ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 5

డేవిడ్ లో ది గ్రేట్! నా ఎదురుగా, నా కార్యాలయంలో, గదిలో! ఏమిటిది! కలా? నిజమా? ఊహించని విధంగా ఎప్పుడో ఒకసారి మీ నెత్తి మీద పెద్ద దెబ్బో, మొహంపై హఠాత్తుగా చరుపో సంభవించడం మీరు ఎరిగే ఉంటారు. అప్పుడు కళ్ళముందు రంగు రంగుల నక్షత్రాలు ప్రత్యక్షం అయినట్లుగా అవుతుంది. ఇప్పుడు అటువంటి నక్షత్రాల మిణుకుమిణుకుల మధ్య నేను చూస్తున్నది నాకే నమ్మశక్యంగా లేదు. మత్తు కమ్మినవాడికి మల్లే నట్టులు కొట్టుకుంటూ ఆ అనుకోని అతిథులతో తత్తర బిత్తర సంభాషణ ఒకటి మొదలుపెట్టా. సంవత్సరాల తరబడి లో బొమ్మలనే కాదు, ఆయన జీవన శైలి, అలవాట్లూ ఎరిగి ఉన్నవాడిని కాబట్టి, ఇప్పుడు ఈ క్షణాన ఆయన ఇక్కడ ఎందుకున్నాడా అని అంచనా వేయడానికి నా బుర్ర వేగంగా పనిచేస్తూ లెక్కలు వేయసాగింది. ఎక్కడో చదివిన గుర్తు – డేవిడ్ లో కూతుళ్ళల్లో ఒకరికి హాంకాంగ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తతో వివాహం జరిగింది, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆయన తన కూతురిని కలవడానికి హాంకాంగ్ వెళతాడు. బహుశా ఇప్పుడూ అదే పని మీద ఇటుగా వచ్చి ఉంటారు. అవునా? అవును. నా అంచనా నిజమే. ఇండియా మీదుగా వెళుతున్న ఆయన ఓడ ఈ రోజు బొంబాయిలో కొన్ని గంటల కొరకు ఆగింది. వారు ఓడ దిగి అటూ ఇటూ చక్కర్లు కొట్టడానికి తగినంత సమయం ఉంది. అలా తిరుగుతూ వారు టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్‌కు సమీపంలో తాము ఉన్నట్లు గ్రహించారు. అదే సమయంలో రాత్రి డ్యూటీ ముగించుకుని అటుగా వెడుతున్న ఒక ప్రెస్ రిపోర్టర్ సాయంతో ఆ దంపతులు అలా నా గదిలోకి ప్రవేశించారు.

ఉన్న ఆ కాసింత సమయాన్ని సద్వినియోగపరిచేందుకని నేను వారిరువురిని ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు చూపించేందుకు తీసుకెళ్ళాను. ఆ ఉదయం వేళ బొంబాయి మెరైన్ డ్రయివ్ పొడవాటి దారి, ఆ సముద్రం, చౌపాటీ తీరం, అక్కడి ఒకలాంటి నిశ్శబ్దం, సన్నగా కిలకిలారావాలు చేసే పక్షులు, సువాసనలు వెదజల్లుతున్న పువ్వుల తాలూకు గాలిమత్తు, ఆ వాతావరణం అంతా లో దంపతులని మంత్రముగ్ధులను చేసింది. వారు అట్లా మైమరిచి ఆ పరిసరాలని చూస్తుంటే, దాన్నంతా నేను నా స్వహస్తాలతో ఇండియన్ ఇంక్, వాటర్ కలర్లతో చిత్రించి సృష్టించినంత గొప్పగా దర్పంగా నా నడుంపై చేతులు పెట్టుకుని గర్వపడ్డాను. ‘శెభాష్’ అని ఆ ప్రకృతిని మెచ్చుకోలుగా చూస్తూ కళ్ళెగరేశాను.

