నైన్ త్రీ నైన్ వన్ జీరో టూ ఎయిట్…

ఈ రోజు ఏప్రిల్ 30 శుక్రవారం సంవత్సరం 2021. మళ్ళీ నిన్న ఏం తేదో, ఏ వారమో చెప్పనక్కరలేదుగా. రాత్రంతా నిద్రలో ఒకటే నెంబర్ బుర్రలో తిరుగుతూ ఉన్నది 9391028… ఫోన్ నెంబర్లు, ఎస్టీడి కోడ్‌లు నాలుక మీద ఆడ్డం మానేసి చాలాకాలం అయ్యింది. గుడ్డివాడికి మల్లే చూపుడువేలు గాజు అద్దాన్ని తడుముకునే కాలపు ఈ రోజుల్లో కూడా ఈ నైన్ త్రీ నైన్ వన్ జీరో ఏమిటి?

సత్యంగా చెప్పనా? చిన్న ప్రపంచం నాది. కష్టపడి ఇష్టపడి కట్టుకున్న బుల్లి ప్రపంచం, అందులోని నా అనుకునే మనుషులు గుప్పెడు. నిన్నటినుండి బావురుమంటున్నట్టు ఉంది. రేవు ఎండి పొడి అయిపోయినట్లుగా ఉంది. కూచుని అలా గుడ్లప్పగించేసి అలౌకకింగా అంతు తెలియని వెనకలకి చూస్తూ వెళ్ళిపోయిన వారందరిని వెతుక్కుంటున్నట్లుగా ఉంది జీవితం. బ్రతుకు పరమ భయంగా బోరుగా ఉంది. నావాళ్ళు అనుకునే మనుషులు అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడెలా గడపడం, ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ కూచుని ఉండాలి? ఇన్ టైమ్ సినిమాలో మాదిరి ఈ మణికట్టు మీద ఆయుషు ఇంతేనని సంఖ్యలుగా తరగరాదా ప్లీజ్?

నైన్ త్రీ నైన్ వన్ జీరో టూ ఎయిట్… రిలయన్స్ నెంబర్ ఇది. చంద్రగారు అప్పుడు ఒకసారి అమెరికా వెళ్ళారు. కొన్ని నెలల తరువాతో, సంవత్సరం తరువాతో తిరిగి వచ్చారు. ఈ ఫోన్ నెంబరు మురిగిపోయింది. ఫోన్ నెంబర్లని అచ్చంగా ఉంచుకోడం ఇప్పుడు ఉన్నంత సులువుగా అప్పుడు లేదు. చంద్రగారి స్నేహితుడు పూర్ణచంద్రగారు కొన్ని చాలాసార్లు గిర్రున అటూ ఇటూ గిరికీలు కొట్టి అదే నెంబరు మళ్ళీ సాధించారు.

చంద్రగారి బొమ్మల గదిలో ఆయన బొమ్మలేయడానికి కూచునే కుర్చీ బావుండేది, ఇది మా నాన్నది అనేవాడాయన. ఆ కుర్చీ ఇప్పుడు నాకు కావాలి. ఎవరిస్తారు? ఎవరిని అడగాలి? 100 జిఎస్ఎమ్ ఎక్జిక్యూటివ్ బాండ్ మీద బొమ్మలు వేసేవాడయన. ఆ కాగితం నాకు, నా బొమ్మలకు మప్పింది ఆయన గీసిన బొమ్మలే. అయితే ఆ కాగితం గురించి ఆయన నాకు చెప్పలేదు. సుప్రభాతం పత్రికలో గడియారం శ్రీనివాసరావుగారు చెప్పారు, చంద్రగారు ఎక్జిక్యూటివ్ బాండ్ మీద బొమ్మలు వేస్తారని. అప్పుడు ఉన్నంత మంచి బాండ్ పేపర్ ఇప్పుడు రావడంలేదు. ఒకసారి చంద్రగారు అమెరికా నుండి వస్తూ వస్తూ నాకోసం బొలెడు స్ట్రాత్‌మోర్ పేపర్ ప్యాడ్స్ తెచ్చి ఇచ్చాడు. వీటి నిండా బొమ్మలు వేసి అదయ్యాకా దాని వెనుక పేజీ బ్రౌన్ రంగులో ఉన్నది, ఇంత మందమున్నది, అది మాత్రం తనకు వెనక్కి ఇచ్చేయమన్నాడు. నాకు వస్తువులంటే లెక్క లేదు. లెక్క మనుషులతోనే. ఆ బొమ్మల కాగితపు ప్యాడ్‌లు కొన్ని బాపుగారికి ఇచ్చేశా, ఇచ్చి ఇది కూడా చెప్పా: “బాపుగారూ, వీటి నిండా మీరు బొమ్మలు వేసి అదయ్యాకా దాని వెనుకపేజీ బ్రౌన్ రంగులో ఉన్నది, ఇంత మందమున్నది చూడండి! అది మాత్రం నాకు వెనక్కి ఇచ్చేయండి, ఎందుకంటే అవి చంద్రగారు అడిగారు.” బాపుగారు నవ్వారు. “అన్వర్‌గారు, మనమిద్దరం కలిసి చంద్రగారి ఇంటికి ఒకసారి వెడదామా?” “ఓ, వెడదాం సార్. ఆయన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి!”

