చదువు అనే ఆరోవేలు

చదువు నన్ను ఎట్లా కుట్టిందో మాటల్లో చెప్పుకోవాలి అంటే ఇట్లా అని ఏమీ చెప్పలేను. అది నాకు పుట్టుకతో అబ్బింది అంతే. అంటే పుట్టీ పుట్టంగానే ‘ఆ ఆ ఇ ఈ- ఏ బి సి డి’లు రావడం, తెలవడం అని కాదు. ఊహ తెలిసినప్పటినుండి చదువుకోడం చాలా బావుండేది నాకు. అనాయాసంగా ఉండే పని ఎవరికయినా బానే ఉంటుంది కదా! చదువు నా మనసుకు హాయి, అత్యంత అనాయాసమన్నమాట. తెలుగు చదువు నేర్చుకోవడానికి నేను ఎట్లా పరిశ్రమ చేశానో, ఏమి సాధన చేశానో, పలకపై ఎంత రుద్దుడులు పోయానో నాకసలు జ్ఞాపకాల ఆనవాలే లేదు. నిదురించే కనులలోనికి కల ఎట్లా వస్తుందో తెలుగు చదవడం అట్లా నా మెలకువలోకి వచ్చేసింది. చదువు నన్ను తెలుసుకున్న నాటినుండి నాకు తెలియకుండానే నా కళ్ళు పుస్తకాల కోసం వెంపర్లాడుతూ ఉండేవి. ఇంటి చదువులో నేను పెద్దబాలశిక్ష పాదాల దగ్గర ఓంప్రథమం దండం పెట్టుకున్నాను. శ్రీవాణి కిండర్ గార్డెన్ అనేది నా మొదటి వీధిబడి. నాగన్నగారు నా తొలి ఉపాధ్యాయుడు. ఆయన దగ్గర నేను నాలుగవతరగతి వరకు చదువుకున్నాను. నాకు ఇప్పటికీ తేటగా గుర్తుంది. మా ఇంటి పొరుగునే మరియమ్మ అవ్వ ఇల్లు ఉండేది. ఆ ఇంటిముందు ఒక చింతచెట్టు. దానికింద నేను, అప్పటి మా శ్రీవాణి బడి సహపాఠి ప్రసన్న కూచుని ఉన్నాము. తను నాకోసమని వాళ్ళింట్లో ఉండే పుస్తకం ఒకటి పట్టుకువచ్చింది. ముందు పేజీలు, వెనుక పేజీలు చిరిగిపోయి ఉన్న పుస్తకమది. పేరు మహాభారతం. పూర్తిస్థాయి చదువు ఉన్న పుస్తకమది. పూర్తిస్థాయి అని ఎందుకు అంటున్నానంటే ఆ నా వయసుకు మా బడిపుస్తకాల్లోను, నాకు పరిచయం అయిన పుస్తకాలన్నింటిలోనూ అక్షరాల రాత, బొమ్మల గీత తప్పక ఉండేవి. అలా కాకుండా మొత్తం అక్షరాలే, చీమల్లా పాకుతున్న అక్షరాలని వరసలుగా, బారులుగా, అక్షౌహిణిలుగా చూడటం అదే మొదలు. అంత గుంపు నల్లచీమల అక్షర సమూహము వెంటకూడా అదే నా పెద్ద ప్రయాణం మొదలు.

మేడమీదికి ఎక్కడానికి ఒకటి రెండు మూడు నాలుగు అనే మెట్ల ఆధారంగా ఎక్కడం మాదిరి గ్రామర్ నడక కబుర్లు నేను నడవలేను. అందుకని కొన్ని జ్ఞాపకాల తుంపులను జేబులోనుంచి తీసి మీతో పంచుకుంటా. అప్పచ్చిల మాదిరి నములుకుంటూ మా ఊరు నూనెపల్లె నీళ్ళట్యాంక్ నుండి నడక మొదలుకుని ఇష్టం వచ్చినట్టుగా చక్కర్లు తిరుగుదాం. ఆసక్తి ఉన్నవాళ్ళు నాతో కూడా రండి.

మా ఇంటి పక్కన ఉండే యాస్మిన్ అక్క (చిన్నప్పుడు అలా పిలవడం చేతకాక యాపిల్ అక్కా అనేవాళ్ళం. సుహాసినిలా ఉండేది. ఆంధ్రజ్యోతి పత్రిక కవర్ మీద సుహాసిని ఫోటో చూపించి ఈ అమ్మాయి ఎవరిలా ఉంది చెప్పు అని అడిగేది) తను బాగా పెద్ద చదువులు చదువుకుని ఆపై ఇక ఏం తోచక చుట్టుపక్కల పిల్లలని పోగుచేసి ట్యూషన్ నడిపేది. నన్నూ అందులో పడేశారు. ఒక ఏడుగంటల సాయంత్రం చిన్నపిల్లాడ్ని నన్నులేపి ఏదో ప్రశ్న అడుగుతుంది అక్క. జీవితంలో ప్రశ్నలు అడిగించుకోడానికే నేను పుట్టానా ఏవిటి? జవాబులు మాత్రం చెప్పడానికి. లేచి చేతులు కట్టుకుని అలా ఊరికే నిలబడి ఉన్నా. మా సలీం చిన్నాయన అలా పోతూ పోతూ నన్ను చూసి ఆగిపోయి “వాడికి ఎక్కాలు, ఉత్తర దక్షిణ దిక్కులు, మహా సముద్రాలు ఎన్ని, హిందూకుష్ పర్వతాలు భారతదేశానికి ఏవైపున ఉన్నాయి వంటివి అడిగితే ఏం తెలుస్తాయి? ఒక భేతాళ కథ అడగండి గడగడా చెప్పేస్తాడు” అని పరిహాసంగా నవ్వాడు. నాకు భలే అవమానం అనిపించింది.

ఇల్లు అన్నాక, ఇంట్లో పిల్లలు అన్నాక, ఆ పిల్లలు అన్నాదమ్ములు అయి ఉండినాక, అటువంటి అన్నాదమ్ముల మధ్య లెక్కలేనన్ని తగవులు ఉంటాయి. నా చిన్నతనాన మా అన్న నాపాలిటి విలన్. నన్ను బెదిరించడం మా అన్నకు మహా తేలిక. “ఉండు చందమామ పుస్తకం చదివినావని ఇంట్లో చెబుతా” అనేవాడు. ఆ బెదిరింపు వినగానే దుఃఖం కట్టలు తెంచుకుని బయటపడేది. చందమామ చదివిన విషయం తెలిస్తే దంచుతారు ఇంట్లో. మా ఇంట్లో పుస్తకాలు అంటే పాఠ్యపుస్తకాలు మాత్రమే! అంతకు మించి మరి ఏ పుస్తకమైనా ముట్టామా ఇక తన్నుడు. తన్నుడు అని అభాండం మొత్తం వారిపై వేయడం సరికాదు కాని, కథాసాహిత్యం చేతిలో ఉంటే బడి పుస్తకాల కేసి అసలు చూసేవాడినే కాదు నేను. నేరం నాది కాదు. పాఠాలని కథల్లా కమ్మగా తయారుచేయలేకపోయిన ఆ విద్యావేత్తలది.

సులువు పుస్తకాలు లేని బాల్యం మాది. చదివిన కథల్లో లైబ్రరీ అనే పుస్తకాల ఇల్లనేది ఒకటి ఉంటుంది అని తెలుసుకుని మా నూనెపల్లిలో అదెక్కడ ఉందా అని పిచ్చివాడిలా దిక్కు దిక్కునా ఊరి దిక్కులు చూసేవాణ్ణి. నాకు తెలిసి మా నూనెపల్లెకి లైబ్రరీనే లేదు. ఉన్నా గిన్నా ఖచ్చితంగా అందులో అడుగుపెట్టే దమ్ము చాలదు. చెప్పాగా! బడి పుస్తకాలు తప్పా మరే బుక్కు ముట్టినా మా చిన్నాయనలు చెమ్డాలూడదీస్తారు. చిన్నాయనల దాక ఎందుకు. బయట టీ బంకు దగ్గర కూచుని కాస్త అక్కడి పేపరు చదువుదామని అలా పట్టుకుంటామో లేదో పెద్ద శరీరాలవాళ్ళు వచ్చి ములాజ లేకుండా పేపరు లాక్కునేవాళ్ళు, ‘ఇంత లేవు నీకెందుకురా పేపరు, ఇంటికి పోయి పాఠాలు చదువుకో పో?’ అని అరిచేవాళ్ళు. అదీకాక మా ఇంటి దగ్గర ఒక పిచ్చాయన ఉండేవాడు, ఎప్పుడు చూసినా ఆయన చంకలో పేపరో, పెద్ద పుస్తకమో ఉండేది. గడగడా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. నేను ఏకథల పుస్తకమో తెచ్చుకుని చదువుతూ దొరికిపోయినపుడల్లా మా ఇంట్లోని ఆడవాళ్ళు ఆ పిచ్చాయనని గుర్తు తెచ్చుకుని రాబోయే రోజుల్లో నా గతి అలానే అయిపోతుందేమోనని కళ్ళనిండా నీళ్ళు పెట్టుకునేవారు.

వెంకటరాముడని నా ఫ్రెండ్ ఒకడు, వాడి ఇల్లు మా ఇంటిదగ్గరే. వాళ్ళ నాయన పాలకేంద్రంలో పని చేసేవాడు. మా ఇంట్లో పుస్తకాలు చదవడం కుదరదని అస్తమానూ వాళ్ళింట్లో నట్టింటి గుంజను ఆనుకుని పుస్తకాలు తెగ చదివేవాణ్ణి. మరే ఇతరుల ఇళ్ళల్లో కాక ఎందుకని వాళ్ళ ఇంట్లోనే పుస్తకాలు చదివేవాడినో నాకు ఇప్పటికీ తెలీదు. వెంకటరాముడు కుటుంబం మా మరోమిత్రుడు తిరుమలరావు ఇంట్లో అద్దెకు ఉండేది. వెంకటరాముడు ఇంటి పక్కనే సాయిలీల అత్త, వెంకన్న మామ ఉండేవారు. వాళ్ళ అబ్బాయే శీనుబావ. ఆయన మా అందరికి సూపర్ సీనియర్. మేము హైస్కూల్‌లో కొత్తగా చేరిన రోజుల్లోనే అప్పటికే ఆయన డిగ్రీ చదువు చదివేవాడు. వాళ్ళది పాలవ్యాపారం. ఆదివారాలు ఆయన బర్రెలను తోలుకోని రైతునగరం వైపు వెళ్ళేవాడు, ఆయనతో పాటే మేమూనూ. ఆయన విపరీతమైన చదువరి. వచ్చిన ప్రతి పత్రిక, ప్రతి నవలా చదివేవాడు. పశువుల్ని తోలుకు పోతూ పోతూ తన వెంట బోలెడన్ని పుస్తకాలు పట్టుకుపోయేవాడు. ఊరికి దూరాన, ఆ పచ్చని పచ్చికలో ఆయన వెంట, బర్రెల వెంట వెళ్ళి ఎన్ని పుస్తకాలని నమిలిమింగేశామో మేము.

