ఇది సిలబస్ కదా! అనగా బోధించుట, జ్ఞాన గుళికలు మింగించుట వంటిదేం లేదా మరి? అని నా రచనలు చదివే రెండున్నర పాఠకుల్లో ఒకరు అడిగారు. పాఠకుడిని పాఠకుడితోనే ఎదుర్కోవాలనేది దాన వీర శూర కర్ణలో శకుని నేర్పిన సూత్రం. ‘నువ్వు రాసేది సిలబస్ కాదు మిత్రమా, ఇది న్యూ సిలబస్! అనగా గ్రామరు బద్దలు కావడం. నువ్వేం వ్రాస్తే, గీస్తే అదే సిలబస్!’ అని మిత్రుడు యాకూబ్ పాషా ఇచ్చిన ధైర్యంతో ఆ విధంగా ఈ నెల కూడా సిలబస్‌ని చచ్చినట్లు మీ భుజాన వేసి ముందుకు సాగుతా…
మనకు వట్టిపుణ్యానికి తెలిసిన విషయాలు రెండు కలవు. సూర్యుడు తూర్పున ఎక్కి పడమట దిగుట. దీని గురించి మళ్ళీ ఎప్పుడయినా చెప్పుకుందాం. రెండు బాపూ గొప్పవాడు, బడా చిత్రకారుడు, ఎలా? అంటే ఆయన బొమ్మలు బాగా వేస్తారు, నవ్వించే కార్టూన్లు గీస్తారు. రంగులు లేతగా బావుంటాయి (ఏంటి బావుండేది? ఆయన ప్రాణానికి రంగులు ఎంత హింసో తెలుసా? నిజంగా ఆయనది గొప్ప రంగుల శైలి. కానీ ఆయనకు కలర్ బ్లైండ్‌నెస్. మేమిద్దరం కలిసి రంగులని గుర్తు పట్టడం ఎలా అనే ఆట ఆడుకునేవాళ్ళం. ఆ ముచ్చట ఎప్పుడో ఒకప్పుడు వ్రాస్తే వ్రాస్తానేమో. ముందు ముందు నా పాఠకుల సంఖ్య కనీసం మూడూముక్కాలు కానీ.)
అయితే నా సంగతి మీలా కాదు. భూమ్మీద పుట్టినప్పటి నుండి బొమ్మల మీదే మనసు పెట్టుకుని ఉన్నా కదా. నాకు బొమ్మల గురించి బాగా తెల్సును. పైగా బొమ్మలు సూపర్ అనే మెజారిటీ పాఠకులకు (పాపం ఒక పాఠకులే అని ఏవుంది, బొమ్మలేస్తాం అనుకునే ఆర్టిస్టులకు కూడా బొమ్మల గురించి తెలీదు!) ఒక్క బాపూ బొమ్మే కాదు ఏ బొమ్మ గురించి కూడా తెలీదని, తెలుసుకోవచ్చనే విషయం కూడా తెలీదని కూడా నాకు తెలుసు. అంత మాత్రానికే ఈగోలు బద్దలుగొట్టుకుని రొమ్ములు విరుచుకుని గోదాలో దూకనక్కరలేదు. సింపుల్ లాజిక్. పుట్టుకతో నీకు కార్ డ్రయివింగ్, ఆరిపోయిన ట్యూబ్‌లైట్ తాలూకు స్టార్టర్ మార్చడం, కళ్ళంలో గడ్డి తెచ్చి బుట్టలో ఒత్తుగా పెట్టి అందులో కోడి గుడ్లు ఉంచి దానిపై పెట్టను నైస్‌గా కూచోబెట్టడం మాత్రం వచ్చునా? నేర్చుకోలా? ఇదీ అంతే! తెలుసుకో, నేర్చుకో.
