ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 6

అలా కాలం గడుస్తూ నేను హైస్కూల్‌కి ప్రమోట్ అయ్యాను. హైస్కూలు చదువులో సాంఘీకశాస్త్రం, సామాన్యశాస్త్రం, లెక్కలు వంటి మామూలుగా ఎప్పుడూ ఉన్న విషయాలే కాకుండా, కొత్తగా ఒక ప్రత్యేక విషయాన్ని ఐచ్ఛికంగా ఎంచుకోవలసి వచ్చింది; ఆ జాబితాలో వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం వంటివాటితో పాటు నాకెంతో ఆనందాశ్చర్యాలు కలగచేస్తూ పెయింటింగ్ కూడా ఒక సబ్జెక్ట్‌గా ఉంది. మా ఇంట్లోని పెద్దలకు నేను ఇష్టంగా చేసుకునే ఏ పనిలోనూ అకారణ జోక్యం చేసుకునే అలవాటు లేదు కాబట్టి, నేను వారిని ఏమాత్రం సంప్రదించనవసరం లేకుండానే బడిలో బొమ్మలు నేర్చుకోవడాన్ని ఐచ్ఛికంగా ఎన్నుకున్నాను.

మా తరగతిలో దాదాపు యాభై మంది విద్యార్థులము ఉన్నాము. వారానికి రెండుసార్లు నడిచే మా డ్రాయింగ్ క్లాసులో ప్రవేశం కొరకు నమోదు చేసుకున్నది కేవలం అయిదుగురు అబ్బాయిలము మాత్రమే. మన సమాజంలో కళలపై అంత గొప్ప గౌరవనీయమయిన అభిప్రాయం ఎప్పుడూ లేదు. సాధారణంగా జీవనానికి అత్యంతవసరమైన చదువు అనే సంప్రదాయక విషయ అధ్యయనంలో వెనుకబడినవారు, సమాజానికి ఎందుకూ పనికిరానివారు, తమ సమయాన్ని ఏదో విధంగా వెళ్ళబుచ్చాలని చూసేవారు మాత్రమే ఇటువంటి తరగతి గదుల్లో చేరి కాలం వెళ్ళబుచ్చుతారనేది తరతరాలుగా సమాజంలో పాతుకుపోయిన గట్టి నమ్మకం. సమాజం తాలూకు ఈ ఆలోచనకు అనుగుణంగానే నా పెయింటింగ్ తరగతి గదిలోని సహవిద్యార్థులు కూడా నిజానికి బొమ్మల మీద మక్కువతో కాక మరింత చదువు అనే పనిని తప్పించుకోడానికనే ఇక్కడికొచ్చి కూచున్నారు. వీరిలో ఏ ఒక్కరికి ఒక గీత గీయడం పట్ల కాని, ఇంత రంగు పులమడం పట్ల కానీ ఎటువంటి ఆసక్తి లేదు.