పడ్డవాణ్ణి పడ్డట్టుగానే కాసింత గర్వపడి గమ్మున ఉండవచ్చు కద, అబ్బే! గొంతు సవరించుకుని అడిగాను కదా! హ్మ్! “కాబట్టి, మిస్టర్ లో, విదేశాలనుండి వచ్చే చాలామంది సందర్శకులు భారతదేశం అనగానే, వీధులలో సాధువులు, రోడ్డు పక్కన పాముల్ని ఆడించేవాళ్ళు, నగరపు నడిదారులలో భారీ ఏనుగులు, పెద్దపులులూ నడుస్తూ కనపడతాయని ఊహాగానాలు చేస్తూ భారతదేశానికి వస్తుంటారు. కనీసం మీరయినా మీ దేశానికి వెంట తీసుకెళ్ళడానికి మా దేశం గురించి ఒక భిన్నమైన అభిప్రాయాన్ని అనుభవించారని నేను గట్టిగా ఆశిస్తున్నాను” అని చెబుతూ ఒక నాటకీయ ధోరణిలో నా చేతిని ఆ సముద్ర తీరం వేపు పొడుగ్గా చాపి అలలా ఆడించాను. ఆ నా చేతి కదలికకు అనుగుణంగా అన్నట్టూ ఎక్కడినుండో ఒక వాద్య సంగీత వీచిక అలలు అలలుగా తేలుతూ వచ్చింది. తొలుత అది భ్రమ అనుకున్నా. సన్నగా వస్తున్న ఆ సన్నటి సంగీతం క్రమంగా పెరుగుతూ మా చుట్టు సర్పంలా నాట్యమాడసాగింది. అంత చల్లగాలిలో కూడా చాపిన నా అరచేతుల్లోకి చెమట వచ్చి చేరింది. పిదప ఆ సంగీతకర్త అయిన ఒక పాములవాడు తన చంకకున్న జోలెలో ఒక పాములబుట్ట వేలాడదీసుకుని, మెడలో ఒక పడగ విప్పిన పామును ధరించి నాదస్వరం ఊదుతూ అచ్చం హాలీవుడ్ సినిమా తెరమీది నుండి సరాసరి తెర దిగి మెరైన్ డ్రయివ్ రోడ్డు మీదికి అడుగు పెట్టినట్లుగా వచ్చాడు. వాడిని చూసి మిస్టర్ లో తన పొగాకు పైపు వెనుకనుండి ఒక చిన్న పరిహాసపు నవ్వు నవ్వారు. హా! ఏమి నాకు ఈ ఘోరావమానము? ఈ ప్రకృతిని చూచుచున్నవాడిని ఏదో ఒకటి చూడనీయక, అడ్డము నేనెందుకు పలుకవలే! పలికితిని పో! పలికిన తక్షణమే ఈ పాములవాడు ఎందుకు ఊడిపడవలె? పడెను పో! … ఉండు, ఉండు, ఉండు! కొద్దిగా సంయమనం పాటించి నేను ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవాలి, అలా కాక ఈ అభాసును కప్పిపుచ్చుకోడానికి ఇంకేమైనా వెర్రిమొర్రి ప్రయత్నాలు చేసినయెడల నా విపత్తు ఈ సముద్రముల ఇసుకకన్న బరువుగా అవమాన భారముగా మారి నన్నే ముంచివేయును అని ఆలోచించి ఇలా దిద్దుకున్నాను. “హాఁ! మరి ఆ విధంగా సర్ డేవిడ్ లో-గారూ, మీకిప్పుడు ప్రథమ దర్శనం పాములవాడిది అయ్యింది, ఇక రోడ్డు ఆ మలుపు తిరగగానే మన అదృష్టం బాగుంటే మనం పులులను, ఏనుగులను, మేకుల మంచం మీద పడుకున్న బాబాజీగారిని కూడా చూడవచ్చు, పోదాం పదండి”.