హైస్కూలు చేరినప్పుడు మా హెడ్మాస్టర్ హనీఫ్ సార్ గదిలో వెనుక వేపున ఒక చెక్క బీరువాలో లక్ష కోట్ల పుస్తకాలు ఉన్నాయనీ దాని బీగం చేతులు మగ్బుల్ అనే క్లర్క్ గుప్పెట్లో ఉంటాయని కనిపెట్టా. పిల్లల కోసం గవుర్నమెంట్ పంపిన పుస్తకాలవి. పిల్లలకు మాత్రం అందనిచ్చేవారు కాదు. ఆ మగ్బుల్ సార్‌ని ఎప్పుడు పుస్తకాలు అడిగినా ‘కైకురే’ అని విసుక్కునేవాడు. ఇక ఇలాకాదని అప్పుడప్పుడూ చాక్ పీసుల కోసమో, అటెండెన్స్ రిజిస్టర్ కోసమో మరి దేనికోసమో ఆ గదిలోకి దూరి, ముందు పుస్తకాల బీరువాని రెండు చేతులతో పట్టుకుని బలం కొద్ది ఊపేవాడిని. పుస్తకాలు అడుగుకు రాలతాయి. అప్పుడు చేయి ఒక దానితో చెక్క బీరువా తలుపు అడుగు గుంజిపట్టి మరోచేత్తో తడిమితే తగిలినన్ని పుస్తకాలు లాగేవాణ్ణి. కాస్త మందం ఎక్కువ పుస్తకాలు ఎప్పటికీ చేతికి రావు. పలుచని బీద పేజీల సన్న బుక్కులు మాత్రం అందేవి. అట్లా బీరువా అడుగు నుంచి దడదడలాడుతున్న గుండెలతో ఆ పుస్తకాల్ని పొట్టకు నిక్కరుకు మధ్య దోపుకునేవాణ్ణి. తలుపుసందు కరిచిన చేయిమాత్రం తోలు జివురుకు పోయి తెగ మంట లేచేది. దొంగతనం చేస్తే కళ్ళు పోతాయి అంటారు కానీ పుస్తకాలు దొంగతనం చేశానని కళ్ళు మాత్రం ఎప్పుడు పోలేదు. సరస్వతి తల్లి నిజంగా ఉంది.

ఇంతోటి కఠినమయిన నా పుస్తకాల ఎండమావి జీవితంలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి అంటే ఒకటి జ్వరం, రెండోది ప్రయాణాలు నా బ్రతుక్కు గొప్ప లగ్జరీలు. జ్వరం తగిలి ఒళ్ళు కాస్త వెచ్చబడిందా పువ్వులా చూసుకునేవాళ్ళు ఇంట్లో జేజీ, పిన్నమ్మలు. వాళ్ళు చెప్పిన మందులు, మాత్తర్లు వేసుకోవాలంటే రైలుకట్ట పక్కన కుక్కలయ్య హోటల్ దోశ, బాలమిత్ర పుస్తకం ఈ రెండు నాకు లంచాలుగా ఇవ్వాలి. ఆ సమయంలో ఏమి అడిగినా కిక్కురుమనకుండా తెచ్చిపెట్టేవాళ్ళు. మేము చాలా తరుచుగా బంధువుల ఊళ్ళు, పుణ్యతీర్థాలు తిరిగేవాళ్ళం, ఊరికి బయలుదేరదీసినపుడల్లా నా చేతిలో అర్దో, రూపాయో పెట్టేవారు. ఆ మామని ఈ మామని బతిమాలో, బంగపోయో మరో రెండు రూపాయలు సంపాదించుకుని వచ్చే పోయే బస్సుల మధ్యనుండి బాహుకుడిలా పరిగెత్తుకుంటూ మా నంద్యాల బస్టాండ్ మూలలోని పుస్తకాల షాపు వేపు పరిగెత్తేవాడిని. వెనుకనుండి మా జేజి “జత్తన్ బేటా” అని కేక వేసేది. పుచ్చుకున్న ఏ పుస్తకమూ నా చేతిలో అరగంటను మించి నలిగేది కాదు. బహు స్పీడ్‌గా చదివేసేవాణ్ణి. నేను పెద్దయి పెళ్ళాడాకా, ఒక పిల్లవాడు పుట్టాకా వాడు పుస్తకాలు చదివే నన్ను గమనించేవాడు. పుస్తకాల పంక్తుల వెంట వేగంగా అటూ ఇటూ తిరిగే నా కనుగుడ్లు ఏమిటో వాడికి అర్థంకాక వాడిని ఊడబెరుక్కుందామని ప్రయత్నించేవాడు. అదే పిల్లవాడు కాస్త పెద్దయ్యాక, వాడికి నోరొచ్చాకా నే పుస్తకాల పేజీలని నాలుకతో తడిచేస్తూ తిరగేస్తూ చదువుతూ ఉంటే “ఎందుకబ్బా! పుస్తకాలని అలా నాకుతూ చదువుతావు” అని అమాయకంగా అడిగేవాడు.

మా నంద్యాల బస్టాండ్‌లో పుస్తకాల షాపులు ఒకటో రెండో అయితే, కర్నూలు పాత బస్టాండ్‌లో మూడో నాలుగో పుస్తకాల షాపులు ఉండేవని గుర్తు నాకు. ఆ పాత బస్టాండ్ దగ్గరే ఉండే పుల్లారెడ్డి మిఠాయిలలో ఎన్నడూ తగలని రుచి ‘బాలభారతి పబ్లికేషన్’ వారి అరచేయంత జానపదగాథల్లో తనున్నా రా రమ్మని ఊరించేది. తరగతి పాఠ్యపుస్తకాల్లో తెలుగు నా అభిమాన విషయం, అందులో కథలు ఉంటాయి కాబట్టి. ఖలీల్ సిద్ధిక్ హైస్కూలులో చేరిన తొలి రోజే ఏడవ తరగతి మొదలుకుని పదవ తరగతి అన్నలందరిని పరిచయం చేసేసుకుని వాళ్ళ తెలుగు వాచకాలు, ఉపవాచకాలు పుస్తకాలన్ని అప్పు తీసుకుని దెబ్బకు చదివి ఇచ్చేశా.

మా ఊరి మంగలిషాపులు నా చిన్న బ్రతుకు పాలిటి పెద్ద గ్రంథాలయాలు. మా ఊళ్ళో ఇసుకా ఇటుకల నాలుగ్గోడలు లేని ఏ షాపునయినా బంకులే అని అంటాము. చెక్కతో చేస్తారు వాటిని. వాటికి రంగులు వేసేవారు కాదు. కాగితాలు కరిపించేవారు. అప్పట్లో మంగలిబంకుల్లో కస్టమర్ల కాలక్షేపం నిమిత్తం సితార, శివరంజని, జ్యోతిచిత్ర తదితర జనరంజక సినిమా పత్రికలన్నింటినీ తెప్పించేవారు. నంద్యాల టవున్లో కాస్త పెద్ద షోకుల సెలూన్‌లలో అయితే స్క్రీన్, సినీ బ్లిట్జ్ ఇత్యాది ఖరీదయిన పత్రికలు కనపడేవి. బీద బంకులవారు పాతబడ్డ సినిమాపత్రికలని మైదా పెట్టి బంకుకు లోపల ఐదువైపులా అతికిస్తారు. బంకు బయట నేడే చూడండి లేదా విజయవంతమయిన నాలుగవవారం తాలూకు సినిమా పోస్టర్లు దిట్టంగా అంటించేస్తారు. బంకులో రేడియో కూడా ఉండేది, తరుచు కొట్టు లోపలో లేదా బయట కానుగ కొమ్మకో తగిలించిన రేడియో ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అని పాటలు పాడేది. క్షవరం చేయించుకోడం అనేది మహా హింస నాకు. కత్తిరించిన జుట్టు సన్న తునకలు మెడ మీద చిర్రు చిర్రుమంటూ గుచ్చుకుంటూ చిరాకు పెట్టేది. అటువంటి ప్రతి కత్తెర సమయాలలో భీష్మ్ పితామహ్‌గారు మతికి వచ్చేవాడు నాకు. ఆయన వీపుకు గుచ్చుకున్న బాణాల మినియేచరేనేమో కదా నా మెడమీద గుచ్చుకున్న ఈ వెండ్రుక ముక్కలు అని తలచేవాణ్ణి. ఆదివారం అనగానే మంగలి బంకు నిండా గిరాకి జాస్తి. మంగలాయన ఒకకంట కత్తెర కిచకిచలాడిస్తూనే మరో కంట వచ్చిన వాడ్ని వచ్చినట్లుగా వరుస చూసుకునేవాడు. నేను నా వంతు వచ్చేవరకు ఆ బంకు గోడల మీద బల్లిలా పాకుతూ ఆ సినిమా సమాచారాల కథలూ గాథలూ అందినకాడికి మొత్తం చదువుకునేవాడిని. క్షవరం దగ్గర నా వంతు వచ్చిందా కుర్చీలో కూచున్నవాడిని అలానే మెడ పొడుగ్గా చాచి ఎదురు గోడమీద అంటించిన కాగితాలు కూడా చదవడానికి శక్తివంచన లేకుండా సాగేవాడ్ని. కత్తెరాయన బలవంతంగా డిప్పని వెనక్కి లాగి నా తలని తన బలంకొద్ది వంచేవాడు. అప్పుడు వంగిన తలలోచి రెండు కనుగుడ్లు పైకి లేపి మళ్ళీ ఒక చదువు కోసం చూసేవాడ్ని. రాన్రానూ అలా చూడటం ఒక అలవాటుగా ఐపోయింది. నా చదువు గోల తెలీని మా ఇంట్లోని పామరులు నావి దొంగ కళ్ళు అని డిసైడయ్యిపోయారు.