చంద్రగారి దగ్గర పుస్తకాలు చాలా ఉన్నాయి. ఎప్పుడూ నాతో అనేవాడు: ‘ఇవన్నీ ఎవరికి ఇస్తా అన్వర్? నాకున్నది నువ్వే కదా? అన్నీ నీకే.’ ఒకసారి నేను, ఆర్టిస్ట్ హంపి కలిసి చంద్రగారి ఇంటికి వెళ్ళాం. ఆయన తన పుస్తకాల గురించి మాట్లాడుతూ, ‘ఇవన్నీ ఎవరికి ఇస్తా అన్వర్? నాకున్నది మీ ఇద్దరే కదా? అన్నీ మీకే’ అన్నాడు. మరోసారి ఆయన దగ్గరికి ఆర్టిస్ట్ ఆంజనేయులుగారితో వెళ్ళా. అప్పుడూ అన్నాడు కదా ‘ఇవన్నీ ఎవరికి ఇస్తా అన్వర్? నాకున్నది మీరే కదా? అన్నీ మీ ఇద్దరికే!’ నాకు అర్థం అయ్యింది.

మోహన్‌గారు చెప్పేవారు: ఒకసారి హైద్రాబాద్ బుక్ ఎక్జిబిషన్‌లో (అంటే దాదాపు ఇరవై ఏళ్ళ క్రితపు పుస్తక ప్రదర్శన అన్నమాట. బ్లాక్ అండ్ వైట్ టివీ ప్రోగ్రాముల్లాంటి మంచి పుస్తక ప్రదర్శన రోజులవి. ఓ… ఊరుకూరుకే సెల్ఫీలు దిగే ఈనాటి గజ్జి దినాలు కావవి.) ఒక బుక్ కనపడిందబ్బా! జపనిస్ న్యూడ్స్‌ది. చంద్రగాడు అది కొనేశాడు. పుస్తకం నిండా బొలెడన్ని ఉత్తలబిత్తల పోజులు. (మోహన్‌గారు వాటిని న్యూడ్స్ అంటారు. ఉత్తలబిత్తలు అనేది నా మాట) అవి చూపిస్తూ చంద్ర ‍‘అరేయ్ మోహన్, ఈ జపనీస్‌గాళ్ళ బెల్లాలు ఏంట్రా ఇంత తెల్లగా చిన్నగా ఉన్నాయ్ బలపాల్లా’ అని నవ్వేశాడు. ఆ పుస్తకం కనపడితే నువ్వు కొట్టేయబ్బా అన్నారు.

