాలు పెట్టారు. గుసాడి ఆడి దీపాలు పెట్టారు. సవరలంతా ఆడితే సంకురాతిరి సలి గిలిగింతలు పెట్టేది. జోడియాలు జోడీకడితే గసురమ్మ, గంగమ్మ పులకరించేటోళ్ళు. విప్పపూలే విరహాగ్నులు రేపేవి. జీలుగు కల్లే జీవామృతమయ్యేది. కాలం పుడమితల్లిపై పూలటేరులా సాగిపోయేది.
అప్పుడు తన బిడ్డలతో వనదేవత ఊసులాడేది. అమ్మలా జాగ్రత్తలు చెప్పేది. అప్పుడే ఓనాడు చెప్పింది.
“మనం పల్లానికి పోవద్దు. పల్లపోళ్ళు పైకి రావద్దు. అప్పుడే బిడ్డలంతా క్షేమంగా వుంటారు. ఈ మాట కట్టు మీరకండి” అని సమస్త తెగలు, జాతులకు ప్రేమార చెప్పింది.
వాళ్ళు అమ్మ మాట జవదాటలేదు.
పల్లపోళ్ళు మా కానోళ్ళు. మితిమీరి విస్తరిస్తున్నోళ్ళు. అడ్డంగా సాగడానికి చాలక, ఆకాశానికి నిచ్చెనలేసినవాళ్ళు.
బాల్కనీలో బంతి మొక్కతో అడవికి దిష్టిచుక్కెట్టినోళ్ళు. మంచినీళ్ళను సైతం మనీ మార్కెట్‌గా మార్చీసినోళ్ళు.
చెరువులను కబ్జా చేసి ఆక్వేరియంలో బంగారు చేపలను పెంచేటోళ్ళు. తినాలనుకున్నవాటిని కోసుకు తినేసి, కాని వాటిని చంపేసి… పెంపుడు కుక్కలను సాకే జీవకారుణ్యమూర్తులు. ఎన్నో మతాలుగా, కులాలుగా, ఉపకులాలుగా, ప్రాంతీయులుగా, రకరకాలుగా, రకంలో పలువిధాలుగా విడిపోయిన మానవమాత్రులు.
గజానికో దేవత ఉంటుంది. అడుగుకో గుడి ఉంటుంది. కానీ, ఎవరూ ఎవరి మాటా వినరు. పండుగలు చేస్తారు, పబ్బాలు గడుపుకుంటారు. పాయసాలు వండుకుంటారు, పాపాలు కడిగేసుకుంటారు. తమ జానెడు పొట్ట కోసం ప్రపంచాన్నే జోలెగా మార్చేసినోళ్ళు.
వాళ్ళను ఆపేవారెవరూ లేరు.
సంప్రదాయాలు, కట్టుబాట్లతోపాటు చట్టాలు, న్యాయాలు ఎన్నో వున్నాయి. కానీ, ఎవరూ ఏదీ పాటించరు. నదులను ఆక్రమించారు. చెరువులను మింగేశారు. కొండలు తొలిచేశారు. బండలు పిండేశారు. చెట్టు చేమలను చిదిమేశారు. భూమిలోకి తొలుచుకుపోయి సారాన్ని పీల్చేశారు.
సరిపోలేదు. ఏదీ సరిపోలేదు. అస్సలు సరిపోలేదు.
ఇంకా కావాలి, ఇంకింకా కావాలి, చాలా కావాలి.
కాలంగాని కాలంలో వాళ్ళ కన్ను అడవిపైన పడింది.
పల్లపోళ్ళు పైకెళ్ళారు. ఆదివాసీకి అభివృద్ధి వాసన చూపించారు. అంగీతొడిగి అంగట్లోకి తీసుకొచ్చారు. అక్షరాల పేరు చెప్పి అజ్ఞానాన్ని మప్పారు. రంగునీళ్ళు తాపించి కొత్తలోకంలో తిప్పారు. మార్కెట్ గురించి చెప్పకుండానే మాయలో పడేశారు. గిరిపుత్రులను కిందకు దిగజార్చారు.