వయసూ పెరిగే కొద్ది చదువు ఆకలీ కూడా పెరుగుతూ వచ్చింది నాకు! మొదటిసారిగా మా ఊరికి విశాలాంధ్ర వారి సంచారగ్రంథాలయ బస్సు వచ్చి ఆంజనేయ ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్ ఎదురుగా ఉండే వేపచెట్టు కింద ఆగింది. మా ఊరి కమ్యూనిస్ట్ పెద్దలు మస్తాన్ వలీభాయ్, తోట మద్దులుగారు, లాయర్ శంకరయ్యగారు, శ్రీనివాసమూర్తి సారు వీళ్ళందరూ మా మాబ్బాష చిన్నాయన ఫ్రెండ్స్. బహుశా వారి బలవంతపు అంటగట్టుడు వల్లే అనుకుంటా మా చిన్నాయన ఆ రోజు మధ్యాహ్నం బోలెడు రంగురంగుల పిల్లల పుస్తకాలు పట్టుకొచ్చాడు. కొమ్ముల గొర్రెపిల్ల. మొసలి కాజేసిన సూర్యుడు, భయములేని వీత్య, వెండి గిట్ట, ఇవీనూ కుక్కలే, బుల్లి మట్టి ఇల్లు, టాల్‌స్టాయ్ పిల్లల కథలు… ఇంకా పేర్లు మొత్తం గుర్తు లేవు. ఆ పైన సోవియట్ భూమి పత్రికకి కూడా చందా కట్టాడు ఆయన. ప్రతి నెల మా ఇంటికి సోవియట్ భూమి పత్రిక వచ్చేది. ఆ పత్రిక అందచందాలు, ఆ కాగితపు మందం, ఆ రంగుల సొబగులు చెప్పనలవి కాదు. ఆ పుస్తకాన్ని చూసి నేనూ మా పిన్ని మహదానంద పడిపోయాం. గబాగబా పుస్తకాలని చదివేసి ఆ పుస్తకాలని మధ్య కుట్టు దగ్గర చించేసుకుని ఇంట్లో పిల్లల పుస్తకాలు అన్నిటికి అట్టలు వేసుకునేవాళ్ళము. ప్చ్! ఆ రోజులు భలేవి! మళ్ళీ రమ్మన్నారావు. ఆ పుస్తకాలలో చదువుకున్న కథలకు, చూసిన జానపద సినిమాలలోని సన్నివేశాలని కలిపి కైకుట్టి నేనూ, మా బష్రున్, ముంతాజ్, షేకున్ పిన్నమ్మలు కలిసి నట్టింట్లో నాటకాలు వేసేవాళ్ళం. ఆ నాటకాలలో నేను ఎప్పుడూ రాజకుమారుణ్ణే. మా చిన్నాయనల హాఫ్ స్లాక్ ఒకటి తొడుక్కుని నడుముకు టవల్ కట్టుకుని అందు ఒక కొబ్బరి ఈన దోపుకుని “రాజు వెడలె రవితేజములలరగ, కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగా…” అని ఎక్కడిదో తెలియని ఒక పాట పాడేవాడిని. ఆ నాటకాల్లో మా పిన్నమ్మలు గుర్రాలుగా మారి నన్ను మోసుకుంటూ మా ఇంట్లోని ఊహాజనిత అరణ్యాల్లో తిప్పేవారు, నా కేమెల్ వాటర్ కలర్స్ లోని నల్లట్యూబు పిండి వాళ్ళకు మీసాలు గడ్డాలు పూసేవాణ్ణి. నాకోసం వారు మీసాలు గడ్డాలు మొలిచిన మునులుగా తయారయ్యి కారుభూతాన్ని ఎలా చంపాలో కిటుకు చెప్పేవారు. చివరికి వారే కారుభూతాల్లా వేషాలు మార్చుకుని నా చేతిలోని కొబ్బరి పుల్ల ఖడ్గానికి కూడా బలయ్యేవాళ్ళు. ఎంత మంచి బాల్యాలు. ఎంత మంచి జ్ఞాపకాలు. ఎంత మంచి చిన్నమ్మలు. ఎంత మంచి అమాయకపు చదువు నా చిన్నప్పటిది. ఏ రంగూ ఎరుగని చదువు, ఏ ఇజమూ పూనని చదువు, కుత్తుకపై ఏ భారము ఆనని చదువు, ఏ ద్వేషమూ నేర్పని చదువు ఆ నలుపూ తెలుపు రోజులవి.


నాకు చాలా పెద్దయ్యేవరకు జీవితంలో రెండు వృత్తుల మీదే మోజు. ఒకటి మిలట్రీలో ఉద్యోగం. ఆలివ్ గ్రీన్ కలర్ నాకు భలే ప్రియమైన రంగు. ఆర్మీ యూనిఫామ్ తొడుక్కుని భుజాన షోల్డర్ స్ట్రాప్‌లో టోపీ ఇరికించుకుని పాలీష్ బూట్లు టకటకలాడించుకుంటూ ఠీవీగా దేశమాత సేవ చేస్తూ ఉంటే, ఉంటుంది చూడూ! అనిపించేది. రెండో మోజు – విశాలాంధ్ర పుస్తకాల బస్సులో పుస్తకాలు అమ్ముకోడం. అబ్బా ఆ ఊహే ఎంత బావుంటుంది! అద్దె పుస్తకాలకు బాడుగ కట్టడం కోసం లేని ఆస్తులు అమ్మేయడం నాకు చాలా కష్టమయిన రోజులవి. ఆ పుస్తకాల బస్సులో కూర్చుని హాయిగా పుస్తకాల మీద పుస్తకాలు చదువుకుంటూ ఆ పుస్తకాలు అమ్మేసుకుంటూ, ఆ అమ్ముకోగా వచ్చిన డబ్బుతో ఖుద్దూస్ హోటల్లో (నేను కాస్త పెద్దయ్యేసరికి నాకు ఎంతగానో ఇష్టమయిన కుక్కలయ్య హోటల్ మూతపడింది. మా ఇంటికి దగ్గరలోనే ఖుద్దూస్ హోటల్ వెలిసింది) మసాల దోశ తిని, లాలూభాయ్ దగ్గర హార్లిక్స్ తాగి వచ్చి, మళ్ళీ పుస్తకాలు చదువుకుంటూ, అమ్ముకుంటూ, నిద్ర వచ్చినపుడు ఆ పుస్తకాల మధ్య పరుపువాల్చి, తల కిందికి పుస్తకాలని దిండుగా పెట్టుకుని ముఖేష్ పాటలు వినుకుంటూ నిద్రపోతే. ఆహా!

విశాలాంధ్ర వారి సంచారగ్రంథాలయ బస్సు ఆంజనేయ ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్ ఎదురుగా ఉండే వేపచెట్టు కిందికి వచ్చి ఆగడం దగ్గరినుండి ఎక్కడికో వెళ్ళి వచ్చేశాను కదా. కాలం గడుస్తూ గడుస్తూ ఆ విశాలాంధ్ర బస్సువాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఐపోయారు. ఆ బస్సు సంవత్సరంలో ఎప్పుడు ఏ నెలలలో వచ్చేదీ పోయేదీ మాత్రం నాకు తెలిసేది కాదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్‌లో కూర్చుని పుస్తకాలు చదువుకుంటున్న నన్ను మా శారదా విద్యామందిర్ శ్రీనివాసమూర్తి సార్ అటుగా వచ్చినపుడు కబురు అందించేవాడు “అనంతపురం నుండి విశాలాంధ్రవాళ్ళు వచ్చి ఉండార్రా, ఇందాకనే కనబడినారు, ‘మా సాహితీ బాలుణ్ణి కనపడితే ఇలా రమ్మనండి సార్’ అని చెప్పినారు, పోయిరా పో.” కబురు ముగిసేదాక నేను ఇంకా ఇక్కడే ఎందుకుంటాను? జై వీరహనుమాన్ అని అరుచుకుంటూ ఒక్క ఉరుకున వేపచెట్టు నీడన బస్సులో వాలేవాడిని. నేను వాళ్ళ దగ్గర పెద్దగా పుస్తకాలు కొనేవాడిని కాదు, కొనడానికి డబ్బులు ఎక్కడివని? అలాగే, అక్కడే నిలబడి పుస్తకాలు చదివేవాడిని. నిలబడి చదువు అంటే మరేదో గుర్తుకు వస్తుంది. హైద్రాబాద్ వచ్చిన కొత్తలో రెడ్ హిల్స్‌లో చిత్రకారులు మోహన్‌గారి స్టూడియోకు ప్రతి సాయంత్రము వెళ్ళి కాసేపు అక్కడున్న వారందరి సోది ఆస్వాదించి ఆపై మోహన్‌గారి కుర్చీ వెనుక ఉండే పుస్తకాల గూడు నుండి ఒక పుస్తకం అరువు తీసుకుని నీలోఫర్ హాస్పిటల్ ముందు వీధిలైటు కింద అఫ్జల్ గంజ్‌కు వెళ్ళే బస్సు కోసం వేచి చూస్తూ పుస్తకం చదివేవాడిని. చాలాసార్లు పుస్తకం చదవడం పూర్తి అయ్యేది కాని బస్సు వచ్చేది కాదు. ఈ పుస్తకం అయిపోయిందిగా మళ్ళీ అఫ్జల్ గంజ్ నుండి శంషాబాద్ దాక ప్రయాణపు జీవితాన్ని ఎట్టా ఆదా చెయాలని వెనక్కి మళ్ళీ పరిగెట్టుకు వెళ్ళి మోహన్‌గారి గూట్లో ఇంకో పుస్తకం అరువు తీసుకుని మళ్ళీ బస్ స్టాపు దీపపు స్తంభం వెలుగుకింద… ఇట్లా చెప్పుకుంటా పోతుంటే మరోటి గుర్తుకు తగులుతుంది.