మా బొమ్మలు నేర్పించే మాష్టారు మహారాష్ట్రీయులు. ఆయన దేశంలోకెల్లా ప్రతిష్టాత్మకమైన జే. జే. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదువుకుని వచ్చినవారు. ఎప్పుడు చూసినా చక్కని వస్త్రాలంకరణతో టిప్పుటాపుగా, ఠీవిగా కనపడేవారు. ఆయన సుపారీ ప్రియుడు, వారి వద్ద నుండి అన్నివేళల సువాసనలొలికే తియ్యని వక్కపొడి వాసన వేసేది. మనిషిని చూస్తే తెల్లని తెలుపు. ఆయనది ఎంత చక్కని పారదర్శకమైన చర్మం అంటే, ఆ చర్మం కింద పాకి ఉన్న నరాలని, అందు ప్రవహిస్తున్న రక్తాన్ని కూడా స్పష్టంగా చూడగలిగేంత. ఆయన నోట్లో నీళ్ళు పోసుకుని తాగుతుంటే గొంతులోంచి జారుతున్న నీటి ధారని కూడా చూడవచ్చు మనం. క్లాసులో మొదటి రోజున ఆయన మా ఎదురుగా ఉన్న ఒక స్టూల్‌పై రెండు అడుగుల చతురస్రాకారపు చెక్కదిమ్మ నొకదాన్ని ఉంచారు. దానిని అనేక కోణాలలో చూపిస్తూ పెర్‌స్పెక్టివ్ డ్రాయింగ్ గురించి చిన్న క్లాసు తీసుకున్నారు. అదయ్యాకా ఒక వస్తువు లేదా ఒక మనిషి యొక్క పొడవు, వెడల్పు, లోతులను సరయిన కొలతల్లో చిత్రించడమేలాగో చెబుతూ, ఒక పెన్సిల్ తీసుకుని ఆ పెన్సిల్ పట్టుకున్న చేతిని బారుగా చాచి, ఒక కన్ను తెరిచి మరో కన్నుని మూసి తెరిచిన కన్ను నుండి చేత్తో పట్టుకున్న పెన్సిల్ సాయంతో వస్తువు కొలతలు తీసుకోవడం ఎలానో, ఆ తీసుకున్న కొలతల సాయంతో కాగితంపై చిత్రించడం ఎలానో వివరంగా చెప్పి ఆ ప్రకారం మా ఎదురుగా ఉన్న చెక్కదిమ్మ బొమ్మను గీయమని అన్నారు. చిత్రకళపై ముందునుండి నాకు ఉన్న ఆసక్తి వల్ల నేను ఇటువంటి సాంకేతిక టక్కుటమార విద్యలన్నిటిని ఎప్పుడో సాధన చేసినవాడిని కనుక ఇదేం నాకు కష్టతరమైన కార్యమేమీ కాదు. ఈ చదరపు సూత్రం ఆధారంతోనే తయారయిన ఇళ్ళు, భవనాలు, రోడ్లు, బెంచీలు, కుర్చీలు, వీధులు మొదలయిన వాటిని బొమ్మలుగా గీయడంలో నేను పుట్టగానే పరిమళించిన రకాన్ని అని మా మేష్టారికి తెలీదు. ఇప్పుడు తరగతి గదిలో వేగంగా, ఖచ్చితమైన కొలతలతో నేను బొమ్మని గీసిన విధానం చూసి ఆయన చకితులయ్యారు, ఇక ఇట్లాంటి కొన్ని ప్రాథమిక పాఠాల అవసరం నాకు లేదని ఆయనకు అర్థమయ్యి ఈ చిన్న చిన్న పాఠాల విషయంలో నన్ను మినహాయించి మిగతా పిల్లలకు బొమ్మలు నేర్పడంపై దృష్టి పెట్టారు.

ఆ రోజుల్లోనే మా అన్నగారి స్నేహితుడయిన చిత్రకారులొకరితో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన ప్రకృతి దృశ్యాలను నీటిరంగుల్లో చిత్రించేవారు. ఈయన ద్వారానే నాకు అప్పట్లో మైసూర్‌లోని కొంతమంది ప్రసిద్ధ చిత్రకారులతో కూడ మంచి స్నేహం కుదిరింది. ఈ చిత్రకారులంతా సంప్రదాయక పద్దతుల్లో చిత్రకళా విద్యను అభ్యసించినవారు. వారి వలన, వారి పనితనం వలన నాకు వారి వారి నైపుణ్యాల గురించి, వారి చిత్రరచనా శైలీ విధానాల గురించిన ఒక అవగాహన ఏర్పడింది. అయితే ఈ సంప్రదాయక చిత్రకారుల చిత్రీకరణ అంతా ప్రధానంగా కొన్ని మూసభావనలపై ఆధారపడి ఉండేది. వీరు సాధారణంగా గీసే చిత్రాలు ఎట్లా ఉండేవి అంటే ‘ప్రేమ’ అనే శీర్షిక గల్గిన ఒక చిత్రరాజం ఉందనుకొండి, అందులో గులాల్ గులాబి రంగు బుగ్గలతో ఒక లేత ప్రాయపు అమ్మాయి మంచం మీద వెల్లకిలా పడుకుని ఊహాలోకం వైపు దృష్టి సారించి ఉంటుంది. ‘మమత’ అనే మరో పెయింటింగ్‌లో అందమయిన తల్లితండ్రులు ముద్దులొలికే పాపను తమ మధ్య కూర్చుండపెట్టుకుని ఆ అమ్మాయి కేసి ప్రేమగా చూస్తుంటారు. వారికి కొంచెం పక్కగానే ఒక ఇత్తడి గిన్నెలో రకారకాల పళ్ళు, పాల గ్లాసు ఉంటాయి. ‘పల్లె పడుచు’, ‘గ్రామంలో సంధ్య వేళ’, ‘చెరువు ఒడ్డున సూర్యోదయం, సూర్యాస్తమయం…’ ఇట్లాంటి శీర్షికలు గల బొమ్మల గురించి మీకు కొత్తగా వివరించాల్సిన అవసరం ఉందనుకోవడం లేదు. ఈ తరహా చిత్రసంపద సృష్టి అంతా పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దాల యూరోపియన్ పెయింటింగ్‌ల నుండి ప్రభావితమైన దేశీయ కళాకారులు వాటి అనుసరణలుగా తాము కల్పించిన చిత్రరాజాలే. అయితే ఇటువంటి కళాఖండాలకు ప్రజలనుండి పెద్ద ఆదరణ, వాటితో ఇళ్ళను అలంకరించుకోవాలనే వెంపర్లాట, కళాభినివేశం వంటివి లేకపోవడం వలన చాలామంది కళాకారులు మరి గతిలేక సమాజంలో పెద్ద పేరుమోసిన వారివి, భారీగా ధనం కూడపెట్టిన వ్యాపారులవి లేదా రాజవంశీయులు, వారితో సంబంధ-బాంధవ్యాలు కలిగి ఉన్న ఘరానా వ్యక్తుల చిత్రాలను పెయింటింగులుగా చిత్రించడం ద్వారా జీవనోపాధి పొందేవారు. ఈ పోర్ట్రెయిట్‌లు వేయించుకున్న పెద్దమనుషులు వాటిని వారి ఇళ్ళల్లో, ప్రభుత్వ భవనాల్లో, వారు విరాళాలిచ్చిన సంస్థల్లో భారీగా ఉండేలా చూసేవారు. ఈ రోజుకూ అదే సంప్రదాయం కొనసాగుతుంది. మనిషికి తన మొహం తాను చూసుకోవడంలో ఉన్న ఆసక్తి, ఆకాంక్ష, పిట్ట మీద చెట్టు మీద ప్రకృతి పల్లవించిన రంగుల మేళవింపు మీద ఎందుకని ఉంటుంది చెప్పండి?

