వేలూరి వారి కథల పుస్తకం

నాకు రక్తమాంసాలు కల్గిన మనుషులంటే ఇష్టం. ఆపైన వారికి మనసు వుంటే అంతకన్నానా? నాకు ఫేస్‌బుక్ అంటే రోత. నాకు అది మనసూ ఇంకా రక్త మాంసాలు కల్గిన అత్యంత అత్మీయమిత్రులని కొందరిని ఇచ్చినా సరే.

అయితే నేను ఫేస్‌బుక్‌లో ఇష్టపడే విషయమొకటి ఉన్నది. పూరా ప్రపంచంలోనే అత్యద్భుతంగా బొమ్మలు వేసే చిత్రకారులు నాకు కొంతమంది ఫ్రెండ్స్. మామూలు ఊరికే ఫ్రెండ్స్ కారు వారు. గ్లోబ్ చూసి హైదరాబాదు అంటే అన్వర్ ఇక్కడే ఉంటాడు అని గుర్తు పట్టుకునే వీరప్రేమ కలిగిన ఒకే జాతి మనుషులు వారు. ప్రపంచం మూలమూలన ఒక కొత్త బొమ్మ, ఒక కొత్త గీత, ఒక చమత్కారపు కలరింగ్, లేండ్‌స్కేప్ మీది తడి రంగు ఆరడం కనిపిస్తే చాలు ఒకరికొకరం గొంతెత్తి బిగ్గరగా ఒకరికొరం ట్యాగి ‘ఇడిగిడిగో చూడు వీడు, ఆపై వీడి బొమ్మల చమత్కారం!’ అని థ్రిల్లయిపోయి అతగాడిని మమ్మల్లో కలిపేసుకుని ఆ చిత్రరచనాశైలి గురించి ఓ తెగ మాట్లాడేసుకుంటాం.

సరే, ఇక ఫేస్‌బుక్ వదిలేద్దాం. నా గత ఇరవై సంవత్సరాలుగా దాదాపూ రచయితల మధ్యే కాలం ఖర్మం నడుస్తూ వస్తుంది. ఎన్నడూ ఏ ఒక్కరూ ‘ఇదిగో గురూ ఇక్కడ చూడు, ఫలాని ఒకడు ఫలాతున్‌లా రాస్తున్నాడు. వాక్యం తాజా. శైలి భిన్నం. కథ ఎత్తుకున్న తీరు అపూర్వం. ఇతగాడిని చదివి నేను మహదానందపడ్డా. నా ఈ ఆనందం నీకు పంచుతున్నా. నువ్వూ సంబరపడు మిత్రమా!’ అని కొత్త కథల గురించి, కథకుడి గురించి మాటాడుకోడం దాదాపు సున్నా అంటే దాదాపుగా అంతే. అరిపిరాల సత్యప్రసాద్ అని ఒకరుండేవారు. చాలామందిలా తన కథలు మాత్రమే కాక తనకు బాగా అనిపించిన కథలు ఎక్కడైనా పత్రికల్లో కనిపిస్తే వాట్సాప్‌లో ఆ కథ తాలూకు లింక్ అంటించి, ‘మంచి కథ. దయచేసి చదవండి’ అని ఒక నోట్ పెట్టడం మాత్రం నేను ఎరుగుదును.

ఇదిగో ఇవాళ ఈ వేలూరి వెంకటేశ్వరరావనే ఈ రచయిత ఒక ఇరవై ఏడు కథలతో నూటా తొంభై పేజీల కథాసంకలనం తెచ్చి ఆరేండ్లు కావస్తున్నా, ఈయన పేరు నాకు వినపడకపోవడాన్ని సాకులు చెప్పి నన్ను నేను క్షమించుకోలేను. కానీ గురూ, చూడు ఈ రచయిత వాక్యం తాజాగా ఉన్నది. శైలి భిన్నంగా మెరుస్తుంది. కథ ఎత్తుకున్న తీరు తీర్చిదిద్దిన తీరుగా కలదు. ఇతగాడిని చదివి నేను మహదానందపడ్డా. నా ఈ ఆనందం నీకూ పంచాలనుకుంటున్నా, రా, నువ్వూ సంబరపడుదువుకాని మిత్రమా! ఈ కథాసంకలనం పేరు ఆ నేల, ఆ నీరు, ఆ గాలి.