బాగ్ లింగంపల్లిలో ఒక మేడ మీద మోహన్‌గారి ప్రెండ్ రమణమూర్తిగారని ఒకాయనకి ‘గాడిద’ అని పత్రిక తేవాలని ఒక సంకల్పం. ఆ పత్రికలోకి ఆర్టిస్ట్ కమ్ సబ్‌ ఎడిటర్‌గా నన్ను తోలారు. అక్కడ నాకస్సలు పని ఉండేది కాదు. పొడవైన ఖాళీ ఆఫీస్. నేనూ బల్లలూ, నాకు తోడుగా మంజుల్ అని ఇంకో సబెడిటర్ తరువాత వచ్చి చేరారు. నేను అప్పుడప్పుడే కొత్తగా హైద్రాబాద్ వచ్చినవాడ్ని కదా! ఆ అనుభవాలతో ‘హైదరాబాధలు’ అని కతలు వ్రాయడం మొదలెట్టా. రాసీరాసీ వీలయినంత రాసి చదవడానికి నాకే అవీ నీచంగా అనిపించి, వాటిని చించి పోగులు పెట్టి తల తిప్పి అటుచూస్తే మా ఆఫీసుకు ఆనుకునే బాగ్ లింగంపల్లి గ్రంథాలయం ఉంది. అరే భలే! అనుకుని అందులోకి వెళ్ళి మెంబర్‌షిప్ తీసుకున్నా. మొహం ఇంత వెడల్పు చేసుకుని పుస్తకాలని మోహంగా చూసే నన్ను చూసి ఆ లైబ్రేరియన్ మేడంగారు ముచ్చటపడ్డారు, పైగా పొరుగు ఆఫీసు కుర్రాడిని కూడా కదా. ఆవిడ దగ్గర పుస్తకం ఇష్యూ చేయించుకుని గంట అయ్యీ కాంగానే మళ్ళీ మరో పుస్తకానికి తయారు అయ్యేవాడిని. “బాబూ రోజుకు ఒక పుస్తకం మాత్రమే ఇస్తాం, ఇలా ఒకే రోజుకు నాలుగు పుస్తకాలు నువ్వు తీసుకోకూడదు, మేం ఇవ్వకూడదు” అని గట్టిగా చెప్పేశారు. ఆ లైబ్రరీలో మామూలుగా కనబడే శుభ్రమైన పుస్తకాల వరుసలకు వెనుక గుట్టలా పడేసిన పాత పుస్తకాలు చాలా ఉండేవి. అటువైపు ఎవరూ తొంగిచూసేవారు కాదు. మామూలు పుస్తకాలు కావవి. అరవై, డెబ్భైల నాటి లోకభీకర తెలుగు అనువాదాలు. పచ్చి క్లాసిక్స్. చాలామటుకు పాడయిపోయిన పుస్తకాలవి. వాటిని ఇష్యూ చేసేది లేదు. అందుకని పొట్టని అంతా లోనికి గుంజేసుకుని ప్యాంటుకు ముందు రెండు వెనుక రెండు పుస్తకాలు దోపుకునేవాడ్ని. బయటికి మాత్రం సక్రమంగా వెన్ను విరుచుకు వచ్చి లైబ్రేరియన్‌తో ఒక మామూలు పుస్తకం ఇష్యూ చేయించుకునేవాణ్ణి. మరుసటి రోజు వచ్చి మర్యాదక్రమంలో తీసుకున్న పుస్తకాన్ని వాపసు చేసి, కొట్టేసిన పుస్తకాలు మళ్ళీ వెనక్కి పెట్టేసి, మళ్ళీ రెండో మూడో పుస్తకాలు ఎత్తేసి చొక్కా లోనికి దోపేవాణ్ణి. గాడిద పత్రికలో ఒక్క నెల మాత్రమే పని చేశా. అలా ఆ ఒక్క నెలలో చదివిన పుస్తకాలు లెక్కలేనన్ని. ఈలోగా ఒకటో తారీఖు వచ్చిందని గంట కొట్టింది. రమణమూర్తిగారిని జీతం అడిగా. ఉద్యోగాలు కొత్త కదా నాకు! పనివాళ్ళు అలా ఒకటో తారీఖే డబ్బులు అడగకూడదని తెలీదు. ఆయన నావంక ఎగాదిగా చూసి ఆ మరుసటి రోజున నా చేతులో జీతం డబ్బులు పెట్టి “ఇక నీవు ఉద్యోగానికి రానక్కరలేదు” అన్నారు. జీతం అడిగితే గెటవుట్ అనే ఉద్యోగం మీద పెద్ద మోహమేం లేదు కానీ పొరుగింటి సరస్వతీదేవిని వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది కదాని మనసుకు కష్టం వేసింది. ఇదంతా హైద్రాబాదుకు కొత్తగా వచ్చినప్పటి సంగతి. మళ్ళీ ఒకసారి పాత నూనెపల్లెకి మరలుదాం రండి.


నూనెపల్లె కాటన్ మార్కెట్ ఎదురు రోడ్లో ఉండేది మా ఇల్లు. ఇంట్లో మాకు డబ్బులకు కొదవలేదు. అయితే పిల్లల చేతికి డబ్బులు ఇవ్వడం అనే పద్దతి మాత్రం మా ఇంట ఏ మాత్రం లేదు. పైగా ఆ విషయంలో మా పెద్ద చిన్నాయన మహా కఠినాత్ముడు. ఏం తినాలన్నా ఇంటి నిండా తిండి ఉంటుంది. దసరా వచ్చిందా ఆయనే మా జన్మ ఎరుగనన్ని రంగు పొడులు తెచ్చి నీళ్ళల్లో కలిపి రంగు మగ్గులు మా చేతికి ఇచ్చేవాడు. దీపావళికి అయితే సంచులుగా, గంపలుగా బాణాసంచా దిగేది. ఏ పండగకా వైభోగం, కొత్త బట్టలు, తీపి వంటలు… ఇక పిల్లల చేతికి డబ్బులు ఎందుకూ అని ఆయన ప్రశ్న. ఆయన అవునన్నమాటని కాదనే ధైర్యం ఇంట్లో లేనేలేదు. అయినా హైస్కూలు బడికి వెళ్ళేప్పుడు అడిగినప్పుడల్లా మా జేజి మా చేతిలో పదిపైసలు పెట్టేది. పది పైసలతో చాలా చేయవచ్చు అయినా పుస్తకాలు కాని, రంగు పెన్నులు కానీ కొనలేం. అలా మా జేజి ఇచ్చే పదిపైసాలు సీమ చింతకాయలకో, ఉప్పుడు నిమ్మకాయకో, కారం సొంగలకో, రేగు వడలకో అయిపోతాయి. అయినా నా సమస్య తిండి కాదు. పుస్తకం అనే అంతు లేని ఆకలిది. అంత డబ్బు చేసినవాళ్ళం మేము కాకపోయినా అవసరార్థపు డబ్బుకు మా ఇంట కొదువ లేదు. అందుకని ఇంట్లో ఉన్న బీరువాలని, మా చిన్నాయనల జేబులని సవరదీయడం మొదలుపెట్టా. ఇప్పుడు ఇలా రాస్తున్నా గానీ భలే సిగ్గుమాలిన పనబ్బా అది. ఏం నిజంగా నాలుగు పుస్తకాలు ఇంట నింపితే? చేయి చాచితే అందేంత దగ్గరలో డ్రాయింగ్ షీట్లు. లక్సర్ పెన్నులు సమకూరిస్తే? మాటి మాటికి భూమి తల్లి నొప్పులుపడి కోటికొక్క అన్వర్‌ని మళ్ళీ మళ్ళీ కనేనా పాడా!

అలా అష్టకష్టాలు పడి పెరుగుతూ పెద్దవుతూ కాలేజీ వేపు దారి అడుగులు కొలుస్తూ ఉండగా ‘అడ్డా’లు అని ఉంటాయి కదా! అవి పరిచయం అయ్యాయి. కాలేజీల దగ్గర టీ కొట్టు ప్రముఖ అడ్డా. అక్కడ కూచుంటే బోల్డంతమంది ఫ్రెండ్స్ చేరతారు. అమ్మాయిలని చూసేవాళ్ళు అమ్మాయిల కోసం చూస్తూ ఉంటారు. నా వంటివాడు వాళ్ళ చెంతన కూచుని వారి ఖాతాలో లెక్కలేనన్ని టీలు తాగొచ్చు. అయితే నా అడ్డా అది కాదు. టెక్కే అనే ఏరియాలో పరమేశ్వర షెడ్ దగ్గరలో ఒక స్క్రాప్ దుకాణం ఉండేది. నా తెలివితక్కువ మొహానికి వాళ్ళతో ఎట్లా స్నేహం కలిపానో గుర్తుకు రావడంలేదు. కాలేజీ క్లాసులకు అటెండయిన రోజులకన్నా అక్కడ తిష్ట వేసుకుని కూచునే దినాలే ఎక్కువ. అంగడి లోపల ఒక పక్కన తూకానికి వచ్చిన పాత పేపర్లు, పుస్తకాలు పెద్ద గుట్టలా పడేసి ఉండేవి. ఒక్కసారి మఠం వేసుకుని అక్కడ కూచున్నానా, ఇక చదువుతూనే ఉండేవాణ్ణి. ఫిక్షన్ తక్కువ దొరికేది. కానీ ఆరోజుల దినపత్రికల్లో డైలీ సీరియళ్ళు దాదాపూ ప్రతి పత్రికలో వచ్చేవి. ఏ పేపరు, ఏ తేదీ, సీరియల్ ఎన్నో భాగమూ అనే లెక్క ఉండేదే కాదు, పేపర్ తరువాత పేపర్ అందిన ప్రతి పేపర్ లోని కథ, సీరియల్ అంతా ఒంపుకోడమే నా చదువు. ఒక్కోసారి వీలయితే తేదీవారిగా పేపర్లు కూర్చిపెట్టుకుని ఆ డైలీ సీరియళ్ళు చదివేవాడిని. కొన్ని భాగాలు మిస్ అవుతుండేవి అయినా పర్లా. ఆరోజుల్లో ఆర్‌.కె. డిగ్రీ కాలేజీలో పురుషోత్తం సర్ చెప్పిన ఇంగ్లీష్ పాఠాల కన్నా టెక్కే ప్రాంతాలలోని ఈ చెత్త గుట్ట మీది చదువే ఎక్కువ ఎక్కేది. తరువాత మా నూనెపల్లెలో మా చిన్నాయనకు ఉన్న ఒక స్థలాన్ని అద్దెకు తీసుకుని ఒకావిడ తుక్కు స్క్రాప్ కొని అమ్మే షాప్ పెట్టింది. ఇక అక్కడ నా చదువుకు కావాల్సిన పుస్తకాల కోసం కిందా మీదుగా వెదుక్కోడానికి, షాపుని తోడేయడానికి అడ్డూ అదుపూ లేదు ఇంటికి పట్టుకెళ్ళిపోయి చదివిస్తాను అన్నా అడ్డం చెప్పేదే లేదు.