ఇలా చెదురుమదురు గొర్రెల్లా మేత కోసం అటూ ఇటూ తిరుగుతూ పోర్ట్రెయిట్ బొమ్మల కమీషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ పేద కళాకారులను మైసూర్ మహారాజుగారు ఒకానొక సమయంలో ఆదుకున్నారు. దసరా ఉత్సవం అనే పేరుతో రాజభవన కుడ్యంపై ఒక ఘనమైన చిత్ర కళాఖండాన్ని గీయించడానికి ఆయనకు మనసయ్యింది. మహరాజావారి దసరా ఉత్సవాల ఊరేగింపు అనేది చాలా గొప్ప వేడుక. అది రాజభవనపు ముఖద్వారపు ప్రాకారం నుండి మొదలయ్యి అక్కడి నుండి దాదాపు పది మైళ్ళ దూరాన ఉన్న బన్నిమండపం వద్ద ముగుస్తుంది. రాచ యేనుగు పైన బంగారు అంబారిలో ఠీవిగా కూచున్న మహారాజు, ఆయన పట్టపుటేనుగు వెనుక సుందరంగా అలంకరించబడ్డ మిగతా ఏనుగుల వరుస, వాటి వెనుక రథాలపై రాజ వంశీయులు, వారి తరువాత గుర్రాలపై ఆశీనులైన నగర రాజాధికారుల గణం, అవ్వారి వెనుక అశ్వికదళ సైన్యం, ఒంటె దళం వారి వెనుక ఆయుదధారులైన కాల్బలం, ఆ పై సమస్త పరివారం. ఈ సంరంభాన్ని అంతా రహదారుల కిరువైపులా నిలబడి చూస్తున్న సాధారణ జనసమూహం, భవనపు పైకప్పులపై కిటికీలు మరియు గవాక్షాలనుండి తొంగిచూసే జన సమాజాన్ని బొమ్మల్లో ఇదంతా చిత్రించాలి. మహా పెద్ద పని. ఈ భారీ పెయింటింగ్ రూపకల్పన కోసం రాజుగారి పాత రాజభవనాన్ని ఒక కళాకేంద్రంగా, చిత్రకారుల వసతిగా ఏర్పాటు చేశారు. అలా స్టూడియోగా మార్చబడిన రాజగృహం అంతా పెద్ద పెద్ద కాన్వాస్‌ల చుట్టలు, రంగులు, కుంచెలు, బొమ్మలకు ఊతగా వాడే చెక్కఫలకాలతో నిండిపోయింది. చిత్రకారులందరూ ప్రతిరోజూ ఆ కళాకేంద్రపు విశాలమైన హాలులో ఉల్లాసంగా ఒకరికొకరు పలకరించుకుంటూ, నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ, హాస్యాలు ఆడుకుంటూ ఆ భారీ ఊరేగింపు చిత్రాన్ని చిత్రించేవారు. వారు బొమ్మలు గీసిన ఆ కాలమంతా ఆ ప్రాంతానికి నేను నిత్య సందర్శకుడిని. భేషజాలు, కల్లా కాపట్యం లేని ఆ అమాయక కళాకారుల సహవాసాన్ని నేనెంతో మనస్పూర్తిగా ఆస్వాదించాను. వారు ఆ అపూర్వ చిత్రం చిత్రించడం పూర్తయ్యాక, అది రాజుగారి ప్రధాన భవనంలో ఒక వైపు మొత్తం కన్నులపండువగా అలంకరించబడింది.

