మార్చి నెల ఎనిమిదవ తేదీన దామెర్ల రామారావుగారి 125వ జయంతి. ఆయన 28సంవత్సరాల చిన్న వయసులోనే అకాల మరణం చెందారు. బ్రతుకు గైర్హాజరులో ఈ నూటా పాతికకు ముందు, ఏభయ్, డెబ్భై అయిదు, నూరు సంవత్సరాల జయంతులు కూడా పూర్తి అయిపోయాయి. ఆయన తాలూకు నూటపాతిక సంవత్సరాల వయసులో మూడింట దాదాపు ఒక వంతు వయసు అటుగా నాదిప్పుడు. నా చిన్నతనంలో మా తండ్రిగారో, చిన్నాయనలో నన్ను కూర్చోపెట్టుకుని ‘బాబూ, నీకు బొమ్మలంటే ఇష్టం కదా! ఇదిగో, ఈయన దామెర్ల రామారావుగారని చాలా గొప్ప చిత్రకారులు. నీలా బొమ్మలేసేవాళ్ళు రోజూ ఈయన పటం ముందు నిలబడి దండం పెట్టుకుంటే ఆయన ఆశీస్సులు అంది నీవు కాస్త మంచి ఆర్టిస్టువు అవుతావు’ అని ఎవరూ చెప్పలేదు. కాస్త పెద్దయ్యి, హైస్కూల్‌లో చేరాకా మా డ్రాయింగు సారు కూడా దామెర్ల రామారావు పేరు పలికి ఆయనకు దండం పెట్టించడం అటుంచి, ఆసలు డ్రాయింగే మాకు నేర్పలేదు. ఒక మనిషి జీవితంలో దాదాపు పాతిక సంవత్సరాల వరకు చదువులో గడుస్తుందంటే– ఆ కాలంలో నాకు ఎక్కడా దేశం గర్వించదగ్గ చిత్రకారుడు దామెర్ల రామారావని అంటామే! ఆ మనిషి గురించి, నేను పుట్టి పెరిగిన ఇల్లు గాని, చదువులు నేర్పిన బడులు గాని, కలిసి నడిచిన స్నేహాలు గానీ పరిచయం చేయలేదు. అదీ పోనీలే… బ్రతుకుతెరువు రీత్యా ఒక చిత్రకారుణ్ణి అయిన తరువాత బొమ్మలు వేసే సర్కిల్ ఒకటి పరిచయం అవుతుంది కదా, అక్కడా అదే వరస! ‘నా జీతం ఇంత, నీ జీతమెంతా? నా బొమ్మకు ఇంత పుచ్చుకుంటా, నీ బొమ్మకు ఎంత అడుక్కుంటావ్?’ అనే గుమాస్తా లెక్కల చిట్టా తప్పా దామెర్ల రామారావు, వరదా వెంకటరత్నం, వి. ఆర్. చిత్ర, పొట్లూరి హనుమంతరావు వంటి పేర్లు వినపడ్డవి కావు, వారి కీర్తి అందిందీ కాదు.
అటు సాధారణ సంసార జనానికీ అందక, ఇటు బొమ్మల బ్రతుకు తలమునకలైనవారికీ తలవడం తెలీక ‘ఈ మహానుభావుడు, గొప్ప చిత్రకారుడు దామెర్ల రామారావు ఇరవై ఎనిమిదేళ్ళ చిన్న వయసులోనే కాలం చెందారు గానీ, ఆయన కనక పూర్ణాయుష్కులు అయి ఉంటే…’ అని కొందరు పెద్దమనుషులు సభా సంప్రదాయాలననుసరించి ఊపిరి పొడుగ్గా వదులుతారు గానీ పూర్ణాయుష్కులు అయి ఉంటే మాత్రం ఏమవుతుంది? ఆయన చిత్రించిన వందల సంఖ్యల బొమ్మల చెంత పక్కన మరిన్ని సున్నాలు చేరి ఉండేవి. తన చిత్రకళా ప్రపంచంలో ఆయన మరింత కృషి కొనసాగించి ఉండేవారు. అయితే మాత్రం? కళా ప్రపంచంలోని వారు ఎంత కృషి చేసినా ఆ బొమ్మల భాష చూపడానికి మన పిల్లల చేతులు పట్టుకుని ఆర్ట్ గ్యాలరీల వైపు అడుగులు వేసే సంస్కారం మన కుటుంబాలది కాదు. విద్యార్థుల బుర్రల్లో ఆ కళాకారుల గురించి, వారి కళాసృష్టి గురించీ జ్ఞానబీజాలు నాటే సంస్కృతి మన బడులది కాదు.