అప్పుడప్పుడు మా ఇంటి బయట ఒక సైకిల్ బెల్ కొట్టిన పాట ఇలా వినిపించేది “బనారస్ పాప్డి అన్న! బనారస్ పాప్డి అన్న! ఉరికి ఉరికి రాన్నా! పది పైసాల్ తేన్నా! పాప్డి, పాప్డి, పాప్డి, పాప్డి… బనారస్ పాపిడి అమ్మే సాయబు గొంతులోని తీపి నన్ను ఏ మాత్రం ఉరికించలేదు కానీ ‘పాతా పేపర్లు, పుస్తకాలు కొంటాం’ అనే స్వరం మాత్రం ఆత్రంగా బయటికి పరిగెత్తించేవి. తోపుడు బండ్లో ఉన్న పుస్తకాలని ఆసక్తిగా తిరగేసేవాడ్ని. ఎలాగూ డబ్బులు ఉండేవి కాదు కాబట్టి ఆ బండి వెంట నడిచినంత వరకు నడుస్తూ ఆయన కసురుకునేవరకు బండిలోని ఒక పుస్తకం చదువుతూ నడిచేవాడ్ని. చిల్లర ఉన్నప్పుడు మాత్రం ఆ బండ్లో ఖచ్చితంగా పుస్తకం కొనేవాడ్నే. మా రోజుల్లో, ఆ కాలంలో అంటూ ‘పాతర వేసి పెట్టుకున్న స్వంత సమాధిని ఇప్పుడు స్వహస్తాలతో తవ్వుకోడం కాదు’ కానీ అప్పట్లో అది చాలా ఇష్టంగా చేసిన పని. కరెంటు బిల్లు కట్టడానికి గంటల తరబడి ఎండలో నిలబడి తల తిరిగి పడిపోయిన రోజులు, కిరసనాయలు క్యూల మధ్యలో ఎడతెగని నిరీక్షణ. ఈ క్యూల మధ్య తగిలే చల్లగాలి అంటే జేబులో దోపుకున్న కథల పుస్తకమో, అపరాధ పరిశోధన సప్లిమెంటరీ నవలారాజం మాత్రమే. ఆ రోజుల్లో ఎక్కడా, ఏ పరిస్థితుల్లో పొద్దుపోవడం అనే మాటే లేదు. పుస్తకం ఎప్పుడూ తోడు ఉండేది.

మా జేజి కంతులకు డబ్బులు ఇచ్చేది, నా హైస్కూల్ రోజుల్లో డబ్బుల వసూళ్ళు నేను చూసుకునేవాడ్ని. బడికి వెళ్ళేటప్పుడు ఒక బ్యాచ్, బడి నుండి వచ్చేటప్పుడు మరో బ్యాచ్ మనుషుల దగ్గర కంతు వసూలు చెయ్యడం నా డ్యూటి. ఒక రోజు మధ్యాహ్నం బడినుండి ఇంటికి వచ్చి అన్నం తిని, నక్కల దిన్నె బడి హెడ్మాష్టర్‌గారి ఇంటి పక్కన ఉండే ఒక ఆమె దగ్గరకు డబ్బులకు వెళ్ళా. ఆవిడ నట్టింట్లో చక్కగా బేతంచర్ల బండల మీద నులక మంచం వేసుకుని పైన ఫ్యాన్ గాలికి హాయిగా ఆదమరచి నిద్రపోతుంది. నిద్రించేవారిని లేపరాదు వంటి పట్టింపు ఏవీ తెలీని వయసు. మామూలుగా అయితే “మ్మో, జేజి డబ్బులకు పంపింది” అని నిద్ర లేపేవాణ్ణే. కానీ ఆవిడ పడుకున్న మంచం పక్క గూట్లో బోర్లించి ఉన్న పుస్తకం ఒకటి నన్ను ఆకర్షించింది. మామూలుగా చదుకునే జానపద రాకుమారుల సాహసాలు సైజ్ పుస్తకం కన్నా కొద్దిగా పెద్దగా ‘ముప్పయి రోజుల్లో కరాటే, కుంగ్ పూ, జూడో నేర్చుకోండి’ సైజ్‌లో ఉందది. చడీ చప్పుడు లేకుండా గమ్మున ఆ పుస్తకం అందుకుని సంచిలో ఉంచుకుని మునివేళ్ళమీద నడుస్తూ బయటపడ్డా. సాయంత్రం వస్తూ వస్తూ మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఎవరూ చూడకుండా ఆ పుస్తకం ఇంట్లో ఏదో మూల గిరాటు కొట్టొచ్చు కదా అని దూరాలోచన, ఆ ఇంటి రోడ్డు మలుపు తిరిగి పుస్తకం తెరిచి చదువుకుంటూ బడి దారి నడుస్తున్నానా. చదివే కొద్దీ ఒళ్ళంతా భయం, తిమ్మిరి. సల్లాడం వేడిగా, బిర్రుగా. ఒక్కసారి పుస్తకం మూసిపడేసి దడదడలాడుతున్న గుండెతో తిన్నని రహదారి వదిలి గవర్నమెంట్ స్కూలు పక్కనుంచి మా స్కూలు వెళ్ళే అడ్డదారి పట్టా. అక్కడంతా ఇళ్ళు తక్కువ, కంపచెట్లు ఎక్కువ. భయంలో కూడా ఏదో గమ్మత్తు ఉంది ఆ రచనలో. అక్కడే ఆ రోడ్డు మీదే ఆగిపోయి పుస్తకం మొత్తం చదివా. ఇలా ఇంతవరకూ ఏ పుస్తకం చెయ్యలా నన్ను. మనిషినంతా అదోలా అయిపోయా. ఏం చెయ్యాలో ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాలా. చెప్పేంత మంచి ఏవుందని? అది చెడ్డ అని స్పష్టంగా వంట్లోకి ఎక్కేసిందిగా. బలమంతా తీసుకుని ఆ పుస్తకాన్ని కంప చెట్ల మధ్యకి విసిరికొట్టా. సరైన వయసు కాదది. ఆ చదువుకు బాల్యానికి మాత్రం మంచి చెయ్యని సాహిత్యమదని తెలిసీ తెలీని బుర్ర నాదయినా, అయినా అర్థం అవుతుంది ఆ సమయంలో కూడా. బడిలో అమ్మాయిలూ కాదు కాని బయట ఆడవాళ్ళు ఒకటీ రెండు రోజుల వరకు తేడాగా కనపడుతున్నారు ఆ అక్షరాల మత్తులో. అదే తొలిసారిగా ఒక పుస్తకాన్ని పాములా మారడాన్ని చూడ్డం, నన్ను పాములా మార్చడాన్ని తెలుసుకోడం. దేనికయినా ఒక వయసు రావాలి ముఖ్యంగా ఈ విశృంఖల శృంగార సాహిత్యం, సినిమాలు చదవడానికి, చూడ్డానికి.


చిన్నతనంలో అన్నిటికన్నా ఎక్కువగా నా చదువు ఆకలి తీర్చింది మాత్రం అద్దె పుస్తకాల బంకులు. ఆ రోజుల్లో మా పక్కింటికో, ఎదురింట్లోకో పరీక్షానంతర సెలవులకో, పండగ సెలవులకో కొత్తపిల్లలు ఎవరైనా వచ్చినపుడు మాటా మాటా కలిసినపుడు మీ ఊరు పెద్దదా మా ఊరు పెద్దదా అని ఒక అంచనా వేసుకోవడానికి అడిగే మొదటి ప్రశ్న ‘మీ ఊర్లో సినిమా టాకీసులు ఎన్ని ఉన్నాయి’ అని ఐవుండేది. నాకటువంటి సమస్యే ఎదురయ్యేది కాదు. నాకు కావలసిన భోగట్టా అల్లా మీ ఊర్లో, మీ ఇంటి దగ్గర పుస్తకాలను అద్దెకు ఇచ్చే షాపులు ఎన్ని ఉన్నాయని మాత్రమే. నాకు ఊహ తెలిశాకా తరచుగా ఎమ్మిగనూరుకు వెళ్తుండేవాడిని. ఊర్లో దిగి మా మేనత్త ఇంటికి వెళ్ళే రిక్షా ఎక్కాకా దారికి అటూ ఇటూ చూస్తూ ఆ ఊరిలో పుస్తకాల బంకులు ఎన్ని ఉన్నాయా? ఎక్కడెక్కడ ఉన్నాయా అని బుర్రలో గురుతులు పెట్టుకునేవాడిని. మా నూనెపల్లెలో అయితే వీరభద్రయ్య బంకు అద్దె పుస్తకాలకు పేరెన్నికది. నూనెపల్లె సెంటరులో గుర్రాల షెడ్డుకు ఎదురుగా ఉండేదది. ఆ బజారు అంతా కోమట్ల ఇళ్ళు ఎక్కువ. భద్రయ్యగారు కూడా కోమట్లే. ఆయన కొడుకు భాస్కర్ ఆ బంకులో ఎక్కువగా కూచునేవాడు. బంకు సీలింగుకు ఒక చిన్న ప్యాన్ బిగించి ఉండేది. బంకులో ఒక మూల రేడియో కూడా ఉండేది. “చదువేరా అన్నిటికీ మూలం, చదువు విలువ తెలుసుకొనుట మానవ ధర్మం” అని పాడేదది. అక్కడ నాకు పుస్తకాల తరువాత అత్యంత ప్రీతిప్రాత్రమైన వస్తువు బెల్లంపాకపు వేరుశెనగ పప్పుండ. ఎంతో రుచిగా ఉండేదది. ఇప్పుడు అటువంటి పప్పుండలే హైదరాబాద్ ఆల్మండ్ హౌస్‌లో కనపడతాయి. రూపం ఒకటే కాని ధర మాత్రం హస్తిమశకాంతరం. పుస్తకాలు, పప్పుండల తరువాత నాకు ఫేవరెట్ అనదగ్గది గుడ్ డే బిస్కత్తు. గాజు సీసాలలో చక్కగా అమర్చిపెట్టి ఉండేవి. సుతారంగా అల్యూమినియం మూత తిప్పి అడిగినవారికి బిస్కట్లు ఇచ్చేవాడు భద్రయ్య, డబ్బులు కూడా పుచ్చుకునేవాడు. అపుడు ఆ సీసాలోనుంచి బిస్కెట్ల వాసన ఎంత కమ్మగా ఉండేదో. ఇప్పుడూ అప్పుడప్పుడూ రత్నదీప్ సూపర్ మార్కెట్‌కు ఏదయినా సరుకులు కొనడానికి వెడతానా, బిస్కెట్ కౌంటర్ దగ్గర గుడ్ డే ప్యాకెట్ పుచ్చుకుని ఆ చిన్ననాడు తగిలిన చక్కని వాసన వస్తుందా లేదా అని చూస్తా, రానే రాదు. ఆ వాసన లేని బిస్కెట్ కూడా రుచిగా అనిపించదు నాకు. నేను భద్రయ్య అంగట్లో పుస్తకం తీసుకుంటే కూడా ఉన్న ఫ్రెండ్ ఎవరో ఒకరు బిస్కెట్టో, బుడ్డల గట్టానో కొనేవాడు. అది ఇద్దరం పంచుకుని తినుకుంటూ నడిచే దారిలోనే పుస్తకాన్ని నమిలేస్తూ కదిలేవాడ్ని.