ప్రస్తుతానికి లో-గారిని అక్కడే వదిలేసి మళ్ళీ నా పాతకథలోకి వెడదాం. మానవ జీవితపు ప్రతి దశలో ఒక్కో అనుభవానిది ఒక్కో రుచి. బాల్యపు జీవితంలో కూడా ఆ ఆనందవిషాదాలన్నీ దానికి తగిన భలే అత్యల్పమైన విషయాలతో కూడుకుని వుంటాయి. ఒక అక్క ఊరి నుండి వస్తూ వస్తూ నాకోసం క్రికెట్ బ్యాట్‌ని బహుమతిగా తేవడం ఒక ఆనందం. ఉన్నట్టుండి ఒక అన్న ఉదాత్తంగా నా చేతికి కొన్ని రూపాయలని ఇచ్చి ఖర్చు పెట్టుకోమన్నప్పుడు ఆ డబ్బుతో నేను సినిమాకి వెళ్ళడానికో లేదా ఆనంద్ భవన్‌లో మసాలా దోశ మెక్కడానికో కాళ్ళు సాగడమనేది మహదానందం. అనుకోని విధంగా ఒకసారి మా చిన్నక్క నాకు ఒక సైకిల్ కొనిపెట్టింది. అదయితే బల్ బహుతానందం. కొన్నేళ్ళ తరువాతా అదే అక్క తన కూతురిని నాకు పెళ్ళికూతురిగా బహుకరించిందనుకోండి, ఆ గొప్పానందం గురించి రాబొయే రోజుల్లో చెప్పుకుందాం. ఆనందాలు అలా అయితే మరి ఏడుపుగొట్టు విషాదాల మాటో? హోరాహోరీగా జరిగిన క్రికెట్ మ్యాచ్ లోనో, కాళ్ళు వాచేలా బంతాడిన ఫుట్‌బాల్ మ్యాచ్ లోనో ఘోరంగా ఓడిపోవడం అనేది సంభవించినపుడో, ప్రశాంతమైన జీవితంలోకి అప్పుడప్పుడు నూనె అని ఒక జిడ్డు పదార్థం వచ్చి దానిని వంటినిండా రుద్దుకుని స్నానం చేయమని అమ్మ ఆదేశం అయినపుడో, అయిదుమంది అన్నల ఆరవ తమ్ముడిగా ఎప్పుడూ ఎవరో ఒకరి చేతిలో నా బ్రతుకు రంగమర్దనమయినపుడో కళ్ళముందు నలుపు కమ్మితే దాని పేరు విషాదమని కాక మరేమిటీ? ఎపుడో ఒకపుడు రాక తప్పవని తెలిసిన ఇటువంటి ఏడుపుగొట్టు విషయాలు సరే! కానీ అసలు ఎన్నడూ ఊహించని ఒక నిరాశాపూరితమైన రోజులు కొన్ని అప్పటి నా జీవితంలోకి వచ్చాయి.

నాకు ఆత్మీయ మిత్రుడు అనండి, అత్యంత ప్రాణస్నేహితుడు అనండి. అదంతా ‘హెచ్.కె.’ ఒకడే నాకు. తొట్టతొలుత బడి అనే విషయంలోకి నేను ప్రవేశించిన రోజు ఒకటుంది కదా, అదే రోజు హెచ్.కె. కూడా తొలిసారిగా బడిలో అడుగు పెట్టాడు. ఇద్దరం అనుకోకుండా ఒకే బెంచిలో కలిసి కూచున్నాం. అలా కూచున్నది మొదలు ఆ ఎలిమెంటరీ చదువుతో సాగి బి.ఎ. డిగ్రీని పుచ్చుకుని కాలేజీ రోజుల నుండి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టేవరకు మేమిరువురమూ మా విద్యాజీవితంలో కలిసే ఉన్నాము. మీకు తెలుసుగా మా క్రికెట్ టీమ్ రఫ్ అండ్ టఫ్ అండ్ జాలీ టీమ్‌ గురించి. నేను దానికి కెప్టెన్‌ని, హెచ్.కె. వైస్ కెప్టెన్. వీడు మంచి బౌలర్, సమర్థుడైన బ్యాట్స్‌మెన్ కూడానూ. మా ఇరువురి ఆసక్తులు, అభిప్రాయాలు సాధారణంగా చాలా విషయాలపై ఒకేలా ఉంటాయి. అందువల్లే మేము ఇరువురం ఒకరి హృదయానికి మరొకరం చాలా దగ్గరగా ఉండేంత మంచి స్నేహితులమయ్యాం. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ అపార్థం అనే మాటకు తావే లేదు. ఒక్కోసారి నేను ఉద్రిక్తతకు లోనయినా మా హెచ్.కె. మాత్రం ఏ సమయంలోనయినా ఎంతటి గంభీరమైన వ్యవహారాన్నయినా చాలా తేలికగా తీసుకుంటాడు. నో వర్రీస్ అంటాడు. అలాంటి హెచ్.కె. ఉన్నట్టుండి వింతగా ప్రవర్తించడం ప్రారంభించాడు. వాడు అకస్మాత్తుగా మా రఫ్ అండ్ టఫ్ అండ్ జాలీ టీమ్‌ని నిర్లక్ష్యం చెయడం మొదలెట్టాడు. మామూలు రోజుల మాట వదిలెయ్యండి, మీకు తెలుసుగా క్రికెట్ టీములకు వారాంతపు మ్యాచ్‌లు అనేవి ఎంత ముఖ్యమో! అటువంటి పవిత్రదినాలలో కూడా మా జట్టు ప్రధాన ఆటగాడు ఆట ఆడటానికి మైదానం వైపు రావడం మానేశాడు. మాకు కనపడ్డమూ మానేశాడు. తరువాత తరువాత నిఘా పెట్టగా తను షరీఫ్ అనే ఒక కొత్త కుర్రాడితో స్నేహం కట్టాడని, ఇద్దరూ కలిసి సైకిల్ మీద మైసూర్ వీధుల్లో తెగతిరుగుతున్నారని తెలిసింది! ఇద్దరూ జంటగా ఆనంద్ భవన్‌లో టిఫిన్లు గుటుక్కుమనిపించడాలు, కలిసి సినిమాలకు వెళ్ళడాలు, సిటీ పార్కులలో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడాలు… అన్నీ తెలుస్తూనే ఉన్నాయి.