పల్లపోళ్ళు కొండలకు ఎగబాకారు. అడవుల మీద పడ్డారు. ఆ అపురూప సంపదకు అబ్బురపడ్డారు. ఆ అపూర్వ వనరులకు అచ్చెరువొందారు. అందినకాడికి దోచుకున్నారు. అందనివాటిని అందుకోవడానికి యంత్రాలను దించారు. చొచ్చుకుపోయారు… చిచ్చు పెట్టారు. ఆ మంటల వెలుగులో వారి ముఖాలు వారికే వెగటు పుట్టించాయి.
తామే రక్షకులమని చాటుకున్నారు. సంరక్షకుల అవతారం ఎత్తారు. చట్టాలు తెచ్చారు. అభయారణ్యాలు సృష్టించారు. రిజర్వ్ ఫారెస్ట్‌లు ఏర్పాటు చేశారు.
వాళ్ళు లారీలతో ఎత్తుకుపోయారు. టిప్పర్లతో తోలుకుపోయారు. కేసులు మాత్రం పిడికిళ్ళతో పట్టికెళ్ళినవాళ్ళపై పెట్టారు. చట్టాలు అడవి చుట్టాలను మాత్రమే చెరలో పెట్టాయి.
అడగాల్సినవారే తెగబడటంతో ఆగడాలు మితిమీరిపోయాయి.
పోడు చేసేవారు పోరాటం చేయక తప్పలేదు. పొలమారిన జ్ఞాపకాలతో అందరినీ కలుపుకొచ్చారు. అన్ని తెగలు కలిశాయి. అన్ని జాతులు ఒక్కచోటజేరాయి. పండుగ జరుపుకున్నాయి. ఆనందంతో కాదు, ఆవేదనతో. ఆశలు సన్నగిల్లి, ఆగ్రహం పెచ్చరిల్లి కదంతొక్కారు. పూనకాలొచ్చి కాదు, కోపోద్రిక్తులై ఊగిపోయారు.
మాట తప్పిన బిడ్డల ముఖం చూడలేక ఎప్పుడో అలిగి వెళ్ళిపోయిన అమ్మలాంటి వనదేవతకు క్షమాపణలు చెప్పుకున్నారు. మొక్కులు మొక్కారు. కోడి పిల్లను కోశారు. కరుణించమని కన్నీరు పెట్టుకున్నారు.
బిడ్డల అరిగోస ఇన్న అమ్మ తిరిగొచ్చింది. పైట చెంగుతో కన్నీళ్ళు తుడించింది. అరచేతిలో ప్రసాదం ఆరగించి, అభయహస్తం చాచింది.
గోండులు గోచీ బిగించారు. సవరలు శరాలు సంధించారు. జాతాపులు జంగ్ సైరన్ ఊదారు. చెంచు పెంటలు పెనుమంటలై రాజుకున్నాయి.
అడివంటుకున్నాది.
పల్లపోళ్ళకు కావాల్సిందదే.
ఈళ్ళ విల్లులు, బాణాలు, బరిసెలకే సచ్చిపోయారో లేక కావాలని ఆళ్ళలో ఆళ్ళే సంపుకున్నారో, చానామంది వాళ్ళవాళ్ళ ప్రాణాలొదిలేశారు.
వ్యాపారులకు కావాల్సిందదే.
అప్పటిదాకా తెగబడిన సామాన్య రక్షకభటుల స్థానంలో సైన్యం దిగింది. సరిహద్దులో కాపలా వుండి పరాయి దేశపువాడిని హతమార్చాల్సిన సైనికులు అధునాతన బాంబులు వేసి సొంత దేశస్థుల దేహాలను తునాతునకలు చేశారు.
అయినా, ఆకాశం వంగలేదు. అడవి కుంగలేదు.
వాళ్ళ బలం ఆయుధాల్లో ఉంది. ఆదివాసుల బలం ఆత్మవిశ్వాసంలో ఉంది.