గీత, రంగు, విసురు, బ్యాలెన్స్, కూర్పు అనే కంపోజింగ్, ఎక్స్‌ప్రెషన్… ఇవన్నీ తెలియాలా! తెలీకపొయినా పర్లా. స్పందించే మనసు ఉంటే ఇవన్నీ హృదయానికి హత్తుకుపోతాయి. ‘వక్త్ కర్‌తా జో వఫా ఆప్ హమారే హోతే’ అనే ముఖేష్‌ని విని కన్నీరు కార్చడానికి అది ఆహిర్ భైరవ్ రాగమని తెలిసి ఉండాలా? లేదు కదా? అట్లానే బొమ్మని చూసి ముచ్చట పడ్డామంటే అది బాపూ బొమ్మ చేసే ఇంద్రజాలం కదా. అయినా సరే! పోన్లే అనుకుని అక్కడే ఆగిపోకుండా ఇవన్నీ తెలుసుకోవచ్చు. తెలుసుకుని పరమభీకరమయిన చిత్రకళ అనే విద్యని కూలివాడికన్నా అన్యాయంగా శ్రమించి అందులో సింప్లీతనాన్ని సాధించిన ఆ మహా శ్రామికుడికి అతగాడి ప్రతి బొమ్మలకు పరి పరి దండాలు పెట్టుకోవచ్చు.
ఇక్కడ పాఠకులకు తెలవాల్సిందితో పాటు చిత్రకారులకు కూడా తెలవాల్సిన సంగతులు ఉన్నాయి. మీకు తెలుసా? సంవత్సరాల తరబడి ఇండియన్ ఇంక్ లైన్ గీస్తున్న చిత్రకారులలో చాలా మంది జీవితంలో కుంచె పట్టి ఎరుగరని! క్రోక్విల్ చప్పుడు తెలిసి ఉండరని! చార్‌కోల్‌తోనో, ఫెల్ట్ టిప్ పెన్‌తోనో, రోట్రింగ్ ఐసోగ్రాఫ్ కాని, బౌ పెన్ కాని వాడి ఉండరని! మన దగ్గర చిత్రకారులు చాలామంది ఏకపత్నీవ్రత పద్ధతి ఆసాములు. కనీసం స్త్రీ వ్యామోహం నయం, పరస్త్రీ మీద మోహం ఉంటుంది. చిత్రకళ మరీ అన్యాయం. అలవాడుతున్న ఒకే ఒక పెన్నో బ్రష్షో తప్పనిస్తే మరో ముచ్చట వంక చూద్దామన్నా చేతకాదు. దీనికి చక్కగా ఇంపొటెన్స్ అని పేరు పెట్టుకోవచ్చు.
కాబట్టి బాపూ బొమ్మ అందం చందం చూడ్డం ఒక పని. అది కాక బిహైండ్ ది ఆ అందచందాలు, ఆ బొమ్మ వెనుక చెప్పే కథ, ఆ గీతల వెనుక పనిముట్ల మర్మం, ఈ చిన్న వ్యాసంలో వీలయినంత విప్పిచెప్పే ప్రయత్నం చేస్తా. క్లాస్ అయిపోయాక మీరు ఇంటికి వెళ్ళి బాపు బొమ్మల పుస్తకాలు ఏవైనా ఉంటే అవి ముందు వేసుకుని మిగతా బొమ్మలు ఏం కథలు చెబుతాయో వినే హోమ్‌వర్క్ చెయ్యండి.