పుస్తకాలు అద్దెకిచ్చే షాపులో ఆ గోడలనిండా వందలుగా పుస్తకాలను నిలువ వరుసల్లో నింపేవారు. స్కెచ్చు పెన్నులతో పుస్తకాల మీద పేర్లు రాసి ఉండేవి. ఏ పుస్తకం కోసం కష్టపడి వెదుక్కోనక్కరలేదు. చక్కని చేతి వ్రాతలో ఆ పేర్లు కళ్ళని ఆకర్షించేవి. చాలా షాపుల్లో అయితే పత్రికల్లో సీరియల్‌గా వచ్చిన పేజీలని చించి నవలా పుస్తకంగా బైండ్ చేసి అద్దెకు ఇచ్చేవారు. కొత్తగా విడుదలైన పుస్తకాలయితే డిమాండ్ ఎక్కువ కాబట్టి నియమిత ఖాతాదారుల కోసం ఆ పుస్తకాలని సెపరేట్‌గా ఉంచేవాళ్ళు. షాపువాళ్ళు ఏ పుస్తకాన్ని కూడా ఒకటి ఒకటిగా కొనేవాళ్ళు కాదు. ప్రతి పుస్తకం రెండూ మూడు ఉండేవి. ఆ కాలపు సూపర్ స్టార్లయిన మధుబాబు, మల్లాది, యండమూరి పుస్తకాలయితే అయిదు లెక్కన కొనేవారు. వారి పుస్తకాలు వచ్చిన కొత్తలో అయిదేం ఖర్మ, పది కొన్నా అంత సులువుగా పాఠకుల చేతికి వచ్చేవి కావవి. త్రిమూర్తులకు డిమాండ్ ఎక్కువ. ఈ రోజు సాహిత్యాన్ని వీపు మీద కట్టుకుని మరీ మోస్తున్నాం అనుకునే గూని రచయితలు ఎవరు ఎంత గీ పెట్టి చచ్చినా ఒకానొక కాలంలో హైస్కూలు పిల్లవాళ్ళ దగ్గరి నుండి సకుటుంబ సపరివారం వరకు తెలిసిన రచయితలంటే వీరే. పెరిగి పెద్దయి అతి పెద్ద చదవరులయిన ఇప్పటి చదువరులు చాలామందికి అక్షర ప్రాశన చేసింది వీరే. వీరిలో యండమూరి కాస్త హట్ కే. రాసింది కమర్షియల్, పాపులర్ సాహిత్యమే కావచ్చు. అయినా ఆయన తన పుస్తకాల్లో ఎక్కడో ఒకక్కడ బుచ్చిబాబు, తిలక్, విశ్వనాథ సత్యనారాయణ, చలం… ఇత్యాదుల ప్రస్తావన తెచ్చేవారు. నాకయితే ఈ మహారచయితల తొలి పరిచయం వీరేంద్రనాథ్‌గారి పుస్తకాల్లోనే. ఒక పుస్తకంలో ఆయన ఇట్లా వాక్యం వ్రాశారు ‘తెలుగు సాహిత్యంలో ఒకే ఒక హీరో తంగిరాల శంకరప్ప.’ ఆ వాక్యాన్ని పట్టుకుని నేను పెద్దయ్యాకా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి సాహిత్యాన్ని మొత్తం చదువుకునే భాగ్యం కలిగింది. లేకుంటే ఎక్కడి చిన్న పల్లె నూనెపల్లె? దానికి అద్భుతమైన సాహిత్యం ఎంతెంత దూరం?

షాపు పెట్టాము కదాని వచ్చిన ప్రతి ఒక్కరికి అడగ్గానే పుస్తకాలు ఇవ్వబడవు. బ్యాంకులో అకవుంట్ తెరవడానికి సాక్షి సంతకం అవసరమైనట్లు షాపువారికి తెలిసిన వారినెవరినయినా తోడుగా తీసుకెడితేనే పుస్తకాలు ఇస్తారు. లేదా పుస్తకం ధరమొత్తం అడ్వాన్సుగా కట్టాలి. నాకు గుర్తుండి కొందరు 20 రూపాయలు బయానాగా పుచ్చుకునేవారు. ఆ రోజుల్లో అంత డబ్బు ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? అందుకని నేను ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి అడ్వాన్స్ డబ్బులు కట్టేవాణ్ని, అద్దె చెల్లించేవాడిని. పుస్తకాలు నాకు దొంగతనం నేర్పాయి. అలవాటు ఐంది కదాని ప్రతి ఎప్పుడూ దొంగతనం చేయకూడదు. పట్టుబడిపోతాం. అందుకే పుస్తకాలకు అద్దె అప్పు పెట్టడం నేర్చుకున్నాను. ఈ రోజుల్లో చోరీ చేస్తూ పట్టుబడిన పిల్లలు ఎవరైనా పుస్తకాలు కొనడానికి దొంగతనం చేశాను అని ఏడుపుముఖంతో అంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోబుద్ధి వేస్తుంది. నేను పెరిగి పెద్దయ్యాక ఒకసారి నాకెంతో ఇష్టమైన ఆర్టిస్ట్ సెర్జియో తోప్పిగారి పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక దిగాలుగా ఉంటే ఏమిటి విషయమని అడిగి తెలుసుకుని చిత్రకారులు శ్రీబాపుగారు దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకోలేదు కానీ ఇరవైవేల రూపాయలు ఇచ్చి నా ముఖంలో నవ్వు చూశారు.

అద్దెకు తీసుకున్న పుస్తకాన్ని తమ వద్దనున్న రిజిస్టరులో తేది, సమయం వేసి మళ్ళీ ఆ పుస్తకాన్ని రేపటి రోజున అదే సమయం లేదా అంతకంటే ముందుగా తెచ్చిస్తే ఒక రోజు అద్దె. రోజు మారిన కొద్దీ అద్దె రెట్టింపు అయ్యేది. ఒక్కొక్కసారి అద్దె కట్టడానికి డబ్బులు లేక పుస్తకాన్ని అట్లానే అట్టిపెట్టేసుకుని పుస్తకం ధరకన్నా అద్దె డబ్బులు ఎక్కువగా పెంచిన రోజులూ ఉన్నాయి. అప్పుడప్పుడు షాపు యజమానికి ఏదయినా పనిపడో, భోజనానికో వెళ్ళవలసి వచ్చినపుడో పుస్తకాల షాపు మూసి ఉండేది. షాపు మూసి ఉన్నదేమని ఖంగారు పడకూడదు. అంగడి చెక్కలకు సన్న సందులు ఉంటాయి. అందుగుండా పుస్తకాన్ని పడెయ్యాలి. షాపు ఆయన తిరిగి వచ్చాక మన పుస్తకం నెంబరూ, పేరూ చూసి పుస్తకం ముట్టినట్టుగా పద్దు వేసుకుంటాడు. అద్దె బకాయి రాసుకుంటాడు.

మా ఇంటి దగ్గరలోనే, శివశంకర విలాస్ దగ్గర ఒక క్రైస్తవ కుటుంబం పుస్తకాల బంకు పెట్టుకున్నారు. అమ్మా, నాన్న, ఒక అబ్బాయి. ఒకరు లేనప్పుడు మరొకరు ఆ షాపు చూసుకునేవారు. నేను వాళ్ళదగ్గర పుస్తకాలు అద్దెకు తీసుకునేవాడిని. యండమూరి వీరేంద్రనాథ్ రక్తసిందూరం పుస్తకం అక్కడే తీసుకున్న గుర్తు నాకు. ఆ పుస్తకానికి చిత్రకారులు చంద్రగారు వేసిన బొమ్మని చూసి మంత్రముగ్ధుణ్ణి అయ్యాను. ఒకసారి పుస్తకాలకు అద్దె చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు ఒక ఉపాయం చేశా. కొడుకు ఆ షాపులో ఉన్నపుడు పుస్తకం తీసుకున్నాను అనుకో, పుస్తకం తిరిగి ఇచ్చేటప్పుడు అతను కాకుండా వాళ్ళ అమ్మగారో, నాయనో ఉన్నప్పుడు పుస్తకం వాపసు ఇచ్చి అద్దె ముందే కట్టేశా అని చెప్పేవాడిని. కొన్ని చోట్ల పుస్తకం అద్దె ముందే కట్టించుకునేవారు. పుస్తకాలు నాకు మోసాన్ని కూడా నేర్పాయి. ఆ కుటుంబంవారు కడుబీదవారు. వారి రూపు, వేసుకున్న బట్టలు ఆ విషయాన్ని యథాతథంగా చూపేవి. అపుడు బుర్రకు, హృదయానికి న్యాయాన్యాయాలు ఏమీ తెలిసేవి కావు. ఇప్పుడు ఎప్పుడయినా నాకు ఏదయినా అన్యాయం జరిగింది అనిపించినపుడు నేను ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని వారిని మోసం చేసినందుకు ఇప్పుడు నాకు తగినదే జరిగింది అనుకుంటాను. లెక్కకు లెక్క అనేది జీవితలెక్కాచారంలో భాగం. ఎవరు మరిచిపోయినా దేవుడు ఎప్పుడూ దానిని మరిచిపోడు. ఇపుడు ఆ బంకువాళ్ళు ఎవరూ కనపడరు కానీ కనపడితే బావుండు, వాళ్ళ చేతులు పట్టుకుని మన్నించమని ప్రాధేయపడిపోయేవాడినే.