చరిత్రకు తెలుసు ఆత్మవిశ్వాసానిదే విజయమని.
చివరికి సెగ పీఠానికి తాకింది. అత్యాధునిక ఆయుధాలకు, సాంకేతిక పరిజ్ఞానం తోడైంది. హెలికాప్టర్‌లు వచ్చాయి. అడవి లోపలికి చొచ్చుకుపోవడానికి టాంకులు వచ్చాయి. బాంబర్లు వచ్చాయి. చీకట్లోనూ బతుకుల్ని చీకట్లో కలిపేసే నైట్ విజన్ డ్రోన్‌లు వచ్చాయి.
ఇంతటి మహా సైనిక, సాంకేతిక బలగం ముందు కూడా ఆత్మవిశ్వాసం ధిక్కారపతాక ఎగరవేసింది.
కాని, బలం సన్నగిల్లుతోంది. ప్రాణం రెపరెపలాడుతోంది.
తల్లులు లేరు, పిల్లలు లేరు, పసికందులు లేరు-వారి కాళ్ళ సందుల్లోంచి కారుతున్న రక్తం చిక్కబడుతోంది.
ముసలీ లేరు, ముతకా లేరు. ఆడోళ్ళు లేరు, మగోళ్ళు లేరు-వారి శవాల గుట్టలతో కొండ చిన్నబోతోంది.
దీనవదనులైన బిడ్డలంతా తల్లిచుట్టూ మూగారు. నెత్తురోడుతున్న గాయాలతో మూలిగారు. వనదేవత బిడ్డల వైపు కన్నీళ్ళతో చూసింది. అప్పటికే ఆమె కొప్పుకు నిప్పంటుకున్నాది. ఆమె పచ్చని కోక తగలబడిపోతున్నాది. నెమ్మది నెమ్మదిగా ఆమె హరించుకుపోతున్నాది. కనుమరుగైపోతున్నాది.
పిల్లల కోసం కోడిపెట్ట సైతం గద్దలతో తలబడుతుంది. గెలవడం కోసం కాదు. కడుపు తీపిని నిలుపుకోవడం కోసం.
మహారణ్యపు మహాతల్లి… మహాకాళి అయ్యింది. పంటి బిగువున ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఊపిరంతా తీసుకుని ఒక్కసారిగా హూంకరించింది.
పెనుగాలుల ప్రభంజనాలు చెలరేగాయి. ఆదిమ పిలుపేదో చెవినపడ్డట్టు మహావృక్షాలు విరుచుకుపడ్డాయి. దుమ్ము లేచింది. ధూళి రేగింది. చీకటి చూపును మాత్రమే కాదు, అసలు చూపునే కమ్మేసింది.
పక్షులన్నీ శత్రువును పసిగట్టాయి. అడవి మృగాలన్నీ అదను చూసుకుని కుమ్మేశాయి. తల్లి గొంతు సవరించుకుని గర్జించింది, అడవి దద్దరిల్లిపోయింది.
శత్రువుల నెత్తురంతా ఏరైంది. సుడులు తిరుగుతూ పల్లానికి పోటెత్తింది. ఊరుల్లోకి ఉరకలెత్తింది. పట్టణాల్లోకి పరుగెత్తింది. అడవి హత్యకు ఆరోవేలుపాటి సాయం చేసినవారంతా నెత్తుటి నదిలో పడి కొట్టుకుపోతున్నారు.
సముద్రానికి దారి తెలియని నెత్తుటి నది పీఠానికి చుట్టుకుంది. దాంతో నెత్తుటి చేతులను దాచుకుంటున్న ప్రభువుల దేహమంతా నెత్తురయ్యింది.
పోరు విరామంలో అలిసిపోయిన అడవి తల్లి నిశ్శబ్దంగా శ్వాస తీసుకుంటోంది. సన్నగిల్లుతున్న శక్తితో రొప్పుతోంది.
“మళ్ళీ అడివంటుకుంటాదో ఏటో?” అన్నారు ఆదివాసులు.
“చల్లారిందెప్పుడు?” అంది అడవి తల్లి.