‘ఇదిగో ఇదీ’ అనే ఎటువంటి ఒక స్పష్టమైన కారణం లేకుండా నా ప్రాణస్నేహితుడు నాకు ద్రోహం చేయడం నిజంగా నా హృదయాన్ని బద్దలుకొట్టింది. నా ఆ మిత్రుడి క్రూరమైన నిర్లక్ష్య ప్రవర్తన నన్ను, మా క్రికెట్ టీమ్‌నీ తీవ్ర నిరాశలో ముంచెత్తింది. జీవనోత్సాహం అనేది జీవితంలోనూ ఆటలోను నశించిన నా వంటి కెప్టెన్‌ వల్ల క్రమంగా రఫ్ అండ్ టఫ్ అండ్ జాలీ టీమ్ జాలిగా కనుమరుగైంది. ఆ పై కొద్దికాలం నేను ఒంటరిగా విషాదంగా తలవంచుకుని మరీ మైసూర్ వీధులు కొలుస్తూ తిరిగాను. ఒక దినాన నేను ఉన్నట్టుండి హెచ్.కె.ని వెతుకుతూ బయలు దేరాను కుకన్‌హాలికేవ్ ట్యాంక్ బండ్‌పై హెచ్.కె., షరీఫ్ ఇద్దరు కబుర్లాడుతూ కూచుని ఉన్నారు. ఒక్కసారిగా మా మధ్య అసలేమీ జరగనట్టు నేనూ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూచున్నాను. వారికి సంబంధించినంతవరకు మా మధ్య నిజానికి ఏమీ జరగలేదు. వాళ్ళు నా రాకను సంతోషంతో ఆహ్వానించారు. అప్పటినుండి మేము నదురూ బెదురూ ఎదురూ లేని ముగ్గురు మిత్రులమయ్యాము. జీవితం మళ్ళీ ప్రారంభమైంది, ఈ సారి సరికొత్తగా, సంతోషంగా, మరింత ఉల్లాసంగా.

కానీ త్వరలోనే ఆ ఉల్లాసపు రోజులనుండి దూరంగా-ఆటపాటలు, అల్లర్లు, అలగడాలు అనే లక్షణాలు గల ఒక చిన్నపిల్లవాడి నుండి కాస్త పక్కకు జరిగి ‘జీవితం అంటే ఏమిటి’ అని ఆలోచించవలసిన పెద్దవాడిగా మార్చిన సంఘటనను అనుభవించాల్సి వచ్చింది. ఒకరోజు తన సాధారణ దినచర్యలో భాగంగా మా నాన్న తన స్నేహితుడితో కలిసి కారులో బయటకు వెళ్ళారు. సాయంత్రం కారు తిరిగి వచ్చింది. ఇంటి ముందు కారు ఆగగానే అందులోనుండి ఇద్దరు వ్యక్తులు గబగబా దిగి, మా నాన్నగారిని చెరో వైపునా ఆసరాగా పట్టుకుని, ఇంటిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మైసూర్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరీ నదిపై కట్టిన కృష్ణరాజ సహారా ఆనకట్ట అనేది ఒక పర్యాటక ప్రదేశం. అక్కడికని వ్యాహ్యాళికి వెళ్ళి తిరిగి వస్తుండగా కారులోనే మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది. ఆ సంఘటన జరిగిన రోజు నుంచి మా ఇంటి తీరే మారిపోయింది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ప్రధాన ప్రాధాన్యత నాన్నగారే అయ్యారు, మా ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళము ఆయన అవసరాలు తీర్చడానికే అన్ని వేళలా సిద్దంగా ఉండేవాళ్ళం. పక్షవాత కారణానా ఆయనలో కదలిక తగ్గిపోయినందున ఆయన్ని కనిపెట్టుకు ఉండటంలో, అవసరం అయినపుడు ఆహారం ఇవ్వడంలో, స్నానం చేయించడంలో, కాలకృత్యాలు తీర్చుకోవడానికి సాయపడ్డంలో, ఇదీ అదీ అని కాకుండా మా తండ్రిగారిని వీలయినంత సౌకర్యంగా ఉంచడానికి మాలో ప్రతి ఒక్కరం వారి వారి చేతనయినంత మేరకు చేయూత అందించాము.

