సంకట సందర్భాలు

ఏది తొండ? ఏది ఊసరవెల్లి?
స్పష్టంగా గుర్తించడం కష్టం కొన్నిసార్లు
ఏది కవనం? ఏది వచనం?
ఇదమిత్థంగా చెప్పడం
సులభం కాదు ఎన్నోసార్లు!

కవితలలాగా కనిపించే వ్యాసాలుంటాయి
కనిపెట్టలేని మారువేషాలుంటాయి
బేరీజు వేయటంలో కొన్ని దోషాలుంటాయి
ఇవి కాక మరెన్నో తమాషాలుంటాయి!

ఎంత సొంతదైనా మూస మూసే
అది యెల్లకాలం రంజించాలని
ఆశిస్తే మిగిలేది అడియాసే!

సవ్యత లేని భాష నేడు హీరో
సరైన భాషకు ఆదరణ జీరో
ఈ సంకటస్థితిని చూసి
అభిజ్ఞులు ఏమంటారో!