ఆ రోజుల్లోనే నేను, మా అన్నగారి మిత్రుడైన నీటిరంగుల ఆర్టిస్ట్ ఇద్దరమూ సెలవు రోజుల్లో మా సైకిళ్ళపై బొమ్మలు వేయడానికి అవసరమయిన సరంజామా మొత్తం సర్దుకుని స్కెచింగ్, పెయింటింగ్ చేయడానికని పట్టణం వెలుపల ఏదో ఒక కొత్త ప్రదేశాన్ని అన్వేషిస్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో మా మైసూర్ పట్టణం అనేది నిజంగా ఒక సగటు చిత్రకారుడి ప్రాణానికి చిత్రస్వప్నంలా ఉండేది. ఎటు చూసినా కుంచెతో తీర్చిదిద్దిన బొమ్మల వంటి పరిసరాలు, ప్రఖ్యాతి గాంచిన చాముండి అమ్మవారి ఆలయపు పాదాల దగ్గరినుండి సాష్టాంగంగా పరుచుకున్నట్లు ఉన్న గుడి మెట్లు, వాటినానుకుని పెద్ద పెద్ద పొదలు, నానా మొక్కలతో నిండి ఉన్న పురాతనమైన పేరు లేని, తేదీ లేని, సమాచారమేమీ తెలియని శిథిలాలు, మంటపాలు, సరస్సులు, ఆ నీటి కలువలు, అల్లిబిల్లి తీగలు అల్లుకున్న గుడిసెల పైకప్పులు, గ్రామాలకు దారితీసే రహదారులు, దారుల నిండా పెద్ద పెద్ద మర్రిచెట్లు. ఇట్లా ప్రకృతిని వెదుక్కుంటూ మేము పట్టణం నలువైపులా సాగేవాళ్ళం. కన్నులకు కట్టుబడి జరిగి ఏదో ఒకచోట ఆగిపోయి అక్కడి బొమ్మలు వేసుకుని, మధ్యాహ్నం కాగానే సిద్ధంగా పట్టుకుపోయిన భోజనాన్ని ముగించుకుని మళ్ళీ బొమ్మల్లో మునిగిపోయేవాళ్ళం. సాయంకాలం ఇళ్ళు చేరుకునేసరికి చాలా అలిసిపోయేవాళ్ళం కానీ మా స్కెచ్ పుస్తకాల పేజీల్లో రచించుకొచ్చిన రంగు బొమ్మల మధ్య మా శరీరం, మనస్సు పూర్తిగా సంతృప్తం అయ్యేవి.

ఒక రోజు రాజ భవనంలో దసరా కుడ్యచిత్రానికి సంబందించిన చిన్నచిన్న మిగుళ్ళను పూరించడానికి నిమగ్నమైన వాసు అనే చిత్రకారుడు మేము ఆ మరుసటి సెలవు రోజున బొమ్మలకని వెళ్ళవలసిన యాత్ర గురించి మాట్లాడుకోడం విన్నాడు. ఆయనకు మా చిత్రయాత్ర పట్ల గొప్ప ఆసక్తి కలిగింది. మా ఇరువురితో కలిసి స్కెచింగ్ చేయడానికి తనకూ ఆసక్తిగా ఉందని, తననీ మాతో చేర్చుకుంటే పెయింటింగ్‌లకు అనువైన, తనకు మాత్రమే తెలిసిన కొన్ని నిగూఢ ప్రాంతాలను చూపుతానని వాగ్దానం చేశాడు. మాకు ఆయన మాటలు చాలా ఆసక్తిగా అనిపించాయి, ఆయన వర్ణించినటువంటి ప్రాంతాలు ఇదివరకు మేమెప్పుడూ చూడలేదు. అలానే ముగ్గురం కలిసి వెడదాం అనుకున్న ఒక రోజున మామూలుకన్నా త్వరగా నిద్రలేచి, తయారయ్యి మేం ఇద్దరమూ బొమ్మల సామాను సైకిళ్ళపై సర్దుకుని అల్పాహారం కోసం ఉడిపి హోటల్‌కు వెళ్ళాము. అక్కడ రకానికి ఒకటి చొప్పున హోటల్‌లో ఉన్న పదార్థాలన్నీ కడుపు నిండా పట్టించి పిదప ఒక కమ్మని కాఫీ తాగి వాసు కొరకు బయలుదేరాము. అయితే మునుపటి యాత్రల మాదిరిగా మధ్యాహ్న భోజనానికని ఎటువంటి పార్సల్ ఈసారి కట్టించుకోలేదు. ఎందుకంటే మా కొత్త మిత్రుడు వాసు ఆ రోజు మా ముగ్గురి మధ్యాహ్నం భోజనం సంగతి తను చూసుకుంటానని దానికి భిన్నంగా మేమేవిధంగా ప్రవర్తించినా తన మీద ఒట్టుపెట్టినంత మాట అని ఆప్యాయత ప్రకటించాడు. వాసు మంచి మసస్సుకు మేము మనస్సులోనే జోహార్లు అర్పించాము. అలా ఉదయపు టిఫినీలు ముగించుకున్న అనంతరం ఇద్దరమూ సైకిళ్ళెక్కి ముందుగా అనుకున్నట్టుగానే మైసూర్-ఊటీ ట్రంక్ రోడ్డులో ఒక వంతెన మీద వాసు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాము.