ఇందులో తిరస్కృతి అనే నాలుగు పేరాల కథ వుంది. పూర్తిగా నాణ్యం అయివుంది. వచనాన్ని ఇంత అందంగా న్యాయంగా చెప్పాలంటే ఈ కథ ఒక అచ్చమైన కవిత అయినప్పటికి, దీన్ని కవితలా కాక కథగా చెప్పడమనేది సాధించడం వెనుక, ఆ నైపుణ్యం వెనుక దయ ఎరుగని ఒక పెద్ద చదువు చచ్చినట్లుగా ఉన్నది రచయితకు. వచనం వ్రాసే ఎవరికైనా ఈ కథ అల్లికలో కూచున్న వాక్యాలవరుస చూసి ‘నాకు చేతకాదు కదా ఈ జిగిబిగి పదాల నడక’ అనే దుఃఖం కలుగుతుంది. నేనైతే అదే దుఃఖంతో ఈ కవిత్వాన్ని చదివి ఆ సన్నటి నల్లని అమ్మాయిని పదే పదే ఈ వాక్యాల సాకున పడీ పడీ తాకా. కథ తియ్యగావుంది. ఆ తిరస్కృతి విషంలా వుంది.

ద్వైతం అనే కథ ఉంది అందులో. అనాదికాలం నుండి అంతా రెండు రకాలుట. వ్యాసుడు సృష్టిలో పాండవులు కౌరవులు. ఇవాంజలిస్ట్ దృష్టిలో క్రిస్టియనులు, పాపులు. కార్ల్ మార్క్స్‌గారి విడగొట్టుటలో మదించినవాళ్ళు మదించనివాళ్ళు. ప్రాశ్చాత్య నాగరికుల న్యాయంలో తెల్లవారు, నల్లవాడులు… ఇది సత్యం, ఇది ద్వైతం, ఇది పిచ్చ వెటకారం.

గోమెజ్ ఎప్పుడొస్తాడో అనే కథ వుంది. ఇందులో రచయిత ద్వైత్వం గురించి మాట్లాడలా, అసలేం వెటకారం కూడా పడలేదు. అయినా తెలిసిపోతుంది. మనుషులు రెండు రకాలు. నిజాయితీపరులు గోమెజ్‌లా. మిగతా అంతా మనమే నాలా, నీలా. పోనీ నువ్వే ముందు అనుకో- నీలా, ఆ పై నాలా. కానీ చదవాల్సిన కథ, ఒక కొత్త జీవితాల్ని, మళ్ళీ అదే పాత మనుషుల్ని కథ పేరిట మన ముందుకు తెచ్చి, కథ చివరన ఒక వాక్యం మళ్ళీ కంటికి తొలిసారి కన్నీటి స్పర్శ తెలిపినట్లు ఇలా… ‘”మి పే! మి పే!” అని హాస్పిటల్‌లో కలవరిస్తున్న గోమెజ్ గుర్తుకొచ్చాడు సుజాతకు. సుజాత కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి. ఒక్క చుక్కకూడా ఐదు డాలర్ల బిల్లు మీద పడలేదు’ అని కథ ముగుస్తుంది. ఇలా చెబితే కథ మీకు అర్థంకాదు. కాస్త పట్టుదలతో ఆన్‌లైన్‌లో గోమేజ్ ఎప్పుడొస్తాడో కథ ఉంది చదవండి ప్లీజ్.

ఈ కథలన్నిటికి ముందొక ముందుమాట ఉంది మా తెలుగు మాస్టారు అని. ఒక తెలుగు పంతులు మల్లావధాని గురించి రచయిత పంచుకోవడం. ఈయన ఒక్కడా? ఇది ఏక వచనమా?? మనకు తెలీని వేనవేల మల్లావధానులు కాకపోతే ముహమ్మదు సలీమ్ సారు గార్లు. మనం మనకి చాలా తెలుసు అనుకుంటామా, ఎందుకంటే మన దగ్గర గూగుల్ హై ఔర్ వికీపీడియా భీ కదా. ఇగ చాల్లే మూసుకుని పండుకో పో నాయనా. జ్ఞాన హీనత్వమా, భాషా దారిద్ర్యమా అని మొహం తుడిచేసుకుని మళ్ళీ మరోసారి… తెలుగు మాస్టారుని చదువుకోండి పోండి.

