ఏక్ టాంగ్- సత్రేనీ- ముల్లముట్టి-నల్లంగోడ


రేఖాయాత్ర ప్రచురణ

చదవడం కొంచెం తెలుసు, గీయడం వచ్చిందని ఎన్నడూ భ్రమించింది లేదు. నాకు గీయడం తెలుసునని గట్టిగా నమ్మిన కొంతమంది ఈ ప్రపంచంలో బ్రతకడానికి చేతికో భుక్తి కల్పించారు. వ్రాయడం వచ్చని మాత్రం ఎన్నడూ అనుకున్నది లేనే లేదు. తెలిసినదల్లా ఏక్ టాంగ్-సత్రేనీ-ముల్లముట్టి-నల్లంగోడ-హైదర్ కోని-ఆర్లెంకి-టెంకి-పెంకి… అని కర్రాబిళ్ళ ఆటలో విజయభాస్కర్ కర్రని కుడి చేతిలో బిగించి పట్టి, ఎడం చేత్తో చిల్లని ఎగిరేసి ఒకే ఒక దెబ్బ వేస్తాడు! నేను ఎప్పుడూ చిల్లా కర్రా ఆడలేదు. చిల్లా కర్రా అనే కాదు, ఆటలు చాలా మటుకు చూడటమే నా పని. మా భాస్కర్‌గాడు, చేతిని బారుగా వెనక్కి చాపి మనిషి దాదాపు భూమ్యాకర్షణ శక్తికి లొంగిపోయినట్టు పోయి తటాలున లేచి ఆ కర్రని విసిరే పద్దతి ఉంది చూశారు! అలా కర్ర దెబ్బ తగిలి పైకి దూసుకుపోయిన చిల్ల ఆకాశం స్పర్శ తగిలి, శాపవిమోచనం కలిగి, పిట్టలా మారి రెక్కలు విప్పుకోడాన్ని చూడగలగడమే దేవుడు నాకు కల్పించిన కన్నుల పని, నా కన్నులలో క్యాచ్ అయిన ఆ పిట్ట విచ్చిన రెక్కల చివర్లనుండి మెరిసే రంగులు, ఫ్రేమ్ బై ఫ్రేమ్ దాని ప్లయింగ్ ఆక్షన్ లోని రేఖా చిత్రణ, పిట్టను చుట్టుముట్టి ఉన్న మేఘాల కాంపోజిషన్… దాన్నంతా కాగితం మీదికీ కలంతోనో, కుంచె నడకతోనో దింపుకోడం నా పని. అందుకనే మరే ఆటని దేవుడు మరి నా అరచేతిలో చిత్రించలేదు.

ఆటల మైదానాల్లో స్కోరర్‌ని నేను. ఆటతో పాటు జీవితాన్ని రికార్ద్ చేయడం నా పని. ఇప్పుడు ఈ పుస్తకానికి ఒక ‘ముందు మాట’ అంటూ చెప్పాలి కాబట్టి–ఎందుకు ఈ రాతలు ఇప్పుడు? ఇలాగని? నా ఎదురుగా నిలబడి నన్ను నేనే ప్రశ్నించుకున్నా! లేదా మీరెవరైనా అడిగినా సరే, పెదాలు బిగించుకుని మోకాళ్ళ మీద కూచుని జుట్టు కళ్ళమీదికి జారుతుంటే చేత్తో తోసుకుంటూ, చాలా చిన్నవాడిగా, ఇంటా బయటా గోడల మీద బొగ్గుతో నల్లబొమ్మలు గీసే నేనే నాకు కనబడతా. కొంచెం పెద్దవాడిగా పెరిగి ఇంటి దీవార్ వైశాల్యం చాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ గోడల కాన్వాస్‌పై చేరి రెడ్ ఆక్సైడ్‌తో లెనిన్ బొమ్మ గీసినపుడు ఎనిమిదో తరగతి చదివే ఎద్దునయ్యా. అప్పుడు నా పలక, ఆ గోడ, ఫ్రెండ్స్ నోటు పుస్తకంలోని పేజీలు… అన్నీ నావిగా ఉండేవి. ఇప్పుడింకా చాలా జీవితాన్ని దాటుకుంటూ దేనికో ఒక తెలీని దానికోసం పరిగెడుతున్నానా! లేదా పరిగెడుతున్నాననుకుంటూ అలా నిలబడిపోయి శూన్యంగా చూస్తున్నానా? గోడ మీది బొగ్గు బొమ్మ నా నుంచి జారిపోయి, కథల కవితల మధ్య నిలబడింది. రూపాయి నోటు మధ్య అల్లికలోకి అల్లుకోడానికి ఒక చేతకాని ప్రాకడానికి చూస్తుంది. నేను నాతో మాట్లాడుకోడానికి కేవలం బొమ్మ ఒకటే కాక ఇంకేదో అవసరం అయ్యింది. అవే ఇవి. మీరు చదువుతున్న ఈ పుస్తకంలో రాసినదంతా ఏదో ఒకటి వ్రాద్దామని రాసినవి కావు, వ్రాయలేక ఉండలేక వ్రాసినవే.

