చదవాలి

మొట్టమొదట
ఒకింత సరదాగానే మొదలైంది

పేజీల గుండా
పసిపిల్లలా తప్పిపోతూ
గాలిపటంలా ఎగరడం
కథావర్షంలో తడిసిపోయి
కవిత్వపు గొడుగు నీడలో
సేదదీరడం అలవాటైంది

అక్షరసౌరభాలను
తనివితీరా ఆఘ్రాణిస్తూ
వాక్యాల విరులను
హృదయానికి పొదువుకుంటూ నడవడం
దినచర్యగా మారింది

ఎన్నో తలుపులను తెరచుకుంటూ
మరెన్నో వింత కిటికీల గుండా
తొంగిచూస్తూ వెడుతుంటే
అప్పటివరకు మొగ్గై
ముడుచుకున్న పువ్వు
వికసించడం ఆరంభమైంది

పాత దుఃఖాలను జోకొట్టుకోడానికి
ప్రయాణపు ఉక్కపోతలో అలసిన బ్రతుకును
ఆరబెట్టుకోడానికి యథేచ్ఛగా తిరుగుతూ
అపురూపమైన వాటిని వెతుక్కుంటూ
విరిగి ముక్కలైన స్వప్నాలకు
అతుకులేసుకుంటూ సాగడంతో
పయనం కొంత సులభతరమైంది

కనురెప్పల పిట్టల రెక్కలను
దివారాత్రులు ఎంత ఆడించినా
ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది
ఇప్పుడిక సముద్రాలలో మరింత ఈదాలి
కొత్త నదులలో స్నానమాడాలి

అరచేతిలో మిగిలిన
కాసిని జీవితపు క్షణాలను
అపురూపంగా దొరకపుచ్చుకుని
చేజారిపోయిన కాలాన్ని లెక్కించడం మాని
ఎన్నడూ చూడని అసలేమాత్రం ఊహించని
ప్రపంచాన్ని స్పృశించడానికి
నిద్రిస్తున్న ఆత్మను తట్టిలేపి
మరింత లోనికి తొలుచుకుని
తెలుసుకోవడానికి శ్రమించాలి

అణువంత దానిని
ఆకాశమంత విస్తరించడానికి
చీకట్లను తోలుకుంటూ
సూర్యరశ్మిని
గుండెల నిండా శ్వాసించాలి