కాసింత నిరీక్షణ అనంతరం అల్లంత దూరం నుండి వాసు రావడం కంటపడింది. సైకిల్ హేండిల్ బారు మీద చుట్ట కట్టి ఉన్న కేన్వాస్, అడ్డ బార్ మీద కుదురుగా బిగించికట్టిన చిన్న ఈజిల్, వెనుక క్యారియర్‌లో రంగులు, కుంచెలు ఇంకా మా మధ్యాహ్నభోజనం తతిమా సరంజామాతో నిండి ఉన్న గుడ్డసంచి ఉన్నాయి. వాసు మా దగ్గరికి వచ్చి పలకరింపుగా నవ్వాడు. ఇక అక్కడి నుండి తను మాకు మార్గదర్శిగా మారాడు. తిన్నగా వెడుతున్న తారురోడ్డు నుండి పక్కకు మళ్ళించి ఒక సన్నని కాలి దారివెంట మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఆ దారి దాటి పొలాలు, పొలాలు దాటి తోటలు… అలా గంటల తరబడి ప్రయాణం చేసిన తర్వాత మేము వాసు చెప్పిన ఆ నిగూఢ ప్రదేశం చేరుకున్నాము. అది ఒక పాడుబడ్డ గ్రామం. శిథిలమైన గుడిసెలు లెక్కలేనన్నిగా ఆ గ్రామం నిండా ఉన్నాయి. ఆ గుడిసెల చుట్టూ అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డి, పేరు తెలియని అడవి మొక్కలు, తుప్పలతో ఆ ప్రాంతమంతా నిండి ఉంది. అక్కడ ఒక పెద్ద వేపచెట్టు, దాని నీడలో ఒక బావి, ఆ బావికి వెనుక ఒక కంచె, విరిగిన బండి చక్రం ఒకటి ఆ కంచెకి ఆనించి ఉంది. చూసే చిత్రకారులకి అవసరమైన ఒక ఖచ్చితమైన కూర్పును ఆ ప్రాంతం కలుగజేస్తుంది. అటువంటి సూక్ష్మ వివరాల గుంరించి మేము ముగ్గురం మా చిత్రకళాకారుల భాషలో వ్యాఖ్యానించుకుంటూ, పొంగిపోతూ, ఆ వాతావరణాన్ని మెచ్చుకుంటూ మా సైకిళ్ళను ఆ వేపచెట్టు నీడ కింద వదిలి ఆ ప్రాంతం చుట్టూ తిరిగాము. ఆ ప్రదేశమంతా నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉంది. అక్కడ కనీసం నాకు ఇష్టమైన కాకుల శబ్దం కూడా లేదు. దూరదూరాల వరకు మేము తప్పా మరో మానవుడి జాడకూడా లేదు. కొన్ని గుడిసెల తలుపులు తెరిచే ఉన్నాయి. అక్కడ మనుషులు నివసించే ఆనవాలు ఎక్కడా కనపడ్డం లేదు. మేము ఒక ఇంటిలోకి దూరి దానిని పరిశీలనగా చూడ్డం మొదలెట్టాం. ఆ ఇంట్లో అక్కడక్కడా కొన్ని విరిగిన మట్టి కుండలు, సగం కాలిన కర్ర ముక్కలు, బొగ్గులు, బూది ఉన్నాయి. పిచ్చి మొక్కలు బయటే కాదు ఇంటి లోపలా విపరీతంగా పెరిగి ఉన్నాయి. ఇంటి బయట ఉన్న చెట్ల వేర్లు పాముల్లా మెలికలుగా పాకుతూ ఇంటి గోడలను నెర్రలుగా చీల్చి అందునుండి ఇంటిలోకి ప్రవేశించాయి. ఆ గ్రామంలో దాదాపుగా యాభై గుడిసెల దాకా ఉండవచ్చు, అన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఊరు ఇంత నిర్జనమైపోవడానికి కారణం ఏమిటని మేము వాసుని అడిగాము.