రోజులు గడిచేకొద్దీ అందరమూ ఈ కొత్తదనానికి అలవాటు పడ్డాము, మా నాన్నగారు కూడా క్రమేపీ మెరుగవుతూ వచ్చే సంకేతాలను చూపించారు. మెల్లమెల్లగా ఆయన మాలో ఎవరో ఒకరి చేయి లేదా ఊతపు కర్ర పట్టుకుని కొంచెం కొంచెం నడవడం ప్రారంభించారు. కానీ అకస్మాత్తుగా ఒక్కోసారి ఆయన పురోగతి దిగజారుతున్నట్లుగా కనపడేది కూడా. ఒకప్పుడు మా నాన్నగారి విద్యార్థిగా ఉండి ఇప్పుడు పెద్ద డాక్టర్ అయిన కృష్ణారావుగారి వద్దకు కబురు అందించడానికి నేను నా సైకిల్‌పై రివ్వున వెళ్ళేవాడిని. మాకు అవసరమైన ఏ వేళలో అయినా, మా తండ్రిగారిని పరీక్షించడానికి ఆయన వచ్చేవాడు. కృష్ణారావుగారు భలే నవ్వుతాలు మనిషి. ఎంతటి ఉద్రిక్త పరిస్థితులనయినా కూడా ఆయన హాస్యపు ధోరణితో తేలిక చేసేవారు, చక్కని కబుర్లు చెబుతూనే నాన్నకు అవసరమయిన వైద్యం చేసి, మందులు వ్రాసి ఇంట్లో ఉన్న అందరికి మరుసటి ఉదయం కల్లా తండ్రిగారు మామూలవుతారని భరోసా కల్పించి, బేలలమై ఉన్న మా మనసుల్లో కొత్త ఆశలు, ఇంకా కొంత ఉత్సాహాన్ని నింపి వెళ్ళిపోయేవారు.

ఆ అనారోగ్య సంఘటన సంభవించి ఒక సంవత్సరం అయింది. చూస్తూ ఉండగానే నాన్నగారు చాలామటుకు కోలుకున్నారు. ఆయన అనారోగ్యం బారిన పడినప్పటి నుండి మేడమీది ఆయన స్వంతగదిలో కాకుండా కింద హాలులోకి ఆయన మకాం మార్చాం. ఇక ఆయన ఆరోగ్యం కాస్త కుదిరింది అనుకున్నప్పటినుండి తనని మేడమీద ఉన్న తన పెద్దగదికి మార్చమని పట్టుబట్టడం ప్రారంభించారు. అక్కడ ఆయన తన పుస్తకాలు, తను వ్రాసుకునే మేజా, కూచునే కుర్చి… అక్కడ ఇలా ఆయనదయిన ఒక ప్రపంచం ఉంది కదా. మళ్ళీ దాని మధ్యకు వెళ్ళిపోవడమనేది ఒక మంచి ఆలోచనగానే అమ్మకు తోచింది. దాదాపు ఒక సంవత్సరం పాటు పక్షవాత కారణంగా ఆయన కిందిభాగం లోని హాల్‌లో ఉన్నారు కదా. అక్కడ ఆయన ఉనికి ఇంట్లో అందరి సాధారణ గృహ కార్యకలాపాలకు ఒక రకమైన ఇబ్బంది కలిగించడమే కాకుండా వంటగది నుండి వచ్చే చెంబు, చేట, తపేలా శబ్దాలు, వంటల ద్వారా వచ్చే ఘాటు వాసనలు, ఇంకా ఇంటికి అప్పుడప్పుడూ వచ్చి పోయే జనం తాలూకు కబుర్లు, ఆ గోల నాన్నగారికి కూడా చాలా చిరాకు తెప్పించేవి. ఇది ఎటూ ఉభయభ్రష్టంగా ఉంది కాబట్టి ఆయన కోరుకున్నట్లుగానే ఆయన్ని మెల్లగా తన స్వంతగదికి తీసుకెళ్ళాము. ఆయన అక్కడ హాయిగా స్థిరపడ్డారు. ఇప్పటి ఆయన పరిస్థితికి తగ్గట్టుగా గదిలోని సరంజామాని ఆయనకు అనుకూలంగా మార్పించుకున్నారు కూడా. క్రమంగా మేము మా గంభీరమైన నాన్నగారి నుండి ఇప్పటి ఒక బలహీనమైన నాన్నగారు ఉన్న స్థితికి అలవాటుపడ్డాము. కాలం అన్నిటినీ సర్ది పెట్టేస్తుంది. అందరిలాగే నేనూ నా పాతరోజుల మాదిరే తిరిగి పాఠశాలకు వెళ్ళడం, స్నేహితులతో ఆడుకోడం, బొమ్మలు వేసుకోడం, హెచ్.కె.తో కలిసి షికార్లుకొట్టడం అంతా మునపటిలాగే జరగసాగింది. నేను చిన్నవాడిని బరువు బాధ్యత లేనివాడిని కాబట్టి నా మునుపటి దినచర్య నాకు వచ్చిందేమో కాని అందరికి మాత్రం కాదు.