చంద్రగారికి నేనంటే భలే ప్రేమ. నిజమేనా? అవును నిజమే! ఆయన పుట్టినరోజు పార్టీలకు, ఇంట్లో జరిగే శుభకార్యాలకు మరే ఆర్టిస్ట్‌ని పిలిచేవాడు కాదు. నన్నే పిలిచేవాడు. అలాంటి ఒక పుట్టినరోజు సందర్భంలోనే ఫిల్మ్ నగర్ క్లబ్‌లో మొదటిసారిగా వేమూరి సత్యంగారిని, శ్రీలక్ష్మి అమ్మగారిని చూసింది. అప్పుడు వారెవరో నాకు నేనెవరో వారికి తెలవదు. ఆ పార్టీలో పేపర్ నాప్కిన్‍పై బ్రష్ పెన్ పెట్టి చంద్రగారి లైవ్ డ్రాయింగ్ వేస్తే సత్యంగారు ఆశ్చర్యపోయాడు. ఇంకోసారి బాగ్‌లింగంపల్లి అంబేద్కర్ కాలేజిలో చంద్రగారి బర్త్‌డే పార్టీ. సాయంకాలం సమయం. భోజనాలు మొదలయ్యాయి. రెండు ముద్దలు తిన్నామో లేదో ఒక వార్త వచ్చింది. లుంబిని పార్క్, గోకుల్ చాట్, రెండు చోట్ల బాంబులు పేలాయని, మనుషులు కుప్పలుగా చనిపోయారని. నిజానికి ఆ రోజు విందు భోజనం చాలా రుచిగా ఉండింది. కానీ మనసు చేదుగా అయి ఏడ్చింది. ఇంకోసారి ‘అర్జంటుగా రా!’ అని ఫోన్ చేశాడు. గబగబ అయితే లేటవుతుందని బగబగ స్కూటరెక్కి హౌసింగ్ బోర్డ్ చేరుకున్నా. ఆక్కడి నుండి ఆయన స్కూటర్ మీద కాచీగూడా సందులు అన్ని తిప్పి ఒక చిన్న హోటల్‌లో కీమా రొట్టె తినిపించాడు, మొదటి ముక్క కొరగ్గానే నా మొహం చూసి ‘బావుంది కదూ?’ అని ఇష్టంగా అడిగాడు-‍అచ్చం నేను నా పిల్లాడు మోహన్ని అడిగినట్టే! హైద్రాబాద్ సాయంత్రాల సాహితీ సమావేశాల అనంతరం అందరిని వెళ్ళిపోనించి నన్ను ఆగమనేవాడు, ఒంటి చేతి సైగతో. పేరు తెలియని రెస్టారెంట్ ఒక దానిలోకి దారి ఎరుగని త్రోవల్లోకి బండి తోలించి టుడేస్ స్పెషల్స్ తినపెట్టేవాడు. అప్పుడు తినబడ్డ తిండి అల్లా అరిగి జీర్ణం కాలా, ఇప్పుడు కరిగి కన్నీరు అయి బయటికి వస్తుంది-మాసిపోని ఆ పాత తేదీల లెక్కాజమా ఇపుడు చూస్తుంటే.

చంద్రగారికి ఎప్పుడూ చెప్పలేదు డివైన్ లవర్స్ కథ ఒకటి. అదంతా మధుగాడే చేశాడు. ‘ఒరే అన్వర్, భలే సినిమా అంటరా నాయనా! మొత్తం ఓపెన్‌గా చూపిస్తారంటా. కావాలంటే టికెట్ డబ్బులు నేను పెట్టుకుంటా. నువ్వు మళ్ళీ ఇద్దువు గానిలే!’ సాయంకాలం సినిమాకి బయలుదేరాము. సంజీవనగర్ గేట్లో విశాలాంధ్ర పుస్తకాల బండి కనపడింది. ఎక్కీ ఎక్కగానే చంద్ర బొమ్మలతో వాత్సాయన కామసూత్రాలు పుస్తకం. టికెట్ సంగతి మధుగాడిదేనన్న ధీమా ఉందిగా, పుస్తకం కొనేశా. వెళ్ళిందేమో డివైన్ లవర్స్ అని పరమపట్టుడు సినిమా; అందులోకి వాత్సాయన కామసూత్రాలు పుస్తకం పట్టుకుని ఎంటర్ కావడం అనేది కామతీక్షణతకు పరాకాష్ట. సినిమాకి వెడుతూ ఎవడయినా సంచులు, బ్యాగులు పట్టుకెడతాడా? మరి పుస్తకం. కొట్టేసిన పుస్తకం పట్టుకోవాలన్నా పెట్టుకోవాలన్నా ఒకటే దారి-చొక్కా పైకెత్తి పొట్ట దగ్గర ప్యాంట్ లోపల దాపెయ్యడం. ‘పుస్తకాలు లైబ్రరీ నుండి నేనూ అలానే కొట్టేసేవాణ్ణబ్బా’ అని మోహన్‌గారు చెప్పినపుడు వారసత్వం సినిమాలో ‘ఇది తరతరాల చరితం’ అనే పాట గుర్తుకురావడం అనేది కేవల యాదృచ్ఛికం. ఆ సాయంకాలం ఆ సినిమా ఏం చూశానో నాకు గుర్తు లేదు కానీ ఏ క్షణాన ఎవడు నా వద్దకు వచ్చి నా చొక్కా పైకెత్తేసి ‘యు ఆర్ అండర్ అరెస్ట్’ అని నన్ను మా నాయనా చిన్నాయనల కస్టడికీ అప్పగిస్తాడోనని భయం.