క్లబ్బులో చెట్టు కథ అని ఇలా మొదలవుతుంది: ‘క్లబ్బులో చెట్టు కొట్టేశారని రెడ్డి మేష్టారు రాజుగారింట్లో చెప్పంగానే, నా కుడి చెయ్యి కొట్టేసినట్టనిపించింది. కుడి చేతిలో స్కాచ్ గ్లాసు జారిపోతుందేమోనని భయపడి, గట్టిగా ఎడమచేత్తో వత్తి పట్టుకున్నా, బాలాజి గుడిలో పూజారి మంత్రపుష్పం చెప్పేటప్పుడు పెట్టే నమస్కారంలాగా!’ ఒక ‘అయ్యో’లా మొదలయ్యి ఒక భయం ఆ పై పూజారి పోలిక చదవగానే ఫకాలున నవ్వొచ్చింది. కథ ముగిశాకా చివర అచ్చమైన కవి ఇస్మాయిల్‌గారి చెట్టు దగ్గరకి మన చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి కాసింత దూరాన నిలబెట్టి చెట్టుకొమ్మల అవతలి శూన్యంలోకి చూస్తో– ‘క్షుద్ర గృహాలకి అతీతంగా ఎదిగిన డెబ్భైఐదేళ్ళ నిద్రగన్నేరు చెట్టు కొట్టేశారు. ఇప్పుడు చిగిర్చే చెట్టు లేదు. చీకట్లో దారితప్పి ఎగిరే పిట్టలు లేవు. చిలకలు వాల్చిన చెట్టు లోతైన కావ్యంలాంటిది! అది ఎందరికి తెలుసు?’ అన్న వాక్యాల వద్ద తటాలున తల ఎద దగ్గరికి చేరలా? ఏడుపు అనిపించింది; దుఃఖం కరవై దుఃఖించాల్సిన సమయంలో దుఃఖం రాకపోయినపుడు అది ఎంత దుఃఖమో ఎవరికి తెలుసు?

ఇక పడమట సంధ్యారాగం కథ దానికదే. నిజానికి నాకు అనుకోకుండా కంటబడిన ఈ పుస్తకంలో యథాలాపంగా తిరగేయగా కంటబడిన చదవబడిన మొదటి కథ ఇది. ఆగకుండా చదివించి ఈ రచయిత పైన, ఈయన తాలూకు అరుదయిన హైలీ స్టయిలైజ్డ్ ప్రోజ్ నడకపైన, ఆసక్తిని పెంచింది.

ఎగిరే గుర్రాలు అనే కలలో కొంత లైన్: ‘జయంతి అని ఆవిడ పేరు నీలం రంగులో పెద్ద అక్షరాల్లో రాయించి ఆశ్చర్యపడేట్టు చెయ్యాలి. పిచ్చిది! అప్పుడు దాని కళ్ళనిండా నీళ్ళు నిండిపోతాయి. చీరె కొంగుతో ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ ఉంటే, డోంట్! యువర్ ఐస్ ఆర్ బ్యూటిఫుల్ విత్ దట్ సాఫ్ట్ వెట్‌నెస్’ అని ఆపుతాట్టా మొగుడుగారు. ఇట్లాంటి పరమ వెటకారంగా పెండ్లాన్ని ఊహల్లోనయినా గిల్లుకునే ఊహలు నాకు ఎందుకని రావురా దేవా?

ఇంకా యాది అనే కథ ఒకటి ఉన్నది. తప్పక చూడండి. ఈ కథ మహానుభావులు సదాశివగారికి అంకితం ఇచ్చింది. కథకుడనేవాడు ఏమీ చదవనక్కర లేకపోవడమే మహా కథక లక్షణం అని నిరూపించే తెలుగు కథకుల ప్రపంచంలో అకస్మాత్తుగా ఒక వీలయినంత అమితంగా చదువుకున్న కథకుడు ఈ యాది అనే కథని కళ్ళముందుకు తెస్తే, ఏఁ చేయగలను? వేలూరి శ్రీ వెంకటేశ్వరరావుగారికి నా చిన్న చేతులని వీలయినంతగా చాచి ఒక పెద్ద నమస్కారం, ఈ చిన్న మాటలు వ్రాసే ప్రయత్నం చేయడం తప్ప.


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...