మా అమ్మ చాలా అరుదుగా క్లబ్‌కి వెళ్ళసాగింది. ఇప్పుడు ఆవిడ ప్రాధాన్యత అంతా నాన్నగారికి వీలయినంత సౌకర్యంగా ఉండేట్లు చూసుకోడం. ఒకప్పుడు తన చేతికి భూషణంగా ఉండిన టెన్నిస్ బ్యాట్, చదరంగపు పావులతో ఆటలాడే సమయమంతా ఇంటిపని, నాన్నపని. అనంతరం పత్రికలు మరియు పుస్తకాలు చదవడంలో కేటాయించింది. మా అమ్మా వట్టి ఆటపాటల మేటి క్రీడాకారిణే కాదు, ఆమెకు దేవదేవతల బొమ్మలను రంగులతో అలంకరించడము, వారికి చక్కని జలతారు బట్టలు కుట్టి, కట్టిపెట్టడమనే పనిలో కూడా మహానిపుణురాలు. ఆమె చేతి హస్తకళకు మైసూర్ దసరా ఎగ్జిబిషన్‌లో రజత పతకాన్ని, ఇంకా ప్రశంసాపత్రాన్ని కూడా గెలుచుకుంది. ఇప్పుడు మా ఇంట్లో నడుస్తున్న చెడ్డకాలంలో ఆవిడకై ఆవిడ ఈ హస్తకళ కోసం తిరిగి కాస్త సమయం కేటాయించింది. చక్కని ఊదారంగు వెల్వెట్ దుస్తులు, బంగారు జరీ పట్టుధోతీ, కాల్జేతులకు పట్టీల అలంకారాలు. దేవతల నెత్తులమీద గాజుపూసల వజ్రాల కిరీటాలు, ఆభరణాలతో ఆ దేవతలను మరింత చూడ అందంగా ముచ్చటగా కనిపించేలా తీర్చిదిద్దసాగింది.