“కలరా, ఇంకా ప్లేగు ఇక్కడి ప్రజలను తరిమికొట్టిందని విన్నాను” అని చెప్పాడు వాసు. అది వినగానే ఆ అంటువ్యాధి నా పక్కనే అదృశ్యంగా పొంచి ఉండి నన్ను తన ఆహారంలా ఆప్యాయంగా చూస్తూ ఉండవచ్చని నేను జడుసుకున్నాను. “వాసూ, ఇదంతా ఎంతకాలం క్రితం జరిగింది గురూ?” కంఠం వణుకుతున్న విషయం తెలియనీకుండా కాస్త గంబీరంగా అడిగాను. “అబ్బే ఎంత! ఓ యాభై లేదా వంద లేదా రెండు వందల సంవత్సరాల క్రితమని నేను అనుకుంటున్నాను.” హమ్మయ్యా, పోనీలే బ్రతికించాడు. వాసు తన గడియారాన్ని చూస్తూ, “ఇప్పటికే మధ్యాహ్నం దాటింది, మనం భోజనం ముగించేసరికి ఎంత లేదన్నా ఒక గంట పడుతుంది. భోజనానంతరం కాస్త విశ్రాంతి తీసుకుని మనం పెయింటింగ్‌కు అనువయిన స్థలాన్ని వెతుక్కునే వరకు సమయం కూడా మించిపోతుంది. ప్రస్తుతానికి ఈ ప్రదేశం చూసుకున్నాము కాబట్టి, బొమ్మలు వేసే పనిని మరెప్పుడయినా సెలవు రోజులో పెట్టుకుందాము. అప్పుడు ఇంత కాలాతీతం అవదు” అన్నాడు. ప్రస్తుతానికి బొమ్మలు వాయిదా వేసి తర్వాత మేము మరొక రోజు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాము.

మేము వెనక్కి తిరిగి వచ్చి వేప చెట్టు నీడలో ఒక బండరాయిపై కూర్చుని మా భోజనానికి సిద్ధమయ్యాము. వాసు మా ముందు కొన్ని పాత వార్తాపత్రికలు పరిచి తను తెచ్చిన భోజనపు పొట్లం విప్పడం మొదలుపెట్టాడు. మాకు ఆకలిగా ఉంది, తను ఏమేమి తెచ్చి ఉంటాడా అని అత్రుతగా చూస్తున్నాం, పెట్టినదాన్ని పెట్టినట్లు గుటుక్కుమనిపించాలని తొందర కూడా పడుతున్నాం. వాసు ఆ భోజనపు పొట్లాన్ని జాగ్రత్తగా విప్పాడు. అందులో ఉన్నది చూసి నేనూ నా మిత్రుడు నిర్ఘాంతపోయాం, నివ్వెరపోయాం, ఖంగుతిన్నాం, నిశ్చేష్టులమయ్యాం!

వాసు మా ముందు కొన్ని పాత వార్తాపత్రికలు పరిచి అందులో వడ్డన ప్రారంభించాడు. మా మధ్యాహ్న భోజన నిమిత్తం వాసు తెచ్చినవి ఇలా ఉన్నాయి: ఒక డజను ఉర్లగడ్డలు, కొన్ని బెండకాయలు, కొన్ని చిక్కుళ్ళు మరియు గోరుచిక్కుళ్ళు, ఇంకా వంకాయలు కూడా. అన్నీను పచ్చివి. కనీసం ఉడికించినవి కూడా కావు. ఊహించని విధంగా మాకు కలిగిన ఆ హఠాత్ ఘాతం నుండి కాస్త తేరుకుని, “మిత్రమా వాసు, ఇవి పచ్చిగా ఉన్నాయి. మనం వీటిని ఎలా తింటాము? నువ్వు ఏదో తమాషా చేయబోతున్నావు కదా?” అని నా స్నేహితుడు అడిగాడు. “అరే భాయ్! ఆకలి దగ్గర, అన్నం దగ్గర తమాషా ఏమిటి? తప్పు. రండి కూచోండి, పచ్చి కాయగూరలు తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది” అంటూ తను తినడం ప్రారంభించాడు. తింటూ తింటూ అతను పచ్చి కూరగాయలు, వాటిలో పోషకాలు మరియు వాటిని తినడం వలన శరీరానికి ఒనగూడే ప్రయోజనాలను వివరించడం మొదలెట్టాడు. వివరిస్తూ వివరిస్తూ కూరగాయలు నమిలేస్తున్నాడు, నమిలేస్తూ నమిలేస్తూ వివరిస్తున్నాడు. వాసు వంకా అతని కూరగాయల బజారు వంకా కంపరంగా చూస్తూ నేను అక్కడి నుండి లేచి నిలబడ్డాను, నాతో పాటే నా స్నేహితుడు కూడాను. ఒక్కసారిగా, మేము అలా లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమవడంతో వాసు కంగారుపడ్డాడు. ‘ఏమిటి? ఏవయింది మీకు? అలా లేచి వెళ్ళి పోతున్నారెందుకని?’ అని అడిగాడు. మేం సైకిళ్ళు తీసుకుని బయల్దేరాము. వాసు మమ్మల్ని ఆపే ప్రయత్నం చేయలేదు. కాసింత దూరం వెళ్ళి నేను వెనక్కి తిరిగి చూశాను. వాసు బెండకాయ నమలడాన్ని ఆస్వాదించడంలో మునిగి ఉన్నాడు. మేము ఇళ్ళకు చేరుకోవడం బాగా ఆలస్యమైంది. శరీరాలు పూర్తిగా ఆకలితో అలసిపోయి నీరసపడి ఉన్నాయి.