పుస్తకాల వలన నేను దొంగతనం, మోసం, దగా చేయడం నేర్చుకుంటే నా ఫ్రెండు బాషా అనేవాడికి పుస్తకాలు వ్యాపారం నేర్పాయి. ఆ రోజుల్లో మేము ఎంత పెద్ద పుస్తకాన్నయినా ఒక దెబ్బకు గంటా రెండు గంటల్లో చదివేసేవాళ్ళం. మరి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లొక లెక్కా! మా బాషాగాడు ఏం చేసేవాడంటే వాడు ఒక పిల్లల పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకుని చదివేసి, ఒకోసారి చదవకుండా కూడా మాకు అద్దెకు ఇచ్చేవాడు. గంటకు పదిపైసలో పావలో పుచ్చుకునేవాడు. షాపులో అయితే పుస్తకాన్ని ఒక గంటకు వెనక్కి ఇచ్చినా, ఒక రోజుకు వెనక్కి ఇచ్చినా దాని సంపూర్ణ అద్దె రూపాయో, అర్ధ రూపాయో కట్టక తప్పదు. బాషాగాడి పుస్తకానికి పావలా పథకం హాయిగా ఉండేది. వాడు ఇచ్చినంతమందికి అద్దెకు ఇచ్చి, అద్దె చెల్లించి ఆ పై మిగిలిన డబ్బులు దర్జాగా జేబులో వేసుకునేవాడు. ఆ రోజుల్లో బడిపిల్లలు చాలామందికి ఈ పిల్లల పత్రికల దగ్గరినుండి, పెద్దల నవలల వరకు చదివే అలవాటు ఉండేది. పుస్తకాల సంచిలో బడి పాఠాలకు తోడుగా ఈ పత్రికలూ తప్పక ఉండేవి. అప్పుడప్పుడు మా స్కూలు క్లాసురూముల్లో ఆకస్మిక తనిఖీ జరిగేది. పిల్లల తమ సంచుల్లో నుంచి కథల పుస్తకాలు తీసి క్లాసుల బయట ఉన్న కంపపొదల్లోకి అమాంతం గిరాటేసేవారు, కొంతమంది తాము కూచుని ఉన్న పెద్ద పెద్ద బండలని పైకి లేపి వాటి కింద పుస్తకాలని దాచేవారు. పుస్తక దాడిలో పట్టుబడిన పుస్తకాలన్నింటినీ మా టీచర్లు గ్రౌండ్ మధ్యలో గుట్టగా పోసి తగలపెట్టేవారు. ఫారెన్‌హీట్ 451 సినిమాని చూడకముందే ఫ్రాన్‌స్వా త్రుఫాఁ పేరు వినక ముందే నాకు ఈ అనుభవాలు ప్రత్యక్షంగా ఉన్నాయి.

సినిమా థియేటర్ టికెట్ కౌంటర్ బయట నిలబడ్డంత పెద్ద వరుస కాకపోయినా, అద్దె పుస్తకాల షాపు, బంకుల బయట వరుసలో నలుగురయిదుగురే ఉన్నా, కొత్తనవల కోసం విపరీతమయిన ఒత్తిడితోనో, నాలుగురోజులుగా తెగ తిరుగుతున్నా ఇంకా దొరకని అభిమాన రచయిత పుస్తకం ఈరోజైనా దొరుకుతుందా లేదా అనే మనోదౌర్బల్యం తోడుగానో నిలబడి ఉండేవారు పాఠకులు. వట్టి అద్దె పుస్తకాలే కాదు. ఊరి మెయిన్ సెంటర్లలోనూ, సందు చివర, వీధి మలుపులో ప్రతిచోటా దినపత్రికలు, వార పత్రికలు, పక్షపత్రికలు, పిల్లల పత్రికలు, పాకెట్ నవల్స్ కనపడుతూనే ఉండేవి. బీడి, సిగరెట్, కిళ్ళీ, అరటిపండు అమ్మే అంగళ్ళలో కూడా తోరణాలుగా వార, పక్ష, మాస పత్రికలు తలకిందులుగా వేలాడుతూ ఉండేవి. పత్రికలు కొనడానికి డబ్బులు లేని నావంటి వారు తలని అడ్డంగా వాల్చి ఆ తలక్రిందుల పత్రికల పేజీల చివరలని సుతారంగా ఎత్తి పట్టుకుని అందినకాడికి కథనాలను, కనపడిన వరకు కార్టూన్లను, బొమ్మల్ని ఆస్వాదించేవాళ్ళం. ఇట్లా చెప్పుకుంటూ పొతే చదువు సంగతులు చాలా ఊరుతూనే ఉంటాయి. నిజానికి ఎలా కనుమరుగయ్యాయో, ఎప్పుడు కనుమరుగయ్యాయో కూడా ఊహకు అందడం లేదు ఆ పుస్తకాలని అద్దెకు ఇచ్చే షాపులు. వీధుల్లో పత్రికలు అమ్మే బంకులు. టెంత్ క్లాస్ లోనా? కాదేమో! ఇంటర్ మీడియట్ లోనా, లేక డిగ్రీ రోజుల్లోనా? ఏమో గుర్తు లేదు.

చందమామ, బాలజ్యోతి, బుజ్జాయి, బొమ్మరిల్లు, బాలమిత్ర, బాలభారతి, బాలచంద్రిక, స్వాతి, స్రవంతి, చెకుముకి, తెలివితేటలు, విస్‌డమ్, పల్లకి, మయూరి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక, రచన, ఇండియాటుడే…ల చదువు సరే, సీరియస్ సాహిత్యం చదవడం ఎలా అలవాటయిందో సరిగ్గా చెప్పలేను కాని, బహుశా ఆ పత్రికల్లో వచ్చే పుస్తకాల రివ్యూలు చదివి ఈ పుస్తకాల మీద ఆసక్తి పెరిగింది అనుకుంటా. అంతే కాదు, విశాలాంధ్ర పుస్తకాల బస్సులో కూడా నేను చదవకపోయినా ఘనాఘనా తెలుగు రచయితల పేర్లని, వారి రచనలని నేను చాలా చిన్నప్పుడు చూసి ఉన్నాను. పెరిగి పెద్దయ్యాక ఇలా వార, పక్ష, మాస పత్రికల్లో వచ్చే రివ్యూలు, బాగా అనిపించిన రచనల్లోని మంచి మాటలు నోటు పుస్తకాల్లో రాసి పెట్టుకోవడం అలవాటయ్యిపోయింది. ఇప్పటికీ నా డిగ్రీ రోజుల నోటుబుక్కుల పేజీలు తిరగేస్తే అందులో పత్రికల లోనుంచి కత్తిరించి పెట్టుకున్న అనేక పుస్తకాల సమీక్షలు దొరుకుతాయి.


కాలం గడుస్తూ నూనెపల్లెలోని, నంద్యాలలోని, తెలుగు దేశంలోని అన్ని పుస్తకాల షాపుల మీద, బస్టాండు, రైల్వే స్టేషనుల్లోని పుస్తక విక్రయ వరుసల మీద టీవీలు వాటి వివిధ ఛానళ్ళు ధనాధనా కురిసి ఆ షాపులన్నీ భూస్థాపితం అయ్యే రోజులు వచ్చేసరికి నేను హైదరాబాదుకు వచ్చేశా. హైదరాబాదుకు వచ్చేనాటికి నా వయసయితే పెరిగింది కానీ ఆదాయం ఏమీ లేదు, పుస్తకాలు అద్దెకు లేవు. ఏ పుస్తకమయినా చచ్చినట్లు కొనవలసిందే. ఈనాడు టాబ్లాయిడ్ పేజీల్లో ఏ వార్త చదివినా చదవకపోయినా ‘నగరంలో ఈ రోజు’ మాత్రం చదివేవాడిని. అందులో ప్రస్తావించబడిన సాహిత్య కార్యక్రమాలు, పుస్తక ఆవిష్కరణలకు వెళ్ళేవాడిని. అక్కడ నాకు తెలిసిన చిత్రకారులు మోహన్‌గారు, చంద్రగారు వంటివాళ్ళు కనపడేవారు. పుస్తకావిష్కరణ అనంతరం చంద్ర, మోహన్‌గార్లకు, వారివంటి అనేక సాహితీ ప్రముఖులకు రచయితలు తమ తమ పుస్తకాలని బహుమానం చేసేవారు. వారి పక్కనే నిలబడి వారి రచనలకేసి ఆశగా చూసే కళ్ళున్న నావంటి పిల్లవాళ్ళ కేసి ఈ రచయితలు పొరపాటు చూపులు కూడా కలిపేవారు కాదు. వారు సంతకాలు చేసి మరీ పుస్తకాలు సమర్పించుకుంటున్న ఈ పెద్దవాళ్ళెవరూ వాటిని ఆ తరువాత ముట్టను కూడా ముట్టరని వారికి తెలియనట్లే, అమాయకంగా అబ్బనాకారంగా కనపడే నావంటి వాళ్ళూ ఏ పుస్తకాన్నయినా ఆవురావురంటూ ఆరగించుకుంటారని వారికి ఎప్పటికీ తెలిసేది కాదు.

అయితే మా ఊరిలో కానీ, మరే చిన్న ఊర్లల్లో కానీ దొరకని ఒక ప్రత్యేకానుభవం హైదరాబాదులో నాకు కనపడింది. అవి పేవ్‌మెంట్ల మీద పరిచిన పుస్తకాలు. మా నూనెపల్లెలో ఏడాదికొకసారి తిక్కస్వామి ఉరుసు జరిగేది. నేల మీద పరిచిన దుప్పట్ల మీద బంతుల, బొమ్మల అంగడి అది. చిన్నతనంలో మోకాళ్ళమీద కూచుని ప్రతి బొమ్మని పట్టుకుని అటూ ఇటూ తిప్పి గంటల తరబడి చూస్తో ఉండేవాళ్ళం పిల్లలం. ఆ పురాస్మృతే, ఆ ఆనందసంబరమే నాకు ఆబిడ్స్ ఆదివారాలు ఇచ్చాయి. నిజానికి నేను ఆ పేవ్‌మెంట్ల పైనా, హైదరాబాదు పాత పుస్తకాల్లో షాపుల్లోనూ సాహిత్యం పుస్తకాలకన్నా, బొమ్మల పుస్తకాలే ఎక్కువ కొన్నాను. ఇంతకింత రాసుకోవలసిన అనుభవాలు నా రేఖాయాత్ర పుస్తకాలది. అదంతా మరెప్పుడైనా.