కానీ తాత్కాలికమైన మా ఇంటి అనిశ్చిత ప్రశాంతత ఇక ఎక్కువ కాలం నిలవలేదు. ఉన్నట్టుండి ఒక రోజు ఉదయాన్నే ఇంట్లో కోలాహలం చెలరేగింది. మా ఇంటి పనాయన, వంట మనిషి ఇద్దరూ పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ పడుతూ లేస్తూ మేడ మెట్లెక్కుతున్నారు. అటు చూస్తే అమ్మ పై అంతస్తులో నుండి సహాయం కోసం బిగ్గరగా కేకలు వేస్తోంది. అన్నయ్య నాన్నగారి గది వైపు పరుగెడుతున్నాడు. మిగిలినవారు గోలగోలగా అరుస్తూ నలువైపులా ఉరుకులు పరుగులు తీస్తున్నారు. అసలక్కడ ఏమి జరుగుతుందో కాసేపటివరకు నాకు అర్థంకాలేదు. చివరికి నేను తెలుసుకున్నది- స్నానాల గదిలోకి వెళ్ళిన నాన్న అక్కడే కుప్పకూలిపోయారని, గది తలుపు లోపల నుండి గొళ్ళెం పెట్టి ఉందని, నాన్న లేవలేని పరిస్థితిలో అలా ఆక్కడే బందీగా పడివున్నారని అర్థం అయ్యింది. నేను క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే డాబా మీదకు పరిగెత్తాను, అక్కడి నుండి విశాలమైన మా బంగ్లా మొత్తాన్ని చుట్టు తిరిగి వెనుక గోడమీదుగా జారి, మా నాన్నగారి బాత్రూమ్ కిటికీ దగ్గరికి చేరుకున్నాను. అక్కడి నుండి కింద నేల దాదాపు ఏభై అడుగుల కిందుగా ఉంది. నేను ఎటువంటి ఆధారం లేకుండానే బిగుతు తాడు మీద నడిచే దొమ్మరివారి వలే గోడమీద అడుగులో అడుగు వేసుకుంటూ కదిలాను. అలా కిటికీ దగ్గరకు వచ్చేసరికి నేను పైకి ఎక్కి ఏదో చేస్తున్నాననే విషయం తెలిసి ఇంటి జనం అంతా ఆత్రుతతో నన్ను చూసేందుకు తోటవైపు చేరుకున్నారు. కింది నుండి వారందరి మాటలు నాకు వినిపిస్తూ ఉన్నాయి. ‘జాగ్రత్త సుమా జాగ్రత్త! జారేవురా’ అని కొన్ని, భద్రంగా నడవమని మరికొన్ని, నేను వట్టి నిర్లక్ష్యపు గాడిద రకాన్నని ఇంకొన్ని గొంతుకలు రకరకాలుగా అంటూ ఉన్న మాటలు కిందనుండి నాకు వినిపిస్తూనే ఉన్నాయి! జాగ్రతగా నాన్నగారి బాత్రూమ్ కిటికీ దగ్గరకు చేరుకున్న నాకు అందులోనుండి నిస్సహాయంగా నేలపై పడి ఉన్న ఆయన దీనావస్థ దృశ్యం కంటపడింది. నేను మెల్లగా వెనక్కి తిరిగి క్రింద ఉన్న మా గుంపుని ఒక వెదురు కర్ర ఇవ్వమని అడిగాను. అదృష్టవశాత్తూ, ఎందుకు? ఎంత పొడవు? ఎంత బరువు? వంటి దిక్కుమాలిన ప్రశ్నలేవీ అడగకుండానే కింద ఉన్నవారిలో ఒకరు ఒక వెదురు కర్రని నాకు అందించారు. ఒక చేత్తో కిటికీ పట్టీని గట్టిగా పట్టుకుని, కిటీకీ లోంచి వెదురు కర్ర దూర్చి దాని మొనతో తలుపు గొళ్ళాన్ని రెండూ మూడుసార్లు గట్టి తాపులు తగలనివ్వడంతో చివరికి గొళ్ళెం విడిపడింది. దిగువన ఊపిరి బిగుపట్టుకుని నేను చేస్తున్న పనిని చూస్తున్న సమూహం వైపు తిరిగి గది తలుపులు తెరుచుకున్నాయని చెప్పడంతో వారు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ నాన్నగారిని లేవదీసేందుకు ఇంట్లోకి పొలోమని పరుగెత్తారు. అక్కడ నాన్నగారికి మెదడులో రక్తస్రావం జరిగింది. ఆ సంఘటన తరువాత ఆయన వాక్కు, చూపు, నడక అనే శక్తులను శాశ్వతంగా కోల్పోయారు. ఒక రెండు నెలల తర్వాత ఆయన దయనీయమయిన స్థితిలో మరణించారు.