కాలేజి చదువుల మెట్లు ఎక్కడానికి నాకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మైసూర్ విశ్వవిద్యాలయ విద్యార్థుల పత్రిక ప్రత్యేక సంచికలోని రచనలకు బొమ్మల కోసం నన్ను చిత్రకారుడిగా వారు ఆహ్వానించారు. నేను వారి దృష్టిలో ఎలా పడ్డాను అంటే, హిందూ పత్రికలో మా అన్న నారాయణ్ వ్రాసే చిన్నకథలకు బొమ్మలు నేనే వేసేవాడిని కాబట్టి. ఆవిధంగా కాలేజి పత్రికలో కాసిన్ని కార్టూన్లు, బొమ్మలు ఇంకా ఆ పత్రిక ముఖచిత్రం కూడా వేశాను. పత్రిక సంపాదకులకు నా బొమ్మలు ఎంతగానో నచ్చాయి. వేసిన బొమ్మలకు గాను వారు నాకు గౌరవంగా కాస్త నగదును కూడా చెల్లించారు. ఇంకా పత్రిక సంపాదకీయంలో నా బొమ్మలను ప్రశంసాపూర్వకంగా ప్రస్తావిస్తూ పత్రికలో నా ఫోటోను ముద్రించి దానిపై ‘మా ఆర్టిస్ట్’ అని వ్రాశారు. పత్రికలో ఫోటో చూసి నేను ఆశ్చర్యపోయాను! వీరు నా ఫోటో ఎలా దొరకబుచ్చుకున్నారో అర్థం కాలేదు. ఆ ఫోటోను మా కుటుంబ ఆల్బమ్ నుండి మా అన్నయ్య రహస్యంగా స్మగుల్ చేసి వారికి అందచేసిన కుట్ర గురించి నేను తరువాత తెలుసుకున్నాను.

అలా కాలేజి మేగజైన్‌కి బొమ్మలు, కార్టూన్లు, కవర్లు, హిందూ పత్రికలో మా అన్న రచనలకు బొమ్మలూ అవీ చూసి ముచ్చటపడ్డ మా అన్నగారి మిత్రులు, ప్రముఖ కన్నడ రచయిత ఒకాయన ఒకరోజు నాతో “ఒరే అబ్బాయ్, మనకు తెలిసిన ఒక డాక్టర్‌గారొకాయన బెంగళూర్ నుండి ఒక హాస్య ప్రధానమయిన మాసపత్రిక తేబోతున్నాడు. దాని పేరు ‘కొరవంజి’. అందులో నువ్వు కార్టూన్లు వేయాలి. అలా గీసినందుకు నీకు డబ్బులు కూడా ఇస్తారులే” అన్నారు. నేను సరేనన్నా. అవి రెండవ ప్రపంచ యుద్ధపు రోజులు, తిండీ బట్టా కరవు రోజులు. నిత్యావసరమైన ప్రతీది కరవుగా ఉన్న రోజులు, చీకటి రోజులు, దిక్కుమాలిన రోజులు. ఆ పరిస్థితులు, ఆ సంక్షోభం, ఆనాటి జీవన సంక్లిష్టతలే నా కార్టూన్లకు ముడి సరుకులు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ మొదటి సంచిక కార్టూన్లు గీశా. ఆ రోజుల్లో కన్నడలో ఉన్న లబ్దప్రతిష్టులైన రచయితల రచనలు కొరవంజిలో వచ్చేవి. మెల్లమెల్లగా ఈ పత్రిక ప్రాముఖ్యత బాగా పెరిగి, అప్పటి జనాదరణ పొందిన పత్రికల్లో ఒకటయ్యింది. కొరవంజితో పాటు నేను కూడా పాఠకులలో కొంతమంది అభిమానులను సంపాదించుకున్నానని నాకు తెలియదు. ఎప్పటివరకు తెలియదు అంటే, ఒక శుభమహూర్తాన పోలీసు ఇన్‌స్పెక్టర్ ఒకరు నన్ను పట్టుకునే వరకు.