(ఇక్కడో చిట్టి సవరణ పంచుకుంటాను. కొన్నేళ్ళ క్రితపు ముచ్చట. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వెంకట నరసమ్మగారని ఒక అమ్మ ఉండేవారు, భర్త కాలం చేశారు, ఈవిడ కడు బీదరాలు, పిల్లలు చిన్నవాళ్ళు, బ్రతుకు బండి లాగాలి, పిల్లలను బడికి పంపి చదువులు చెప్పించాలి. నరసమ్మగారు చదువుకోలేదు కాబట్టి నెలకింతని జీతం రాలే ఉద్యోగం రాదు. పళ్ళు అమ్ముకుని బ్రతకడం, పిల్లలని బ్రతికించుకోడం అనేది ఆవిడ జీవితం అయ్యింది. ఆవిడ పిల్లల్లో ఒక పిల్లవాడికి చిన్నతనం నుండే చిత్రకళ అంటే ప్రాణిష్టం. అసలే కష్టాలలో ఉన్నాము. ఇంకాస్త కష్టపడి చదువుకుని ఏ కలెక్టరో లేదా అబ్దుల్ కలామో అవుతానని ఆశలు పెట్టుకుంటే, నువ్వు మాత్రం బొమ్మలు వేస్తానంటావా బొమ్మలు అని పళ్ళు రాల్చిన కొమ్మ పట్టుకుని పిల్లాడి వీపు చీరేయ్యలేదు ఆ తల్లి, పని మీద బజారు వెళ్ళినపుడో, అక్కడా ఇక్కడా అంగట్లో కూచున్నప్పుడో, గాలికి ఎగిరి వచ్చి దొరికిందో, కాలికింద నలగబోతూ చిక్కిందో ఏదయినా కానీ! గీసిన బొమ్మలు గల కాగితం ఆ తల్లికంట పడితే ఆవిడ దానిని భద్రంగా దాచుకుని ఇంటికి వచ్చాకా పిల్లవాడికి ఇచ్చేది ‘నాన్నా చూడు ఎంత బావుందో బొమ్మ! నువ్వు ఇంత గొప్ప బొమ్మలు గీసేవాడివి కావాలి’ అని. ఆ బొమ్మలని కళ్ళ నిండుగా దిద్దుకుని చివరకి ఆ పిల్లవాడు ఆ బొమ్మల వారందరిని మించి, తెలుగులో గొప్ప చిత్రకారులలో ఒకరయ్యారు. ఆయన పేరు కడలి సురేష్.)
దామెర్ల రామారావు గురించి వెతికితే ఆయన జనన మరణాలు, విద్యాభ్యాస సమాచారం సంవత్సరానికి 365 రోజులు వికీపీడియాలో మీకు దొరక్కపోదు. అదికాదు కదా మనకిప్పుడు కావలసినది! ఎవరు చూస్తున్నారని, చూడబోతున్నారని గాని, ఏ కీర్తి కీరిటపు బరువు నీడలో కాలాన్ని వెళ్ళబుచ్చుదామని వంటి ఆలోచన లేని ఒకలాంటి మానవులు ఉంటారు. ఉత్తమ జాతి మానవులు వారు. ఉత్తమోత్తమమైనది వారి సృజన. సర్వవిద్యలకు రెండు దశలుంటాయి. ఒకటి రసాత్మకమైనది. రెండవది వినోదమైనది. సినిమాల పేరిట, షోల పేరిట టీవీల నిండా, మొబైల్ ఫోన్ల నిండా దొరుకుతున్నది రెండవదే. మనిషిలో కామ క్రోధ లోభ మోహాలనీ బలవంతాన మరీ బయటకు తీసి ఊ అంటావా ఊఊ అంటావా అని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నవవే. ఈ శబ్దాలతో ఊపిరందక ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ మనిషి మనసుకూ దృగ్గోచరం కాని కళ్ళు, చెవులు వంటి జ్ఞానేంద్రియాలు ఉంటాయి. దానికి కావలసినదల్లా కాసింత సాంత్వన. గొప్ప సంగీతం వినడం, గొప్ప బొమ్మ చూడ్డం, గొప్ప రచన చదవడం వల్ల కనపడని మనస్సుకు ఆ సాంత్వన కలుగుతుంది.
చిత్రించిన ప్రతీది గొప్ప బొమ్మా కాదు, చిత్రించే ప్రతీవాడూ గొప్ప చిత్రకారుడు కాలేడు. కేవలం దామెర్ల రామారావు వంటి కొందరు చేసిన పని ఉంటుంది. అది కాలానికి కట్టుపడనిది, మనిషి మనసుకు శాంతినివ్వడానికి ఇవ్వబడినది. మనిషి ఎల్లకాలం ఉండడు. గొప్ప కళ ఎప్పటికీ ఉంటుంది. ఆ కళ తనున్నంత కాలం తన సరసన ఆ మనిషి పేరును నిలిపి పెడుతుంది. ఆవకాయ ఎలా ఆవకాయ కోసం కాదో, కళ అనేది కూడా తన కోసం తాను కాదు. మనలాంటి వారి కోసం. మనం కళలకు ఏం చేయగలిగినవాళ్ళం కాదు, కానీ క్లాసిక్ కళ మాత్రం మనకు చాలా చెయ్యగలదు. చలం గారి ‘యోగ్యతా పత్రం’లో ‘ఏమిటి వొంతెన మీద నుంచుని చూస్తున్నావు?’ అని ప్రశ్న ఉంటుంది. ‘సంధ్య కేసి’ అంటారు ఆయన. అడగవలసిన ప్రశ్న కాదది. అట్లా చూసేవాడిని చూడనివ్వాలి. మనమందరమూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒకవేపు అలా చూస్తూ నిలబడ్డవాళ్ళమే. ఆ సమయాన సంధ్య లోనో, అరుణోదయం లోనో, పారుతున్న ఏరు మెరుపు లోనో, మనం ఏం చూశామో, ఏం పొందామో, దానిని ప్రతిసారి ఇవ్వగలిగినది మాత్రమే గొప్ప కళ. అది దామెర్ల వారి బొమ్మలో ఉన్నది, అస్వాల్డ్ గుయాసమీన్ బొమ్మలో ఉన్నది, బిస్మిల్లా ఖాన్ షెహనాయిలో, భూపేన్ హజారికా గొంతులో ఉన్నది. మనవంటి వారి మనసుల్లో శాంతి నింపడం కోసమే… నూటా పాతిక కాదు, ఎన్ని వందల పాతిక జయంతులయినా జరుపుకుంటూ రామారావుగారూ ఆయన బొమ్మలూ ఉంటాయి. ఆ వేపుకు కాస్త అడుగు వేసి చూడండి. అది మాత్రం మీ కోసం మీరు చేసుకోగలిగినది.