మా నాన్నగారిది ఒకవిధమైన మనస్తత్వము, ఆయనకంటూ ఉన్న కొన్ని ప్రత్యేక విలువలు గల వ్యక్తిత్వము. ఆయనకు చదువు మీద ఉన్న నమ్మకము ఆస్తిపాస్తుల మీద అసలు లేదు. తమ పెద్దల వారసత్వంగా ఒక మిరపతోట ఆయన వాటాగా వచ్చింది. తన పాండిత్య కార్యకలాపాలకు ఈ తోటలు, దాని వ్యవహారాలు అడ్డుగా నిలుస్తాయని, దాని వలన తన చదువుకు ఆటంకం ఏర్పడుతుందని ఆయన భావించారు. ఆయన పెద్దన్నగారు ఒకాయన ఈ వ్యాపార వ్యవహారాలలో బాగా లౌక్యుడు, వ్యవహారదక్షత గలవాడు. ఎలా అయినా చేసి మా నాన్నగారి వాటా తోటను తాను సంగ్రహించాలని ఎత్తుల్లో ఉండి ఉండగానే, ఆయనకు అంత శ్రమ అవసరం లేకుండా అప్పట్లో నవయువకుడైన మా తండ్రిగారు తన పెళ్ళి కాగానే తనకు పెద్దలనుండి వారసత్వంగా వచ్చిన మిరపతోటను, తతిమా ఆస్తిని ఎటువంటి శషభిషలు లేకుండా బంగారు పళ్ళెంలో పెట్టి మరీ వారి పెద్ద అన్నగారికి అప్పగించాడు. పిదప తన సంచి సర్దుకుని అక్కడ తనకున్నదానిని అంతటినీ విడిచి పెట్టి శాశ్వతంగా మైసూర్‌కు వచ్చేశారు. ఇంటి పెద్ద, అందరి సంరక్షకుడు, ఇంతమందికి ఒంటి చేత్తో అన్నం పెట్టే ఏకైక వ్యక్తి, మా అన్నదాత, మా ప్రియాతి ప్రియమైన తండ్రిని మేము ఇప్పుడు కోల్పోయాం. ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణంచేసుకోడానికి, ఇల్లు కుదుర్చుకోడానికి మాకు కొంత సమయం పట్టింది. ఆయన ఉన్నంత కాలం ఇల్లు ఎలా నడిచింది మాకు తెలియలేదు, ఇకపై ఎలా గడుస్తుందో కూడా తెలియబోవడం లేదు. మా నాన్నగారు మాకు ఆస్తులు ఏమీ మిగల్చలేదు, అలానే మా తలలపై అప్పుల బరువు లేదా బాధ్యతల భారం అనేవేవీ కూడా మోపి పోలేదు.

మా నాన్నగారు నలుగురితో కలిసి అంతగా తిరిగే, నలుగురి మధ్య కూడి సందడి చేసే మనస్తత్వం కలవారు కాదు. ఆయన అంతర్ముఖుడు. తన పనేదో తను చూసుకోవడం, పాఠశాల నుండి ఇంటికి రావడం, తన గదిలో తాను కూచుని పుస్తకాలు చదవుతూ సమయాన్ని గడపడం. అంతే! అంతకు మించి జీవితం నుండి ఆయన ఆశించినదేమీ కనపడదు. ఆయన ఉన్నంతకాలమూ పెద్దగా తెలీని ఆయన ఉనికి ఆయన మరణానంతరం లేకపోవడాన్ని నేను తీవ్రంగా అనుభవించాను. ఆయన గదిలోకి వెళ్ళినపుడల్లా నాన్నగారి కోటు తగిలించి ఉంచే స్టాండ్, ఆయన బట్టల బీరువా, ఆయన లండన్ నుండి ఆర్డర్ చేసి తెప్పించుకున్న అనేక జతల బూట్లు, రకరకాల చేతికర్రలు, ఆయన పుస్తకాలు, ఆయన కళ్ళజోళ్ళ జతలు, ఆ వివిధ రకాల సేకరణ. వాటిని చూచినప్పుడల్లా నాకు అప్పుడు కలిగిన బాధ ఇప్పుడు అక్షరాలకు అందదు. ఇంట్లో అందరికన్నా చిన్నవాడిని కావడంతో నేను నాన్న గురించి అంత ఎక్కువగా ఆలోచించి చింతించే సమయం నా వద్ద ఉండింది. కానీ ఇంట్లో ఉన్న మిగతా పెద్దలకు ఇకపై మా కుటుంబానికి రాబోయే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని ఇంటిని ఎలా నడపాలా అనే సమస్యని పరిష్కరించడంలో తలమునకలుగా ఉన్నారు. నాన్న ఇక లేరు అనే ఒక లోటు మాటే కానీ దానివల్ల నా దైనందిన జీవన విధానం పెద్దగా మారింది లేదు. ఉదయం పాఠశాలకు హాజరు పలకడం, సాయంత్రం హెచ్.కె.తో కలిసి తిరగడం, కలిసి ఆడుకోడం, చదువుకోవడం, పరీక్షలకు హాజరవడం, ఫలితాలు రావడం, సంవత్సరం తరువాత సంవత్సరం పెద్ద తరగతులకు మారడం.

(ఇంకా ఉంది)


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...