ఒకరోజు నా మానాన నేను నా సైకిల్ మీద పోతూ పోతూ ఒక పోలీసాయన చేతిలో పట్టుబడ్డా. అప్పటికి నా సైకిల్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిన గడువు దాటి కొన్ని నెలలు గడిచిపోయింది. దారిన పోతున్న నన్ను కానిస్టేబుల్ ఆపి సైకిల్ కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇన్స్‌పెక్టర్‌గారు నా సైకిలుకున్న ఇత్తడి లైసెన్స్ ప్లేట్ పరిశీలించి చూసి నా వద్దకు వచ్చి తన నోట్‌బుక్‌లో వివరాలు నమోదుచేసే నిమిత్తం నా పేరు అడిగాడు. నాకు ఇక్కడ నిలువెల్లా చెమటలు దిగిపొతున్నాయి. జాలి మొహం, ఏడుపు మొహం, దీనాతిదీన మొహం, హీనాతి హీన మొహం ఇలా రకరకాలుగా మొహం పెట్టి ఆ ఇన్స్‌పెక్టర్‌ గారి గుండెని వీలయినంత కరిగిద్దామని ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నేను ఎంత తీవ్రంగా జబ్బుపడి ఉండి లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేకపోయానో; పైగా రెన్యువల్ సమయానికి ఈ ఊళ్ళో లేనని; ఇంకా అదీ కాక తరగతి పరిక్షల్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకోడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఈ రెన్యువల్ సంగతి మరిచిపోయానని; ఈసారికి క్షమించి వదిలిపెడితే గాడ్ ప్రామిస్‌గా రేపే వెళ్ళి లైసెన్స్ పునరుద్ధరించుకుంటానని… ఎంత చెప్పుకున్నా నా మాట ఒక్కటీ ఆయన వినిపించుకోవడం లేదు. ‘ముందు నీ పేరు, అడ్రస్ చెప్పరా’ అనే గదమాయింపు. వీలయినన్ని దొంగ పేర్లు తప్పుడు చిరునామాలు చెప్పడం కోసం బుర్ర వెతకసాగింది. ఏమీ లాభం లేదు. నాకు నా పేరు తప్ప వేరే ఏ పేరూ తట్టి చావట్లా. నోరు పెగుల్చుకుని ఆర్కే లక్ష్మణ్ అన్నా. ఇన్స్‌పెక్టర్‌ అదే పేరు తన పుస్తకంలో వ్రాసుకుని, రేపు ఉదయమే వచ్చి ఆఫీస్‌లో కనబడమని హూంకరించి వెనుతిరిగాడు. ఎంత త్వరగా అక్కడినుండి పారిపోదామా అని ఆత్రంగా సైకిల్ ఎక్కబోయిన నన్ను ఒక ప్రశ్న వెనకనుండి ఆపింది. ‘ఆర్కే లక్ష్మణ్ అంటే ఏ ఆర్కే లక్ష్మణ్? కొరవంజిలో బొమ్మలు వేసే లక్ష్మణ్ అయితే కాదు కదా?’ ఇన్స్‌పెక్టర్‌ అడిగాడు. ‘అవును సార్! అదే లక్ష్మణ్’. ఇన్స్‌పెక్టర్‌గారి మొహం చాటంతయ్యింది. వెంటనే తన నోట్‌బుక్‌లో సంఘవిద్రోహుల జాబితాలో ఉన్న నా పేరుని చెరిపేసి, ఆ పై నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఒక గట్టి షేక్‍హేండ్ ఇచ్చి లాగి లాగి వదిలాడు. ‘నేను నీ అభిమానిని అబ్బాయ్! కొరవంజిలో నీ వ్యంగ్య చిత్రాలు చూస్తుంటానుగా! భలే బావుంటాయి. అయితే నేను ఎంత నీ అభిమానిని అయినప్పటికీ నువ్వు రేపు వెళ్ళి లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. అది నీకే మంచిది’ అని మరోసారి నా భుజం తట్టి వెనక్కి తిరిగాడు. అబ్బా! ఎలా అయితేనేం నేను రక్షింపబడ్డాను. నేను వేసే కార్టూన్లు నాకు డబ్బు ఇవ్వడమే కాదు, చలానా రూపంలో డబ్బు పోకుండా కాపాడుతాయి కూడా. ఐ లవ్ కార్టూన్స్! భలే!

(సశేషం)


అన్వర్

రచయిత అన్వర్ గురించి: బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. రచనకు తగ్గ బొమ్మ వేయగలిగిన అన్వర్ చిత్రకారుడే అయినా సాహిత్యం చదువుకుంది చాలామంది రచయితలకన్నా ఎక్కువే. https://www.flickr.com/photos/anwartheartist/ https://www.facebook.com/whoisanwar/ ...