చంద్రగారిని మొదట చూడ్డం, ప్రత్యక్ష పరిచయం కూడా భలే తమాషా. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక సభకు నేను, మోహన్‌గారు, ఖలీజ్ జీబ్రాన్ ఫేమ్ శైలజగారు వెళ్ళాము. విజ్ఞాన కేంద్రం ఎదురుకు రాగానే మా ఎదరగా నీలం స్కూటర్ మీద రయ్యిమని నీలం డెనిమ్ చొక్కా వేసుకుని చంద్రగారు దిగారు. నేను చంద్రగారిని చూడ్డం అదే మొదటిసారి, అంటే అంతకాలం చూశానని అనుకున్నది మంచుపల్లకి అనే సినిమాలో ’గాంధి’ పాత్రధారిని చూసి ఆయనే చంద్ర అనుకుంటూ గడిపా. కావలిస్తే పందొమ్మిదివందల తొంభయ్‌ల్లో శ్రీ సుంకర చలపతిరావుగారు ప్రచురించిన ’చిత్రకళారత్నాలు’ పుస్తకం చూడండి. అందులో చంద్రగారి ఫోటో చూస్తే ఇకపై మీరు కూడా చంద్రాని గాంధి అనో హరీష్ అనో అనుకోడమే మొదలెడతారు. శ్రీమతి శైలజగారిని అలా సభలోకి సాగనంపి మోహన్‌గారు సిగరెట్ అంటించుకుని చంద్రగారికో సిగరెట్ అందిస్తూ నన్ను చూపించి, “ఇతడు అన్వర్, నీ అభిమాన్స్. నువ్వు వేసిన వాత్సాయన కామసూత్రాల బొమ్మల్ని పెద్ద సైజ్‌లో వెయ్యడానికి గళ్ళు కూడా కొట్టుకున్నాడు” అని పరిచయం చేశాడు. “మరి వేశావా?” అని అన్నది చంద్రగారు నాతో మాట్లాడిన మొదటి మాట. ఇదంతా రాస్తూ నాకు నిస్సత్తువుగా ఉంది. కళ్ళ మీద చత్వారపు పొర కమ్మినట్లుగా ఉంది. పొరదాటి రాలేని దుఃఖతీవ్రతతో ఉంది.

ఎట్లాంటి మనుషుల మధ్య నేను గడిపానో తెలుసా మీకు? వాకింగ్ అమాంగ్ లయన్స్ అంటారే! టెంపర్ ఉన్న మనుషులు, దర్జా అయిన వ్యక్తిత్వాలు, సందడిగా సెలయేళ్ళుగా నడిచినవాళ్ళు. డబ్బు భిక్షుకులు, కీర్తి ముష్టివాళ్ళు, తీవ్ర కపటులు, నక్కల వంటి మానుషుల మధ్య వెంపలి చెట్టు వ్యక్తిత్వాల మధ్య ఇంకా జీవితాన్ని లాగించాలంటే భయంగా ఉంది. తెలీక ఈ మహానగరానికి వచ్చా, తెలీక బొమ్మలేశా, తెలీక సరస్వతి నమస్తుభ్యం అని పంక్తులు తిరగేశా. తెలీక ఈ పదీ పన్నెండుమంది మనుషులే నా ప్రపంచం అనుకున్నా. తెలిసి ఉంటే, టౌన్ పక్కకెల్లద్దురో డింగరి అనే పాటని మనసుకు తెలుసుకుని ఉంటే మా నూనేపల్లెలో స్కూటర్లకు, నాలుగు చక్రాల కార్లకు పంచర్లు వేసుకుందును కాదా? బొగ్గులైను దిక్కున ఏ జమీలానో పెళ్ళి చేసుకుని ఉగ్గాణి – టీ హోటేలు నడుపుకునేవాణ్ణి కాదా? అంతటినీ పొగొట్టుకుని పాతికేళ్ళ వెనక్కి చూసుకోడమా సాధించుకున్నది ఇక్కడ?