డ్రాయింగ్ నేర్చుకోడం అతి ముఖ్యం. పెన్సిల్ రహస్యం తెలిశాకా ఇంక్ చెయ్యడం, రంగు పూయడం అనే దారిలో నడుస్తూ…స్తూ…స్తూ ఊహని అంది పుచ్చుకోవాలి. వీటన్నిటిని ఆకళింపు చేసుకున్నాకా వచ్చిన డ్రాయింగ్ పద్దతులని సవాల్ చేస్తూ బొమ్మని రకరకాలుగా తీగపై సర్కస్ భామని ఉయ్యాలలూపినట్లు ఎన్ని విన్యాసాలయినా చేయించవచ్చు. అయితే ఇందులో ఒక అత్యంత ముఖ్య విషయం ఉంది. దానికి కాంపోజిషనని పేరు. ఇది ఎలా వస్తుందో నాకూ తెలీదు. కోటికి పదిమంది చిత్రకారులకు కూడా ఇది ఎందుకు పట్టుపడదో కూడా నాకు తెలీదు. తెలిసినవారు ఎవరైనా దీని గురించి చెబుతానంటే బుద్దిగా వినడానికి నేను హాజిర్ హూఁ! కాంపోజిషన్ రావడమంటే నువ్వు వారెన్ బఫెట్‌కు ఏకైక సంతానంగా పుట్టడం. కాంపోజిషన్ తెలిసిన వాడికి మిగతా విద్య ఏది రాకున్నా పర్లా. ఒక్క కాంపోజిషన్‌తోనే తన ముద్ర గట్టిగా ముద్రించగలడు. అయితే అదృష్టవశాత్తు కాంపోజిషన్ తెలిసినవాడు డ్రాయింగ్‌ని కూడా ప్రేమించినవాడు అయి ఉండటం సర్వ సాధారణం. బాపూగారికి పై విద్యలన్నీ తెలుసు. పైగా కాంపోజిషను తెలుసు కదాని ఆయన తేలికతనం చూపి తేలిక బొమ్మ ఎన్నడూ గీసినవాడు కాదు. అందుకే ఆయన పూజ్యుడు. మరొకటి, మీకు కాస్త చిత్రకళావిద్య తెలిసి, దానిపై అనురక్తి కలిగి ఉండి, ఊరికే అలా కుంచెనో క్రోక్విల్‌నో బౌ పెన్‌నో చేబూని కాగితంపై ఇంక్ బొమ్మ గీయ ప్రయత్నించండి. బ్రష్ కొనుక్కుని ఉంటే సరిపోదు. బ్రష్‌తో ఇంకు చెయ్యడం అంటే గంటకు 120 మైళ్ళ వేగంతో మీరూ మీ కుంచె తుఫాన్ గాలితో ఢీ కొట్టడమే. అందుకు మీకు వాయుస్థంభన తెలిసి ఉండాలి. లేకపోతే అశ్వత్థామ శిఖముడి నుండి బయలుదేరిన ఆ గీత మందం చెడకుండా ఉపపాండవుల కుత్తుక గురి చూసే కత్తి మొనదాకా ప్రయాణం చెయ్యదు, చెయ్యలేదు. క్రోక్విల్ అనే నీలి బంగారం రంగు నిబ్ ఒకటి ఉంటుంది. దాని మొన సింగర్ కుట్టు మిషిన్ సూదికన్నా సున్నితంగా పదునుగా ఉంటుంది. మనం క్రోక్విల్ పడితే, ఒకటి నిబ్ అయినా విరగాలి లేదా కాగితం అయినా చిరగాలి. ఆ విధంగా కర్ర విరగకుండా ఆ కాలసర్పము చావకుండా కళాఖండం కాగితానికి మిగలడం అసాధ్యం. బాపు అటువంటి క్రోక్విల్‌తో రివర్స్ ఆక్సెస్‌లో గీత లాగేవారుట. అంతే ఇస్పీడ్‌గా పుస్తకాల టైటిల్స్ కూడా వ్రాసేవారు!
బాగా క్లాసిక్ అయిన వాటర్ కలర్స్ కాకుండా పరమ తలకాయనొప్పి ఫోటో కలర్స్ అని ఉంటాయి. నిజంగా తలకాయనొప్పే అవి. వాటిని నీటిలో కలిపి బొమ్మలకు రంగులు అద్దేవారు బాపు. అదీ దేనిమీదో తెలుసా? ఎనభై జీయెసెమ్ జిరాక్స్ కాగితం లేదా నూరు జీయెసెమ్ బాండ్ పేపర్ మీద… జిరాక్స్ కాగితంపై అంత ఇంద్రచాపాన్ని సారించడం శివధనస్సు ఎత్తడం అంత సులువు కాదు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అందుకోసమయినా నన్ను చెప్పనివ్వాలి. ఇదంతా ఏభై కేజీల మనిషి ఎత్తిన పదివేల కేజీల బరువు విద్య. రేయింబవళ్ళు ఇంకు బుడ్డిలో మునిగి లేచిన సూర్యోదయాస్తమయాలే కాదు, తులసి దళంతో కృష్ణుడిని కాదని సరస్వతీదేవిని పూజించిన ఒక ప్రేమైక భక్తి కూడా.