కాలం ముందుకు కదిలి కావలసిన పుస్తకాన్ని కొనేంత డబ్బులు సంపాదించుకునే రోజులు వచ్చాయి. అప్పట్లో పుస్తకం ఏదయినా, ఎటువంటిదయినా గుడ్ బ్యాడ్ అగ్లీ ఆక్వర్డ్ హారిబుల్ దేన్నయినా చదివే జీర్ణశక్తి ఉండేది. ఇప్పుడు అది పోయింది. వాతాపిని జీర్ణం జీర్ణం అనుకునే నా లోపలి అగస్త్యుడు కూడా ముసలివాడు అయిపోయాడు. ఎవరయినా పుస్తకాలు ఇస్తారా అని ఎదురుచూసే రోజులనుండి ఎవరయినా రచయిత ఎదురుపడి వచ్చి పుస్తకాలు కానీ ఇస్తాడా! అంటగడతాడా ఏమిటిరా ఖర్మ! అని భయపడే రోజులు వచ్చాయి. అయితే ఇదంతా చదువుమీద, రచనల మీద వ్యతిరేకత కాదు, విరోధాభాసాలంకారం మాత్రమే. కాలం గడిచే కొద్ది మనసుకు ఎక్కే, ఆనందింప జేసే రచనల ఎరుక ఏమిటో తెలిసివచ్చిన ఆరోగ్యకర పరిణామమే ఇదంతా. అయినా కష్టపడి, ప్రాణంపెట్టి రాసి, ముచ్చటగా అచ్చు వేసిన పుస్తకాలు ఎందుకబ్బా ఊరికే పంచడం? బోలెడు చెడ్డ మాటలు ఊరికే అలా మాట్లాడతాను కాని, ఒకానొక సమయంలో నా కోసం ఒక్క పుస్తకం కూడా కొనలేనితనం నుండి మంచి పుస్తకమన్నది దొరికిన ప్రతిసారీ నాకోసం ఒకటే కాదు నా వంటి చదువరి మిత్రుల కోసం నాలుగు, పద్నాలుగు ప్రతులు కొని పంచిపెట్టిన మంచిరోజులూ వచ్చాయి. చదివి ప్రాణంగా హత్తుకున్న ప్రతి పుస్తకాన్ని నలుగురికి, పద్నాలుగురికే మాత్రమే కాదు, నాలుగు వందల మందికి కూడా ఈ పుస్తకం ఖచ్చితంగా చదవండబ్బా అని వెంటపడి వెంటపడి ప్రాణం తీసేంత రివ్యూలు, మెసేజ్‌లు, ఫేస్బుక్ ప్రకటనలు రాస్తున్న రోజులున్నాయి నాకిప్పుడు. బొమ్మలు వేయని రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి. కానీ కనీసం ఒక్క పేజీ అయినా చదవకుండా ఉన్న రోజులేవీ నాకు లేవు. ఈ రోజుకు మంచి పుస్తకం దొరికిందా, ఆఫీసుకు సెలవు పెట్టి ఒకటీ రెండు రోజులు పుస్తకాలు చదువుకుంటూనే సంతోషించదగ్గ చదువుతనం ఇప్పటికీ మిగిలే ఉంది.

సాహిత్యం అంటే ఏమీ తెలియని వయసులో మొదలయిన పఠనాసక్తి దాదాపు నలభయ్యేళ్ళ వయసు వరకు ప్రతి పుస్తకం నమిలి మింగేసే అప్పటి నా అక్షర క్షుత్తు ఇప్పుడు అంతగా లేకపోవచ్చు, ఇంకా కొన్నాళ్ళకు అదీనూ మొత్తం పోవచ్చు. పోకపోవచ్చు కూడా. ఎందుకంటే చిన్నతనంలో తెలియనిది ఇప్పుడు తెలిసినది ఒకటి ఏమిటంటే మనిషి రక్తానికి ఒక గ్రూప్ ఉన్నట్లే చదువుకు ఒక అభిరుచి ఉంటుంది. నాది కాని గ్రూపు రక్తాన్ని నా శరీరం ఎట్లా స్వీకరించలేదో వ్రాసిన, వ్రాసి పడేసిన ప్రతి రచన మనసుకు పట్టదు. ఒకానొక కాలంలో సినిమా హీరోల గురించి మా హీరో ఈయనని, మీ హీరో వాడని తిట్టుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం కూడా. కానీ నా పుస్తకం బాలజ్యోతని, నీ పుస్తకం చందమామని తేడాలు ఉండేవి కాదు. ఏ పుస్తకమైనా, ఏ రచన అయినా చదువుకుని ఎవరికి వాళ్ళం సంతోషపడేవాళ్ళం తప్పా దాని గురించి ఒక మాటో, ఇక చర్చో, రచ్చో తెలీనే తెలీదు. అసలు కథలు, నవలలు, పత్రికలు చదవడమనేది పెద్ద గొప్ప విషయమేం కాదు. అదొక అభిరుచి. మహా అంటే పత్రికా పేజీల్లో కలం స్నేహం శీర్షికల్లో కొన్ని ఫోటోలలోని మనుషులు చెప్పుకునే నా అభిరుచులు – క్రికెట్ ఆడటం, పాటలు వినడం, కుట్లు-అల్లికలు, పద ప్రహేళిక పూరించడం, డైరీ రాయడం, పుస్తక పఠనం… అనే వరుసలోని ఒక హాబీ మాత్రమే. ఈ వ్యాసానికి నేను ‘చదువు అనే ఆరో వేలు’ అని పేరు పెడదామని అనుకున్నా. అలా ఎందుకంటే, మనలో కొంతమందికి ఆరో వేలు ఉంటుంది, అది పుట్టుకతో వస్తుంది. అది ఉండటమనేది గొప్ప క్వాలిటీ కాదు. అది లేకపోవడం వలన వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. చదువు అనేది నాకు ఆరో వేలు వంటిది. అది రావడానికి నేనేం తపస్సు చేయలేదు. అది పెట్టి పుట్టించమని తీర్థాల్లో మునిగి కోరింది లేదు. అది నాకుందని నేనెన్నడూ ఇంచు కూడా గర్వపడ్డది ఏ మాత్రం లేదు. చదువు నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన మాట నిజమే. ఇలా ఆనందాన్ని ఇచ్చే విషయాలు ఎవరికి వారికి వ్యక్తిగతంగా లక్షా తొమ్మిది ఉండవచ్చు. తేడా అల్లా, నా చదువు వల్ల నాకు కానీ ఇతరులకు కానీ ఏ మాత్రం హాని కలగలేదని. చదువు నా ఆరో వేలు, చదువు నా పుట్టు గుణం. చదువు నాకు మంచి అనుభవం, చదువు నా తొలి నేస్తం, చదువు నాకు పని కాదు, చదువు నా యజమాని కాడు, తొడ చరిచి రమ్మని పిలిచిన శత్రువు సవాల్ కాదు నాకు చదువు. నోటు పుస్తకంలో దాచుకున్న నెమలీక హాయిని హత్తుకుని ఖులాసా అవడమే నాకు అంటిన చదువు. చదవడం వలన నేను ఈ మాత్రపు నా అనుభవాలని వ్రాయడాన్ని గ్రహించాను. వ్రాయడం ద్వారా నేను ప్రతి రాసేవారి రచనలను కాదు కానీ వారి వారి వ్రాయాలనుకునేతనాన్ని గౌరవించాను. రచయితల రూపూరేఖల స్థాయీభేదాల సామాజిక స్థితిగతుల ఒడ్డూ పొడుగు అడ్డాలను బట్టి కాక వారి వాక్యపు నిరాడంబరత, వారి అక్షరాలు వెదజల్లిన జీవితపు మానవతా పరిమళాల ఆధారంగా నమస్కరించుకుంటున్నాను.

ఈరోజు ఒక దినపత్రిక కోసమో, వారపత్రిక కోసమో కిలోమీటర్లకు కిలోమీటర్లు నడిచినా ఒక్క పుస్తకమూ రోడ్డు మీద కనపడటం లేదంటే, రోడ్డు మీద వీచే గాలికి పత్రికల పేజీలు రెపరెపలాడటం లేదంటే అత్యంత సాంస్కృతిక లేమి నడుస్తున్న రోజులివి. ఆరోజుల్లో కథలు, నవలలు, పాటలు, పద్యాలు, ఎక్కాలు, శతకాలు అనేకాలు పుస్తకాలుగా దొరికేవి. రచయితల ముక్కు మొహంతో, ఫోన్ నెంబర్, ఇంటి విలాసంతో అవసరం లేని రోజులవి. ఎవరు రాసినా చదివిందే భాగ్యం. కంటపడిన అచ్చు కాగితమే వరం. ఈ రోజున వద్దన్నా వీధికొక, సందుకొక, నగరం నాలుగు దిక్కులా రచయితలు, కవులు, అవారుడు గ్రహీతలు, సాహిత్య వైపరీత్యాలు ఊరికూరికే కనపడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సరస్వతి మీద ఒట్టు రచయితల పేర్లు తెలుసు, వారు వ్రాసిన ఒక్క వాక్యం కూడా తెలీదు. రాసేవారు మాత్రమే తెలుస్తున్నారు రచన అందడం లేదు. ఏం రాశారో ఆనవాలు లేదు, చూసిన తనని పోల్చుకుంటే చాలన్నంత అల్పసంతోషి అయిపోయినాడు సృజనకారుడు.

అంతిమంగా పుస్తకాలని అంకితం ఇస్తారని నాకు తెలుసు, కానీ రాసుకున్న ఒకనాటి పాత మూటలోని అనుభవాల మాటలని అంకితం ఇస్తారో లేదో తెలీదు. ఈ రోజుకూ నాలోని చదువు ఆర్చుకుపోకుండా నాలోని చదువరిని కాపాడుకోజూసే నా మిత్రులు శ్రీ శ్యామ్ నారాయణగారికి ఈ పలుకులను అంకితం చేసుకుంటున్నాను

అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...