‘గిది బస్తి కొడకా! జర బద్రం బిడ్డ’ అనేవాడు ఆయన నాతో. రాని డబ్బులకు బొమ్మలు గీసి గీసి అరిగిపోయిన పదిపైసాల బిళ్ళల్లాంటి నా అరచేతులని చూసి. మూసిన నా అరచేతుల వేళ్ళని బలవంతంగా విడదీసి అందులో ఆ రోజు నా ఇంటికి చేరవలసిన బస్సు కిరాయో, సబర్బన్ రైలు టికెట్ డబ్బులో ఉంచేవాడు. డబ్బు మనిషి కాదు చంద్ర; కథ, కవిత, సాహిత్యం, సినిమా మనిషి కూడా కాదు ఆయన. మీకు తెలీదు కానీ చివరికి బొమ్మల మనిషి కూడా కాదు చంద్ర. ఈ సంగతి మా ఇద్దరికే తెలుసు. అందుకే మా మాటల్లో ఎప్పుడూ పెద్దగా బొమ్మల గురించి మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఎవరయినా పెద్ద ఆర్టిస్ట్ చనిపోగానే తెల్లారి కాగితపు పేపర్లకు కార్టూనిస్టులు వేసే బొమ్మలలో ఆ సదరు చిత్రకారుడు ఒక సంచి తగిలించుకుని అందులో ఒక కాగితపు రోలు, రెండున్నర కుంచెలు ఇరికించుకుని మేఘాల మధ్య స్వర్గమో ఇంకే శ్రాద్ధమో అనే ఒక పిండాకూడు ద్వారం దగ్గరికి వెడుతుంటాడు కదా, అటువంటి బొమ్మలని చూసినపుడల్లా మాకిరువురికి ఎక్కడ కాలాలో అక్కడ కాలేది. ‘త్వనే మత్ర తాండుణ్యం ద్వినియోగ ఫలిక’ అనే కథా కవితలకు బొమ్మలేసి బొమ్మలేసి ఇక్కడ రుబ్బుడు అయింది చాలదారా? ఇక్కడా బొమ్మలే అక్కడా బొమ్మలే అవుతున్నప్పుడు మరి గ్లెన్‌ఫిడిచ్, హన్‌డ్రెడ్‌పైపర్స్ సోమరసాలు ఎందుకురా? ఆక్రిలింకు ఇంకుల్లో మీడియాల కింద కలుపుకోడానికా? దేవకన్యలు, అప్సరసాలు దేనికిరా? జెట్ బ్లాక్ ఇండియన్ ఇంక్ పూసీ పూసీ ఎండిన కుంచెలు నిండిన నల్ల బోకులను ఆ కుసుమ కోమల అరచేతుల నిండా తోమడానికా? ఏం ఇంతకు మించి ఒక ఇంచికి కూడా ఈ బుర్రలు ఎదగవా? ఇక వేరే పనేం లేదా ఆర్టిస్టులకు, తెల్లారిన దగ్గరినుండి పీటర్ పాల్ రూబెన్స్ నుండి బాపు వరకు అనే ఒక తులనాత్మక పరిశీలన అని బ్రతుకంతా బ్రతకడానికి? ఇది జీవితమబ్బా! ఇందున తెల్లవారుఝామునుండి మళ్ళీ తెల్లవారుఝాము వరకు బోలెడు గంటలున్నవి, ఘడియలున్నవి, విఘడియలున్నవి, ఝాములున్నవి, ఆవులున్నవి, బర్రెలున్నవి, త్రాగడానికి వాటి పాల టీ కాఫీలున్నవి, గోడలమీద వాల్ పోస్టరులున్నవి, సినిమాలున్నవి, సినిమా లోపలా బయటా అందమయిన అమ్మాయిలున్నవి, అవకాశములున్నవి, పడక గదికి గడియ ఉన్నది. శక్తి కొరకు బాదాము, పిస్తా గింజలున్నవి. బ్రతికినంత కాలం, కాలాన్ని బ్రతికిస్తూ, చుట్టూ ఉన్న వాతావరణాన్ని నవ్విస్తూ, కవ్విస్తూ, కళ్యాణ కేళీ ఉత్సవంగా నిలిపాడాయన. పుస్తకాల నిధులుండేవాయన వద్ద. సినిమాల గుట్టలుండేవి. చిత్రకళా పచారి కొట్టుకు కొట్టు పడుండేది ఆ ఇంట్లో. మనిషి హృదయం లాగానే ఆ బొమ్మల గది తలుపులు తెరిచి ఉండేవి. నేను ఒక చేతిని ఆయన హృదయ ద్వారం దగ్గర ఆనించి మరో చేతితో నా చేయి పట్టినన్ని ఆయన రాశిపోసిన సంపదను అంది పుచ్చుకున్నాను. పుచ్చుకున్నవాడికి పుచ్చుకున్నంత. ఇచ్చిన చేయి బర్కత్, పుచ్చుకున్నవాడిది ఏమీ లేదు. ఇక్కడ వ్రాసినది అంతా గుడిలోకి వెళ్ళేముందు ద్వారం దగ్గర ఆగి గంట కొట్టిన చప్పుడు మాత్రమే. లోపలికి వెళ్ళి చూపించగలిగినంత చూపిస్తాను. వస్తారా? చూస్తారా మరి?

అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...