మీరు ఏం చెయ్యండంటే ఒక తెల్లదో నల్లదో కాగితం తీసుకోండి. దాన్ని మధ్యలో ఎక్కడో ఒక చోట రెండున్నర ఇంటూ రెండున్నర సెంటీమీటర్ల వ్యాసార్ధంలో చతురస్రం కత్తిరించండి. ఇప్పుడు దాన్ని మీ బొమ్మల పుస్తకాల్లో బాపూగారిది కానీ ఏ ఇతర చిత్రకారుడు కానీ వేసిన బొమ్మ మధ్యలో ఉంచండి, బొమ్మ పూర్తిగా మూసుకుపోయి బొమ్మలో ఏదో ఒక భాగం మాత్రమే కనబడుతుంది కదా. అలా ఆ చతురస్రాన్ని బొమ్మ మీదుగా అంతా తిప్పండి. ఒక్క బాపూ బొమ్మ తప్ప మిగతావారు చాలామంది గీసిన బొమ్మల్లో గీతలు కానీ, చేతి వేళ్ళు కానీ, కనుముక్కు తీరు కానీ, చాచిన చేయి కానీ, ఏదీ సక్రమంగా ఉండదు. బొమ్మ మొత్తంలో కనిపించే బ్యూటీ ఒక్కో భాగాన్ని గమనించి చూస్తే ఎంత నిర్లక్ష్యపు అనాటమీ అది! ఎంత లక్ష్యరహితరేఖలవి! అని తెలిసే విద్య మీకు తెలిసిపోతుంది. హెయిర్ టు బాటమ్ బాపూ బొమ్మల్లో కన్సిస్టెన్సీ ఎక్కడా తొణకదు. కన్సిస్టెన్సీ ఏం బాపూ పెరట్లో కాచిన జామపండు కాదు. ఆ నిలకడ బొమ్మలో రావడం కోసం కాగితాలపై కాగితాలు నింపేవారు ఆయన. కుదరని బొమ్మలు చింపేవారు. మళ్ళీ మళ్ళీ కుదిర్చేవారు.
ఇక్కడ ఊరికే కొన్ని బొమ్మలు ఇస్తున్నా. ఒకటీ రెండు మాటల్లో వాటిగురించి వివరించే ప్రయత్నం చేస్తా. మీకు తరువాత్తరువాత బొమ్మలు ఎలా చూడాలో నా వంటి చిత్రకారులని ఎందుకు గౌరవించకూడదో తెలిసిపోతుంది. నాకు నేను చేసుకునే జస్ట్ సూయిసైడ్ ఇది. అయినా పర్లా. సత్యం పలికేందుకే నా వంటి కారణజన్ములు అకారణంగా మీ వంటి వారి మధ్య పుడతారు. ఆ విధంగానయినా నన్ను ఎందుకు గౌరవించాలో మీకు తెలిసి వస్తుంది.
సంచలనమ్ అనే బొమ్మ చూడండి. చిత్రకళా వ్యాకరణం ఎంత పట్టుబడకపోతే దాన్ని తోసిరాజని ఇట్లా బొమ్మ పుడుతుంది? నన్ను నమ్మండి, మీకు వేరే దారి లేదు. మానవ శరీర నిర్మాణాన్ని, బోన్ స్ట్రక్చర్‌ని గౌరవిస్తూనే ఇటువంటి బొమ్మ గీయగలిగిన, ఊహించగలిగిన, ఈ పోజ్‌లో కూచోబెట్టగలిగిన మరో మనిషి మరొకరు లేరు, ఉన్న ఒక్కరూ మరిక లేరు. తల ఏమో పూర్తిగా అటు నూటా ఇరవై డిగ్రీలలో, ఎద తాలూకు ఆ గుండ్రాలు రెండూ మనవేపు తొంభై డిగ్రీలు. మరి నడుం మాత్రం ఎలా ఆ పైకి జరిగి నూటా యాభై డిగ్రీలవైపు చూస్తోంది? ఇటు కాలు సపాటుగా సున్నా. ఈ మొత్తం మూర్తిని బ్యాలెన్స్ చేస్తూ చుట్టూ అల్లుకున్న ఉత్తరీయం. అలా కూర్చున్న మనిషి బరువు బ్యాలెన్స్ చెయ్యడానికి తంబురాని పట్టుకున్న ఆ చేయి పట్టిన పట్టు.