నా పిడికెడంత గుండె చుట్టూ తిరుగుతున్న ఒక సీతాకోకచిలుక రంగుల రెక్కల చప్పుడు ఈ రాతలు. నాకు మాత్రమే వినపడేది అనుకున్న ఈ నిశబ్ద చప్పుడ్ని, అంతే నిశ్శబ్దంగా కొంతమంది విన్నారు. ఓ మంచి మధ్యాహ్నం బాపుగారు ఇలా అడిగారు కదా. ‘ఏవండి నా బొమ్మలతో ఒక పెద్ద కాఫీ టేబుల్ బుక్ తెస్తున్నారు. అందులో మీరు ముందు మాట వ్రాయాలని కోరిక’ అని వెళ్ళబుచ్చినపుడు నిజ్జంగా గుండెంతా కరిగి కన్నీరయింది. నా సీతాకోకచిలుక రంగులు సిగ్గెక్కి ఇంకొంచెం ఎరుపెక్కి ఈ వేళ్ళకు ఇలాకూడా సంతోషపడొచ్చని తెలిసింది. నలుగురే కానీ అయిదుగురే కానీ నేను వ్రాసుకున్న ప్రతి చిన్న వాక్యం తమ భాగ్యం అనుకునేంత ప్రేమించే జనం కొంచెం కొంచెం, ఇంకొంచెం, మరికొంచెం ఆపకుండా వ్రాయొచ్చుగా అనడం మొదలుపెట్టారు ముఖ్యంగా ఆ రంగుపూల దారం వంతెన పైనుండి నడిచొచ్చిన ఆ కళ్ళద్దాల అమ్మాయి అయితే నన్ను క్షమించి కేవలం నా వాక్యం కోసం నన్ను ప్రేమిస్తూ ఉండిపోయింది. నా పుస్తకం కోసం ఆ చేతులు జాపి అలా నిలబడే ఉంది.

మా ఇంటి పక్క మూతపడ్డ బావి గట్టున మొలిచిన చెట్టు నీడక్రింద అప్పుడెప్పుడో పాతిన ట్రంకు పెట్టిని మళ్ళీ తెరుస్తున్నా. ఆ రేకు పెట్టిలో నేను దాచుకున్న నా బొమ్మల పుస్తకాలు, నేను చదువుకున్న కథల పుస్తకాలు, నా నల్ల రేనాల్డ్స్ పెన్ను, ఆ పెన్నుతో గీసుకున్న బొమ్మలు, కాటన్ మార్కెట్ చెట్టు నీడల క్రింద కూచుని తెరిచిన నోటు పుస్తకంలో తరగతి పాఠాలని అరచేత్తో తోసేసి, నా కాళ్ళపైకి పాకే గండుచీమలని బొమ్మలుగా ఆహ్వానించుకున్న పేజీలు. లెదర్ బంతి ఎరుపు తగిలి గాల్లోకి ఎగిరిన బెయిల్సుల కులాసా నా రూల్డ్ నోట్‌బుక్ బౌండరీలో బందీగా ప్రీజ్ అయిన క్షణాలు, ఆటల్లో పొద్దువాల్చిన పాలిటెక్నిక్ కాలేజీ గులకరాయి పసుపు మైదానపు వర్ణాన్ని, అరచేతుల్లో గిర్రున తిరిగే ఐడిఎం బ్యాటు హేండిల్ నీలంరంగు గ్రిప్పురంగుని, నూనేపల్లె రోడ్దుల మీద సిగరెట్ ప్యాకెట్ల నిధిని, పాలీష్ బండల ఫ్యాక్టరీకి బయట విష్ణు చక్రంకన్నా పస్ట్ క్లాస్‌గా గిర్రున తిరిగే బెచ్చెల పెన్నిధిని, గవుర్నమెంట్ హాస్పిటల్ వెనుక రబ్బరు మూతల చక్రాల సౌభాగ్యాన్ని, కుందూ నది ఈతల్లో ఆ మునగ బెండ్ల జతగాడిని, శివాలయం ఎదురుగా గోనెపట్టాలపై పవళించి విన్న బుర్ర కథా, హరికథలను, సువర్ణష్టీవి, నాడీ ఝంగుడు జీమూతవాహనుడి సాంగత్యాలని దాచుకున్న ఒక చిత్రకారుడి కథ ఇది. గడిచిన కథ, నడిచిన కథ, నడుస్తున్న కథ. అలా అలా వ్రాసుకున్న ఓ రెండు వందలకు పైగా రాతల్లోంచి చేతికి అందిన గుప్పెడు ఈ పుస్తకంలో పరిచా. చూద్దాం మళ్ళీ అన్నీ అనుకూలంగా సమకూరితే మరోసారి ఈ అక్షరాల ఆకాశంపై బొమ్మల నక్షత్రాలు పొదిగి మళ్ళీ మీ ముందుకు రానా ఏం?

వివరాలు: అనగనగా ఒక చిత్రకారుడు. రచయిత: అన్వర్, రేఖాయాత్ర ప్రచురణ, పే. 264, పుస్తకం ధర రూ. 275/-, పుస్తకానికై సంప్రదించవలసిన వాట్సాప్ నెంబర్ (+91) 93472 34086.

అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...