రాలీ రాలని పువ్వులో అత్యంత ప్రధానం కాంపోజిషన్. ఒకటీ రెండు మూడు. కథని అమ్మాయి వైపు నుంచి చూడమంటున్న బొమ్మ. అలా అని ముగ్గురిలో ఏ ఒక్కరిని తక్కువ చేసింది లేదు, ఎవరి హావభావాలు వారివే. ఆ అమ్మాయి నిలుచున్న విధం, కూచున్న మనిషి పరామర్శ, రోగి మొహంలో నీరసం. కథ మూడ్ చెప్పడానికి బాపూ ఇక్కడ బ్రష్ వాడారని గమనించండి. ప్రతి టూల్‌కు ఒక కెమిస్ట్రీ ఉంటుంది. ప్రతి రంగుకు ఒక అస్తిత్వం ఉన్నట్లు. నలుపు విషాదానికి, నిరసనకూ, ఎరుపు చైతన్యానికి, విప్లవానికి వాడినట్లు.
వీడు ఏదో మాడగొట్టాడు. ఆ పెద్ద కళ్ళ మధ్య చుక్కలు, ఎగిసిన కనుబొమలు, ముఖ్యంగా వాడి వేళ్ళ మధ్య చెదిరిన చొక్కా కనపడని వాడి ముక్కు పొడవును కూడా కొలుస్తోంది. నుదుటిపై జుత్తు వీడు కొంటెవాడు సుమా అని తెలుపడం. మిగతా వాతావరణం అంతా కుంచె తాలూకు వేగం. ఎక్కడా పద్దతి చెడని విధంగా.
ఒక కురూపి చేతిలో అమ్మాయి. క్రోక్విల్ రేఖలు కత్తిపెట్టి కోసినట్టు లేవూ! ఆకాశంలో మర్డర్ జరిగినట్లు. అమ్మాయి బేలగా బ్రష్ వర్క్. ఈ మనిషి చుట్టూ స్ట్రయిట్ హేచింగ్. గుంజి పడేసినట్లు… కను మధ్య చుక్కలు కాస్త అటూ ఇటూ. వికారంగా పళ్ళు పెదాలు. కానీ ఇంత వక్రరూపంలో కరుణ కొట్టొచ్చినట్లు అనిపించేలా గీయాలంటే! ఎంత సాధన! ఎంత వేదన! అంతకు మించి తను ఉన్న కాలంలో కానీ లేని రోజున కానీ బాపూకు పోటీ అనేదే లేదు. అయినా ఈ చిత్రకారుడు తనకు తానే పోటీ అనుకుని ఉంటాడా?
ఈ బొమ్మ చూడండి. నిజానికి ఆ అమ్మాయి వెనుకనున్న గోడ అక్కడ తగిలించిన బట్టలు ఎత్తేస్తే ఆ అమ్మాయి ఇంకా ఎక్స్‌పోజ్ అయ్యేది. అయినా ఆ గీతల మధ్య ఈ అమ్మాయి ఠీవిగా తల ఎత్తుకు ఉంది. బ్రష్‌ని అడ్డంగా లాగి చిత్రించిన గీతలు. క్రికెట్‌లో దీన్నే స్వీపింగ్ షాట్స్ అంటారు. ముఖ్యంగా ఆ కూచున్నవాడి భంగిమ. పట్టు పోకుండా ఆ పేముకుర్చీని బలంగా పట్టుకున్న ఒక చేయి, దాన్ని ఇంకా బలంగా పట్టుకున్న మరో చేయి. అట్లా కూచోవాలంటే నిజంగా బలంగా బలవంతంగా కూచోవాలి. ఆ పై, నీకు నాకు ఏంటి పో అనే అలక కావాలి.
ఇలా ఎంతయినా రాసుకుంటూ పొవచ్చు. కానీ వేళ్ళ నొప్పి. వృథా ప్రయాస. చూసేదెవరు, చదివేదెవరు, బాపూ అని ఆకాశం వేపు తిరిగి దండం పెట్టుకుని మళ్ళీ మళ్ళీ గర్వపడేదెవరు? ఈ మొహాలకు ఇది చాల్లే.
(సశేషం)